శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

“ఈ రాకాసిని జయిస్తా!” (పాతాళానికి ప్రయాణం - 37)

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, December 6, 2011

మర్నాడు ఉదయం ఐదింటికి మాకు ఆతిథ్యం ఇచ్చిన రైతు కుటుంబానికి వీడ్కోలు చెప్పాం. మామయ్య అతికష్టం మీద ఆ రైతుకి ఇవ్వాల్సిన పారితోషకం అతగాడు వద్దంటున్నా బలవంతంగా చేతిలో పెట్టాడు. హన్స్ ఇచ్చిన సంజ్ఞతో బృందం అంతా బయల్దేరింది.

గర్దర్ నుండి ఓ నూరు గజాల దూరం వచ్చామో లేదో మట్టిలో కొన్ని మార్పులు రావడం కనిపించింది. అంతవరకు పొడిగా ఉన్న నేల కాస్తా చితకనేలగా మారి నడవడం కష్టం అయ్యింది. మాకు కుడి వైపున ఓ బృహత్తరమైన పర్వత శ్రేణి పెట్టని కోటలా విస్తరించింది. అక్కడక్కడ చిన్న చిట్టేర్లు దాటాల్సి వచ్చినప్పుడు, మా సామాన్లు తడవకుండా జాగ్రత్తపడుతూ, ముందుకి సాగిపోయాం.

పోను పోను ఎడారి ఇంకా విస్తారంగా, ఇంకా దుస్తారంగా మారసాగింది. అప్పుడప్పుడు అల్లంత దూరంలో ఎదో మానవాకృతి కనిపిస్తుంది. మమ్మల్ని చూడగానే అట్నుంచి అటే మాయమవుతుంది. వాళ్లు అలా ఎందుకు పారిపోతున్నారో నాకైతే మొదట అర్థం కాలేదు. కొన్ని సార్లు ఓ మలుపు తిరగగానే మా ఎదుటే ఓ మానవాకారం సాక్షాత్కరిస్తుంది. చాలీ చాలని మురికి బట్టలతో, జుట్టులేని చర్మంతో, ఒడలంతా పుండ్లతో, వికారమైన ఆ రూపాన్ని చూడగానే చెప్పలేని జుగుప్స కలిగేది.


అలా ఒకసారి మమ్మల్ని చూడగానే ఓ వ్యక్తి పారిపోబోయాడు. కాని కనుమరుగు అయ్యేలోపే హన్స్ మర్యాదగా, “సెల్వెర్టూ” అని సంబోధించాడు. మామయ్య వైపు తిరిగి, “స్పెటెల్స్క్” అన్నాడు.


“కుష్టువాడా?” అన్నాడు మామయ్య ఉలిక్కిపడుతూ.

ఈ దారుణమైన కుష్టువ్యాధి ఐస్లాండ్ లో సర్వసామాన్యంగా కనిపిస్తుంది. ఇది అంటువ్యాధి కాదు, అనువంశికమైన వ్యాధి. కుష్టువాళ్లు వివాహానికి అర్హులు కారు.

పోగా పోగా నేల మీద ఆ కాస్త పచ్చిక కూడా కనిపించకుండా పోతోంది. అక్కడక్కడ చిన్న బిర్చ్ మొక్కలు తప్ప చెప్పుకోదగ్గ చెట్లే కనిపించలేదు. అలాగే యజమానులు వదిలేసి వెళ్లిన కొన్ని నిర్భాగ్యపు పోనీలు తప్ప ఎక్కడా పెద్దగా జంతువులు కూడా కనిపించలేదు. అప్పుడప్పుడు తల పైకెత్తి చూస్తే తన విశాలమైన రెక్కల మీద గాలికెరటాలపై స్వైరవిహారం చేసే డేగ కనిపిస్తుంది. కాని అంతలోనే అది వేగం పెంచి దక్షిణ దిశగా దూసుకుపోతుంది. ఈ నిస్సారమైన దృశ్యాలన్నీ చూస్తుంటే నాకు కాస్త ఇంటి మీదకి మనసు మళ్లింది. హిమ ఎడారి లాంటి ఈ ఉత్తర భూమిని వదిలి, గొప్ప జీవన సౌరభాలతో పరిమళించే దక్షిణ దేశం మీదకి ఆలోచనలు పోయాయి.

తరువాత కొన్ని చిన్న చిన్న ఏళ్లు దాటాక ఓ పెద్ద నది దాటాల్సి వచ్చింది. అవతలి గట్టు నుంచి ఓ మైలు దూరంలో ఉన్న అల్ఫటేన్స్ అనే గ్రామాన్ని చేరుకున్నాం.

ఆ సాయంకాలం ట్రౌట్ లు, పైక్ లు మొదలైన జలచరాల మయమైన రెండు నదులని (వాటి పేర్లు ఆల్ఫా, హేటా) దాటాం. ఆ రాత్రికి ఓ నిర్జన భవనంలో బస చెయ్యాల్సి వచ్చింది. స్కాండినావియా దేశాల్లో ఎల్ఫిన్లు అనే ఒక రకమైన అదృశ్య జీవులు ఉంటారని ఎన్నో గాధలు ఉన్నాయి. ఈ భవంతి నిండా ఎల్ఫిన్లు కలయదిరుగుతున్నారన్న ఊహకి రాత్రంతా కునుకు పట్టలేదు.

ఆ మర్నాడు కూడా పెద్దగా విశేషాలేమీ జరగలేదు. బురద నేల, భరించరాని ఎడారి నిశ్శబ్దం – రోజంతా వీటితోనే గడచిపోయింది. రాత్రి అయ్యేసరికి ఇంచుమించు సగం దూరం వచ్చేశాం. క్రోసోల్బ్ట్ అనే ఊళ్లో ఆ రాత్రికి బస చేశాం.

జూన్ పందొమ్మిది. గట్టి పడ్డ లావా మీద ఓ మైలు (అది ఐస్లాండిక్ మైలు!) దూరం నడిచాం. ఈ దేశంలో ఇలాంటి నేలని ‘హ్రౌన్’ అంటారు. దట్టమైన వైర్ల కట్టలని అల్లిబిల్లిగా, గజిబిజిగా, వికృతంగా నేలంతా పరిచినట్టు ఉంటుంది. ఒకప్పుడు ఎర్రగా కుతకుతలాడుతూ ఈ నేలంతా ప్రవహించిన ద్రవం ఇప్పుడు నల్లగా గట్టిపడి ఆ భూమి రూపురేఖలని మార్చేసింది. అక్కడక్కడా మిగిలిన శిధిలాలు ఒకప్పటి భీకర అగ్నిపర్వత విస్ఫోటాలకి ఆనవాళ్లుగా నిలిచాయి. అగ్నిపర్వతాలు నిష్క్రియం అయిపోయినా, కొన్ని చోట్ల వేణ్ణీటి బుగ్గల నుండి ఇప్పటికీ ఆవిర్లు తన్నుకొస్తున్నాయి.

ఈ దృశ్యాలన్నీ చూసే తీరిక లేక గబగబ ముందుకి సాగిపోయాం. దగరలో ఉన్న పర్వతాల పాదాల వద్ద నేల అంతా చిత్తడిగా ఉంది. చుట్టుపక్కల కొన్ని చిన్న చెరువులు ఉన్నాయి. ఇక ఇక్కణ్ణుంచి మా గమనదిశ పశ్చిమంగా తిరిగింది. ఫాక్సా ఖాతం దిశగా ముందుకి సాగిపోయాం. ఐదు మైళ్ల దూరంలో స్నెఫెల్ పర్వతపు తెల్లని జంట శిఖరాలు మబ్బుల్లోంచి దూసుకుపోతున్నాయి.

గుర్రాలు అలుపు లేకుండా నడుస్తున్నాయి. వాటి కన్నా నేనే ఎక్కువ అలిసిపోయినట్టు ఉన్నాను. గుర్రాల లాగానే మామయ్య కూడా పెద్దగా అలిసిపోయినట్టు కనిపించలేదు మరి. ఆయన ఓపికకి నిజంగా మెచ్చుకోవాలి. ఇక మా బృందానికి దారి చూపిస్తున్న హన్స్ కి ఇదంతా ఓ సరదా షికారులా ఉన్నట్టుంది.

జూన్ ఇరవై. సాయంకాలం ఆరు గంటలకి సముద్ర తీరం మీద ఉన్న బుదిర్ అనే గ్రామాన్ని చేరుకున్నాం. మా గైడుకి అందాల్సిన బకాయిలు అన్నీ అక్కడ మామయ్య తీర్చేశాడు. అక్కడ మేము హన్స్ బంధువుల ఇంట్ళోనే బస చేశాం. వీళ్లకి కాస్త ఇబ్బంది అయినా హాయిగా ఇక్కడే ఓ రెండు రోజులు సేద దీరుదాం అని నిశ్చయించేసుకున్నాను. కాని మామయ్యకి అలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. మర్నాడు ఉదయానే ఠంచనుగా గుర్రం ఎక్కమన్నాడు.

ఓ బృహత్తరమైన అగ్నిపర్వతం చూట్టూ మా ప్రదక్షిణ మొదలయ్యింది. ఆ పర్వతం యొక్క ఉన్కి గురించి ఆ పరిసరాల మట్టి కూడా సాక్షం చెబుతోంది. ఆ పర్వతపు గ్రానైట్ పునాదులు ఏదో మహావృక్షపు విస్తృతమైన వేళ్లలా భూగర్భంలోకి లోతుగా చొచ్చుకుపోతున్నాయి. ప్రొఫెసరు ఆ పర్వతం కేసే కన్నార్పకుండా కాసేపు చూశాడు. “ఎలాగైనా ఈ రాకాసిని జయిస్తాను,” అంటూ పిడికిలి బిగించి బిగ్గరగా ప్రతిజ్ఞ చేశాడు.

మరో నాలుగు గంటల నడక తరువాత స్టాపీ అనే చిన్న ఊళ్లో మా గుర్రాలు ఓ అర్చకుడి ఇంటి గుమ్మంలో వాటికవే ఆగిపోయాయి.

(పదమూడవ అధ్యాయం సమాప్తం)
(ఇంక వుంది)

1 Responses to “ఈ రాకాసిని జయిస్తా!” (పాతాళానికి ప్రయాణం - 37)

  1. YOURS IS NICE BLOG CONGRATS FOR WRITING IN TELUGU FOR INFO I WROTE AN RESEARCH PAPER ON AERONAUTICS WAY BACK IN 1986 READ IN MILITARY CONFERENCE FUNNY THING IS I HAVE TO READ 4 PAPERS WHEN FIRST THEY ACCEPTED ONE BEFORE PV NARASIMHA RAO H R MINISTER MAIL TO ME FOR MORE INFO DAMODHARRAOM@GMAIL.COM CALL ME 09441816605 SEE SOME POINTS IN HTTP://INDIANBANNOTES.BLOGSPOT.COM PRACHINATELUGU.BLOGSPOT.COM

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email