(గాంధీ జయంతి సందర్భంగా ఇవాల్టి నుండి ఓ కొత్త సీరియల్. కొలంబస్ కథ ముగిసింది కనుక దానికి కొనసాగింపుగా ఇటీవలే ఆంధ్రభూమిలో వాస్కో ద గామా మీద మొదలైన సీరియల్...
)
http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-921
అసమాన సాహసాన్ని ప్రదర్శిస్తూ కొలంబస్ నాలుగు గొప్ప యాత్రలు చేసి, ఇండియాకి దారి కనుక్కోలేకపోయినా, పశ్చిమ ఇండీస్ దీవులని, దక్షిణ అమెరికా ఖండాన్ని కనుక్కున్నాడు. కాని చివరి వరకు తను కనుక్కున్న ప్రాంతం ఇండియానే అన్న భ్రమలో ఉన్నాడు. అయితే తన తదనంతరం ఆ ప్రాంతం ఇండియా కాదని, అదేదో కొత్త భూమి అని క్రమంగా యూరొపియన్ ప్రజలకి తెలిసొచ్చింది. సిల్కు దారులు మూసుకుపోయాయి కనుక ఇండియా కోసం కొత్త దారుల వేట మళ్లీ మొదలయ్యింది.
ఆఫ్రికా దక్షిణ కొమ్ము చుట్టూ ప్రయాణించి ఇండియా చేరుకోవచ్చన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉన్నా ఆఫ్రికా ఖండం దక్షిణంగా ఎంత దూరం విస్తరించి ఉందో పదిహేనవ శతాబ్దపు తొలిదశల్లో యూరప్ లో ఎవరికీ తెలీదు. 1415 దరిదాపుల్లో యూరప్ లో అన్వేషణల యుగం మొదలయ్యింది చెప్పుకుంటారు. సముద్ర దారుల వెంట ఆ కాలంలోనే పోర్చుగల్ రాజ్యాన్ని పాలించే హెన్రీ మహారాజు ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరాన్ని పర్యటించి రమ్మని వరుసగా కొన్ని నౌకా దళాలని పంపాడు. నౌకా యాత్రలలో అంత శ్రధ్ధ చూపించాడు కనుక హెన్రీ రాజుకి ‘హెన్రీ ద నావిగేటర్’ (నావిక రాజు హెన్రీ) అన్న బిరుదు దక్కింది. హెన్రీ రాజు పంపిన నౌకా దళాలు అంచెలంచెలుగా ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని పర్యటిస్తూ పోయాయి. 1460 లో హెన్రీ రాజు మరణానంతరం కూడా ఈ నౌకా యాత్రలు కొనసాగాయి. 1488 లో బార్తొలోమ్యూ దియాజ్ నేతృత్వంలో బయల్దేరిన నౌకలు ఆఫ్రికా దక్షిణ కొమ్ము వద్ద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ నగరాన్ని చేరుకున్నాయి. కాని అంత కన్నా ముందుకి పోవడానికి ఆ దళంలోని నావికులు ఒప్పుకోలేదు. కనుక విధిలేక దియాజ్ పోర్చుగల్ కి తిరిగి వచ్చేశాడు. అంతకన్నా ముందుకి పోడానికి వీలుపడలేదని అప్పటికి పోర్చుగల్ ని పాలించే మహారాజు జాన్ – 2 తో విన్నవించుకున్నాడు.
ఆఫ్రికా దక్షిణ కొమ్ము జయించబడ్డాక ఇక ఇండియాని చేరుకునే ప్రయత్నంలో ఓ ముఖ్యమైన అవరోధాన్ని జయించినట్టే. కాని ఆ కొమ్ముకి అవతల ఇండియా ఇంకా ఎంత దూరంలో ఉందో ఎవరికీ తెలీదు. పైగా దియాజ్ బృందం దారిలో పడ్డ కష్టాల గురించి, ఎదుర్కున్న భయంకరమైన తుఫానుల గురించి నావికుల సంఘాలలో కథలు కథలుగా చెప్పుకున్నారు. కనుక కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటి పోవడానికి నావికులు మొరాయించారు. కనుక ఇండియా దాకా విజయవంతంగా ఓ నౌకా దళాన్ని నడిపించడానికి సమర్ధుడైన నావికుడు దొరకడం కష్టమయ్యింది. పైగా ఈ కొత్త సముద్ర మార్గాన్ని జయించడానికి కేవలం ఓడలు నడిపించడం వస్తే చాలదు. అతడు గొప్ప యోధుడు కూడా కావాలి. ఎందుకంటే పోర్చుగల్ ఆఫ్రికా తీరం వెంట ఇండియాకి దారి కనుక్కోవడం ఇష్టం లేని వారు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఈజిప్ట్ ని ఏలే సుల్తాను, వెనీస్ నగరాన్ని ఏలే రాజు ఉన్నారు. పోర్చుగల్ ఓడలు ఆ దారిన వస్తే అటకాయించి ఓడలని ముంచడానికి వీళ్లు సిద్ధంగా ఉన్నారు. కనుక మంచి నావికుడు, మంచి యోధుడు అయిన అరుదైన వ్యక్తి కోసం గాలింపు మొదలెట్టిన మహారాజు జాన్ -2 కి త్వరలోనే అలాంటి వాడు ఒకడు దొరికాడు. అతడి పేరు వాస్కో ద గామా.
వాస్కో ద గామా పోర్చుగల్ లో, రాజధాని లిస్బన్ కి అరవై మైళ్ల దూరంలో ఉన్న సీన్స్ అనే ఓ చిన్న ఊళ్లో పుట్టాడు. ఈ సీన్స్ సముద్ర తీరం మీద ఉంది. అతడు పుట్టింది 1460 ల దశకంలో అని చారిత్రకులు అభిప్రాయపడుతున్నారు. వాస్కో తండ్రి పేరు ఎస్టేవాయో ద గామా. ఇతడు కూడా నావికుడే. పోర్చుగీస్ రాజు కొలువులో పని చేసేవాడు. తల్లి పేరు ఇజబెల్. వాస్కో కి పాలో, ఆయ్రెస్ అని ఇద్దరు అన్నలు, తెరేసా అని ఓ చెల్లెలు ఉన్నారు.
పడవలన్నా, సముద్రం అన్నా వాస్కోకి చిన్నప్పట్నుంచి వల్లమాలిన అభిమానం. అన్నలు తనకి పడవ ఎలా నడపాలో, వల వేసి మేలు జాతి చేపలని ఎలా పట్టాలో నేర్పించారు. తండ్రి నావికుడు కావడంతో తమ కుటుంబానికి నావికులతో సాన్నిహిత్యం ఉండేది. అన్నదమ్ములు ముగ్గురూ నావికులు చెప్పే సాహస గాధల గురించి వింటూ ఉండేవారు. పెద్దయ్యాక ఎలాగైనా సముద్ర యానం చేసి ఎన్నో గొప్ప సాహసాలు చెయ్యాలని కలలు కనేవారు.
సీన్స్ లో కొంత వరకు చదువుకుని పై తరగతులు చదువుకోడానికి వాస్కో ఎవోరా అనే నగరానికి వెళ్లాడు. సీన్స్ లాగ కాక ఈ ఎవోరా పెద్ద పట్టణం. ఈ నగరానికి ఇరుగు పొరుగు దేశాల నుండి జనం వస్తుండేవారు. అలా నానా రకాల సంస్కృతులకి, భాషలకి చెందిన వ్యక్తులతో వాస్కోకి పరిచయం ఏర్పడింది. లోకంలో మనుషులు ఎన్ని రకాలుగా జీవిస్తారో, ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారో వాస్కోకి అర్థం కాసాగింది.
పదిహేనవ ఏటికే వాస్కో మంచి నావికుడిగా ఎదిగాడు. పశ్చిమ ఆఫ్రికా తీరం వద్దకి ప్రయాణించే ఓడలలో స్థానం సంపాదించి నౌకా యానంలో తొలిపాఠాలు నేర్చుకోవడం మొదలెట్టాడు. తుఫాను సమయంలో సముద్రం అల్లకల్లోగంగా ఉన్నప్పుడు, పొగ మంచు వల్ల దారి అయోమయం అయినప్పుడు, కరకు శిలలు పొంచివున్న ప్రమాదకరమైన మార్గాలలో ఓడలు ప్రయాణించవలసి వచ్చినప్పుడు నావికులు ఎలాంటి కౌశలాన్ని ప్రదర్శించాలో నేర్చుకున్నాడు.
అలాంటి దశలో రాజుగారి నౌకా దళాలలో పని చేసే అవకాశం దొరికింది. 1492 లో ఒక సారి వాస్కోకి రచకార్యం మీద సేతుబల్ అనే ఊరికి వెళ్ళే పని పడింది. ఆ ఊరి సమీపంలో ఫ్రెంచ్ ఓడలు పోర్చుగల్ ఓడలని అటకాయించాయి. ఫ్రెంచ్ ఓడలకి తగిన గుణపాఠం నేర్పమని పోర్చుగీస్ రాజ్యంలో బేజా ప్రాంతానికి డ్యూక్ గా పని చేసే డామ్ మిగ్యుయెల్ అనే అధికారి వాస్కోని పంపాడు. వాస్కో ద గామా తనకి ఇచ్చిన పనిని సమర్ధవంతంగా పూర్తి చేసుకుని, దురగతాలకి ఒడిగట్టిన ఫ్రెంచ్ నావికులకి సంకెళ్ళు వేసి డామ్ మిగ్యుయెల్ కి అప్పజెప్పాడు. వాస్కో చూపించిన సత్తా చూసి డామ్ మిగ్యుయెల్ సంతొషించాడు. ఇండియాకి దారి కనుక్కోగల మహాకార్యాన్ని సాధించగల శూరుడు వాస్కో ద గామాలో తనకి కనిపించాడు.
(ఇంకా వుంది)
అయ్యా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చెయ్యొచ్చు ?
naa email address:
srinivasa.chakravarthy@gmail.com
మీ ఫోన్ నంబర్ ఇస్తారా?