చార్లెస్ డార్విన్ ఇంగ్లడ్ లో ష్రూబెరీ నగరంలో 1809 లో, ఫిబ్రవరి 12, నాడు పుట్టాడు. తండ్రి పేరు రాబర్ట్ డార్విన్, తల్లి సుసన్నా డార్విన్. చార్లెస్ తండ్రి మంచి ఆస్తిపరుడైన వైద్యుడు. తాత ఎరాస్మస్ డార్విన్ కూడా వైద్యుడే. ఒక జీవశాస్త్రవేత్తగా కూడా అతడికి మంచి పేరు ఉండేది. తల్లి సుసన్నా పుట్టింటివైపు ఇంటిపేరు వెడ్జ్ వుడ్. ఆమె తండ్రి జోసయా వెడ్జ్ వుడ్ ఓ పేరుమోసిన కుమ్మరి.
చార్లెస్ తాతలు (ఎరాస్మస్ డార్విన్, జోసయా వెడ్జ్ వుడ్) ఇద్దరూ ముందే మంచి స్నేహితులు. బిర్మింగ్ హామ్ లో ‘లూనార్ సొసయిటీ’ అనే సమాజంలో వీళ్లిద్దరూ సభ్యులుగా ఉండేవాళ్లు. ఎంతో మంది శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు అందులో సభ్యులుగా ఉండేవారు. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టిన జేమ్స్ వాట్ కూడా ఆ సమాజంలో ఉండేవాడు. నెలకి ఒకసారి అంతా కలిసి వైజ్ఞానిక, సాంకేతిక విషయాలు ముచ్చటించుకుంటూ ఉండేవారు. భౌగోళిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వాతావరణం ఇలా ఎన్నో అంశాల మీద చర్చి కొనసాగేది.
ఈ సమాజం యొక్క వ్యవహారాల వల్ల మనుషుల మనసులు మత చింతన నుండి మరలి వైజ్ఞానిక చింతన దిక్కుగా మొగ్గు చూపడం మొదలెట్టాయి. మతం బోధించే కట్టుబాట్లలాగా కాక సైన్సు చెప్పే ధర్మాలు అనుభవంలో తెలుసుకోదగ్గవి. రూఢి చేసుకోదగినవి. అందుకని వాటి మీద జనం నమ్మకం పెరగసాగింది. అంతేకాక ఈ సమాజం యొక్క లక్ష్యం కేవలం సైన్సు మీదే కాదు. పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్న ఈ సమాజంలో జరిగే చర్చల్లో, విజ్ఞానాన్ని వాడుకుని లాభాలు ఎలా పొందాలి అనే చర్చ కూడా చోటుచేసుకునేది. ఆ విధంగా మతచింతన పట్టునెమ్మదిగా సడలింది. అలాంటి పూర్వీకుల ప్రభావం డార్విన్ చింతన మీద కనిపించింది అనడంలో సందేహం లేదు.
చార్లెస్ కి ఏడేళ్ళ వయసులో తల్లి మరణించడంతో చదువు కొంచెం ఆలస్యం అయ్యింది. తొమ్మిదేళ్ల వయసులో 1818 లో చార్లెస్ ని బళ్లో చేర్పించారు. బళ్లో చార్లెస్ చదువు అంత గొప్పగా సాగలేదనే చెప్పాలి. అయితే చిన్నప్పట్నుంచి పురుగులు, పక్షి గుడ్లు మొదలైన వాటిని సేకరించడం అంటే అతడికి చాలా ఆనందం. ఈ పనికిమాలిన పనులతో పిల్లవాడు కాలం వృధా చేస్తున్నాడని తండ్రికి మంటగా ఉండేది.
స్కూలు చదువులు ఎలాగో పూర్తయ్యాయి. కాలేజి చదువుల కోసం తండ్రి చార్లెస్ ని 1825 లో వైద్య కళాశాలలో చేర్పించాడు. తన లాగ, తన తండ్రి లాగ కొడుకు చార్లెస్ కూడా గొప్ప డాక్టరు కావాలని ఆయన ఆలోచన. ఎడిన్బర్గ్ లోని ప్రఖ్యాత వైద్య విశ్వవిద్యాలయంలో చార్లెస్ విధిలేక చదువు మొదలెట్టాడు. అక్కడి పాఠాలు తెగ బోరు కొట్టేవి. ఇక అనెస్తీషియా కూడా ఇవ్వకుండా రోగుల మీద చేసే శస్త్రచికిత్సలు అతడికి జుగుప్సాకరంగా అనిపించేవి. ఈ కాలంలోనే అతడికి జేమ్స్ ఎడ్మండ్ స్టోన్ అనే నల్లజాతికి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇతగాడి వద్ద చార్లెస్ ‘టాక్సీ డెర్మీ’ అనే విద్యని నేర్చుకున్నాడు. టాక్సీడెర్మీ అంటే జంతు కళేబరాలలో తగిన పదార్థం కూరి ఆ జంతు దేహాన్ని ఓ శీల్పంలా సజీవంగా కనిపించేలా నిలిపే కళ. ఈ జేమ్స్ ఎడ్మండ్ స్టోన్ దక్షిణ అమెరికాలో కారడవులలో చార్లెస్ వాటర్టన్ అనే వ్యక్తితో కలిసి పర్యటించాడు. కనుక ప్రయాణంలో తన అనుభవాలన్నీ కథలు కథలుగా చార్లెస్ చెప్పేవాడు. ఇతడి సాంగత్యం చార్లెస్ కి ఎంతో ఆనందదాయకంగా ఉండేది.
రెండవ సంవత్సరంలో ఉండగా చార్లెస్ డార్విన్ ‘ప్లైనియన్’ సమాజంలో చేరాడు. ఇదొక ప్రకృతి శాస్త్ర సమాజం. ఆ కాలంలో రాబర్ట్ గ్రాంట్ అనే అనాటమీ ప్రొఫెసరు తో బాగా సాన్నిహిత్యం పెరిగింది. పంతొమ్మిదవ శతాబ్దపు జీవశాస్త్రవేత్తల్లో ముఖ్యుడిగా ఈ గ్రాంట్ కి మంచి పేరు ఉంది. పైగా జీవపరిణామం ఉందని నమ్మినవారిలో ఒకడు. గ్రాంట్ చింతనల ప్రభావం డార్విన్ మీద పడింది. ఆ రోజుల్లోనే నీట్లో బతికే అకశేరుకాలని సేకరించడం డార్విన్ ఓ హాబీగా తీసుకున్నాడు. ఆ సేకరణ కార్యక్రమంలో డార్విన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని కనుక్కున్నాడు. ఆలుచిప్పల్లో కనిపించే నల్లని స్పోర్ లు నిజానికి ‘స్కేట్’ అనబడే ఒకరకం జలగలు పెట్టే గుడ్లు అని గమనించాడు. ఇదంత విశేషమైన విషయంగా కనిపించలేదు డార్విన్ కి. కాని గురువుల ప్రోద్బలం మీద తను కనుక్కున్న ఈ కొత్త విషయాన్ని ప్లైనియన్ సమాజపు సమావేశంలో ఒకసారి ప్రకటించాడు. మొత్తానికి డార్విన్ వైద్య చదువు సజావుగా సాగలేదనే చెప్పాలి.
డాక్టరు కమ్మని పంపితే నదీ తీరంలో నత్తగుల్లలు ఏరుకునే కొడుకు తీరు చూసి తండ్రికి ఒళ్లు మండిపోయింది. వైద్యం చదువు మాన్పించి కేంబ్రిడ్జ్ లో మతవిద్యలో బి.ఏ. చదువులో చేర్పించాడు. ఇష్టం లేకపోయినా తండ్రి మాటకి ఎదురుచెప్పలేక కేంబ్రిడ్జ్ లోని క్రైస్ట్ కాలేజి లో చేరాడు డార్విన్. అక్కడ కూడా చదువు అంతంతమాత్రంగానే సాగింది. ఇక్కడ కూడా ఓ కొత్త వ్యాపకం అలవడింది. దాన్ని అంటించినవాడు విలియమ్ ఫాక్స్ అనే ఓ బంధువుల కుర్రాడు. ఇద్దరూ కలిసి తీరిక వేళల్లో ‘కుమ్మర పురుగు’ (బీటిల్) లని సేకరిస్తూ కాలక్షేపం చేసేవారు. ఈ పురుగులేరుకునే పిచ్చి ఎంత వరకు వెళ్లిందంటే ఒక దశలో తను కనుక్కున్న కొన్ని కొత్త పురుగుల చిత్రాలు స్టీవెన్స్ ఇలస్ట్రేషన్స్ ఆఫ్ బ్రిటిష్ ఎంటొమాలజీ (స్టీవెన్స్ వారి బ్రిటిష్ కీటక శాస్త్ర చిత్రాలు) అనే పుస్తకంలో కూడా అచ్చయ్యాయి.
ఒక పక్క ఈ కీటక సేకరణ ప్రహసనం ఇలా ఉండగా తన మత చదువు కూడా అంతో ఇంతో ఉత్సాహంగానే సాగింది. ముఖ్యంగా విలియం పాలే (చిత్రం) రాసిన ‘క్రైస్తవ మతానికి ఆధారాలు (ఎవిడెన్సెస్ ఆఫ్ క్రిస్టియానిటీ) అన్న పుస్తకం డార్విన్ ని బాగా ఆకట్టుకుంది. ‘ప్రతిభతో కూడిన రూపకల్పన’ అనే భావన ముఖ్యంగా పాలే రచనలో కనిపిస్తుంది. గడియారానికి దాని నిర్మాత ఎంత అవసరమో, ప్రపంచానికి దాని సృష్టికర్త అంత అవసరం అంటాడు. అంతవరకు తెలిసిన ప్రతీ వైజ్ఞానిక విభాగాన్ని తీసుకుని, అందులోని విశేషాల బట్టి దేవుడు ఉన్నాడని వాదించేవాడు. ఇంత అందమైన, సంక్లిష్టమైన సృష్టి దేవుడు ఉన్నాడనడానికి మౌన సాక్షం అంటాడు. ఈ వాదనలన్నీ డార్విన్ కి ఇంచుమించు కంఠస్తం వచ్చేవి. ఈ సారి చదువు బాగానే సాగినందున, 178 అభ్యర్థుల్లో పదో స్థానంలో నిలిచి జనవరి 1931 లో బి.ఏ. విజయవంతంగా పూర్తిచేశాడు.
జనవరిలో పరీక్షలు పూర్తయిపోయినా జూన్ నెల దాకా కేంబ్రిడ్జ్ నగరంలోనే ఉండదలచాడు డార్విన్. ఆ సమయంలో మరి కొన్ని ఆసక్తికరమైన పుస్తకాలు డార్విన్ చేతిలో పడ్డాయి. ఆ పుస్తకాలు తన జీవితాన్నే మార్చేశాయి.
(ఇంకా వుంది)
0 comments