మాలింది నగర వాసులు వాస్కో బృందాన్ని సాదరంగా ఆహ్వనించారు. నానా రకాల ఫలహారాలు ప్రసాదించి వారి సేద తీర్చారు. కాని అప్పటికే అరబిక్ సముద్రపు విపరీత పరిస్థితుల వల్ల బాగా అస్వస్థత పడ్డ కొందరు నావికులకి ఆ ఫలహారాల వల్ల పెద్దగా మేలు జరగలేదు. పైగా ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉండే మాలింది వాతావరణం వల్ల వారి పరిస్థితి మరింత విషమించింది. వ్యాధి వాత పడ్డ కొంతమంది నావికులు పాణాలు కోల్పోయారు.
మాలిందిలో ఐదు రోజులు బస చేశాక వాస్కో బృందం పోర్చుగల్ కి బయల్దేరింది. కొంతమంది నావికులు చనిపోవడం చేత మూడు ఓడలని నడపడానికి తగినంత మంది సిబ్బంది లేరు. కనుక ‘సాన్ రఫాయెల్’ ఓడలో ఉండే ఆహారం మొదలైన సరుకులు అన్నీ తక్కిన రెండు ఓడలలో పంపిణీ చేసి ‘సాన్ రఫాయెల్’ కి నిప్పు పెట్టారు. తక్కిన రెండు ఓడలలోను వాస్కో బృందం తిరిగి పోర్చుగల్ కి పయనమయ్యింది.
మే ఇరవయ్యవ తారీఖుకి నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ ని చేరుకున్నాయి. అంటే సగం దూరం వచ్చేశాయన్నమాట. నావికులు సంతోషించారు. ఓడలు పోర్చుగల్ దిశగా ప్రయాణించాయి. ఆ సమయంలోనే వాస్కో తమ్ముడైన పాలోకి టీ.బీ. వ్యాధి సోకినట్టు తెలిసింది. ఎలాగైనా వీలైనంత త్వరగా పాలోని పోర్చుగల్ చేర్చాలి. బతికించుకోలేకపోయినా మార్గ మధ్యంలో అతడు పోవడం వాస్కోకి ఇష్టం లేదు. కాని ఓడల వేగం సరిపోలేదు. పోర్చుగల్ చేరకుండానే పాలో ప్రాణాలు వదిలాడు. దారిలో అజోర్స్ దీవుల వద్ద ఆగి వాస్కో తన తమ్ముడి అంత్యక్రియలు జరిపించాడు.
యాత్ర కొనసాగింది. కాని వాస్కో తన తమ్ముడు పోయిన విషాదం నుండి తేరుకోలేకపోయాడు.1499 ఆగస్టు నెల ఆఖరులో వాస్కో బృందం పోర్చుగల్ చేరుకుంది. వాస్కో ద గామా బృందం తమ దేశం కోసం, ఇంచుమించు శతాబ్ద కాలంగా సాధ్యం కాని ఓ ఘన విజయం సాధించుకు వచ్చింది. ఇండియాకి కొత్త సముద్ర దారులు కనుక్కోగలిగింది. అయితే తమ్ముడు పోయిన బాధలో వాస్కో ఆ విజయానందంలో పాలుపంచుకో లేకపోయాడు.
పోర్చుగల్ దేశం ఇండియాని కనుక్కుని తిరిగొచ్చిన నావిక వీరులకి ఘన స్వాగతం పలిగింది. మాన్యుయెల్ రాజు వాస్కో ద గామాని సాదరంగా ఆహ్వానించాడు. డామ్ బిరుదు ప్రసాదించి వాస్కో ని సత్కరించాడు. బహుమతిగా కొంత ధనం కూడా ప్రదానం చేశాడు. వాస్కో తను చూసినది, చేసినది అంతా వివరంగా ఏకరువు పెట్టాడు. అది విన్న రాజు రెండో సారి యాత్రకి సిద్ధం కమ్మని సూచించాడు.
1500 లో రెండవ యాత్ర కి ఉపక్రమించమని వాస్కో ని అడిగాడు రాజు. కాని రెండేళ్లకి పైగా సాగిన యాత్ర వల్ల బాగా బడలిక చెందిన వాస్కో వెంటనే మరో యాత్ర మీద బయల్దేరడానికి సిద్ధంగా లేనన్నాడు. కనుక రాజు పెడ్రో ఆల్వారెజ్ కబ్రాల్ అనే నావికుణ్ణి ఎంచుకున్నాడు. పదిహేను ఓడలతో, బోలెడంత సాయుధులైన బలగంతో బయల్దేరాడు పెడ్రో. ఈ యాత్ర యొక్క లక్ష్యం ఇండియా తో వాణిజ్యం కాదు. దారి పొడవునా తమకి లోగడ ద్రోహం చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం. మొదటగా ఆఫ్రికాలోని మొంబాసా నగరాన్ని చేరుకున్నారు.పోర్చుగల్ ఓడలు ఆ ఊరి మీద ఫిరంగులతో అగ్నివర్షం కురిపించాయి. పోర్చుగీస్ సైనికులు ఊరిమీద విరుచుకుపడి విలయతాండవం చేశారు. స్త్రీలని అటకాయించి నగలు దోచుకున్నారు. అందినది అందినట్టు దోచుకుని తమ ఓడలలోకి ఎక్కించుకున్నారు. ఆఫ్రికా తీరం మీద పోర్చుగీస్ నౌకల పట్ల ద్వేషం, భయం పెరిగింది.
1502, ఫిబ్రవరి 12, నాడు వాస్కో ద గామా స్వయంగా ఇరవై నౌకలు తీస్కుని బయల్దేరాడు. దారిలో మొజాంబిక్ లో కొంత కాలం ఆగారు. మొజాంబిక్ ని పాలించిన సుల్తాన్ క్వాజా లోగడ వాస్కొ ద గామాని మోసం చేశాడు. కాని ఈ మధ్య కాలంలో అతగాడు మరణించాడు. అతడి తరువాత వచ్చిన షేక్, వాస్కో ద గామా గురించి విని వుండడం చేత, వాస్కో తో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. దారిలో మాలింది నగరాన్నిమళ్లీ సందర్శించారు. ఆ తరువాత అంగెదీవా దీవుల మీద కూడా ఆగారు. ఈ సమయంలో మళ్లీ ఎంతో మంది నావికులు స్కర్వీ వాత పడ్డారు. వారిలో కొంతమంది మరణించారు. వ్యాధి నుండి నావికులు మళ్లీ కోలుకున్నాక ప్రయాణం మొదలయ్యింది.
అంగెదీవాని దాటాక ఇక తదుపరి మజిలీ ఇండియానే. ఈ సారి కాలికట్ కి పోకుండా ఆ ఊరికి ఉత్తరాన ఉన్న కాననూర్ నగరాన్ని చేరుకున్నారు. ఇక ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమయ్యింది. కొన్ని రోజులు ఎదురు చూశాక ‘మేరీ’ అనే అరబ్ ఓడ పశ్చిమం నుండి రావడం కనిపించింది. ఆ ఓడ ఓ కాలికట్ నగర వాసికి చెందినది. అందులో 380 మంది ప్రయాణీకులు ఉన్నారు. మెక్కా యాత్ర చేసుకుని వారంతా కాలికట్ కి తిరిగి పోతున్నారు.
పోర్చుగీస్ నౌకలు ఆ అరబ్ నౌకని ముట్టడించాయి. నౌకలోని సరుకులని తమకి అప్పజెప్పమని ద గామా గద్దించాడు. నౌకలో పెద్దగా విలువైనవి ఏమీ లేవన్నారు నౌకలోని అరబ్బులు. వాళ్ల మాట నమ్మని వాస్కో ఇద్దరు అరబ్బులని ఓడ మీంచి నీట్లో పడేయించాడు. దాంతో ఓడలో సరుకులు ఉన్నాయని అరబ్బులు ఒప్పుకున్నారు. సరకులని ఆ ఓడ నుండి పోర్చుగీస్ ఓడలలోకి తరలించారు. అయినా అరబ్బులు ఇంకా ఏదో దాస్తున్నారన్న సందేహంతో ముక్కోపి అయిన వాస్కో ఓ ఘాతుకానికి ఒడిగట్టాడు. అరబ్బు ఓడని నిలువునా దహించమని తన సైనికులని ఆదేశించాడు. ప్రమాదాన్ని గుర్తించిన అరబ్బులు తమ వద్ద మిగిలిన ఆయుధాలని వాస్కో బృందానికి సమర్పించుకోడానికి ప్రయత్నించారు. కాని వాస్కో ప్రదర్శించిన పాశవికతను వారి చర్యలు మార్చలేకపోయాయి. నాలుగు పగళ్ళు, నాలుగు రాత్రుల పాటు ఓడ మంటల్లో రగిలింది. ఓడలోని ప్రయాణీకులలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు.
అలా ఎంతో మంది స్త్రీలు, పిల్లలు ఉన్న ఓడని నిలువునా దహించిన ఘట్టం సముద్ర యాన చరిత్రలోనే ఓ అతి చేదైన, క్రూరమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఆ సందర్భంలో వాస్కో ద గామా ప్రదర్శించిన కాసాయి స్వభావం ముందు సముద్రపు దొంగలు చేసే దురాగతాలు కూడా దిగదుడుపే.
అలా ఎంతో మంది స్త్రీలు, పిల్లలు ఉన్న ఓడని నిలువునా దహించిన ఘట్టం సముద్ర యాన చరిత్రలోనే ఓ అతి చేదైన, క్రూరమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఆ సందర్భంలో వాస్కో ద గామా ప్రదర్శించిన కాసాయి స్వభావం ముందు సముద్రపు దొంగలు చేసే దురాగతాలు కూడా దిగదుడుపే.
అరబ్బు ఓడలో మంటలు ఆరినా వాస్కో ద గామా లో రగులుతున్న క్రూర, ప్రతీకార జ్వాలలు మాత్రం అరలేదు. కాలికట్ ని ఏలే జామొరిన్ మీద దెబ్బ కొట్టడానికి ఓ పన్నాగం పన్నాడు.
(ఇంకా వుంది)
0 comments