http://www.andhrabhoomi.net/intelligent/wrere-375
గతంలో ప్రళయం ఒకే సారి వచ్చి ఉంటే శీలాజాలన్నీ ఒకే లోతులో దొరికి ఉండాలి. కాని శీలాజాలు ఎన్నో లోతుల్లో విస్తరించి ఉండడం మతఛాందస వాదులని ఇబ్బంది పెట్టింది. ఆ సమస్య నుండి తప్పించుకోడానికి ప్రళయం ఒకే సారి రాలేదని, గతంలో ఎన్నో సార్లు వచ్చిందని ఓ కొత్త ప్రతిపాదన లేవదీశారు.
కాని శిలాజాలు చెప్పే సాక్షాలని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తూ పోతే మరో ముఖ్యమైన విషయం బయటపడింది. వివిధ లోతుల్లో దొరికిన శిలాజాలన్నీ కేవలం ఒకే జంతు రాశికి చెందినవి కావు. బాగా లోతులో కనిపించిన శీలాజాలు కాస్త సరళమైన జంతువులకి చెందినవై ఉన్నాయి. కాస్త పైపొరలలోని శిలాజాలు మరింత ఉన్నత జాతి జంతువులకి చెందినవి. బాగా లోతుల్లో అకశేరుకాల (invertebrates) శిలాజాలు ఉన్నాయి. కాస్త పైకి వస్తే చేపల శిలాజాలు. ఇంకా పైకి వస్తే సరీసృపాలు, పక్షులు. ఇంకా పైన స్తన్య జీవులకి, మానవులకి చెందిన శీలాజాలు. ఇలా శిలాజాల విస్తరణలో ఓ క్రమ పురోగతి కనిపించింది.
ఈ సమాచారం అంతా చూసి సృష్టి వాదులు తదనుగుణంగా తమ కథని మార్చుకున్నారు. దేవుడు జీవజాతులన్నిటినీ అదే పనిగా ఒక్కసారిగా సృష్టించలేదు. దశలవారీగా, ఒక క్రమపద్ధతిలో ముందు సరళ జతులని, తదనంతరం సంక్లిష్టజాతులని సృష్టిస్తూ వచ్చాడు. ఈ వాదననే ‘పురోగమన వాదం’ అంటారు. దీనికి ఆధునిక పరిణామ సిద్ధాంతానికి సంబంధం లేదు. ఎందుకంటే ఈ పురోగమనంలో సరళ జీవాల నుండి సంక్లిష్ట జీవాలు ఉద్భవించడం లేదు. దేవుడే వరసపెట్టి ఒక క్రమంలో జీవజాతులని సృష్టించాడు. కాని జీవజాతుల ఆవిర్భావంలో ఒక క్రమం ఉందన్న విషయం ఆధునిక పరిణామ సిద్ధాంతానికి స్ఫూర్తి నిచ్చింది.
మరి దేవుడు జీవజాతులని అలా దశల వారీగా ఎందుకు సృష్టించాడు? సర్వశక్తిమంతుడైన దేవుడు అన్నిట్నీ ఒక్కసారే సృష్టించవచ్చును కదా? అందుకు వివరణ ఈ ఫక్కీలో ఉండేది. ఇప్పుడు మీరు టీ చెయ్యదలచుకున్నారు. ముందు నీళ్లు మరగబెడతారు. అందులో టీ పొడి పోస్తారు. కాసేపట్లో డికాషన్ తయారవుతుంది. అందులో పాలు పోస్తారు. పాలు, డికాషన్ కాస్త కలిసి మరిగాక చక్కెర కలుపుతారు. ఆ విధంగా టీ యొక్క తయారీలో ఒక క్రమం కనిపిస్తుంది. అంత మాత్రం చేత నీళ్ల నుంచి పాలు పరిణామం చెందినట్టు కాదు. అలాగే టీ నుండి చక్కెర పరిణామం చెందినట్టూ కాదు. ఆ క్రమం లేకుండా టీ తయారు కాదు. కాని అది బాహ్యంగా కనిపిస్తున్న వ్యవహారం మాత్రమే. టీ తయారుచేస్తున్న వ్యక్తి మనసులో ముందే అన్నీ ఉన్నాయి – టీ కి కావలసిన పదార్థాలు, తయారు చేసే పద్ధతి, దాని చరమ ఫలితం – అన్నీ ముందే ఆ వ్యక్తి ఊహలో ఉన్నాయి. టీ చేసిన వ్యక్తి మనసులో ముందే ఉన్న భావనే బాహ్య ప్రపంచంలో దశల వారీగా వాస్తవీకరించబడుతోంది. అదే విధంగా మనిషిని నిర్మించడానికి పూర్వం ఇన్ని దశల జీవజాతుల నిర్మాణం అవసరం అని తెలిసిన దేవుడు ఇలా దశల వారీగా సృష్టి చేశాడు.
ఈ విధమైన చింతనని బాగా స్పష్టంగా వ్యక్తం చేసిన వాడు పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన శిలాజ శాస్త్రవేత్త లూయీ అగాత్సీ. భవిష్యత్తులో ఒక ఫలితం రావాలంటే, అంతకు పూర్వం కొన్ని ప్రాథమిక ఫలితాలు కలగాలి. అంటే జీవజాతుల వికాసాన్ని ఒక రకమైన ‘విధి’, ఒక ‘ప్రణాళిక’ నడిపిస్తోందన్న భావన. ఈ భావననే ‘ప్రతిభతో కూడిన రూపకల్పన’ (intelligent design) అంటారు. దీన్ని బట్టి జీవజాతుల వికాస క్రమానికి ప్రోద్బలం గతంలో లేదు, భవిష్యత్తులో ఉంది! జీవజాతుల పరిణామ రహస్యం ఈ భూమి మీద లేదు, ఏదో దివిలో, ఆ దేవుడి మనసులో ఉంది!
ఈ ‘ప్రతిభతో కూడిన రూపకల్పన’ అన్న భావన బాగా ఊపందుకుంది. అటు మత ఛాందసులని, ఇటు శాస్త్రవేత్తలని (కొన్ని సందర్భాల్లో ఆ రోజుల్లో ఈ రెండు వర్గాలకి పెద్దగా తేడా ఉండేది కాదు) కూడా ఈ రకమైన వాదన తృప్తిపరిచింది. ఆ ‘రూపకల్పన’ చేసిన వాడు, ‘ప్రతిభ’ గల వాడు దేవుడే కనుక మతఛాందస వాదులు సంతోషించారు. శాస్త్రవేత్తల అవసరాలు మరో విధంగా తీరాయి. ఓ అధునాతన యంత్రాన్నే తీసుకుందాం. ఆ రోజుల్లో అత్యంత అధునాతన యంత్రం చేతి గడియారం. ఇంత సునిశితమైన యంత్రం దానికదే ప్రకృతిలోని సహజ చర్యల వల్ల తీర్చిదిద్దబడడం అనేది ఊహించగలమా? అంత సంక్లిష్టమైన యంత్రాన్ని నిర్మించడానికి ఓ ప్రతిభావంతుడైన సూత్రధారి కావాలి. అలాగే జంతుశరీరంలోని ఓ సంక్లిష్టమైన కన్ను లాంటి అవయవాన్నే తీసుకుందాం. కంట్లో పారదర్శకమైన కార్నియా ఉంటుంది, ఫోకస్ ని మార్చుకోగల లెన్స్ ఉంటుంది, కంటికి పోషక పదార్థాలని సరఫరాచేసే పారదర్శకమైన ద్రవం (విట్రియస్ హ్యూమర్, అక్వియస్ హ్యూమర్) ఉంటుంది. ఇంత సంక్లిష్టమైన యంత్రాన్ని నిర్మించడానికి కూడా ఓ ప్రతిభావంతుడైన సూత్రధారి కావాలి. అతడే దేవుడు.
ఆ విధంగా శిలాజ సాక్షాలన్నిటినీ దేవుడి పరంగా, మతబోధనకి అనుగుణంగా అన్వయించుకునే ప్రయత్నాలు జరిగాయి. అలాంటి అన్వయం చేసినవారిలో ఉద్దండుడు ‘పాలే’ అనే బిషప్. ఈ పాలే రచనలు తదనంతరం డార్విన్ ని కూడా ప్రభావితం చేశాయి. ప్రతిభతో కూడిన రూపకల్పన అనే భావన ఎంతో మంది జీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసింది. ఈ రకమైన భావనకి మద్దతు ఒక విధంగా గ్రీకు తాత్వికుడు ప్లేటో చింతన నుండి కూడా కొంచెం వచ్చింది.
ప్లేటో చింతన ప్రకారం భౌతిక ప్రపంచంలోని వస్తువులు శాశ్వతాలు కావు. శాశ్వతమైనవి భావనలు, లేదా భావనా ప్రపంచానికి చెందిన ఆకృతులు. ఆ భావరూపాలే, భౌతిక ప్రపంచంలో వాస్తవీకరించబడి వస్తువులు అవుతాయి. నీటి లోంచి పొడుచుకొచ్చిన కలువ చెలువ ఏ దివిలోనో ప్రకాశించే అమరమైన అరవిందానికి పార్థివ ప్రతిరూపం. కూర్చోవడానికి ఉపయోగపడే వస్తువుని కుర్చీ అంటాం. ఇదొక భావన. ఇది ఏకైక, శాశ్వత భావన. భౌతిక ప్రపంచంలో దీనికి ఎన్నో వాస్తవ రూపాలు (నానా రకాల కుర్చీలు) ఉంటాయి. ఇవి ఎంతో మార్పుకి, వికాసానికి లోనవుతూ ఉంటాయి. కాని వాటి వెనుక ఉన్న మూల భావన – ‘మూల’ కుర్చీ - మాత్రం శాశ్వతంగా రాజిల్లుతూ ఉంటుంది!
ఆ విధంగా భౌతిక ఆధారాలు కొరవడిన దశలో మత ఛాందసవాదులు, తాత్వికులు జీవపరిమాణ రంగంలో చెలరేగుతూ వచ్చారు.
(ఇంకా వుంది)
0 comments