ఇలా ఉండగా ఏమీ తోచని పాలోకి తన ఓడ పక్కనుండి ఓ పెద్ద తిమింగిలం పోవడం కనిపించింది. నేలజంతువులు అన్నిట్లోకి సింహం వేటలో ఎంతో ఉత్సాహం, ఉద్వేగం ఉన్నట్టుగానే, సముద్ర చరాలు అన్నిట్లోకి తిమింగలాలని వేటాడే అవకాశం కోసం నావికులు ఉర్రూతలూగేవారు. హార్పూన్ అనబడే బలమైన ఈటె తీసుకుని దాని మీదకి విసిరాడు పాలో. ఈటె గుచ్చుకోగానే తిమింగిలం విలవిలలాడింది. నీట్లో సంక్షోభంగా కొట్టుకోవడం మొదలెట్టింది. ఈటె యొక్క అవతలి కొస ఓడకి ఓ త్రాటితో కట్టబడి వుంది. ఉధృతంగా కదులుతున్న ఆ మహాచరం ఓడని కూడా బలంగా అటుఇటు కుదిపేయసాగింది. సకాలంలో ఎవరో వచ్చి ఆ తాడుని కోసి ఓడని రక్షించారు.
అంతలో అల్లంత దూరంలో బలంగా చేతులు ఊపుతూ, ఓడల కేసి పరుగెత్తుతూ వస్తున్న వెలోసో కనిపించాడు. బోలెడు మంది కోయవాళ్లు బరిశెలు పట్టుకుని తన వెంటపడుతున్నారు. ఈ వెలోసో అక్కడ గ్రామంలో ఏం మాట్లాడో? లేనిపోని శత్రుత్వం కొనితెచ్చుకున్నాడు. విషయం అర్థమైన వాస్కో ద గామా లంగర్లు పైకెత్తి ఓడలని బయల్దేరమన్నాడు. బ్రతుకు జీవుడా అంటూ నౌకాదళం ఆ కోయవారి నుండి తప్పించుని ముందుకి సాగిపోయింది.
నౌకా దళం ఎక్కడి దాకా వచ్చారో ఇంకా తెలీదు. కాని రెండు రోజుల తరువాత మరో తీరం కనిపించింది. బార్తొలోమ్యూ దియాజ్ లోగడ అందించిన సమాచారంతో పోల్చుకుని అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని తెలుసుకున్నారు. వారి ఆనందానికి హద్దుల్లేవు. బయల్దేరిన నాటి నుండి ఐదు నెలలలో, నవంబర్ 22, 1497, లో ఆఫ్రికా దక్షిణ కొమ్ముని చేరుకున్నారు. ఏ ప్రమాదమూ కలగకుండా ఒడుపుగా తమని అంతవరకు తీసుకొచ్చిన కెప్టెన్ నేతృత్వం మీద అందరికీ గురి కుదిరింది.
మరో మూడు రోజుల ప్రయాణం తరువాత మాసెల్ ఖాతం అనే ప్రాతంలో ఓడలు లంగరు దించాయి. చిన్న పడవలో వాస్కో ద గామా కొందరు నావికులతో తీరం మీదకి వెళ్లాడు. అవసరం వస్తాయేమోనని బట్టలలో తుపాకులు దాచుకున్నారు. నేల మీద కొంత ముందుకి వెళ్లగానే కొంత మంది స్థానిక కోయలు కనిపించారు. కెప్టెన్ వారికి తమ నౌకాదళం తరపున రంగురంగుల పూసల దండలు, చిరుగంటలు లాంటి వస్తువులు బహుమతులుగా ఇచ్చాడు. కోయలకి ఇలాంటి వస్తువులు ఇష్టం అని ఆ రోజుల్లో నావికులకి బాగా తెలుసు. అలాంటి చవకబారు వస్తువులు బహుకరించి స్థానిక కోయలని ఆకట్టుకోవడం వారికి పరిపాటి. అక్కడే కొన్ని రోజులు ఉండి మరింత మంది స్థానికులని కలుసుకున్నారు. వారితో కలిసి విందులు చేశారు. నాట్యాలు ఆడారు. స్థానికులతో సత్సంబంధాలు కుదిరాయన్న నమ్మకం కుదిరాక నావికులు ఇక అసలు పన్లోకి దిగారు.
నావికుల యాత్రలకి లక్ష్యాలు రెండు. మొదటిది, కొత్త ప్రాంతాల వారితో వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకుని, బంగారం, సుగంధ ద్రవ్యాలు మొదలైన అరుదైన వస్తువులని చవకగా పోర్చుగల్ కి తరలించడం. రెండవది, కొత్త ప్రాంతాలని ఆక్రమించి పోర్చుగల్ సామ్రాజ్యాన్ని విస్తరించడం. తాము పాదం మోపిన ఈ కొత్త భూమిని ఇప్పుడు పోర్చుగల్ రాజుకి అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించాలి. (మన దేశంలో ప్రాచీనకాలంలో రాజులు చేసిన రాజసూయయాగం లాంటిదే ఇదీను.) ఆ ప్రకటనలో భాగంగా ‘పద్రావ్’ అని పిలువబడే రాతి స్తంభాలని పాతారు. ఇవి గాక కొన్ని చెక్క శిలువలని కూడా పాతారు. గతంలో బార్తొలోమ్యూ దియాజ్ కూడా ఇలా ఎన్నో స్తంభాలు పాతాడు. అది చూసిన కోయలకి ఒళ్ళు మండిపోయింది. ఈ స్తంభాలు పాతే కథ వారికి పాత కథే! ఆ రాతి స్తంభాలని బద్దలు కొట్టారు. శిలువలని పీకేశారు. వాస్కో ద గామా తన సిబ్బంది తో పాటు అక్కణ్ణుంచి పలాయనం చిత్తగించాడు.
0 comments