శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

  

సల్ఫర్ రంగు పొగమంచు వీనస్ ఉపరితలానికి 4.5 కిమీల ఎత్తు వరకు కూడా విస్తరించి వుంటుంది. అంతకన్నా దిగువన దట్టమైన, నిర్మలమైన వాతావరణం ఉంటుంది. అయితే అక్కడ వాతావరణ పీడనం ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఉపరితలం కనిపించదు. సూర్యకాంతి వాతావరణంలోని అణువుల చేత ఎంతగా చెల్లాచెదురు చెయ్యబడుతుందంటే ఇక ఉపరితలానికి చెందిన చిత్రాలు బయటికి పోవు. అక్కడ మబ్బులు గాని, దూళి గాని లేవు. వాతావరణమే ఇంకా ఇంకా దట్టమై, చిక్కనవుతూ ఉంటుంది. పైనున్న మబ్బుల్లోంచి కూడా ఎంతో సూర్యకాంతి కిందికి ప్రసరిస్తుంది. భూమి మీద మబ్బేసినపుడు ఎంత ఎండ పడుతుందో ఇదీ అంతే.

దహించే వేడిమితో, పిప్పి చేసే పీడనంతో, విషపూరిత వాయువులతో, సర్వత్ర ఆవరించిన విడ్డూరమైన సంజె కాంతితో, వీనస్ ని ప్రేమదేవత అనడం కన్నా నరకానికి ప్రతిరూపం అంటే సబబేమో. మనం గుర్తుపట్టగలిగేటంత మేరకు, ఏదో అక్కడక్కడా కాస్త నునుపుదేలిన బండలు కనిపించినా, దూర గ్రహం నుండి వచ్చి వాలిన వ్యోమనౌకల శిధిలాలు ముక్కలు ముక్కలై ధూళిలో పడి కనిపించినా, మొత్తం మీద విషమయ వాతావరణంతో కప్పబడ్డ మరుభూమి వీనస్.[1]

 

(image credit: https://www.smithsonianmag.com/science-nature/giant-planetary-smashup-may-have-turned-venus-hot-and-hellish-180958377/)

గ్రహం మొత్తం మీద వ్యాపించిన ఉపద్రవం వీనస్ లో కనిపిస్తుంది. ఉపరితల ఉష్ణోగ్రతలు అంత ఎక్కువగా ఉండడానికి కారణం అక్కడ బృహత్తర స్థాయిలో పని చేసే హరితగృహ ప్రభావమేమని ఇప్పుడు మనకి చూచాయగా తెలుసు. వీనస్ మేఘమండలాన్ని ఛేదించిన సూర్యకాంతి వీనస్ ఉపరితలాన్ని చేరుకుంటుంది. వేడెక్కిన ఉపరితలం వేడిమిని ఉష్ణతరంగాల రూపంలో తిరిగి అంతరిక్షంలోకి ప్రసరించడానికి ప్రయత్నిస్తుంది. కాని సూర్యుడితో పోల్చితే వీనస్ బాగా చల్లగా ఉంటుంది కనుక, దాని నుండి వెలువడే వికిరణాలు దృశ్య ప్రాంతంలో కన్నా పరారుణ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటాయి. కాని వీనస్ వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సయిడ్, నీటి ఆవిర్లు పరారుణ తేజానికి ఇంచుమించు అపారదర్శకంగా ఉంటాయి.[2] కాబట్టి సూర్యకాంతి లోని వేడిమి వాతావరణంలో బంధింపబడుతుంది. ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలా అధిక పీడనం గల వాతావరణం లోంచి బయటికి పోయే పరారుణ వికిరణ శక్తి, దిగువ వాతావరణంలోను, ఉపరితలం లోని లోనికి గ్రహించబడే వికిరణ శక్తితో సరితూగే వరకు ప్రక్రియ కొనసాగుతుంది.

మన పొరుగు ప్రపంచం చాలా దారుణమైన ప్రపంచం అని వేరే చెప్పనక్కర్లేదు. కాని మనం వీనస్ కి వెళ్లే ప్రయత్నాలు చెయ్యక మానము. వీనస్ లో ఏదో ఆకర్షణ వుంది. గ్రీకు, నోర్స్ పురాణాలలో  ఎందరో వీరులు నరకాన్ని సందర్శించి తిరిగొచ్చిన ఘట్టాలు ఉన్నాయి. నరకంతో పోల్చితే స్వర్గంలా కనిపించే మన గ్రహం గురించి కూడా తెలుసుకోవలసింది ఇంకా ఎంతో వుంది.

 

సగం మనిషి, సగం సింహం ఆకారంలో ఉండే స్ఫింక్స్  5,500 నిర్మించబడింది. అప్పుడు దాని ముఖం మీద రూపురేఖలు స్పష్టంగా తీరుగా ఉండేవి. కాని కొన్ని వేల ఏళ్ళ ఈజిప్టు వాయుదుమారాల మర్దన ప్రభావం చేత, అరకొరగా పడే వానల ప్రభావం చేత, దాని ముఖకవళికలు నునుపుదేలాయి. న్యూ యార్క్ నగరంలో క్లియోపాట్రా సూది (Cleopatra’s Needle)  అని పెద్ద స్మారక చిహ్నం వుంది. అది ఈజిప్ట్ నుండీ వచ్చింది. చిహ్నం నగరంలోని సెంట్రల్ పార్క్ లో వుంది. ఒక్క వందేళ్లలోనే చిహ్నం మీద చెక్కబడ్డ శాసనంలోని అక్షరాలు ఇంచుమించు పూర్తిగా చెరిగిపోయాయి. దానికి కారణం పారిశ్రామిక కాలుష్యం. వీనస్ వాతావరణంలోని రసాయనిక ఒరిపిడి లాంటిదే ఇదీను. భూమి మీద జరిగే ఒరిపిడి  (erosion)  సమాచారాన్ని నెమ్మదిగా తుడిచేస్తుంది. కురిసే వర్షపు చినుకులు, కొరికే ఇసుక దుమారాలు మొదలైన వాటి ప్రభావాలు మందగతిలో కనిపిస్తాయి కనుక పెద్దగా పట్టించుకోము. కొండల వంటి పెద్ద పెద్ద నిర్మాణాలైతే కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా తరుగుదల లేకుండా నిలుస్తాయి. కాస్త చిన్నపాటి ఉల్కాబిలాలైతే లక్ష సంవత్సరాలు నిలుస్తాయేమో.[3] ఇక పెద్ద పెద్ద మానవ నిమాణాలైతే కొన్ని వేల ఏళ్ల నిలుస్తాయి. మందగతిలో, కాలానుగతంగా సాగే ఒరిపిడి కాకుండా, ఉపద్రవాల వల్ల ఉన్నట్లుండి జరిగే విధ్వంసం కూడా ఉంటుంది. స్ఫింక్స్ కి ఇప్పుడు ముక్కు లేదు. ఒళ్లు తెలియని కోపంలో ఎవరో ధూర్తులు దాన్ని నరికేసి ఉంటారు. అది చేసిన వాళ్లు మామలూక్ టర్కులు అని కొందరంటే, కాదు నెపోలియన్ సేనల్లోని సిపాయిలు అని మరి కొందరు.

భూమి మీద, వీనస్ మీద, సౌరమండలం లో ఎన్నో ఇతర ప్రదేశాలలో కూడా, ఉపద్రవాత్మకమైన విధ్వంసంతో పాటు, మరింత మందగతిలో, సమంగా సాగే ప్రభావాలు కూడా ఉంటాయని ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి భూమి మీద పడే వాన వాగులై, వంకలై, నదులై ప్రవహించి జలాపనీతాలని (alluvial basins) ఏర్పరుస్తుందిమార్స్ మీద ప్రాచీన నదులు నేలలో కోసిన అగాధాలు కనిపిస్తాయి. జూపిటర్ ఉపగ్రహాలలో ఒకటైన అయో మీద ద్రవరూపంలో ఉన్న సల్ఫర్ ప్రవాహాల వల్ల ఏర్పడ్డ విశాలమైన కాలువలు కనిపిస్తాయి. భూమి మీద ఉండే వాతావరణ వ్యవస్థ వంటిదే, వీనస్, జూపిటర్ వాతావరణంలో పై ఎత్తుల్లో కూడా ఉంది. భూమి మీద, మార్స్ మీద కూడా ఇసుక తుఫానులు ఉంటాయి. భూమి మీదే కాక జూపిటర్, వీనస్ మీద కూడా ఉరుములు, మెరుపులు ఉంటాయి. భూమి మీద, అయో మీద కూడా అగ్నిపర్వతాలు శిలా పదార్థాన్ని వాతావరణంలోకి వెళ్లగక్కుతాయి. భూమి మీద జరుగుతున్నట్టే వీనస్, మార్స్, గానిమీడ్, యూరోపాలలో కూడా అంతరంగ భౌగోళిక ప్రక్రియలు అతి నెమ్మదిగా ఉపరితలాన్ని మలస్తున్నాయి. మందగతికి మరో పేరని చెప్పుకోదగ్గ హిమానీనదాలు (glaciers) భూమి మీదే కాక, మార్స్ మీద కూడా నేల రూపురేఖల్ని చెక్కుతున్నాయి. ప్రక్రియలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. యూరప్ లో అధికభాగ ఒకప్పుడు మంచుతో కప్పబడి ఉండేది. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితమే ప్రస్తుతం షికాగో నగరం ఉన్న స్థలం మూడు కిలోమీటర్ల ఎత్తు మంచు పొర కింద పూడుకుపోయి ఉండేది. మార్స్ మీదే కాక, సౌరమండలంలో ఎన్నో ఇతర ప్రాంతాలలో కూడా, నేడు సాధ్యం కాని ఎన్నో భౌగోళిక విశేషాలు కనిపిస్తాయి. అవన్నీ కొన్ని మిలియన్ల, బిలియన్ల సంవత్సరాల క్రితం గ్రహాల వాతావరణం చాలా భిన్నంగా ఉన్న పరిస్థితుల్లో ఏర్పడ్డ విశేషాలు కావచ్చు.

 

భూమి మీద నేలని, వాతావరణాన్ని కూడా మార్చగలిగే మరో శక్తి కూడా ఉంది. పర్యావరణంలో గణనీయ మార్పులు తేగల ప్రజ్ఞగల జీవులే శక్తి. వీనస్ మీద జరిగినట్టే, భూమి మీద కూడా పెద్ద ఎత్తున హరితగృహ ప్రభావం కనిపిస్తుంది. హరితగృహ ప్రభావమే లేకుంటే భూమి మీద సగటు ఉష్ణోగ్రత నీటి ఘనీభవన బిందువు (freezing point)  కన్నా తక్కువగా ఉండేది. ప్రభావం వల్లనే సముద్రాలు ద్రవరూపంలో ఉన్నాయి. జీవనం సాధ్యమయ్యింది. కాబట్టి కాస్తంత హరితగృహ ప్రభావం మనకి మంచిదే. వీనస్ మీద ఉన్నట్టే భూమి మీద కూడా 90 వాతావరణాల కార్బన్ డయాక్సయిడ్ ఉంది. అయితే అది వీనస్ లో ఉన్నట్టు వాతావరణంలో కాక, నేలలో సున్నపు రాయి తదితర కార్బనేట్ల రూపంలో వుంది. భూమిని సూర్యుడికి మరి కాస్త దగ్గరిగా జరిపితే, ఉష్ణోగ్రత మరి కాస్త పెరుగుతుంది. దాని వల్ల ఉపరితలంలో ఉన్న శిలలలో దాగున్న CO2 కొంచెం వాతావరణంలోకి విడుదల అవుతుంది. దాని వల్ల హరితగృహ ప్రభావం మరింత తీవ్రం అవుతుంది. ఉపరితలం మరింత వేడెక్కుతుంది. వేడెక్కిన ఉపరితలం వల్ల మరిన్ని కార్బొనేట్లు CO2 గా మారుతాయి. విధంగా హరితగృహ ప్రభావం అడ్డుఅదుపు లేకుండా పని చేస్తూ ఉష్ణోగ్రతలని అమితంగా పెంచేస్తుంది. వీనస్ గ్రహం మీద తొలి దశలలో సరిగ్గా ఇదే జరిగి వుంటుంది. సూర్యుడికి వీనస్ సమీపంగా ఉండడమే అందుకు కారణం. వీనస్ ఉపరితల పరిస్థితులు మనకొక హెచ్చరిక కావాలి. మన లాంటి గ్రహానికి కూడా అలాంటి గతి పట్టొచ్చునని చెప్పే పాఠం కావాలి.

 

మన ప్రస్తుత పారిశ్రామిక నాగరికతలో శక్తి వనరులు అధికభాగం శిలాజ ఇంధనాలే (fossil fuels). వంటచెరకు, చమురు, బొగ్గు, గ్యాస్ మండిస్తాం. దాని వల్ల వ్యర్థ వాయువులు, ముఖ్యంగా CO2 గాల్లోకి ప్రవేశిస్తాయి. దాని వల్ల పృథ్వీ వాతావరణంలో CO2  పెరుగుతూ పోతుంది. అదుపుతప్పిన హరితగృహ ప్రభావం అనేది ఉంటుంది అని అర్థం చేసుకుంటే మనం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. భూమి ఉష్ణోగ్రత ఒకటి, రెండు డిగ్రీలు పెరిగినా చాలు, అందుకు ఉపద్రవాత్మకమైన పర్యవసానాలు ఉంటాయి. బొగ్గు, చమురు మొదలైన వాటిని మండించడం వల్ల వాతావరణం లోకి సల్ఫురిక్ ఆసిడ్ ని ప్రవేశపెడుతున్నాం. వీనస్ వాతావరణం లాగానే మన వాతావరణంలో కూడా ఇప్పుడు గణనీయమైన స్థాయిలో సల్ఫురిక్ ఆసిడ్ బిందువులు ఉన్నాయి. మన మహానగరాలలో గాలి విషపదార్థాలతో నిండివుంది. మన చేష్టలని దీర్ఘకాలిక పర్యవసానాలని మనం అర్థం చేసుకోవడం లేదు.

 

అయితే మనం  మన వాతావరణాన్ని వ్యతిరేక దిశలో కూడా క్రమంగా మార్చుతున్నాం. కొన్ని లక్షల ఏళ్లుగా మనుషులు వంటచెరకు కోసం చెట్లు కొడుతూ వస్తున్నాం. పశువులని మేతకోసం విడిచిపెట్టి పచ్చిక బయళ్లు నాశనం చేస్తున్నాం. చెట్లు నరికి, అడవులని తగుల బెట్టి చేసే సేద్యం, పారిశ్రామిక ప్రయోజనాల కోసం నిరటవీకరణ, అతిమేత వల్ల పచ్చికబయళ్ల విధ్వంసం నేడు విచ్చలవిడిగా జరుగుతోంది. పచ్చికబయళ్ల కన్నా అడవులు మరింత చిక్కని రంగులో ఉంటాయి, ఎడారుల కన్నా పచ్చికబయళ్ళు మరింత చిక్కని రంగులో ఉంటాయి. కాబట్టి నేల గ్రహించుకునే సూర్య కాంతికి కూడా తరుగుతూ వస్తోంది. విధంగా నేల వినియోగంలో వస్తున్న మార్పుల వల్ల భూమి ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతోంది. నేల చల్లబడడం వల్ల ధృవాల వద్ద హిమావరణం పెరుగుతుంది. ధృవాల వద్ద మంచు పొర పెరిగితే, తెల్లని మంచు మరింతగా సూర్యకాంతిని ప్రతిబింబిస్తుంది. విధంగా గ్రహం మరింత చల్లబడుతుంది. అలా హరితగృహ ప్రభావానికి వ్యతిరేక దిశలో అదుపు తప్పిన ఆల్బేడో ప్రభావం కొనసాగుతుంది.[4]

చక్కని నీలి గ్రహం, భూమిఇదే మనకి తెలిసిన ఇల్లు. వీనస్ మరీ వేడిగా ఉంటుంది. మార్స్ మరీ చల్లగా ఉంటుంది. కాని భూమి మీద పరిస్థితులు సరిగ్గా సరిపోతాయి. మనుషుల పాలిటి వరం భూమి. మరి మనం పరిణామం చెందింది ఇక్కడే. అయితే సుఖమయ వాతావరణం శాశ్వతం కాకపోవచ్చు. అది అస్థిరమైనదని గుర్తుంచాలి. విడ్డూరమైన పద్ధతుల్లో, పరస్పర విరుద్ధమైన  విధానాలలో భూమి మీద పరిస్థితులని మనం భంగపరుస్తున్నాం. ఇలా అడ్డుఅదుపు లేకుండా పృథ్వీ పరిస్థితులని మారుస్తూ పోతూ, అటు నరకం లాంటి వీనస్ దిశగా నైనా, అటు మార్స్ మీద ఉన్నట్లు   ధరావ్యాప్త హిమయుగం  దిశగానైనా భూమిని తోస్తున్నామా? దానికి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే తెలియదనే చెప్పాలిసమాధానం ఎవరికీ తెలీదు. పృథ్వీ వాతావరణం యొక్క శోధన, భూమిని ఇతర ప్రపంచాలతో పోల్చుతూ చేసే అధ్యయనాలు, ఇవన్నీ ఇంకా అంకుర దశలో ఉన్నాయి. అధ్యయనాలకి కావలసిన ధనసహాయం కూడా అంతంత మాత్రంగానే వుంది. మన అజ్ఞానంలో మన గ్రహాన్ని అనాలోచితంగా ముందుకి వెనక్కి తోస్తున్నాం. వాతావరణాన్ని కలుషపరుస్తున్నాం. నేలని మరింత బోసిగా చేస్తున్నాం. మన చేష్టల దీర్ఘకాలిక పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియక బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నాం.

కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం, భూమి మీద అప్పుడే మానవుడు పరిణామం చెందిన తరుణంలో, భూమి అప్పటికే మధ్యవయసులో ఉండేది. యవ్వనపు ఆటుపోట్లని, దుడుకుతనాన్ని దాటి ప్రౌఢగా మారింది. కాని ప్రస్తుతం భూమి మీద మానవుడి ఉనికి నిశ్చయమైన భావిని సూచిస్తోంది. మన తెలివితేటలు, మన సాంకేతిక సత్తా వాతావరణం మీద ఎనలేని ప్రభావాన్ని చూపగల శక్తిని మన చేతిలో ఉంచాయి. శక్తిని మనం ఎలా ఉపయోగించుకుంటాం? మొత్తం మానవ కుటుంబం మీద ప్రభావం చూపే విషయాలలో ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా ఉంటామా? స్వల్పకాలిక ప్రయోజనాల కోసం భూమి యొక్క దీర్ఘకాలిక శ్రేయస్సుని వదులుకుంటామా? లేదా దీర్ఘకాలిక పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని, మన సంతతి కోసం, వారి సంతతి కోసం, మన గ్రహం మీద నెలకొన్న జీవరక్షక వ్యవస్థలని అర్థం చేసుకుని, పదిలంగా కాపాడుకుంటామా? భూమి ఒక అద్భుతమైన ప్రపంచం. అర్భకమైన ప్రపంచం. పసికందును కాచుకున్నట్టు దాన్ని కాచుకోవడం తప్ప మనకి వేరే దారి లేదు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



[1] అలాంటి అస్థిరమైన ప్రదేశంలో ఏదీ సజీవంగా మిగల్లేదు. అలాంటి పరిస్థితుల్లో కర్బన రసాయనాలు ముక్కలు చెక్కలవుతాయి. ఊరికే సరదాగా అలాంటి గ్రహం మీద ఒకప్పుడు ప్రజ్ఞగల జీవులు బతికేవారని అనుకుందాం. అలాంటి జీవులు సైన్స్ ని కనుక్కోగలరా? తారల, గ్రహాల్ పరిశీలనలు భూమి మీద సైన్స్ యొక్క అభివృద్ధికి ఎంతో స్ఫూర్తి నిచ్చాయి. కాని వీనస్ పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. రాత్రి చాలా సుదీర్ఘమై ఉంటుంది. (59 భూమి రోజులతో సమానం). కాని వీనస్ మీద రాత్రి వేళ ఆకాశం కేసి చుస్తే, భూమి నుండి చూసినప్పుడు కనిపించే ఖగోళ ప్రపంచం వంటిది ఏమీ కనిపించదు.  పగటి పూట సూర్యుడు కూడా కనిపించడు. సూర్యకాంతి ఆకాశంలో సమంగా విస్తరిస్తుంది. భూమి మీద సముద్ర గర్భంలో డైవ్ చేసేవారికి, సముద్ర గర్భంలో కాంతి సమంగా వ్యాపించినట్టు కనిపిస్తుంది. వీనస్ మీద రేడియో టెలిస్కోప్ ని నిర్మిస్తే అది సూర్యుణ్ణి, భూమిని, ఇతర ఖగోళ వస్తువులని గుర్తించగలుగుతుంది. అక్కడ ఖగోళశాస్త్రం రూపొందితే, అది కేవలం సైద్ధాంతికమే అవుతుంది. కేవలం భౌతిక శాస్త్ర సూత్రాల సహాయంతో తారల ఉన్కిని కనుక్కోవడానికి వీలవుతుంది. వీనస్ మీద ప్రజ్ఞ గల జీవులే ఉంటే, వాళ్లు ఏదో ఒక రోజు ఎగరడం నేర్చుకుని, వీనస్ మీద సాంద్రమైన వాయుమండలాన్ని ఛేదించుకుని, దాన్ని 45 కిమీల ఎత్తున ఆవరించిన విచిత్రమైన మేఘమండలాన్ని దాటుకుని, మొట్టమొదటి సారిగా సూర్యుణ్ణి, తారలని చూసినప్పుడు వారి స్పందన ఎలా ఉంటుందో అని కొన్ని సార్లు ఆలోచిస్తూ ఉంటాను.

[2] వీనస్ మీద నీటి ఆవిరి ఎంత ఉంది అన్న విషయంలో ఇప్పుడు పెద్దగా సందేహం లేదు. పయనీర్ వీనస్  ఎంట్రీ ప్రోబ్ ల మీద ఉండే గ్యాస్ క్రొమటోగ్రాఫ్ ల పరిశీలనల బట్టి దిగువ వాతావరణంలో 0.1 శాతం స్థాయిలో నీటి ఆవిరి వుంది. అందుకు భిన్నంగా సోవియెట్ ఎంట్రీ వాహనాలు వెనెరా 11, 12 లు చేసిన పరారుణ పరిశీలనల బట్టి నీటి ఆవిరి కేవలం 0.01 శాతం మాత్రమే వుంది. మొదటి విలువే నిజమైతే, కార్బన్ డయాక్సయిడ్, నీటి ఆవిరి కలిసి ఉపరితలం మీద వేడి మొత్తాన్ని వాతావరణంలోనే బంధించి ఉంచి, ఉపరితలాన్ని 480 డిగ్రీల సెల్షియస్ వద్ద ఉంచగలవు. రెండ విలువే నిజమైతే – అదే నిజమని నా అభిప్రాయం కూడా - కార్బన్ డయాక్సయిడ్, నీటి ఆవిరి కలిసి ఉపరితలం మీద వేడి మొత్తాన్ని వాతావరణంలోనే బంధించి ఉంచి, ఉపరితలాన్ని 380 డిగ్రీల సెల్షియస్ వద్ద మాత్రమే ఉంచగలవు. కాబట్టి వీనస్ వాతావరణ హరితగృహంలో పరారుణ ఫ్రీక్వెన్సీ వద్ద గవాక్షాలని మూసి వుంచడానికి మరేదో పదార్థం అవసరమవుతుంది. SO2, CO, HCl మొదలైన రసాయనాలు వీనస్ వాతావరణంలో సూక్ష్మ మోతాదుల్లో ఉన్నాయి. వీనస్ ఉష్ణోగ్రతని అంత అధికంగా ఉంచడానికి ఆ రసాయనాలు చాలు. కాబట్టి ఇటీవలి కాలంలో అమెరికా, రష్యాలు వీనస్ కి పంపిన మిషన్లు, వీనస్ ఉపరితలం మీద అధిక ఉష్ణోగ్రతలు ఉండడానికి కారణం హరిత గృహ ప్రభావమేనని నిర్ధారిస్తున్నాయి.

[3] ఇంకా కచ్చితంగా చెప్పాలంటే భూమి మీద 10 కిమీల వ్యాసం గల ఉల్కాబిలం ఏర్పడడానికి 500,000 ఏళ్లు పడుతుంది. యూరప్, ఉత్తర అమెరికా వంటి స్థిరమైన భౌగోళిక లక్షణాలు గల ప్రాంతాల్లో, అలాంటి బిలాలు 300 మిలియన్ల సంవత్సరాల పాటు కూడా ఒరిపిడిని తట్టుకుని మనగలుగుతాయి. ఇంకా చిన్న ఉల్కాబిలాలు మరింత తరచుగా ఏర్పడతాయి గాని, భౌగోళికంగా అస్థిరమైన ప్రాంతాల్లో, ఇంకా వేగంగా తుడిచిపెట్టుకుపోతాయి.

[4] ఆల్బెడో అంటే ఒక గ్రహం మీద పడే సూర్యకాంతిలో తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబించబడే కాంతి యొక్క భిన్నం. భూమి యొక్క ఆల్బెడో 30-35 శాతం మధ్యన ఉంటుంది. తక్కిన సూర్యకాంతి నేల చేత గ్రహించబడి, ఉపరితల సగటు ఉష్ణోగ్రతని పెంచుతుంది.

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts