కేవలం బహుమతులు నచ్చని దానికే రాజుకి తనపై అంత కోపం రావడం వాస్కో ద గామాకి ఆశ్చర్యం కలిగించింది. తరువాత వాకబు చెయ్యగా తన గురించి, పోర్చుగీస్ గురించి రాజుకి ఎవరో బోలెడు చాడీలు చెప్పినట్టు తెలిసింది. పోర్చుగీస్ వారు కాలికట్ కి రావడం మొదట్నుంచీ కూడా స్థానికులైన అరబ్ వర్తకులకి ఇష్టం లేదు. వాళ్లకి చెందవలసిన వాణిజ్య లాభాలు పోర్చుగీస్ వారు తన్నుకు పోతారని వారి భయం. అందుకే వాస్కో ద గామా గురించి లేని పోని కథలల్లి రాజుకి చెప్పారు. వాస్కో పరమ కిరాతకుడని, ఆఫ్రికా తీరం మీద ఎదురైన ఎంతో మందిని నానారీతుల్లో చిత్రహింస పెట్టాడని చెప్పి రాజుగారి మనసు మార్చేశారు.
మర్నాడు వాస్కో, తన బృందంతో కలిసి రాజమందిరాన్ని విడిచి తన ఓడలని చేరుకోవాలని బయల్దేరాడు. కాని ఆ ప్రయత్నంలో బృందం దారి తప్పి వేరు పడిపోయారు. దారి చూపించడానికి రాజు గారి అధికారుల్లో ఒకడి సహాయం కోరాడు వాస్కో. కాని ఆ అధికారి సహాయం చెయ్యడానికి నిరాకరించాడు. వీళ్లేదో కుట్ర పన్నుతున్నారని వాస్కోకి సందేహం కలిగింది. ఒక వార్తాహరుణ్ణి పంపించి తన సోదరుడైన పాలో ని జాగ్రత్తపడమని హెచ్చరించాడు.
మరో రోజు వాస్కో బృందానికి రాజ మందిరంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మర్నాడు ఉదయం మళ్లీ వాస్కో తమ ఓడలని చేరుకోడానికి కొన్ని పడవలు కావాలని అడిగాడు. ఈ సారి నిరాకరించడమే కాకుండా వాస్కోని, తన బృందాన్ని రాజభటులు నిర్బంచించారు. దాంతో కాలికట్ రాజు అసలు రంగు బయట పడింది. వాస్కో బృందాన్ని విడుదల చెయ్యడానికి రాజుగారి అధికారులు కొత్త షరతు పెట్టారు. తమ ఓడలలో ఉన్న సరుకులన్నీ అప్పజెప్పితే విడుదల చేస్తాం అన్నారు. కొన్ని సరుకులని ఓడల నుండి దింపించి అప్పజెప్పమని వాస్కో తన తమ్ముడు పాలోకి సందేశం పంపాడు. సరుకులు అందగానే వాస్కో బృందాన్ని విడిచిపెట్టారు రాజభటులు.
వాస్కో బృందం వేగంగా తమ ఓడలు చేరుకున్నారు. వెంటనే పోర్చుగల్ కి బయల్దేరమని మూడు ఓడల కెప్టెన్లకి ఆదేశాలు ఇచ్చాడు. కాలికట్ మళ్లీ వస్తానని, పెద్ద మంది మార్బలంతో తిరిగి వచ్చి, రాజుకి బుధ్ధి చెప్తానని బెదిరిస్తూ లేఖ రాసి రాజు కి పంపాడు. పోర్చుగీస్ తో తగవు తమకి తగదని తెలుసుకున్న రాజు శాంతి సందేశం పంపాడు. కాని వాస్కో దానికి సుముఖంగా స్పందించలేదు. ఆగస్టు 29, 1498 వాస్కో బృందం పోర్చుగల్ కి పయనమయ్యారు.
ఓడలు ఆఫ్రికా తీరం దిశగా పయనం అయ్యాయి. కాని బయల్దేరిన నాటి మధ్యాహ్నమే ఓ చిన్న దుర్ఘటన ఎదురయ్యింది. కాలికట్ నుండి అప్పటికి ఓడలు ఎంతో దూరం రాలేదు. ఓ డెబ్బై స్థానిక ఓడలు వాస్కో ఓడలని సమీపించసాగాయి. అవి వస్తున్నది యుద్ధం చెయ్యడానికేనని వాస్కోకి అర్థమయ్యింది. ఫిరంగులని పేల్చమని ఓడలకి ఆదేశించాడు. ఫిరంగులని పేల్చినా కూడా శత్రు నౌకలు తమని సమీపిస్తూనే ఉన్నాయి. కాని ఇంతలో ఉన్నట్లుండి ఆకాశంలో మేఘాలు క్రమ్మాయి. అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా ముసురు క్రమ్మింది. ఉరుములు, మెరుపులతో తుఫాను విరుచుకుపడింది. ఆ ధాటికి శత్రునౌకలు చెల్లాచెదురు అయ్యాయి. పోరుకి ఇది అనువైన సమయం కాదని శత్రు నౌకలు వెనక్కి మళ్లాయి. ఈ దెబ్బతో వాస్కో ద గామాకి కూడా కాస్త వేడి చల్లారింది. అనవసరంగా కాలికట్ రాజుతో తగవు తెచ్చుకున్నానని తెలుసుకుని పశ్చాత్తాప పడ్డాడు. కాని ఇప్పుడు చేసేదేమీ లేదు.
సెప్టెంబర్ చివర్లో అంగదివా అనే దీవులని చేరుకున్నారు. ఆహారం, నీరు మొదలైన సరంజామా ఓడలకి ఎత్తించుకోవడానికి బృందం అక్కడ ఆగింది. ఆ వ్యవహారం సాగుతుంటే కాస్త దూరంలో రెండు పెద్ద ఓడలు తమని సమీపించడం కనిపించింది. అవి కూడా తమని నాశనం చెయ్యడానికి వస్తున్న శత్రు నౌకలే అనుకున్నాడు వాస్కో ద గామా. వాటి మీద ఫిరంగులని ప్రయోగించమని నావికులని ఆదేశించాడు. వచ్చిన నౌకలలో ఒకటి తప్పించుకుంది. రెండో నౌకకి చుక్కాని విరిగిపోవడం వల్ల తప్పించుకోలేక పోయింది. వాస్కో మనుషులు ఆ ఓడని ఆక్రమించుకోబోయే సరికి ఆ నౌకలోని సిబ్బంది నౌకని విడిచిపెట్టి పారిపోయారు.
ఆఫ్రికా తూర్పు తీరం దిశగా ప్రయాణం కొనసాగింది. కాలికట్ కి ఆఫ్రికా తీరానికి మధ్య దూరం మరీ ఎక్కువ కాకపోయినా వాతావరణ పరిస్థితుల వల్ల, సముద్ర పరిస్థితుల వల్ల ప్రయాణం కఠినమయ్యింది. సముద్ర పవనాలు అనుకూలించలేదు. గమనం బాగా మందగించింది. ఆహారం నిలువలు వేగంగా తరిగిపోతున్నాయి. గతంలో జరినట్టే మళ్లీ నావికులు స్కర్వీ వ్యాధి వాతన పడ్డారు. ఆ దెబ్బకి ముప్పై మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఒక దశలో ఇండియాకి వెనక్కి తిరిగి వెళ్ళక తప్పదని అనిపించింది. కాని అదృష్టవశాత్తు ఒక దశలో సానుకూల పవనాలు వీచాయి. ప్రయాణం మళ్ళీ ఊపు అందుకుంది. 1499 జనవరి ఏడో తారీఖున వాస్కో బృందం ఆఫ్రికా తూర్పు తీరం మీద ఉన్న మాలింది నగరాన్ని చేరుకున్నారు.
(ఇంకా వుంది)
ఆఫ్రికా తూర్పు తీరం దిశగా ప్రయాణం కొనసాగింది. కాలికట్ కి ఆఫ్రికా తీరానికి మధ్య దూరం మరీ ఎక్కువ కాకపోయినా వాతావరణ పరిస్థితుల వల్ల, సముద్ర పరిస్థితుల వల్ల ప్రయాణం కఠినమయ్యింది. సముద్ర పవనాలు అనుకూలించలేదు. గమనం బాగా మందగించింది. ఆహారం నిలువలు వేగంగా తరిగిపోతున్నాయి. గతంలో జరినట్టే మళ్లీ నావికులు స్కర్వీ వ్యాధి వాతన పడ్డారు. ఆ దెబ్బకి ముప్పై మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఒక దశలో ఇండియాకి వెనక్కి తిరిగి వెళ్ళక తప్పదని అనిపించింది. కాని అదృష్టవశాత్తు ఒక దశలో సానుకూల పవనాలు వీచాయి. ప్రయాణం మళ్ళీ ఊపు అందుకుంది. 1499 జనవరి ఏడో తారీఖున వాస్కో బృందం ఆఫ్రికా తూర్పు తీరం మీద ఉన్న మాలింది నగరాన్ని చేరుకున్నారు.
(ఇంకా వుంది)
0 comments