సైన్స్ ఫిక్షన్ ప్రియులకి ప్రతీ శనివారం రాత్రి ఓ చక్కని విందు – టెరా నోవా సీరియల్. సైన్స్ ఫిక్షన్ రంగంలో సినిమాలే తక్కువ. ఇక టీవీ సీరియళ్లు మరీ అపురూపం. గతంలో బాగా ఆదరణ పొందిన, ఒక మొత్తం తరాన్నే సైన్స్ దిశగా ప్రభావితం చేసిన సీరియల్ స్టార్ ట్రెక్. ఈ కొత్త సీరియల్ ఆ ఎత్తుని చేరుకుంటుందో లేదో గాని, ‘పవిత్ర రిష్తా’లని, ‘మొగలి రేకుల’ ని చూపించి, చూపించి కృంగి కృశించిపోయిన మా టీవీ ఈ కొత్త షో వల్ల ఏదో కొత్త వన్నె తెచ్చుకున్నట్టయ్యింది.
క్లుప్తంగా ఈ సీరియల్ కి నేపథ్యం ఇది. కథ క్రీ.శ. 2149 లో మొదలవుతుంది. వాతావరణం కాలుష్యం బాగా పెరిగిపోవడం వల్ల, మితిమీరిన జనాభా వల్ల భూమి మీద జీవన పరిస్థితులు దుర్భరంగా మారుతాయి. అలాంటి పరిస్థితుల్లో చికాగో నగరంలో ఒక చోట కాలాయతనంలో (space-time) ఓ చీలికని కనుక్కుంటారు శాస్త్రవేత్తలు (!!!) దాని లోంచి గతం లోకి ప్రయాణించవచ్చని కనుక్కుంటారు. ఇక గుంపులుగా గుంపులుగా దుర్భరమైన భావి భూమి నుండి తప్పించుకుని 84 మిలియన్ల సంవత్సరాలు గతం లోకి ప్రయాణిస్తారు మనుషులు. ఆ విధంగా ఈ ‘తీర్థయాత్రల’ వల్ల ఎంతో మంది విమోచనం పొందుతారు. వాటిలో పదవ తీర్థ యాత్రలో షానన్ కుటుంబం గతం లోకి ప్రవేశిస్తుంది. పదవ తీర్థయాత్రలో వెనక్కు వెళ్ళిన వారంతా ఒక ‘కాలనీ’ లాంటిది నిర్మించుకుని అందులో జీవనం మొదలెడతారు. ఆ కాలనీ పేరే ‘టెరా నోవా’ (అంటే నవ్య భూమి).
84మిలియన్ సంవత్సరాలు గతంలో అంటే అది భూమి మీద క్రిటేషియస్ యుగం నడుస్తున్న కాలం. గతంలో 145.5 నుండి 65.5 మిలియన్ల సంవత్సరాల మధ్య కాలాన్ని క్రిటేషియస్ యుగం అంటారు. ప్రస్తుత భూమితో పోల్చితే అప్పటి భూమి రూపురేఖలు చాలా భిన్నంగా ఉండేవి. అప్పటికి ఇండియా ఇంకా ఏషియాలో భాగం కాదు. అప్పుడే ఆఫ్రికా ఖండం నుండి వేరు పడి నెమ్మదిగా ఏషియా దిశగా తన సుదీర్ఘ ప్రయాణం మొదలెట్టింది. ఆస్ట్రేలియా ఇంచుమించు అంటార్కిటికాతో కలిసి వుంది. యూరొప్ అంతా ఛిన్నాభిన్నమై, జలమయమై వుంది. ఆఫ్రికా ఉత్తర భాగం అంతా నీరు. ఉత్తర అమెరికా ఖండాన్ని ఓ సముద్రం నిలువుగా రెండుగా వేరుచేస్తోంది. అది భూమి మీద డైనోసార్లు స్వైరవిహారం చేస్తున్న కాలం. ఈ క్రిటేషియస్ యుగాంతంలోనే భారీ ఎత్తున భూమి మీద జీవరాశులు అంతరించిపోయాయి. అంత తక్కువ కాలంలో హఠాత్తుగా ఎన్నో రకాల జీవరాశులు (డైనోసార్లు కూడా) ఎందుకు అంతరించిపోయాయి ఇప్పటికీ ఓ అంతుబట్టని విషయంగా ఉండిపోయింది. దాన్నే కే-టీ వినాశన ఘట్టం అంటారు. అలాంటి వినాశనానికి ఉల్కాపాతాలు కారణం కావచ్చని ఓ సిద్ధాంతం ఉంది.
అలాంటి భయంకరమైన ధరాగత పరిస్థితుల్లో టెరా నోవా లో బతికే వ్యక్తుల జీవితాల కథే ఈ సీరియల్.
వీలున్నప్పుడు ఈ సీరియల్ లో విశేషాలు పోస్ట్ చేస్తాను. కాని ప్రస్తుతానికి ఓ చిన్న సంఘటన గురించి చెప్తాను. ఈ సీరియల్ లో ప్రతీ ఘట్టంలో ఎంత ఆలోచన, ఎంత శాస్త్రవిజ్ఞానం చొప్పించబడిందో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ.
ఒక సన్నివేశంలో షానన్ ఐదేళ్ల కూతురు రాత్రి వేళ ఇంట్లోంచి బయటికి వచ్చి చందమామని చూసి గతుక్కుమంటుంది. అది పున్నమి. చందమామ ఆకాశంలో నిండుగా ప్రకాశిస్తుంటాడు. కాని చంద్రుడి పరిమాణం కొంచెం విపరీతంగా కనిపించి పాప భయపడుతుంది. అప్పుడు తండ్రి భయంలేదని చెప్తూ, చందమామ అలా పెద్దగా కనిపించడానికి కారణం చెప్తాడు.
చందమామ పుట్టుపూర్వోత్తరాల గురించి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. (దాని మీద లోగడ ఓ బ్లాగ్ పోస్ట్ కూడా ఉంది). ఏదో దారే పోయే గ్రహం భూమి లోంచి పెల్లగించగా చందమామ ఏర్పడింది అని ఓ సిద్ధాంతం. దానికి నిదర్శనంగా చందమామ ఏటేటా 3.8 cms భూమి నుండి దూరంగా జరుగుతోంది అన్నది వాస్తవం. కనుక గతంలో, అదీ ఎనభై మిలియన్ సంవత్సరాల క్రితం, చందమామ భూమికి మరింత (సుమారు 3000 kms) దగ్గరిగా ఉండాలి.
ఎనభై నాలుగు మిలియన్ల సంవత్సరాలు గతంలో భూమి మీదే కాక, అంతరిక్ష పరిసరాలలో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఈ సీరియల్ ని దాని సూత్రధారులు ఎంతో పకడ్బందీగా నిర్మించినట్టు ఉన్నారు. ఇలాంటి సూక్ష్మాలు ఎన్నెన్నో ఈ సీరియల్ లో కనిపించి మురిపిస్తుంటాయి.
సైన్స్ ప్రియులూ! స్టార్ వరల్డ్ చానెల్ లో ప్రతీ శనివారం రాత్రి తొమ్మిదికి… మర్చిపోకండేం?
మరింత సమాచారం కోసం…
http://en.wikipedia.org/wiki/Terra_Nova_%28TV_series%29
http://en.wikipedia.org/wiki/Cretaceous
http://en.wikipedia.org/wiki/Cretaceous%E2%80%93Tertiary_extinction_event
http://curious.astro.cornell.edu/question.php?number=124
http://scienceintelugu.blogspot.com/2009/12/blog-post_04.html
http://scienceintelugu.blogspot.com/2009/12/2.html
అంతలో శ్వేతకేతు ఎయిర్లాక్ మెల్లగా తెరుచుకుంది. రెండు స్పేస్ సూట్లు తేలుతూ నెమ్మదిగా బయట పడ్డాయి. మా మధ్య ఇంత సంక్షోభాన్ని కలుగజేసిన విగ్రహాన్ని మోసుకొస్తున్నారన్నమాట. కొంచెం దారుణంగానే ఉన్నా పథకం పారింది.
“విగ్రహాన్ని లోపలికి తీసుకురండి. ఎయిర్లాక్ తెరుస్తాను,” ప్రొఫెసర్ రేడియోలో అన్నాడు.
ప్రొఫెసర్ నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నాడు. నేను గడియారం కేసి చూశాను. అప్పుడే పదిహేను నిముషాలు అయిపోయింది. పాపం వర్మ... అనవసరంగా ప్రొఫెసర్ తో కక్ష పెట్టుకున్నాడు. ఈ పాటికి ఏ కక్ష్యలో ఉన్నాడో ఏమో!
మా ఎయిర్లాక్ తెరుచుకుంది. ముందు కెప్టెన్ నిత్యానంద్ ప్రవేశించాడు. వెనకే అమేయ అడుగుపెట్టింది. ముఖంలో కోపం, ఉక్రోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మెడలో కపాలమాల వేస్తే కాళికలా ఉంటుందేమో.
ఇంత జరుగుతున్నా ప్రొఫెసర్ ముఖంలో పశ్చాత్తాపపు చాయలైనా కనిపించడం లేదు. అతిథులు తెచ్చిన ’సామాను’ అంతా జాగ్రత్తగా చూసుకుని ఓ సారి తృప్తిగా చిరునవ్వు నవ్వి, అందరి కేసి ఓ సారి చూసి –
“అయిందేదో అయ్యింది. కూర్చోండి. కూర్చోండి. కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుందాం” అన్నాడు.
“మీకేమైనా పిచ్చి పట్టిందా?” ఇక ఉండబట్టలేక గట్టిగా అరిచాను. “అవతల మనిషి చచ్చిపోతుంటే... ఈ పాటికి జూపిటర్కి సగం దూరంలో ఉంటాడు పాపం...”
“ఈ కుర్రకారుతో ఇదే ఇబ్బంది,” ప్రొఫెసర్ విసుగ్గా అన్నాడు. “ప్రతీ దానికి తొందరే.”
వచ్చిన తరువాత మొదటి సారిగా అమేయ నోరు మెదిపింది.
“మీరు మాకో మాటిచ్చారు...”
“ఏం భయపడకండి మిస్ అమేయా! వర్మ కేం ప్రమాదం లేదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి తనని తిరిగి తెచ్చుకోవచ్చు.” ప్రొఫెసర్ ప్రసన్నంగా అన్నాడు.
“అంటే ఇందాక నాతో అబద్ధం చెప్పారా?”
“లేదు. నేను చెప్పిందంతా నిజమే. కాని అది పూర్తి నిజం కాదు. మీరా సగం నిజం విని నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. ఇక్కణ్ణుంచి జూపిటర్ ఉపరితలానికి పడడానికి తొంభై ఐదు నిముషాలు పడుతుంది అన్నది నిజమే. కాని అది జూపిటర్ బట్టి నిశ్చలంగా ఉన్న వస్తువులకే వర్తిస్తుంది. వర్మ పంచమంతో పాటు కదులుతున్నాడు కనుక ఆ సూత్రం తనకి వర్తించదు. ప్రస్తుతం రమారమి ఇరవై ఆరు కిమీలు.సెకనుకి వేగంతో జూపిటర్ చుట్టూ తిరుగుతుంటాడు.
కనుక పంచమం మీద నుంచి విసిరేసినా మేం తనకి ఇచ్చిన అదనపు వేగం చాలా తక్కువ కనుక ఇంచుమించు పంచమం కక్ష్య లోనే తిరుగుతుంటాడు. మహా అయితే ఓ వంద కిలోమీటర్లు లోపలికి, అంటే జూపిటర్ కి కాస్త దగ్గరిగా జరిగి ఉంటాడు. కెప్టెన్ వర్ధమాన్ లెక్కలన్నీ వేశాడు. మరో పన్నెండు గంటల్లో తిరిగి మన దగ్గరికి తేలుకుంటూ రావాలి.”
గదిలో కాసేపు ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు అమేయ కెప్టెన్ నిత్యానంద్ కేసి చూసింది.
“ఇదంతా మీక్కూడా తెలిసే ఉండాలే. అయినా నాతో ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు?”
“మరి మీరెప్పుడూ అడగలేదే...” సణిగాడు కెప్టెన్ నిత్యానంద్.
చిటారు కొమ్మకి వేలాడే పండుని తెంపుకున్నట్టు, ఓ గంట తరువాత పంచమానికి సన్నిహితంగా కొట్టుకొచ్చిన అభినవ్ వర్మ ని పట్టుకుని తెచ్చుకున్నాం. మరీ ఎక్కువేం కాదు. ఇరవై కిమీలే లోపలికి వెళ్లాడు. తన సూట్ లో మెరుస్తున్న కాంతి బట్టి సులభంగా పట్టుకోగలిగాం. కిందకి దిగగానే నిప్పులు కక్కుతాడు అనుకున్నాను. కాని అలాంటిదేం జరగలేదు. అంతరిక్షంలో దిక్కులేకుండా వేలాడే స్థితి నుండి బయటపడి ఇప్పుడే కేబిన్ లో వెచ్చగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక కదను తొక్కడానికి, కథకళి చెయ్యడానికి ఓపికేది? లేకపోతే దెబ్బకి పూర్తిగా జడిసిపోయి ఉంటాడు. పోయిపోయి మా విశ్వనాథంతో పెట్టుకుంటాడా?
అదండీ కథ. ఇక పెద్దగా చెప్పేదేవుంది. ఆ అనుభవం నుండి తేరుకున్న అభినవ్ వర్మకి వాళ్ల నౌకలో సరిపోయినంత ఇంధనం ఉందని అర్థమయ్యింది. ఎందుకంటే సగం పేలోడ్ ఇప్పుడు మా నౌకలోకి వచ్చింది. తన నౌక నుండి మా నౌక లోకి చేరవేసిన ఇంధనం (దానికి తరువాత మా ప్రొఫెసర్ పైకం చెల్లించాడండోయ్) తో ఆ ’దూత’ ని గానిమీడ్ దాకా తీసుకెళ్లగలిగాం.
(కొన్నాళ్ళ తరువాత... ఇంటికి తిరిగొచ్చాక)
ఇటీవల వచ్చిన వార్త. సలార్జంగ్ మ్యూజియమ్ లో మా ఆవిష్కరణలు ప్రదర్శించడానికి ఓ కొత్త విభాగాన్ని తెరిచారు. అందులో ’దూత’ ని కూడా ఉంచారు.
నేను, శేషు ఈ రోజు అక్కడికే వచ్చాం. ఈ కొత్త ముచ్చట చూడ్డానికి వచ్చిన జనంతో ఇవాళ మ్యూజియం చాలా రద్దీగా ఉంది. ప్రదర్శించబడ్డ వస్తువులతో పాటు వాటి మధ్యలో చాటంత చిరునవ్వులు నవ్వుతూ అభినవ్ వర్మ, అమేయలు కూడా కనిపించారు. అంతా వాళ్ల గొప్పయినట్టు...
ఆ రోజు అందరం కలిసి తాజ్ లో లంచ్ చేశాం. అభినవ్ వర్మ పాత కక్షలన్నీ మర్చిపోయి బాగా మాట్లాడాడు. కాని ఒక్క విషయం మాత్రం నా మనసులో ఎప్పట్నుంచో దొలిచేస్తోంది.
ఆ పిల్లకి వాళ్లో ఏం కనిపించిందంటారూ?
(సమాప్తం)
“ఇదంతా నేను నమ్మను!” అరిచింది అమేయ. “మీరు ఊరికే నన్ను భయపెడుతున్నారు. మీ సిబ్బంది కూడా ఒప్పుకోరు.”
ఎంత వివరంగా పాఠం చెప్పినా బోధపరుచుకోని ఆ విద్యార్థి అవస్థ చూసి ప్రొఫెసర్ ఓ సారి నిట్టూర్చి, సిబ్బంది వైపు తిరిగి:
“కెప్టెన్ వర్ధమాన్, గౌరంగ్ దయచేసి నా ఆదేశాలని అమలు చేస్తారా?” అన్నాడు.
కెప్టెన్ తల పంకించాడు.
అభినవ్ వర్మ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. తన సూట్ లని రియాక్షన్ పిస్తోళ్లని తిసేసి, సూట్ తిరిగి ఇస్తూ, కెప్టెన్ వర్ధమాన్ అన్నాడు,
“మీ సూట్ వేసుకోండి. కాసేపు అలా షికారు కెళ్దాం.”
ప్రొఫెసర్ అన్నంత పనీ చేస్తాడనని నాకు నమ్మ బుద్ధి కావడం లేదు. అంతరిక్షంలోకి విసిరేస్తానని ఇందాక వర్మని తిడితే ఏదో నోటిదురద అనుకున్నా. అయినా కెప్టెన్ వర్ధమాన్, గౌరంగ్ లు అలాంటి ఘాతుకం చేస్తారని కూడా అనిపించడం లేదు. ఇదంతా వట్టి బుకాయింపు అని అమేయకి తెలిసిపోయిందంటే మళ్లీ మేం నవ్వులపాలు అవుతాం.
అభినవ్ వర్మ కి పారిపోయే అవకాశం కూడా లేదు. తన రియాక్షన్ పిస్తోళ్లు లేకపోతే తనది పూర్తి నిస్సహాయ పరిస్థితి.
తన రెండు జబ్బలూ పట్టుకుని ఓ పెద్ద బెలూన్ ని లాక్కెళ్తున్నట్టు ఎంతో దూరం లేని పంచమం అంచుల వరకు, బృహస్పతి దిశగా వర్మని లాక్కెళ్తున్నారు.
తన నౌక కిటికీ లోంచి ఈ దారుణమైన వ్యవహారాన్ని చూస్తున్న అమేయ ముఖం కనిపిస్తోంది. అమేయ చూస్తోంది అన్న సంగతి ప్రొఫెసర్ గమనించడం కూడా కనిపిస్తోంది.
“ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా మిస్ అమేయా? మా మనుషులు ఖాళీ సూట్ ని మోసుకు పోవడం లేదు. కావాలంటే మీ నౌకలోని టెలిస్కోప్ లోంచి చూడొచ్చు. మరో రెండు నిముషాల్లో మా వాళ్లు వర్మని ’లాంచ్’ చేస్తారు. అయినా వర్మగారు ’నేల విడిచి సాము’ చెయ్యడంలో సిద్ధ హస్తులు అనుకుంటా?”
పాపం ఆడపిల్ల ఒక్కర్తీ ఆ శ్వేతకేతులో భయపడి ఛస్తుంటే ఇప్పుడీ వ్యంగ్యం అవసరమా? మనసులోనే అనుకున్నాను.
లౌడ్ స్పీకర్ లో కాసేపు నిశ్శబ్దం... అమేయ ఏం ఆలోచిస్తోంది? ప్రొఫెసర్ ఏమీ చెయ్యలేడని ధీమానా? లేక తనిక ఏమీ చెయ్యలేదన్న నిస్సహాయతా?
బైనోక్యులర్స్ తీసుకుని దూరంగా ఏం జరుగుతుందో చూశాను. ముగ్గురూ రియాక్షన్ పిస్తోళ్ల సహాయంతో ఆకాశం లోకి లేచారు. ఒక ఎత్తు వరకు లేచాక మధ్యలో ఉన్న వ్యక్తిని వొదిలేసి, రియాక్షన్ పిస్తోళ్లతో తమ వేగాన్ని ఆపుకుంటూ మిగతా ఇద్దరూ తిరిగి కిందకి దిగారు. పైకి లేచిన ఆకారం మెల్లగా అలా జూపిటర్ వైపుకి కొట్టుకుపోవడం కనిపించింది.
“మై గాడ్! వాళ్లు మీరు చెప్పినట్టే చేశారు. మీరు బుకాయిస్తున్నారు అనుకున్నాను,” ఆదుర్దాగా అన్నాను.
“అవును. అమేయ కూడా అలాగే అనుకుంది,” ప్రొఫెసర్ అమేయకి వినిపించేట్టుగా కాస్త మైక్రోఫోన్ మీదకి వొంగుతూ అన్నాడు. “మనం ఉన్న పరిస్థితి ఎంత కీలకమైనదో నేను మళ్లీ గుర్తు చెయ్యనక్కర్లేదు. వర్మ జూపిటర్ ఉపరితలాన్ని చేరుకోడానికి సరిగ్గా తొంభై ఐదు నిముషాలు పడుతుంది. అంతే కాదు. అందులో సగం సమయం కన్నా ఎక్కువ సేపు మనం కాలయాపన చేస్తే పరిస్థితి చెయ్యి జారి పోతుంది....”
అవతలి వైపు నుండి మళ్లీ నిశ్శబ్దం.
“ఇప్పుడు నేను రిసీవర్ ఆఫ్ చేస్తున్నాను. ఇక మన మధ్య వాదనలు అనవసరం. మీరు తీసుకెళ్లిన విగ్రహం తో పాటు, ఇతర వస్తువులని కూడా భద్రంగా తిరిగి ఇచ్చేశాకే మళ్లీ మనం మాట్లాడుకుందాం. బై!”
ఓ పది నిముషాలు ఏమీ జరగలేదు. ఆకాశంలో అభినవ్ వర్మ ఎక్కడయినా మినుకు మినుకు మంటుంటాడేమో నని చూశాను. కాని ఎక్కడా అతని ఆచూకీ లేదు. అసలీ ప్రొఫెసర్ నోటికి గుడ్డ కట్టి ఓ చోట కట్టి పడేసి, మేం వెళ్లి వర్మని రక్షించకపోతే మా మీద హత్యానేరం ఆరోపించబడుతుందని ఒక పక్క భయం మొదలయ్యింది.
(సశేషం – రేపటి పోస్ట్ తో కథ సమాప్తం)
“అవునా?” మళ్లీ అమాయకంగా అంది.
’అబ్బ నంగనాచి!’ మనసులోనే తిట్టుకున్నాను. ప్రొఫెసర్ ఇంకా ఇలా అన్నాడు.
“మీకు గ్రహగతుల గురించి పెద్దగా తెలియదని అనుకుంటాను. మీకు సందేహం ఏవైనా ఉంటే మీ కెప్టెన్ ని అడిగితే చెప్తాడు. చెప్తారు కదూ కెప్టెన్?”
“వివరంగా!” నిత్యానంద్ వత్తాసు పలికాడు.
“సరే అయితే. మిస్ అమేయా!” ప్రొఫెసర్ తన ’రేడియో ఉపన్యాసాన్ని’ కొనసాగించాడు. “గ్రహాలన్నిట్లోకి జూపిటర్ పెద్దది. కనుక దాని ఆకర్షణ కూడా చాలా బలంగా ఉంటుంది. ఇది మీకు తెలుసనుకుంటా?”
తెలుసు గాని ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారు అన్నట్టు ఓ సారి చూసింది.
“ఆ బృహస్పతి సమీపంలో ఈ ఉపగ్రహం మీద మన పరిస్థితి కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. పంచమం జూపిటర్ చుట్టూ పన్నెండు గంటలకి ఒకసారి ప్రదక్షిణ చేస్తుంది. ఖగోళ విజ్ఞానంలో ఓ ప్రఖ్యాత సిద్ధాంతం ఉంది. ఒక వస్తువు ఒక కక్ష్య నుండి గురుత్వ కేంద్రం లోకి పడడానికి పట్టే సమయం, దాని ప్రదక్షిణ కాలం లో 0.177 వంతు ఉంటుంది. అంటే ఇంత దూరం నుండి ఓ వస్తువుని బృహస్పతి మీదకి విసిరేస్తే రెండు గంటల ఏడు నిముషాలలో అది గ్రహ కేంద్రాన్ని చేరుకుంటుంది. నిత్యానంద్ గారికి కూడా ఇవన్నీ తెలిసే ఉంటాయి.”
కెప్టెన్ నిత్యానంద్ కాసేపు ఏమీ మాట్లాడలేదు. తరువాత మెల్లగా అన్నాడు “అంకెలు కచ్చితంగా తెలీవు గాని...ఇంచుమించు అంతే అయ్యుంటుంది.”
“మంచిది. ఇప్పుడు మీకు నమ్మకం కుదురుతోంది అనుకుంటా” అంటూ ఓ వికారపు నవ్వు నవ్వాడు ప్రొఫెసర్. “అయినా బృహస్పతి కేంద్రానికి ఎంత సేపు పడుతుంది అనేది మనకి ఇప్పుడంత ముఖ్యం కాదు. గ్రహపు ఉపరితలాన్ని ఇంకా ముందే చేరుకోవచ్చు... బోరుకొడుతున్నానా మిస్. అమేయా?”
“లేదు” కొంచెం నీరసంగా వచ్చింది సమాధానం.
“సంతోషం. కెప్టెన్ వర్ధమాన్ ఈ లెక్కలు కచ్చితంగా వేశాడు. ఉపరితలాన్ని చేరుకోడానికి గంటా ముప్పై ఐదు నిముషాలు పడుతుంది. ఓ రెండు నిముషాలు అటు ఇటు అవుతుందేమో. ఇప్పుడు మనం ఉన్న ఉపగ్రహం మీద గురుత్వం చాలా బలహీనంగా ఉందన్న సంగతి మీకు అనుభవం మీద తెలిసే ఉంటుంది. ఇక్కడ పలాయన వేగం కేవలం పది మీటర్లు సెకనుకి. అంటే ఆ వేగంతో ఇక్కణ్ణుంచి ఓ వస్తువుని విసిర్తే అది ఉపగ్రహాన్ని శాశ్వతంగా వొదిలి పోతుంది అన్నమాట. అంతేనా కెప్టెన్ నిత్యానంద్”
“పచ్చినిజం.”
“సరే ఇక సూటిగా పాయింటుకి వచ్చేస్తున్నా. ఇప్పుడు మేం వర్మగార్ని కాసేపు షికారుకి తీసుకెళ్లబోతున్నాం. సరిగ్గా జూపిటర్ కిందకి వచ్చినదాకా నడిపించుకెళ్లి అక్కణ్ణుంచి తనని ’లాంచ్’ చేస్తాం అన్నమాట. మీరు దొంగలించిన సామాను మాకు తిరిగి ఇచ్చాక మా నౌకలో వెళ్లి అతణ్ణి వెనక్కు తెచ్చుకుంటాం. అంటే అప్పుడు మనకి సరిగ్గా గంటా ముప్పై ఐదు నిముషాలు మాత్రమే ఉంటుంది.”
“ప్రొఫెసర్!” ఉలిక్కి పడ్డాను నేను. “ఏంటి మీరనేది?”
“నువ్వు నోర్ముయ్” ఓ సారి నా వైపుకి తిరిగి ఉరిమాడు. “ఏవంటారు మిస్ అమేయా?”
అమేయ ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్క లేదు.
(సశేషం...)
కాని అంతలో అభినవ్ వర్మ ఏం ఆలోచించుకున్నాడో ఏమో. మళ్లీ మా వద్దకి వచ్చాడు. ఈ సారి తనతో పాటు వాళ్ల కెప్టెన్ నిత్యానంద్ ని వెంట తెచ్చుకున్నాడు.
“కొన్ని ముఖ్యమైన ఏర్పాట్లు చేసుకుని వస్తున్నా ప్రొఫెసర్. మీ ఇంధనాన్ని కావాలంటే మీద దగ్గరే ఉంచుకోండి. కాని ఏవైనా మనం ఇద్దరం ఓ ఒప్పందానికి వస్తే ఇద్దరికీ కలిసొస్తుంది. మీరు నా ఇంధనాని తిరిగి ఇచ్చేయండి. నేను మీకు తత్తిమా వస్తువులన్నీ ఇచ్చేస్తాను – ఆ ఒక్క ’ మోనా లిసా’ తప్ప!”
దాంతో ప్రొఫెసర్ ఒంటికాలి మీద లేచాడు. భూలోకపు తిట్లన్నీ ఇక్కడ ఈ గురుపరిసర ప్రాంతంలో వినడం మొదట్లో కాస్త విడ్డురంగా అనిపించింది అనుకోండి. ఇలాంటి దొంగ రాక్సెల్స్ ని అంగారక గ్రహం మీద ఒంటరిగా వొదిలేసి రావాలన్నాడు. ఇలాటి దగాకోరులు గ్రహశకలాల మధ్య నలిగి దిక్కుమాలిన చావు ఛస్తారన్నాడు. ఆక్సిజన్ మాస్క్ కి కన్నం పెట్టి అంతరిక్షం లోకి విసిరేయాలన్నాడు. మా ప్రొఫెసర్ లో ఇంత అగ్గి దాక్కుందని అప్పుడే తెలిసింది.
అలా ఓ పది నిముషాలు తిట్ల వర్షం కురిశాక వాతావరణం చల్లబడింది. అప్పుడు ప్రొఫెసరే మళ్లీ –
“చూడండి వర్మగారు. మీ లాంటి గుండెలు తీసిన బంటుని ఈ మొత్తం సౌరమండలంలో నేనెక్కడా చూళ్లేదు. మీ లాంటి వాళ్ళతో మాటలతో పని జరగదు. మీ మీద బల ప్రయోగం చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో చట్టం నా వైపు ఉందని నాకు తెలుసు.”
దాంతో వర్మ కొంచెం ఖంగు తిన్నట్టు కనిపించాడు. మేం దారి కాస్తూ తలుపుకి అడ్డుగా నిలబడ్డాం. ప్రొఫెసర్ కెప్టెన్ వైపు తిరిగి అన్నాడు –
“కెప్టెన్ వర్ధమాన్! వర్మని కేబిన్-B లో నిర్బంధించండి.”
“ఇది అన్యాయం!” వర్మ అరిచాడు. “నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్నిలా నిర్బంధించే హక్కు మీకు లేదు.” తమ నౌక కెప్టెన్ నిత్యానంద్ కేసి ఓ సారి చూశాడు ఏవైనా సహాయపడతాడేమోనని.
“చూడండి. నాకీ గొడవలతో ఎలాంటి సంబంధమూ లేదు. నా పని నౌకని నడపడం. మీ గొడవలన్నీ తేలాక చెప్పండి. బయలుదేరుదాం,” కెప్టెన్ నిత్యానంద్ తనకి ఏమీ పట్టనట్టుగా నిర్లక్ష్యంగా అన్నాడు.
“భేష్ కాప్టెన్. మీ తీరు నాకు బాగా నచ్చింది. మీరు మీ నౌకకి తిరిగి వెళ్లి అక్కడ పరిస్థితి మొత్తం వివరించండి. సమయం వచ్చినప్పుడు మీకు కబురు పెడతాను.”
కెప్టెన్ నిత్యానంద్ నిష్క్రమించాడు. ఈ సారి అమేయతో సూటిగా మాట్లాడి విషయం తేల్చుకుందామని రేడియో ద్వార తనని సంపర్కించాడు ప్రొఫెసర్.
“మంచి పని చేశారు ప్రొఫెసర్. ఆ వర్మ కి తగిన శాస్తి జరిగింది. కాని చిక్కేంటంటే తనని మీరు ఏవీ చెయ్యలేరు. ఇక్కడ ఉండే బదులు అక్కడ ఉంటాడు. తన వల్ల మీకు పెద్దగా లాభవేం ఉండదు. మీకు తనంటే విసుగు పుట్టాక సాగనంపేయండేం” అది అమాయకత్వమో అతి తెలివితేటలో అర్థం కానట్టుగా మాట్లాడి పెట్టేసింది.
ఈ సారి ఖంగు తినడం ప్రొఫెసర్ వంతు అయ్యింది. కాబిన్ కిటికీ లోంచి విశ్వమంత విశాలంగా వెలుగుతున్న బృహస్పతి కేసి చూస్తూ కూర్చున్నాడు.
“ఈ అమ్మాయికి ఇదంతా ఏదో ఆటలా ఉందా ఏంటి?” తనలో తానే గొణుగుతున్నట్టుగా అని తిరిగి నా వైపు చూసి –
“కొంపదీసి ఆ పిల్ల ఈ గొరెల్లా మీద మనసు పళ్లేదు గద!”
“పడే ఉంటుంది. మనం ఇదవడమే గాని ఆడపిల్లలకి అలాంటి పట్టింపులేం ఉండవు. వాళ్లు ఏవైనా చెయ్యగలరు.” కొంచెం నీరసంగా అన్నాను.
