బంగాళ దుంపల నుండి కరెంటు తీయొచ్చు తెలుసా? ఈ తమాషా ప్రయోగానికి కావలసిన సరంజామా –
• ఒక బంగాళదుంప
• ఒక రాగి బద్ద
• ఒక జింకు బద్ద
• ఒక ఎల్.ఇ.డి. లేదా పెన్ టార్చిలో వాడేటటువంటి చిన్న బల్బు
• రెండు చిన్న కరెంటు వైర్లు (ఇన్సులేషన్ ఉన్నవి)
రాగి, జింకు బద్దల్లో ఒక కొస వద్ద వైర్లు పోవడానికి చిన్న రంధ్రాలు చెయ్యోలి. ఆ బద్దలని బంగాళదుంపలో గుచ్చాలి. గుచ్చిన బద్దలు దగ్గర దగ్గరగా ఉండాలి కాని, ఒకదాన్నొకటి తాకకూడదు. ఇప్పుడు రాగి, జింకు బద్దలని వైర్లతో ఎల్.ఇ.డి. కి కలపాలి. (ఎల్. ఇ.డి.కి బదులు చిన్న బల్బు ఉంటే దానికి చిన్న సాకెట్ తెచ్చుకోవాలి. అప్పుడు వైర్లని తగిలించడానికి వీలవుతుంది.) రాగి బద్దని ఎల్. ఇ.డి. లో పాజిటివ్ టర్మినల్ కి, జింకు బద్దని ఎల్. ఇ.డి. లో నెగెటివ్ టర్మినల్ కి కలపాలి. ఇప్పుడు ఎల్. ఇ.డి. వెలుగుతుంది.
మీ ఇంట్లో పెద్ద వాళ్ల సహకారం ఉంటే ఓ మల్టీమీటర్ తో రాగి, జింకు బద్దల మధ్య వోల్టేజి కొలవచ్చు. సుమారు 1.2 Volts రావాలి.
మరింత ఎక్కువ వోల్టేజి కావాలంటే అనేక బంగాళ దుంపలని వాడాలి. వాటిని పై చిత్రంలో సూచించినట్టు వరుసగా గొలుసుకట్టుగా కలపాలి. ఒక దుంపలోని జింకు బద్దని, అవతలి దుంపలోని రాగి బద్దతో కలపాలి. ఈ సారి ఎంత వోల్టేజి పుడుతుందో నమోదు చేసుకోండి.
అలాగే మరిన్ని ఇతర కాయగూరలతో ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. మీ ప్రయోగాల ఆధారంగా ఈ కింద ప్రశ్నలకి సమాధానాలు వెతకండి –
- ఏ కాయగూరలో అత్యధిక వోల్టేజి పుడుతుంది?
- అలా పుట్టిన విద్యుత్తు ఎంత సేపు ఉంటుంది?
Reference:
http://www.miniscience.com/projects/PotatoElectricity/
nice idea