మక్కా నుండి వచ్చిన ఓడని దగ్ధం చేశాక పోర్చుగీస్ నౌకాదళం కాననూర్ దిశగా పయనమయ్యింది. ఇండియాకి మొదటి యాత్రలో వాస్కో ఇక్కడి రాజుతో స్నేహం చేసుకున్నాడు. ఈ రాజుకి కాలికట్ ని ఏలే జామొరికి మధ్య చిరకాల శత్రుత్వం ఉంది. కాననూర్ రాజు వాస్కోదగామాని తన మందిరంలోకి ఆహ్వానించి సాదరంగా ఆతిథ్యం ఇచ్చాడు. ఇద్దరూ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. రాజు వద్ద నానా రకాల సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని వాస్కో దా గామా కాలికట్ కి బయల్దేరాడు.
ఉదయభాను కిరణాలకి అడ్డుపడుతూ అల్లంత దూరంలో సముద్రం అంచులో బారులు తీరిన పోర్చుగీస్ నౌకాశ్రేణిని చూసిన జామొరిన్ కి వెన్నులో వణుకు పట్టుకుంది. అనవసరంగా ఈ తెల్లనావికుడితో కయ్యం పెట్టుకున్నందుకు పశ్చాత్తాపపడ్డాడు. గతాన్ని మరచి సత్సంబంధాలు పెంచుకుందాం అంటూ దూతలతో సందేశం పంపాడు. ఆ సందేశం వాస్కో ద గామాకి హాస్యాస్పదంగా అనిపించింది. ఉత్తిత్తి మాటలతో కరిగే మనసు కాదు వాస్కోదగామా ది. జామొరిన్ తో జట్టు కలపడానికి వాస్కో ఓ షరతు పెట్టాడు. కాలికట్ లో ఉన్న ముస్లిమ్లు అందరినీ వెళ్ళగొడితే గాని తనతో స్నేహం కుదరదని ఖండితంగా చెప్పాడు.
షరతుకి ఒప్పుకోకపోతే అందుకు పర్యవసానం కటువుగా ఉంటుందని నిరూపించదలచాడు ద గామా. తనలోని కసాయి స్వభావాన్ని మరొక్కసారి బయటపెట్టాడు. తమ ఓడలవద్ద చేపలు అమ్ముకోడానికి వచ్చిన కొందరు అరబ్బు జాలర్లని పట్టి బంధించమని తన నావికులని ఆదేశించాడు. అలా పట్టుబడ్డ అరబ్బులందరినీ ఓడలోనే ఉరి తీయించాడు. వాస్కో ద గామా లోని ప్రతీకార జ్వాల అక్కడితో ఆరలేదు. ఉరితీయబడ్డ జాలర్ల శవాలని కిందికి దింపించి, వాటిని ముక్కలుముక్కలుగా కోయించి తీరం మీద పడేయించాడు. అలా ప్రాణాలు పోగొట్టుకున్న జాలర్లకి అయినవారంతా ఆ రాత్రి తీరం వద్ద కాపుకాసి ఎదురుచూడసాగారు. నీట్లో కొట్టుకొచ్చిన దేహాంగాలని చూసి వారంతా భయంతో వొణికిపోయారు.
ఆ మారణకాండ పూర్తయ్యాక వాస్కో కొన్ని నౌకలతో కొచ్చిన్ కి పయనమయ్యాడు. ఆరు నౌకలని కాలికట్ వద్దనే ఉంచి ఆ దారిన ఏవైనా వాణిజ్య నౌకలు వస్తే అటకాయించమని ఆదేశించాడు. కొచ్చిన్ కి వెళ్ళిన వాస్కో ద గామా అక్కడి రాజుతో కూడా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు.
ఇలా ఉండగా జనవరి 3, 1503, నాడు కాలికట్ నుండి వాస్కో ద గామాని కలవడానికి ఒక ప్రభుత్వ అధికారి, అతడు కొడుకు కొచ్చిన్ కి వచ్చారు. వారి ద్వారా జామొరిన్ వాస్కో కి శాంతి సందేశం పంపాడు. వాస్కో చేసిన కట్టడి వల్ల కాలికట్ కి వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. జామొరిన్ ఆ కట్టడిని భేదించడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఇక కాళ్ల బేరానికి రాక తప్పలేదు.
ఈ శాంతి ప్రయత్నానికి ద గామా ఒప్పుకున్నాడు. వెంటనే కాలికట్ కి బయల్దేరాడు. కాని నిజానికి ఈ శాంతి సందేశం, అందుకు ఆహ్వానం అంతా ఓ కుట్ర. కాలికట్ లో రాజమందిరంలో వాస్కో ద గామాని హత్య చెయ్యడానికి జామొరిన్ పథకం వేశాడు. కాని ఆ పథకం పారలేదు. అక్కణ్ణుంచి తప్పించుకుని వాస్కో ద గామా తిరిగి కొచ్చిన్ చేరాడు. ద్రోహం చేసినందుకు తన వద్దకి దూతగా వచ్చిన అధికారిని శిక్షించాలనుకున్నాడు. అధికారిని విడిచిపెట్టాడు గాని తన కొడుకుని మాత్రం ఉరితీయించాడు.
“శాంతి ప్రయత్నం” విఫలమయినందుకు ఇక జామొరిన్ కి యుద్ధం తప్ప వేరే మార్గాంతరం కనిపించలేదు. పోర్చుగీస్ వారితో పోరుకి సిద్ధ పడ్డాడు. జామొరిన్ చేసుకుంటున్న యుద్ధ ప్రయత్నాల గురించి విన్న వాస్కో వెంటన తన నౌకాదళాన్ని కాలికట్ కి పోనిచ్చాడు. అతి తక్కువ కాలంలో అరబ్బు నౌకాసేనలని చిత్తుగా ఓడించాడు.
ఆ విధంగా తన రెండవ ఇండియా యాత్రలో వాస్కో ద గామా జామొరిన్ మీద అతి క్రూరంగా తన ప్రతీకారం తీర్చుకుని తన నౌకాదళంతో పోర్చుగీస్ కి తిరిగి పయనమయ్యాడు.
(ఇంకా వుంది)
ఆ విధంగా తన రెండవ ఇండియా యాత్రలో వాస్కో ద గామా జామొరిన్ మీద అతి క్రూరంగా తన ప్రతీకారం తీర్చుకుని తన నౌకాదళంతో పోర్చుగీస్ కి తిరిగి పయనమయ్యాడు.
(ఇంకా వుంది)
0 comments