శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.
అధ్యాయం 14

ఆర్కిటిక్ ప్రాంతంలో చివరి మజిలీ (పాతాళానికి ప్రయాణం - 38)

స్టాపీ గ్రామంలో పట్టుమని ముప్పై గడపలు కూడా లేవు. తడకలతోనో, ఇటుకలతోనో చేసిన ఇళ్లు కావవి. లావారాతి ఇళ్లు. ఓ అగ్నిపర్వతానికి దక్షిణాన ఉందీ గ్రామం. ఉవ్వెత్తున లేచిన బేసల్ట్ శిలా ప్రాకారాల మధ్య నెమ్మదిగా ప్రవహించే ఓ లోతైన కాలువ గట్టు వెంట విస్తరించింది ఈ గ్రామం.

బేసల్ట్ చాలా చిత్రమైన రాయి. అగ్నిశిలా జాతికి చెందిన ఈ రాయి గోధుమ రంగులో ఉంటుంది. కచ్చితమైన, క్రమబద్ధమైన ఆకృతులు దాల్చుతుంది. రూళ్లకర్రతో, వృత్తలేఖినితో, ఉలితో, సమ్మెటతో ప్రకృతి ఎంతో జ్యామితిబద్ధంగా ఈ రాతిని మలిచినట్టు ఉంటుంది. మిగతా రకాల శిలల విషయంలో అయితే ఆ పదార్థాన్ని పెద్ద ఎత్తున నిర్లక్ష్యంగా గుమ్మరించడంతో ఆమె బాధ్యత తీరిపోతుంది. సౌష్ఠవం లేని శంకువులు, పరిపూర్ణం కాని పిరమిడ్లు, అస్తవ్యస్తమైన రేఖాకృతులు ఈ పదార్థాల రాశులలో కనిపిస్తాయి. కాని బేసల్ట్ రాయిని మాత్రం క్రమబద్ధతకి గీటురాయిగా మలచింది ఆమె. ఆ రాతి ఆకృతిలో ఆమె ప్రదర్శించిన స్థాపత్య కళాకౌశలం ముందు ప్రాచీన బాబిలోన్ లోని వైభవాలు గాని, పురాతన గ్రీకు శీల్పకళా సోయగం గాని దిగదుడుపే.ఐర్లాండ్ లో రాకాసి రాదారి (Giant’s causeway - image above) గురించి విన్నాను, స్కాట్లాండ్ లో ఫింగాల్ గుహ (Fingal’s cave - image below) గురించి విన్నాను. కాని ఈ బేసల్ట్ శిలానిర్మాణాల గురించి వినడమే కాని కళ్లార చూసింది లేదు.


స్టాపీలో ఆ శిలాసోయగాన్ని కళ్ళార చూసి నోరెళ్లబెట్టాను.

కాలువకి ఇరుపక్కలా ఓ సజహ చెలియలికట్టలా ఏర్పడ్డ ఈ రాతి ప్రాకారంలో ముప్పై అడుగుల ఎత్తున్న నిటారైన రాతి స్తంభాలు ఉన్నాయి. ఈ నిలువు స్తంభాలు అడ్డుగా గుమ్మంలా ఏర్పడ్డ రాతి దిమ్మలని మోస్తున్నాయి. ఆ బేసల్ట్ స్తంభాలలో కొన్ని గోడల నుండి వేరుపడి కింద మట్టిలో పడివున్నాయి. అలా మట్టిలోపడ్డ స్తంభాలన్నీ ఏదో ప్రాచీన ఆలయ శిధిలాలలా శోభాయమానంగా ఉన్నాయి.ఇక మా చివరి మజిలీ దగ్గరపడింది. మేం బస చెయ్యాల్సిన ఇంటి యజమాని ఓ రెక్టర్ (మత ప్రవచకుడు). మేం వాళ్ళ ఇంటి ప్రాంగణంలో కి ప్రవేశిస్తున్న సమయంలో ఆ పెద్దమనిషి ఓ గుర్రానికి నాడా కొడుతున్నాడు.

“సెల్వెర్టూ” అని సంబోధించాడు హన్స్.
“గాడ్ డాగ్,” అన్నాడు ఆ ‘కంసాలి’ రెక్టర్ శుద్ధమైన డేనిష్ భాషలో స్పందిస్తూ.
“కిర్కోహెర్డే” అన్నాడు హన్స్ వెనక్కు తిరిగి మామయ్య కేసి చూస్తూ.
“ఇతడే రెక్టర్ అంటున్నాడు,” మామయ్య నా కేసి తిరిగి అన్నాడు.


ఇంతలో మా గైడు ఆ రెక్టర్ కి మా వ్యవహారం అంతా చెప్పుకొస్తున్నాడు. అంతలో రెక్టర్ ఉన్నట్లుండి ఓ విచిత్రమైన అరుపు అరిచాడు. కూత కూశాడు అంటే ఇంకా సబబుగా ఉంటుందేమో. గుర్రాలని, గొర్రెలని కేకేసి పిలవడానికి వాడే కూత లాంటిది అది. అది విని లోపలి నుండి ఓ పొడవాటి స్త్రీ బయటికి వచ్చింది. ఆమె పొడవు సులభంగా ఆరడుగులు దాటుతుంది. మాసినబట్టలతో వికృతంగా ఉందా వనిత. ఐస్లాండ్ లో లాగా ‘ముద్దు సత్కారం’ జరిపిస్తుందేమోనని తలచుకుని హడలిపోయాను. కాని ఆ మనిషి అలాంటి ఉద్దేశాలేవీ లేవని తెలిసి నా గుండెదడ తగ్గింది.ఇల్లంతటికీ అతిథుల గదే అత్యంత జుగుప్సాకరంగా ఉంది. కంపు భరించరానిదిగా ఉంది. రెక్టర్ కి పాత కాలపు అతిథి సత్కారాలు చేసే అలవాటు ఉన్నట్టు లేదు. మేం ఉన్న ఆ ఒక్క రోజులోను ఈ పెద్దమనిషిలో ఎన్నో ముఖాలు చూశాం. కంసాలిగా, జాలరిగా, వేటగాడిగా ఇలా ఠక్కుఠక్కున ఎన్నో అవతారాలు ఎత్తాడు గాని, ఎక్కడా రెక్టర్ లక్షణాలు కనిపించలేదు. మేం వచ్చింది ఆదివారం కాదు కనుక మాకు ఆ భాగ్యం లేకపోయింది కాబోసు. లేకపోతే ఈ పెద్దపనిషి దివ్యసందేశాన్ని విని తరించేవాళ్ళం.

ఏదేవైనా అర్చకులని ఏవైనా అంటే పాపమే. చాలీ చాలని జీతాలతో పొట్టపోసుకోవాలి. డేనిష్ ప్రభుత్వం వీళ్ల ముఖాన నాలుగు చిల్లర పెంకులు కొడుతుంది. ఉన్న కాస్త భూమి నుండి మరి నాలుగు దమ్మిడీలు పుడతాయి. అన్నీ కలుపుకుంటే ఏడాదికి అరవై మార్కులు కూడా రావు. వట్టి ప్రవచనంతో పబ్బం గడవదు. అందుకే చేపలు పట్టడాలు, వేటాడడాలు, గుర్రానికి గంటల తరబడి నాడాలు బిగించుకోడాలు – మొదలైన వ్యాపకాలు అలవడతాయి. ఈ వ్యాపకాలకి తగ్గట్టే వాళ్ల ప్రవర్తన కూడా మోటుగా తయారవుతుంది. పైగా ఇతడికి ముక్కోపం అని త్వరలోనే తెలిసింది.సంస్కారం గల ప్రవక్తకి బదులు ఓ పల్లెటూరి మొద్దు దొరికినందుకు మామయ్యకి చిరాకుగా వుంది. వీలైనంత త్వరగా ఈ ఇంట్లోంచి బయటపడితే మేలని అనుకున్నాడు.


కనుక స్టాపీ లో అడుగుపెట్టిన మర్నాడే మా చివరి ప్రయాణానికి కావలసిన సన్నాహాలు మొదలయ్యాయి. హన్స్ మరి ముగ్గురు ఐస్లాండ్ వ్యక్తులని మోతుబరులుగా నియమించాడు. కాని అగ్నిపర్వతం దగ్గర పడగానే ఆ ముగ్గురూ వల్లకాదంటూ చల్లగా తప్పుకున్నారు.

మామయ్య హన్స్ ని పిలిచి తన మనసులో మాట చెప్పాడు. అగ్నిపర్వతంలో పైన అగ్నిబిలం (crater) లోంచి పర్వతంలోకి ప్రవేశించి దాని అంతరాళాన్ని చివరికంటా శోధించడం మా ఉద్దేశం అని స్పష్టంగా చెప్పాడు.(ఇంకా వుంది)


0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email