ఇలాంటి వికార రూపంగల జీవాల వల్ల కొన్ని ఉపయోగాలు కూడా లేకపోలేవు. అయినా శాస్త్రవేత్తలు వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ఉదాహరణకి 1791 లో, అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో, సెత్ రైట్ అనే ఓ రైతు తన గొర్రెకి పొట్టి కాళ్లు ఉన్న గొర్రె పిల్ల పుట్టటం గమనించాడు. కాళ్లు పొట్టివి అని తప్ప గొర్రె పిల్ల ఆరోగ్యంగానే ఉంది. కాని పెరిగి పెద్దయ్యాక, కాళ్లు పొట్టివి కావటంతో కంచె మీంచి గెంతలేకపోయేది. చేను దాటి బయటికి పోలేకపోయేది.
ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు రైట్ రైతు. ఈ గొర్రె ఇక కంచె దాటి బయటికి పారిపోయే సమస్యే ఉండదు, కనుక దాన్ని వెంబడించి పట్టుకునే తిప్పలు కూడా ఉండవు. ఈ గొర్రె యొక్క సంతతిలో మరిన్ని పొట్టి కాళ్ల గొర్రెలు కనిపించాయి. కొన్నేళ్లలో అలాంటి పొట్టి కాళ్ల గొర్రెల మందల్నే తయారుచేశాడు రైట్ రైతు.
కొంత కాలం తరువాత ఆ సంతతి అంతరించిపోయింది అనుకుంటుండగా నార్వేలో అలాంటి పొట్టి కాళ్ల వికారం ఒకటి కనిపించింది. వాటి నుండి గొర్రెల మందల్ని సాకారు. కాని ఎందుచేతనో అలాంటి పరిణామాలేవీ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించలేకపోయాయి.
ఇదిలా ఉండగా 1886 లో డచ్ వృక్ష శాస్త్రవేత్త హ్యూగో డీ వ్రీస్ కి ( 1848-1935 ) ఓ ఆసక్తికరమైన విషయం కంటపడింది.
గతంలో ప్రిం రోజ్ అనే అమెరికన్ మొక్కని నెదర్లాండ్స్ లో ప్రవేశపెట్టటం జరిగింది. ఒకరోజు ఓ నిర్జన ప్రాంతంలో ఈ మొక్కల తోట ఒకటి డీ వ్రీస్ కంటపడింది. ఒకే మొక్క యొక్క విత్తుల నుండి ఆ తోట అంతా పుట్టుకొచ్చి ఉంటుంది. అయినా కూడా మొక్కల్లో కొన్ని ఆసక్తికరమైన తేడాలు గుర్తించగలిగాడు డీ వ్రీస్.
కొంచెం ప్రత్యేకంగా, తేడాగా ఉన్న మొక్కలు sports , అంటే వైపరీత్యాలు అన్నమట. కాని అవి కూడా బాగా పెరిగి వర్ధిల్లుతున్నాయి. అలాంటి వాటిని కొన్ని తవ్వి తిసి తన పెరట్లో నాటుకున్నాడు. మెండెల్ బఠాణీ మొక్కల్తో చేసిన ప్రయోగాల్లాంటివే ఇతడు ప్రిం రోజ్ మొక్కల్తో ప్రారంభించాడు. (అయితే ఆ సమయంలో డీ వ్రీస్ కి మెండెల్ గురించి ఏమీ తెలీదు.)
ప్రిం రోజ్ మొక్కల సంతతి కూడా అధికశాతం విత్తులు వచ్చిన మొక్క పోలికలోనే ఉండేవి. కాని అరుదుగా మాత్రం సంతతి మొక్క చాలా తేడాగా ఉండేది. అనువంశికతలో అలాంటి హఠాత్ పరిణామానికి mutation (ఉత్పరివర్తన) (అంటే లాటిన్ లో మార్పు) అని పేరు పెట్టాడు డీ వ్రీస్.
అప్పట్నుంచి వికారాలు, వైపరీత్యాలు, monsters, sports మొదలైన పరిభాష పోయి mutation అన్న మాటే స్థిరపడింది.
మొక్కల తరాల పరిణామంలో మెండెల్ గమనించిన సూత్రాలే డీ వ్రీస్ కూడా గమనించాడు. మొక్కల మీద జాగ్రత్తగా కొలతలు తీసుకుంటూ ఎంత శాతం మొక్కల్లో ఏ లక్షణాలు ఉంటాయో నమోదు చేసుకున్నాడు. మెండెల్ లాగానే ఇతడు కూడా ప్రతీ భౌతిక లక్షణాన్ని శాసిస్తూ రెండు ఫాక్టర్ లు ఉంటాయని గుర్తించాడు. వీటిలో ఒకటి పరాగంలోను, మరొకటి అండాశయంలోను ఉంటుందని కూడా అర్థం చేసుకున్నాడు. ఈ రెంటి మధ్య జరిగే యాదృచ్ఛికమైన కలయికల వల్ల సంతతి లక్షణాలు నిర్ణయింపబడ్డాయి.
1900 లో డీ వ్రీస్ "అనువంషికతా ధర్మాలు" అన్న గ్రంథ రచనకి పూనుకున్నాడు.
డీ వ్రీస్ కి తెలియకుండా మరిద్దరు వృక్షషాస్త్రవేత్తలు కూడా అవే అనువంశికతా ధర్మాలని కనుక్కున్నారు, వాళ్లిద్దరూ కూడా 1900 కల్లా వాళ్ల ఆవిష్కరణలని ప్రచురించటానికి సిద్ధం అయ్యారు. వాళ్ల పేర్లు - జర్మన్ వృక్షషాస్త్రవేత్త కార్ల్ ఎరిక్ కారెన్స్ ( 1864-1933 ), మరియు ఆస్ట్రియన్ వృక్షషాస్త్రవేత్త ఇరిక్ ట్షెర్మాక్ ఫాన్ సైసెనెక్ (1871-1962).
ఈ ముగ్గురు వృక్షషాస్త్రవేత్తలూ తమ రచనలని ప్రచురించే ముందు ఈ రంగంలో అంతకు ముందు ఎవరైనా ఏదైనా కృషి చేశారా అని సమీక్షించారు. ముగ్గురికీ మెండెల్ రాసిన పత్రాలే తారసపడ్డాయి. తాము కనుక్కున్న సూత్రాలే మెండెల్ కూడా కనుక్కున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అయితే తేడా ఏంటంటే మెండెల్ అవన్నీ 40 ఏళ్ల క్రితమే కనుక్కున్నాడు.
1900 లో ముగ్గురు వృక్షషాస్త్రవేతలు - డి వ్రీస్, కారెన్స్, ట్షర్మాక్ ఫాన్ సైసెనెక్ లు తమ ఆవిష్కరణలని ప్రచురించారు. కాని ముగ్గురూ ఘనత అంతా మెండెల్ దేనని వినమ్రంగా ఒప్పుకున్నారు. అందుకే నేడు మనం మెండెల్ అనువంశికతా సూత్రాలు అని చెప్పుకుంటున్నాం. ఈ పరిణామాలన్నీ చూడటానికి మెండెల్ జీవించి లేకపోయినా, తన ఖ్యాతి మత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.
(మెండెల్ కథ సమాప్తం)
కాని పొట్టి మొక్క నుండి శుక్రకణాన్ని, పొడవు మొక్క నుండి అండకణంతో కలిపాం అనుకుందాం. శుక్రకణంలోని s అండకణం లోని T తో కలుస్తుంది. అందులోంచి వచ్చే విత్తు sT విత్తు అవుతుంది. అలాగే పొడవాటి మొక్కలోని షుక్రకణాన్ని, పొట్టి మొక్కలోని అండకణంతో కలిపినప్పుడు, శుక్రకణం లోని T అండకణం లోని s తో కలిసి Ts రకం విత్తు పుడుతుంది. ఈ రెండు రకాల విత్తుల (Ts లేదా sT ) నుండి కూడా పొడవాటి మొక్కలే పుడతాయి. T యొక్క ప్రభావం, s యొక్క ప్రభావాన్ని మరుగుపరుస్తుంది. అంటే పొడవు అనే లక్షణం dominant (ఎక్కువ ప్రాబల్యం గలది) అన్నమాట. అదే విధంగా పొట్టిదనం అనే లక్షణం recessive (తక్కువ ప్రాబల్యం గలది) అన్నమాట.
అలా కాకుండా ఓ పొడవాటి మొక్కని ( Ts లేక sT జాతి దాన్ని) తీసుకుని దాని నుండి కొత్త మొక్కలు పుట్టించాం అనుకోండి. ఈ కొత్త మొక్కల్లోంచి వచ్చే శుక్ర కణాలలో ఏదో ఒక ఫాక్టర్ మాత్రమే ఉంటుంది. అంటే సగం శుక్ర కణాలు T జాతివి మిగతా సగం s జాతివి అయ్యుంటాయి. అండ కణాల విషయంలో కూడా అదే జరిగుతుంది. సగం T జాతికి, సగం s జాతికి చెంది ఉంటాయి.
శుక్ర కణాలని అండకణాలతో కలియనిస్తే, ప్రతీ T జాతి శుక్ర కణం ఒక T జాతి అండకణంతో గాని, s జాతి అండకణంతో గాని సంపర్కిస్తుంది. ఆ కలయిక వల్ల పుట్టిన విత్తు TT జాతిది గాని, Ts జాతిది గాని అవుతుంది. అలాగే ప్రతీ s జాతి శుక్రకణం ఒక T జాతి అండకణంతో గాని, s జాతి అండకణంతో గాని కలిసి, sT లేదా ss జాతుల విత్తులు ఉత్పన్నం అవుతాయి.
ఆ విధంగా TT, Ts, sT, ss అని నాలుగు రకాల విత్తనాలు ఉత్పన్నం అవుతాయి. ఆ నాలుగు జాతులూ సమపాళ్లలో ఉంటాయి. TT, Ts, sT రకం విత్తుల నుండి పొడవాటి బఠాణీ మొక్కలు పుడతాయి. ss విత్తుల నుండి పొట్టివి వస్తాయి. అంటే మూడు వంతులు పొడవాటి మొక్కలు, ఒక వంతు మాత్రమే పొట్టివి అవుతాయన్నమాట. TT, ss జాతి మొక్కలు శుద్ధ అనువంశికతను ప్రదర్శిస్తాయి. అంటే వాటి సంతతికి కచ్చితంగా వాటి లక్షణాలే (పోడగరితనం గాని, పొట్టిదనం గాని) వస్తాయి. కాని Ts, sT మొక్కలు శుద్ధ అనువంశికతను ప్రదర్శించవు. వాటి సంతతిలో రెండు రకాల మొక్కలూ ఉంటాయి.
బఠాణీ మొక్కల్లో ఇతర లక్షణాలు కూడా పరిగణిస్తూ మెండెల్ తన ప్రయోగాలు కొనసాగించాడు. అన్ని లక్షణాల విషయంలోను తన వివరణలు చక్కగా వర్తిస్తున్నాయి. తరువాత లక్షణాల మిశ్రమాలని కూడా పరీక్షించాడు. ఆకుపచ్చని విత్తనాలు కలిగి, పొడుగ్గా ఎదిగే మొక్కలని తీసుకున్నాడు. అలగే ఆకుపచ్చని విత్తనాలు గల పొట్టి మొక్కలని, పసుపు పచ్చని విత్తనాలు గల పొడవు మొక్కలని, పసుపు పచ్చని విత్తనాలు గల పొట్టి మొక్కలని తిసుకుని ప్రయోగాలు చేసి చూశాడు. రెండు లక్షణాల దృష్ట్యా శుద్ధ అనువంశికతను ప్రదర్శించే మొక్కలు ఏవి అవుతాయో ముందే నిర్ణయించగలిగాడు. తదుపరి తరంలో పుట్టిన మొక్కలు ఏఏ నిష్పత్తిలో వస్తాయో కూడా అంచనా వెయ్యగలిగాడు.
ఇన్ని పరిశోధనలు చేసి, తన సిద్ధాంతాలని క్షుణ్ణంగా పరీక్షించి తీర్చిదిద్దుకున్నాక కూడా మెండెల్ కి వైజ్ఞానిక సంఘం తన భావాలని గౌరవిస్తుందన్న నమ్మకం లేకపోయింది. మరి తనేమో ఓ మామూలు సాధువు. వృక్షషాస్త్రంలో ఓనమాలు కూడా సరిగ్గా రాని ఔత్సాహికుడేగాని, జగమెరిగిన పండితుడు కాడు. బడిపంతులు ఉద్యోగానికి ప్రవేషపరీక్షలో కూడా నెగ్గలేని పామరుడు.
కనుక తను రాసిన పరిశోధనా పత్రాన్ని నిపుడైన ఓ వృక్షషాస్త్రవేత్తకి పంపించాలని అనుకున్నాడు. అలాంటి ప్రముఖుల ఆమోదముద్ర ఉంటే ఇతర శాస్త్రవేత్తలు ఆ భావాలని సమ్మతిస్తారేమోనని ఓ ఆశ.
ఉదాహరణకి పూర్తిగా ఎదిగినా కురచగా ఉండే ఓ బఠాణీ మొక్కని తీసుకున్నాడు. ఈ జాతి మొక్క పొడవు 1 - 1.5 అడుగులే ఉంటుంది. ఈ జాతికి చెందిన ఎన్నో మొక్కల్లో స్వపరాగ సంపర్కం చేశాడు. వాటిలో కొన్ని మొక్కల నుండి వచ్చిన విత్తుల నుండి వచ్చిన మొక్కలు పొడుగ్గా ఎదగటం గమనించాడు. కాని అలా అన్ని సందర్భాలలోను జరగలేదు. మరి కొన్ని పొడవాటి మొక్కల నుండి వచ్చిన విత్తుల నుండి మొలిచిన మొక్కలు కూడా పొట్టిగానే పెరిగాయి. పొడవాటి మొక్కల నుండి వచ్చిన మొక్కల్లో ముప్పావు వంతు పొడవుగా వచ్చాయి, పావు వంతు మాత్రం పొట్టిగానే ఉండిపోయాయి.
ఈ పరిణామాన్ని చూసిన మెండెల్ నిర్ఘాంతపోయాడు. పొడవుని బట్టి చూస్తే పొడవాటి మొక్కలన్నీ ఒకే తీరులో ఉన్నాయి. మరి కొన్నిటికి పొడవాటి సంతతి, కొన్నిటికి పొట్టి సంతతి కలగటం ఏమిటి?
మెండెల్ ఇప్పుడు మరో ప్రయోగం చేషాడు. ఈ సారి పరపరాగ సంపర్కం చేశాడు. పొడవాటి సంతతి గల పొడవాటి బఠాణీ మొక్కల నుండి పరాగాన్ని తీసుకుని పొట్టి మొక్కల పిస్టిల్ మీద చల్లాడు. అంటే అలా పుట్టిన విత్తుల తల్లిదండ్రుల్లో ఒకరు పొడగరి, మరొకరు కాదు. ఈ విధమైన సంపర్కం వల్ల పుట్టిన మొక్కల్లో కొన్ని పొడవుగా, కొన్ని పొట్టిగా ఉంటాయా? లేక అన్నీ మధ్యస్థపు ఎత్తు గలిగి ఉంటాయా?
ఆ పరిణామాలు ఏవీ జరక్క పోవటం చూసి మెండెల్ ఆశ్చర్యపోయాడు. పొట్టి మొక్కలూ లేవు, మధ్యస్థపు ఎత్తు గల మొక్కలూ లేవు. ఒక పొడవు మొక్క, ఒక పొట్టి మొక్క నుండి వచ్చిన ప్రతీ విత్తు పొడవుగా పెరిగింది. పొడవు మొక్కల్లో స్వపరాగ సంపర్కం చేస్తే కనిపించినట్టుగా, ప్రతీ మొక్క పొడవుగా పెరిగింది. పొట్టిదనం అనే లక్షణం మటుమాయం అయ్యింది.
అప్పుడు మెండెల్ ఇందాక తాను పెంచిన పొడవాటి మొక్కలలో స్వపరాగ సంపర్కం చేశాడు. వాటిలో శుద్ధ అనువంశికత కనిపించలేదు. వాటి నుండి వచ్చిన విత్తుల్లో ముప్పావు వంతు పొడవాటి మొక్కలుగాను, పావు వంతు పొట్టి మొక్కలుగాను పెరిగాయి.
అంటే పొట్టిదనం అనే లక్షణం పూర్తిగా మాయం కాలేదన్నమాట. అది కేవలం ఒక తరం ప్రచ్ఛన్నంగా ఉండిపోయిందంతే.
ఈ పరిణామాన్ని మెండెల్ ఈ విధంగా వివరించాడు. ప్రతీ మొక్కలోను ఒక ప్రత్యేక భౌతిక లక్షణాన్ని షాషించే రేండు ఫాక్టర్లు (కారణాంశాలు) ఉంటాయి. వాటిలో ఒకటి తల్లి నుండి, మరొకటి తండ్రి నుండి వస్తుంది (ఈ ఫాక్టర్లు అసలు ఏంటి అన్న విషయం మాత్రం మెండెల్ కి అర్థం కాలేదు.)
ఉదాహరణకి పొడవు అనే లక్షణాన్ని కలుగజేసే లక్షణం T అనుకుందాం. అలాగే పొట్టిదనం అనే లక్షణాన్ని కలుగజేసే ఫాక్టర్ పేరు s అనుకుందాం. పొట్టి మొక్కల్లో రెండు s లు ఉంటాయి. కనుక దాన్ని ss అని సూచించవచ్చు. ఒక ss మొక్కలో ప్రతీ శుక్రకణంలోను ఈ ఫాక్టర్ లలో ఒకటి ఉంటుంది కనుక, శుక్రకణంలో ఒక s ఉంటుంది. అదే విధంగా ప్రతీ అండకణంలోను ఒక s ఉంటుంది.
పొట్టి బఠాణీ మొక్కకి చెందిన శుక్రకణం, పొట్టి బఠాణీ మొక్కకి చెందిన అండకణంతో కలిసినప్పుడు, ఆ వచ్చిన విత్తుకి శుక్రకణం నుండి ఒక s, అండకణం నుండి మరో s సంక్రమిస్తాయి. అంటే ఆ విత్తు ss జాతి విత్తు అవుతుంది. అది పొట్టి మొక్కగా వికాసం చెందుతుంది. పొట్టి మొక్కలన్నిటి లోను ఇదే జరుగుతుంది.
పొడవాటి బఠాణీ మొక్క యొక్క పొడగరితనానికి రెండు ఫాక్టర్లు ఉండొచ్చు. అవి TT రకం కావచ్చు. అండ కణం నుండి ఒక T, శుక్రకణం నుండి మరో T, రెండూ కలిసి TT అవుతుంది. కనుక అలాంటి విత్తులన్నీ కూడా పొడవు మొక్కలుగా పెరుగుతాయి.

(ఈ కథ అసిమోవ్ రాసిన "హౌ డిడ్ వి ఫైండ్ అవుట్ అబౌట్ జీన్స్" అన్న పుస్తకం నుండి తీసుకోబడింది.)
1. మెండెల్ - బఠాణీ మొక్కలు
పిల్లలు తల్లిదండ్రుల పోలికలతో పుడతారని అందరికీ తెలుసు. సాధారణంగా కొన్ని పోలికలు తల్లి నుండి, కొన్ని తండ్రి నుండి వస్తాయి. అలాగే తోబుట్టువుల మధ్య కూడా పోలికలు కనిపిస్తాయి.
తల్లి దండ్రులు పొడుగ్గా ఉంటే పిల్లలు కూడా తరచు పొడుగ్గా ఉంటారు. తల్లిదండ్రులకి పిల్లి కళ్ళు ఉంటే పిల్లలకీ పిల్లి కళ్ళు వస్తాయి. తల్లిదండ్రులు నల్లనివారైతే పిల్లలూ నల్లగానే పుడతారు.
ఈ లక్షణాలన్నీ అనువంశికంగా సంక్రమిస్తాయి.
మనుషుల్లోనే కాదు, జంతువులలోను మొక్కల లోను కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. పసి జీవాలు, అవి ఏ జాతికి చెందినవి అయినా సరే, వాటి తల్లిదండ్రులని పోలి ఉంటాయి. తాటి చెట్టుకి తాబేలు పుట్టదు. ఆలుచిప్ప నుండి అరవిందం మొలవదు. ఇక పులి కడుపున పిల్లి పుట్టదన్న నానుడి ఉండనే ఉంది.
మరి తల్లిదండ్రుల నుండి పిల్లలకి ఈ భౌతిక లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి?
మనుషులలో ఈ అనువంశిక లక్షణాలు ఎలా సంక్రిమిస్తాయో చెప్పటం కష్టం. మొదటి సమస్య ఏంటంటే శారీరక లక్షణాలు కోకొల్లలు. అసలు వాటిని లెక్కించటమే కష్టం. అంతే కాక పిల్లలు ఎదిగే వరకు ఆగాలంటే చాలా కాలం పడుతుంది. ఎదిగితే గాని ఏ పోలిక ఎవరి నుండి వచ్చిందో చెప్పటం కష్టం. అలాగే ఒకే దంపతులకి గంపెడు సంతానం ఉంటే పిల్లల్లో వైవిధ్యం ఉంటుంది కనుక మన పరిశోధనకి సదుపాయంగా ఉంటుంది. కాని గంపెడు సంతానం గల తల్లిదండ్రులు అరుదే. ఇవన్నీ కాక పూనుకుని ప్రయోగాలు తలపెట్టవచ్చు. పొడవాటి ముక్కున్న పెద్ద మనిషికి, చప్పిడి ముక్కున్న చుక్కతో పెళ్లి చేసి, వాళ్లకి పుట్టిన పిల్లల ముక్కుల్ని పరీక్షించాలి. అలాగే చప్పిడి ముక్కు చిన్నోడికి, సూది ముక్కు సుదతిని ఇచ్చి పెళ్లి చేసి, మళ్లీ పిల్లల ముక్కులని పరీక్షించాలి. లేదా ప్రత్యేకమైన శారీరక లక్షణాలు గల దంపతుల కోసం గాలించాలి. ఇవన్నీ చేయొచ్చు గాని ఈ వ్యవహారం అంతా తేలాలంటే చాలా కాలం పడుతుంది.
ఈ సమస్య గురించే ఒక శతాబ్దం క్రితం ఆస్ట్రియాకి చెందిన ఓ సాధువుకి ఓ చక్కని ఉపాయం తట్టింది. అతని పేరే గ్రెగర్ యోహాన్క్ మెండెల్ (1822-1884).
ఈ మెండెల్ కి బడిపంతులు కావాలని చాలా కోరికగా ఉండేది. కాని ఆ ఉద్యోగం రావాలంటే ఓ ప్రవేశపరీక్ష పాసు కవాలి. కాని పాపం అతగాడు అందులో మూడు సార్లు తప్పాడు. ఉద్యోగం రాకపోయినా తనకి ప్రియాతిప్రియమైన వృక్షశాస్త్రానికే జీవితమంతా అంకితం చెయ్యాలని సంకల్పించాడు.
సరిగ్గా అదే సమయంలో తనకో బ్రహ్మాండమైన ఉపాయం వచ్చింది. అనువంశిక భౌతిక లక్షణాలని పరిశోధించటానికి సులభమైన మార్గం మొక్కల్ని పెంచటమేనన్న ఆలోచన అతనికి 1857 లో వచ్చింది. మొక్కలతో ఓ సౌకర్యం ఏంటంటే అవి ఉన్నచోటి నుండి కదలవు. కనుక వాటిని సులభంగా నియంత్రించవచ్చు. కనుక మొక్కల పెంపకాన్ని కూడా సులభంగా నియంత్రించవచ్చు. మొక్కల్లో పరాగ సంపర్కానికి కావలసిన కణాలు పుప్పొడిలో ఉంటాయి. పువ్వుల కేంద్రంలో పిస్టిల్క్ అని ఓ అంగం ఉంటుంది. అందులో ఉండే అండాశయంలో (ఓవ్యూల్) అండకణం ఉంటుంది. ఒక మొక్క నుండి పుప్పొడిని (ఇందులో శుక్ర కణం ఉంటుంది) తీసుకుని మరో మొక్క యొక్క పిస్టిల్క్ మీద అద్దాలి. దాన్నే పరపరాగ సంపర్కం (క్రాస్ పోలినేషన్) అంటారు. పిస్టిల్ మీద రాలిన పుప్పొడిలోనుండి ఓ సన్నని నాళం కిందికి దిగుతుంది. ఆ నాళంలోంచి శుక్ర కణం కిందికి ప్రయాణించి అండాశయంలో ఉండే అండకణంలో ఐక్యం అవుతుంది. దాన్నే ఫలదీకరణం (ఫెర్టిలైజేషన్ ) అంటారు. ఫలదీకరణం తరువాత అండాలు విత్తనాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ విత్తనాలని పాతితే వేగంగా ఎదిగి మొక్కలు అవుతాయి. అలా పుట్టిన మొక్కల లక్షణాలని, పరాగాన్ని పిస్టిల్క్‌ని ప్రసాదించిన మొక్కల లక్షణాలతో పోల్చాలి.
అసలు నిజానికి ఒక మొక్క నుండి తీసుకున్న పుప్పొడిని అదే మొక్కకి చెందిన పిస్టిల్క్ మీద వేయొచ్చు. అలా పుట్టిన విత్తనాలకి తల్లిదండ్రి ఒకరే నన్నమాట. ఇందువల్ల మన పని కొంచెం సులభం అవుతుంది.
ఓ ఎనిమిదేళ్ల పాటు మెండెల్క్ బఠాణీ మొక్కల్లో పరాగ సంపర్కం చేస్తూ, ఫలితాలు పరీక్షిస్తూ పోయాడు.
మరికొంత వచ్చే టపాలో...
రచయిత: డాక్టర్ వి.శ్రీనివాస చక్రవర్తి.
పాశ్చాత్య సంస్కృతిలో మతానికి, సైన్సుకి మధ్య నిరంతర ఘర్షణ జరుగుతు ఉంటుంది. ఒక దాని మీద ఒకటి అధిపత్యం కోసం సతతం కలహించుకుంటూ ఉంటాయి. ఆ కలహం కొన్ని సార్లు వికార రూపాలు దాల్చుతుంది కూడా.
భారతీయ సంస్కృతిలో విజ్ఞానానికి, అధ్యాత్మికతకి మధ్య అలాంటి పోరాటం ఉన్నట్టు కనిపించదు. దానికి ఒక కారణం బహుశ సైన్సుకి మన దేశంలో లోతైన వేళ్లు లేకపోవడం కావచ్చు. ఎవరో ఎక్కడో కనుక్కున్న ఎంగిలి ముక్కల్ని ముక్కున పట్టుకుని నడిపిస్తున్న వ్యవహారంలా ఉంటుంది మన విజ్ఞానం. అదీ గాక మన దేశంలో విజ్ఞానం ఏదో పరీక్షల కోసం, పదవుల కోసం పడే ప్రాకులాటలో ఓ పనిముట్టు మాత్రమే! కనుక మతానికి సమాధానం చెప్పగల సత్తా మన విజ్ఞానంలో లేదు. ఇక్కడ విజ్ఞానం మరింత పటిష్ఠం కావాలంటే అందుకు మరింత లోతైన పునాదులు తవ్వాలి...
విజ్ఞానం బలహీనతని అలుసుగా తీసుకుని కాబోలు కుహనా "శాస్త్రాలు" మన దేశంలో పెచ్చరిల్లి పోతుంటాయి. చెయ్యి చూసి జాతకం చెప్పడం పాత పద్ధతి; కంప్యూటర్ ని "క్వెరీ" చేసి తలరాత తేల్చుకోవడం కొత్త "శాస్త్రీయ" పద్ధతి. సివిల్ ఇంజినీరింగ్ పుస్తకాల కన్నా "వాస్తు" మీద పుస్తకాలకి గిరాకి ఎకువగా ఉండడం విచిత్రంగా ఉంటుంది. (రెండిటికీ తేడా తెలీకపోవడం విచారంగా ఉంటుంది.) బల్లిపట్టు, చిలకజోస్యం, రేకీ, ప్రాణిక్ హీలింగ్, రిఫ్లెక్సాలజీ, "యోగా", ఆక్యుపంచర్, చేపవైద్యం, ... ఈ బాపతు పుస్తకాలని నమ్మినంత, సమ్మతించినంత సులభంగా ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని నమ్మదు మన సమాజం. (నమ్మడం అంటే దైనిక జీవితంలో ఆ పరిజ్ఞానాన్ని మన:పూర్వకంగా, లోతుగా భాగంగా చేసుకోవడం.) అపోలో అధినేత సుస్తీ చేస్తే ఆయుర్వేద నిపుణుణ్ణి సంప్రదిస్తాడు. ఇస్రో అధికార్లు లాంచ్ కి ముందు ఉపగ్రహ నమూనాన్ని తిరుపతి దేవుడికి ఓ సారి చూబిస్తారు! క్వాంటం శాస్త్రంలో ష్రోడింగర్ సమీకరణానికి, బ్రహ్మానికి మధ్య సంబంధాన్ని శోధిస్తాడో శాస్త్రవేత్త. ఓ అణు విజ్ఞాన శాస్త్రవేత్త రిటయిరయ్యాక మఠాధిపతి అవుతాడు. వైజ్ఞానిక విషయాలని ఇష్టం వచ్చినట్టు మతబోధకి ఊతగా వాడుకుంటూ ప్రవచిస్తుంటారు మన సాధువులు, ప్రవక్తలు...
ఇవన్నీ చూస్తుంటే మన దేశంలో సైన్సుకి, అధ్యాత్మికతకి మధ్య కలహం లేకపోగా ఓ విడ్డూరమైన స్నేహం, ఓ అసంగతమైన అనుబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. ఏది శాస్త్రమో, ఏది అశాస్త్రమో తెలీని మిథ్యామయ పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితి అంత శ్రేయస్కరం కాదని అనిపిస్తుంది. విజ్ఞానికి, అధ్యాత్మికతకి మధ్య అగాధమైన ఎడం ఉందన్నది స్పష్టం కావాలి. రెండిటీనీ అన్యాయంగా, అకాలంగా కలపకుండా వాటి వాటి శుద్ధ రూపాల్లో వాటిని ముందు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. రెండిటినీ సమన్వయ పరచడానికి కేవలం సదుద్దేశం ఉంటే సరిపోదు. అందుకు తగ్గ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ప్రస్తుతం లభ్యంగా లేదు. విజ్ఞానానికి, అధ్యాత్మికతకి మధ్య వివాదాన్ని వివాహంగా మార్చగల జ్ఞానాన్ని సాధించాలంటే మానవ జాతి మరి కొన్ని శతాబ్దాలు పురోగమించాల్సి ఉంటుందేమో...
ఇంత సుదీర్ఘమైన (కొంచెం భారమైన!) ఉపోద్ఘాతం ఓ మంచి కథకి ముందు మాట మాత్రమే. అది పాశ్చాత్య సంస్కృతికి చెందిన ఓ సాధువు కథ. విజ్ఞానం అంటే మనసు పడ్డ ఓ అరుదైన సాధువు కథ. అయితే అతగాడు మతభావాలని, విజ్ఞానంతో వికారంగా కలగలిపి విజ్ఞానాన్ని భ్రష్టు పట్టించలేదు. ఏ శాస్త్రీయ శిక్షణా లేని అతడు నిర్దోషమైన శాస్త్రీయ ప్రమాణాలని అనుసరిస్తూ తన ఆశ్రమ వాటికనే ప్రయోగశాలగా తీర్చి దిద్దుకున్నాడు. ఓ ముఖ్యమైన ఆధునిక శాస్త్ర రంగానికి ప్రేమగా తన పెరట్లోనే స్వహస్తాలతో పునాదులు తవ్వాడు.
ఆ సాధువు పేరు గ్రెగర్ మెండెల్. ఆ రంగమే జన్యు శాస్త్రం.
- చక్రవర్తి
(వచ్చే కొన్ని టపాల్లో మెండెల్ కథ ధారావాహికంగా...)
గమనిక: ఈ టపాకు పాఠకుల స్పందనకనుగుణంగా వివరణ ఈ బ్లాగులో ఇచ్చాము. వివరణ కోసం ఇక్కడ నొక్కండి (Click here).



