శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
Showing posts with label శాస్త్రవేత్తలు. Show all posts
Showing posts with label శాస్త్రవేత్తలు. Show all posts




ఈ రోజు (మార్చ్ 14) ఐన్ స్టయిన్ పుట్టిన రోజు. ఆ మహాశాస్త్రవేత్త మార్చ్ 14, 1879 నాడు పుట్టాడు.
ఐన్ స్టయిన్ కి పుట్టిన రోజు పండుగలు జరుపుకోవడం అంటే గిట్టేది కాదట. పుట్టిన రోజు పండుగలు “పసి పిల్లలకి” అని త్రోసి పుచ్చేవాడు.

అయితే 1953 లో తన 74 వ పుట్టిన రోజు మాత్రం అభ్యంతరం చెప్పకుండా బుద్ధిగా తన పుట్టిన రోజు పండుగలో పాల్గొన్నాడు. ఆ సందర్భంలో న్యూ యార్క్ రాష్ట్రం లోని యేషివా విశ్వవిద్యాలయం వాళ్లు ఐన్ స్టయిన్ గౌరవార్థం ఆయన పేరుతో ఓ వైద్యవిశ్వవిద్యాలయానికి ప్రారంభోత్సవం చెయ్యాలని తలపెట్టారు. ఆ ఒక్క సారి మాత్రం ఎందుకో ఆ శాస్త్రవేత్త ఒప్పుకున్నాడు.

ఎప్పట్లాగే వొదులైన పాంటు, వదులైన స్వెట్టరు కాకుండా చక్కగా సూటు వేసుకుని వేడుకకి హాజరు అయ్యాడు. వేషం మారినా నడతలో మాత్రం పెద్దగా మార్పులేదు. పెద్దగా ఎవరితోనూ మాట్లాడకుండా ఓ మూల కూర్చుకున్నాడు. తన కోసం ఓ స్థానిక  బేకరీ వాళ్లు ఎంతో ప్రేమగా తయారు చేసిన “మూడు అంతస్థుల” కేకుని గమనించను కూడా లేదు. విందులో వేయించిన బీఫ్ చూసి “అది సింహాలకి సరిపోతుంది” అని చిరునవ్వు నవ్వాడట!

మొత్తం మోద ఐన్ స్టయిన్ గౌరవార్థం నిర్వహించిన ఆ విందులో వైద్యవిశ్వవిద్యాలయ నిర్మాణం కోసం మూడున్నర మిలియన్ డాలర్ల విరాళాలు పోగయ్యాయి. విందు ముగిశాక ఆ సందర్భంలో ముఖ్య అతిథిగా ఏదైనా  మాట్లాడమన్నారు. ఐన్ స్టయిన్ నోటి వెంట ముచ్చటగా రెండే ముక్కలు  వెలువడ్డాయి – “హమ్మయ్య! అయిపోయింది!”
http://time.com/4228178/albert-einstein-birthday/
 

లూయిస్ పాశ్చర్ (Louis Pasteur) జీవిత కథ

Posted by V Srinivasa Chakravarthy Friday, January 4, 2013 0 comments

మా చెల్లెలు స్వాతి రాసిన వ్యాసం ఇది. బయటి వారు ఈ బ్లాగ్ లో వ్యాసాలు రాసే ఒరవడి పెరుగుతోంది. ఇది ఇలాగే సాగితే జనవిజ్ఞానరంగంలో ఓ వెబ్ జైన్ ప్రారంభించాలని వుంది.


– శ్రీ.చ.



రచన: స్వాతి చీమకుర్తి


లూయిస్ పాశ్చర్ 27 డిసెంబర్ 1822 న ఫ్రాన్స్ లో జురా అనే ప్రాంతం లో జన్మించారు.


1849 వ సంవత్సవరం లో స్ట్రాస్బౌర్గ్ (Strasbourg) విశ్వవిద్యాలయం లో రసాయన శాస్త్ర ప్రొఫెసర్ అయ్యారు. అక్కడ ఆయన సేంద్రీయ సంయోగం (organic synthesis) ద్వారా స్ఫటిక విన్యాసాలకి (crystal structure) సంబంధించి ఎన్నో ముఖ్యమైన ఆవిష్కరణలు చేసారు.

బాక్టీరియా వల్లా మరియు ఇతర సూక్ష్మ జీవుల వల్లా వ్యాధులు ఎలా సంభవిస్తాయి అన్న విషయం 19 వ శతాబ్దంలో ఒక రహస్యం గా ఉండేది. అప్పట్లో చాలా మంది కేవలం గాలి సోకడం వల్ల అంటువ్యాధులు వస్తాయని నమ్మేవారు. గాలిలో రోగకారక క్రిములని మోసుకొచ్చే వస్తువుల వల్ల అంటువ్యాధులు కలుగుతాయని అప్పుడు ఎవరికీ తెలీదు.



పాశ్చర్ కొన్ని అద్భుత ప్రయోగాలు చేసి సూక్ష్మ జీవులు ఒకదాన్నుండి ఒకటి పుడతాయని, గాల్లోంచి ఊడిపడవని నిరూపించాడు. ఆయన ప్రతిపాదించిన రోగకారక క్రిమి సిద్ధాంతం (Germ theory of disease) వైద్య శాస్త్రంలో ఒక విప్లవాత్మకమైన భావనగా చెప్పుకోవచ్చు. అంతేకాక ఆయన వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టేందుకు ఆస్పత్రులలో చేతులు కడుక్కోవడం వంటి పరిశుభ్రతా పరమైన పద్ధతులు ప్రవేశపెట్టారు. పాశ్చర్ అత్యంత సునిశితమైన, క్రమబధ్ధమైన ప్రయోగాలు చేసి ఎన్నో ప్రమాదకరమైన సూక్ష్మజీవులను కనుగొన్నారు. ఆ సూక్ష్మజీవులని అరికట్టే వాక్సీన్ లు రూపొందించి మనుషులనే కాక, జంతువులను కూడా ఎన్నో భయంకరమైన వ్యాధుల నుంచి కాపాడారు.



జీవం నుంచి జీవం :



ఈ ద్రాక్ష చుట్టూ ఉన్న చిన్న సహజ పదార్థాలు(Yeasts) వాటి ఏక కణ శిలీంధ్రాల (single-celled fungi) నుంచి పెరుగుతాయి. ఇటువంటి సూక్ష్మజీవులు, పరిసరాలలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు వాటంతట అవే పుట్టుకు వస్తాయని ఒక సిద్ధాంతంగా(spontaneous generation) అప్పట్లో ప్రజలు భావించేవారు. పాశ్చర్ తన ప్రయోగాలను ఉపయోగించి ఈ సూక్ష్మజీవులు వాస్తవానికి ఇతర సూక్ష్మజీవుల నుండి ఉత్పత్తి అవుతాయని, ఊరికే గాలిలోంచి ఊడిపడవని నిరూపించారు.



ఆరోగ్యకరమైన పాలు:



పాలు అమ్మకానికి వెళ్ళే ముందు, వాటిలో ఉండే హానికరమైన జీవుల సంఖ్య (బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వంటివి) తగ్గించేందుకు, ఒక నిర్ణీత సమయం సేపు, ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చెయ్యాలి. పాశ్చర్ 1860 లో మొదట పులిసిపోయిన వైన్ ని శుధ్ధి చెయ్యడానికి ఈ పద్దతిని ఉపయోగించారు. ఆ తర్వాత నుంచి ఈ పద్దతిని పాశ్చరైజేషన్ (“Pasteurization”) అన్నారు.


మద్యాన్ని పులియబెట్టే పద్ధతిని మెరుగుపరచడం(Improving fermentation of Alcohol):

ఫ్రాన్స్ లో వైన్ మరియు బీర్ పరిశ్రమలలో ఎన్నో సందర్భాలలో మద్యం అతిగా పులిసిపోవడం వల్ల దాన్ని పారబోయాల్సి వచ్చేది. ఈ దుష్పరిణామాన్ని అడ్డుకోడానికి ఏదైనా చెయ్యమని ఆ పరిశ్రమల వారు పాశ్చర్ ని కోరారు. పాశ్చర్ తన పరిశోధనల ద్వార పులిసిన వైన్ లోను, మంచి వైన్ లోను ఉండే ఈస్ట్ (yeast ) కణాల మధ్య ఆకారంలో తేడా ఉందని కనుక్కునారు. ఆక్సిజన్ రహితంగా కిణ్వన ప్రక్రియ (fermentation process) జరుగుతున్నప్పటికీ, అందులో వున్న ఈస్ట్ (yeast) వల్ల మద్యం ఉత్పత్తి జరుగుతుంది అని కనుక్కున్నారు. సరైన ఈస్ట్ (yeast ) ను ఉపయోగించడం వల్ల, 122F (55C) ఉష్ణోగ్రత వరకు వేడి చేసి అనర్థకరమైన ఇతర సూక్ష్మజీవులను ఆ ద్రవం నుంచి తొలగించడం వల్ల వైన్ పులియకుండా అరికట్టవచ్చని కనుక్కున్నారు.





పట్టు పరిశ్రమను కాపాడుట:

దక్షిణ-పశ్చిమ ఫ్రాన్స్ పట్టుపరిశ్రమలకి ఆలవాలం. అలంకార ప్రియులైన ఫ్రెంచ్ పౌరుల జీవనంలో ఈ పట్టు ఓ ముఖ్యభాగంగా ఉండేది. ఆ రోజుల్లో ఏదో తెలియని వ్యాధి వల్ల పట్టుకాయలు (silk coccoons) నాశనం అవుతూ ఉండేవి. కనుక 1864 లో ఫ్రెంచ్ ప్రభుత్వం, వ్యాధి వల్ల నాశనం అవుతున్న పట్టుపురుగులని రక్షించమని పాశ్చర్ ని కోరింది. స్థానికులైన పట్టు పురుగు పెంపకదార్లకి ముందు పాశ్చర్ మీద పెద్దగా నమ్మకం కలగలేదు. మైక్రోస్కోప్ పట్టుకుని బయల్దేరి వచ్చిన ఈ పెద్ద మనిషి తమకి ఏం చెయ్యగలడు అనుకున్నారు.

పట్టుపురుగులని నాశనం చేస్తున్న సూక్ష్మజీవుల మీద పాశ్చర్ పరిశీలనలు మొదలెట్టారు. 2 సంవత్సరాల తర్వాత పాశ్చర్ రెండు రకాలైన పరాన్నజీవులు (parasites) వల్ల infection సంభవించింది అని కనుగొన్నారు. తదనంతరం వాటిని నిర్మూలించే పద్ధతిని కనిపెట్టి పాశ్చర్ పట్టుపరిశ్రమని కాపాడారు.



అదృశ్య శత్రువులు:

ప్రాణాంతకమైన వ్యాధి ఆంత్రాక్స్ వ్యాధికి కారణం bacillius అనే కడ్డీ ఆకారంలో బాక్టీరియం. జర్మన్ వైద్యుడు రాబర్ట్ కోచ్ (Robert Koch) (1843-1910) ఆంత్రాక్స్ కి కారణమైన సూక్ష్మజీవి ఒకటుందని 1876 లో కనుక్కున్నాడు. పాశ్చర్ తన పరిశోధనలతో ఆ విషయాన్ని నిర్ధారించడమే కాక, ఆంత్రాక్స్ నివారణకి అవసరమైన వాక్సీన్ ని రూపొందించారు.



రాబిస్ వ్యాధి:



రేబీస్ అనేది వైరస్ ల వల్ల కలిగే ఓ భయంకరమైన వ్యాధి. అది కుక్కల నుండి మనుషులకి సోకుతుంది. ఈ వైరస్ బాక్టీరియాల కన్నా అతి చిన్నదైన వస్తువు. కనుక పాశ్చర్ వాడిన సూక్ష్మదర్శినిలో ఇది కనిపించలేదు. ఆ వైరస్ వ్యాధితో కేంద్ర నాడీ వ్యవస్థ ఫై ప్రభావితం చేస్తుంది. పాశ్చర్ ఆ వ్యాధి సోకిన జంతువుల వెన్నుపాము (spinal cord) నుంచి ద్రవం సంగ్రహించి, వివిధ పద్ధతుల చేత ఆ ద్రవం యొక్క రోగతీవ్రతని క్షీణపరిచి, ఆ ద్రవాన్ని తిరిగి కుక్కల మీదకి ఎక్కించి రేబీస్ కి వాక్సీన్ ని రూపొందించారు.


మొదటి రాబీస్ వ్యాక్సిన్:

1885,లో జోసెఫ్ మైస్టర్ అనే 9 ఏళ్ల పిల్లవాడికి మొట్టమొదటి సారిగా ఈ రేబీస్ వాక్సీన్ ని ఎక్కించి రోగాన్ని నయం చేశారు.

ఎన్నో ఏళ్ళ పాటు ఎన్నో మహమ్మారి రోగాల మీద ధ్వజం ఎత్తిన తన వ్యాధి నిర్మూలనా ప్రయత్నాలని వ్యవస్థీకరించాలనే ఉద్దేశంతో “పాశ్చర్ ఇన్స్టిట్యూట్” అనే ప్రైవేటు సంస్థకి ప్రారంభోత్సవం చేశారు.

ఆ విధంగా గొప్ప వైద్యుడిగా, శాస్త్రవేత్తగా, దేశభక్తుడిగా ఫ్రెంచ్ వారి మనసులలో స్థిరనివాసం ఏర్పరచుకున్న పాశ్చర్ 1895 లో సెప్టెంబర్ 28 నాడు పారిస్ లో సెయింట్ క్లౌడ్ సమీపంలో చివరి శ్వాస విడిచారు.


(ఈ వ్యాసం ఇటీవలే మాలిక పత్రికలో ప్రచురించబడింది.)
http://magazine.maalika.org/2012/10/02/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%aa%e0%b0%be%e0%b0%9c%e0%b1%80%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8b%e0%b0%a7%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%97%e0%b1%8d/




స్త్రీ స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉన్న యుగంలో, ఇంకా ఇరవైలు దాటని ఓ చక్కని బ్రిటిష్ యువతి, ఒంటరిగా ఆఫ్రికా అడవుల్లో సంచరిస్తూ, చింపాజీల ప్రవర్తన గురించి లోతుగా అధ్యయనాలు చేస్తూ, చింపాజీలకి, మనిషికి మధ్య ఉన్న పరిణామాత్మక సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకుని, ఆ రంగంలో అగ్రగామి అయిన శాస్త్రవేత్తగా ఎదిగింది. ఆ యువతి పేరే జేన్ గుడాల్.

1934 లో లండన్ లో పుట్టిన జేన్ కి చిన్నప్పట్నుంచి జంతువులంటే మహా ఇష్టం ఉండేది. జంతువులతో ఆడుకుంటున్నట్టు, మాట్లాడుతున్నట్టు కలలు కనేది. ‘టార్జాన్,’ ‘డాక్టర్ డూలిటిల్’ (ఈ మనుషుల డాక్టరు మనుషుల కన్నా జంతువులకే ఎక్కువగా చికిత్స చేస్తూ ఉంటాడు) వంటి పిల్లల పుస్తకాలు చిన్నతనంలో ఈమెకి ఎంతో స్ఫూర్తి నిచ్చేవి. అందరిలాగానే ‘పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్’ అవ్వమన కుండా తన తల్లి ‘వాన్నే’ కూతుర్ని తనకి నచ్చిన దారిలోనే ముందుకి సాగమని ప్రోత్సహించేది. “నీకు ఏం కావాలంటే అది అవ్వు. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో బాగా పైకొస్తావని నాకు తెలుసు,” అనేది ఆ తల్లి.

ఇరవై రెండేళ్ల వయసులో జేన్ కి తన జీవితాన్ని మార్చేసే ఓ గొప్ప అవకాశం దొరికింది. ఓ లండన్ ఫిల్మ్ స్టూడియో తో పాటు ఆఫ్రికాకి వెళ్లే అవకాశం దక్కింది. అయితే ప్రయాణానికి కావలసిన ఖర్చులు కూడా తన వద్ద లేవు. వెంటనే ఓ హోటల్ లో వెయిట్రెస్ గా పనిలోకి దిగి, రాత్రనక పగలనక పని చేసి నాలుగు డబ్బులు వెనకేసింది. తగినంత ధనం పోగవగానే ప్రయాణానికి సిద్ధం అయ్యింది.

ఆ ప్రయాణం 1957 లో మొదలయ్యింది. ముందుగా ఆఫ్రికాలోని మొంబాసా లో దిగింది. మొంబాసాలో ‘లూయీ లీకీ’ అనే పేరుమోసిన పురావస్తు శాస్త్రవేత్త ఉండేవాడు. జేన్ ఆయన్ని కలుసుకుని తన ఆశయాల గురించి విన్నవించుకుంది. జేన్ లోని ఉత్సాహం, శక్తి, జంతువుల పట్ల ఆమెకి సహజంగా ఉండే ప్రేమ మొదలైన లక్షణాలు ఆయన్ని అకట్టుకున్నాయి. వెంటనే తనకి అసిస్టెంటుగా పనిచేసే ఉద్యోగం ఇచ్చాడు. టాంజానియాలో ఓ చెరువు సమీపంలో ఉండే చింపాజీలని అధ్యయనం చేసే పనిలో ఆమెని పాల్గొనమన్నాడు. చింపాజీల జీవన రహస్యాలు అర్థమైతే మనిషి యొక్క పరిణామ గతం గురించి ఎన్నో రహస్యాలు తెలుస్తాయని ఆయన ఆలోచన.

ఈ అధ్యయనాలు 1960 లో మొదలయ్యాయి. ఆ రోజుల్లో జేన్ తల్లి కూడా కూతురుతో పాటు పర్యటించేది. యవ్వనంలో ఉన్న స్త్రీ ఆఫ్రికా అడవుల్లో ఒక్కర్తీ పర్యటించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కనుక కూతురితో పాటు ఈ పర్యటనలు ఆ తల్లికి తప్పలేదు. మొదటి రెండు వారాలు జేన్ కి కలిగిన అనుభవాలు కాస్త నిరుత్సాహ పరిచాయి. తనని అంత దూరంలో చూడగానే చింపాజీలు పరుగు అందుకునేవి. పోనీ తను చూసినంత మేరకు కూడా చింపాజీల ప్రవర్తనలో తనకి విశేషంగా ఏమీ కనిపించలేదు. వచ్చిన పని విఫలమయ్యింది అన్న బాధ మనసులో దొలిచేస్తుండగా అనుకోకుండా ఓ సంఘటన జరిగింది.

చింపాంజీలు శాకాహారులు అని అంతవరకు జేన్ అనుకునేది. కాని ఒకరోజు ఓ విచిత్రమైన సంఘట కనిపించింది. ఓ చింపాజీ ఓ చెదల పుట్ట పక్క కూర్చుని ఓ పొడవాటి పుల్లని పుట్టలోకి దూర్చి దాంతో చెదలు “పట్టి” తింటోంది. పుల్లని ఓ పనిముట్టుగా వాడి, దాంతో ఆ పురుగులని “వేటాడి” తినడం తనకి ఆశ్చర్యంగా అనిపించింది. గిట్టలు, కొమ్ములు, ముక్కులు, పంజాలు మొదలైన దేహాంగాలని కాకుండా మరో వస్తువుని పనిముట్టుగా వాడి ఆహారాన్ని సేకరించడం జంతులోకంలో అరుదైన విషయం. ఆ రోజుల్లో పెద్దగా తెలియని విషయం. పనిముట్లు వాడే దశ ఆదిమానవుడి పరిణామ క్రమంలో ఓ ముఖ్యమైన మలుపుగా చెప్పుకుంటాం. అలాంటి పనిముట్ల వినియోగం ఈ జంతువులలో కనిపించడం విశేషం.

చింపాజీలలో ఈ పనిముట్ల వినియోగం గురించి ప్రొఫెసర్ లీకీ కి వివరంగా ఉత్తరం రాసింది. ఆయన సంతోషం పట్టలేకపోయాడు. “ దీంతో ‘పనిముట్టు’, ‘మనిషి’ మొదలైన పదాలకి కొత్త నిర్వచనాలు ఇవ్వాలి, లేదా చింపాజీలు మనిషితో సమానమని ఒప్పుకోవాలి,” అంటూ ఆయన ఉత్సాహంగా జవాబు రాశాడు.

తరువాత జేన్ ధ్యాస చింపాజీలలో సాంఘిక జీవనం మీదకి మళ్లింది. మనుషులలో లాగానే చింపాజీలలో కూడా విస్తృతమైన సాంఘిక పారంపర్యం ఉంటుంది. ‘నువ్వెక్కువా? నేనెక్కువా?” అన్న భేటీ మగ చింపాజీల మధ్య తరచు వస్తుంటుంది. బలప్రదర్శనతో మగ చింపాజీలు ఇతర చింపాజీల మీద తమ ఆధిక్యతని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ బలాబలాల పోటీ గెలిచిన మగ చింపాజీని ‘ఆల్ఫా మేల్’ (మొదటి మగాడు!) అంటారు. అతడే ముఠా నాయకుడు అవుతాడు. అయితే అంతకన్నా బలమైన చింపాజీ రంగప్రవేశం చేసినప్పుడు, ఇంద్రపదవి లాగా ఈ పదవి చేతులు మారిపోతుంటుంది!


చింపాజీలు సాధు జంతువులు ససేమిరా కాదని తెలుసుకుని జేన్ నిర్ఘాంపోయింది. చింపాజీ ముఠాల మధ్య కొట్లాటలు తరచు జరుగుతుంటాయి. ఒక “ముఠా నాయకుడు” తన ముఠాతో సహా వెళ్లి శత్రు ముఠా మీద యుద్ధం ప్రకటిస్తాడు.


ఆ యుద్ధంలో బలమైన చింపాజీలు బలం తక్కువైన చింపాజీలని తీవ్రంగా గాయపరచి, ఆ గాయలతోనే ప్రాణాలు వొదిలే స్థితికి తెస్తాయి. మనుషుల్లో ‘గ్యాంగ్ వార్’ లకి ఈ కలహాలకి పెద్దగా తేడా ఉన్నట్టు లేదు.

జేన్ చేసిన ఈ ప్రప్రథమ అధ్యయనాలన్నీ చక్కని ఫోటోలతో సహా ఆ రోజుల్లోనే ‘నేషనల్ జ్యాగ్రఫీ’ పత్రికలో అచ్చయ్యాయి. ఆ ఫోటోలు తీసిన హ్యూగో వాన్ లావిక్ ని ఆమె తరువాత వివాహం చేసుకుంది. ఇద్దరి కృషి ఫలితంగా అక్కడ “గోంబే స్ట్రీమ్ రీసెర్చ్ సెంటర్” అనే గొప్ప పరిశోధనా కేంద్రం వెలసింది. కొన్ని దశాబ్దాలుగా ఈ కేంద్రం చింపాంజీల పరిశోధనలో ప్రపంచంలో అగ్రస్థాయిలో నిలిచింది. కేంద్రంలో సిబ్బంది పెరిగారు. చింపాంజీల జీవన విధానంలో ఎన్నో అంశాలని ఈ బృందం క్రమబద్ధంగా అధ్యయనం చేస్తూ వచ్చింది. ఇరవై అయిదేళ్ల పాటు ఆమె చేసిన పరిశోధనలు 1986 లో “గోంబే చింపాజీస్ – పాటర్న్స్ ఆఫ్ బిహేవియర్” (గోంబే చింపాంజీలు – వాటి ప్రవర్తనలో విశేషాలు) అనే పుస్తకంగా వెలుడ్డాయి. జేన్ గుడాల్ కృషి నుండి స్ఫూర్తి పొందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు చింపాంజీల మీద పరిశోధనలు చేసి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. జేన్ గుడాల్ చేసిన వైజ్ఞానిక కృషికి గుర్తింపుగా ఎన్నో జంతు జాతుల, వృక్ష జాతుల పేర్లలో ఆమె పేరు కలిపారు. ఆమె సుదీర్ఘ వైజ్ఞానిక జీవితంలో ఆమె పొందిన అవార్డులు కోకొల్లలు. స్త్రీలు వైజ్ఞానిక రంగాల్లో కేవలం రాణించడమే కాదు, తలచుకుంటే వారి వారి రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగాములుగా ఉండగలరని జేన్ గుడాల్ నిదర్శనం మనకి స్పష్టం చేస్తోంది.


References:

http://en.wikipedia.org/wiki/Jane_Goodall http://www.janegoodall.org/




ప్రొ॥ జె. ఇ. గోర్డన్ ఆధునిక బయోమెకానిక్స్ (biomechanics), పదార్థ విజ్ఞాన (material science) రంగాల పితామహులలో ఒకరని చెప్పుకోవచ్చు.

1913 లో పుట్టిన ఈయన గ్లాస్గో విశ్వవిద్యాలయం నుండి నేవల్ ఆర్కిటెక్చర్ లో పట్టం పుచ్చుకున్నారు.

స్కాట్లాండ్ షిప్ యార్డ్ లలో పని చేస్తూ తొలిదశలలోనే ఓడల రూపకల్పనలో తన అసామాన్య నైపుణ్యం నిరూపించుకున్నారు. ఓడలు నిర్మించడమే కాక వాటిలో విస్తృతంగా ప్రయాణించి రూపకల్పనకి, ప్రవర్తనకి మధ్య సంబంధాన్ని లోతుగా అర్థంచేసుకున్నారు. సరైన పదార్థం + సరైన నిర్మాణం – ఈ రెండూ కలిస్తేనే మన ప్రయోజనం కోరుకున్న విధంగా నెరవేరుతుందని తెలుసుకున్నారు.

గోర్డన్ యొక్క అభిరుచులు ఇంజినీరింగ్ రంగానికే పరిమితం కాదు. సాహిత్య, కళా రంగాలలో కూడా ఈయన ఎంతో ఆసక్తి చూపించేవారు. సాంప్రదాయక సాహిత్యంలో అతడికి మంచి ప్రవేశం ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ నౌకాదళంలో పని చేసిన ఈయన, రాత్రిళ్లు తీరిక వేళల్లో స్వాధ్యాయం చేసి గ్రీకు భాష నేర్చుకున్నారు. ప్రాచీన సాహిత్యంతో ఆయనకి ఉండే పరిచయం ప్రాచీన సంస్కృతులలో వాడబడ్డ కవచాల మీద, వాటిలో వాడే పదార్థాల మీద ఆయన చేసిన అధ్యయనాలకి శ్రీకారం చుట్టింది.



మానవ చరిత్రలో పదార్థాలకి ప్రబలమైన పాత్ర వుందని, కొత్త పదార్థాల ఆవిష్కరణ వల్ల చరిత్ర ఎన్నో ముఖ్యమైన మలుపులు తిరిగిందని ఆయన గుర్తించారు. రాబోయే కాలంలో పదార్థాల ప్రాబల్యం పెరుగుతుందని, వాటి ప్రాధాన్యత లోతుగా గుర్తించబడుతుందని, ఓ కొత్త “పదార్థ సంస్కృతి” ఆవిర్భవిస్తుందని ఆయన ముందే ఊహించారు. పదార్థాలకి, ప్రాచీన సంస్కృతులకి మధ్య ఉన్న సంబంధాన్ని బాగా గుర్తించిన గోర్డన్ ఈ రెండు విద్యావిభాగాలని కలుపుతూ ఓ కొత్త ఉమ్మడి విభాగాన్ని స్థాపించారు. ఆ విభాగం ఈ రెండు రంగాల్లో ఉమ్మడిగా పట్టం ప్రదానం చేస్తుంది. అయితే గోర్డన్ లాగా ఈ రెండు విభిన్న రంగాలని కలిపి జీర్ణించుకోగల సత్తా ఉన్న విద్యార్థులు అరుదు. కనుక ఈ విభాగం పెద్దగా రాణించలేదు.





గోర్డన్ పని చేసే కాలంలో పదార్థ విజ్ఞానం అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండేది కాదు. నిర్మాణాలలో ఎక్కువ సాంప్రదాయబద్ధమైన పదార్థాలనే వాడేవారు. కనుక ఆ రోజుల్లో పదార్థ విజ్ఞానం లోహ విజ్ఞానం (metallurgy)తో సమానం. కాని గోర్డన్ నౌకానిర్మాణంలో ఆయన గడించిన అనుభవాన్ని ఉపయోగించి, నౌకా నిర్మాణంలో వాడే పదార్థాలని విమానాల రుపకల్పనలో వినియోగించే ప్రయత్నం ప్రారంభించారు. ఓడలలో వాడే చెక్క మాత్రమే కాకుండా ప్లాస్టిక్ మొదలైన సాంప్రదాయేతర పదార్థాలని యుధ్ధవిమానాలలో వినియోగించి ఎన్నో చక్కని ఫలితాలు సాధించారు.

ఆ కాలంలోనే గాలితో పూరించబడ్డ డింగీ (dinghy) అనబడే పడవల రూపకల్పనలో ఎంతో ప్రగతి సాధించారు. ఈ డింగీ అన్న పదం బెంగాలీ నుండి గాని, ఉర్దూ నుండి గాని వచ్చి వుంటుంది అంటారు (వికీ). ఈ చిన్న పడవలని యుద్ధ విమానాలు మోస్తాయి. అలాగే గాజు, కార్బన్, బోరాన్ మొదలైన పదార్థాలతో ప్రబలీకృత ఫైబర్ల (reinforced fibers) ప్రవర్తనని ఈయన అధ్యయనం చేశారు.

ఇంగ్లండ్ కి, ప్రపంచ పదార్థ వైజ్ఞానిక రంగానికి ఈయన చేసిన సేవలకి గుర్తింపుగా రాయల్ ఎయిరోనాటిక్స్ సొసయిటీ ఇతనికి రజత పతకం ఇచ్చి సత్కరించింది.



ప్రొ. గోర్డన్ రాసిన పుస్తకాలలో రెండు మచ్చుతునకలు ఉన్నాయి. అవి –

1. Structures or Why things don’t fall down.

2. The New Science of Strong Materials or Why You Don't Fall Through the Floor



ఈ రెండు పుస్తకాలు ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. పాపులర్ సైన్స్ సాహిత్యంలో ముఖ్యంగా పదార్థ విజ్ఞాన రంగంలో ఈ రెండు పుస్తకాలకి పోటీ లేవని చెప్పుకోవచ్చు. తన వైజ్ఞానిక జీవితం యొక్క చివరి దశల్లో రాయబడ్డ ఈ పుస్తకాలలో విస్తృతమైన తన అనుభవం యొక్క సారాన్ని పొందుపరిచారు. లోతైన వైజ్ఞానిక విషయాలని చర్చిస్తున్నా ఈ పుస్తకాలు భారంగా పాఠ్యపుస్తకాలలా కాకుండా సరదాగా చందమామ కథలలా సాగిపోతాయి. ఈ పుస్తకాల రచనలో ప్రాచీన సంక్కృతులతో, ప్రాచీన సాహిత్యంతో రచయితకి ఉన్న పరిచయం ఎంతో ఉపయోగపడింది. ఉదాహరణకి -



గ్రీకు వీరుడు ఒడిసెస్ వాడిన వింటికి నారిని సంధించడం ఎందుకంత కష్టం?

ప్రాచీన గ్రీకులు రాత్రి వేళల్లో రధ చక్రాలని ఎందుకు ఊడదీసి పెట్టేవారు?

గ్రీకుల కాటపల్ట్ ఎలా పని చేస్తుంది?

పార్థెనాన్ మందిరం ఎందుకంత అందంగా ఉంటుంది?

విస్మయం గొలిపే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు గోర్డన్ పుస్తకాలని అందంగా అలంకరించి పాఠకులని పుస్తకాన్ని పక్కన పెట్టనివ్వకుండా చదివింపజేస్తాయి.



గోర్డన్ రాసిన పుస్తకాలలో మొదటిదైన Structures నుండి కొన్ని విశేషాలని వరుసగా కొన్ని వ్యాసాలలో రాసుకొద్దామని ఉద్దేశం.



References:

http://en.wikipedia.org/wiki/J.E._Gordon

http://press.princeton.edu/chapters/i8225.html



గోళం యొక్క ఘనపరిమాణానికి సూత్రం 4/3 pi r^3 అని చిన్నప్పుడు బళ్లో నేర్పుతారు. కాల్క్యులస్ విధానాలని ఉపయోగించి ఈ సూత్రాన్ని ఎలా సాధించొచ్చో ఇంటర్మీడియట్ లో తెలుసుకుంటాం. అయితే కాల్క్యులస్ అవసరం లేకుండా గోళం యొక్క ఘనపరిమాణాన్ని సాధించే ఓ అద్భుతమైన పద్ధతి కనిపెట్టాడు ఆర్కిమిడీస్. ఆ విధానం ఇలా ఉంటుంది.


ఈ పద్ధతిలో ముందు రెండు వస్తువుల యొక్క ఘనపరిమాణాన్కి సూత్రం తెలియాలి – స్తంభం (cylinder), మరియు శంకువు (cone).
r వ్యాసార్థం, h పొడవు ఉన్న స్తంభం యొక్క ఘనపరిమాణం = p r2 h (pi r^2 h)
ఆధారం యొక్క వ్యాసార్థం r, ఎత్తు h అయిన శంకువు యొక్క ఘనపరిమాణం = 1/3 p r2 h (1/3 pi r^2 h)

ఇప్పుడొక చిన్న కసరత్తు చేద్దాం. r వ్యాసార్థం గల ఒక అర్థగోళాన్ని తీసుకుందాం. అలాగే ఆధారం యొక్క వాసార్థం r, ఎత్తు కూడా r గల ఓ శంకువు ని తీసుకుందాం. ఈ అర్థగోళాన్ని, శంకువుని పక్కపక్కన ఇలా ఉంచుదాం.


ఇప్పుడు h ఎత్తులో రెండు వస్తువులని పరిచ్ఛేదిస్తే, ఆ పరిచ్ఛేదం యొక్క వైశాల్యం ఎంతవుతుందో చూద్దాం. రెండు వస్తువులకి నిలువు అక్షం మీదుగా సౌష్ఠవం (symmetry) ఉంది గనుక, పరిచ్ఛేదాలు రెండూ వృత్తాలే అవుతాయి.


అర్థగోళంలో పరిచ్ఛేదం యొక్క వాసార్థం = sqrt (r^2 – h^2)
కనుక దాని వైశాల్యం = pi (r^2 – h^2) (1)
శంకువు ఆధారం యొక్క వ్యాసార్థం, దాని ఎత్తుతో సమానం కనుక, h ఎత్తులో చేసిన పరిచ్ఛేదం యొక్క వ్యాసార్థం కూడా r అవుతుంది. కనుక,
శంకువు లోని పరిచ్ఛేదం వైశాల్యం = pi (h^2) (2)
ఈ రెండు పరిచ్ఛేదాల వైశాల్యాలని కలిపితే వచ్చేది,

pi (r^2 – h^2) + pi ( h^2) = pi r^2
అంటే ఏ ఎత్తులో కోసినా ఆ రెండు పరిచ్చేదాల మొత్తం = pi r^2 కావడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది.
ప్రతీ ఎత్తులోను పరిచ్ఛేదం pi r^2 అయ్యే ఒక వస్తువు ఉంది. అది r వ్యాసార్థం కలిగి నిలువుగా ఉన్న స్తంభం.


అంటే ప్రతీ ఎత్తులోను,
అర్థగోళం యొక్క పరిచ్చేదం వైశాల్యం + శంకువు యొక్క పరిచ్ఛేదం వైశాల్యం = స్తంభం పరిచ్ఛేదం యొక్క వైశాల్యం
ప్రతీ పరిచ్చేదాన్ని, సన్నని మందం ఉన్న పొరలాగా ఊహించుకుంటే, దీన్ని బట్టి మనకి మరో సత్యం అర్థమవుతుంది,

r వ్యాసార్థం గల అర్థగోళం యొక్క ఘనపరిమాణం + r వ్యాసార్థం, r ఎత్తు గల శంకువు యొక్క ఘనపరిమాణం = r వ్యాసార్థం, r ఎత్తు గల స్తంభం యొక్క ఘనపరిమాణం

==> r వ్యాసార్థం గల అర్థగోళం యొక్క ఘనపరిమాణం + 1/3 pi r^3 = pi r^3

==> r వ్యాసార్థం గల అర్థగోళం యొక్క ఘనపరిమాణం = 2/3 pi r^3
==> r వ్యాసార్థం గల పూర్ణగోళం యొక్క ఘనపరిమాణం = 2X 2/3 pi r^3 = 4/3 pi r^3

ఈ విధంగా ఆర్కిమిడీస్ గోళం యొక్క ఘనపరిమాణానికి సూత్రం కనుక్కుంటాడు.








ఆర్కిమిడీస్ కనిపెట్టిన స్టోమకియాన్ (stomachion) అనే గణిత క్రీడ గురించి రెండు వ్రాతపత్రులు శిధిలావస్థలో దొరికాయి. వాటిలో ఒకటి అరబిక్ అనువాదం. పదవశతాబ్దానికి చెందిన రెండవ వ్రాతపత్రి గ్రీకులో రాయబడినది. ఇది 1899 లో కాస్టాంటినోపుల్ నగరంలో దొరికింది. అసలు ఆర్కిమిడీస్ ఈ ఆటని కనిపెట్టాడా లేక అందులోని జ్యామితి (geometry) సంబంధమైన అంశాలని గణితపరంగా విశ్లేషించాడా అన్న విషయం మీద స్పష్టత లేదు. ప్రాచీన రచనలలో మరి కొన్ని చోట్ల కూడా ఈ ఆట గురించిన ప్రస్తావన ఉంది. ఒక లాటిన్ కృతిలో దీని గురించి ‘లోక్యులస్ ఆర్కిమీడియస్’ (loculus Archimedius అంటే ఆర్కిమిడీస్ పెట్టె) అని ప్రస్తావించబడింది. στόμαχος (stomakos) అంటే గ్రీకులో ‘కడుపు’ (stomach) అని అర్థం. మరి ఈ ఆటకి స్టొమకియాన్ అని ఎందుకు పేరు పెట్టారో ఎవరికీ తెలీదు.

ఈ ఆటలో 14 చదునైన దంతపు ముక్కలు ఉంటాయి. ప్రతి ముక్క ఒక బహుభుజి (polygon) ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారాలని కూర్చి ఒక చదరాన్ని తయారు చెయ్యొచ్చు. అయితే ఇవే ఆకారాలని కొత్త కొత్త రకాలుగా కూర్చి సరదాగా వివిధ వస్తువుల రూపాలని తయారు చెయ్యాలి. కింద చిత్రంలో వీటిని కూర్చి ఓ ఏనుగు బొమ్మని తయారుచేసే పద్దతి కనిపిస్తోంది.







`

స్టొమకియాన్ ఆటలో ఆడే బహుభుజుల నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. 12 X 12 పరిమాణం ఉన్న చదరపు గడిని తీసుకోవాలి. గడిలో కనిపించే గీతల అంతరఖండన (intersection) బిందువులని ‘గడి బిందువులు’ (lattice points) అంటారు. గడిలో కనిపించే ప్రతి చిన్న చదరం యొక్క వైశాల్యం ఒక యూనిట్ అనుకుంటే, పెద్ద చదరం యొక్క వైశాల్యం 144 అవుతుంది. గడిలో గుర్తులు పెట్టబడ్డ ఎర్రని బిందువులని చిత్రంలో చూపించినట్టు కలపాలి. ఈ గీతల వల్ల గడి 14 ముక్కలుగా విభజింపబడుతుంది.










3 ముఖాలు గల బహుభుజులు (త్రిభుజాలు) =11
4 ముఖాలు గల బహుభుజులు (చతుర్భుజాలు) = 2
5 ముఖాలు గల బహుభుజులు (పంచభుజాలు) = 1









ప్రతి బహుభుజి యొక్క వైశాల్యం పూర్ణ సంఖ్య కావడం విశేషం. ఎందుకంటే ఇవి ప్రత్యేకమైన బహుభుజులు. చదరపు గడి మీద బిందువులని కలపగా ఏర్పడ్డవి. అలాంటి బహుభుజులని గడి బహుభుజులు (lattice polygons) అంటారు. గడి బహుభుజుల వైశాల్యాన్ని తెలిపే ఓ చక్కని సూత్రం ఉంది. దాని పేరు ‘పిక్ సిద్ధాంతం’ (Pick’s theorem). ఆ సిద్ధాంతం సహాయంతో స్టొమకియాన్ ఆటలోని బహుభుజుల వైశాల్యం పూర్ణ సంఖ్య ఎందుకు అయ్యిందో అర్థం అవుతుంది.


పిక్ సిద్ధాంతం
ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఆస్ట్రియాకి చెందిన జార్జ్ అలెగ్సాండర్ పిక్ (1859-1942).
ఈ సిద్ధాంతం ప్రకారం ఒక గడిబహుభుజి యొక్క వైశాల్యాన్ని తెలిపే సూత్రం ఈ విధంగా ఉంటుంది –
వైశాల్యం = A + B/2 – 1
A - ఇది బహుభుజి లోపలి భాగంలో ఉండే గడి బిందువుల సంఖ్య
B – ఇది బహుభుజి సరిహద్దు మీద ఉండే గడి బిందువుల సంఖ్య
ఉదాహరణకి కింద కనిపించే గడిబహుభుజిలో A = 31, B = 15, కనుక బహుభుజి వైశాల్యం
= 31 + 15/2 – 1 = 37.5 అవుతుంది.

ఇంత సంక్లిష్టమైన బహుభుజి యొక్క వైశాల్యానికి ఇంత సులభమైన సూత్రం ఉండడం ఆశ్చర్యం. ఇదే పిక్ సిద్ధాంతంలోని గొప్పదనం.
ఈ సూత్రంలో B సరి సంఖ్య అయితే వైశాల్యం ఎప్పుడూ పూర్ణ సంఖ్య అవుతుంది. స్టొమకియాన్ ఆటలో ప్రతీ బహుభుజికి సరిహద్దు మీద ఉండే గడి బిందువుల సంఖ్య సరి సంఖ్య అయ్యుండేలా జాగ్రత్తపడ్డాడు ఆ ఆట యొక్క సృష్టికర్త.

Reference:
http://www.math.nyu.edu/~crorres/Archimedes/Stomachion/intro.html












ఆర్కిమిడీస్ భౌతిక శాస్త్ర సూత్రాలని కనుక్కోవడమే కాక ఎన్నో అద్భుత సాంకేతిక పరికరాలని కూడా రూపొందించాడు. అలాంటి పరికరం ఒకటి ‘ఆర్కిమిడీస్ స్క్రూ’. ఈ పరికరంతో నీళ్లు తోడడానికి వీలవుతుంది. దీని రూపకల్పనకి కూడా ఒక విధంగా రెండవ హీరో రాజే కారణం. నౌక్రాటిస్ కి చెందిన ఎథెనేయియస్ అనే రచయిత ఈ కథనం అంతా ఓ పుస్తకంలో వర్ణించాడు. అందులో 600 మంది ప్రయాణించగలిగేవారట. అందులో ఓ క్రీడారంగం (జిమ్నేషియమ్) ఉంటుంది. గ్రీకుల ప్రేమదేవత అయిన అఫ్రొడైటీ కి అంకితం చెయ్యబడ్డ ఓ ఆలయం కూడా ఉండేదట. అంతపెద్ద ఓడలో ఎక్కడైనా చిల్లులు పడి నీరు ఓడ లోపలికి వస్తే ఆ నీటిని తోడి బయటికి పంప్ చెయ్యాల్సిన సమస్య వచ్చి పడింది. అందుకోసమే ఈ ప్రత్యేకమైన ‘స్క్రూ’ ని కనిపెట్టాడు ఆర్కిమిడీస్. ఈ స్క్రూ ఇప్పటికీ ప్రపంచంలో పంట పొలాలకి నీరు అందించే ప్రయోజనాల కోసం వాడుతున్నారు. బొగ్గు లాంటి ఘనపదార్థాలని ఎత్తుకి ఎత్తించేటందుకు కూడా వీటిని వాడతారు. ఇలాంటి స్క్రూ నే తొలుత బాబిలోన్ నగరంలోని ప్రఖ్యాత ‘వేలాడే తోటలకి’ (Hanging gardens of Babylon) నీరు సరఫరా చెయ్యడానికి వాడేవారని చెప్తారు. ఆ పాత స్క్రూ యొక్క మరింత అధునాతన రూపమే ఆర్కిమిడీస్ కనిపెట్టిన స్క్రూ అని అంటారు.



ఆర్కిమిడీస్ పంజా





ఆర్కిమిడీస్ కేవలం శాంతియుతమైన ప్రయోజనాలు గల పరికరాలు మాత్రమే కాక యుద్ధంలో పనికొచ్చే యంత్రాలని కూడా రూపొందించాడు. ఉదాహరణకి ఆర్కిమిడీస్ పంజా అని పిలువబడే ఓ యంత్రం సిరక్యూస్ నగరానికి యుద్ధంలో గొప్ప రక్షణ కల్పించింది. ‘క్రేన్’ ఈ యంత్రం కోట గోడల మీద స్థాపించబడి వుంటుంది. ఆ యంత్రం నుండి పంజా లాంటి పరకరాన్ని కిందికి దించుతారు. కోట గోడలకి అవతల సముద్రం మీదుగా గోడలకి మరీ దగ్గరగా వచ్చిన శత్రు నౌకల మీదికి ఈ పంజాని ప్రయోగిస్తారు. ఆ పంజా ఓడకి తగులుకోగానే పైనుండి తాళ్లతో ఓడలని లాగుతారు. కొంత ఎత్తువరకు తాళ్లు లాగి ఒక్కసారిగా వదిలేస్తారు. ఆ దెబ్బకి ఓడలు పక్కకి ఒరిగి నీట మునుగుతాయి.


ఆర్కిమిడీస్ ప్రయోగించిన “మరణ కిరణం”


క్రీ.శ. రెండవ శతాబ్దానికి చెందిన లూసియన్ అనే రచయిత సిరక్యూస్ యుద్ధం గురించి రాస్తూ ఆ యుద్ధంలో ఆర్కిమిడీస్ అగ్నిని ప్రయోగించి శత్రు నౌకలని ధగ్ధం చేశాడని వర్ణిస్తాడు. “ఆర్కిమిడీస్ వేడి కిరణం” గా చెప్పుకోబడే ఈ సాధనంతో సూర్యకాంతిని ఓడ మీదకి కేంద్రీకరించి ఓడని ధగ్ధం చేస్తారు.

అయితే నిజంగానే అల్లంత దూరంలో ఉన్న ఓడల మీదకి సూర్యకాంతిని కేంద్రీకరించి నాశనం చెయ్యడం జరిగేపనేనా, అది అతిశయోక్తి కాదా అని ఎంతో మంది ఈ విషయంలో సంశయం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ తాత్వికుడు రేనే దేకార్త్ అదంతా వట్టి పుక్కిటి పురాణం అని కొట్టి పారేశాడు. అయితే ఆర్కిమిడీస్ కాలంలో అందుబాటులో ఉండే సాధన సామగ్రితో అలాంటి ఫలితం సాధ్యం కావచ్చని కొందరు ఆలోచించారు. రాగితో గాని, కంచుతో గాని చేయబడ్డ కవచాలని బాగా మెరుపు వచ్చేలా రుద్ది, వాటిని అద్దాలలా వాడుకుంటూ, సముద్ర తీరం మీద పారాబోలా ఆకారంలో వాటిని నిలిపి, సూర్యకాంతిని శత్రు నౌక మీదకి కేంద్రీకరిస్తే నిజంగానే ఓడని ధగ్ధం చెయ్యొచ్చని వాదనలు జరిగాయి.

1973 లో అయోనిస్ సక్కాస్ అనే గ్రీకు శాస్త్రవేత్త నిజంగానే ఈ వాదనని ప్రయోగించదలచాడు. ఏతెన్స్ నగరానికి బయట స్కరమాగాస్ అనే రేవులో ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగంలో 70 అద్దాలు వాడారు. 5 X 3 అడుగుల పరిమాణం ఉన్న ఈ అద్దాలకి రాగి పూత వేశారు. ప్లై వుడ్ తో తయారు చేసిన రోమన్ యుద్ధనౌక యొక్క నమూనాని

160 అడుగుల దూరంలో ఉంచారు. అద్దాలని కచ్చితంగా నిలిపి కిరణాలని నౌక మీదకి కేంద్రీకరిస్తే క్షణాల్లో నౌక భగ్గుమంది. పైగా నౌక మీద తారు పూత పూశారు. దాని వల్ల కూడా నౌక మరింత సులభంగా నిప్పు అంటుకుని ఉంటుంది. నీరు ఓడ లోపలికి రాకుండా తారు పూత పూయడం ఆ రోజుల్లో పరిపాటి.

అక్టోబర్ 2005 లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థుల బృందం ఒకటి ఈ ప్రయోగాన్ని మళ్లీ చేసి చూసింది. ఈ ప్రయోగంలో 1 చదరపు అడుగు వైశాల్యం ఉన్న 127 అద్దపు పలకలని తీసుకున్నారు. వాటి సహాయంతో 100 అడుగుల దూరంలో ఉన్న ఓ నమూనా ఓడ మీదకి సూర్యకాంతిని కేంద్రీకరించారు. ఓడ మీద కాంతి పడ్డ ప్రాంతంలో మాత్రమే నిప్పు అంటుకుంది. అయితే ఆకాశంలో మేఘాలు లేని పరిస్థితుల్లో, ఓడ కదలకుండా పది నిముషాల సేపు ఉన్నప్పుడే ప్రయోగం పని చేసింది. ఈ సారి ఓడ మీద కాంతి పడ్డ చోట కాస్త మంట వచ్చింది, కాస్త మసిబారింది.

ఇదే ప్రయోగాన్ని ఆ ఎమ్. ఐ. టి. బృందం సాన్ ఫ్రాన్సిస్కో తీరం మీద కూడా చేసి చూసింది. ‘మిత్ బస్టర్స్’ అనే టీవీ షోలో భాగంగా ఆ ప్రయోగం జరిగింది. మూడనమ్మకాలని పరీక్షించి వాటి గుట్టు రట్టు చెయ్యడం ఈ టీవీ షో లక్ష్యం. ఈ సారి చెక్కతో చేసిన ఓ జాలరి పడవ మీద ఈ సారి కాంతిని కేంద్రీకరించారు. అయితే ఓడ సమూలంగా దగ్ధం కాలేదు. చెక్క నిప్పు అంటుకోవాలంటే దాని ఉష్ణోగ్రత స్వయం జ్వలన బిందువు (autoignition temperature) ని, అంటే 300 oC ని, చేరుకోవాలి.

ఈ ఫలితాలన్నీ గమనించాక ‘మిత్ బస్టర్స్’ షో లో ఈ ప్రయోగం విఫలం అయినట్టు ప్రకటించారు. ఓడ మీద ఎంతో కొంత ప్రభావం లేకపోయినా, అనుకున్నట్టు ఓడ దగ్ధం కాదని ఆ షో ఖండితంగా చెప్పింది. అంత కష్టపడి అద్దాలతో సూర్యకాంతిని కేంద్రీకరించి అంత అల్పమైన ఫలితాన్ని సాధించే బదులు, సాంప్రదాయక ఆయుధాలైన నిప్పుబాణాలు, ఫిరంగులు మొదలైనవి మరింత సఫలదాయకంగా ఉంటాయని ఆ షో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.












ఆర్కిమిడీసె సూత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో వస్తువులని నీట్లో ముంచి, తీసి, తూచి తిప్పలు పడ్డ అనుభవం చాలా మంది తెలియనితనంలో పొందే వుంటారు. అలాగే స్నానాల తొట్టెలో దీర్ఘంగా ఆలోచిస్తుండగా స్ఫురించిన ఆలోచనకి సంబరం పట్టలేక ఇబ్బందికరమైన వేషంలో నగర వీధుల వెంట ‘యురేకా’ అంటూ ఉరకలు వేసిన ఆర్కిమిడీస్ గురించి చాలా మంది వినే వుంటారు.

పాశ్చాత్య గణితలోకంలో త్రిమూర్తులుగా మూడు పేర్లు చెప్పుకుంటారు – వాళ్లు ఆర్కిమిడీస్, న్యూటన్, గౌస్. వీరిలో న్యూటన్, గౌస్ లు కేవలం శతాబ్దాల క్రితం జీవించిన వారైతే, ఆర్కిమిడీస్ క్రీ.పూర్వం వాడు. సిసిలీ ద్వీపంలోని సిరక్యూస్ నగరంలో క్రీ.పూ. 287 లో జన్మించాడు ఆర్కిమిడీస్. తన తండ్రి ఫైడియాస్ ఓ ఖగోళవేత్త. ఆ రోజుల్లో సిరక్యూస్ ని పాలించిన రెండవ హీరోకి ఆర్కిమిడీస్ బంధువు అని చెప్పుకుంటారు. యవ్వనంలో చదువు కొంతకాలం ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో జరిగింది. భూమి వ్యాసాన్ని అంచనావేసిన ఎరొటోస్తినీస్ ఇతడికి సమకాలికుడు.

ఆర్కిమిడీస్ కనుక్కున్న ప్రఖ్యాత సూత్రం వెనుక ఒక కథ వుంది. మహారాజు రెండవ హీరో ఒకసారి గుళ్ళో విగ్రహాన్ని అలంకరించేందుకు గాను ఓ స్వర్ణకారుణ్ణి పురమాయించి ఓ బంగారు కిరీటం చేయించాడు. కిరీటానికి కావలసిన బంగారం కూడా రాజే సరఫరా చేశాడు. అయితే తీరా కిరీటం తయారయ్యాక బంగారానికి బదులు కాస్త వెండి కలిపాడేమోనని రాజుకు స్వర్ణకారుడి మీద సందేహం వచ్చింది. సందేహం రావడంతోనే స్వర్ణకారుణ్ణి పిలిచి ఉరి తీయించకుండా ముందు సందేహం నిజమో కాదో తేల్చుకోవాలని అనుకున్నాడు. ఆర్కిమిడీస్ ని పిలిచి ఏదైనా ప్రయోగం చేసి నిజం నిర్ధారించమని కోరాడు.

ఆర్కిమిడీస్ ఆలోచనలో పడ్డాడు. కల్తీ జరిగిందో లేదో తెలియాలంటే కిరీటం సాంద్రత కనుక్కోవాలి. కిరీటం బరువు కనుక్కోవడం సులభమే. కాని ఘనపరిమాణం తెలుసుకోవడం ఎలా? ఏ ఘనమో, శంకువో అయితే ఘనపరిమాణాన్ని అంచనా వెయ్యడానికి కచ్చితమైన సూత్రాలు ఉన్నాయి. కాని ఇలాంటి క్రమరహిత రూపం యొక్క ఘనపరిమాణం కనుక్కోవడం ఎలా? దీని గురించి ఆలోచిస్తూ ఓ రోజు స్నానం చేద్దామని స్నానాల తొట్టెలో కి దిగాడు. తను లోపలికి దిగుతుంటే తొట్టెలో నీటి మట్టం నెమ్మదిగా పైకి రావడం గమనించాడు. పెరిగిన నీటి మట్టానికి తన ఒంటి ఘనపరిమాణానికి మధ్య సంబంధాన్ని గుర్తించాడు. వస్తువు రూపం ఎలా ఉన్నా ఈ అత్యంత సులభమైన పద్ధతిలో దాని ఘనపరిమాణం ఎలా కనుక్కోవాలో ఆ క్షణం అర్థమయ్యింది. ఇక ఉత్సాహం పట్టలేక ఉన్న పళంగా సిరక్యూస్ పురవీధుల్లో ‘యురేకా’ అని ఉరికాడట! తదనంతరం ఆ పద్ధతిని ఉపయోగించి కిరీటంలో వెండి కలిసిందని నిరూపించాడు ఆర్కిమిడీస్.

అయితే కేవలం స్థానభ్రంశం చెందిన నీటి ఘనపరిమాణం సహాయంతో కిరీటం ఘనపరిమాణాన్ని కచ్చితంగా కొలవడం కొంచెం కష్టం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా అసలు ఈ కిరీటం సమస్య గురించి ఆర్కిమిడీస్ సొంత రచనల్లో ఎక్కడా లేదు. మర్కస్ విట్రీవియస్ అనే రోమన రచయిత, ఇంజినీరు ఈ కథ గురించి రాశాడు. అయితే ఆర్కిమిడీస్ ‘తేలే వస్తువులు’ అన్న పుస్తకంలో ఇలాంటి అంశాలు ఎన్నో చర్చించాడు. అందులోనే మనం ప్రస్తుతం చెప్పుకునే ఆర్కిమిడీస్ సూత్రం ప్రస్తావన వస్తుంది.

నీట్లో (లేక మరే ద్రవంలో అయినా) మునిగిన వస్తువు దాని ఘనపరిమాణంతో సమానమైన నీటి మొత్తాన్ని స్థానభ్రంశం (displace) చేస్తుంది. అలా స్థానభ్రంశం అయిన నీటి భాగం మునిగిన వస్తువుని పైకెత్తుతూ ఉంటుంది. దీన్నీ ప్లవనం (buoyancy) అంటారు. దీని వల్ల మునిగిన వస్తువు ఎంత బలంతో పైకి ఎత్తబడుతుందో ఆ బలాన్ని ప్లవన బలం (force of buoyancy) అంటారు. వస్తువు బరువు కన్నా ఈ బలం ఎక్కువ అయితే వస్తువు పూర్తిగా తేల్తుంది.

వస్తువు బరువు కన్నా ప్లవన బలం తక్కువైతే వస్తువు మునుగుతుంది గాని, గాలిలో ఉన్నప్పటి కన్నా నీట్లో మునిగి వున్న స్థితిలో బరువు కాస్త తగ్గుతుంది.స్థానభ్రంశం చెందిన నీటి ఘనపరిమాణం, వస్తువు ఘనపరిమాణం ఒక్కటే కనుక ఇక్క బరువులని పోల్చేబదులు సాంద్రత (=బరువు/ఘనపరిమాణం) ని పోల్చితే సరిపోతుంది. సాంద్రత పరంగా ఈ సూత్రాన్ని చెప్పుకోవాలంటే, నీటి సాంద్రత కన్నా వస్తువు సాంద్రత తక్కువైతే వస్తువు తేల్తుంది, లేకుంటే మునుగుతుంది.

ఈ సూత్రాన్ని ఈ కింది చిత్రంలో ప్రదర్శించబడుతున్న ప్రయోగంలో స్పష్టంగా చూడొచ్చు. చిత్రంలో కనిపిస్తున్న మూడు గ్లాసుల్లో మూడు కోడిగుడ్లు ఉన్నాయి. ఎడమ పక్క ఉన్న గ్లాసులో మంచి నీరు ఉంది. మధ్యలో ఉన్న గ్లాసులో ముందు మంచి నీరు తీసుకుని, అందులో నాలుగు చెంచాల ఉప్పు కలిపారు. కుడి పక్క ఉన్న గ్లాసులో ముందు మంచి నీరు తీసుకుని అందులో రెండు చెంచాల ఉప్పే కలిపారు. ఉప్పు కలపడం వల్ల నీటి సాంద్రత పెరుగుతుంది.

ఎడమ పక్క గ్లాసులో నీటి సాంద్రత తక్కువ కనుక గుడ్డు మునిగింది. కుడి పక్క గ్లాసులో నీటి సాంద్రత మరి కాస్త ఎక్కువ కనుక గుడ్డు తేలకుండా, మునగకుండా మధ్యస్థంగా ఉండిపోయింది. మధ్యలో ఉన్న గ్లాసులో నీటి సాంద్రత అన్నిటికన్నా ఎక్కువ కనుక గుడ్డు తేలింది.

ఈ సూత్రాన్ని ఉపయోగించి ‘కిరీటం సమస్యని’ సులభంగా పరిష్కరించొచ్చు. కచ్చితంగా కిరీటం బరువుతో సమానమైన బరువున్న శుద్ధ బంగారపు ముక్కని తీసుకోవాలి. ఇప్పుడు కిరీటాన్ని, బంగారపు ముక్కని ఓ త్రాసు మీద ఉంచి, రెండిట్నీ నీట్లో ముంచాలి. రెండు వస్తువుల సాంద్రత ఒకటే అయితే, త్రాసు సరిగ్గా తూగుతుంది. కల్తీ జరగడం వల్ల కిరీటం సాంద్రత బంగారం సాంద్రత కన్నా తక్కువైతే, బంగారం ఉన్న వైపు త్రాసు మొగ్గు చూపుతుంది.



References:


2. Socoolscienceshow


(ఆర్కిమిడీస్ రూపొందించిన యంత్రాల గురించి మరో పోస్ట్ లో)

సర్ ఐజాక్ న్యూటన్

Posted by V Srinivasa Chakravarthy Thursday, September 29, 2011 16 comments




(ఎప్పుడే నేనే ఏదో సోది రాయడం కాకుండా తెలుగులో సైన్సు రాయాలనుకునే ఔత్సాహికుల రచలనని ఈ బ్లాగ్లో పోస్ట్ చెయ్యాలనే కార్యక్రమంలో మొదటి మెట్టుగా ‘సర్ ఐజాక్ న్యూటన్’ జీవితం మీద ఓ వ్యాసం… శ్రీ.చ.)

సర్ ఐజాక్ న్యూటన్ (డిసెంబరు 25, 1642 - మార్చి 20, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. "ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సు గా ఎలా పరిణామం చెందింది" అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవిస్తుంది.

సర్ ఐజాక్ న్యూటన్ ఊల్స్ తోర్ప్, లింకన్ షైర్, ఇంగ్లాండ్ లో డిసెంబర్ 25, 1642 సంవత్సరమున జన్మించాడు. ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ , న్యూటన్ 85 సంవత్సరాల వయస్సు వరకు జీవించి, మార్చి 20, 1727 న కెన్సింగ్టన్ పట్టణము నందు మరణించారు.

న్యూటన్ జన్మించిన సమయంలో అతను నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా బరువు తక్కువగాను, బలహీనంగాను ఉండేవాడు. చూసినవాళ్లంతా అసలీ శిశువు బ్రతుకుతాడా అనుకున్నారు. న్యూటన్ తండ్రి న్యూటన్ జననానికి మూడు నెలల ముందు మరణించారు. న్యూటన్ తన తల్లి సంరక్షణ క్రింద 3 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. తరువాత న్యూటన్ కేవలం 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె బార్ స్మిత్ అనే ఆయన్ను రెండవ వివాహం చేసుకున్నారు. అందువలన న్యూటన్ తన చిన్నతనంలో తన తల్లితండ్రుల ప్రేమ కోల్పోయి తన అమ్మమ్మ-తాతల వద్ద పెరగటం జరిగింది. న్యూటన్ తన బలహీనమైన ఆరోగ్యం వలన ఆటల వైపు ఎక్కువగా ఆసక్తి చూపించ లేదు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. న్యూటన్ 10 సంవత్సరముల వయస్సు లో ఉన్నప్పుడు తన సవతి తండ్రి కూడా మరణించాడు, అతని తల్లి ఊల్స్ తోర్ప్ కు తిరిగి వచ్చారు. ఆమె వ్యవసాయం మరియు పశువుల పై ఆసక్తి తీసుకోవడం ప్రారంభించారు.

12 ఏళ్ల వయస్సులో న్యూటన్ గ్రాన్థమ్ లోని గ్రామర్ స్కూలుకు పంపబఢ్డారు. అక్కడ అతని స్నేహితులలో చాలా మంది అమ్మాయిలు ఉండేవారు. న్యూటన్ గ్రామర్ స్కూల్ లో ఉన్నప్పుడు తన మేధోశక్తితో అందరిని ఆకట్టుకున్నారు. న్యూటన్ ఎల్లప్పుడూ భౌతిక, గణిత శాస్త్రాలకు సంబంధించిన సమస్యలను మాత్రమే పరిష్కరించటానికి ఇష్టపడేవారు. లైబ్రరీ లో చాలా సమయం అతను పుస్తక పఠనంలో గడిపేవారు.

న్యూటన్ ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి వద్ద విద్యార్థిగా ఉన్నప్పుడు అతని తల్లి గ్రామంలో సహాయం కోసం కబురు చేశారు. న్యూటన్ 17 వ సంవత్సరములో ఉన్నప్పుడు ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జి నుండి ఊల్స్ తోర్ప్ తిరిగి రావడం జరిగినది. పల్లెలో నివసిస్తున్నప్పుడు, న్యూటన్ గొర్రెల మందలు మేస్తుండగా కాపలా కాసేవారు. ఈ పనిని న్యూటన్ చాలా అసహ్యించుకునేవారు.అనేక సార్లు న్యూటన్ గణిత శాస్త్ర సమస్యలలో మునిగిపోవడంతో ఒకటి లేదా రెండు గొర్రెలు ఎల్లప్పుడూ తప్పించుకొనేవి. తన అజాగ్రత్త వలన తీవ్రంగా మందలింపబడేవాడు. గణితంలో న్యూటన్ పట్ల ఎంతో ఆసక్తి చూసిన ఒక ఉపాధ్యాయుడు, న్యూటన్ ను ఉన్నత విద్యను అభ్యసించడానికి విశ్వవిద్యాలయానికి పంపండని న్యూటన్ తల్లి కి గట్టిగా చెప్పారు. ఆ ఉపాధ్యాయుడు న్యూటన్ యొక్క విద్యకు అయ్యే ఖర్చును భరించటానికి అంగీకరించారు. న్యూటన్ తిరిగి జూన్ 1661 లో మరోసారి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరి భౌతిక, గణిత శాస్త్రాల అధ్యయనం ప్రారంభించారు.

న్యూటన్ పేద విధ్యార్ధి అవటం వలన సహ విద్యార్థులు (ధనవంతులు) న్యూటన్ ను నిందించి ఆటపట్టించేవారు. కానీ అతి తక్కువ కాలంలోనే, న్యూటన్ అద్భుతమైన భౌతిక, గణిత శాస్త్ర సామర్ధ్యంతో తన తోటి విద్యార్ధుల గౌరవం పోందారు. తదుపరి కాలంలో న్యూటన్ విశ్వవిద్యాలయం లో మిగిలిన స్నేహితుల మరియు ఉపాధ్యాయుల ప్రశంసలను అందుకున్నారు. న్యూటన్ ట్రినిటీ కాలేజ్ నుంచి మెట్రిక్యులేషన్ పోందారు, కానీ స్కాలర్షిప్ పోందటంలో విఫలమయ్యారు. ఇలా జరగడం, తద్వారా ఖర్చులు పెరగడంతో న్యూటన్ చాలా కలవరపడ్డారు.


స్కాలర్షిప్ లేకుండా ఉన్నత విద్యను కొనసాగించడం సాధ్యపడదని ఆయన గ్రహించారు. న్యూటన్ ఎంతో ప్రయత్నించినా, మార్కులు తక్కువ వచ్చిన కారణంగా స్కాలర్షిప్ మీద ఆశలు వదులుకున్నారు. అయినప్పటికి యూనివర్సిటీ బోర్డు సభ్యులు ఆయనకు నాలుగు సంవత్సరముల వరకు స్కాలర్షిప్ ఇచ్చారు. న్యూటన్ ఆనందానికి అవధులు లేవు. ఈ వచ్చిన అవకాశాన్నివీలైనంత సద్వినియోగం చేసుకోవాలని న్యూటన్ నిశ్చయించుకున్నారు. అతని పూర్తి సమయం లెక్కలు మరియు భౌతిక శాస్త్రం అభ్యాసానికే వినియోగించారు. ఆయన ఎంతలా నిమగ్నమయ్యారంటే ఒక్కొక్కసారి తిండి నిద్ర కూడా మరిచేవారు. న్యూటన్ యూనివర్సిటీలో గ్రీకు, లాటిన్, హిబ్రు భాషలను, లాజిక్, జ్యామితి మరియు త్రికోణమితి లను ఎంచుకున్నారు. లైబ్రరీ లో న్యూటన్ తరచుగా మేధావులైన కెప్లర్ మరియు ఇతరులు రాసిన / తయారుచేసిన గొప్ప ప్రయోగాలపై అధ్యయనం చేసేవారు.


న్యూటన్ 1969లో ట్రినిటీ కాలేజిలో ఉండే సమయంలో తన ఆలోచనలను పుస్తకాలలో రాసుకున్నారు. ఆ పుస్తకాలు న్యూటన్ ఆలోచనా ధోరణిని బహిర్గతం చేస్తూ ఇప్పటికీ ఎంతో ముఖ్యమైనవిగా పరిగణింపబడతాయి. న్యూటన్ 1665 లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి బాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో అనేక ప్రాంతాల్లో ప్లేగు మహమ్మారినబడి వేల మంది మరణించారు. ఆ అంటువ్యాధుల వలన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం రెండు సంవత్సరాల పాటు మూసివేయబడినది. అప్పుడు న్యూటన్ ఊల్స్ తోర్ప్ కు తిరిగి వచ్చి భౌతిక మరియు గణిత శాస్త్ర అధ్యయనంలో రెండు సంవత్సరాల కాలం గడిపారు. ఈ కాలంలో, ఆయన fluxions యొక్క ఆలోచన మరియు కాంతి మరియు రంగు యొక్క పునాదులు వేశారు. అదే సంవత్సరంలో న్యూటన్ ప్రిన్సిపియా అని ఒక సంకలనం తయారు చేశారు. అది న్యూటన్ యొక్క మహత్తర పుస్తకంగా, 1687 లో ప్రచురించబడినది. న్యూటన్ 1667 లో కేంబ్రిడ్జి తిరిగి తన పరిశోధన కార్యకలాపాలను ప్రారంభించారు. న్యూటన్ 1669 లో కేంబ్రిడ్జి నుండి మాష్టర్స్ డిగ్రీ పొందారు, మరియు అదే సంవత్సరంలో గణిత శాస్త్ర ప్రొఫెసరు గా నియమించబడ్డారు.

ప్రొఫెసర్ న్యూటన్ విశ్లేషణాత్మక జ్యామితి, బీజగణితం, మరియు క్యాల్కులస్ రంగాలమీద తన దృష్టి సారించారు. బైనామినల్ సిద్ధాంతం, అనంతం సిరీస్ విస్తరణ కోసం కొత్త పద్ధతులు, fluxions యొక్క ప్రత్యక్ష మరియు విలోమ పద్ధతులు – ఇవీ ఆ కాలంలో ఆయన చేసిన ప్రధాన ఆవిష్కరణలు. న్యూటన్ 1665 నుండి 1666 వరకు కాంతి అధ్యయనం మీద దృష్టి కేంద్రీకరించారు. కాంతి యొక్క ఖచ్చితమైన కూర్పు తెలుసుకోవడానికి అనేక ప్రయోగాలను నిర్వహించారు. ఆయన కాంతి యొక్క అనేక ఇతర లక్షణాలను అధ్యయనం చేశారు.



రాయల్ సొసైటీ అధ్యక్షుడు "రాబర్ట్ హు్క్" 1703 లో మరణించాడు. అప్పుడు ప్రొఫెసర్ న్యూటన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యూటన్ అద్భుతమైన రచయిత, అతను అనేక శాస్త్రీయ మరియు అశాస్త్రీయ విషయాల మీద ఎన్నో పుస్తకాలను రాశాడు. దురదృష్టవశాత్తు న్యూటన్ దైవీ శాస్త్రం (theology) మీది రచనలు ప్రచురించబడలేదు.

ప్రొఫెసర్ న్యూటన్ సన్నగా, పొడవుగా ఉండేవారు. న్యూటన్ తన దుస్తులు మరియు కేశాలంకరణపై ఆసక్తి చూపేవారు కాదు. ఎక్కువ సమయం అతను తన సొంత ఆలోచనలలో మునిగిపోయేవారు. ఎప్పుడూ గదిలో ఒక మూలలో లెక్కలు చేసుకునేవారు. తీవ్రమైన చర్చలలో కూడా ఒక్కోక్కసారి సొంత ఆలోచనలలో ఉండేవారు. న్యూటన్ క్రీడలు, వ్యాయామం పై ఎటువంటి ఆసక్తి చూపించేవారు కాదు. అనేక సందర్భాలలో అతను ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది లేదా పందొమ్మిది గంటలు అధ్యయనంలో గడిపేవారు. ప్రొఫెసర్ న్యూటన్ బ్యాచిలర్ గా ఉండి భౌతిక శాస్త్రం మరియు గణిత శాస్త్ర సేవలకే అంకితం చేశారు. న్యూటన్ నిజాయితి మరియు ముక్కుసూటి మనిషి. న్యూటన్ మార్చి 20, 1727 న 84 సంవత్సరాల వయసులో మరణించాడు. అతనని వెస్ట్ మినిస్టర్ అబ్బే లో ఖననం చేశారు.

అనువాదం – స్వాతి మరియు శ్రీవత్సవ చీమకుర్తి
మూలం - http://biography-of.com/sir-isaac-newton


http://www.andhrabhoomi.net/intelligent/ship-builder-093

బ్రిటిష్ పరిపానలలో ఉన్న పందొమ్మిదవ శతాబ్దపు భారత దేశంలో జీవించిన ఓ గొప్ప మెరైన్ ఇంజినీరు ఆర్దశీర్ కుర్సట్జీ (1808-1877). ఇతడు ఫార్సీ జాతికి చెందినవాడు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చూపించుకోగలగడానికి కారణం వారి సాంకేతిక నైపుణ్యం. ఆవిరి యంత్రం మొదలైన ఆవిష్కరణల వల్ల వచ్చిన పారిశ్రామిక విప్లవం బ్రిటిష్ వారి ప్రాబల్యానికి హేతువయ్యింది. ఆ సాంకేతిక బలంతోనే మన దేశం మీద అంత కాలం రాజ్యం చెయ్యగలిగారేమో.


అల్లంత దూరంలో ఉన్న బ్రిటన్ దీవి నుండి భారతాన్ని పాలించడానికి, సాంకేతిక సత్తాని ఉపయోగించి ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆవిరి యంత్రాల మీద పని చేసే ఓడలు ఆ ప్రయోజనం కోసం బాగా పనికొచ్చాయి. ఇవి కాకుండా ఇండియా అంతటా రైలు మార్గాలు వేశారు. టెలిఫోన్ లైన్లు అమర్చారు. ఇండియాలో తమ కార్యాలయాలలో పని చెయ్యడానికి భారతీయులకి తగు శిక్షణ నిచ్చారు. ఆ విధంగా ఆధునిక సాంకేతిక విద్య ఇండియాలోకి ప్రవేశించింది. ఎంతో మంది భారతీయులు సాంకేతిక విద్యలో శిక్షణ పొందారు. పాశ్చాత్య రాజ్యాల ప్రాబల్యానికి వేళ్లు ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకున్నారు.

అలా బ్రిటిష్ పాలనలో పాశ్చాత్య సంకేతిక విద్యలో ప్రవేశం పొందిన వారిలో కుర్సట్జీ వంశం కూడా ఉంది. ఆర్దశీర్ కుర్సట్జీకి పూర్వీకుడైన లోజీ నుసర్వాన్జీ వాడియా సూరత్ రేవులో వడ్రంగిగా పని చేసేవాడు. బ్రిటిష్ వారు బొంబాయిలో రేవు నిర్మించదలచుకున్నప్పుడు ఆ రేవు నిర్మాణంలో లోజీ నుసర్వాన్జీ సేవలు వాడుకున్నారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు నౌకా నిర్మాణంలో ఓక్ చెట్టు యొక్క కలపని వాడేవారు. కాని బ్రిటిష్ నౌకాదళ విస్తరణ వల్ల అన్ని ఓడలని నిర్మించడానికి ఓక్ చెట్లు సరిపోలేదు. కనుక స్థానికంగా దొరికే మలబార్ టేకు కలపని వాడడం మొదలెట్టారు. ఇది బలమైన కలప. సులభంగా కుళ్ళదు. ఈ కొత్త నౌకా నిర్మాణ పధ్ధతితో బొంబాయి గొప్ప రేవుగా రూపొందింది. ఆ విధంగా కుర్సట్జీ కుటుంబంలో నౌకా నిర్మాణం వంశానుగతంగా వస్తున్న విషయం.

అయితే కుర్సట్జీ మొదట శిక్షణ పొందిన రంగం నౌకా నిర్మాణం కాదు, ఆవిరి యంత్రాల నిర్మాణం. చిన్న వయసులోనే 1-హెచ్.పి. యంత్రం నిర్మించి తన సత్తా నిరూపించుకున్నాడు. ఇండియాలో నిర్మించబడ్డ మొట్టమొదటి ఆవిరి యంత్రం అదేనేమో. దాంతో ఓ నీటి పంపు తయారుచేసి ప్రదర్శించాడు. తరువాత 1833 లో ఇంగ్లండ్ నుండి 10 –హెచ్.పి. ఇంజిను తెప్పించుకుని దాన్ని ‘ఇండస్’ అనే పేరుగల ఓడలో అమర్చాడు. 1834 లో గ్యాస్ తో విద్యుత్ దీపాలు ఎలా అమర్చాలో చేసి చూపించాడు. మజగాన్ లో తన బంగళాలోను, తోటలోను గ్యాస్ దీపాలు అమర్చుకున్నాడు.

అప్పుడే బొంబాయిలో కొత్తగా వచ్చిన ఎల్ఫిన్స్టోన్ సంస్థలో ‘మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్’ రంగాల్లో శిక్షణ పొందాడు. నౌకలలో వాడే అధునాతన ఆవిరి యంత్రాల గురించి ఇంకా లోతుగా తెలుసుకోడానికి ఓ ఏడాది పాటు ఇంగ్లండ్ లో గడిపాడు.

కుర్సట్జీ పార్సీ ఆచారాలని తుచ తప్పకుండా పాటించేవాడు. అందుకే తనతో పాటు కొందరు పార్సీ సేవకులని ఇంగ్లండ్ కి తీసుకువెళ్లాడు. వాళ్లు చేసిన వంటే తినేవాడు. కుర్సట్జీకి ఎందుచేతనో లండన్ అంతగా నచ్చలేదు. లండన్ లోని టంకశాల కన్నా బొంబాయి లోని టంకశాలే నయం అనిపించింది. లండన్ లోని మురికి వీధులు చూసి, బొంబాయిలోని శుభ్రమైన వీధులతో పోల్చుకుని, అసహ్యించుకునేవాడు. మన దేశంలో ప్రస్తుత వాస్తవాలు అప్పటి వాస్తవానికి విరుద్ధంగా ఉండడం చింతించదగ్గ విషయం.

ఇంగ్లండ్ లో ఉండగా కుర్సట్జీ కి 1841 లో అక్కడి ప్రఖ్యాత రాయల్ సొసయిటీ లో సభ్యత్వం దొరికింది. అంత ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో సభ్యత్వం పొందిన ప్రథమ భారతీయుడు ఈయనే. ఆ తరువాత 75 ఏళ్ల తరువాత శ్రీనివాస రామానుజన్ కి మళ్లీ అదే గౌరవం లభించింది. అదే సంవత్సరం అతడు గొప్ప హోదాలో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈ కొత్త ఉద్యోగంలో ఎంతో మంది బ్రిటిష్ వారు కూడా కుర్సట్జీ కింద పనిచెయ్యాల్సి వచ్చింది. ఇది నచ్చని బాంబే టైమ్స్ పత్రిక ఈ విధంగా జాత్యహంకారం చూపించుకుంది – “ఎంత సమర్థుడైనా, ఎంత చదువుకున్నా, ఒక స్థానికుడు బాంబే స్టీమ్ ఫాక్టరీ లాంటి గొప్ప పరిశ్రమకి నేతృత్వం వహించడం” ఎంత వరకు సమంజసం అంటూ సందేహం వ్యక్తం చేసింది.


1851 లో కుర్సట్జీ తన పూర్వీకుల గౌరవార్థం ‘లోజీ ఫామిలీ’ అనే పేరుగల ఓ స్టీమరును విడుదల చేశాడు. ఆ స్టీమరులో వాడిన విడిభాగాలన్నీ తన సొంత ఫౌండ్రీలో ఉత్పత్తి చెయ్యబడ్డాయి. బొంబాయిలో మొట్టమొదటిసారిగా కుట్టుమెషిను, ఫోటోగ్రఫీ, ఎలక్ట్రో ప్లేటింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాల ప్రవేశానికి కూడా ఇతడే కారణం.

1861 లో ఇండస్ ఫ్లోటిలా కంపెనీ లో సూపర్ ఇంటెండింగ్ ఇంజినీరుగా పదవీ స్వీకారం చేశాడు. తదనంతరం సింద్ ప్రాంతంలోని కోట్రీ అనే ఊళ్లో ఈ కంపెనీకి శాఖలు కూడా తెరిచాడు. తరువాత 1863 ఇంగ్లండ్ కి వెళ్లి రిచ్మండ్ అనే ఊళ్లో స్థిరపడ్డాడు. జీవితాంతం అక్కడే ఉండి, 16, నవంబర్ 1877 లో కన్నుమూశాడు.

(అరవింద్ గుప్తా రాసిన ‘బ్రైట్ స్పార్క్స్’ అనే పుస్తకం నుండి)


http://www.andhrabhoomi.net/intelligent/srinivasa-207



ఎప్పుడూ ఒకే సమస్యని పట్టుకుని వేలాడకుండా, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ, తనకి పరిచయం లేని వైజ్ఞానిక రంగాల్లో చొచ్చుకుపోతూ, పరిశోధనలు చెయ్యడం అంటే మేటి అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత, రిచర్డ్ ఫెయిన్మన్ కి సరదా. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పని చేసే రోజుల్లో ఒక సారి, తను ఎప్పుడూ పని చేసే సైద్ధాంతిక భౌతిక శాస్త్రాన్ని వదిలిపెట్టి సరదాగా జీవశాస్త్రంలో వేలు పెట్టి చూడాలని నిశ్చయించుకున్నాడు.

భౌతిక శాస్త్రంలో అయితే తను గొప్ప పండితుడు, గురువు కావచ్చు, కాని జీవశాస్త్రంలో తను శిష్యుడే కనుక ఒక విద్యార్థి లాగా ఇతర విద్యార్థులతో పాటు క్లాసులకి వెళ్లి పాఠాలు విని నేర్చుకోవాలని అనుకున్నాడు. కణ జీవశాస్త్రం (సెల్ బయాలజీ) లో ఓ కోర్సులో కూర్చోవాలనుకున్నాడు. ఆ కోర్సుకి ఆచార్యుడి పేరు న్యూటన్ హార్వే. ఇతగాడు కాంతిని వెలువరించే బాక్టీరియాల గురించి చాలా పరిశోధనలు చేసి పేరు తెచ్చుకున్నాడు. ఫెయిన్మన్ తన క్లాసులో కూర్చోడానికి హార్వే ఒప్పుకున్నాడు.

పాపం కొత్తవాడు కదా అని తోటి విద్యార్థులు ఎంతో ఆదరంగా ఉండేవారు. ఒక సారి ఓ విద్యార్థి మైక్రోస్కోప్ లో కణాలు ఎలా కనిపిస్తాయో ఫెయిన్మన్ కి చూపించాడు. అవి వృక్షకణాలు. ఫెయిన్మన్ కి అందులో చిన్న చిన్న ఆకుపచ్చ ‘చుక్కలు’ కనిపించాయి. వాటిని ‘క్లోరోప్లాస్ట్’ లు అంటారని తెలుసుకున్నాడు. అయితే ఆ ‘చుక్కలు’ అటు ఇటు సంచలనంగా కదలడం అతడికి విశేషంగా కనిపించింది. అది చూడగానే అతడిలోని భౌతిక శాస్త్రవేత్త మనసులో ఓ ప్రశ్న మెదిలింది. క్లోరోప్లాస్ట్ లు ఎందుకు కదులుతున్నాయి? వాటిని కదిలించే బలాలు ఏంటి? అదే అడిగాడు తన తోటి విద్యార్థులని. అంతా తెల్లమొహం వేశారు. వాటి పేర్లు తెలుసేగాని అవి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో ఎవరికీ తెలీదు. అసలు అలా ప్రశ్నించొచ్చని కూడా వారికి ఎప్పుడూ తట్టలేదు. ఈ అనుభవం బట్టి ఫెయిన్మన్ కి భౌతిక శాస్త్రానికి, జీవశాస్త్రానికి మధ్య ఉండే ఓ ముఖ్యమైన తేడా అర్థమయ్యింది. భౌతిక శాస్త్రంలో కాస్త ఆసక్తి కరమైన ప్రశ్న వెయ్యాలంటే కొంత లోతుకి వెళ్లాలి. జీవశాస్త్రంలో ఎవరికీ సమాధానం తెలీని ప్రశ్నలు వెయ్యడం పెద్ద కష్టం కాదు.

ఆ తరువాత ఫెయిన్మన్ కి ఓ పేపరు చదివి క్లాసు ముందు ప్రెజెంట్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లిలోని కొన్ని ప్రత్యేక కండరాలని దాని నాడీమండలం ఎలా నియంత్రిస్తుంది అన్నది ఆ పేపరులోని విషయం. గాస్ట్రోక్నిమియస్ కండరం మొదలైన కండరాల పేర్లు ఉచ్ఛరించడానికే ఫెయిన్మన్ కి నోరు తిరగలేదు. పైగా పిల్లిలో అవసలు ఎక్కడ ఉంటాయో కూడా తెలీదు. మరిన్ని వివరాలు సేకరించడానికి లైబ్రరీకి వెళ్లాడు. అలాంటి సమాచారం ఎలాంటి పుస్తకాలలో ఉంటుందో కూడా తనకి తెలీదు. నేరుగా జీవశాస్త్ర విభాగానికి చెందిన లైబ్రేరియన్ ని కలుసుకుని “పిల్లికి సంబంధించిన మ్యాపులు ఉన్నాయా?” అని అడిగాడు. ఆవిడకి నవ్వు ఆగలేదు. పిల్లికి “మ్యాపులు” ఉండవని వివరించి, పిల్లి జీవనిర్మాణానికి (అనాటమీకి) సంబంధించిన సమాచారం అందించింది లైబ్రేరియన్.

మర్నాడు క్లాసుకి వెళ్లి తన సెమినార్ ఇవ్వడం మొదలెట్టాడు ఫెయిన్మన్. ముందుగా బోర్డు మీద పిల్లి బొమ్మ గీసి, అందులో వివిధ కండరాలని సూచించడం మొదలెట్టాడు. “ఇవన్నీ మాకు తెలిసినవే” అంటూ క్లాసంతా గగ్గోలు పెట్టింది. “అవును మరి. అందుకే మీరు నాలుగేళ్లు కష్టపడి చదువుకున్న విషయాలని ఇంత తక్కువ సమయంలో నేను నేర్చుకున్నాను,” అంటూ చురక వేశాడు ఫెయిన్మన్.

జీవశాస్త్రంలో కనిపించిన విషయాలకి పేర్లు పెట్టుకుని, ఆ పేర్లన్నీ శ్రమపడి బట్టీ పట్టుకునే పద్ధతి ఫెయిన్మన్ కి కాలయాపనలా అనిపించింది. అంత కన్నా జీవ వ్యవస్థల తత్వం గురించి ప్రశ్నించి, దాన్ని శోధించడం మరింత ఆసక్తికరమైన వ్యాపకంగా తోచింది.


మరో సందర్భంలో ఫెయిన్మన్ రైబోజోమ్ లకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమస్య మీద హిల్డెగార్డ్ లామ్ఫార్మ్ అనే శాస్త్రవేత్తతో పని చేశాడు. ఈ రైబోజోమ్ లు అనే వేదిక మీద, ఎమ్. ఆర్. ఎన్. ఏ. అనే అణువుల లోని ‘కోడ్’ ఆధారంగా, కణంలో ప్రోటీన్ అణువుల నిర్మాణం జరుగుతుంది. అయితే సామాన్యంగా ఒకే జీవకణంలో ఉండే రైబోజోమ్ లు, ఆర్. ఎన్. ఏ. ల నుండి ఆ జీవకణానికి సంబంధించిన ప్రోటీన్ లు తయారవుతాయి. అలా కాకుండా రెండు విభిన్న జీవజాతుల నుండి ఈ రెండిటినీ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఉదాహరణకి బాక్టీరియాల నుండి రైబోజోమ్ లని, బఠాణీల నుండి ఎమ్. ఆర్. ఎన్. ఏ. ని తీసుకుని కలిపితే ఆ వచ్చే ప్రోటీన్లు బఠాణీ ప్రోటీన్లా, బాక్టీరియా ప్రోటీన్లా?


ఈ ప్రయోగానికి ఎక్కువ మోతాదులో రైబోజోమ్ పదార్థం కావలసి వచ్చింది. అంతకు ముందే మరేదో ప్రయోగం కోసం ఫెయిన్మన్ ఈ.కోలై బాక్టీరియా నుండి పెద్ద మొత్తంలో రైబోజోమ్ లని వెలికి తీసి వున్నాడు. ఊరికే ఉన్నాయి కదా అని ఆ రైబోజోమ్లని ఈ కొత్త ప్రయోగంలో వాడి ప్రయోగం చేసి చూశాడు. కాని చిన్న పొరపాటు వల్ల ప్రయోగం బెడిసికొట్టింది. తను వాడిన రైబోజోమ్ లు నెల రోజులుగా ఫ్రిడ్జిలో ఉన్నాయి. కనుక అవి మరేదో జీవపదార్థంతో కలుషితం అయ్యాయి. ప్రయోగం సరిగ్గా జరిగి వుంటే ఎంతో గొప్ప జీవ వైజ్ఞానిక సత్యం బయట పడి వుండేది. జీవలోకంలో ప్రోటీన్ల నిర్మాణానికి పనికొచ్చే ఈ రైబోజోమ్లనే యంత్రాంగం ఎక్కడైనా ఒక్కలాగే ఉంటుంది అని తెలిసేది. కాని ఫెయిన్మన్ చేసిన పొరపాటు వల్ల ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వలేదు.

ఈ అనుభవం వల్ల ఫెయిన్మన్ జీవశాస్త్రాన్ని ఓ కొత్త కోణం నుండి చూడగలిగాడు. జీవశాస్త్రంలో ప్రగతి సాధించాలంటే కేవలం సిద్ధాంతాన్ని లోతుగా అర్థం చేసుకుంటే సరిపోదు. జీవశాస్త్రానికి ఊపిరి ప్రయోగం. ఆ ప్రయోగాలు చెయ్యడానికి అపారమైన సహనం, శ్రద్ధ అవసరం. చిన్న పొరబాటు జరిగినా ప్రయోగం మొత్తం అపభ్రంశం అవుతుంది.


ఆ విధంగా జీవశాస్త్రంలో ఎన్నో విషయాలు నేర్చుకుని, ఎన్నో అనుభవాలు సేకరిస్తాడు ఫెయిన్మన్. ఒక రంగంలో నోబెల్ బహుమతి గ్రహించేటంత స్థాయికి వెళ్లిన ఆ శాస్త్రవేత్త తనకి పరిచయం లేని రంగంలోకి ప్రవేశించి, ఒక విద్యార్థి స్థాయికి దిగి, వినమ్రంగా తప్పులు సరిదిద్దుకుంటూ, ఆ రంగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి, శాస్త్రవేత్తకి ఉండాల్సిన నిగర్వానికి, అంతులేని వైజ్ఞానిక కుతూహలానికి ప్రతీకగా నిలిచాడు.

(రిచర్డ్ ఫెయిన్మన్ రాసిన ‘ష్యూర్లీ యూ మస్ట్ బి జోకింగ్ మిస్టర్ ఫెయిన్మన్’ అన్న పుస్తకం నుండి)



http://www.andhrabhoomi.net/intelligent/ata-230

ఆటబొమ్మలతో సైన్స్ నేర్పే అరవింద్ గుప్తా

రాముడు రాతిని నాతిని చేసినట్టు, అతడి చేయి పడితే ఎందుకూ పనికి రాని వస్తువులు కూడా అమూల్యమైన వైజ్ఞానిక బోధనా పరికరాలుగా మారిపోతాయి. వాడేసిన అగ్గిపుల్లలు, పాత న్యూస్ పేపర్లు, వాడిన టెట్రాపాక్ డబ్బాలు, పాడైపోయిన సైకిల్ టైర్లు, పారేసిన ప్లాస్టిక్ సీసాలు.. కావేవీ చదువు కనర్హం అని అతడి ఉద్దేశం. దైనందిన జీవితంలో మన చుట్టూ కనిపించే అతి సామాన్యమైన వస్తువులతో కూడా ఏదో సృజనాత్మకమైన ప్రయోగం చేసి సైన్సు అంటే పిల్లల్లో వల్లమాలిన అభిమానాన్ని పెంచగల చాతుర్యం తనది. అతడి పేరు అరవింద్ గుప్తా.

వాడేసిన అగ్గిపుల్లలతో జ్యామెట్రీ ఆటలా? కోకొల్లలు చెయ్యొచ్చంటారు అరవింద్ గుప్తా. అందుకు కొన్ని వాడిన అగ్గిపుల్లలు, సైకిల్ ట్యూబులలో వాడే వాల్వ్ ట్యూబులు కావాలి. వాల్వ్ ట్యూబుల్లో అగ్గిపుల్లలు గుచ్చి ఓ గొలుసుకట్టుగా అమర్చవచ్చు. అలా మూడు అగ్గిపుల్లలని కలిపి ఓ త్రికోణాన్ని చెయ్యొచ్చు. నాలుగింటితో చదరాన్ని చెయ్యొచ్చు. దాన్ని కొంచెం నొక్కితే రాంబస్ అవుతుంది. అలాగే ఐదు పుల్లలతో పంచభుజిని చెయ్యొచ్చు. దీన్ని నొక్కితే ఏమవుతుంది? పడవ బొమ్మ అవుతుంది! ఆరు పుల్లలతో టెట్రహెడ్రన్ ని చెయ్యొచ్చు. మరో రెండు కలిపితే పిరమిడ్, ఇంకొకటి కలిపితే ప్రిజమ్. ఇంకా అలాగే సాగితే చిన్న చిన్న ఇళ్లు, వంతెనలు… మొత్తం సివిల్ ఇంజినీరింగ్ అంతా ఈ “చెత్త” లోనే కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఈ అంశం మీద అరవింద్ గుప్తా రాసిన ‘అగ్గిపుల్లల ఆటలు’ అన్న పుస్తకం డజను భాషల్లో అనువదించబడింది. ఐదు లక్షల కాపీలకి పైగా అమ్ముడుపోయింది. అయినా ఆ రచయిత దానికి రాయల్టీ తీసుకోరు.

అలాగే పాత హవాయి చెప్పుతో కాంతి శాస్త్రం నేర్చుకోవచ్చా? అదెలాగో చూపిస్తారు అరవింద్ గుప్తా. పాత హవాయి చెప్పులో అడుగు భాగాన్ని (సోల్) మాత్రం తీసుకోవాలి. అందులో వరుసగా మూడు కన్నాలు చేసి, వాటిలో మూడు పెన్సిళ్లు గుచ్చాలు. సోల్ చదునుగా ఉన్నప్పుడు పెన్సిళ్లు సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు సోల్ ని పెన్సిళ్లు ఉన్న వైపుకి వంచాలి. ఇప్పుడు పెన్సిళ్ల కొసలు ఒక బిందువు వద్ద కలుసుకుంటాయి. ఇది చూస్తే కాంతి శాస్త్రంలో పుటాకార దర్పణం (concave mirror) తో చేసే ఒక ప్రయోగం గుర్తొస్తుంది. అనంతం నుండి వచ్చి ఈ దర్పణం మీద పడే కాంతి రేఖలు, పరావర్తనం చెంది తిరిగి దాని నాభి (focus) వద్ద కలుసుకుంటాయి, ఈ చెప్పులోని పెన్సిళ్లు కలుసుకున్న తీరులో! ఈ సారి చెప్పుని వెనక్కి వంచాలు పెన్సిళ్ల కొసలు దూరంగా జరిగిపోతాయి, కుంభాకార దర్పణంలో (convex mirror) కాంతిరేఖలు ఇలాగే దూరంగా జరుగుతాయి. కనుక ఈ సారి మీ హవాయి చెప్పు పాడైపోతే బాధపడక, కాస్త కాంతి శాస్త్రం అవపోసన పట్టడానికి అదో సువర్ణావకాశం అనుకోండేం!

ఇలా పాడైపోయిన వస్తువులతో సైన్స్ ప్రయోగాలు చెయ్యొచ్చని ఎందుకు అనిపించిందని అడిగిన ప్రశ్నకి అరవింద్ గుప్తా సమాధానం – “సైన్స్ ఎలా నేర్పించాలి అన్న విషయంలో మనకి కొన్ని బూజు పట్టిన భావాలు ఉన్నాయి. పిపెట్లు, బ్యూరెట్లు మొదలైన సరంజామా లేకుండా సైన్స్ మింగుడు పడదనుకుంటాం. చాలా మటుకు స్కూళ్లు విద్యార్థిని ఓ పరాయి వాడిలా చూస్తాయి. లాబరేటరీలలో పరికరాలన్నీ భద్రంగా దాచిపెట్టుకుంటారు. వాడితే పగిలిపోతాయని పిల్లలని వాటిని ముట్టుకోనివ్వరు. బల్లల మీద దుమ్ము పేరుకుని ఉంటుంది. అలా కాకుండా బొమ్మలతో అయితే, అదీ వ్యర్థ పదార్థాలతో చేసిన బొమ్మలతో అయితే ఆ భయం ఉండదు. బొమ్మలతో పిల్లలు చెయ్యదగ్గ అతి ముఖ్యమైన పని వాటిని పగలగొట్టి అవి ఎలా పని చేస్తాయో అధ్యయనం చెయ్యడం!”

ఐ.ఐ.టి. కాన్పూర్ లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుకున్న అరవింద్ గుప్తా తను అసలీ రంగంలోకి ఎలా ప్రవేశించిందీ చెప్తారు. 1972 లో ఐ.ఐ.టి కాన్పూర్ లో అనిల్ సదగోపాల్ అనే విద్యవేత్త ఇచ్చిన ఉపన్యాసం అరవింద్ గుప్తాని చాలా ప్రభావితం చేసింది. దేశం అంతటా సంక్షోభం నెలకొన్న రోజులవి. “ఒక పక్క నక్సలైట్ ఉద్యమం, మరో పక్క జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం. చదువుకున్న వారంతా తాము సమాజానికి ఎలా ఉపయోగపడాలి అన్న అంతర్మథనంలో పడ్డారు.” 1975 లో అరవింద్ గుప్తా చదువు పూర్తిచేసినప్పటికి మధ్యప్రదేశ్ లో ‘హోషంగాబాద్ సైన్స్ టీచింగ్ ప్రోగ్రాం’ అమలులో ఉంది. ఆరు, ఎనిమిది తరగతుల మధ్య ప్రయోగాల ద్వారా సైన్స్ నేర్పించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. అంత వరకు బడుల్లో సైన్స్ అంతా “బట్టీ పద్ధతి” లో నేర్పించేవారు. క్లాసులో పిల్లవాడు ఉత్సాహం కొద్దీ ప్రశ్న వేస్తే క్రమశిక్షణ పేరిట నోరు మూయించేవారు. సదగోపాల్, అతడి బృందం, ఈ పరిస్థితులని మర్చాలని ప్రయత్నించారు.

ప్రయోగాలతో సైన్స్ చదువు అభిలషణీయమే అయినా వాస్తవంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆన్ని బడులలోను ఈ సామగ్రి ఉండేది కాదు. ఉన్న బడులలో కూడా వాటి ప్రభావం వల్ల కొంత కీడు జరిగిందనే చెప్పాలి. “ప్రయోగాలలో వాడే సామగ్రి చాలా మటుకు పాశ్చాత్యం నుండి దిగుమతి చేసుకున్నది. బోధనా పద్ధతులు కూడా పాశ్చాత్యం నుండి వచ్చినవే. ఇవి పిల్లలకి సులభంగా మింగుడు పడేవి కావు. పైగా పరికరాలు ఖరీదైనవి కనుక ఏదైనా పాడైతే సులభంగా కొత్తవి దొరికేవి కావు.” ఈ సమస్యలన్నీ చూసిన అరవింద్ గుప్తా తనదైన ఓ కొత్త మర్గాన్ని తీర్చిదిద్దుకున్నారు.

ఈ పద్ధతిలో పిల్లలు సైన్స్ నేర్చుకోవాలంటే ఖరీదైన పరికరాలు అక్కర్లేదు. ట్యూషన్ మాస్టర్లు, కోచింగ్ సెంటర్లు ఇవేవీ అక్కర్లేదు. సరదాగా ఆటలో ఆటగా ఎన్నో సైన్స్ విషయాలు సహజంగా నేర్చుకుంటారు. ఆ ఆటలు ఎలా ఆడాలో చెప్పే ఎంతో సమాచారం అరవింద్ గుప్తా వెబ్ సైట్ లో ఉంటుంది. (www.arvindguptatoys.com) ఈ వెబ్ సైట్ నిజంగా ఓ గొప్ప విజ్ఞాన భాండారం. కొన్ని వందల, వేల పుస్తకాలు ఇక్కడ ఉచితంగా లభ్యం అవుతాయి. అందులో అరవింద్ గుప్తా రచనలే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఓ వందకి పైగా ఉంటాయి. అవి కాక సైన్స్, విద్య రంగాల్లో పుస్తకాలు, పిల్లల పుస్తకాలు కోకొల్లలుగా ఉంటాయి. “హిందీ నా మాతృభాష. హిందీలో బాల సాహిత్యంలో ఎంతో వెలితి కనిపిస్తుంది. కనుక చాలా అనువాదం చేస్తాను. రోజూ ఐదు గంటల పాటు అనువాదం చేస్తాను,” అంటారు అరవింద్.

అరవింద్ గుప్తా లాంటి విద్యా వేత్తల నుండి స్ఫూర్తి తీసుకుని తెలుగులో కూడా విస్తృత కృషి జరిగితే, ప్రస్తుతం 67.7% వద్ద ఉన్న మన అక్షరాస్యత 2020 కల్లా 90% శాతాన్ని చేరుకోగలదని, చేరుకోవాలని ఆశ.

http://www.andhrabhoomi.net/intelligent/andhatswa-222

http://www.andhrabhoomi.net/intelligent/bruno-889

గణిత లోకపు యువరాజు గౌస్

Posted by V Srinivasa Chakravarthy Wednesday, May 18, 2011 0 comments

http://www.andhrabhoomi.net/sisindri/ganitham-274

గెలీలియో ఆఖరు రోజులు

Posted by V Srinivasa Chakravarthy Thursday, December 9, 2010 6 comments

ఏం జరుగుతుందో తెలీని అనిశ్చిత వాతావరణంలో ఫిబ్రవరి 1633 లో గెలీలియో రోమ్ లోకి ప్రవేశించాడు. నగరంలోకి అడుగుపెట్టగానే రాజభటులు తనకి సంకెళ్ళు వేసి బరబర లాక్కెళతారని ఊహించాడు. కాని అలంటిదేం జరగలేదు. టస్కనీ ప్రాంతానికి చెందిన వాడు కనుక మొదట్లో రోమ్ లోని టస్కనీ దౌత్యాలయంలో కొంత కాలం అతిథిగా ఉన్నాడు. ఇతర అతిథులతో సమానంగానే తనకీ మర్యాదలు జరిగాయి. అయితే ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఆ రోజుల్లో చాలా బాధపడేవాడు. ఆర్త్ రైటిస్ వల్ల కీళ్లు బాగా నొప్పి పుట్టేవి. ఆ బాధకి రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. బాధ భరించలేక గట్టిగా రోదించేవాడు. ఇలా కొన్ని రోజులు సాగాయి.

ఏప్రిల్ నెలలో న్యాయవిచారణ మొదలయ్యింది. ఇంతకీ చేసిన నేరం ఏంటయ్యా అని చూస్తే న్యాయమూర్తులకి పెద్దగా ఏమీ దొరకలేదు. మొదటి తప్పు - తన భావాలు నలుగురికీ అర్థం కావాలని లాటిన్ కి బదులుగా ఇటాలియన్ లో పుస్తకాలు రాయడం. ’మతవిరోధి, పచ్చి తగవుల కోరు, కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేవాడు’ అయిన విలియమ్ గిల్బర్ట్ ని పొగుడుతూ గెలీలియో ఒక చోట రాశాడు. ఇది రెండవ తప్పు. అయితే ఇవి రెండూ కాస్త చిన్న విషయాలేనని కొట్టిపారేయొచ్చు. కాని కాస్త కీలకమైన సమస్య మరొకటి ఉంది. కోపర్నికస్ భావాలని బోధించకూడదు అన్న మతపరమైన నిషేధాన్ని ఉల్లంఘించడం – ఇది అసలు తప్పు. ఒకసారి న్యాయవిచారణ మొదలయ్యాక ఏదో ఒక నేరం కింద గెలీలియోని ఇరికించి, భవిష్యత్తులో ఆ తప్పు మరొకరు చెయ్యడానికి భయపడేలా శిక్షించాల్సిందే. ఎందుకంటే న్యాయవిచారణలో గెలీలియో నిరపరాధి అని తేలితే, న్యాయమూర్తులకే ముప్పు. అన్యాయంగా ఆరోపించినందుకు శిక్ష వాళ్లకి పడుతుంది! కనుక ఎలాగైనా గెలీలియోకి శిక్షపడేలా చెయ్యాలని కాథలిక్ చర్చి అధికారులు చాలా పట్టుదలగా ఉన్నారు.

ఈ సమయంలో గెలీలియో స్నేహితుడైన కార్డినల్ బర్బెరీనీ ఎంతో సహాయం చేశాడు. గెలీలియో శిక్ష తగ్గడానికి శతవిధాల ప్రయత్నించాడు. తప్పు చెయ్యకపోయినా తప్పు ఒప్పుకొమ్మని గెలీలియోని ప్రాధేయపడ్డాడు. లేకపోతే గెలీలియోకి చిత్రహింస తప్పదన్న వాస్తవాన్ని వివరించాడు. గెలీలియోకి తన దయనీయమైన పరిస్థితి స్పష్టంగా అర్థమయ్యింది. ఇకి విధిలేక రాజీకి ఒప్పుకున్నాడు. కోపర్నికస్ బోధనలని తన పుస్తకంలో వివరంగా వర్ణించడం తను చేసిన పెద్ద పొరబాటని ఒప్పుకున్నాడు. వైజ్ఞానిక భావాలని అందంగా, విపులంగా వ్యక్తం చెయ్యడంలో తన నైపుణ్యాన్నిప్రదర్శించుకోవాలన్న మితిమీరిన అహంకారంతోనే అలా రాశానన్నాడు. అందుకు మనస్పూర్తిగా పశ్చాత్తాప పడుతున్నానన్నాడు. ’నా తప్పిదాలను నేనే ఖండిస్తున్నాను, శపిస్తున్నాను, గర్హిస్తున్నాను’ అంటూ ప్రాణాలు కాపాడుకోవడం కోసం చేయని తప్పుని పూర్తిగా ఒప్పుకున్నాడు. ఆధునిక భౌతికశాస్త్రానకి ఓనమాలు దిద్దించిన ఆ మొదటి గురువు, తను చేసిన ’తప్పు’కి అపరాధిలా తలవంచకుని నిలబడ్డాడు.

ఈ వృత్తాంతానికి చిన్న కొస మెరుపు ఒకటి ఉంది. మహాభారత యుద్ధంలో ధర్మరాజు “అశ్వత్థామ హత:” అని బిగ్గరగా అని, “కుంజర:” అని నెమ్మదిగా అన్నట్టు, ఈ సందర్భంలో గెలీలియో తన అపరాధాలని ఒప్పుకుంటూ బిగ్గరగా ఆ సుదీర్ఘమైన ప్రకటన చదివి, చివర్లో “ eppur, si muove (కాని అది కదులుతోందిగా...)” అని మెల్లగా, బయటికి వినిపించకుండా అనట్టు చెప్పుకుంటారు. అది గాని బయటికి వినిపించి ఉంటే శిర:ఖండన ఖాయం. అదీ కాకపోతే కట్టెకి కట్టి బహిరంగ దహనం చేసి ఉండేవారేమో. కాని గెలీలియో నిజంగా అలా అన్నాడా లేదా అన్న విషయం మీద కొంత వివాదం ఉంది.

గెలీలియో మీద విజయం సాధించినందుకు జెసూట్ లు సంబరపడిపోయారు. ఇక శిక్ష ప్రకటించడమే తరువాయి. గెలీలియోకి యావజ్జీవ కారాగార శిక్ష తప్పేలా లేదు. న్యాయవిచారణ జరిపిన పది మంది న్యాయమూర్తుల్లో ఏడుగురే శిక్షని ఆమోదించారు. మిగతా ముగ్గురూ ఆ పత్రం మీద సంతకం చెయ్యలేదు. ఆ ముగ్గురిలో చిరకాల స్నేహితుడైన బర్బరీనీ కూడా ఉన్నాడు. బర్బరీనీ ప్రమేయం వల్లనే మొదట్లో శిక్ష జారీ అయినా, అమలు చెయ్యడంలో దాన్ని బాగా బలహీన పరిచారు. మొదట్లో రోమ్ లోని టస్కనీ దౌత్యాలయంలోనే కొంత కాలం నిర్బంధించారు. 1634 నుండి మాత్రం ఆర్సెట్రీ నగరంలో ఉన్న గెలీలియో సొంత ఇంట్లోనే నిర్బంధిస్తూ శిక్షవిధించారు. ఇక జీవితాంతం ఆ ఇల్లు, పరిసర ప్రాంతాలు విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని నిర్బంధం. చివరికి వైద్య చికిత్స కోసం ఫ్లోరెన్స్ నగరానికి వెళ్లడానికి కూడా అనుమతి దొరకలేదు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా గెలీలియో తన పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. దూరదర్శిని వినియోగం మరీ ఎక్కువ కావడం వల్లనేమో, చివరి రోజుల్లో 1637 కల్లా పూర్తిగా గుడ్డివాడు అయిపోయాడు. అలా కొన్నేళ్లపాటు నరకయాతన అనుభవిస్తూ ఆ మహా మేధావి జనవరి 8, 1642, లో కన్నుమూశాడు.

References:
1. Simon Singh, Big Bang, Harper Perennial, 2004.
2. John Gribbin, Science: A history, Penguin, 2003.
3. http://www.vias.org/physics/bk1_05_01.html
4. http://cnx.org/content/m11932/latest/
5. http://cnx.org/content/m11932/latest/g_telescope.gif
6. http://galileo.rice.edu/lib/student_work/astronomy95/moon.html
7. https://ca-science7.wikispaces.com/file/view/Sun_spots.gif/34504237/Sun_spots.gif

8. http://upload.wikimedia.org/wikipedia/commons/8/87/Jupitermoon.jpg
9. http://www.scienceandyou.org/articles/ess_16.shtml
10. http://en.wikipedia.org/wiki/Giordano_Bruno
11. http://www.chrismadden.co.uk/meaning/galileo-pope-church.html
12. http://en.wikipedia.org/wiki/Dialogue_Concerning_the_Two_Chief_World_Systems

“సంవాదాలు” తెచ్చిన సంకటాలు

Posted by V Srinivasa Chakravarthy Monday, December 6, 2010 0 comments

గెలీలియో పుస్తకం ప్రచురితం అయిన నాటికి యూరప్ లో ’ముప్పై ఏళ్ల యుద్ధం’ ఉధృతంగా కొనసాగుతోంది. 1618 లో మొదలైన యుద్ధం మూడు దశాబ్దాల పాటు అంటే 1638 వరకు సాగింది. ఈ యుద్ధానికి ఒక ఏకైక కారణం ఆంటూ ఏమీ లేదు. అయితే కాథలిక్కులకి, ప్రొటెస్టంట్ లకి మధ్య మతకలహం ఈ యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. 1618 లో జరిగిన ఓ దారుణమైన సంఘటన జరిగింది. ప్రాగ్ నగరంలో కొంతమంది ప్రొటెస్టంట్ లు రాజగృహంలోకి జొరబడి ఇద్దరు అధికారులని పై అంతస్థు కిటికీ లోంచి బయటికి విసిరేశారు. దీన్నే ప్రాగ్ నగరపు నిర్గవాక్షీకరణ (Defenestration of Prague, fenestra అంటే కిటికీ) అంటారు. ప్రొటెస్టంట్ల మీద పదే పదే జరుగుతున్న అత్యాచారాలకి నిరసనగా వాళ్లు ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టారు. దాంతో రెండు మతవర్గాల మధ్య యుద్ధ జ్వాల భగ్గు మంది. ఈ యుద్ధంలో యూరప్ లో అపారమైన జన నష్టం, ధన నష్టం జరిగింది. క్షామం విలయతాండవం చేసింది.

గెలీలియో పుస్తకం ప్రచురితం అయిన నాటికే యుద్ధం పద్నాలుగేళ్లుగా నడుస్తోంది. అలాంటి నేపథ్యంలో కాథలిక్ వర్గం యొక్క అధిపత్యాన్ని నిరూపించాల్సిన బాధ్యత పోప్ అర్బన్ VIII మీద పడింది. కాథలిక్కుల ప్రతినిధిగా తన పెత్తనం కొనసాగాలంటే ప్రొటెస్టంట్ల విప్లవాన్ని ఎలాగైనా అణచాలి. ముందుగా కాథలిక్ మతానికి విరుద్ధంగా మాట్లాడే గొంతికలని మూయించాలి. కనుక కాథలిక్ మతానికి విరుద్ధమైన ప్రచారాన్ని బహిష్కరిస్తూ, అలాంటి ప్రచారానికి తీవ్ర దండన ప్రకటించాడు. మతం సమర్ధించే పృథ్వీ కేంద్ర సిద్ధాంతానికి వ్యతిరేక ప్రచారం మీద వేటు వేయాల్సిన అవసరం కనిపించింది.

అయితే పోప్ అలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వ్యక్తిగతమైన కారణాలు కూడా ఉన్నాయని చెప్తారు. పెరుగుతున్న గెలీలియో పరపతికి ఓర్వలేని కొందరు ఆస్థాన ఖగోళశాస్త్రవేత్తలు గెలీలియో మీద లేని పోని చాడీలు చెప్పసాగారు. పోప్ తెలివితేటలని కించపరుస్తూ గెలీలియో తన పుస్తకంలో ఎన్నో విసుర్లు విసిరాడని చెప్పారు. అందులో కొంత నిజం కూడా లేకపోలేదు. సర్వశక్తివంతుడైన దేవుడు భౌతిక ధర్మాలకి అతీతంగా విశ్వాన్ని సృష్టించాడని పోప్ ఎన్నో చోట్ల చాటుతూ వచ్చాడు. ఈ విషయం గురించే గెలీలియో “సంవాదాల”లో ఒక చోట పండితుడైన సాల్వియాటీ, మూఢుడైన సింప్లీసియోతో హేళనగా ఇలా అంటాడు: “అవున్లే! దేవుడు తలచుకుంటే పక్షుల అస్తిపంజరాలలో ఎముకకి బదులు బంగారం ఉండేదేమో, వాటి రక్తనాళాలలో పాదరసం ప్రవహించేదేమో, వాటి మాంసం సీసం కన్నా బరువుగా ఉండేదేమో! చిట్టి చిట్టి రెక్కలతో ఆకాశంలో అంతెత్తున సునాయాసంగా ఎగిరేవేమో! కాని దేవుడు అలా చెయ్యలేదు. దీన్ని బట్టి నీకో విషయం అర్థం కావాలి. అది తెలుసుకోడానికి ప్రయత్నంచకుండా నీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటూ అడుగడుగునా దేవుడి పేరు ఎందుకు వాడుకుంటావు?” ఇవన్నీ చదివిన పోప్ కి నిజంగానే చిర్రెత్తి ఉంటుంది.

“సంవాదాలు” ప్రచురితం అయిన కొంతకాలం తరువాత మతధర్మకర్తల సదస్సు (Inquisition) గెలీలియోని న్యాయవిచారణ కోసం పిలిపించింది. మతవ్యతిరేక ప్రచారం చేస్తున్నాడన్న నింద మోపి రోమ్ కి రమ్మని సందేశం పంపింది. అలాంటి పరిస్థితుల్లో రోమ్ కి వెళ్తే ఏం జరుగుతుందో గెలీలియోకి బాగా తెలుసు. పైగా ఆ సమయంలో తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. రోమ్ కి ప్రయాణం ఆ పరిస్థితుల్లో తన వల్లకాదని కబురు పెట్టాడు గెలీలియో. రానని మొండికేస్తే రెక్కలు కట్టి తిసుకురావలసి ఉంటుందని తీవ్రంగా వచ్చింది సమాధానం. ఇక గతిలేక ప్రయాణానికి సిద్ధం అయ్యాడు గెలీలియో.

(సశేషం...)



గెలీలియోకి చర్చికి మధ్య భావసంఘర్షణ కొనసాగుతూనే ఉంది. చర్చి అధికారులు వాళ్లు చెప్పేది చిలకల్లా వల్లెవేస్తూనే ఉంటారు గాని, గెలీలియో సేకరించిన పరిశీలనల మీద వ్యాఖ్యానించరు, ఆ సమాచారానికి స్పందించరు. గెలీలియో కూడా పట్టువదలకుండా ఓ కొత్త విశ్వదర్శన స్థాపన కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా 1623 లో చర్చిలో పరిస్థితులు గెలీలియోకి అనుకూలంగా మరాయి. తన చిరకాల స్నేహితుడైన కార్డినల్ మాఫియో బర్బెరీనీ ఇప్పుడు కొత్త పోప్ అయ్యాడు. ఈ కొత్త పోప్ పేరు అర్బన్ VIII. గెలీలియో, ఈ బర్బెరీనీ చిన్నప్పుడు పీసా విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు కనుక గేలిలీయోకి పోప్ ని స్వయంగా కలుసుకునే అవకాశం సులభంగా దొరికింది. ఆరుసార్లు పోప్ ని కలుసుకుని తన భావాలని వ్యక్తం చేసుకున్నాడు. ఎంతో కాలంగా తన మనసులో ఉన్న మాటని ఆ సందర్భంలో గెలీలియో పోప్ కి విన్నవించుకున్నాడు.

విశ్వం యొక్క తత్వం గురించి ప్రస్తుతం సమాజంలో రెండు విభిన్న భావజాలాలు చలామణిలో ఉన్నాయి. ఒకటి బైబిల్ చెప్పేది, దానికి ప్రతినిధులైన మతాధికారులు చెప్పేది. రెండవది ఇటీవలి కాలంలో దూరదర్శిని మొదలైన పరికరాల సహాయంతో చేసిన పరిశీలనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్నది. ఈ రెండు భావజాలల మధ్య ఏది నిజం అన్నది తెగని సమస్యగా ఉంది. ఆ భావజాలాల మధ్య సంఘర్షణని, సంవాదాన్ని ఒక పుస్తరూపంలో రాయాలని గెలీలియో ఎంతో కాలంగా అనుకుంటున్నాడు. ఆ విషయమే పోప్ తో అన్నాడు. పుస్తక రచనకి పోప్ పూర్తిగా ఒప్పుకున్నాడు. పోప్ వద్ద సెలవు తీసుకున్న గెలీలియో ఇంటికి తిరిగి వెళ్లగానే పుస్తక రచనకి ఉపక్రమించాడు.


తొలిదశల్లో ఈ పుస్తకాన్ని ’తరంగాల మీద సంవాదం’ అని పిలుచుకునేవాడు గెలీలియో. వ్రాతప్రతి మాతాధికారుల చేతికి చిక్కింది. వాళ్లకి పుస్తకం పేరు ససేమిరా నచ్చలేదు. ఎందుకంటే తరంగాల పేరు చెప్పి పృథ్వీకేంద్ర సిద్ధాంతాన్ని గుంభనంగా సమర్థిస్తున్నాడు గెలీలియో అని వాళ్ళు పసిగట్టారు. తరంగాలు చందమామ యొక్క గురుత్వాకర్షణ మీద ఆధారపడతాయి. భూమి యొక్క ఆత్మభ్రమణం మీద ఆధారపడతాయి. అంటే తరంగాల గురించి గెలీలియో చెప్పింది ఒప్పుకుంటే, భూమి కదులుతోందని ఒప్పుకున్నట్టే. కనుక మతాధికారులు పుస్తకంలో తరంగాలకి సంబంధించిన విషయాలన్నీ తీసేయించారు. చివరికి వట్టి “సంవాదం” (Dialogue) అన్న పేరు మాత్రం మిగిలింది.

అయితే ఆధునిక రూపంలో ఈ పుస్తకాన్ని Dialogue Concerning the Two Chief World Systems (Dialogo sopra i due massimi sistemi del mondo) (రెండు ముఖ్యమైన విశ్వ విజ్ఞాన సాంప్రదాయాల మధ్య సంవాదం) అన్న పేరుతో వ్యవహరిస్తుంటారు. ఈ పుస్తకం అంతా సంవాదాల రూపంలో ఉంటుంది. నాలుగు రోజుల పాటు ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన సంవాదాలవి. వారిలో ఒకడి పేరు సింప్లీసియో (Simplicio). ఇతగాడు వట్టి అమాయకుడు. ఆ రోజుల్లో చలామణిలో ఉన్న అవైజ్ఞానిక భావాలకి, నమ్మకాలకి ఇతడు ప్రతిరూపం. రెండవ వ్యక్తి పేరు సాగ్రెడో (Sagredo). ఇతగాడు పామరుడే గాని తెలివైన వాడు. మొదట్లో తటస్థంగా ఉన్నా, సంవాదాలలో చివరి దశలో గెలీలియో భావాలని స్వీకరిస్తాడు. ఇక మూడవ వ్యక్తి పేరు సాల్వియాటీ. పండితుడైన సాల్వియాటీ, కోపర్నికస్, గెలీలియో మొదలైన ఆధునికుల భావాలకి మూర్తిరూపం. ఒక పక్క నిష్పక్షపాతంగా రెండు సిద్ధాంతాలని వర్ణిస్తున్నట్టు, వాటి మధ్య భేటీని విపులీకరిస్తున్నట్టు కనిపిస్తున్నా, ప్రచ్ఛన్నంగా సూర్యసిద్ధాంతానిదే పైచేయి అయినట్టుగా ఇందులో వివరిస్తాడు గెలీలియో. అయితే తలదిమ్మెక్కించే తాత్విక వివరణల రూపంలో కాకుండా అంతా సంభాషణల రూపంలో ఉంటుంది కనుక సామాన్యులకి కూడా అర్థమయ్యేలా ఉంటుంది. పైగా అప్పటికి అధికార భాష అయిన లాటిన్ లో కాక, జనరంజకంగ ఉండాలని కావాలని ఈ పుస్తకాన్ని పామర భాష అయిన ఇటాలియన్ లో రాశాడు గెలీలియో.

చివరికి పుస్తకం 1932 లో ప్రచురితం అయ్యింది. అంటే పోప్ ఆమోదం ఇచ్చాక ఇంచుమించు దశాబ్దం తరువాత అన్నమాట. కాని దురదృష్టవశాత్తు ఈ పదేళ్లలో రాజకీయపరిస్థితులు బాగా మారిపోయాయి. పుస్తకం రచన మొదలయినప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు లేదు. ఒకప్పుడు మనసారా దీవించిన పోప్ ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఎలా తగులబెట్టించాలా అన్న ఆలోచనలో ఉన్నాడు.

(సశేషం...)

చర్చితో తగని తగవు

Posted by V Srinivasa Chakravarthy Tuesday, November 30, 2010 0 comments




ఆ విధంగా గెలీలియో తన పరిశీలనలని మాత్రమే ప్రచారం చేస్తూ కోపర్నికస్ ప్రసక్తి తేకుండా ఎంతో కాలం జగ్రత్తపడుతూ వచ్చాడు. కాని 1613 లో ఒక సందర్భంలో తన సహనం చచ్చిపోయినట్టుంది. ఆ సంవత్సరం సూర్యబిందువుల (sunspots) గురించి తను చేసిన పరిశీలనల గురించి ఓ చిన్న పుస్తకం రాశాడు. లిన్సియన్ సదస్సు ఆ పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకం ముందుమాటలో గెలీలియోని ఆకాశానికెత్తుతూ సూర్యబిందువులని మొట్టమొదట పరిశీలించిన ఘనత గెలీలియోదే నన్నట్టుగా రాశారు లిన్సియన్ సభ్యులు. కాని అది నిజం కాదు. గెలీలియో కన్నా ముందు సూర్యబిందువులని గమనించినవారు మరి కొందరు ఉన్నారు. వారిలో ఒకరు ఓ జెసూట్ ఖగోళవేత్త. అతడి పేరు క్రిస్టఫర్ షైనర్. తనకు రావలసిన ఘనత గెలీలియోకి దక్కడం చూసి ఇతగాడికి ఒళ్ళుమండిపోయింది. అయితే ఇతడికి కూడా నిజానికి ఒళ్లు అంతగా మండాల్సిన పనిలేదేమో! ఎందుకంటే ఇతడి కంటే ముందు థామస్ హారియట్ అనే ఇంగ్లండ్ కి చెందిన వ్యక్తి, యోహాన్ ఫాబ్రీసియస్ అనే ఓ డచ్ వ్యక్తి సూర్యబిందువులని కనిపెట్టారు. ఘనత ఎవరికి దక్కినా ఈ వివాదం వల్ల గెలీలియో పేరు నలుగురు నోటా నానింది. కాని అసలు సమస్యకి కారణం ఇది కాదు. పుస్తకం చివర్లో గెలీలియో బాహటంగా కోపర్నికస్ విశ్వదర్శనాన్ని సమర్ధిస్తూ రాశాడు. అందుకు ఉదాహరణగా జూపిటర్ చందమామల వృత్తాంతాన్ని పేర్కొన్నాడు. అసలు గొడవ అక్కడ మొదలయ్యింది.



చర్చితో కలహం తన ఆరోగ్యానికి మంచిది కాదని గెలీలియోకి బాగా తెలుసు. ఎలాగైనా పోప్ ని స్వయంగా కలుసుకుని తన అభిమతాన్ని స్పష్టంగా వివరించాలని అనుకున్నాడు.


రోమ్ ని మరో సారి సందర్శించడానికి తగ్గ అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. పరిస్థితులు అనుకూలంగా లేవు, ఇప్పుడు వద్దని హితులు వారించారు. ఎందుకంటే ఈ నడిమి కాలంలో కొన్ని మార్పులు వచ్చాయి. అప్పటి పోప్ పాల్ V, కోపర్నికస్ బోధనలు మతబోధనలకి అనుకూలంగా ఉన్నాయో, లేక మతధిక్కారాన్ని (heretic) సూచిస్తాయో తీర్పు చెప్పమని ఓ సదస్సుని నియమించాడు. ఆ సదస్సు సమావేశమై, విషయాన్ని పరిశీలించి, సూర్యుడు విశ్వానికి కేంద్రం అని చెప్పే బోధన “అవివేకం, అసంగతం... పూర్తిగా మతవిరుద్ధం” అని తేల్చిచెప్పింది. ఆ కారణం చేత రోమ్ లో గెలీలియోకి వ్యతిరేకమైన వాతావరణం నెలకొంది. ఆ నేపథ్యంలో గెలీలియో 1615 డెసెంబర్ లో రోమ్ ని సందర్శించినప్పుడు వెంటనే పోప్ ని కలుసుకోలేకపోయాడు గాని అక్కడ టస్కనీ దూత ఇంటికి విందుకు మాత్రం వెళ్లగలిగాడు. పోప్ పాల్ V మాత్రం చర్చి కి ప్రతినిధిగా, కార్డినల్ బెలార్మిన్ ద్వారా గెలీలియోకి ఈ ఘాటైన సందేశం పంపించాడు. ఆ సందేశంలోని ముఖ్యాంశాలు ఇవి:


1. సూర్యుడు స్థిరంగా ఉన్నాడన్న భావనని గాని, భూమి కదులుతోందన్న భావనని గాని గెలీలియో ఎక్కడా సమర్ధించకూడదు, బోధించకూడదు
2. అసలు ఆ భావనలని గెలీలియో స్వయంగా నమ్మకూడదు
3. ఊరికే వాదన కోసం కూడా వాటి తరపున వాదించకూడదు


కాని తదనంతరం మార్చ్ 1616 లో గెలీలియో పోప్ ని స్వయంగా కలుసుకుని తన పరిస్థితిని పుర్తిగా వివరించాడు. తనకి చర్చికి ఎలాంటి విరోధం లేదని, తనకి దైవం పట్ల భక్తి, పోప్ పట్ల గౌరవం మెండుగా ఉన్నాయని విన్నవించుకున్నాడు. పోప్ అంతా విన్నాడు. గెలీలియో పాండిత్యం పట్ల, ప్రతిభ పట్ల ఎంతో గౌరవం ఉన్నవాడు ఈ పోప్. తన వల్ల చర్చి యొక్క అధికారానికి ప్రమాదం లేదనుకున్నాడు. తన కంఠంలో ప్రాణం ఉండగా గెలీలియోకి ఏ ప్రమాదమూ లేదని, చర్చి వల్ల ఏ సమస్యా రాదని హామీ ఇచ్చి పంపాడు. తేలకపడ్డ మనసుతో గెలీలియో టస్కనీకి తిరిగి వెళ్లాడు.

ఆ తరువాత కూడా గెలీలియోకి, చర్చికి మధ్య అడపాదపా భావసంఘర్షణ జరుగుతూనే ఉంది. 1618 లో మూడు తోకచుక్కలు కనిపించాయి. వాటిని చూసిన కొందరు జేసూట్ ఖగోళవేత్తలు (వాళ్లలో షైనర్ కూడా ఉన్నాడు) వాటి శకునం గురించి నానా వ్యాఖ్యానాలు చేశారు. అది చదివిన గెలీలియో వాటిని హేళన చేస్తూ ఇలా రాశాడు. హోమర్ లాంటి కవులు ఇలియడ్ లాంటి కమ్మని కవితలు అల్లినట్టు, ఖగోళ శాస్త్రం అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు అందమైన కల్పనలు అల్లడం కాదన్నాడు. విశ్వ గ్రంథాన్ని చదవాలంటే


“... ముందు ఆ పుస్తకం రాయబడ్డ భాష అర్థం కావాలి, ఆ భాషలోని అక్షరాలు చదవడం రావాలి. ఆ భాష గణిత భాష. అందులోని అక్షరాలు త్రిభుజాలు, వృత్తాలు మొదలైన జ్యామితీయ ఆకారాలు. ఆ ఆకృతుల రహస్యాలు తెలియకపోతే ఆ పుస్తకంలో ఒక్క పదం కూడా అర్థం కాదు...”


ఆ విధంగా జెసూట్ ల వ్యాఖ్యానాలు వట్టి కాకమ్మ కథలని దుమ్మెత్తి పోసి తనలోతనే సంతోషించి ఉంటాడు గెలీలియో. కాని ఈ ’ఎత్తిపోతల’తో తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడని గ్రహించలేకపోయాడు.


(సశేషం...)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts