శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

 కాంటర్బరీ సాధువులు చందమామ మీద గుర్తించిన చోటే సరిగ్గా చక్కని ఉల్కాబిలం వుందని, దాని చుట్టూ ఏర్పడ్డ రేఖలు ఇంకా చెరిగిపోలేదని, జాక్ హార్టుంగ్ అనే ఉల్కాశాస్త్రవేత్త కనిపెట్టాడు. ఉల్కాబిలానికి జోర్డానో బ్రూనో అని పేరు పెట్టారు. బ్రూనో పదహారవ శతాబ్దానికి చెందిన రోమన్ కాథొలిక్ పండితుడు. విశ్వమంతా అనంతంగా ప్రపంచాలు విస్తరించి ఉంటాయని, వాటిలో ఎన్నో ప్రపంచాలలో జీవరాశులు ఉంటాయని అతడు అప్పుడే ఊహించాడు. అలాంటి ‘’అశుభవచనాలు’’ పలికిన పాపానికి అతణ్ణి మతాధికారులు  1600లో బహిరంగంగా కట్టెకి కట్టి సజీవదహనం చేశారు.

రకమైన అన్వయాన్ని సమర్ధిస్తూ కలేమ్, మల్హోలాండ్ లు మరి కొన్ని ఆధారాలు అందించారు. అధిక వేగంతో పెద్ద వస్తువు చందమామని ఢీ కొన్నప్పుడు అది చందమామ గమనంలో సన్నని ఊగులాట కలిగిస్తుంది. ఊగులాట కాలానుగతంగా సద్దుమణుగుతుంది. అయితే అలా సద్దుమణగడానికి ఎనిమిది వందల సంవత్సరాలు సరిపోవు. చంద్రుడి గమనంలో అలాంటి డోలనాన్ని లేజర్ పద్ధతులతో కనిపెట్టొచ్చు. అపోలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం మీద కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేకమైన అద్దాలు ప్రతిష్ఠించారు. వాటిని లేజర్ ఇంటర్ఫియరో మీటర్లు (laser interferometers) అంటారు. భూమి నుండి ప్రసరించిన లేజర్ కిరణం అద్దాల మీద పడి వెనక్కు పరావర్తనం చెందుతుంది. లేజర్ కిరణం రాను పోను ప్రయాణానికి పట్టే సమయాన్ని చాలా కచ్చితంగా కొలవచ్చు. సమాయాన్ని కాంతివేగంతో గుణిస్తే క్షణం భూమి నుండి చందమామ దూరాన్ని చాలా కచ్చితంగా అంచనా వేయొచ్చు. అలాంటి కొలతలు ఏళ్ల తరబడి పదే పదే తీసుకున్నారు. సమాచారాన్ని విశ్లేషించగా చందమామ నిజంగానే కంపిస్తోందని (librating), కంపనం యొక్క ఆవృత్తి (period) మూడేళ్లు అని, కంపనం యొక్క వ్యాప్తి మూడు మీటర్లని స్పష్టంగా తెలిసింది. దీన్ని బట్టి జోర్డానో బ్రూనో పేరు పెట్టిన ఉల్కాబిలం ఇటీవలి కాలంలోనే అంటే వెయ్యేళ్ల లోపే చందమామని ఢీ కొన్న ఉల్క చేత తవ్వబడిందని తెలుస్తోంది.

 

ఆధారాలన్నీ పరోక్షమైన ఆధారాలే. ఇందాక చెప్పుకున్నట్టు ఇటీవలి కాలంలో అంటే చారిత్రక యుగంలో అలాంటి ఘటనలు జరిగే ఆస్కారం చాలా తక్కువ. ఆస్కారం మాట ఎలా ఉన్నా, ఉన్న ఆధారాలు అలాంటి అవకాశాన్ని మాత్రం సూచిస్తున్నాయి. తుంగుష్కా ఘటనే కాక, ఆరిజోనా లోని ఉల్కాబిలం కూడా అభిఘాత ఉపద్రవాలన్నీ సౌరమండలం యొక్క తొలిదశలలో జరిగినవి కావని చెప్తున్నాయి. అయితే చందమామ మీద ఏర్పడ్డ ఉల్కాబిలాలలో కొన్నిటికే విస్తృతమైన రేఖావ్యవస్థలు ఉన్నాయన్న వాస్తవం బట్టి, చందమామ మీద కూడా అంతో ఇంతో ఒరిపిడి జరుగుతుందని నమ్మవలసి ఉంటుంది.[1] చందమామకి సంబంధించిన స్తరవిన్యాస శాస్త్రాన్ని (stratigraphy) బట్టి  చంద్రుడి మీద ఉల్కాబిలాలు లోపలి స్తరాలలో పూడుకుపోయాయో, ఉల్కాబిలాలు పైన ఉపరితలం మీద ఉన్నాయో మొదలైన సంగతులన్నీ కనిపెట్టొచ్చు. అలాంటి విశ్లేషణ ఆధారంగా చందమామ మీద ఉల్కల అభిఘాత చరిత్రని క్రమబద్ధంగా కూర్చవచ్చు. అలాంటి అభిఘాత చరిత్ర యొక్క చివరి దశలలోనే ఇందాక మనం చెప్పుకున్న జోర్డానో బ్రూనో ఉల్కాబిలం ఏర్పడింది. కింది చిత్రం, భూమి నుండి చూసినప్పుడు చంద్రోపరితలం మీద మనకి కనిపించే దృశ్యాలని కళ్లకి కట్టినట్టు ప్రదర్శిస్తుంది.

 


 

భూమి చందమామకి చాలా దగ్గరగా వుంది. చందమామ మీద ఉల్కాబిలాలు అంత ఎక్కువగా ఉంటే, మరి పక్కనే ఉన్న భూమి దెబ్బల నుండి ఎలా తప్పించుకుంది? ఆరిజోనా లోని ఉల్కాబిలం లాంటివి  భూమి మీద అంత అరుదుగా ఎందుకున్నాయి? ఉల్కలు, తోకచుక్కలు మనలాంటి జీవరాశులు ఉన్న గ్రహం మీద దాడి చెయ్యడం సముచితం కాదనుకున్నాయా? నింగి నుండి రాలే రాళ్లకి అంతటి ఇంగితం ఉంటుందనుకోను. తేడాకి మనం ఇవ్వగల వివరణ ఒక్కటే. భూమి మీద, చందమామ మీద కూడా ఉల్కాబిలాలు ఏర్పడే వేగం ఒక్కటే కావచ్చు. కాని నిర్వాతమై, నిర్జలమైన చందమామ మీద ఏర్పడ్డ ఉల్కాబిలాలు యుగయుగాల కాలం నిశ్చలంగా మిగిలిపోతాయి. భూమి మీద అనుక్షణం జరిగే ఒరిపిడి వాటి ఆనవాళ్లని చెరిపేస్తూ ఉంటుంది. పారే నీరు, ధూళిని రవాణాచేసే దుమారం, పర్వతాల పుట్టుక మొదలైన వన్నీ నెమ్మదిగా జరిగే ప్రభావాలే. కాని అవి లక్షల, కోట్ల సంవత్సరాల పాటు జరిగినప్పుడు ఎంత పెద్ద ఉల్కాబిలపు గాయాలనైన నయం చెయ్యగల సత్తాగలవని మర్చిపోకూడదు.

 

చందమామ మీద గాని, మరే ఇతర గ్రహం మీద గాని, అంతరిక్షం నుండి రాలే ఉల్కల్లాంటి బాహ్య ప్రభావాలు గాని, భూకంపాల వంటి అంతరంగ ప్రభావాలు గాని, పని చేస్తూ ఉంటాయి. అగ్నిపర్వత విస్ఫోటాల్లా ప్రచండ వేగంతో పని చేసే ప్రక్రియలు ఉంటాయి. అతినెమ్మదిగా యుగయుగాల పాటు జరిగే ప్రభావాలూ ఉంటాయి. గాలి మోసుకుపోయే సన్నని ఇసుక రేణువులు నేల మీద పోగై గుట్టలుగా ఏర్పడడం వంటిది రెండవ కోవకి చెందిన పరిణామం. రెండు రకాల ప్రభావాలలో దేనిది పైచేయి అవుతుంది? అంటే అందుకు సామాన్యమైన సమాధానమేమీ లేదు. బాహ్య ప్రభావాలు గెలుస్తాయా, అంతః ప్రభావాలు గెలుస్తాయా అంటే చెప్పడం కష్టం. కానరాని అరుదైన విధ్వంసాత్మక ఘటనలు ముఖ్యమా, కనీకనిపించని సర్వసామాన్యమైన రోజూవారీ ఘటనలు ముఖ్యమా అనే ప్రశ్నకి సులభమైన జవాబు లేదు. చందమామ మీద బాహ్య ప్రభావాలు, విధ్వంసాత్మక పరిణామాలు రాజ్యం చేస్తాయి. భూమి మీద నెమ్మదిగా, అంతరంగంలో సాగే ప్రక్రియల పెత్తనం ఎక్కువగా ఉంటుంది. ఇక మార్స్ పరిస్థితి రెండిటికీ మధ్యస్థంగా ఉంటుంది.

 

మార్స్ కక్ష్యకి, జూపిటర్ కక్ష్యకి మధ్య లెక్కలేనన్ని ఉల్కాశకలాలు ఉన్నాయి. ఇవి భూమిలా కఠిన పదార్థం గల బుల్లి గ్రహాలు. వీటిలో అతి పెద్దవి కొన్ని వందల కిలోమీటర్ల వ్యాసం కలిగి వుంటాయి. కొన్ని పొడుగ్గా స్తంభాల్లా వుండి అంతరిక్షంలో గిరికీలు కొడుతూ పోతుంటాయి. కొన్ని సార్లు రెండు, మూడు ఉల్కా శకలాలు ఒక దాని చుట్టూ ఒకటి పరస్పర కక్ష్యలలో పరిభ్రమిస్తుంటాయి. ఉల్కాశకలాల మధ్య అభిఘాతాలు తరచు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు ముక్క విరిగి వేరుపడి భూమి దిశగా దూసుకువెళ్లి, భూమి మీద ఉల్కలా రాలిపోతుంది. మన మ్యూజియమ్లలో ఉల్కాశకలాలని, సుదూర ప్రపంచాల నుండి వచ్చిన తునియలని, భద్రంగా దాచుకుని గర్వంగా ప్రదర్శించుకుంటుంటాం. ఉల్కాశకలాల వలయం (asteroid belt)  ఒక పెద్ద పిండి మర లాంటిది. అది తన లోని ఉల్కాశకలాలని  నూరి నూరి చివరికి ధూళి స్థాయికి తెస్తుంది. వాటిలో కాస్త పెద్ద ఉల్కాశకలాలే గ్రహ్ల మీద ఏర్పడే ఉల్కాబిలాలకి కారణాలు. ఉల్కాశకల వలయం ఉన్న ప్రాంతంలో ఒక గ్రహం ఏర్పడడానికి ప్రయత్నించి, పక్కనే వున్న జూపిటర్ యొక్క తీవ్ర గురుత్వ ప్రభావం వల్ల, ఏర్పాటులో విఫలం అయ్యుండొచ్చు. లేదా అక్కడ ఒకప్పుడు ఉన్న గ్రహం ఏదో కారణం వల్ల పెటేలుమని పేలిపోయి ఉండొచ్చు. అయితే ఒక నిండు గ్రహం దానంతకు అది ఎలా పేలిపోయి ఉంటుందో ఊహించడం కష్టం.

సాటర్న్ చుట్టూ ఉండే వలయాలు కొంతవరకు ఉల్కాశకల వలయాలని పోలి వుంటాయి. సాటర్న్ చుట్టూ కొన్ని ట్రిలియన్ల మంచు కణికలు వలయాలుగా ఏర్పడి ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. సాటర్న్ చుట్టూ ఉండే  అవశేషాలు సాటర్న్ గురుత్వానికి లోబడి, సమీపంలో ఉన్న ఉపగ్రహంలోనో కలిసిపోకుండా, అలా సాటర్న్ చుట్టూ తిరుగుతుంటాయి. లేదంటే సాటర్న్ ఉపగ్రహాల్లో ఒకటి మాతృగ్రహానికి మరీ దగ్గరగా రాగా, దాని భారీ గురుత్వాకర్షణ ప్రభావం చేత ఉపగ్రహంలో గురుత్వ కెరటాలు ఏర్పడి ఉపగ్రహం తుత్తునియలై పోవడం వల్ల సాటర్న్ వలయాలు ఏర్పడి వుండొచ్చు. సాటర్న్ వలయాల గురించి మరో సిద్ధాంతం కూడా వుంది. సాటర్న్ ఉపగ్రహాలలో ఒకటైన టైటన్ నుండి పైకి తన్నుకొచ్చే ద్రవ్యరాశికి, సాటర్న్ వాతావరణంలో పతనమై కలిసిపోయే ద్రవ్యరాశికి మధ్య ఒక విధమైన సమతూనిక ఏర్పడి వుండొచ్చు. అలా ఏర్పడ్డ సమతూనికకి పర్యవసానమే సాటర్న్ వలయాలు కావచ్చు. జూపిటర్, యురేనస్ గ్రహాల చుట్టూ కూడా వలయాలు ఉంటాయి. వాటిని ఇటీవల కాలంలోనే కనుక్కున్నారు. భూమి నుండి చూసినప్పుడు అవి ఇంచుమించు అదృశ్యంగా మిగిలిపోతాయి. మరి నెప్ట్యూన్ చుట్టూ వలయాలు ఉన్నాయా లేవా అన్న విషయంలో గ్రహశాస్త్రవేత్తలు తర్జనభర్జనలు పడుతున్నారు. విశ్వం మొత్తంలోను బృహస్పతిని పోలిన బృహద్ గ్రహాలకి వలయాలు ప్రత్యేక అలంకారం కావచ్చు.

(ఇంకా వుంది)



[1] మార్స్ మీద కూడా ఒరిపిడి తరచుగా జరుగుతుంది. అక్కడ ఉల్కాబిలాలు ఉన్నాయి గాని నలుదిశలా రేఖలు ఉన్న ఉల్కాబిలాలు కనిపించలేదు.

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts