శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

అగ్నిపర్వతం పేలితే? (పాతాళానికి ప్రయాణం - 39)

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, December 27, 2011అగ్నిపర్వతం యొక్క అడుగుభాగాన్ని తడిమి చూస్తాం అన్న ప్రకటనకి హన్స్ అదురుకుంటాడని ఊహించాడు మామయ్య. కాని హన్స్ నిర్లిప్తంగా తలూపాడు. పాతాళంలో పూడుకుపోయినా, పర్వత శిఖరాలని కావలించుకున్నా – తనకి రెండూ ఒక్కటే. నేను కూడా అంతవరకు జరిగిన సంఘటనల గురించే ఆలోచించాను గాని ఇక ముందు పొంచివున్న ప్రమాదాల గురించి ఆలోచించలేదు. కాని భవిష్యత్తు తలచుకుంటే వెన్నులో చలి పుడుతోంది. అయినా ఇప్పుడు తలచుకుని ఏం లాభం. మా మామయ్య దూకుడుకి అడ్డుపడే ఉద్దేశమే ఉంటే ఆ పనేదో హామ్బర్గ్ లోనే చెయ్యాల్సింది.

ఒక్క ఆలోచన మాత్రం పదే పడే మనసులో మెదులుతూ కలవరపెడుతోంది. నేనంటే అర్భకుణ్ణి వొలేయండి. మహామహా వాళ్ళలోనే వెన్నుల్లో చలిపుట్టించిన ఆలోచన అది.

సరే ఎలాగోలా ఇక్కడిదాకా వచ్చాం. ఇక ఇహనోరేపో ఈ స్నెఫల్ పర్వతాన్ని ఎక్కుతాం. బానేవుంది. అగ్నిబిలంలోకి దిగి అక్కడ దేవుళ్ళాడతాం. అదీ బానేవుంది. కాని ప్రాణాలు పణం పెట్టకుండా ఇంతవరకు వచ్చి, ఇన్ని చేసిన వాళ్ళు ఎంతో మంది ఉండి ఉంటారు. ఆ సాక్నుస్సెమ్ చెప్పిన పిట్టకథ నిజమేననుకుంటే, నిజంగానే ఆ అగ్నిబిలం లోంచి పోతే ఈ ద్వీపం యొక్క అట్టడుగుభాగాలని చేరుకోగలిగామే అనుకోండి. అక్కడ మేం దారి తప్పిపోతే? ఈ అగ్నిపర్వతం చచ్చిపోయిందని, నిష్క్రియంగా ఉందనీ ఎవడన్నాడు? ఈ క్షణం దాని లోతుల్లో నిప్పు రాజేసుకోవడం లేదని ఏంటి భరోసా? 1229 తరువాత ఈ రాక్షసుడు ఎప్పుడూ మేలుకోలేదు అంటారు గాని, అసలు మేలుకోడని ఏంటి నమ్మకం? తీరా మేలుకుంటే మా గతేంటి?

లాభం లేదు. ఈ విషయం గురించి లోతుగా చర్చించాలి. దాని గురించి ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతోంది. నిద్రపోదామంటే భయం వేస్తోంది. అగ్నిపర్వత విస్ఫోటాలతో కలలన్నీ కిక్కిరిసిపోతాయేమో!

ఇక లాభం లేదు. మామయ్యతో విషయం విప్పి చెప్పి సందేహ నివృత్తి చేసుకోవాలి. వెళ్ళి అలాగే చెప్పాను. చెప్పి ఒక్క అడుగు వెనక్కి జరిగాను. ఇప్పుడు ఈయన విస్ఫోటం చెందితే నా గతేం గాను? కాని నేను భయపడినట్టు జరగలేదు.

“నేనూ అదే ఆలోచిస్తున్నాను సుమా,” అన్నాడు నెమ్మదిగా.


అంటే ఏంటి దీని తాత్పర్యం? తను చెప్పిన మాట వింటాడనా? దూకుడు తగ్గించుకుని హేతువు మాట వింటాడనా? నిజంగా అంత గొప్ప మార్పు తనలో కలుగుతుందా? ఏమో సందేహమే.

కాసేపు ఇద్దరం ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఆయనే అన్నాడు –

“స్టాపీ లో అడుగుపెట్టిన క్షణం నుండి నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. నువ్వు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. ముందువెనకలు చూసుకోకుండా ఇలాంటి ప్రయత్నంలోకి దూసుకుపోకూడదు.”

“మరే?” అన్నాను వత్తాసు పలుకుతూ.

“ఆరు వందల ఏళ్లుగా ఈ పర్వతంలో ఏ చలనమూ లేదు. అయినా ఇప్పుడు మళ్లీ చలనం రాదనేమీ లేదు. అయితే అగ్నిపర్వత విస్ఫోటాలు జరిగే ముందు కొన్ని చిహ్నాలు కనిపిస్తాయి. ఈ విషయం గురించి స్థానికుల వద్ద వాకబు చేశాను. పర్వతం యొక్క బాహ్య లక్షణాలని పరిశీలించాను. అందుచేత, నా బంగారు ఏక్సెల్! పర్వతం విస్ఫోటం చెందే భయం ససేమిరా లేదు!”

అలా ధీమాగా ఆయన చేసిన ప్రకటనకి నోరెళ్లబెట్టాను.

“ఏం నా మాటలు నమ్మశక్యంగా లేవా?” అడిగాడు మామయ్య. “నా వెనకే రా చెప్తాను.”

బుద్ధిగా ఆయన వెనకే నడిచాను. ప్రవచకుడి ఇంటి నుండి బయటపడగానే నేరుగా పోయే ఓ దారి తీసుకున్నాం. బేసల్ట్ రాతి ప్రాకారంలో ఏర్పడ్డ ఓ సందు లోంచి, సముద్రానికి దూరంగా తీసుకుపోతుంది ఈ దారి. అలా కొంత దూరం పోగానే ఓ విశాలమైన ప్రాంతాన్ని చేరుకున్నాం. దాన్ని ‘ప్రాంతం’ అనడం కన్నా మరేమనాలో అర్థం కాలేదు. అగ్నిపర్వతాల నుండి తన్నుకొచ్చిన నానా రకాల పదార్థమూ అక్కడ రాశిపోసి వుంది. బేసల్ట్, గ్రానైట్ మొదలుకొన్ని ఎన్నో రకాల అగ్నిశిలలు అక్కడ పెద్ద పెద్ద గుట్టలుగా పడి వున్నాయి.

అక్కడక్కడ నేల లోంచి గుప్పు గుప్పని ఆవిర్లు తన్నుకొస్తున్నాయి. వేణ్ణీటి బుగ్గలలోంచి తన్నుకొచ్చే ఈ ఆవిరిధారలని ఐస్లాండ్ లో ‘రేకిర్’ లంటారు. వాటి ధాటిని బట్టి అడుగున అగ్నిపర్వతంలో దాగి వున్న శక్తి ఏపాటిదో తెలుస్తుంది. వాటిని చూస్తుంటే నా భయాలు రెండింతలు అవుతున్నాయి. ఎలాగైనా మామయ్య మనసు మార్చాలి. కాని అంతలో మామయ్య అన్న మాటకి అప్పుడే చిగురిస్తున్న ఆశని చప్పున చిదిమినట్టయ్యింది.

“అదుగో ఆ పైకి తన్నుకొస్తున్న ఆవిర్లని చూస్తున్నావుగా ఏక్సెల్! వాటిని బట్టి అగ్నిపర్వత విస్ఫోటం తప్పక జరగదని నిశ్చయంగా చెప్పొచ్చు.”

“అలా ఎలా చెప్పగలవు మామయ్యా?” ఆందోళనగా అడిగాను.
“ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో.” మామయ్య వివరించాడు. “విస్ఫోట సమయం దగ్గర పడుతుంటే ఈ ధారల ధాటి రెండింతలు అవుతుంది. కాని విస్ఫోటం జరిగే సమయంలో మాత్రం అవి పూర్తిగా నిలిచిపోతాయి. విస్ఫోటం జరుగుతున్నప్పుడు మరుగుతున్న శిలాద్రవాలు సూటీగా పైన ఉన్న అగ్నిబిలం లోంచి బయటికి స్రవించడం వల్ల ఒత్తిడి తగ్గి, పక్కలలో రాతి చీలికల లోంచి బయటపడే ఆవిరి ధారలు ఆగిపోతాయి. కనుక ఈ ఆవిరి ధారలు ఎప్పట్లాగే ఉంటే, వాటి శక్తి ద్విగుణీకృతం కాకుంటే, వాటికి తోడు గాలి బలంగా వీస్తుంటే, వర్షం ఆగక కురుస్తుంటే, అగ్నిపర్వత విస్ఫోటం దగ్గర్లో సంభవించే అవకాశం లేదని గ్రహించాలి.”

“కాని మామయ్యా…” అని ఏదో అనేంతలో ఆయనే,

“మరింకేం మాట్లాడకు,” అన్నాడు చెయ్యెత్తి వారిస్తూ. “విజ్ఞానం పలికినప్పుడు అజ్ఞానం అలికిడి వినిపించకూడదు.”
అలా సైన్సు పేరు చెప్పి మామయ్య నోరు మూయించాడు. ఇక నా ఆశలన్నీ ఒక్క విషయం మీదే నిలుపుకున్నాను. ఆ సాక్నుస్సెమ్ ఎంత అరిచి గొంతు చించుకున్నా, ఆ దిక్కుమాలిన అగ్నిబిలం లోంచి కిందికి దిగినప్పుడు ఆ సొరంగం కాస్త దూరంలో అంతమైపోతే బావుణ్ణు.

ఆ రాత్రంతా పీడకలల దాడిలో గడిపాను. అగ్నిపర్వతపు లోతుల నుండి ఎగజిమ్మబడుతున్న నిప్పుబండలలో నేనూ ఓ బండనై దూరాన వున్న నిశీధిలోకి విసిరేయబడుతున్నాను.

మర్నాడు జూన్ 23. హన్స్ తన సహచరులతో పాటు మా కోసం ఎదురుచూస్తున్నాడు. మా పనిముట్లు, సంభారాలు అన్నీ మోస్తూ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మామయ్యకి, నాకు రెండు ఈటెలు, రెండు రైఫిళ్ళు, బుల్లెట్లు ఉన్న బెల్టులు ఉన్నాయి. హన్స్ ముందుజాగ్రత్తగా మంచినీళ్లు ఉన్న ఓ పెద్ద తోలుతిత్తి కూడా ఏర్పాటు చేశాడు. మా వద్ద ముందే ఉన్న ఫ్లాస్క్ లకి దీన్ని కలుపుకుంటే ఆ మొత్తం నీరు ఎనిమిది రోజులకి సరిపోతుంది.

ఉదయం తొమ్మిది అయ్యింది. ప్రవచకుడు, అతడి భార్య మా కోసం ద్వారం వద్ద ఎదురుచూస్తున్నారు. మాకు వీడ్కోలు చెప్పడం కోసమే ఆ ఎదురుకోలు అనుకున్నాం. కాని పొరబడ్డాం. మేం అక్కడ చేసిన బసకి, పీల్చిన (ఆ కంపు) గాలికి కూడా లెక్క కట్టి, బిల్లు చూపించాడు. స్విట్జర్లండ్ లో పూటకూళ్లవాళ్ళలా నిలువుదోపిడి చేసేశారు భార్యభర్తలు ఇద్దరూ కలిసి.

మామయ్య మరు మాట్లాడకుండా డబ్బు చెల్లించి బయటకి నడిచాడు.
అయినా భూమి కేంద్రానికి ప్రయాణించేవాడు అణాబేడాల కోసం ఎందుకు చూసుకుంటాడు చెప్పండి?
లెక్కలన్నీ తేలాక హన్స్ సంజ్ఞ చేశాడు. స్టాపీని వదిలిపెట్టి మా విచిత్ర భవితవ్యం దిశగా పయనమయ్యాము.

(పద్నాల్గవ అధ్యాయం సమాప్తం)


(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email