శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

మార్స్ గ్రహపు ధరాసంస్కరణ (Terraforming Mars)

Posted by V Srinivasa Chakravarthy Saturday, July 2, 2022

 

కాని అలాంటి ప్రయత్నంలో కొత్త ప్రమాదం పొంచి వుంది. అది తిర్యక్-కాలుష్యం (back-contamination). మార్స్ మట్టిని భూమికి తెచ్చి సూక్ష్మక్రిముల కోసం విశ్లేషించాలంటే, మట్టిని ముందే క్రిమిరహితమయ్యేలా ప్రక్షాళన (sterilize) చెయ్యకూడదు. మిషన్ యొక్క లక్ష్యం క్రిములని భూమికి సజీవంగా తీసుకురావడం. కాని అప్పుడు మరో ప్రమాదం పొంచి వుండదూ? మార్స్ నుండి అపురూపంగా తెచ్చుకున్న సూక్ష్మక్రిముల వల్ల భూమి మీద ఆరోగ్య సమస్యలు తలెత్తితే? హెచ్. జి. వెల్స్, ఆర్సన్ వెలెస్ లు చేసిన మార్స్ కల్పనలో, మార్స్ నుండి వచ్చిన జీవాలు అమెరికాలో బోర్నెమౌత్, మరియు జర్సీ నగరాలని అణగదొక్కాలని ఎంతో ప్రయత్నిస్తాయి. కాని ఒక దశలో భూమికి చెందిన సూక్ష్మక్రిముల దాడికి తట్టుకోలేక మార్స్ వాసులలోని రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. కాని అందుకు వ్యతిరేకమైన పరిణామం కలిగితేనో? ఇది చాలా కఠినమైన సవాలు, జటిలమైన సమస్య. అసలు మార్స్ మీద సూక్ష్మక్రిములే ఉండకపోవచ్చు. ఉన్నా వాటిని గుప్పెడు తీసుకుని గాభరాగా మింగినా ముప్పూ వాటిల్లకపోవచ్చు. అయితే అలాగని నిశ్చయంగా చెప్పలేం. వాటి వల్ల గలిగే ముప్పు వెలకట్టలేనంత దారుణమైనది కూడా కావచ్చు. శుద్ధి చెయ్యని మార్స్ మట్టిని భూమికి తిరిగి తెచ్చే ఉద్దేశమే ఉంటే, భూమి మీద క్రిముల వ్యాప్తిని నిగ్రహించే వ్యవస్థ (containment system)  అత్యంత విశ్వసనీయమైనదై ఉండాలి. బాక్టీరియా ఆధారిత మారణాయుధాలని రూపొందించి, జమ చేసుకునే దేశాలు ఉన్నాయి. వాటి వల్ల అప్పుడప్పుడు జరిగిన అవాంతరాలు ఉన్నాయి. కాని నాకు తెలిసిన వాటి వల్ల ప్రపంచవ్యాప్తమైన అంటువ్యాధులు పెచ్చరిల్లలేదు. బహుశ మార్స్ మట్టిని నిజంగానే సురక్షితంగా భూమికి తేగలమేమో. కాని అలా మార్స్ మట్టిని భూమికి తిరిగి తెచ్చుకునే ముందు వాటి వల్ల అపాయమూ లేకుండా పూర్తిగా కట్టుదిట్టం చేసుకోవాలి.

మార్స్ గ్రహాన్ని శోచించడానికి, గ్రహం మీద మన కోసం ఎదురుచూస్తున్న అందాలని, ఆవిష్కరణలని అందుకోడానికి వేరే పద్ధతి కూడా ఉంది. వైకింగ్ చిత్రాలతో పని చేస్తున్నప్పుడు నా మనసులో పదే పదే రేగిన స్పందన మన అచలత పట్ల నిస్సహాయమైన కోపం. నా మనసులోనే మూగగా అంతరిక్షనౌకకి కనీసం మునివేళ్ల మీద అయినా లేచి మరి కాస్త ముందుకి చూడమని అభ్యర్థించాను. గ్రహాంతర ప్రయోగశాల అచలంగా ఉండేట్టుగానే రూపొందించబడింది అన్న విషయం మర్చిపోయి, అది రెండడుగులు వేసి పరిసరాలని పరిశీలించడం లేదేంటని నాలోనేనే చిరాకుపడడం నాకు బాగా గుర్తు. చేయి చాచితే అందేటంత దూరంలో వున్న ఇసుక తిన్నని కాస్త పొడిచి చూద్దామని, అల్లంత దూరంలో వున్న బండని పైకెత్తి కింద కిటకిటలాడుతున్న క్రిముల కోసం తొంగి చూద్దామని, ఇంకా దూరంలో కనిపిస్తున్న గుట్టల వెనుక ప్రగాఢ ఉల్కాబిలం దర్శనమిస్తుందో తెలుసుకుందామని, మనసు తహతహలాడుతుంది. ఇక దక్షిణ-తూర్పు దిశగా మరి కాస్త దూరం పోతే క్రైసే వద్ద కలిసే నాలుగు ఎండు కాలువలూ ఉన్నాయి. వైకింగ్ ఫలితాలు మనని సవాలు చేశాయి, సంధిగ్ధంలో పడేశాయి.  విషయాన్ని పక్కన బెడితే, వైకింగ్ లాండింగ్ ప్రదేశాల కన్నా ఆసక్తికరమైనవి మార్స్ మీద  కనీసం మరో వంద ప్రదేశాలనైనా ఎంపిక చెయ్యగలను. మనకి కావలసిన అసలైన పరికరం సంచాలక వాహనం, రోవర్. ఇమేజింగ్, జీవసాస్త్రం, రసాయన శాస్త్రం మొదలైన వాటికి సంబంధించిన అధునాతన ప్రయోగ పరికరాలని రోవర్ మోసుకుపోవాలి. అలాంటి రోవర్ల నమూనాలని ఇప్పటికే నాసా రూపొందిస్తోంది. బండల మీది కెక్కి ఎలా చిక్కుకోకుండా ఉండాలి, గుంతల్లో పడకుండా ఎలా జాగ్రత్తపడాలి, ఇరుకైన ప్రదేశాల్లోంచి ఎలా బయటపడాలిమొదలైనవన్నీ వాటికి తెలుసు. మార్స్ మీద రోవర్ ని దింపి, దాని పరిసరాలలోని అత్యంత ఆసక్తికరమైన ప్రదేశాలని చూడనిచ్చి, మళ్లీ మర్నాటికి అదే చోటికి వచ్చి ఉండేలా దాన్ని ప్రోగ్రాం చెయ్యడం ప్రస్తుతం మనకి తెలుసు. ప్రతి రోజు కొత్త పరిసరం, కొత్త పరిశీలన, కొత్త పరిశోధన. విచిత్ర గ్రహం మీది తెలిసీతెలియని ఒంపుసొంపులన్నీ పరికించి, లోకంతో నానాటికి పరిచయం పెంచుకునే మధురానుభూతి.

 

మార్స్ మీద జీవం ఉన్నా లేకపోయినా అలాంటి మిషన్ ఎనలేని వైజ్ఞానిక ఫలితాలనిస్తుంది. ప్రాచీన నదీ లోయలన్నీ కలయదిరగొచ్చు. బృహత్తర జ్వాలాముఖుల వాలుతలాలని ఎగబ్రాకవచ్చు. పరమశీతల హిమావృత ధృవపీఠాల వద్ద విచిత్రమైన మెట్ల దారుల వెంట సంచరించవచ్చు. రమ్మని పిలిచే మార్స్ పిరమిడ్లని కాస్తంత సమీపించి సంభ్రమంతో సందర్శించవచ్చు. అలాంటి మిషన్ విషయంలో ప్రజల మద్దతు కూడా బలంగానే ఉంటుంది. ప్రతి రోజు ఏవో కొత్త వింతలు మన టీవీ తెరలని అలంకరిస్తాయి. రోవర్ నడిచిన బాటలోనే మనమూ నడుస్తాం. దాని పరిశీలనలని మనమూ పరిశీలిస్తాం. కొత్త గమ్యాలని సూచిస్తాం. అయితే ప్రయాణం సుదిర్ఘమైనది. ఇంత దూరం నుండి మనం పంపే రేడియో సందేశాలని విధేయంగా అక్కడ రోవర్ అమలు జరుపుతూ ఉంటుంది. ఎన్నో వినూత్న పధకాలని, పద్ధతులని మిషన్ ప్రణాళిక లోకి ప్రవేశపెట్టవలసి వుంది. బిలియన్ జనం ఊకుమ్మడిగా నవ్యప్రపంచాన్ని సందర్శించొచ్చు.

 

మార్స్ ఉపరితల విస్తీర్ణత విలువ భూమి మీద నేల విస్తీర్ణతతో సమానం. కాబట్టి మార్స్ ఉపరితలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలంటే మనకి కొన్ని శతాబ్దాలు పడుతుంది. కాని ఏదో ఒక నాటికి మార్స్ మీద ప్రతి అంగుళమూ పరిశీలించబడుతుంది. రోబో విమానాలు గాల్లో ఎగురుతూ నేలని పరిశీలించిన తరువాత, రోబోలు నేలంతా శుభ్రంగా పరిశీలించిన తరువాత, మార్స్ మట్టిని సురక్షితంగా భూమికి చేరవేసి పరిక్షించిన తరువాత, మార్స్ మట్టి మీద మనుషులు నిర్భయంగా సంచరించిన తరువాత మార్స్ ని మనం పూర్తిగా అన్వేషించామని చెప్పుకోవచ్చు. తరువాత మనం ఏం చెయ్యబోతున్నాం? మార్స్ మీద మనం ఏం చెయ్యబోతున్నాం?

భూమి మీద మనం తలపెట్టిన దుర్వినియోగపు, దురాచారపు సందర్భాలని తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. మార్స్ మీద జీవం అంటూ ఉంటే మనం మార్స్ జోలికే పోరాదని అని అంటాను. మార్స్ మార్షియన్లకే చెందుతుంది. మార్షియన్లు సూక్ష్మక్రిములు అయినా సరే. భూమికి సమీపంలో ఉన్న గ్రహం మీద పూర్తిగా స్వతంత్రమైన జీవన వ్యవస్థ ఉంటే అది ఎనలేని సంపద అని గుర్తించాలి. మార్స్ ని వాడుకోవడం కన్నా అక్కడి జీవనాన్ని సంరక్షించడం మన ముఖ్య లక్ష్యం కావాలి. పోనీ మార్స్ జీవరహితమే కావచ్చు ననుకుందాం. అక్కడి నుండి ముడిసరుకులని మనం తవ్వి తెచ్చుకోవడం జరగని పని. ఎందుకంటే మార్స్ నుండి భూమికి అంతంత బరువులని రవాణా చెయ్యడానికి అయ్యే ఖర్చు దుర్భరం అవుతుంది. ఇక పోతే మనమే మార్స్ మీద జీవించగలమా? మార్స్ ని జీవనయోగ్య ప్రపంచంగా మార్చుకోగలమా?

 

మార్స్ సొగసైన ప్రపంచం అన్నది నిజమే. అయితే దాన్ని మన వ్యక్తిగత, సంకుచిత, మానవ దృక్పథంతో చూస్తే అందులో తగని లక్షణాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవిఆక్సిజన్ తక్కువగా ఉండే వాతావరణం, ద్రవపు నీరు లేని నేల, తీవ్ర అతినీలలోహిత కిరణాలతో కూడుకున్న పర్యావరణ ప్రకాశం. (అతి శీతల ఉష్ణోగ్రతలు పెద్ద సమస్య కాదు. ఏడాది పొడవునా అంటార్కిటికాలో మనం నడిపిస్తున్న పరిశోధనా కేంద్రాలే అందుకు తార్కాణం.) మార్స్ మీద మరి కాస్త గాలిని తయారు చెయ్యగలిగితే సమస్యలన్నీ అధిగమించవచ్చు. వాతావరణ పీడనాలు పెరిగితే ద్రవపు నీరు నిలిచే అవకాశం ఏర్పడుతుంది. అక్కడ గాలిలో ఆక్సిజన్ పెరిగితే మనం ఊపిరి తీసుకోగలం. అప్పుడు వాయుమండలం మీద ఓజోన్ పొర ఏర్పడి సూర్యుడి నుండి  ప్రసరించే అతినీలలోహిత కిరణాల నుండి కవచంలా రక్షిస్తుంది. మెలికలు తిరిగే కాలువలు, మెట్లుగా ఏర్పడ్డ ధృవపీఠాలు, తదితర సాక్ష్యాల బట్టి ఒకప్పుడు మార్స్ మీద మరింత సాంద్రమైన వాతావరణం ఉండేదని తెలుస్తోంది. వాయువులన్నీ మార్స్ నుండి తప్పించుకుపోయే అవకాశం తక్కువ. అవన్నీ మార్స్ మీదే ఏదో రూపంలో ఉండి ఉండాలి. కొన్ని రసాయనికంగా ఉపరితల శిలలలో కలిసిపోయాయి. మరి కొన్ని ఉపరితలానికి అడుగున మంచులో దాగి వున్నాయి. కాని అధికశాతం హిమావృత ధృవపీఠాలలో నిక్షిప్తమై వుందని చెప్పొచ్చు.

 

ధృవాలని కరిగించాలంటే వాటిని వెచ్చజేయాలి. వాటి మీద మసి వంటి నల్లని పొడి ఏదైనా చల్లితే అది మరింత సూర్యకాంతిని లోనికి తీసుకుని మంచుని కరిగిస్తుందేమో. భూమి మీద  మన అడవులు, బయళ్లు మండి మసైనప్పుడు జరిగే పరిణామానికి ఇది వ్యతిరేకం అనుకోవచ్చు. కాని హిమావృత ధృవాలు చాలా విశాలమైనవి. వాటిని కప్పడానికి కావలసిన మసిని భూమి నుండి మార్స్ కి మోసుకెళ్లాలంటే 1,200 సాటర్న్ 5 రాకెట్లు అవసరమవుతాయి. అప్పుడు కూడా ధృవశిఖల (polar caps)  వద్ద వీచే గాలికి మసి కొట్టుకుపోవచ్చు. అంతకన్నా తెలివైన పద్ధతి ఏమిటంటే దానినది నకలు చేసుకునే ప్రత్యేకమైన నల్లని పదార్థాన్ని కనిపెట్టాలి. అలాంటి పదార్థం గల యంత్రాన్ని మార్స్ కి పంపిస్తే అక్కడ అది, స్థానిక పదార్థాలని వాడుకుంటూ, పదే పదే దానినది ప్రతులు చేసుకుని ధృవశిఖల మీద మొత్తం వ్యాపిస్తుంది. అలాంటి యంత్రాలు వాస్తవంలో ఉన్నాయి. వాటిని మనం మొక్కలు అంటాము.కొన్ని ధృఢంగా, కఠినమైన శీతోష్ణస్థితులకి తట్టుకునేలా ఉంటాయి. అలాగే కొన్ని ధరాగత సూక్ష్మక్రిములు మార్స్ వాతావరణం మీద మనగలవని మనకి తెలుసు. నల్లనివి, సమర్థవంతమైనవి అయిన మొక్కలని పెంచడానికి ఒక జెనెటిక్ ఇంజినీరీంగ్ పరిశోధనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అలాంటి మొక్కలకి చక్కని ఉదాహరణలు lichen మొక్కలు. కఠోరమైన మార్షియన్ పర్యావరణానికి తట్టుకోగల లైకెన్ జాతి మొక్కలని తయారుచెయ్యాలి. అలాంటి మొక్కలని రూపొందించగలిగితే వాటిని విశాలమైన మార్షియన్ హిమధృవాల మీదుగా వెదజల్లొచ్చు. అవి పెరిగి, వేళ్లూని, విస్తరించి, సూర్యరశ్మిని లోనికి తీసుకుని, వెచ్చబడి, ధృవాల మంచుని కరిగిస్తాయి. అంతవరకు నేలలో బందీగా పడి వున్న ప్రాచీన మార్షియన్ వాతావరణం అప్పుడు విడుదల అవుతుంది. అప్పుడు అభినవ జానీ ఆపిల్సీడ్ (అతడు మనిషిగాని, రోబో గాని కావచ్చు) మార్షియన్ నేలపై, కరుగుతున్న హిమధృవాలపై సంచరిస్తున్నట్టు ఊహించుకోవచ్చు. అతడు చేయబోయే ఘనకార్యాల వల్ల మార్స్ కి వలసపోయే భావి  మానవ తరాల వారు ఎంతో లబ్ధి పొందొచ్చు.

ఇలాంటి విధానాలకి, ప్రయత్నాలకి శాస్త్ర నామం వుంది. దాన్ని ధరాసంస్కరణ (terraforming) అంటారు. అన్య ప్రపంచ సీమలని మానవ నివాస యోగ్యంగా మలచుకోవడమే ధరాసంస్కరణ. ఇన్ని వేల ఏళ్లలో మనుషులు, హరితగృహ ప్రభావం ద్వార, ఆల్బెడోలో మార్పుల ద్వార, ధరాగత ఉష్ణోగ్రతలని కేవలం 1 డిగ్రీ మేరకే మార్చగలిగారు. అయితే ప్రస్తుతం మనం మన అడవులని, బయళ్లని ధ్వంసం చేసే వేగంతో, శిలాజ ఇంధనాలని మండించే వేగంతో మరో శతాబ్దంలోనే మరో డిగ్రీ వరకు ఉష్ణోగ్రతని పెంచగలమేమో. కాబట్టి మార్స్ మీద పెద్ద ఎత్తున ధరాసంస్కరణలు సాధించాలంటే అందుకు కొన్ని వందల వేల ఏళ్ల కాలవ్యవధి అవసరమవుతుంది. భవిష్యత్తులో, గొప్ప అధునాత సాంకేతి సత్తా మనకి వశమైన దశలో, మార్స్ వాతావరణ పీడనాన్ని మరింత పెంచడమే కాక, ద్రవ రూపపు జలాన్ని సాధించడమే కాక, నీటిని కరుగుతున్న హిమ ధృవ శిఖల నుండి మరింత వెచ్చని గ్రహమధ్య ప్రాంతాల వరకు రవాణా చెయ్యగలుగుతాము. దానికో చక్కని తరుణోపాయం వుండనే వుంది. కాలువలు నిర్మించడం.



కరుగుతున్న ఉపరితల హిమాన్ని విస్తృతమైన కాలువల వ్యవస్థ ద్వార రవాణా చేయొచ్చు. కేవలం నూరేళ్ల క్రితం పార్సివాల్ లొవెల్ పొరబాటుగా ఊహించుకున్నది సరిగ్గా అదే. మార్స్ భూములు మానవ నివాస యోగ్యం కాకపోవడానికి కారణం అక్కడ నీటి ఎద్దడేనని లొవెల్ కి, వాలెస్ కి ఇద్దరికీ తెలుసు. నీటి కాలువల వ్యవస్థే ఉంటే కరవు తీరుతుంది. మార్స్ నేల మానవ నివాస యోగ్యమవుతుంది. లొవెల్ చేసిన పరిశీలనలు చాలా విపరీతమైన దర్శన పరిస్థితుల్లో చేయబడ్డాయి. షియాపరెల్లీ తదితరులు అప్పటికే మార్స్ మీద కాలువల వంటి నిర్మాణాలని ఊహించుకున్నారు. లొవెల్ మార్స్ తో తన ప్రేమకలాపాలు మొదలెట్టక ముందే వాళ్లు మార్స్ కాలువలని canali  అని అభిమానంగా పిలుచుకున్నారు. భావావేశం అదుపు తప్పినప్పుడు మనుషులు ఆత్మవంచన చేసుకోడానికి కూడా సిద్ధపడతారని మనకి తెలుసు. పొరుగు గ్రహంలో ప్రజ్ఞ గల జీవులు ఉన్నారన్న భావన కన్నా మనుషుల హృదయాలలో గాఢమైన స్పందన కలిగించే భావాలు ఎన్నో ఉండవేమో.

లొవెల్ భావన ఒక విధంగా పూర్వభావన కావచ్చు. అతడి కాలువల వ్యవస్థని నిర్మించిన వాళ్లు మార్షియన్లు. అలాగే ఇది కూడా చక్కని భవిష్యత్ సూచన అవుతుందేమో. గ్రహం ఎప్పటికైనా ధరాసంస్కరించబడితే అది అక్కడ శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్న మనుషుల వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఏనాటికైనా మార్షియన్లు మనమే అవుతాము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts