పాలే రచనలు కాకుండా మరి కొన్ని పుస్తకాలు కూడా డార్విన్ చదువుకునే రోజుల్లో అతడి మీద గాఢమైన ప్రభావం చూపాయి. వాటిలో ఒకటి అలెగ్జాండర్ హంబోల్ట్ రాసిన ‘Personal Narrative‘ (నా జీవనయాత్ర). జర్మనీకి చెందిన అలెగ్జాండర్ హంబోల్ట్ (1769 – 1859) ఓ గొప్ప ప్రకృతి శాస్త్రవేత్త, పర్యాటకుడు. హంబోల్ట్ తన జీవితంలో విస్తృతంగా పర్యటించాడు. ఆ పర్యటనలలో తన చుట్టూ ఉండే పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. భౌగోళిక విశేషాలు, చెట్లు, జంతువుల రూపురేఖలు, మనుషులు, సమాజాలు, సంస్కృతులు – ఇలా ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. అవసరమైన చోట ఎన్నో రకాల పరికరాలని కూడా తన పరిశీలనలలో వాడేవాడు. తన పరిశీలనల నుండి వైజ్ఞానిక సత్యాలని రాబట్టేవాడు. అలా తను అర్థం చేసుకున్న వైజ్ఞానిక విషయాలని గ్రంథస్థం చేసేవాడు. హంబోల్ట్ రచనలు చదివాక డార్విన్ కి కూడా అలాంటి ‘యాత్రా పరిశోధన’ పట్ల మోజు పుట్టింది.
డార్విన్ కి స్ఫూర్తి నిచ్చిన మరో పుస్తకం జాన్ హెర్షెల్ రాసిన ‘An introduction to the study of Natural Philosophy’ (ప్రకృతిగత తత్వశాస్త్ర అధ్యయనానికి పరిచయం). ఈ జాన్ హెర్షెల్ (1792 – 1871) ఇంగ్లండ్ కి చెందిన గొప్ప గణితవేత్త, ఖగోళవేత్త, రసాయనవేత్త కూడా. సాటర్న్, యురేనస్ గ్రహాలకి చెందిన ఉపగ్రహాల మీద ఇతడు ఎన్నో పరిశీలనలు చేసి వాటికి పేర్లు కూడా పెట్టాడు. తన పరిశీలనల ఆధారంగా పదివేల తారల విశేషాలని వివరిస్తూ పుస్తకం రాశాడు. అసలు వైజ్ఞానిక పరిశోధన అంటే ఎలా చెయ్యాలి అన్న విషయాన్ని తన ‘study of Natural Philosophy’ లో స్పష్టంగా వివరించాడు. పరిశోధిస్తున్న రంగంలో ముందు విస్తృతంగా పరిశీలనలు చేసి వాటి ఆధారంగా, కచ్చితమైన తర్కంతో, పరిశీలనలన్నిటినీ వివరించేలా, సిద్ధాంతాన్ని ఎలా నిర్మించాలో వివరించాడు.
అసలే ‘సేకరణ’ అంటే వల్లమాలిన ఉత్సాహం గల కుర్ర డార్విన్ ఇలాంటి పుస్తకాలన్నీ చదివి ఎలాగైనా విస్తృతంగా ప్రపంచం అంతా పర్యటించి, జీవరాశుల గురించి క్షుణ్ణంగా పరిశీలనలు చేసి, పరిణామం అనేది నిజంగా జరుగుతోందో లేదో తెలుసుకోవాలని ఆరాట పడసాగాడు. అలా పర్యటించే అవకాశం త్వరలోనే వచ్చింది. డార్విన్ కి జాన్ హెన్స్లో అనే ఓ స్నేహితుడు ఉండేవాడు. ఇతడో వృక్షశాస్త్రవేత్త. ఇద్దరూ కలిసి అడవులంట తిరుగుతూ చెట్లు, చేమలు పరిశీలించేవారు. 1831 ఆగస్టు నెలలో డార్విన్ కి హెన్స్లో నుండి ఓ ఉత్తరం వచ్చింది. ఇంగ్లండ్ మహారాణి గారి సర్వేయింగ్ ఓడలో ప్రయాణించే అవకాశాన్ని ఇస్తున్నట్టు ఆ ఉత్తరంలో హెన్స్లో రాశాడు. డార్విన్ సంతోషానికి హద్దుల్లేవు.
కాని ప్రయాణానికి నాన్నగారు ఒప్పుకుంటారో లేదోనన్న భయం ఒక పక్కపీకుతోంది. అనుకున్నట్టుగానే యాత్ర మాట చెవిన పడగానే తండ్రి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. “శ్రద్ధగా చదువుకోరా అంటే, ఈ తిరుగుళ్ళేవిట్రా?” అంటూ డార్విన్ ని దులిపేశాడు. కాని డార్విన్ మామగారైన జోసయ్యా కల్పించుకుని బావగారికి నచ్చజెప్పి డార్విన్ కి అనుమతి ఇప్పించాడు.
ఒక సమస్య తీరింది, కాని మరో సమస్య ఇంకా ఉంది. డార్విన్ ప్రయాణించాల్సిన ఓడ పేరు హెచ్. ఎం. ఎస్. బీగిల్. ఆ ఓడ కెప్టెన్ పేరు ఫిట్జ్ రాయి. ఇతగాడు బాగా చాదస్తం మనిషి. ఓడలో సిబ్బందితో నిరంకుశంగా ప్రవర్తిస్తాడు. తను చెప్పిందే వేదం. ప్రయాణంలో పాల్గొనాలంటే డార్విన్ ముందు ఇతగాణ్ణి ఒప్పించాలి. ఈ ఫిట్జ్ రాయ్ కి ఫిజియానమీ అనే ఓ శాస్త్రం అంటే నమ్మకం. ఈ శాస్త్రం ప్రకారం ముఖం యొక్క రూపురేఖల బట్టి మనిషి యొక్క మనస్తత్వాన్ని గురించి చెప్తారు. అయితే బల్లిపట్టు, హస్తసాముద్రికం లాగానే ఇది కూడా ఓ కుహనా శాస్త్రం. డార్విన్ ముక్కు ఆకారం నచ్చలేదు ఫిట్జ్ రాయ్ కి! అలాంటి ముక్కు ఉండేవాళ్లు సోమరులని అతడి నమ్మకం. కాని ముందు కాస్త నస పెట్టినా నెమ్మదిగా డార్విన్ తన ఓడ మీదకి రావడానికి ఒప్పుకున్నాడు.
చివరికి ఆ యాత్ర 1831 లో 27 డిసెంబర్ నాడు మొదలయ్యింది. రెండేళ్లు అనుకున్న యాత్ర ఐదేళ్లు సాగింది. ఆ సుదీర్ఘ యాత్రలో దక్షిణ అమెరికా తీరం పొడవునా ఎన్నో ప్రదేశాలు సందర్శించి, అక్కణ్ణుంచి ఆస్ట్రేలియాకి ప్రయాణించి, అక్కడ కొన్ని తీర ప్రాంతాలు చూసి, అక్కణ్ణుంచి ఆఫ్రికా దక్షిణ కొమ్ము వద్ద ఉన్న కేప్ టౌన్ కి వెళ్లి, మరో సారి దక్షిణ అమెరికా తూర్పు తీరాన్ని తాకి, అక్కణ్ణుంచి తిరిగి ఇంగ్లండ్ ని చేరుకున్నారు. అంతకాలం నావికజీవనం డార్విన్ కి కొంచెం కష్టంగానే అనిపించింది. నియంతలాగా ప్రవర్తించే ఫిట్జ్ రాయ్ నీడలో బతకడం మరీ ఇబ్బంది అయ్యింది. సిబ్బందితో కెప్టెన్ మోటుగా వ్యవహరించే తీరు సున్నిత స్వభావుడైన డార్విన్ కి నచ్చేది కాదు. ఫిట్జ్ రాయ్ విషయంలో డార్విన్ ని ఇబ్బంది పెట్టిన మరో విషయం ఏంటంటే ఈ ఫిట్జ్ రాయ్ కి బైబిల్ అన్నా, ఆ కారణం చేత సృష్టివాదం అన్నా, గాఢమైన నమ్మకం. ఒక పక్క డార్విన్ సృష్టి వాదాన్ని ప్రశ్నిస్తూ ఈ యాత్ర మీద బయల్దేరుతుంటే మరో పక్క నిరంకుశుడైన ఓడ కెప్టెన్ కి సృష్టివాదం అంటే గుడ్డి నమ్మకం! విధి వైపరీత్యం అంటే ఇదేనేమో! కెప్టెన్ తో వాదనకి దిగితే డార్విన్ ని నడిసముద్రంలో సొరచేపలకి ఎర వేసే ప్రమాదం ఉంది. కనుక కెప్టెన్ జోలికి పోకుండా తన పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు డార్విన్. రాత్రనక, పగలనక ఆరోగ్యాన్ని లెక్కచెయ్యకుండా పరిశ్రమించేవాడు. ఓడ లంగరు వేసిన ప్రతీ సారి తీరం మీదకి వెళ్లి అక్కడి జంతువులని, వృక్ష జాతులని పరిశీలించేవాడు. ఇక్కడే ‘సేకరణ’ పట్ల తనకి చిన్నప్పట్నుంచి ఉండే అభిలాష మళ్లీ ఊపిరి పోసుకుంది. తదనంతరం పరిశోధనకి పనికొచ్చేలా ఎంతో సరంజామాని సేకరించాడు. గవ్వలు, ఈకలు, గోళ్లు, దంతాలు, ఎముకలు మొదలైన అవిశేషమైన వస్తువులే జీవశాస్త్రానికి మూలస్తంభం లాంటి అమోఘమైన సిద్ధాంత నిర్మాణానికి పునాది రాళ్ళు అయ్యాయి.
0 comments