ప్రొఫెసర్ దీర్ఘాలోచనలో పడ్డాడు. కాసేపయ్యాక కెప్టెన్ వర్ధమాన్ వైపు తిరిగి –
“ఓసారి నా కేబిన్ లోకి రండి కెప్టెన్. మీతో కొంచెం మాట్లాడాలి.”
కాసేపయ్యాక ఇద్దరూ ప్రొఫెసర్ కేబిన్ లోంచి బయటికొచ్చారు. ప్రొఫెసర్ ముఖంలో సంతోష రేఖలు కనిపిస్తున్నాయి. అమేయతో లైన్ కలిపాడు.
“హలో!” అవతలి నుండి అమేయ స్వరం. “ఏవండీ ప్రొఫెసర్ గారూ! బోరుకొడుతోందండీ బాబూ! మా వర్మని ఎప్పుడు పంపుతున్నారు?” కవ్విస్తున్నట్టుగా అంది.
“చూడండి మిస్ అమేయా! మీకు ఈ వ్యవహారం అంతా ఓ ఆటలా ఉండొచ్చు. విషయం మీకు అర్థం కావడానికి ఓ చక్కని ఏర్పాటు చేశాను. ఆ ఏర్పాటు ఏంటో తెలిసిందంటే ఇక మీ బోరు ఏడుపు హోరుగా మారుతుందేమో?”
(సశేషం...)
“ఇదుగో వస్తున్నా. ఇప్పుడే అటో ఇటో తేల్చుకుంటా!” కోపంగా ప్రసారం ఆఫ్ చేస్తూ అన్నాడు వర్మ.
“దెబ్బకి దిగొచ్చాడు... పెద్ద వీర విలేకరి!” కచ్చగా అన్నాడు శేషు.
అంతలో ఎయిర్లాక్ తెరుచుకుని అభినవ్ వర్మ లోపలికి ప్రవేశించాడు. ధుమధుమలాడుతూ ఉంటాడని అనుకున్నాం. కాని అంతలో శాంతంగా మారిపోయి
“ఏంటండీ ఇదంతా! ఇదంతా అసలేవైనా బావుందా చెప్పండి?”
“మీకు కొత్తగా చెప్పేదేవుంది వర్మగారు. పంచమం నుండి ఏమీ బయటికి తీసుకుపోకూడదని నియమం ఉంది. మీకు చెందని దాన్ని తీస్కెళ్తున్నారు. అది చౌర్యం అవుతుంది.” ప్రొఫెసర్ నెమ్మదిగా అన్నాడు.
“ఇదంతా మీ సొంతమేం కాదే! ఏంటి ఈ గ్రహం మీద ఉన్నదంతా మీ సొమ్మన్నట్టు మాట్లాడుతున్నారు?” వర్మ గొంతు పెద్దది చేశాడు.
“ఇది గ్రహం కాదు. ఇదో నౌక. మరమ్మత్తులు కావలసిన నౌక. ఈ సందర్భంలో పూర్తిగా భిన్నమైన చట్టాలు వర్తిస్తాయి.”
“మీరు చెప్పేది నేను చచ్చినా ఒప్పుకోను. ఈ లా పాయింట్లు తేల్చుకోడానికి కోర్టులు ఉన్నాయి. లాయర్లు ఉన్నారు. మీ పద్ధతేం బాలేదు.” ఇంచుమించు అరుస్తున్నట్టుగా అన్నాడు వర్మ.
“నే చెప్పేది కాస్త శాంతంగా వినండి వర్మగారు!” అవతలి వాడు నిప్పులు కక్కుతున్నా మా పెద్దాయన మాత్రం ప్రసన్నంగా మంతనం చేస్తున్నాడు. “మీరు తీసుకున్న వస్తువు ఇక్కడ మేం కనుక్కున్న వాటి లోకెల్లా అత్యంత అమూల్యమైన వస్తువు. నాలాగా మీరు పురావస్తు పరిశోధకులైతే ఆ వస్తువు విలువేంటో మీకు తెలిసి ఉండేది. సరే ఆ సంగతి వొదిలేద్దాం. ఆ వస్తువు తిరిగి ఇచ్చేయండి. మీ ఇంధనం మీకు తిరిగి ఇచ్చేస్తాం.”
వర్మ ధుమ్మెక్కిన పిచ్చుక గూడు లాంటి తన గడ్డాన్ని ఓసారి సాలోచనగా గోక్కున్నాడు.
“అయినా ఇక్కడ ఇన్ని వస్తువులు ఉండగా ఆ ఒక్క వస్తువు గురించి మీరు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు నాకు.
“మోనా లీసా చిత్రాన్ని కొట్టేసి అదే మ్యూజియంలో ఇంకా ఎన్నో చిత్రాలు ఉన్నాయి కదా, ఏం కొంపలు అంటుకు పోయాయి అని వాదించే దొంగలాగా ఉంది మీ పద్ధతి. మీరు కాజేసిన కళాఖండాన్ని పోలిన వస్తువు ఈ సౌరమండలంలోనే లేదు. ప్రాణాలొడ్డి అయినా దాన్ని తిరిగి సాధిస్తాను.” ప్రొఫెసర్ ఆవేశంగా అన్నాడు.
“వేశావు ప్రొఫెసరూ, పప్పులో కాలు” మనసులోనే అనుకున్నాను. బేరసారాలు జరిపేటప్పుడు ఎప్పుడూ ఓ ముఖ్య సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. మనం బేరం ఆడుతున్న వస్తువు దొరక్కపోతే మనం తలతెగ్గోసుకోడానికి సిద్ధంగా ఉన్నామన్న భావన అవతలి వాడికి ఎట్టిపరిస్థితిలో కలిగించకూడదు. ఇప్పుడు ప్రొఫెసర్ చేసిన పొరబాటు సరిగ్గా అదే. ఆ వస్తువు కోసం ప్రొఫెసర్ ఎంత మూల్యమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడని వర్మకి ఆ సంభాషణతో అర్థమయ్యింది.
“ఒక్క అరగంట గడువు ఇవ్వండి. ఆలోచించుకోవాలి,” అంటూ వర్మ తన నౌకకి తిరిగి వెళ్లిపోయాడు,
“అరగంట కన్నా ఒక్క సెకను కూడా ఎక్కువ ఆగను,” పట్టుదలగా అన్నాడు ప్రొఫెసర్.
ఈ సంభాషణ తరువాత వర్మ తెలివితేటల పట్ల నా గౌరవం మరి కాస్త పెరిగింది. అంతలో వర్మ నౌక మీది ఏరియెల్ కాసేపు అటు ఇటు తిరిగి గానిమీడ్ దిసగా గురిపెట్టబడడం కనిపించింది. గానిమీడ్ కి సందేశం పంపుతున్నాడా? ఎందుకో? అతి దగ్గర ఫ్యూయెల్ స్టేషన్ గానిమీడ్ మీద ఉందని ఆ మధ్య కెప్టెన్ వర్ధమాన్ అనడం గుర్తు. వాళ్ల సందేశాన్ని రహస్యంగా టాప్ చెయ్యాలని చూశాం. కాని వర్మ గట్టివాడే. తన సందేశాన్ని స్క్రాంబుల్ చేయబడింది. కొన్ని నిముషాల తరువాత వాళ్లకి ఏదో సమాధానం కూడా వచ్చింది. అది కూడా స్క్రాంబుల్ చెయ్యబడింది.
పరిస్థితి చేజారిపోతోంది. ప్రొఫెసర్ ముఖం జేవురించి ఉంది. ఏ క్షణాన అయినా అగ్నిపర్వతం బద్దలవ్వడానికి సిద్ధంగా ఉంది.
(సశేషం...)
నేను మా ప్రొఫెసర్ గారి బృందంలో చేరినప్పుడు ఇలా పాతకాలపు రైల్వే పోర్టర్ అవతారం ఎత్తుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎర్ర చొక్కా, తువ్వాలు తలపాగా, జబ్బకి తాయత్తులాంటి ఐ.డి. బిళ్ల – ఇవే తక్కువ! ఇంధనం టాంకులు సగానికి రావడంతో, పంచమం మీద గురుత్వం తక్కువ కావడంతో అంత భారీ శ్వేతకేతు బరువు కూడా రెండొందల కిలోలకి దిగింది. అందరం తలా చెయ్యి వేసి దాన్ని పైకెత్తాం. ఈ సందర్భంలో మా ప్రొఫెసర్ వల్ల మాకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది అనుకోండి. అది వేరే విషయం.
ఎలాగో రొప్పుతూ, రోజుతూ ఇంచుమించు రెండు కిమీలు నడిచి శ్వేతకేతుని మా రాజహంసకి దగ్గరగా దింపాం. ఆ కుదుపుకి అయినా శ్వేతకేతులో పాపాయిల్లా నిద్రపోతున్న వాళ్లంతా ఉలిక్కిపడి లేచి చూస్తారనుకున్నాం. కాని అలాంటిదేం జరగలేదు.
కెప్టెన్ వర్ధమాన మా నౌక నుండి రీ ఫ్యూయెలింగ్ కి పైప్ తెచ్చాడు. కాలేజి రోజుల తరువాత మళ్లీ ఎప్పుడూ ఇంత చక్కటి వెధవ పని చేసే అవకాశమే రాలేదు. నాకైతే ఇదంతా భలే థ్రిల్లింగా ఉంది.
“ఐదు నిముషాల్లో వాళ్ల టాంక్ ఖాళీ అవుతుంది. ఇక చచ్చినట్టు కాళ్లబేరానికొస్తారు” గౌరంగ్ కసిగా అన్నాడు.
అలా మేం తలపెట్టిన ఘనకార్యం విజయవంతంగా పూర్తిచేశాం.
తన ఆలోచనలని పొల్లు పోకుండా నిజం చేసిన తన సమర్ధవంతమైన బృందం కేసి ప్రొఫెసర్ ఓ సారి గర్వంగా చుసి,
“భేష్!” అన్నడు. “ఇక ఇక్కడ మన పని పూర్తయినట్టే. పదండి నౌక లోకి పోదాం.”
అందరం కంట్రోల్ రూమ్ లోకి పట్టినంత మేరకు మూగాం. ప్రొఫెసర్ రేడియో ముందు కుర్చుని అవతలి నౌకకి ’ఎమర్జెన్సీ’ సందేశం పంపాడు. ఇక పొగపెట్టిన తుట్టలో తేనెటీగల్లా ఏ క్షణానైనా అవతలి నౌకలోని సభ్యులంతా బయటికి ఉరకాలి.
ఇంతలో కంట్రోల్ రూమ్ లో టీవీ స్క్రీన్ ఉలిక్కిపడి మేలుకుంది. అభినవ్ వర్మ ముఖం ప్రత్యక్షమయ్యింది. భయపడినట్టున్నాడు పాపం.
“అయ్యా! ప్రొఫెసర్ గారూ! ఏంటీ గొడవ” ఆదుర్దాగా అడిగాడు.
“పెద్దగా ఏం లేదు. ఓ సారి మీ ఫ్యూయెల్ గేజ్ ల కేసి చూసుకోండి.” అన్నాడు ప్రొఫెసర్. (పెద్దాయన అసాధ్యుడు సుమండీ!)
“ఎలా జరిగిందిది?” కొంచెం కోపంగా అన్నాడు వర్మ. “ఇందులో మీ ప్రయేయం ఏం లేదుగద?”
“ఇలా దయచేస్తే అంతా సావధానంగా మాట్లాడుకుందాం. మేం ఇప్పుడు ఆట్టే దూరంలో లేం లేండి!”
“ఇదుగో వస్తున్నా. ఇప్పుడే అటో ఇటో తేల్చుకుంటా!” కోపంగా ప్రసారం ఆఫ్ చేస్తూ అన్నాడు వర్మ.
(సశేషం...)
సన్నాహాలన్నీ పూర్యయ్యాయి. ఇక ఇంటికి బయలుదేరడమే ఆలస్యం. మేం తెచ్చిన సామగ్రి అంతా సరిగ్గా ఉందో లేదో ఆఖరి సారిగా ఓ సారి సరిచూశాను. అప్పుడు తెలిసింది. మేం తెచ్చిన ఫిల్ప్ రోల్స్ లో ఆరు తక్కువయ్యాయి.
ఆ ఫిల్మ్ రోల్స్ లో కళాలయంలో తీసిన ఫోటోలు ఉన్నాయి. ఎక్కడ పోయుంటాయబ్బా? కాసేపు ఆలోచించాను. కళాయలంలో గుర్తుగా ఒక అరుగు మీద పెట్టాను తరువాత తీసుకెళ్దామని.
బయల్దేరడానికి ఇంకా చాలా సేపే ఉంది. ప్రొఫెసరు, తిరుమల రావు నిద్రపోతున్నారు. ఒక సారి మళ్లీ కళాలయానికి వెళ్లి ఫిల్మ్ కోసం వెతకాలి. ఎక్కడ పెట్టానో తెలుసు కనుక గాలించడం పెద్ద కష్టం కాదు. చప్పున బయలుదేరితే అరగంటలో తిరిగొచ్చేయొచ్చు.
కళాలయంలో మేం ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైటు పనిచెయ్యడం లేదు. కనుక టార్చిలైటు మీదే ఆధారపడాల్సి వచ్చింది. తాడు మీద ఆధారపడకుండా ఏకంగా పైనుండి దూకేశాను. ఎండుటాకులా తేలుకుంటూ నెమ్మదిగా కిందకి దిగాను. పది నిముషాల్లో పోయిన ఫిల్మ్ లని తిరిగి వశం చేసుకోగలిగాను.
నన్ను అంతగా ఆకట్టుకున్న ’దూత’కి చివరి సారిగా వీడ్కోలు చెప్పాలనిపించింది. ఆ మానవేతర కళాఖండాన్ని మళ్లీ ఎప్పుడు చుస్తానో ఏమో? కాని ఆ గదిలోకి వెళ్లి చూడగా ఒక్కసారి నా ఊపిరి ఆగినంత పనయ్యింది. ఆ శిల్పం ఉండాల్సిన చోటు ఖాళీగా ఉంది!
వెంటనే మా నౌకకి తిరిగెళ్లి ప్రొఫెసర్ ని లేపి జరిగింది చెప్పాను. ఆయనకి దెబ్బకి మత్తు వొదిలిపోయినట్టుంది. పళ్లు పటపట కొరుకుతూ అభినవ్ వర్మ గురించి అతడి నేస్తాల గురించి ఏదో అన్నాడు. ఆయనకి ఈ ’పరిభాష’ కూడా బాగా తెలుసని అప్పుడే తెలిసింది.
“నాకు అర్థం కానిదేంటంటే, అంత పెద్ద వస్తువుని అసలు ఎలా బయటికి తెచ్చారు? తెచ్చినా మనకి కనిపించకుండా ఎలా తెచ్చారు?” కాప్టెన్ వర్ధమాన్ ఉద్వేగంగా అడిగాడు.
“దాచాలనుకుంటే ఎన్నో రహస్య స్థలాలు ఉన్నాయి. మనం ఎవ్వరూ లేని సమయంలో అదను చూసి బయటికి తీసి ఉంటారు. ఎంత గురుత్వం తక్కువ ఉన్నా, అంత పెద్ద వస్తువుని బయటికి తీయడం మాటలేం కాదు,” రాకేష్ ప్రత్యర్థిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
“ఏదో ఏడ్చారులే!” ప్రొఫెసర్ కి చిర్రెత్తినట్టుంది. “తక్షణ కర్తవ్యం ఆలోచించండి. మనకి ఇంకా ఐదు గంటల సమయం ఉంది. అంత లోపల వాళ్లు బయలుదేరలేరు. గానిమీడ్ ని ఇప్పుడే దాటాం. కనుక వెంటనే బయలుదేరడం శ్రేయస్కరం కాదు, అంతేనా కెప్టెన్?”
“అవునవును” తలూపాడు కెప్టెన్ వర్ధమాన్. “కక్ష్య మార్పిడి చేసుకోవాలంటే జూపిటర్ కి అవతలి వైపుకి వెళ్లాలి. అలా కక్ష్య మారితేనే ఇంధనం కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది.”
“మంచిది. మనకి కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఏం చేస్తే బావుంటుందంటారు?” అందర్నీ ఓ సారి కలయజూస్తూ అడిగాడు ప్రొఫెసర్.
ఆ సందర్భంలో మేం చేసిన పని గురించి తరువాత సింహావలోకనం చేసుకుంటే అది చాలా అమానుషంగా, అనాగరికంగా, మోటుగా అనిపిస్తుంది. ఏం చేస్తాం? మా పరిస్థితి అలాంటిది. అంత కష్టపడి మేం సాధించిన దాన్ని ఆఖరి నిముషంలో ఎవరో గద్దలా తన్నుకుపోవడం సహించలేకపోయాం. అలాంటి నిస్సహాయ స్థితిలో ఇక వేరే గత్యంతరం కనిపించలేదు. మానవ లోకానికి, భూమికి దూరంగా న్యాయం, చట్టం లేని ఆ శూన్యసీమలో ఇక మేమే మా సొంత చట్టాన్ని రూపొందించుకోక తప్పింది కాదు.
వరుసగా ఎవరికి తట్టిన ఆలోచన వాళ్ళు చెప్పుకొచ్చారు.
“వాళ్ల రాకెట్ బూస్టర్లని ధ్వంసం చేస్తే,” అన్నాడు శేషు తన ఆలోచనకి తానే మురిసిపోతూ.
కెప్టెన్ వర్ధమాన్ ఈ ఆలోచన బొత్తిగా నచ్చలేదు.
“అలాంటి అఘాయిత్యానికి పాల్పడడం నాకు ఇష్టం లేదు. పైగా కెప్టెన్ నిత్యానంద్ నాకు మంచి స్నేహితుడు. అలా చేస్తే ఇక ఛస్తే నన్ను క్షమించడు. అంతేకాక ఆ నౌకని వాళ్లు తిరిగి రిపెయిర్ చేసుకోలేకపోతే వాళ్ల ప్రాణాలకే ముప్పు.”
“పోనీ ఇంధనం కొట్టేస్తే?” ఇది గౌరంగ్ ఆలోచన. “అందరూ పడుకుని ఉంటారు. ఇదే మంచి అదను.”
“బంగారం లాంటి ఆలోచన,” నాకైతే తెగ నచ్చింది. “కాని మన రెండు నౌకల మధ్య రెండు కిమీల దూరం వుంది. మన పైపు పొడవు కేవలం నూరు మీటర్లే!” అంత చక్కని అంతలోనే ఆవిరైనందుకు నిట్టూర్చాను.
కాని అప్పుడు ఎవరికి వచ్చిందో గుర్తులేదు గాని మెరుపు లాంటి ఆలోచన. అసంభవాన్ని సంభవం చేసే ఆలోచన. దాని ఆచరణకి ఏ అధునాతన పరికరాలూ అక్కర్లేదు.కండలు తిరిగిన నలుగురు కూలీలు ఉంటే చాలు.
(సశేషం...)
ప్రొఫెసర్ చెప్పినట్టే అందరం పన్లోకి దిగాం. కొత్త బృందంలో ప్రతి ఒక్కరికి మాలో ఒకరు గైడు గా కుదిరారు. మరి అదెలా జరిగిందో ఎమో గాని అమేయకి నన్ను గైడుగా వేశారు. (అయితే అందులో నా మానవ ప్రయత్నం కూడా కొంత ఉందనుకోండి!) దొరికిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ముందు ఆ అమ్మాయిని కళాలయానికి తీసుకెళ్ళాను, నేను కొత్తగా కనుక్కున్న దేవ రహస్యాన్ని చూపించి తనని మెప్పిద్దామని.
ఆ శిల్పం మీద నేను టార్చిలైటు వేసి పట్టుకుంటే అమేయ దాని కేసి ఎంతో సేపు తదేకంగా, ఆరాధనగా చూసింది.
“అద్భుతం!” అంది నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. “ఇన్ని మిలియన్ల సంవత్సరాల పాటు ఈ కళాఖండం ఇక్కడ ఈ చీకట్లో ఇలా వేచి ఉండడం మహాద్భుతం! దీనికి ఏదైనా మంచి పేరు పెట్టాలి.”
“నేను ఎప్పుడో పెట్టేశా. దీని పేరు ’దూత’.”
“ఎందుకలా?”
“ఎందుకంటే ఈ శిల్పం వారి సంస్కృతి నుండి మనకో సందేశాన్ని ఇస్తోంది. ఏదో ఒకరోజు ఎవరో వచ్చి దీన్ని కనుక్కుంటారని దీన్ని నిర్మించిన వారికి తెలిసే ఉంటుంది.”
“అవును. మీరు చెప్పింది బానే ఉంది. దూత – భలే పేరు పెట్టారే. కాని చూస్తుంటే దాని ముఖంలో ఏదో విచారం మీకు స్పష్టంగా కనిపించడం లేదూ?”
ఈ అమ్మాయెవరో చాలా తెలివైన పిల్లలా ఉంది. లేకపోతే సరిగ్గా నేను ఆలోచించినట్టే తనూ ఎలా ఆలోచిస్తోంది? నేను చూపించిన ప్రతీ వస్తువు మీద చాలా ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యంగా ’దూత’ దగ్గరికి మళ్లీ మళ్లీ వచ్చి, గుచ్చి గుచ్చి చూసింది.
ఆ మర్నాడు వర్మని కూడా తీసుకొచ్చి చూపించాను. అప్పుడు అమేయ అడిగింది:
“కిరీటి గారు! ఈ శిల్పాన్ని భూమికి తీసుకెళ్లి అక్కడ అందరికీ చూపిస్తే గొప్ప సంచనలం కలిగిస్తుంది. ఏమంటారు?”
నేను నిట్టూర్చాను.
“ప్రొఫెసర్ కి కూడా అదే ఆలోచన ఉంది. కాని దీని బరువు ఓ టన్ను ఉంటుందేమో. మాకు ఇంధనం సరిపోదు. దీనికి ప్రత్యేకించి మరో యాత్ర ఏర్పాటు చెయ్యాలి.”
“కాని ఇక్కడ వస్తువులకి అసలు బరువే ఉన్నట్టు లేదే?” నాకేసి విస్మయంగా చూసి అడిగింది.
“అది వేరు.” ఈ అమ్మాయికి నా సైన్సు ప్రతాపం ప్రదర్శించే అవకాశం దొరికింది. “బరువు వేరు, జడత్వం వేరు. ఈ జడత్వం ఉందే ... సరే వదిలేయండి. ఇప్పుడు న్యూటన్ గతినియమాలు , గురుత్వాకర్షణ సిద్ధాంతం ... చెప్పాలంటే చాలా పురాణం ఉంది. దీన్ని తీసుకెళ్లలేం అంతే. కాప్టెన్ వర్ధమాన్ ఎప్పుడో కచ్చితంగా చెప్పేశాడు.”
“అయ్యో, అలాగా?” బాధగా అంది అమేయ.
మేం బయలుదేరడానికి ముందు రోజు వరకు ఈ సంభాషణని పూర్తిగా మర్చిపోయాను. తిరిగి వెళ్లే సన్నాహంలో ఉన్నాం అందరం. మేం తెచ్చిన ఫోటో ఫిల్మ్ అంతా వాడేశాం.
"ఇలాంటప్పుడు ఆ పాము మనుషుల్లో ఒకడు నిజంగా నడిచొస్తే ఫోటో తీసేదెలా?” తిరుమల రావు సందేహం వెలిబుచ్చాడు. సమస్యని ఎప్పుడూ కొత్త కొత్త కోణాల నుండి చూడడం తిరుమల రావుకి అలవాటు. ఎంతైనా ప్రొఫెసర్ సెక్రటరీ కదా.
అభినవ్ వర్మ నౌక (దీని పేరు... అదేం పేరండీ బాబు... ’శ్వేతకేతు’ ట, రాక్షసుల పేరులా లేదూ?) కూడా సరిగ్గా మేం బయలుదేరినప్పుడే బయలుదేరాలని ప్రొఫెసర్ ఒప్పందం చేసుకున్నాడు. మేము లేని సమయంలో ఆ వర్మ మర్మంగా ఏవైనా చేస్తాడేమోనని భయం.
సన్నాహాలన్నీ పూర్యయ్యాయి. ఇక ఇంటికి బయలుదేరడమే ఆలస్యం. మేం తెచ్చిన సామగ్రి అంతా సరిగ్గా ఉందో లేదో ఆఖరి సారిగా ఓ సారి సరిచూశాను. అప్పుడు తెలిసింది. మేం తెచ్చిన ఆరు ఫిల్ప్ రోల్స్ లో ఒకటి తక్కువయ్యింది.
(సశేషం...)
ఆలోచన బాగానే వుంది. కాని బోలెడు కొత్త తంటాలు తెచ్చి పెట్టింది. ప్రొఫెసర్ కి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టేలా ఉంది...
అంతలో అల్లంత దూరంలో ముగ్ధలా ఈ వ్యవహారంతో సంబంధం లేనట్టు నించున్న మిస్. అమేయ కంట పడింది. చీకాకులన్నీ కాకులై ఎగిరిపోయాయి. ఏ తంటాలూ లేకుండానే మనిషి చంద్రమండలం మీద పాదం మోపాడా? ఏ తలనొప్పులూ లేకుండానే సౌరమండలాన్ని జయించాడా?
అయినా నాకు ఆనందాన్నిచ్చే కారణాలు మా ప్రొఫెసర్ కి కూడా ఆనందదాయకం కావాలని లేదు. పంచమం యొక్క మూలరహస్యాన్ని ముందు ఎవరు కనుక్కున్నారు? ప్రథమత్వం ఎవరిది? అన్న విషయంలో పేచీ రాక తప్పేలాలేదు. చూడబోతే ఈ అభినవ్ వర్మ తన అసలు లక్ష్యాన్ని వొదిలిపెట్టి, ఆఫోటోలేవో ఇక్కడే తీసేసి, ఉన్నపళంగా తుర్రుమని భూమికి ఎగిరెళ్లి తనే విజేతనని చాటుకునేలా ఉన్నాడు. అతణ్ణి ఆపే హక్కు మాకు లేదు. ఇక్కడ మా శోధనని తీరుబాటుగా పూర్తిచేసుకున్నాకనే భూమికి తిరిగెళ్లాలని మా ఆలోచన. మా ప్రొఫెసర్ కి అసలే లౌక్యం తెలీదు. ఏం గొడవ జరుగుతుందో ఏమో?
కాని అనుకున్నట్టుగా గొడవేం జరగలేదు. మా ప్రొఫెసర్ కి ఒక చక్కని ఆలోచన వచ్చింది (ఇలాంటప్పుడే ఆయన నాకు తెగ నచ్చేస్తాడు!) అభినవ్ వర్మ బృందంలో ఒక్కొక్కరికి మా బృందంలో ఒకరిని తోడుగా పంపించి పంచమాన్ని వివరంగా చూపించి రమ్మన్నాడు. పైగా ఇప్పుడు సిబ్బంది సంఖ్య పెరిగింది కనుక మా అధ్యయనాలు కూడా మరింత వేగంగా పూర్తిచేసుకొవచ్చు. ప్రొఫెసర్ మమ్మల్ని పిలిచి తన ఆలోచన చెప్పాడు.
“మన రెండు బృందాలు కలిసి పని చేస్తే ఇరు పక్షాలకి మంచిదని అనిపిస్తోంది,” మాటల్లో ఆదుర్దా కనిపిస్తోంది. “మన అతిథులని ఎక్కడికైనా పోనివ్వండి, ఎన్ని ఫోటోలైన తీసుకెళ్ల నివ్వండి. కాని ఇక్కణ్ణుంచి ఏమీ తీసుకెళ్లకుండా మత్రం జాగ్రత్తగా చూడండి. ఈ సాక్ష్యాలతో మనకన్నా ముందు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భూమిని చేరకూడదు.”
“కాని వాళ్లని ఆపడానికి మనకేం హక్కుంది?” తిరుమల రావు అసహనంగా అడిగాడు.
“ఇలా చెయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు గాని ఇప్పుడు చెయ్యక తప్పలేదు... పంచమం మీద మనకి ప్రత్యేక హక్కులు కావాలని కోరుతూ నిన్న రాత్రే గానిమీడ్ కి సందేశం పంపాను. ఈ పాటికే ఆ సందేశం ’ద హేగ్’ కి చేరుకుని ఉంటుంది.”
“కాని ఒక ఉపగ్రహం మొత్తం ఎవరూ సొంతం చేసుకోలేరుగా? మన చంద్రుడి విషయంలో కూడా గత శతాబ్దంలో ఇలాంటి పేచీయే వచ్చింది. ఆ సందర్భంలో అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సు చేసిన తీర్మానం మనందరికీ తెలిసిందే.”
“దీన్ని ఒక ఉపగ్రహంలా పరిగణిస్తే నువ్వు చెప్పింది నిజమే. కాని ఇది కాదు కద! ఒక పాడైపోయిన వ్యోమనౌక నుండి పనికొచ్చే సామగ్రిని వెలికితీస్తున్నాం. అందుకు అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సు నుండి ప్రత్యేక హక్కులు సంపదిస్తున్నాం. ఆ వర్మ తన అతితెలివి ఉపయోగించి ఏదో పిచ్చి పని చేసే లోపు ఈ విషయాన్ని రేపే వర్మకి వివరిస్తాను. ” ప్రొఫెసర్ తన పన్నాగం బయటపెట్టాడు. మా ప్రొఫెసర్ కి ఇలాంటి తెలివితేటలు కూడా ఉన్నాయని నాకు అప్పుడే తెలిసింది.
(సశేషం...)
ఈ రెండవ వ్యోమనౌక కొన్ని కిమీల దూరంలో దిగింది. దూరం నుండి చూస్తే అచ్చం మా నౌక లాగానే ఉంది. వీలైనంత వేగంగా అడుగులేసి, మా నౌక ఎయిర్లాక్ లోంచి మా నౌక లోకి ప్రవేశించాం. అక్కడ మా ప్రొఫెసర్ అప్పటికే ఎవరో ముగ్గురు కొత్తవాళ్లతో మాట్లాడుతున్నాడు. ఈ లోకం కాని లోకంలో వీళ్లెక్కడి నుండి దాపురించారు? అని తిట్టుకోబోతూ ఆగాను. వాళ్లలో ఒక పిల్ల కూడా ఉందని, ఆమె సామాన్యమైన ఆడపిల్ల కాదని, ఈ నిస్సార జగత్తుకి వన్నె తెచ్చే కన్నె అని ఇట్టే అర్థం చేసుకున్నాను.
ప్రొఫెసర్ ఆ అనుకోని అతిథులని మాకు పరిచయం చేశాడు.
“ఈయన పేరు అభినవ వర్మ. సైన్సు రచయిత. మీరంతా ఈయన గురించి వినే ఉంటారు. ఇక వీళ్లద్దరూ...” అని ఆగి, అభినవ వర్మతోనే “ఇంతకీ వీళ్ల పేళ్లు ఏమన్నారూ?” అన్నాడు.
“ఇతను మా పైలట్ కెప్టెన్ నిత్యానంద్. ఈమె నా సెక్రటరీ ... “
పేరు చెప్పబోతూ ఒక్క క్షణం ఆగాడు. ఆ ఒక్క క్షణంలో ఎన్ని జరిగాయనుకున్నరు? ఉద్విగ్నతకి తట్టుకోలేక నా గుండె వేగం పెరిగింది, ఒంట్లో అడ్రెనలిన్ పరవళ్లు తొక్కింది, ముఖాన ముచ్చెమటలు పోశాయి. గుండెలో X-నాగరికతకి చెందిన కొండంతవి కోటి వాయిద్యాలేవో ఒక్క సారి మీటినట్టయ్యింది. నాలో అంత వేగంగా వస్తున్న పరిణామాలని ఇట్టే పట్టేసిన శేషు నా కేసి కొరకొర చూశాడు. ఆ చూపులో “నువ్వేం ఆలోచిస్తున్నావో అర్థమయ్యింది రా! (ఎందుకంటే నేను కూడా సరిగ్గా అలాగే ఆలోచిస్తున్నా కనక!) అసలు నువ్వు నా స్నేహితుడివని చెప్పుకోడానికే సిగ్గేస్తోంది,” అన్న భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
“...అమేయ.” ఇద్దర్నీ పరిచయం చేశాడు అభినవ్ వర్మ.
అభినవ్ వర్మ చూడబోతే చాలా సరదా మనిషిలా కనిపించాడు. కాని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆ కలుపుగోరుతనం అంతా తెచ్చిపెట్టుకున్నదేమో ననిపిస్తుంది. ఆ మాత్రం కలుపుగోరుతనం లేకపోతే రచయితల, కళాకారుల ప్రపంచంలో
బతకడం కష్టం కాబోలు.
“ఉన్నట్లుండి మమ్మల్ని ఇక్కడ చూసి అదిరిపోయారు కదూ?” నా వీపు మీద ఉత్సాహంగా చరుస్తూ అన్నాడు అభినవ్ వర్మ. స్పేస్ సూట్ ఇంకా తియ్యలేదు కనుక తమాయించుకున్నాను. “అయినా నాకు మాత్రం ఏం తెలుసు ఈ మారుమూల ఉపగ్రహంలో, ఇదే సమయంలో ఇంత మంది ఊడిపడతారని?”
“ఇంతకీ మీరు ఏం పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా?” ప్రొఫెసర్ అసిస్టెంటు తిరుమల రావ్ ఉండలేక అడిగేశాడు.
“అదే ఇంత సేపు మీ ప్రొఫెసర్ గారికి వివరిస్తున్నా” అంటూ తన సెక్రటరీ కేసి తిరిగి, “అమేయా! ఆ పైలు ఓ సారి ఇలా ఇవ్వమ్మా.”
అందులో అద్భుతంగా వేయబడ్డ, ఖగోళానికి చెందిన తైల వర్ణ చిత్రాలు ఉన్నాయి. గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, ఉల్కాబిలాలు వగైరాలు.
“ఇలాంటి చిత్రాలు మీరు చాలానే చూసి ఉంటారు. కాని వీటికి ఓ ప్రత్యేకత ఉంది. వందేళ్ల నాటి చిత్రాలివి. పృథ్వీ సింగ్ అనే చిత్రకారుడు వేసినవివి. 1944 లో ’లైఫ్’ పత్రికలో ఇవి అచ్చయ్యాయి. అంటే రాకెట్ యుగం ఇంకా ఆరంభం కాక ముందు అన్నమాట. మరి ఆ కళాకారుడు ఇవన్నీ ఎలా ఊహించాడు? ఆ చిత్రాలలో కనిపించే దృశ్యాలకి సంబంధించిన వాస్తవ లోకాలు మన సౌరమండలంలో ఎక్కడైనా ఉన్నాయేమో చూసి రమ్మని ఆ పత్రిక యాజమాన్యం నన్ను పంపింది. లైఫ్ పత్రిక త్వరలోనే శతవార్షికోత్సవం జరుపుకోనుంది. ఆ సంచికలో నేను కనుక్కోబోయే లోకాల ఫోటోలు ప్రచురించాలని యాజమాన్యం ఆలోచన. చాలా గొప్ప ఆలొచన కదూ?”
(సశేషం...)
పంచమంలో పర్యటిస్తున్న కొద్ది దాన్ని సృష్టించిన జాతి మీద మా గౌరవం పెరగ సాగింది. ఐదు మిలియన్ సంవత్సరాల పాటు నిక్షేపంలా ఉన్న వాళ్ల సంస్కృతికి చెందిన జ్ఞాపికలని మేం మొట్టమొదటి సారిగా స్పృశిస్తున్నాం. వాళ్లు మరో తారామండలం నుండి వచ్చిన వాళ్లే కావచ్చు. కొండంత కాయం వున్న మహాకాయులే కావచ్చు. కాని వారికి మన మానవజాతికి మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. వాళ్లని కలుసుకునే మహాభాగ్యం, విశ్వవ్యవధుల ప్రమాణాలతో పోల్చితే, తృటిలో తప్పిపోవడం బాధకలిగిస్తుంది.
కాని మామూలుగా పురావస్తు పరిశోధకులు ఎదుర్కునే ఇబ్బందులు మాకు ఎదురు కాకపోవడం ఒక విధంగా మా అదృష్టమే అని చెప్పాలి. ఇంతకాలం అక్కడి శుద్ధ శూన్యంలో ఆ వస్తువులన్నీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. నౌక యొక్క ఉపరిభాగాలలో ఉన్న వస్తువులన్నీ ఆ జాతివాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండేవో అచ్చం అలాగే ఉన్నట్టు ఉన్నాయి. బహుశ వారి స్వగ్రహానికి, స్వగృహానికి గుర్తుగా ఈ వస్తువులన్నీ ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, పదిలంగా భద్రపరచుకున్నారేమో. అందుకే అక్కడ ఫోటోలు తీస్తున్నప్పుడు కూడా ఒక పక్క ఏదో అపరాధ భావం మనసులో పీకుతూ ఉండేది. అంతేకాక మా దుడుకు పనులని చూసి ఒళ్లు మండి ఏ లోకోత్తర జీవులో భళ్లున ఆ లోహపు గోడలలోంచి ఊడి పడి మాకు తగిన శాస్తి చేస్తారేమో నని ఒకపక్క భయంగా కూడా ఉండేది.
నాలుగో రోజు మా పంట పండింది. నౌక యొక్క దక్షిణ గోళార్థంలో గాలిస్తున్న కాప్టెన్ వర్ధమాన్, గౌరంగ్ లు ఓ ’కళావస్తు ప్రదర్శనశాల’ ని కనుక్కున్నారు. దాని అసలు పేరేంటో తెలీదు గాని మాకు మాత్రం అది అలాగే అనిపించింది. ఇతర భవనాల లాగానే ఇది కూడా చాలా పెద్దది. లోహంతో చేసినదే అయినా మిగతా భవనాలలాగా కఠినంగా, కర్కశంగా లేదు. ఇదేమైనా ఆలయమా? బార్హస్పతేయులకి ఒక మతం లాంటిది ఉంటే ఎలా ఉంటుందో? అది కళానిలయమో, ఆలయమో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అందుకే ’కళాలయం’ అన్న పేరే దానికి సార్థకం చేసేశాం!
అలా ఆ భవనాన్ని కలయదిరుగుతూ ఉంటే ఒక చోట ఒక చిన్న వృత్తాకారపు గది కనిపించింది. ఆ గది వద్ద ఆరు వేరు వేరు సొరంగ మార్గాలు కలుస్తున్నట్టుగా ఉంది. గోడల మీద ఏదో లిపి లోతుగా చెక్కబడి ఉంది. నా టార్చిలైటు కాంతిని గోడల మీద ప్రసరిస్తూ అక్షరాలని అనుసరిస్తూ ముందుకి సాగాను. అప్పుడు కనిపించిందది. ఓ నిలువెత్తు శిల్పం. మొట్టమొదటి సారిగా ఓ గొప్ప కళాఖండాన్ని చూసినప్పుడు ఆ దృశ్యం మనసు మీద వేసిన ముద్రని జ్ఞాపకం తెచ్చుకోవడం కష్టం. అదొక అపురూపమైన అనుభవం. బార్హస్పతేయులు ఎలా ఉంటారో మొట్టమొదటి సారిగా ఆ శిల్పాన్ని చూశాకే తెలిసింది. సరీసృపంలా పొడవైన, నాజూకైన శరీరం. దాని లోతైన కళ్లు నా అంతర్యాన్ని తడుముతున్నట్టు ఉన్నాయి. దాని ముఖంలో గాని, శరీరంలో గాని ఎక్కడా మానవాకృతి కనిపించడం లేదు. దాని నాలుగు చేతుల్లో రెండు చేతులు దాని చాతీ మీద ఒకదాన్నొకటి పెనవేసుకుని ఉన్నాయి. మిగతా రెండు చేతుల్లో ఏవో సాధనాలు – ఆయుధాలేమో – ఉన్నాయి. నేను చూస్తున్నది ఏదో అపరిచిత జీవి శిల్పమే కావచ్చు, కాని దాని ముఖకవళికలలో తొంగి చూస్తున్న భావావేశం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ప్రజ్ఞ ఉంది, గొప్ప బలంతో, అధికారంతో వచ్చే గాంభీర్యం, రాజసం ఉంది. కాని ఎందుచేతనో విచారం కూడా స్పురించింది. అంత శ్రమ పడి, అంత సృష్టి చేశాక అదంతా వృధాగా వదిలేయాల్సి వస్తుందని విచారమేమో! అందుకేనేమో, మా ప్రొఫెసర్ ఒక సారి వీళ్ల గురించి “మానవత్వం గల మానవేతరులు” అని వర్ణించారు.
ఆ భవనంలో మొత్తం పది నుండి ఇరవై మిలియన్ల కళా వస్తువులు ప్రదర్శించబడ్డాయి. కాని బార్హస్పతేయుల రూపాన్ని తెలిపే శిల్పం అక్కడ ఒక్కటే ఉండడం ఆశ్చర్యం కలిగించింది. వాళ్ల వ్యక్తిగత రూపాలని శిల్పాలుగా ప్రదర్శించుకోవడం గురించి వాళ్లలో ఏదైనా నీషేధం ఉందా? అంత అధునాతన జాతిలో కూడా అలాంటి నిషేధాలు, నమ్మకాలు ఉంటాయా? ఏమో? ఆ గోడల మీద లిపిని అర్థం చేసుకోగలిగితే రహస్యం విడుతుందేమో....
నా మనసు నిండా కోటి ఆలోచనలు హోరు పెడుతున్నాయి.
కొద్ది నిముషాల తరువాత మా మిత్రులతో కలిసి నౌక వద్దకి బయలుదేరాను. ఆ శిల్పం గురించి మా ప్రొఫెసర్ కి పూస గుచ్చినట్టు చెప్పాలి. ’ద్వారం’ లోంచి అందరం బయటపడ్డాం. లోపల ఇందాక చూసిన కళావస్తుప్రదర్శన శాల మాత్రమే కాదు అసలు ఈ లోకమే ఓ కళాఖండం అనిపించేలా ఉంది బయట దృశ్యం. రగిలే జూపిటర్ ముఖం విరజిమ్మే బంగరు తేజం విశాలంగా విస్తరించిన లోహపు మైదానం మీద లాస్యం చేస్తోంది. అంతులేని రోదసిలో మౌనంగా మెరుస్తున్న తారకల కింద, తడిలేని పసిడి వానలో తడుస్తూ, ఆ ప్రశాంత రజనీ దృశ్యాన్ని కాసేపు ఆస్వాదించాం.
అంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ శేషు గొంతు రేడియోలో వినిపించింది.
“ఏయ్! అదేంటి ప్రొఫెసర్ నౌక స్థానాన్ని మార్చేశాడా?”
“నౌక స్థానాన్ని మార్చడం ఏవిటి? నాన్సెన్స్. అది ఎక్కడ ఉండేదో అక్కడే ఉంది,” కాస్త విసుగ్గా అన్నాను.
తల తిప్పి చూస్తే శేషు అలా పొరబడడానికి కారణం ఏంటో అర్థమయ్యింది. అల్లంత దూరంలో మరో నౌక కనిపించింది.
మాకు అతిథులొచ్చారు.
(సశేషం)
అరవడం అయితే అరిచేశా గాని మరీ అంత దద్దమ్మలా ఎలా మాట్లాడానా అని సిగ్గేసింది. తక్కిన వాళ్ల స్పందన ఎలా ఉందోనని ఓ సారి అటు ఇటు చూశాను. ఒక్క నిముషం అంతా నిశ్శబ్దం. అప్పుడిక గొడవ మొదలయ్యింది. అవునని కాదని అంతా వాదనలోకి దిగారు. ఈ వాదనని మొగ్గలోనే తెంపేస్తూ ప్రొఫెసర్ ఇలా అన్నాడు:
“కిరీటి చెప్పింది నిజం. X-నాగరికతని మన సౌరమండలానికి తెచ్చిన వ్యోమనౌక ఇదే.”
అది విని రాకేష్ అనుకుంటా, కెవ్వున అరిచినంత పని చేశాడు.
“ఏంటి మీరనేది! ముప్పై కిలోమీటర్ల వ్యాసం గల నౌకా?”
“ఆశ్చర్యం ఏవుంది రాకేష్. ఇంజినీరువి. ఓసారి నువ్వే ఆలోచించు,” తొణకకుండా తర్కం చెప్పుకొచ్చాడు ప్రొఫెసర్.
“ఉదాహరణకి ఓ నాగరికత బృహత్తరమైన తారాంతర రోదసిని దాటి ఇతర నాగరికతల కోసం అన్వేషిస్తూ పోవలని అనుకుంది అనుకుందాం. ఇంతకు మించి దానికి వేరే దారేముంటుంది? ఒక చిన్న సైజు గ్రహం లాంటి నౌకని నిర్మించుకుంటుంది. అలాంటి నౌకని నిర్మించడానికి కొన్ని శతాబ్దాలు పట్టొచ్చుగాక. కాని ఆ నౌక స్వయంసంపూర్ణంగా ఉండాలి. అందులో జీవులు తరాల తరబడి ఏ బాహ్యమైన ఆసరా లేకుండా జీవిక సాగించగలగాలి. అలాంటి లక్షణాలు గల నౌక ఈ మాత్రం పరిమాణంలో ఉండాలి. మన సూర్యుణ్ణి సమీపించక ముందు మరెన్ని సూర్యుల వద్ద మజిలీలు చేశారో ఏమో? ఒక తారామండలం లోకి ప్రవేశించాక ఇరుగుపొరుగు గ్రహాలని సందర్శించడానికి కాస్త చిన్న నౌకలు కూడా నిర్మించుకుని ఉంటారు. అలా స్థానికంగా పర్యటిస్తున్న సమయంలో మాతృనౌకని ఎక్కడో ఒక దగ్గర స్థిరంగా ఉంచాలి. కనుక ఇక్కడ దాన్ని నిలిపారు. మన సౌరమండలంలో ఇదే అతి పెద్ద గ్రహం అని గమనించారు. ఇక్కడ ఈ గ్రహం చుట్టూ స్థిర కక్ష్యలో భద్రంగా తిరుగుతూ ఉంటుంది. అదే సూర్యుడి చుట్టూ స్థిర కక్ష్యలో నిలిపితే ఇతర గ్రహాల గురుత్వ ప్రభావం వల్ల ఆ కక్ష్య చెదరిపోయే ప్రమాదం ఉంది.”
“నిజం చెప్పండి ప్రొఫెసర్,” ఇంతలో ఎవరో అడిగారు. “మనం బయలుదేరక ముందే ఇదంతా మీరు ఊహించారా?”
“ఊహించలేదు గాని ఆశించాను. ఆధారాలన్ని ఈ దిశగానే సూచిస్తున్నాయి. ఈ పంచమం విషయంలో ఎప్పుడూ ఏదో విడ్డూరంగానే తోచేది. ఈ ఒక్క చిన్న ఉపగ్రహం మాత్రం జూపిటర్ కి అంత చేరువగా ఉండడం ఏంటి, ఇతర ఉపగ్రహాలన్నీ ఇందుకి డెబ్బై రెట్లు పైగా దూరంలో ఉండడం ఏంటి?” అంటూ ఉపన్యాసాన్ని కాస్త ఆపి, “సరే సరే ఇలా చర్చించుకుంటూ కూర్చుంటే అంతే. బోలెడు పనుంది. పదండి, పదండి” అంటూ తొందర చేశాడు.
“ప్రొఫెసర్ తలచుకుంటే పనికేం తక్కువ?” మనసులోనే అనుకున్నాను. “ఒక దేశం జనాభాకి ఓ అర్థశతాబ్ద కాలం పట్టేటంత హోం వర్కు ఇవ్వగలడు జాగ్రత్త!”
కాని ఆలోచించి చూస్తే నిజంగానే చాలా పనుంది. చరిత్రలోనే ఇది అత్యంత సంచలనాత్మకమైన, అమూల్యమైన పురావస్తు పరిశోధనా రహస్యం. ఓ మహత్తర విజ్ఞాన లోకపు ద్వారాల వద్ద ఏడు మందిమి – కేవలం ఏడు మందిమి – నిలిచి ఉన్నాం. మా కున్న కాస్త వనరులతో, వ్యవధితో ఈ లోకాన్ని, ఈ కృత్రిమ లోకాన్ని పై పైన తడిమి, చూచాయగా తెలుసుకోవడం తప్ప మేం చెయ్యగలిగిందేమీ లేదు. మా వెనుక దళాలు దళాలుగా పరిశోధకులు, పర్యాటకులు వచ్చి దశాబ్దాల పాటు దీన్ని శోధిస్తే గాని తరగని జ్ఞాన నిధులున్నాయి ఇందులో.
మేం మొట్టమొదట చెయ్యాల్సింది, నౌక నుండి వచ్చే విద్యుత్తు మీద పనిచేసే ఓ పవర్ లైటుని, ఓ తీగకి వేలాడదీసి నెమ్మదిగా కిందకి దింపాలి. ఆ దీపం చిందించే వెలుతురులో మెల్లగా ఉపగ్రహం (దీన్ని ఎందుకో వ్యోమనౌక అనబుద్ధి కావడం లేదు) లోతుల్లోకి చొచ్చుకుపోవాలి. అలాగే ఓ కిమీ పొడవున్న తీగకి ఓ లైటుని కట్టి కిందకి వదిలేం. గురుత్వం తక్కువ కనుక అది కిందపడి పగిలిపోతుందన్న భయం లేదు.
ఇది మా తొలి ప్రయత్నమే కనుక పై మూడు కవచాలని దాటి ఆట్టే దూరం పొలేక పోయాం గాని, మా తరువాత వచ్చిన వైజ్ఞానిక పరిశోధనా బృందాలు ఇంకా లోపలికి చొచ్చుకుపోయి ఆ నాగరికతకి చెందిన అద్భుతాలెన్నో కనుక్కున్నాయి.
మేం చూసిన పై పై భాగాలు ఆ జీవుల నివాసాలు కాబోలు. అసలు వాటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి ఓ జీవితకాలం పడుతుంది. పైన కవచాలలో అక్కడక్కడ ఉన్న గాజు గవాక్షాల లోంచి లోనికి ప్రవేశించే సూర్యకాంతే ఆ లోకపు లోతుల్లో కాంతులు కురిపించేదేమో. దట్టమైన మూడు కవచాల రక్షణలో ఉన్న ఆ అంతరంగంలో ఒకప్పుడు అనువైన వాతావరణం ఉండేదేమో. ఆ విధంగా ఆ బార్హస్పతేయులు (మరి బృహస్పతి చెంత నివాసం ఏర్పరుచుకున్న ఈ జీవులని ఇంత కన్నా ఎలా పిలవాలో అర్థం కాలేదు) వాళ్లు వచ్చిన తారా వ్యవస్థ సమీపంలో ఉండే పర్యావరణానికి సన్నిహితమైన పర్యావరణాన్ని ఇక్కడ కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నారేమో. వాళ్లకీ వానలు, వసంతాలు, సంజెకాంతులు, సరోవరాలు ఉండేవేమో. మరి ఎక్కణ్ణుంచి తెచ్చుకొచ్చారో గాని అక్కడ ఓ చిన్న పాటి సముద్రం కూడా ఉంది. మూడు కిమీల వెడల్పు ఉన్న ఆ చిట్టి కడలి మంచై ఘనీభవించింది. దాన్ని విద్యుద్విశ్లేషించి, ఉపరితలం మీదనున్న ’ద్వారాల’ని మూసేసి, పంచమం మీద మానవ నివాస యోగ్యమైన పర్యావరణాన్ని కల్పించాలని ఏవో పథకాలు కూడా జరుగుతున్నాయి.
(సశేషం...)
డోమ్ చుట్టూ కొంత దూరం వరకు ప్రదక్షిణ చేశాక ఒక చోట ద్వారం లాంటిది కనిపించింది. చాలా చిన్న ద్వారమది. వెడల్పు రెండు మీటర్లే. అది వృత్తాకారంలో ఉండడం వల్ల అది ద్వారం అని గుర్తించడానికి సమయం పట్టింది.
“జాగ్రత్త! అది ద్వారం కాదు” గౌరంగ్ స్వరం రేడియోలో వినిపించింది. “అదేదో ఉల్క చేసిన ఘనకార్యం.”
“అసంభవం!” ప్రొఫెసర్ అరిచినంత పని చేశాడు. “దాని ఆకృతి మరీ తీరుగా ఎవరో గీసినట్టు ఉంది.”
గౌరంగ్ ఒప్పుకోలేదు.
“ఉల్కాపాతాలు జరిగినప్పుడు ఎప్పుడూ వృత్తాకారపు గోతులే పడతాయి. దాని అంచులు చూడండి. ఏదో విస్ఫోటం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆ దెబ్బకి ఉల్క పూర్తిగా ఆవిరైపోయి ఉంటుంది. దాని అవశేషాలు కూడా దొరక్కపోవచ్చు.”
“అయినా ఇలాంటివి మామూలే,” కాప్టెన్ వర్ధమాన్ కూడా సమర్ధిస్తూ వచ్చాడు. “అవునూ, ఇది ఇక్కడ ఎంత కాలంగా ఉందన్నారూ? ఐదుమిలియన్ సంవత్సరాలా? ఇలాంటివి దీని ముఖం నిండా కనిపించకపోతే ఆశ్చర్యపడాలి.”
“సరే ఏదో ఒకటి.” ప్రొఫెసర్ కి ఈ వాదన ఎక్కువగా పొడిగించడం ఇష్టం లేకపోయింది. “నేను మాత్రం ముందు లోపలికి వెళ్తున్నా.”
“సరే అయితే...” ఇలాంటి వ్యవహారాల్లో కెప్టెన్ వర్ధమాన్ మాటే వేదం. “మీకు ఇరవై మీటర్ల పొడవున్న తాడు ఇస్తాను. మేం ఇక్కడే ఈ గొయ్యి అంచు వద్ద కూర్చుంటాం. లేకపోతే మనిద్దరి మధ్య రేడియో సంభాషణలు సాధ్యం కావు.”
ప్రొఫెసర్ విశ్వనాథం పంచమం లోతుల్లోకి ప్రవేశించాడు. ఆయన నుండి వచ్చే సంకేతాలు కెప్టెన్ వర్ధమాన్ కే అందుతుంటాయి కనుక అందరం అతడి చుట్టూ మూగాం.,
కాని ప్రొఫెసర్ పురోగమనం ఎంతో దూరం సాగలేదు. పైన కనిపించే లోహపు కవచం అడుగున మరో కవచం ఉంది.
ఈ రెండు కవచాల నడుమ ప్రొఫెసర్ పట్టేటంత స్థలం మాత్రం ఉంది. ఇంకా అడుగున టార్చి లైటు కాంతిలో కనిపించినంత మేరకు చూస్తే లోహపు ఊచల బాటలే కనిపిస్తున్నాయి. అడుగున ఉన్నది ఓ లోహపు కమ్మీల కారడవి.
మరి కాస్త లోపలికి వెళ్లడానికి మేం మరో ఇరవై నాలుగు గంటలు కుస్తీ పట్టాల్సి వచ్చింది. మందుగుండు పెడితే విషయం చిటికెలో తేలిపోవును. అన్నీ ఆలోచించే ప్రొఫెసర్ కి మందుగుండు మొసుకురావాలన్న ఆలోచన ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. అదే అడిగా. నాకేసి మళ్లీ జాలిగా చూశాడు.
“మనందరి ఉమ్మడి దహనానికి కావలసినంత మందుపాతర తెచ్చాను. కాని మనం శోధిస్తున్న వస్తువులు చాలా విలువైనవి. అది నీకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఎక్కడా విధ్వంసం జరగకుండా జాగ్రత్తపడుతున్నాను.”
ఆయన ఓర్పుని చూసి మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆయన తాపత్రయం ఏంటో ఇప్పుడు అర్థమయ్యింది. ఈ సుముహూర్తం కోసం ఆయన ఇరవై ఏళ్లు ఎదురుచూశాడు. మరి కొద్ది రోజులు ఓపిక పడితే పోయిందేం లేదు.
అలా ఆ కవచాలని భేదించడానికి అంతా కుస్తీ పడుతుంటే చివరికి ఆ రహస్యాన్ని కనుక్కున్నది ఎవరనుకున్నారు? చెప్తే నమ్మరు. మా శేషుగాడు! ఉపగ్రహం యొక్క ఉత్త్తర ధృవం వద్ద తనకో పెద్ద ఉల్కాబిలం కనిపించింది. దీని వ్యాసం ఓ వంద మీటర్లు ఉంటుందేమో. అక్కడ రెండు కవచాల్లోనూ పెద్ద రంధ్రం పడింది.
కాని రెండో కవచంలో పడ్డ రంధ్రం లోంచి లోనికి ప్రవేశించి చూస్తే అక్కడ మరో చిన్న కవచం కనిపించింది. కాని మా అదృష్టం బావుండి ఆ మూడవ కవచంలో కాస్త చిన్న రంధ్రం ఉండడం కనిపించింది. మరీ పెద్దదేం కాదుగాని ఓ స్పేస్ సూట్ పట్టేటంత పెద్దది. ఒక్కొక్కరం ఆ రంధ్రం లోంచి దూరి లోనికి ప్రవేశించాం.
ఉత్సాహంగా లోనికి దూరామన్న మాటే గాని మా అవస్థని ఏమని వర్ణించను? ఆ సమయంలో మేము సరైన పేరు కూడా లేని అనామక లోకపు లోహపు చూరు పట్టుకుని వేలాడే గబ్బిలాలం! దివికి భువికి మధ్య దిక్కులేకుండా వేలాడే విగతాత్మలం! మా టార్చిలైట్ కాంతులు ఆ లోహపు చూరు మీద నాట్యం చేస్తున్నాయి. కాని ఆ కాంతిని
“కిందికి” ప్రసరిస్తే నేల ఎంత దూరంలో ఉందో కూడా అర్థం కాకుండా ఉంది.
ఆట్టే గురుత్వం లేని ఈ చిన్నారి లోకంలో అందరం మా చూరు ఆసరా వొదిలేసి నెమ్మదిగా కిందికి కొట్టుకుపోయాం. కొంత దూరం పోయాక పైన రంధ్రానికి కట్టబడ్డ తాడే మమ్మల్ని ఆపింది. పైకి చూస్తే కవచపు నోటి వద్ద కాస్తంత కాంతి కనిపించింది. ఆ సమయంలో ఆ కాంతులే మా జీవన ఆశాకిరణాలు.
నా నడుముకి కట్టబడ్డ తాడుకి లోలకంలా కాసేపు నెమ్మదిగా వేలాడుతూ ఊగాను. కలో నిజమో తెలీని ఏదో సదసత్ లోకంలో తేలిపోతున్నట్టు ఉంది. నాకు కాస్త పైగా వేలాడుతున్న నా మిత్రుల టార్చిలైట్ కాంతులు మిణుగురుపురుగుల్లా మినుకుమినుకు మంటున్నాయ్. ఆ విచిత్ర దృశ్యాన్ని మైమరచి తిలకిస్తున్న నా తలలో ఉన్నట్టుండి ఏదో మెరుపులా మెరిసి గట్టిగా గావుకేక పెట్టాను:
“ప్రొఫెసర్! ఇదసలు ఉపగ్రహమే కాదు! ఇదో పేద్ద వ్యోమనౌక!”
(సశేషం...)
“అంత చిన్న వస్తువుకి ఉండే ప్రకాశం కన్నా దీని ప్రకాశం కొంచెం ఎక్కువగా ఉంది. అది చూస్తే ఇదసలు నిజంగా ఉపగ్రహమేనా అన్న సందేహం కూడా కలుగుతుంది. అసలు దీని కాంతిని ప్రతిబింబించే గుణం ... దాన్నేమంటారూ...” పదం గుర్తు రాక అర్థోక్తిలో ఆపాడు ప్రొఫెసర్.
“ఆల్బేడో.” గౌరంగ్ అందించాడు.
“థాంక్యూ గౌరంగ్. దీనికి అంత ఎక్కువ ఆల్బేడో ఉండడం చూస్తే దాని ఉపరితలం మీద ఏదైనా లోహపు పూత ఉందేమో అనిపిస్తుంది.”
“అర్థమయ్యిందోచ్!” ఉత్సాహంగా అరిచాను. “X-నాగరికతకి చెందిన వాళ్లు పంచమం చుట్టూ ఓ పెద్ద లోహపు కవచం నిర్మించి ఉంటారు. మెర్క్యురీ మీద వాళ్ళు నిర్మించిన ’డోమ్’ ల వంటిదే ఇదీను. అయితే ఇంకా చాలా పెద్దది.” గడగడా చెప్పేశాను. ఆ ఆలోచనకి నాకే కొంచెం గర్వం వేసింది.
ప్రొఫెసర్ కి నేనంటే కొంచెం జాలి వేసింది.
“నీకు ఇంకా అర్థం కాలేదన్నమాట!” జాలిగా అన్నాడు.
నేనన్న దాంట్లో తప్పేంటో నాకు అర్థం కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా అలాగే ఆలోచిస్తారేమో....
మరో మూడు గంటల తరువాత ఉపగ్రహం మీద వాలాం. అది రాతి నేల కాదు. ఓ విశాలమైన లోహపు మైదానం. ఆ విచిత్ర పరిసరంలో మా స్థితి చాలా అల్పంగా అనిపించింది. ఓ పెట్రోల్ డ్రమ్ము మీద నడిచే చీమ స్థితి! ఇక ఒక పక్క ఆకాశమంతా ఎడం లేకుండా నింపేస్తూ రగిలిపోతున్న బృహస్పతి. ఎప్పుడూ ’నాకే అంతా తెలుసు’ అన్నట్టు ఉండే ఓ చిద్విలాసపు వెధవ నవ్వు ముఖం మీదేసుకుని తిరిగే మా ప్రొఫెసర్ కూడా ఆ సన్నివేశంలో కాస్త చలించినట్టు కనిపించాడు.
మైదానం అన్నానేగాని అది ఏ రూపురేఖలూ లేని సమతలం కాదు. ఇందాక పైనుంచి చూసినప్పుడు కనిపించిన గజిబిజి గీతలు, విశాలమైన లోహపు ఫలకాల అంచులు.
మేం ఉన్న చోటికి ఓ పావు కి.మీ. దూరంలో ఓ చిన్న గుట్ట లాంటిది ఉంది. ఉపగ్రహం మీద వాలే ముందు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి, సర్వే చేసినప్పుడు కనిపించిందది. ఉపగ్రహం ఉపరితలం మీద అలాంటి గుట్టలు మొత్తం ఆరు ఉన్నాయి. ఉపగ్రహమధ్య రేఖ చుట్టూ సమ దూరాలలో నాలుగు, ధృవాల వద్ద చెరొకటి అమర్చబడి ఉన్నాయి. లోహపు కవచానికి అడుగున ఉన్న లోకానికి ఈ ’గుట్టలు’ ముఖద్వారాలు అయ్యుంటాయి.
బాగా తక్కువ గురుత్వం గల శూన్య లోకం మీద స్పేస్ సూట్లు వేసుకుని సంచరిస్తుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది అంటుంటారు గాని అది పూర్తిగా నిజం కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, ఒళ్లు దగ్గర పెట్టుకుని అడుగేయాలి. కాని ఈ సందర్భంలో ఎందుకో, ఎయిర్ లాక్ లోంచి బయటికి అడుగుపెట్టిన క్షణం నా మనసంతా ఎంత ఉద్విగ్నతతో నిండిపోయిందంటే ఈ చిన్న చిన్న కష్టాలు అసలు గుర్తే రాలేదు.
పంచమం మీద గురుత్వం ఎంత తక్కువగా ఉందంటే, దాని మీద నడవడం అనేది అయ్యేపనిలా లేదు. పర్వతారోహణం చేసే వాళ్లలాగా అందరం ఒకరికొకరు తాళ్లతో కట్టుకుని ఓ గొలుసుకట్టుగా ఏర్పడ్డాం. చిన్న రియాక్షన్ పిస్టోళ్లు వాడుకుంటూ, న్యూటన్ మూడవ నియమం పుణ్యమా అని అటు ఇటు కదలగలిగాం.
కొద్ది నిముషాల్లో మా లక్ష్యం చేరుకున్నాం. పొట్టిగా వెడల్పుగా ఉన్న డోమ్ అది. దాని చుట్టుకొలత కనీసం ఓ కి.మీ. ఉంటుంది. ఏకంగా అంతరిక్ష నౌకలు లోనికి ప్రవేశించేందుకు వీలుగా అదొక పెద్ద ఎర్లాక్ ఏమో నన్న ఆలోచన వచ్చి వొంట్లో కాస్త వొణుకు పుట్టింది. అయినా ఇదంతా ఎన్ని వేల ఏళ్ల నాటిదో. ఇప్పుడంతా పాడైపోయి ఉంటుంది.
మరిప్పుడెలా? లోపల చరిత్రలోకెల్లా అత్యంత విలువైన పురావస్తు నిధులు లోపల ఊరిస్తూ ఉంటే, ఇంత దూరం వచ్చి, ఇలా తలుపుకి తాళం లేకపోవడం వల్ల, ద్వారం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు.
(Image credits: https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgiSiKjf_X4rQrc04c19wDAXHipml2HqdKn86gNOBWCOMFAErz6485C4idW-vZrxH8_djrEkFfR_gSSu_u_FExm3TOY-8aZbG_oiT33M24V47L7TgqNBCt6FXTtcYwCR2I7iQJgpLApmKs/s1600-h/Planet+of+Blood+spaceship.jpg)
(సశేషం...)
ఓ వారం తరువాత బృహస్పతి ఉపగ్రహాల్లో కెల్లా అతి పెద్దదైన గానిమీడ్ మీద వాలాం. గురుడి ఉపగ్రహాలు అన్నిట్లో శాశ్వ
త మానవ స్థావరం ఉన్నది ఒక్క గానిమీడ్ మీదే. అక్కడ ఓ యాభై మంది సిబ్బందితో ఓ వేధశాల, ఓ భౌగోళిక పరిశోధనా కేంద్రం ఉన్నాయి. మనుషుల కోసం ముఖం వాచినట్టున్నారు పాపం. మమ్మల్ని చూసి తెగ పొంగిపోయారు. కాని ప్రొఫెసర్ రీఫ్యూయెల్ చేసుకుని త్వరగా బయల్దేరాలన్న తొందర మీద ఉన్నాడు. పంచమాన్ని చూడడానికి ఇలా ఒక ప్రత్యేకంగా భూమి ఓ మిషన్ రావడం అక్కడి సిబ్బందికి ఆశ్చర్యంగా ఉంది. కాని వాళ్ల ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పకుండా ప్రొఫెసర్ దాటేస్తూ వచ్చాడు. మేం నోరు మెదప బోతే మాకేసి కొరకొర చూశాడు.గానిమీడ్ నుండి పంచమాన్ని చేరుకోడానికి సరిగ్గా ఒకటిన్నర రోజు పట్టింది. జూపిటర్ కి దగ్గర పడుతుంటే ఆ గ్రహం ఇంకా ఇంకా పెద్దదై ఆకాశమంతా నిండిపోతున్నట్టు కనిపించి అబ్బురపాటుతో పాటు కాస్తంత భయం కూడా వేసింది. గ్రహాలలో కెల్లా అతిపెద్ద గ్రహం. మరి దాని సమీపంలో గురుత్వం విపరీతంగా ఉంటుందని వేరే చెప్పన్నక్కర్లేదు. పంచమం మీద వాలే ప్రయత్నంలో ఏదైనా తేడా వస్తే అంతే ... ఆ బృహస్పతి బృహత్తులో ఓ ధూళి కణంలా మాయం కావాల్సిందే.
ఒక పక్క భయం వేసినా బృహస్పతి అందాన్ని, గాంభీర్యాన్ని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రహోపరితలం మీద నిరంతరం సంక్షోభంగా చెలరేగే పెను తుఫానులని చూస్తూ చూస్తూ మనసు ఉప్పొంగి వాటి మీద ఆ సమయంలో బోలెడు కవిత్వం కూడా రాశాను. (అయితే కొందరు శ్రేయోభిలాషుల సలహా మీద కథలోంచి ఆ కవితని తొలగిస్తున్నాను. పాఠకులకి నిరాశ కలిగించినందుకు క్షమించాలి.)
మా గమ్యం దగ్గరపడుతోంది. పంచమాన్ని సమీపించి కక్ష్యలోకి ప్రవేశించాం. ఉపగ్రహం ఎలా ఉంటుందో స్పష్టంగా చూడడానికి అందరం కంట్రోల్ రూమ్ లోకి దూరాం. కాప్టెన్ వర్ధమాన్ ఎప్పట్లాగే నిబ్బరంగా తన పనిచేసుకుంటున్నాడు. ఇంజినీరు రాకేష్ పట్నాయక్ మీసం దువ్వుకుంటూ ఫ్యూయెల్ గేజి కేసి ఆలోచనగా చూస్తున్నాడు. నావిగేటర్ గౌరంగ్ ఏవో చార్టులు ముందేసుకుని లెక్కలు వేస్తున్నాడు.
టెలీపెరిస్కోప్ ఐపీస్ మీద కన్ను ఆన్చి ప్రొఫెసర్ ఆత్రంగా చూశాడు. బయట ఏం కనిపించిందో ఏమో... ఆయన నోట్లోంచి చిన్న కేక వెలువడింది. ఒక్క క్షణం ఆగి ఏమీ చెప్పకుండా పక్కనే ఉన్న కాప్టెన్ వర్ధమాన్ కి సైగ చేశాడు. కాప్టెన్ వచ్చి, ఐపీస్ లోంచి చూసి తను కూడా అలాగే స్పందించాడు. కాప్టెన్ ఈ సారి ఇంజినీర్ రాకేష్ ని చూడమన్నాడు. మళ్లీ అదే స్పందన. తరువాత గౌరంగ్ కూడా చూసి అదే విధంగా స్పందించాడు. నాకైతే ఈ వ్యవహారం చూస్తే కంపరం ఎత్తుతోంది. అందరూ అలా వరుసగా నోళ్లు వెళ్లబెట్టకపోతే, నోరు విప్పి విషయం ఏంటో చెప్పొచ్చుగా?
ఇక ఆఖర్న శేషు, నేను కూడా వెళ్లి చూశాం. ఏ అంతరిక్ష బ్రహ్మరాక్షసో కనిపిస్తుందని భయపడ్డా గాని నేను ఊహించింతంగా ఏమీ కనిపించలేదు. నల్లని ఆకాశంలో అల్లంత దూరంలో పంచమం యొక్క అర్థచంద్రికా రూపం కనిపించింది. దాని చీకటి పార్శ్వం మీద మాత్రం బృహస్పతి ముఖం నుండి వెలువడుతున్న బంగరు కాంతులు పడి చిత్రంగా మెరుస్తోంది. ఇంతకు మించి నాకేమీ కనిపించలేదు.
కాని మరి కాసేపు శ్రద్ధగా చూశాను. అప్పుడు కనిపించాయవి. చీకటి పార్శ్వం మీద పొడవాటి గజిబిజి కాంతిరేఖలు పరుగెడుతున్నాయి. అవేవో లోయలకి, అగాధాలకి చెందిన ప్రకృతి సిద్ధ రేఖల్లాగా లేవు. ఎందుకంటే వాటిలో ఓ తీరైన విన్యాసం ఉంది. భూగోళపు నమూనా మీద అడ్డుగాను, నిలువుగాను పరుగెత్తే అక్షాంశ, రేఖాంశ రేఖలని తలపిస్తున్నాయి. ఆ దృశ్యం చూసి ఉత్సాహం పట్టలేక (ప్రొఫెసర్ సన్నిధిలో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా) ఈల వేశాను. ఆ ఈల విన్న శేషు నన్ను అవతలికి తోసి తన పెదవిని పంటి కింద నొక్కి, కంటిని ఐపీస్ మీద నొక్కాడు.
ఏ దేవతో పూనిన వాడిలా మా ప్రొఫెసర్ ముఖమంతా పూర్తిగా మారిపోయింది. అర్థనిమీలిత నేత్రాలతో, ఓ విచిత్రమైన చిరునవ్వుతో వెళ్లి ఓ చోట చిద్విలాసంగా బోధి వృక్షం కింద బుద్ధుడిలా కూర్చున్నాడు. ఇందాక కనిపించిన దృశ్యానికి వివరణ మొదలెట్టాడు.
“మీకు ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు గాని నాకేమీ అంత ఆశ్చర్యం కలిగించలేదు. మెర్క్యురీ మీద దొరికిన ఆధారాలు కాకుండా మరి కొన్ని ఆనవాళ్లు కూడా ఉన్నాయి. గానిమీడ్ మీద ఉన్న వేధశాలలో నాకో మిత్రుడు ఉన్నాడు. ఈ మధ్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనుక్కున్నాడు. ఖగోళ శాస్త్రంలో ఏ మాత్రం ప్రవేశం ఉన్నవాడికైనా ఈ వేధశాల ఇంత కాలం పక్కనే ఉన్న బృహస్పతి ఉపగ్రహాల గురించి పట్టించుకోకుండా, గెలాక్సీకి బయట ఉన్న పేరూ ఊరూ లేని నెబ్యులాలని పట్టుకుని దేవుళ్లాడడం కొంచెం విడ్డూరంగా అనిపించొచ్చు. ఇక ఈ పంచమం విషయానికొస్తే దాని వ్యాసాన్ని కొలవడం, ఏవో కొన్ని ఫోటోలు తియ్యడం మించి ఈ వేధశాల పెద్దగా ఏమీ చేసినట్టు లేదు. పైగా ఆ ఫోటోలు కూడా అంత గొప్పవేం కావు. అందులో మనం ఇందాక చూసిన గజిబిజి రేఖలు కనిపించవు.
“కనుక వేధశాలలో పనిచేసే నా మిత్రుడు వరవరరావుని తమ 100-cm పరావర్తన దూరదర్శినిలో చూసి వివరాలు చెప్పమన్నాను. అప్పుడు తనకి కూడా ఈ గజిబిజి రేఖలు కనిపించాయి. పంచమం వ్యాసం కేవలం ముప్పై కిమీలే గాని అంత చిన్న వస్తువుకి ఉండే ప్రకాశం కన్నా దీని ప్రకాశం కొంచెం ఎక్కువగా ఉంది. అది చూస్తే ఇదసలు నిజంగా ఉపగ్రహమేనా అన్న సందేహం కూడా కలుగుతుంది.”
(సశేషం...)
ఈ X-నాగరికత గురించి మా ప్రొఫెసర్ కి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వీళ్లు అంతరిక్ష యానంలో ఆరితేరిన వాళ్లు. ఎందుకంటే మెర్క్యురీ మీద కూడా వీళ్ళ ఆనవాళ్లు దొరికాయి. జల్లెడ తీగల్లాంటి తీరైన వీధులున్న, X-నాగరికత కి చెందిన, నగరాల శిధిలాలు మెర్క్యురీ నేలలో దొరికాయి. ప్రొఫసర్ ఉద్దేశంలో ఆ జాతి వారు చిన్న గ్రహాలన్నిటినీ ఆక్రమించుకోవాలని చూశారు. భూమి, వీనస్ గ్రహాల మీద గురుత్వం మరీ ఎక్కువ కావడంతో ఈ రెండు గ్రహాల జోలికీ పోలేదట. కాని మరి మన చందమామ మీద వాళ్ల ఆచూకీ లేకపోవడం ప్రొఫెసర్ విశ్వనాథాన్ని కొంచెం నిరాశపరిచింది. ఏదో ఒక నాడు తప్పకుండా చందమామ మీద కూడా ఆ జాతికి చెందిన ఆనవాళ్లు దొరుకుతాయని ఆయనకి గట్టి నమ్మకం.
X-నాగరికత ఆవిర్భావాన్ని గురించి సాంప్రదాయక సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటాయి మా ప్రొఫెసర్ భావాలు. సాంప్రదాయక సిద్ధాంతం ప్రకారం ఈ X-నాగరికత మన సౌరమండలంలో ఏదో చిన్న గ్రహం మీదనో, ఉపగ్రహాల మీదనో ఆవిర్భవించి, ఒక దశలో మార్షియన్ జాతిని సంపర్కించి, మార్షియన్ జీవన స్రవంతితో కలిసిపోయి, ఆ జాతితోనే అంతరించిపోయింది. కాని ప్రొఫెసర్ గారి ఆలోచన వేరు. X-నాగరికత సౌరమండలానికి బయట ఎక్కడో ఆవిర్భవించి ఒక దశలో మన సౌరమండలం లోకి ప్రవేశించిందట. కాని ఆయన భావాలతో ఏకీభవించే వారు కోటికి ఒక్కరు కూడా ఉండరు. అందుకు ఆయన విచారపడకపోగా అదేదో గర్వకారణంగా బడాయిపోతుంటారు.
ప్రొఫెసర్ విశ్వనాథం తన పథకాలని వివరిస్తుంటే నేను మా కాబిన్ కిటీకీ లోంచి కనిపిస్తున్న జూపిటర్ ని చూస్తున్నాను. అది మన సౌరమండలంలోనే ఓ అత్యద్భుతమైన, గంభీరమైన దృశ్యం. కుంకుమ, విభూతి కలిపి నామాలు పెట్టినట్టు దేవగురువు ముఖం దివ్యంగా వెలిగిపోతోంది. గ్రహమధ్య రేఖ మీదుగా విస్తరించిన మేఘమాల నెరిసిన మీసకట్టులా మెరిసిపోతోంది.
బృహస్పతికి అల్లంత దూరంలో మూడు చిన్న ఉపగ్రహాలు తారకలలా మెరుస్తున్నాయి. వీటిలో మేం మొదట దిగాల్సిన గానిమీడ్ ఏదో నాకు అర్థం కాలేదు.
“ఏం కిరీటీ! ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు?” ప్రొఫెసర్ స్వరానికి ఉలిక్కి పడి ఆయన కేసి చూశాను.
“ఇంతకీ ఈ యాత్ర ఎందుకు చేస్తున్నామో చెప్పాను కాదు. గత ఏడాది నేను మెర్క్యురీ మీద ఎన్నో శిధిలాలని బాగా క్షుణ్ణంగా తనిఖీచేసిన మాట మీకు తెలుసు. ఆ విషయం మీద నేను టి.ఐ.ఎఫ్.ఆర్. లో ప్రెసెంట్ చేసిన పేపర్ మీరు కూడా చదివే ఉంటారు.” చిన్న వ్యంగ్యమైన చిరునవ్వు నవ్వి, “ఆ రోజు సభలో మీరు ఉన్నారనే అనుకుంటాను. వెనక సీట్లలో మహా కోలాహలంగా ఉండడం నాకు బాగా గుర్తు.”
ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయాడు.
“కాని ఆ సందర్భంలో నేను చెప్పని రహస్యం ఒకటుంది. X-నాగరికత మూలాల గురించి ఓ ముఖ్యమైన ఆనవాలు దొరికింది. అప్పుడు ఆ విషయం గురించి నోరు మెదప దలచుకోలేదు. ఆ సందర్భంలో డా కులకర్ణి కి ఎప్పట్లాగే అతితెలివి ప్రదర్శించే అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాను. ఈ అన్వేషణలో నేనే ముందుండాలి. ఈ పోటీ నేనే గెలవాలి.”
“మెర్క్యురీ లో తవ్వకాలలో దొరికిన శిధిలాలలో ఒక చోట మొత్తం సౌరమండలానికి నమూనా లంటి శిల్పం దొరికింది. ఖగోళాన్ని చిత్రీకరించే కళాఖండాలు మార్షియన్ నాగరికత, X-నాగరికతలకి చెందిన పురావస్తు ఆవిష్కరణల్లో దొరకడం పరిపాటే. మార్స్, మెర్క్యురీ గ్రహాలకి చెందిన ఎన్నో చిత్రాలు కూడా అక్కడ దొరికాయి. కాని చిత్రం ఏంటంటే ఆ చిత్రాల్లో జూపిటర్ యొక్క ఐదవ ఉపగ్రహమైన ఈ ’పంచమం’ కి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ ఉపగ్రహం మీద మనకి ఇంతవరకు తెలీని ఏదో గొప్ప రహస్యం దాగి వుందని అప్పట్నుంచి నా మనసులో బలంగా పడిపోయింది.”
(సశేషం)
“భూమిని విడిచి బయలుదేరిన దగ్గర్నుండి మీతో పెద్దగా మాట్లాడడానికే వీలుపడలేదు.” గొంతు సవరించుకుంటూ అన్నాడు ప్రొఫెసర్. “ఈ యాత్రకి లక్ష్యం ఏంటో మీకు వివరంగా చెప్పాలి.”
ఎదురు ప్రశ్నలు వేసి చిత్రహింస పెట్టకుండా ఇలా మా ప్రొఫెసర్ సూటిగా విషయం చెప్పేస్తున్నాడేంటని మేము ఆశ్చర్యపడేటంతలో, ఆయనే మళ్లీ అన్నాడు:
“పోనీ నేను చెప్పే బదులు మీరే ఊహించగలరా మన యాత్రకి లక్ష్యం ఏంటో?”
“మీ మనసులో ఏవుందో మాకెలా తెలుస్తుంది .. కానీ” కాస్త సగౌరవంగా సణిగాడు శేషు. “బహుశ జూపిటర్ ఉపగ్రహాల మీద ఏవైనా కొత్త సంగతులు తెలుసుకోవచ్చేమో నన్న...”
“భేష్ శేషూ!” ప్రొఫెసర్ సంతోషం పట్టలేక ఎప్పట్లా శేషు వీపుని ఓసారి మోగించాలనుకున్నాడు గాని, ఈ శూన్య గురుత్వ లోకంలో ఆ చర్యకి పర్యవసానం ఏంటో తెలిసి తమాయించుకున్నాడు. “భలే చెప్పావ్. మనకి తెలిసి బృహస్పతికి పదిహేను ఉపగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటి ఉపరితల విస్తీర్ణత కలిపితే భూమి ఉపరితలంలో సగం ఉంటుందేమో. మనకేమో పట్టున రెండు వారాలు కూడా లేవు. అంత తక్కువ సమయంలో అంత ప్రాంతం ఎలా గాలించడం?” మళ్లీ ప్రశ్న కసిగా విసిరాడు ప్రొఫెసర్.
శేషు ఓసారి ఇబ్బందిగా కదిలి, కొంచెం ధైర్యం తెచ్చుకుని అన్నాడు,
“నాకు ఖగోళశాస్త్రం పెద్దగా తెలీదుగాని. అదుగో ఆ నాలుగు పెద్ద ఉపగ్రహాలు ఉన్నాయిగా. నేనైతే వాటితో మొదలుపెడతాను.”
“కాని మరి నీకు తెలుసోలేదో. నువు చెప్పే ఆ నాలుగు ఉపగ్రహాలు – అయో, యూరోపా, గానిమీడ్, కల్లిస్టో లు. ఒక్కొక్కదాని విస్తీర్ణత ఆఫ్రికా ఖండం అంత ఉంటుంది. ఏ వరుసలో వాటిని గాలిస్తే బావుంటుందంటావ్?”
నాకీ ఈ జ్ఞాన హింస బొత్తిగా నచ్చలేదు.
“బృహస్పతికి అతి దగ్గరి ఉపగ్రహంతో మొదలెట్టి క్రమంగా దూరంగా జరుగుతూ పోతే...?”
“ప్చ్” బాధగా అన్నాడు ప్రొఫెసర్. కాని జాగ్రత్తగా వింటే ఆ బాధ వెనుక వ్యంగ్యం ధ్వనిస్తుంది. “నువ్వు పట్టేస్తావు అనుకున్నా శేషూ. నువ్వు చెప్పింది తప్పు. నీ ఆలోచనా విధానం తప్పు. మనం అసలు పెద్ద ఉపగ్రహాల వద్దకే పోవడం లేదు. భూమి నుండి ఇప్పటికే వాటిని క్షుణ్ణంగా సర్వే చేశారు. ఎన్నో మిషన్లు కూడా ఇప్పటికే వాటిని పరిశీలించాయి. మనం వెళ్లేది ఇంతవరకు ఇవరూ వెళ్ళని చోటికి.”
“కొంపదీసి జూపిటర్ కి కాదు కద.” భయంగా అన్నాన్నేను. అక్కడి నిరవధిక ప్రళయభీకర వాయుదుమారాలలో ఊపిరాడక చచ్చిపోతున్న దృశ్యాన్ని ఊహించుకుంటూ.
“లేదు. కాని ఇంచుమించు అంతవరకు వెళ్తున్నాం. గురుడికి అంత దగ్గరిగా ఇంత వరకు ఎవరూ పోలేదు.”
ఈ సారి సాలోచనగా అన్నాడు.
“మీకు తెలుసోలేదో గాని... విచిత్రం ఏంటంటే జూపిటర్ ఉపగ్రహాల మధ్య ప్రయాణించడం ఎంత కష్టమో, గ్రహాల మధ్య ప్రయాణించడం కూడా అంతే కష్టం. దానికి కారణాలు రెండు. జూపిటర్ కి ఉండే బ్రహ్మాండమైన గురుత్వం. అతి వేగంగా కదిలే దాని ఉపగ్రహాలు. జూపిటర్ కి అత్యంత సన్నిహితంగా ఉండే ఉపగ్రహం ఇంచుమించు భూమి అంత వేగంగా కదులుతోంది. కనుక గానిమీడ్ నుండి అక్కడికి ప్రయాణించడానికి ఎంత ఇంధనం అవుతుందో, భూమి నుండి వీనస్ కి ప్రయాణించడానికి కూడా అంతే ఇంధనం అవుతుంది. ఇదే మనం చేయబోతున్న యాత్ర. ఇంతవరకు ఈ యాత్ర చెయ్యాలని ఎవరికీ అనిపించలేదు. ఈ బృహస్పతి పంచమం చాలా చిన్న ఉపగ్రహం. దీని వ్యాసం కేవలం ముప్పై కి.మీ.లే. జూపిటర్ కి కొంచెం దూరంలో ఉండే చిన్న ఉపగ్రహాలని కూడా ఇంతవరకు ఎవరూ సందర్శించలేదు. సందర్శించడం డబ్బు దండుగ అనుకున్నారు.”
“మరి మనం ఇప్పుడు ఇంత ఇదిగా ఎందుకు బయలుదేరినట్టు?” కొంచెం అసహనంగా అడిగాను, ’ఇది’ అన్న మాటను కాస్త నొక్కి పలుకుతూ. ఏదో ప్రొఫెసరు ఉత్సాహపడుతున్నాడని గాని నాకైతే ఇదంతా వట్టి పనికిమాలిన వ్యవహారంలా తోచుతోంది.
ఇక్కడ మా ప్రొఫెసర్ విశ్వనాథం గారి గురించి ఆయన సిద్ధాంతాల గురించి కొంచెం చెప్పాలి. నాకైతే ఆయన సిద్ధాంతాల మీద బొత్తిగా నమ్మకం లేదు గానీ ఆయనకి ఆయన రంగంలో మంచి పేరు ఉంది. కాని ఆయన భావాలు చాలా నవ్యంగా, విప్లవాత్మకంగా ఉంటాయి. అసలు నమ్మశక్యంగా అనిపించవు.
ఆ మధ్యన అలాగే ఒక మార్స్ మిషన్లో ఆ గ్రహం మీద రెండు ప్రాచీన నాగరికతల శిధిలాలు బయటపడ్డాయి. రెండూ బాగా అధునాతనమైనవే. కాని ఐదు మిలియన్ సంవత్సరాల క్రితమే రెండూ అంతరించిపోయాయి. అందుకు కారణం ఏంటో ఇప్పటికీ తెలీదు. యుద్ధం వల్ల జరిగినట్టు కనిపించలేదు. ఎందుకంటే రెండు నాగరికతలు సామరస్యంగా జీవించినట్టే కనిపించింది. వాటిలో ఒక జాతి జీవులు కొంచెం పురుగుల్లా ఉంటారు. వీళ్లే ఆదిమ మార్షియన్లు. ఆ గ్రహం మీదే ఆవిర్భవించి, పరిణామం చెందినవారు. రెండవ జాతి పాముల్లాగా, సరీసృపాల్లాగా ఉంటారు. వీళ్లు బయటి నుండి వచ్చినట్టు కనిపిస్తుంది. వీళ్లు ఎవరో, ఎక్కణ్ణుంచి వచ్చారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. అందుకే ఈ నాగరికతని “X-నాగరికత” అని పిలిస్తారు.
ఈ X-నాగరికత గురించి మా ప్రొఫెసర్ కి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి.
(సశేషం...)
బృహస్పతి పంచమం
ఆయనే ప్రొఫెసర్ విశ్వనాథం... మనిషి పొట్టివాడే గాని (ఎంత పొట్టివాడంటే ఆయన కోసం ప్రత్యేకంగా కొలతలు ఇచ్చి స్పేస్ సూట్ తయారుచెయ్యించాల్సి వచ్చింది) బుద్ధి మహా పదును. ఎవరికీ రాని ఏవో విచిత్రమైన ఆలోచనలు ఆయనకే వస్తుంటాయి. ఎప్పుడూ ఏదో చెయ్యాలని, ఏవో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఒకసారి ఆయనకి ఏదైనా బుద్ధి పుడితే దాన్ని సాధించిన దాకా నిద్రపోడు. నిద్రపోడు గాని కలలు మాత్రం తెగ కంటాడు.
ఆయనదో విచిత్రమైన కల. ఓ కూతుర్ని పెంచినట్టు ఇరవై ఏళ్ల పాటు దాన్ని మురిపెంగా పెంచి పెద్దచేశాడు. ఆ కలని ఇప్పుడు సాకారం చేసుకునే సమయం వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ని సఫలం చేసుకోడానికి పెద్ద పెద్ద వైజ్ఞానిక సదస్సులని ఒప్పించి పెద్ద మొత్తంలో ’కట్నం’ డబ్బు తెచ్చుకున్నాడు. అంతే కాదు. పుష్పక విమానం లాంటి చక్కని అంతరిక్ష నౌకని కూడా ఎలాగో పట్టాడు. (దానికి రాజహంస’ అని ఓ పేరు కూడాను.) అయినా... ఇంత వివరం మాలిన వ్యవహారం కోసం ఇన్ని విరాళాలు ఏ వెర్రిబాగులోడు ఇచ్చాడో నాకైతే ససేమిరా అర్థం కాలేదు.
మొత్తం ఆరు మంది సిబ్బందితో ’రాజహంస’ పృథ్వీ వాతావరణాన్ని విడిచి అంతరిక్షంలోకి ప్రవేశించింది. సిబ్బందిలో అందరి కన్నా ముఖ్యుడు ప్రొఫెసర్ విశ్వనాథంగారే. ఆయనకసలే కాస్త మతిమరుపు. కనుక ఆయన విషయాలన్నీ చూసుకునే ఆయన అసిస్టెంట్ తిరుమల రావు కూడా మాతో వచ్చాడు. వీళ్లు కాక ప్రతీ నౌకలోను తప్పనిసరిగా ఉండాల్సిన ముగ్గురూ - బండి చలాయించడానికి ఓ పైలెట్, దారి చూపించడానికి ఓ నావిగేటర్, బండి దార్లో పేచీ పెడితే చూసుకోవడానికి ఓ ఇంజినీరు – ఉన్నారు. ఇక ఆఖర్లో మిగిలింది మా శేషాద్రి శర్మ, నేను. మేమిద్దరం ప్రొఫెసర్ వద్ద రీసెర్చి చేస్తున్నాం అన్నమాట.
శేషుకి, నాకు అంతరిక్షం లోకి రావడం ఇదే మొదటి సారి. ఇద్దరికీ ఈ యాత్ర భలే థ్రిల్లింగ్ గా ఉంది. అందుకే మేం తిరిగి భూమికి వెళ్లేసరికి మా క్లాసులు మొదలవుతాయన్న బెంగ కూడా లేదు. పనికిమాలిన క్లాసులు. ఎప్పుడూ ఉండేవేగా! అయితే అక్కడ మాకు పాఠం చెప్పిన ప్రొఫెసర్ కూడా అలాగే అనుకున్నాడో ఏమో. కాస్త సిఫారసు ఇయ్యవయ్యా పెద్దమనిషీ అంటే తిడుతున్నాడో, పొగుడుతున్నాడో అర్థం కాకుండా ఏదో సోది రాశాడు. ఎవరికీ అర్థం కాని సోది రాయడంలో ఆయన ఎలా దిట్టో, ఎవరికీ అర్థం కాని సోది చదవడంలో మేం దిట్ట. మార్షియన్ రహస్య లిపి చదవడంలో మంచి పాండిత్యం గల వాళ్ల సంఖ్య చేతివేళ్ల మీద లెక్కెట్టొచ్చు. వారిలో చిటికెన వేలు మా శేషు, చూపుడు వేలు నేను. అందుకే రాజహంసలో సీట్లు కొట్టేశాం.
కాని మేం వెళ్తున్నది మార్స్ కి కాదని, జూపిటర్ కి అని ముందు మాకు మాత్రం ఏం తెలుసు? మా అంతకి మేము కుక్కపాట్లు పడి తెలుసుకోవడమే గాని మా ప్రొఫెసరు మాకు విపులంగా విషయం చెప్పిందెప్పుడు? కాని ప్రొఫెసరు సిద్ధాంతాల గురించి మాకు బాగా తెలుసు కనుక, జూపిటర్ మీద పని ఏవై ఉంటుందో ఇద్దరం ఊహాగానాలు చెయ్యడం మొదలెట్టాం. భూమిని వొదిలి పది రోజు లయ్యిందేమో. మా ఊహలు నిజమేనని మెల్లగా అర్థం కాసాగింది.
అప్పుడప్పుడు మా ప్రొఫెసర్ కి మా ఇద్దరికి జ్ఞానభిక్ష పెట్టాలని బుద్ధి పుడుతుంది. అలాంటప్పుడు ఎంత దూరంలో ఉన్నా కను సన్న చేసి పిలుస్తాడు. ఆ పిలుపు మాకు బాగా తెలుసు. ఇప్పుడలాగే పిలిచాడు. ఇద్దరం వెళ్లాం... అంటే వెళ్లడానికి ప్రయత్నించాం. ప్రొఫెసర్ పిలవగానే పరుగుపరుగున వెళ్లడం మాకు కొత్త కాదు గాని, బొత్తిగా గురుత్వం లేని శూన్య లోకంలో పరుగులు పెట్టడంలో మాకంత అనుభవం లేదు. ఒక పక్క మా శేషుగాడు ర్యాకెట్ బాల్ లా నౌక గోడల మధ్య తుళ్లుతున్నా, నాకు నేల మీద కాళ్లు ఆనడమే గగనమై పోతున్నా, మా ప్రొఫెసర్ మాత్రం నిండు కుండలా తొణకకుండా ఉన్నాడు. జీవితంలో ’సెటిల్’ కావడానికి అవస్థ పడుతున్న మా ఇద్దరి కేసి ఓ సారి విచారంగా చూశాడు. భూమి మీద కూడా అలా మా కేసి ఎన్నో సార్లు చూశాడు. ఆ చూపులో కోటి ప్రశ్నలు. “వీళ్లసలు ఎలా పుట్టారు?” “ఎందుకు పుట్టారు?” “నాకే ఎందుకిలా తగులుకున్నారు?” “వీళ్ల నుండి నాకు విముక్తి ఎప్పుడు?” ఏంటో ఆయన ప్రశ్నలు మాకెప్పుడూ అర్థం కావు.
“భూమిని విడిచి బయలుదేరిన దగ్గర్నుండి మీతో పెద్దగా మాట్లాడడానికే వీలుపడలేదు.” గొంతు సవరించుకుంటూ అన్నాడు ప్రొఫెసర్. “ఈ యాత్రకి లక్ష్యం ఏంటో మీకు వివరంగా చెప్పాలి.”
(సశేషం...)





