శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

జపనీస్ జాతీ! నీకు జోహార్లు!

Posted by V Srinivasa Chakravarthy Sunday, March 20, 2011
ప్రస్తుతం జపాన్ దేశం పడుతున నరక యాతన చూస్తే బాధ కలుగుతుంది. అంత సున్నితమైన, అందమైన జాతికి ఇలాంటి అధోగతి పట్టడం అన్యాయం అనిపిస్తుంది.

గత రెండేళ్లలో రెండు సార్లు జపాన్ ని సందర్శించే అవకాశం కలిగింది. మొత్తం మూడు నెలల మకాం. ఇండియాలో ఎప్పుడూ మన బాహ్య వ్యవహారాలు, మన ప్రజా వ్యవస్థలు ఎందుకంత గందరగోళంగా ఉంటాయి? ఎందుకు అంత తరచు విఫలం అవుతూ ఉంటాయి? ఇంత జనాభా ఉంటే మరి ఇలాగే ఉంటుందేమో అని సరిపెట్టుకుంటూ ఉంటాను. కాని జపాన్ ని చూశాక ఆ అభిప్రాయం తప్పని అర్థమయ్యింది. అది కేవలం ఓ కుంటిసాకని తెలిసింది. జనాభా సాంద్రత చూస్తే జపాన్ లో చదరపు కి.మీ.కి 336, మన దేశంలో చదరపు కి.మీ. కి 324 (2001 నాటి సమాచారం). మనకి ఉన్నంత భూభాగం కాని, సహజ వనరులు కాని వారికి లేవు. మరి ఎందుకంత తేడా?

ఎప్పుడూ మారని మర్యాద, సంస్కారం, సున్నితమైన సనాగరికమైన ప్రవర్తన – ఇవి జపనీస్ లో సర్వత్ర కనిపించే లక్షణాలు. నేను ఉన్నంత కాలంలో ఎప్పుడూ ఇద్దరు ఒకరి మీద ఒకరు అరచుకోవడం గాని, కోపంగా మాట్లాడడం గాని, అసలు గట్టిగా మాట్లాడడం గాని చూడలేదు. సందు చివర గ్రోసరీ స్టోర్ వాడు కూడా అంగడి లోకి ఎవరైన అడుగుపెట్టడం చూడగానే తల ఊచి (జపనీస్ లో!) స్వాగతం చెప్తాడు. టాక్సీ వాడు మిగిలిన చిల్లర ఉంచుకోమంటే మర్యాదగా నవ్వి యెన్నులతో (ఒక యెన్ = సుమారు అర్థరూపాయి) పాటు తిరిగి ఇచ్చేస్తాడు.

అర్థ రాత్రి పూట పెద్దగా జన సంచారం లేని చోట్ల స్త్రీలు ఒంటరిగా నడిచి వెళ్లడం చూశాను. అభివృద్ధి చెందిన దేశాలలో అతితక్కువ ‘క్రైమ్ రేట్’ ఉన్న దేశం మరి. నేను వెళ్ళిన కొత్తల్లో మా ల్యాబ్ మేట్ ని అడిగాను – “రాత్రి పూట ఒంటరిగా తిరగడం క్షేమమేనా?” అని. ఆ ప్రశ్న అర్థం కానట్టు నాకేసి విస్తుపోయి చూశాడు.


జపనీస్ యొక్క నిర్వహణా కౌశల్యానికి వాళ్ల రైల్వేలు చక్కని నిదర్శనం. ముఖ్యంగా రష్ అవర్ లో మెట్రో స్టేషన్లు విపరీతంగా రద్దీగా ఉంటాయి. స్టేషన్లో రైలు ఆగక ముందే ప్లాట్ ఫామ్ మీద, కొన్ని నిర్దిష్ట స్థానాల వద్ద క్యూలు కడతారు. కంపార్ట్ మెంట్ తలుపు సరిగ్గా ఆ స్థానాల వద్దే ఆగుతాయి. తలుపులు తెరుచుకోగానే ముందు లోపల ఉన్న వారు బయటికి వస్తారు. అందరూ పూర్తిగా బయటికి వచ్చాకనే బయట ఉన్న వాళ్లు సాఫీగా లోపలికి ప్రవహిస్తారు. ఎప్పుడూ తోపుడు, తొక్కిసలాట వంటివి చూడలేదు. ఇలాంటి సందర్భాల్లో వాళ్లు సమిష్టిగా కదిలే తీరు చూస్తే ఫ్లూయిడ్ మెకానిక్స్ లో లామినర్ ఫ్లో గుర్తొస్తుంది.

ఇక రైళ్ళ సమయ పాలన సంగతి అందరికీ తెలిసిందే. 9:28 రైలు రావాలంటే, గడియారం 9:27 చూపించేసరికే ప్లాట్ ఫామ్ కి అల్లంత దూరంలో రైలు కనిపిస్తుంది. బాగా దూరాలు వెళ్లే రైళ్ల ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకే రూట్ లో ప్రయాణించే షింకాన్సెన్ (బులెట్ ట్రెయిన్) కూడా సుమారు అరగంటకి ఒకటి నడుస్తుంటుంది. చిన్న స్టేషన్లలో ఆగకుండా 300 kmph వేగంతో తెల్లని మెరుపుతీగలా దూసుకుపోయే నొజోమీ క్లాస్ షింకాన్సెన్ ధాటిని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ప్రభుత్వ రైల్వే సంస్థ అయిన జపాన్ రైల్వేస్ (జె.ఆర్.) కాకుండా లెక్కలేనన్ని ప్రయివేట్ లైన్లు పని చేస్తాయి. అంత చిన్న భూభాగం, అంత జన సాంద్రత గల దేశంలో అంత సంక్లిష్టమైన రైల్వే నెట్వర్క్ లేకపోతే జీవితం దుర్భరం కావచ్చు. అందుకే అంత మంది జీవితాలు సాఫీగా సాగేలా అత్యంత సంక్లిష్టమైన, అధునాతనమైన వ్యవస్థని నిర్మించి సమర్థవంతంగా నడుపుకుంటున్న ఆ జాతి మీద ప్రకృతి ఇలా దెబ్బ కొట్టడం అన్యాయం అనిపిస్తుంది.

అక్కడ సిక్యూరిటీ గార్డులు, హోటల్ వెయిటర్లు - ఇలా చిన్నచిన్న పనులలో ఎన్నోసార్లు ముసలివాళ్లు కనిపిస్తారు. నేను పని చేసిన సంస్థకి ఎంట్రన్స్ వద్ద ఒక సెక్యూరిటీ గార్డుగా ఓ పెద్దాయన నించుని కనిపించేవాడు. చేతిలో చిన్న దండంతో కాంపౌండ్ లోకి వచ్చేపోయే వాహనాలకి దారి చూపిస్తుంటాడు. (నిజానికి అక్కడ పెద్దగా రద్దీ ఉండదు. కాని అది అతడి కర్తవ్యం అని చేస్తాడు). ఆ దారిని నడిచివెళ్లే వాళ్లని మర్యాదగా పలకరిస్తాడు. ఎవరైనా కొత్త మొహం కనిపిస్తే మర్యాదగా చిరునవ్వుతో వారి ఐ.డి. కార్డ్ చూపించమంటాడు. వర్షం పడుతున్నా లోపల కేబిన్ లోకి వెళ్లి కూర్చోడు. రెయిన్ కోటూ, హాటు వేసుకుని బయటే నించుని తన పని యథావిధిగా చేసుకుపోతుంటాడు. పోనీ తను చేస్తున్న పని అంత కీలకమైన పని కూడా కాదు. మధ్యలో మానేసి ఓ గంట “టీ తాగడానికి” వెళ్ళిపోయినా కొంపలేం అంటుకుపోవు. కాని పని చిన్నదైనా, పెద్దదైనా కర్తవ్యం తుచ తప్పకుండా నిర్వర్తించాల్సిందే. అది జపనీస్ పద్ధతి.


ఆ దేశాన్ని చూడడానికి వెళ్లే సందర్శకులకి కలిగే ఒక ముఖ్యమైన ఇబ్బంది భాష. వ్యవహారాలన్నీ జపనీస్ లోనే జరుగుతాయి. ఇంగ్లీష్ తెలిసిన వాళ్లు అరుదుగా కనిపిస్తారు. కాని సందర్శకుల సంగతి పక్కన పెడితే మాతృభాషలోనే పనులన్నీ జరగడం వల్ల దేశానికి ఎంత మేలో అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. బయట సైన్ బోర్డులు అన్నీ జపనీస్ లోనే ఉంటాయి. మెడిసిన్ లో సూపర్ స్పెషాలిటీల స్థాయిలో కూడా బోధన జపనీస్ లోనే ఉంటుందంటే, ఆధునిక అవసరాల దృష్ట్యా ఆ భాష ఏ స్థాయి వరకు అభివృద్ధి చెందిందో ఊహించుకోవచ్చు. (నూరేళ్ల క్రితమే వాళ్ల పూర్వీకులు సైన్సు విలువ తెలిసి వైజ్ఞానిక పరిభాష అంతటినీ జపనీస్ లో తర్జుమా చేసుకున్నారని ఓ జపనీస్ మిత్రుడు చెప్పాడు.) అక్కడ కూడా ప్రతీ నూరు మైళ్ళకి మాండలికం మారిపోతుందట. కాని దేశం అంతా ఒక ప్రామాణిక జపనీస్ ని వినియోగిస్తుంది. వ్యవహారాలన్నీ ఏకైక భాష మీదుగా నడిచే దేశంలో అక్షరాస్యత 99% ఉందంటే మరి ఆశ్చర్యం లేదు.

వైజ్ఞానిక, పరిశోధనా రంగంలో కూడా వాళ్ల పని తీరు విశేషంగా ఉంటుంది అంటాడు నేను పని చేసిన సంస్థలోనే కొన్నేళ్ల పాటు పని చేస్తున్న ఓ ఇండియన్ మిత్రుడు. ఉద్యోగులు ఉదయానే తొమ్మిదికి వస్తారు, సాయంత్రం ఐదున్నర ఆరు కల్లా ఇంటికెళ్లిపోతారు. కాని చేసే పనిని మాత్రం ప్రణాళికాబద్ధంగా, కాలయాపన లేకుండా, సమిష్టిగా చేసుకుంటారు. ఏదో జీతాల కోసం అన్నట్టు కాక, సహజమైన ఆసక్తితో, స్ఫూర్తితో పరిశోధనా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతిభలో, తెలివితేటల్లో వారిలో నిమ్నోన్నతలు కనిపించొచ్చు. కాని పని పట్ల శ్రద్ధలో మాత్రం రవంత అయినా వెలితి ఉండదు. కనుక ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నేచర్, సైన్స్ మొదలైన ప్రఖ్యాత పత్రికలలో వారి ఫలితాలు తరచు అచ్చు అవుతుంటాయి. అలాంటి సంస్థలు జపాన్ లో ఎన్నో. కాని అలాంటి సంస్థ మన దేశంలో ఒక్కటి కూడా లేదు.

ఏ దేశంలో అయినా గొప్ప వ్యక్తిత్వం, సంస్కారం గల వ్యక్తులు ఎంతో మంది ఉంటారు. కాని ఇంచుమించు ఒక దేశప్రజ మొత్తం అలాంటి లక్షణాలని సమానంగా వ్యక్తం చెయ్యడం… అదసలు అసాధ్యం అనిపిస్తుంది. కాని జపనీస్ ని చూస్తే సాధ్యం అని ఒప్పుకోక తప్పదు. ముఖ్యంగా ప్రస్తుత దయనీయ పరిస్థితుల్లో వాళ్లు మసలు కుంటున్న తీరుని యావత్ ప్రపంచం టీవీలో చూసి ఆశ్చర్యపోతోంది. బారైన క్యూలలో ఆహారం కోసం, మంచి నీటి కోసం గంటల తరబడి ఓపిగ్గా నించుంటారు. (మన దేశంలో అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం పంపకం అప్పుడు జరిగే తొక్కిసలాటలోనే జనం చచ్చిపోతారు.) క్యూలో మనిషికి మనిషికి మధ్య బోలెడంత ఎడం కనిపిస్తుంది. ఎవడో ధూర్తుడు దూరుతాడన్న సందేహం కూడా ఎవరికీ రాదు. నాలుగు లక్షల పైగా జనం సంక్షేమ శిబిరాలలో ఉంటున్నారు. మాసినబట్టలతో, చాలీచాలని ఆహారంతో స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అలా శిబిరాలలో గడపడం ఆత్మగౌరవానికి ఎంతో విలువిచ్చే ఆ సమాజానికి నిజంగా నరకయాతనే.

ఒక పక్క సాంప్రదాయనిబద్ధతని, మరో పక్క ఆధునికతని అద్భుతంగా మేళవించుకున్న సంస్కృతి జపనీస్ ది. ఇరవై ఒకటవ శతాబ్దపు సమాజాలు సాధించవలసిన అపురూపమైన సాంస్కృతిక సమ్మేళనానికి అద్దం పట్టే అరుదైన సమాజం అది. వారి ఈ యాతన త్వరలోనే అంతం కావాలని మనసారా కాంక్షిద్దాం. నిన్న మొన్నటి వరకు ఉన్న వైభవం, సుఖశాంతులు త్వరలోనే మళ్లీ రావాలని కోరుకుందాం.

18 comments

  1. చాలా చక్కటి వ్యాసం. క్రమశిక్షణ బహు అరుదుగా కనిపించే మన లాంటి దేశాలు వారినుంచి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. మళ్ళీ వారు పూర్వ వైభవం సాధించాలని మనస్పూర్తిగా కోరుతూ..
    - రాధేశ్యాం

     
  2. Anonymous Says:
  3. మీరు జపనీయులు కొరియా వాళ్ళ పైన చేసిన ఆకృత్యాల గురించి కూడా రాస్తే బాగుండేది. జపాన్ సైనికులు ఎంత మంది కొరియా ఆడవాళ్ళని వాళ్ళ సైనికులకు లైంగిక బానిసలుగా మార్చారో కూడా తెలుసుకుంటే బాగుండేది. చిన్న పిల్లలని కూడా చూడకుండా వారిని వేదించిన తీరును కూడా రాస్తే బాగుండేది. వాళ్ళ ఆకృత్యాల పైన ఇప్పటికి జపాన్ ప్రబుత్వం క్షమాపణలు చెప్పక పోగా ఆ సైనికులను హీరోలుగా కొలుస్తున్నారు

     
  4. Anonymous Says:
  5. మంచి విశ్లేషణ..!
    పై Anonymous గారు...,
    ఈ టపా, వారు చూసిన సమకాలీన విషయాలను ప్రస్థావించారు. వారిని రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎందుకు పుట్టలేదు, వాటిని ఎందుకు రాయలేదు అని అడగటం సభ్యత కాదేమో?

     
  6. మంచు Says:
  7. శ్రీనివాస చక్రవర్తిగారు ...చాల మంచి వ్యాసం అందించారు. ధన్యవాదాలు.

    అనానిమస్ గారు. మీరు చెప్పిన జపాన్ చరిత్ర కనీసం 70 సంవత్సరాల మునుపు. అవును అప్పట్లొ జపాన్ దేశం ఇప్పుడున్నంత శాంతి కాముక దేశం కాదు, ఆ దేశ సైనికులు చేసిన అకృత్యాలు చాలానే ఉన్నాయ్... పెరల్ హార్బర్ మీద ఏక పక్ష దాడి మనకి తెలుసు... అయితే అది అప్పుడు.. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఆక్కడి ప్రజల అలొచిన విధానం లొ చాల మార్పు వచ్చింది. ఇంత మార్పు ఎలా సాధ్యం అనుకునే వారికి ఒక బెస్ట్ ఉదాహరణ జపాన్. ఇప్పటికీ కొన్ని లోటు పాట్లు ఉండొచ్చు కానీ... పైన చక్రవర్తి గారు చెప్పినట్టు చాలా విషయాల్లొ మిగతా ప్రపంచానికి మార్గదర్శకం జపాన్.
    అంత ఎందుకు... 1960 కి ముందు జపాన్ లొ తయారయిన వస్తువంటే ఇప్పుడు మనం చైనా వస్తువలని చూసినట్టు చూసే వారు.. అస్సలు క్వాలిటి లేకుండా చీప్ గా దొరికే వస్తువులు అని... ఇప్పుడు మేడ్ ఇన్ జపాన్ అని కనిపిస్తే చాలు కళ్ళు మూసుకుని కొనే పరిస్తితి.

    అలాగే ఒక 40 సంవత్సరాలలొ అంత ఎక్కువ మారిన మరొ దేశం సింగపూర్....

     
  8. Anonymous Says:
  9. నాకు తెలిసిన ఒక సీనియర్ సిటిజన్ కూడా మొదటి అనానిమస్ చెప్పినట్లే చెప్పారు. జపాన్ వారు ఇంతకుముందు చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష పడిఉండవచ్చు అన్నారు. కొరియావాళ్ళపై, చైనావాళ్ళపై వారు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదని చెప్పారు.

    - శివ

     
  10. Anonymous Says:
  11. ఆ లెఖ్ఖన మన దేశంలో ప్రజలు పడుతున్న బాధలు కూడా ఎప్పుడో ఎవరిపైనో చేసిన అకృత్యాలవల్ల కావచ్చును.

     
  12. Anonymous Says:
  13. >>వారిని రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎందుకు పుట్టలేదు, వాటిని ఎందుకు రాయలేదు అని అడగటం సభ్యత కాదేమో?>>
    Only Telabans ask such stupid questions. This case it is Praveen, you can't expect such things from him either becoz he is telaban supporter.

     
  14. Anonymous Says:
  15. >నాకు తెలిసిన ఒక సీనియర్ సిటిజన్ కూడా మొదటి అనానిమస్ చెప్పినట్లే చెప్పారు. జపాన్ వారు ఇంతకుముందు చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష పడిఉండవచ్చు అన్నారు. కొరియావాళ్ళపై, చైనావాళ్ళపై వారు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదని చెప్పారు.<

    తాతలు నేతులు తాగారని, మూతులు వాసన చూడమన్నాట్టుంది. ఎవరండీ ఆ సీనియర్ సిటిజన్? రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి ఇంకా బ్రతికే వున్నారా, పోకుండా?!

     
  16. చక్రవర్తి గారు మంచి విషయాన్ని చెప్పినందుకు వారికి దన్యవాదములు. శాస్త్రీయ విషయాలను విపులంగా చెబుతున్న ఈ బ్లాగులో కొందరు అనామకులు చేస్తున్న వ్యాఖ్యలు బాగోలేదు. దయచేసి వాటిని తీసివేసి మంచి విషయాలను మాత్రమే చర్చించాలని మనవి.

     
  17. Anonymous Says:
  18. This comment has been removed by the author.  
  19. Anonymous Says:
  20. ఈ బ్లాగు/పోస్టు స్పూర్తికి విరుద్ధంగా నా వ్యాఖ్య మీకు అనిపించినట్లైతే దాన్ని మీరు నిరభ్యంతరంగా తొలగించవచ్చు చక్రవర్తిగారు.

     
  21. కామెంట్లకి ధన్యవాదాలు.

    నిజమే. పై తరాలకి చెందిన జపనీస్ ఎన్నో చేసి ఉండవచ్చు. కాని అందుకు నేటి తరం మూల్యం చెల్లించాలి అనడం ఏం న్యాయం? అది “కర్మ” అని సులభంగా అనేయొచ్చు గాని మానవతా దృష్టితో చూస్తే అన్యాయం అనిపిస్తుంది.

    ఈ వ్యాసం రాయడంలోని ముఖ్యోద్దేశాలు... అన్ని ఇబ్బందులకి గురవుతున్న ఓ సాటి దేశం గురించి సానుభూతిగా ఓ మంచిమాట అనుకోవడం మొదటి ఉద్దేశం.

    ఇతర దేశాలలో, సమాజాలలో ఆ దేశాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లిన మంచి లక్షణాలు ఏవైనా ఉంటే వాటీని గుర్తించి అర్థం చేసుకోవడం అవసరం అనిపిస్తుంది. వివిధ దేశాలు పురోగతి ఎలా సాధించాయో తెలిస్తే వేగంగా పురోగమించడానికి ప్రయత్నిస్తున్న మనకి అలాంటి అవగాహన ఉపయోగపడవచ్చు. వాళ్ళ రోడ్లు, రైళ్లు ఎందుకంత నీటుగా, శుభ్రంగా ఉంటాయి? ... మొదలైనవి తెలిస్తే మనమూ అలాంటీ సమర్థవంతమైన ప్రజావ్యవస్థల నిర్మాణం కోసం ప్రయత్నించవచ్చు. ఇది రెండవ ఉద్దేశం.

    ఇక మూడవది. మన దేశంలో ఎన్నో వర్గాలలో ఒక రకమైన అర్థంలేని జాత్యహంకారం, నిరాధారిత ఆధిక్యతాభావం లోతుగా పాతుకుపోయి ఉంటుంది. భారతీయు లందరికీ ఏదో చెప్పలేని నైతిక ఆధిక్యత ఉన్నట్టు, తక్కిన సమాజాలన్నీ నైతిక విషయాలలో తక్కువే అయినట్టు వ్యవహరిస్తారు. అసలు “ఏనాడైతే మన దేశస్థులు ఈ “మ్లేచ్ఛులు” అన్న పదాన్ని కనిపెట్టారో ఆనాడే మన దేశ పతనం మొదలయ్యింది” అన్నారట స్వామి వివేకానందులు. కనుక ఇతర సమాజాల పట్ల అవగాహన పెరిగితే వారిని సహజంగా గౌరవించగలుగుతాం. అలంటి అవగాహన వల్ల మనపట్ల మనకి కూడా మరింత వాస్తవికమైన గ్రహింపు ఏర్పడుతుంది. ఇది మూడో ఉద్దేశం.

     
  22. మంచు Says:
  23. చక్రవర్తి గారు: "మ్లేచ్ఛులు" అంటే ????

     
  24. మంచు గారు మ్లేచ్ఛులు అంటే అపవిత్రమైన అనాగరికులు అని అర్థం.

     
  25. mlechchulu aMTE foreigners, "firang log"!

     
  26. Rathoti Says:
  27. Srinivas garu, Chaalaa Chakkagaa cheppaarandee..

     
  28. Anonymous Says:
  29. mana jeevitalu baagucheyyandi tharuvath vaallani pogudurukani

     
  30. Anonymous Says:
  31. mana jeevitalu baagucheyyandi tharuvath vaallani pogudurukani

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts