శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

 

వాయేజర్ చెప్పిన యాత్రా కథలు అన్నిట్లోకి నాకు బాగా నచ్చింది జూపిటర్ అతి దగ్గరి చందమామ అయినఅయో’* గురించి చెప్పిన కథలే. అయో తీరులో ఏదో విచిత్రంగా వుందని ముందే సందేహించాము. దాని ఉపరితలం మీద  విశేషాలని స్పష్టంగా గుర్తించలేకపోయాం కాది ఎర్రగా ఉంటుందని మాత్రం గమనించాం. అది మార్స్ కన్నా కూడా ఎర్రగా ఉంటుంది. బహుశా మొత్తం సౌరమండలంలోనే అత్యంత ఎర్రనిదైన వస్తువు ఇదేనేమో. కొన్నేళ్లుగా దాని ఉపరితలం మీద ఏవో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పరారుణ కాంతిని, రాడార్ తరంగాలని అతి ప్రతిబింబించే పద్ధతిలోను మార్పులు కనిపిస్తున్నాయి. అయో కక్ష్య ఉన్న స్థానంలోనే జూపిటర్ ని పెనవేసుకుని వడ్డాణ్ణం లాంటి విశాల అణుసమాహారం వుందని కూడా గుర్తించాము. అందులో ప్రధానంగా సల్ఫర్, సోడియమ్, పొటాషియమ్ అణువులు ఉన్నాయి. పదార్థం అంతా ఎలాగో అయో నుండి పోగొట్టుకుపోయిన పదార్థమే.

వాయేజర్ నౌక విశాలమైన చందమామని సమీపించినప్పుడు విచిత్రమైన దాని పలు వర్ణాల ఉపరితలం మాకు దర్శనమిచ్చింది. అలాంటి వింత మొత్తం సౌరమండలంలోనే ఎక్కడా లేదేమో. అయో గ్రహశకల వలయానికి దగ్గరిగా వుంది. ఆది నుండి చందమామ మీద రాలే బండలు ఉపగ్రహం ముఖం మీద గుద్దే పిడిగుద్దుల ప్రభావమే పలువర్ణవిలాసం అయ్యుంటుంది. రాలే రాళ్ల వల్ల ఉల్కాబిలాలు ఏర్పడి వుండాలి. కాని అలాంటివేవీ కనిపించలేదు. అయో మీద ఏర్పడ్డ ఉల్కాబిలాలని త్వరత్వరగా పూరించేవి గాని, నామరూపాలు లేకుండా చెరిపేసేవి గాని ప్రక్రియలు చందమామ ఉపరితలం మీద సదా సమర్థవంతంగా పనిచేస్తూ ఉండాలి. యంత్రాంగమేదో అయో వాతావరణానికి చెందినది అయ్యుండదు. ఎందుకంటే గురుత్వం బలహీనంగా ఉండడం వల్ల అయోకి పెద్దగా వాతావరణమే లేదు. అది నీటి ప్రవాహం చేసిన పనికూడా కాదు. ఎందుకంటే పరమశీతలమైన అయో ఉపరితలం మీద ద్రవపు నీరు నిలవదు. అయితే అగ్నిపర్వత శిఖరాలని పోలిన కొన్ని ప్రదేశాలు అయితే కనిపించాయి. కాని అవి కచ్చితంగా అగ్నిపర్వతాలేనని నిశ్చయంగా చెప్పడం కష్టం.

 

వాయేజర్ దిశానిర్దేశ బృందంలో లిండా మొరాబిటో అనే మహిళాశాస్త్రవేత్త వుంది. వాయేజర్ కచ్చితంగా దాని నియత కక్ష్యలో ప్రయాణించేలా చెయ్యడం ఆమె పని. అయో నుండి వచ్చే చిత్రాలలో నేపథ్యంలో ఉండే తారలు మరింత స్పష్టంగా కనిపించేలా చిత్రాన్ని మరింత నిగ్గుదేల్చమని ఆమె కంప్యూటర్ ని మరీమరీ ఒత్తిడి చేసింది. అలా చిత్రాన్ని ఇంకా ఇంకా సంస్కరిస్తుంటే ఒక దశలో చందమామ ఉపరితలం నుండి ఉవ్వెత్తున పైకి ఎగజిమ్ముతున్న ఒక స్రోతస్సు కనిపించింది. చీకటి నేపథ్యం మీద స్రోతస్సు మిలమిలా మెరుస్తోంది. స్రోతస్సు అగ్నిపర్వతం లోంచి పైకి తన్నుకొస్తున్న పదార్థం అని మరింత విశ్లేషణ చేసిన మీదట అర్థమయ్యింది. అంతకుముందు అగ్నిపర్వతాలని పోలిన స్థలాలలో ఒక దాని వద్దనే స్రోతస్సు ఉందని కూడా తెలిసింది. సంగతి తెలిసిన లిండా ఆనందానికి అంతులేదు. భూమికి బయట మొట్టమొదటి సక్రియమైన అగ్నిపర్వతాన్ని వాయేజర్ కనుక్కుంది. వాయుధారలని, రాతిశకలాలని అంతరిక్షంలోకి ఎగజిమ్ముతున్న తొమ్మిది సక్రియమైన అగ్నిపర్వతాలు ఇప్పుడు అయో మీద ఉన్నాయని మనకి తెలుసు. అవి గాక కొన్ని వందల, వేల సంఖ్యలో వినష్టమైన అగ్నిపర్వతాలు ఉన్నాయని కూడా తెలుసు. అలా అగ్నిపర్వతాల లోంచి పైకి తన్నుకొస్తున్న పదార్థం కొండవాలు మీదుగా కిందికి ప్రవహిస్తుంటే, అందులోంచి పుట్టిన మహోగ్రమైన అగ్నిధారలు, నిప్పు చాపాల బాటల వెంట అంత ఎత్తున ఎగసి పడుతూ, చుట్టూ ఉండే పలువన్నెల నేపథ్యం మీద రంగవల్లులు దిద్దుతున్నాయి. అలా ఆకాశం లోంచి వర్షించే శిలా ద్రవమే చందమామ మీద ఏర్పడే ఉల్కాబిలాలని ఎప్పటికప్పుడు పూరిస్తూ ఉండొచ్చు. విధంగా చందమామ ముఖం ఎప్పటికప్పుడు నవ్యంగా, దివ్యంగా మెరుస్తూ ఉంటుంది. వింతని చూసి గెలీలియో, హైగెన్స్ లు ఎంత పొంగిపోయేవారో.

 

స్టాంటన్ పీలే మరియు అతడి సహోద్యోగుల బృందం కలిసి అయో మీద అగ్నిపర్వతాల ఉనికి మొట్టమొదటి సారిగా సిద్ధాంతపరంగా పసిగట్టారు. తరువాత వాయేజర్ పరిశీలనలలో వాటిని ఉనికి నిర్ధారించబడింది.  అయో మీద, దాని పొరుగు చందమామ అయిన యూరోపా, దాని మాతృ గ్రహమైన జూపిటర్ లు కలికట్టుగా చూపించే గురుత్వ ప్రభావాన్ని వాళ్లు అంచనా వేసి, దాని వల్ల అయో అంతరాళంలో పుట్టే తరంగాల గురించి లెక్కలు వేశారు. తరంగాల ప్రభావం వల్ల అయో లోపలి రాళ్లు కరిగి, ద్రవరూపంలో ఉండాలని వాళ్లు నిర్ణయించారు. అయో మీది అగ్నిపర్వతాలు వెళ్లగక్కే పదార్థానికి మూలం, చందమామ అంతరాళంలో ఉన్న ద్రవరూపపు సల్ఫర్ సముద్రమేనని ఇప్పుడు మనకు బలంగా ఆధారాలు ఉన్నాయి. ఘన రూపంలో ఉన్న సల్ఫర్ ని నీరు మరిగే ఉష్ణోగ్రత కన్నా మరి కాస్త ఎక్కువకి, అంటే సుమారు 115 డిగ్రీల సెల్షియస్ కి, వేడి చేస్తే అది మరిగి రంగు మారుతుంది. ఉష్ణోగ్రత ఎంత ఎక్కువైతే రంగు అంత చిక్కన అవుతుంది. అగ్నిపర్వతాల ముఖాల  లోంచి కరిగిన సల్ఫర్ నదులు వరదలై పారితే దృశ్యం ఎలా ఉంటుందో, అయో మీద కనిపించే అనేక వర్ణాల విన్యాసం సరిగ్గా అలాగే ఉంటుంది. వేడి గరిష్ఠంగా ఉండే అగ్నిపర్వత ముఖం వద్ద నల్లని సల్ఫర్ కనిపిస్తుంది. నదులై ప్రవహించే పరిసరాలలో ఎరుపు, చెంగావి వర్ణాలలో కనిపిస్తుంది. మరి కాస్త దూరాన తలాల మీద దాని సహజ వర్ణంలో పచ్చని పసిమితో మెరిసిపోతుంది. అయో ఉపరితలం మీద నెలల స్థాయిలో కూడా మార్పులు కనిపిస్తాయి. భూమి మీద వాతావరణ వివరాలు రోజూ ప్రకటించినట్టు, అయో కి సంబంధించిన మ్యాపులు నెలనెలా మారుస్తూ ఉండాలేమో. భవిష్యత్తులో విచిత్ర ప్రపంచాన్ని పర్యటించడానికి బయల్దేరిన ధీరోదాత్తులకి పాపం కొంచెం గట్టి సవాళ్లే ఎదురవుతాయి.

అయోని పూర్తిగా ఆవరించిన సన్నని వాయుమండలం అంతా సల్ఫర్ డయాక్సయిడ్ మయమై వుంది. కాని సన్నని గాలి పొర వల్ల కూడా సత్ప్రయోజనం ఉందనిపిస్తుంది. జూపిటర్ వికిరణ వలయం లోంచి పుట్టుకొచ్చే తీక్షణమైన విద్యుదావేశ కణాల తాకిడి నుండి పొరే అయోని కాపాడుతుంది. రాత్రి పూట ఉష్ణోగ్రత ఎంతగా పడిపోతుందంటే సల్ఫర్ డయాక్సయిడ్ అంతా ఘనీభవించి తెల్లగా పిండారబోసినట్టు నేలని కప్పేస్తుంది. కాని విద్యుదావేశ కణాల తీక్షణ తాడనానికి నేల దహించుకుపోతుంది. కాబట్టి అయో మీద తలదాచుకునే ఉద్దేశం గాని ఉంటే ఉపరితలానికి అడుగున ఎక్కడో దాచుకుంటే తలకి ఎంతో మేలు.

అయో మీద అగ్నిపర్వతాలు ఆకాశంలోకి వెళ్లగక్కే స్రోతస్సులు ఎంత ఎత్తుకు లేస్తాయంటే, అవి ఎగజిమ్మే పదార్థం నేరుగా జూపిటర్ పరిసరాల వరకు పోతుందని చెప్పుకోవచ్చు. అయో కక్ష్య ఉన్న ఎత్తులో, జూపిటర్ చుట్టూ వడ్డాణ్ణంలా ఏర్పడ్డ అణురాశికి మూలం స్రోతస్సులేనని అనుకోవచ్చు. అలా పుట్టిన అణుధార నెమ్మదిగా గిరికీలు కొడుతూ జూపిటర్ దిశగా పతనం చెందుతూ ఉండొచ్చు. జూపిటర్ యొక్క అంతర చందమామ అయిన అమేథియా యొక్క ఎర్రని ఛాయకి కారణం అణుధారే కావచ్చు. అసలు అయో నుండి పైకి తన్నుకొచ్చే పదార్థమే, జూపిటర్ యొక్క పలచని వలయాల వ్యవస్థకి కూడా కారణం కావచ్చు.

 


అయో ఉపరితలం - నేపథ్యంలో జూపిటర్ (ఊహాచిత్రం)


జూపిటర్ మీద పెద్ద ఎత్తున మనుషులు జీవించడం అనేది ఊహించుకోవడం కొంచెం కష్టమే. కాని జూపిటర్ మేఘాల మీద తేలే గాలి బుడగ నగరాలలో నివాసం సుదూర భవిష్యత్తులో సాంకేతికంగా సాధ్యమే. అయో మీద నుండి గాని, యూరోపా మీద నుండి గాని బృహస్పతి వైపుగా ఉన్న ముఖాల నుండి మాతృగ్రహాన్ని గమనిస్తే, విశాలమైన ప్రపంచం, విపరీతమైన మారుదల గల ప్రపంచం, ఉదయాస్తమయాలు లేని ప్రపంచం, మొత్తం ఆకాశాన్నంతా నింపేస్తూ కనిపిస్తుంది. భూమి నుండి చూసినప్పుడు చందమామ యొక్క ఒక ముఖమే కనిపిస్తుంది. అలాగే జూపిటర్ కి కూడా దాని చందమామల్లో చాలా మటుకు ఒక ముఖాన్నే ప్రకటించుకుంటాయి. కాబట్టి జూపిటర్ ని దాని  చందమామల నుండి చూసినప్పుడు ఎల్లవేళల వింతైన నారింజ తేజంతో వెలిగిపోతూ, అపరసూర్యుడిలా  సాక్షాత్కరిస్తుంది. భవిష్యత్తులో జూపిటర్ వ్యవస్థని పర్యటించగోరే అన్వేషులని అక్కడి పరిస్థితులు వేలనోళ్లతో వెక్కిరిస్తాయి, వేయి రీతుల్లో సవాలు చేస్తాయి.

(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts