http://www.andhrabhoomi.net/intelligent/srer-757
ఆ విధంగా ప్రతిభతో కూడిన రూపకల్పన వల్లనే జీవజాతులు సృజించబడ్డాయి అన్న భావనని అడ్డుపెట్టుకుని సృష్టి వాదులు సంబరపడుతున్న సమయంలో, వారి వేడిని చల్లారుస్తూ, పరిణామ వాదానికి మద్దతు నిస్తూ మరిన్ని ఆధారాలు బయటపడ్డాయి.
ఎన్నో జంతువులకి పనికిరాని అంగాలు ఉంటాయి. ఉదాహరణకి కొన్ని పాములకి కాళ్ళు ఉంటాయి. పాకే పాములకి కాళ్లతో ఏం పని? బల్లులకి, మొసళ్లకి ఉన్నట్టే ఉంటాయి గాని నిజానికి ఆ కాళ్లు ఆ పాముల కదలికలో పాల్గొనవు. ఇలాంటి అంగాలనే వ్యర్థ అంగాలు (vestigial organs) అంటారు. అలాగే మోల్ అనబడే ఎలుకని పోలిన జంతువులకి చెందిన బ్లైండ్(గుడ్డి) మోల్ అనే ఉపజాతి ఒకటి ఉంది. ఇవి ఎక్కువగా కలుగుల్లో, చీకటి ప్రాంతాల్లో బతుకుతుంటాయి. వీటికి కళ్లు ఉంటాయి గాని అవి పని చెయ్యవు. వాటి మీదుగా ఓ చర్మపు పొర కప్పబడి ఉంటుంది. చూపు లేని ఈ జీవాలకి కళ్లెందుకు? అలాగే రెక్కలు ఉన్నా ఎగరలేని ఎన్నో పక్షి జాతులు ఉంటాయి. మనకి కనిపించే సర్వసాధారణమైన కోడి ఇందుకు తార్కాణం. కొన్ని రకాల పురుగులకి చిట్టి రెక్కలు ఉంటాయి. అవి ఎగరడానికి పనికి రావు. ‘ప్రతిభతో కూడిన రూపకల్పన’ అనే భావనకి ఈ వ్యర్థ అంగాలు ఓ వెక్కిరింపుగా, సవాళ్లుగా పరిణమించాయి. జంతువులన్నీ అంత తెలివిగా, కచ్చితంగా తీర్చిదిద్దబడినట్టయితే ఈ పనికిమాలిన అవయవాలు ఎందుకు ఉన్నట్టు?
దీనికీ సృష్టి వాదులు, తదితరులు చిత్రవిచిత్ర రీతుల్లో స్పందించారు. వ్యర్థ అంగాలు జంతువు యొక్క ఆకారానికి చక్కని సౌష్ఠవాన్ని ఇస్తాయన్నారు. అవి లేకపోతే ఏదో ‘వెలితి’గా ఉంటుందన్నారు. అవి లేకుంటే ‘చూడ్డానికి బాగోద’న్నారు. ఇలా ఎన్నో అన్నారు. ఇలాంటి ‘వ్యర్థ’ వివరణల వల్ల లాభం లేదని త్వరలోనే తేటతెల్లం అయ్యింది. తదనంతరం డార్విన్ ఈ వ్యర్థ అంగాలు పరిణామ సిద్ధాంతానికి సమర్ధిస్తున్నాయని అర్థం చేసుకున్నాడు. ఆ అంగాలు గత జీవ దశల నుండి వారసత్వంగా సంక్రమించి ఉంటాయని, బాహ్యపరిస్థితుల్లోని మార్పుల వల్ల అవి నిరుపయోగం అయిపోయి ఉండొచ్చని భావించాడు.
పరిణామ వాదాన్ని సమర్థించే మరో విశేషం జంతు శరీరాల నిర్మాణంలో కనిపించింది. పైకి చూడడానికి చాలా వేరుగా ఉన్నా అంతరంగ నిర్మాణంలో ఎంతో సమానత గల ఎన్నో అంగాలు జంతుశరీరాలలో కనిపిస్తాయి. డార్విన్ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఆశ్చర్యపోయాడు. పట్టుకోవడానికి ఉపయోగపడే మనిషి చెయ్యి, తవ్వడానికి ఉపయోగపడే మోల్ కాలు, దౌడు తీయడానికి పనికొచ్చే గుర్రం గిట్ట, ఎగరడానికి ఉపయోగపడే గబ్బిలం రెక్క – ఎంతో వైవిధ్యంతో కూడుకున్న ఈ అవయవాలన్నిటిలోను ఎముకల విన్యాసం ఒకేలా ఉండడం డార్విన్ కి విస్మయం కలిగించింది. గతానికి చెందిన శరీరనిర్మాణ విన్యాసాలు కాలానుగతంగా, బాహ్యపరిస్థితులకి అనుగుణంగా కొద్దికొద్దిగా మారుతూ వస్తునాయి కాబోలు. ఒక జంతు జాతి నుండి మరో జంతు జాతి వచ్చింది అనడానికి, జీవపరిణామం నిజమని చెప్పడానికి, ఇంతకన్నా గొప్ప ఆధారం అక్కర్లేదు అనుకున్నాడు.
అయితే ప్రతిభావంతమైన రూపకల్పనని పట్టుకుని వేలాడే బృందం ఇదే సమాచారాన్ని మరోలా తీసుకున్నారు. తెలివైన సూత్రధారి ఒకే మూలసూత్రాన్ని వాడుకుంటూ ఎన్నో రకాల వస్తువులని రూపొందిస్తాడు. ప్రతీ వస్తువుకి కొత్తగా, ప్రత్యేక మూలసూత్రాలని కనిపెట్టాల్సిన పన్లేదు. కనుక ప్రతిభావంతమైన రూపకల్పనే నిజం అన్నారు. ఈ సందర్భంలో విషయం ఎటూ తేలకపోయినా, పరిణామాన్ని బలపరిచే మరో విషయాన్ని చూద్దాం.
ఆ విషయం పిండం యొక్క అభివృద్ధికి సంబంధించినది. పిండ దశలో ఉన్నప్పుడు వివిధ జీవజాతుల పిండాల్లో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. తొలిదశల్లో చేప, ముళ్లపంది, కోడిపెట్ట, దూడ, కుందేలు, మనిషి ఇలా ఎన్నో జీవజాతుల పిండాల్లో పోలిక కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది (చిత్రం). ఉదాహరణకి మానవ పిండంలో ఒక దశలో చేపలలో ఉండే మొప్పలు (gills) లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ భావనకి మొట్టమొదట ఊపిరి పోసినవాళ్ళు పద్దెనిమిదవ శతాబ్దపు జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్తలు అని తెలుస్తోంది. తరువాత పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన జర్మన్ జీవశాస్త్రవేత్త, తాత్వికుడు అయిన ఎర్నెస్ట్ హెకెల్ ఈ భావన గురించి ఎన్నో జీవజాతుల పిండాల మీద పరిశీలనలు చేసి, ఆ భావనకి ప్రాచుర్యాన్ని పెంచాడు.
అయితే ఓ ఆసక్తికరమైన కొత్త విషయాన్ని కనుక్కున్నప్పుడు ఆ నూతనోత్సాహంలో అది అన్నివిధాలా నిజమని నమ్ముతాం. వివిధ జీవజాతుల పిండాలలో హెకెల్ చూసిన పోలికలలో కొంత అతిశయోక్తి ఉన్న మాట నిజమైనప్పటికీ, మూలభావన మాత్రం స్థిరంగా ఉందని తదనంతరం జీవనిర్మాణ శాస్త్రవేత్తలు సమర్ధించారు. పిండ దశలలో వివిధ జీవజాతులు పోలి ఉండే విషయం ఒక జీవజాతి నుండి మరో జీవజాతి వచ్చిందనడానికి ముఖ్య ఆధారాలలో ఒకటిగా తదనంతరం డార్విన్ స్వీకరించాడు.
డార్విన్ కి బాగా స్ఫూర్తి నిచ్చిన సర్వసాధారణ విషయం ఒకటుంది. రైతులకి, పశువులని పెంచేవారికి బాగా తెలిసిన విషయం ఇది. ఉదాహరణకి వరి పంట వేసే రైతు వర్షాపాతం తక్కువగా ఉండే ప్రాంతం వాడైతే ఎక్కువ నీరు అవసరం లేని వరి జాతిని ఎంచుకుంటాడు. నీరు పుష్కలంగా దొరికే ప్రాంతపు రైతుకి ఆ సమస్య ఉండదు. కొన్ని రకాల వరిగడ్డి బలంగా ఉండి, గుడిసెల మీద కప్పడానికి అనువుగా ఉంటుంది. ఆ గడ్డి ప్రధానంగా కావాలనుకునే రైతు ఆ రకం వరినే ఎంచుకుంటాడు. అలాగే జొన్న పంటలో జొన్నలే కాక ఎండిన పంట నుండి వచ్చే చొప్ప పశువులకి మేతగా పనికొస్తుంది. కొన్ని రకాల జొన్నలో చొప్ప బాగుంటుంది గాని, జొన్న గింజ నాణ్యత తక్కువగా ఉంటుంది. కాని చొప్పకి ప్రాధాన్యత ఇచ్చే రైతు ఆ రకం జొన్ననే ఎంచుకుంటాడు. ఆ విధంగా రైతు తన అవసరాల బట్టి వివిధ రకాల ధాన్యపు జాతుల నుండి తనకి కావలసిన జాతిని ఎంచుకుంటాడు.
అలాగే పెంపుడు జంతువుల (కుక్కలు, మేకలు, గొర్రెపోతులు, ఆవులు, దున్నలు…) విషయంలో కూడా అవసరాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి వివిధ జాతుల ఎంపిక జరుగుతుంది. ఆ విధంగా కొన్ని జాతులు బాగా వర్ధిల్లుతాయి, కొన్ని అంతరించిపోవడం కూడా జరుగుతుంది. మానవ చర్యల వల్ల కృత్రిమంగా జరుగుతున్న ఈ ‘ఎంపికే’ ప్రకృతిలో సహజమైన మార్పుల వల్ల కూడా జరుగుతోందని, కొన్ని జాతులు అంతరించిపోడానికి, కొత్త జాతులు ఆవిర్భవించడానికి ఈ ఎంపికే కారణం అని డార్విన్ తదనంతరం గుర్తిస్తాడు.
ఆ విధంగా డార్విన్ రంగప్రవేశం చేసిన సమయానికి పరిణామ సిద్ధాంత నిర్మాణానికి అవసరమైన ఎన్నో పునాదిరాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆయన రంగప్రవేశం చెయ్యడమే ఆలస్యం…
(ఇంకా వుంది)
0 comments