http://www.andhrabhoomi.net/sisindri/vasco-da-gama-359
సేతుబల్ లో వాస్కో ద గామా సాధించుకు వచ్చిన ఘన విజయం చూశాక బేజా ప్రాంతానికి డ్యూక్ అయిన డామ్ మిగ్యుయెల్ కి వాస్కో సామర్థ్యం మీద నమ్మకం బలపడింది. ఇండియాకి దారి కనుక్కోగల సత్తా ఈ వ్యక్తిలో ఉందని మనసులో అనుకున్నాడు. ఇండియాకి నౌకాదళాన్ని పంపితే దాన్ని శాసించగల సమర్ధుడు ఈ వాస్కో ఒక్కడే అంటూ వాస్కోని సిఫారసు చేస్తూ రాజైన జాన్-2 కి డామ్ మిగ్యుయెల్ జాబు రాశాడు. ఆ సిఫారసుని రాజు ఆమోదించాడు. ఇండియాకి దారి కనుక్కునే బాధ్యతని వాస్కో భుజాల మీద ఉంచాడు.
రాజు తనపై పెంచుకున్న నమ్మకానికి తగినట్టుగానే వాస్కో ద గామా కూడా ఒక సమర్ధుడైన కెప్టెన్ గా మంచి పేరు తెచ్చుకోసాగాడు. ఒక ఓడని నడిపించాలంటే, ఓ నౌకాదళాన్ని శాసించాలంటే ఆ నౌక లోని సిబ్బంది కెప్టెన్ ని గౌరవించాలి. కెప్టెన్ మాటని శిరసావహించాలి. కాని ఆ రోజుల్లో కెప్టెన్ పని అంత సులభం కాదు. నావికులని శాసించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో నావికులు, మోటుగా, కరుగ్గా, మహాబలిష్టులై ఉండేవారు. ఎన్నో సందర్భాల్లో జైల్లోని బందీలని విడిపించి నౌకా యాత్రల మీద పంపేవారు. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన నౌకాయాత్రల్లో సామాన్యులు ప్రయాణించడానికి ముందుకి వచ్చేవారు కారు. అలాంటి గట్టిపిండాలని శాసించగల కెప్టెన్ కూడా గొప్ప నేతృత్వం, బలమైన వ్యక్తిత్వం, వ్యతిరేకతని సులభంగా ఎదుర్కుని అణచగల సత్తా ఉన్నవారు అయ్యుండాలి. వాస్కో ద గామాలో అలాంటి లక్షణాలన్నీ అప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇండియా యాత్రలో తనకి సహకరించగల నౌకాదళాన్ని ఎన్నుకునే పనిలో మునిగాడు వాస్కో ద గామా. మొదటగా వాస్కో తన అన్నల్లో ఒకడైనా పాలో ని ఎంచుకున్నాడు. ఇతగాడు అంటే వాస్కోకి ఎంతో గౌరవం, అభిమానం. అయితే పాలో ఆ యాత్రలో పాల్గొనడానికి అడ్డుపడే చిన్న చిక్కు ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ పాలో సేతుబల్ ప్రాంతానికి చెందిన ఓ న్యాయమూర్తితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో న్యాయమూర్తి గాయపడ్డాడు. ఆ నేరానికి పెద్ద శిక్షే పడేలా ఉండడంతో అప్పట్నుంచి పాలో రాజభటులకి అందకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు పాలోని యాత్ర మీద తనతో తీసుకెళ్ళాలంటే ముందు రాజుగారి క్షమాభిక్ష పొందాలి. అన్నని క్షమించమని అర్థిస్తూ వాస్కో రాజుకి లేఖ రాశాడు. క్షమాపణ ప్రసాదించిన రాజు ఓ షరతు పెట్టాడు. వాస్కో, పాలో సోదరులు ఇండియాకి విజయవంతంగా దారి కనుక్కుని వస్తేనే శిక్ష పూర్తిగా రద్దవుతుంది. ద గామా సోదరులు షరతుకి సంతోషంగా ఒప్పుకున్నారు.
యాత్ర కోసం వాస్కో ద గామా మూడు ఓడలని ఎంచుకున్నాడు. అన్నిట్లోకి పెద్దదైన సావో గాబ్రియెల్ ఓడని ప్రధాన ఓడగా ఎంచుకున్నాడు. దానికి కెప్టెన్ గా గొన్సాలో ఆల్వారెజ్ అనే వాణ్ణి నియమించాడు. ఈ ఆల్వారెజ్ కి గొప్ప నావికుడిగా పేరు ఉంది. అదే ఓడకి పైలట్ గా పెరో దలెంకర్ అనే వాడు నియమించబడ్డాడు. ఈ దలెంకర్ గతంలో బార్తొలోమ్యూ దియాజ్ తో పాటు ఆఫ్రికా యాత్రలో పాల్గొని కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా ప్రయాణించినవాడు. తన అనుభవం ఈ యాత్రలో ఉపయోగపడుతుందని తనని ఎంచుకున్నాడు వాస్కో. ఆ రోజుల్లో కెప్టెన్ ఉద్యోగం చాల వరకు వంశపారంపర్యంగా వచ్చే ఉద్యోగం. కాని పైలట్ ఉద్యోగం మరింత కీలకమైనది. అసలు పని భారం అంతా పైలట్ మీద ఉంటుంది. రెండవ ఓడ అయిన సావో రఫాయెల్ కి కెప్టెన్ గా వాస్కో కి అన్న అయిన పాలో ద గామా నియమించబడ్డాడు. ఇక మూడవది, కాస్త చిన్నది అయిన బెరియో అనే ఓడకి కెప్టెన్ గా నికొలావ్ కోయిలో నియమించబడ్డాడు.
కెప్టెన్ ల నియామకం జరిగాక 140 నుండి 170 మంది దాకా నౌకా సిబ్బందిని పోగు చేశాడు. ఒక్కొక్క వ్యక్తిని, వారి పుట్టు పూర్వోత్తరాలని క్షుణ్ణంగా పరిశీలించి, ఆచి తూచి ఎన్నుకున్నాడు. అంత ముఖ్యమైన యాత్రలో ప్రతి ఒక్కడు సమర్ధుడు, నిజాయితీ పరుడు అయ్యుండాలి. ఒక్క విషపురుగు ఉన్నా యాత్ర విఫలం అయ్యే ప్రమాదం ఉంది. బార్తొలోమ్యూ దియాజ్ తో పాటు ప్రయాణించిన నావికులలో ఎంతో మందిని తన దళంలో చేర్చుకున్నాడు వారి అనుభవం పనికొస్తుందని. అంత సుదీర్ఘమైన యాత్రలో నౌకలు ఎన్నో రేవుల వద్ద ఆగాల్సి వస్తుంది. ఎన్నో రకాల సంస్కృతులతో సంపర్కం తప్పదు. కనుక వివిధ భాషల యొక్క, సంస్కృతుల యొక్క అవగాహన కలవారు కావాలి. కనుక ఆఫ్రికా తెగలు మాట్లాడే భాషలు తెలిసిన మార్టిన్ అఫోన్సో ని చేర్చుకున్నాడు. అరబిక్ భాష తెలిసిన ఫెర్నావో మార్టిన్స్ ని, జో న్యూన్స్ ని కూడా ఎంచుకున్నాడు. వీరు కాక వంట వాళ్లు, సిపాయిలు, వండ్రంగులు, తెరచాప తయారీ తెలిసిన వాళ్లు, ఒక వైద్యుడు కూడా సిబ్బందిలో చేరారు.
ఇంత ముఖ్యమైన యాత్రలో విజయం సాధించాలంటే కేవలం సమర్ధులైన సిబ్బంది మాత్రం ఉంటే సరిపోదు. అంత కఠినమైన యాత్రకి తట్టుకోగల బలమైన ఓడలు కూడా కావాలి. 15 వ శతాబ్దంలో పోర్చుగల్ లో కారవెల్ అనే కొత్త రకం ఓడల నిర్మాణం మొదలయ్యింది. గతంలో వాడబడ్డ ఓడల కన్నా ఇవి మరింత వేగంగా ప్రయాణించగలగడమే కాక మరింత కఠినమైన సముద్ర పరిస్థితులకి తట్టుకోగలిగి ఉండేవి. వీటి తెరచాపలు చదరపు ఆకారంలో కాక, త్రికోణాకారంలో ఉండేవి. ఆ కారణం చేత ఇవి గాలికి ఎదురుగా కూడా ప్రయాణించగలిగేవి. వీటి దేహం కూడా మరింత బలమైన, దళసరి అయిన చెక్కపలకలతో నిర్మించబడేది. ఇండియా యాత్ర కోసం ఈ కారవెల్ ఓడలని ఎంచుకున్నాడు వాస్కో ద గామా.
ఇంత సుదీర్ఘమైన యాత్ర పూర్తి కావడానికి మూడేళ్లు అయినా పట్టొచ్చని అంచనా వేశాడు. కనుక మూడేళ్లకి సరిపోయే ఆహార పదార్థాలు ఓడల పైకి ఎత్తించారు. వీటితో పాటు తగినంత మందుపాతర, విల్లంబులు మొదలైన యుద్ధ సామగ్రి కూడా ఎక్కించుకున్నారు.
సన్నాహాలన్నీ పూర్తయ్యాక ఇక ఇండియా కి బయల్దేరే సుముహూర్తం కోసం ఎదురుచూడసాగారు.
(ఇంకా వుంది)
0 comments