శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

ఇంగ్లీష్ లో బాల సాహిత్యం

Posted by V Srinivasa Chakravarthy Thursday, August 30, 2012 1 comments

ఇంగ్లీష్ లో బాల సాహిత్యం


ఇంగ్లీష్ లో బాలసాహిత్యంలో ఎన్నో సాహితీ విభాగాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని – 1) ఊహా సాహిత్యం లేదా fantasy సాహిత్యం, 2) అన్వేషకుల గాథలు, 3) సైన్స్ సాహిత్యం, 3) సైన్స్ ఫిక్షన్ సాహిత్యం, 4) భయానక సాహిత్యం, 5) అపరాధ పరిశోధన, 6) సాహసగాధలు, 7) వృత్తులు, క్రీడలకి సంబంధించిన సాహిత్యం. ఈ రకమైన వర్గీకరణ తెలుగు బాలసాహిత్యంలో ఉందనుకోను.



1) ఊహా సాహిత్యం –

పిల్లల మానసిక జివితానికి ఊహే ఊపిరి. ఆ ఊహని పోషించే సాహిత్యానికి మరి బాలసాహిత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గత దశకంలో ఇంగ్లీష్ లో బాల సాహిత్యానికి కొత్త ఊపిరి పోసిన పుస్తకమాల ‘హారీ పాటర్’ అనుకోవచ్చు. పట్టున ఐదేళ్లు కూడా లేని పిల్లలు కూడా అంతంతలేసి గ్రంథరాజాల్ని సునాయాసంగా చదువుతుంటే ఆ పుస్తకంలో ఏం మహత్తు ఉందో అని ఆశ్చర్యం కలుగుతుంది. టీవీ ప్రభావానికి లోనవుతున్న బాలతరాన్ని మళ్లీ పుస్తక పఠనం వైపుకి తిప్పాయి జె.కె. రౌలింగ్ రచనలు అని చెప్పుకుంటారు.





మాయా చీపురుకట్ట మీద షికార్లు కొడుతున్న హారీ పాటర్



హారీ పాటర్ విజయం తరువాత ఆ ఫక్కీలో ఇంగ్లీష్ లో మరెందరో పిల్లల పుస్తకాలు రాశారు. అంతే కాక గత శతాబ్దానికి చెందిన కొంత ‘ఫాంటసీ’ బాల సాహిత్యం కూడా పునర్జన్మించి కొత్త ఊపిరి పోసుకుంది. గత శతాబ్దపు తొలి సగంలో సి.ఎస్. లువిస్ రాసిన నార్నియా (Narnia) కథలు, సుమారు అదే కాలంలో జె.ఆర్. ఆర్. టోల్కీన్స్ రాసిన హాబిట్ (Hobbit) కథలు ఆ వర్గానికి చెందినవే. మన దేశంలో కూడా ఈ పుస్తకాలు పిల్లల మనసుల్ని దోచాయి.



ఈ మధ్యకాలంలో వస్తున్న ఫాంటసీ కథలు/నవళ్లలో కొన్ని ప్రాచీన గ్రీకు దేవతలని సమకాలీన ప్రపంచంలోకి ప్రవేశపెట్టి, ఆ పాత కొత్తల మేళవింపునే అంశంగా తీసుకున్నాయి. రిక్ రియోర్డెన్ నవళ్లు ఈ రకమైన ప్రయత్నానికి తార్కాణాలు. ఈ రకమైన ప్రయత్నాలు మన దేశంలో కొత్త కాదు. టీవీ లోకంలో ‘ఛోటా భీమ్,’ ‘బాల్ గణేశ్’, ‘వీర్ హనుమాన్’ మొదలైన వన్నీ ఆ రకమైన సృజనలే.







2. అన్వేషుల సాహస కథలు (Stories of explorers)- మానవ ప్రగతికి కారణం సాహసంతో కూడిన అన్వేషణ. అన్వేషుల కథలు పిల్లల మనసుల్లో గాఢమైన ముద్ర వేస్తాయి. మార్కో పోలో, కొలంబస్, వాస్కో ద గామా, మెగాలెన్, జేమ్స్ కుక్, అముండ్ సెన్ మొదలైన ధీరులు భూమి మీద దిశదిశలా పర్యటించి కొత్త ప్రాంతాలని కనుక్కోవడం వల్ల ఆ వీరులు చెందిన సమాజాలు ఎంతో పురోగమించాయి. వీళ్ల మీద పుస్తకాలు ఇంగ్లీష్ లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.





అన్వేషణ కేవలం భూమికే పరిమితం కానక్కర్లేదు కనుక అంతరిక్షంలో కి ప్రవేశించే సాహసం చేసిన ఎడ్విన్ ఆల్డ్రిన్, వెలెంతినా తెరిష్కోవా మొదలైన అన్వేషుల కథలు కూడా ఎన్నో ఉన్నాయి. కొత్త విషయాలని తెలుసుకోవాలనే స్ఫూర్తి పాశ్చాత్య సంస్కృతిలో బలంగా కనిపిస్తుంది. కనుక వారి సంస్కృతిలో, సాహిత్యంలో అన్వేషుల గాధలకి అంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. ఆ స్ఫూర్తి మనలో కొంచెం తక్కువ కావడమే ఆ రకమైన సాహిత్యం మన సంస్కృతిలో కొరవడడానికి కారణమేమో. ఇంగ్లీష్ లో బాల సాహిత్యంలో అన్వేషుల కథలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలియడానికి ఈ లింక్ చూడండి.

http://www.enchantedlearning.com/explorers/







అయితే అన్వేషణా స్ఫూర్తి అడుగంటిన విషయం గత రెండు మూడు శతాబ్దాల భారతానికి మాత్రమే పరిమితం కావచ్చు. మన పూర్వీకులు కూడా దక్షిణ-తూర్పు ఆసియాలో సామ్రాజ్యాలు స్థాపించారు (శ్రీ విజయ సామ్రాజ్యం). మరి జావా, సుమత్రా మొదలైన దీవులని వాళ్ళు ఎలా కనుక్కున్నారు? ఆ వివరాలన్నీ ప్రస్తుతం లభ్యమైతే చదువుకోడానికి ఎంతో ఆసక్తికరంగా, తెలుసుకోడానికి ఎంతో గర్వంగాను ఉంటుంది. అలాగే మన పూర్వీకులు బౌధ్ధ మత ప్రచారం కోసం హిమాలయలు దాటి చైనా, జపాన్ భూములకి ప్రయాణించారు. ఆ యాత్రలు ఎలా చేశారు? సిల్కు దారుల వెంట మన పూర్వీకులు యూరప్, పర్శియా మొదలైన ప్రాంతాలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకునేవారు? ఇలాంటి వివరాలు కొన్ని చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయేమో మరి నాకు తెలీదు. కాని ఆ విశేషాలని పిల్లలకి అర్థమయ్యే భాషలో, భారతీయ భాషలలోకి తీసుకొస్తే ఎంతో బావుంటుంది. మన బాలసాహిత్యానికి మంచి పోషణ అందుతుంది.

(ఈ సందర్భంలో 2007 లో వెలువడ్డ ఓ అరుదైన పుస్తకం గురించి చెప్పాలి. సురవి, ఋషి అనే ఇద్దరు భారతీయ టీనేజ్ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి క్రిస్మస్ కి ఓ అపురూపమైన బహుమానం ఇచ్చారు. అందురూ ఇచ్చే బొమ్మలో, పుస్తకాలో కాదు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించే సువర్ణావకాశం ఆ బహుమానం! చిలీ దేశపు నౌకాదళానికి చెందిన ఓ పర్యాటక నౌకలో పిల్లలు ఇద్దరూ వారి తల్లిదండ్రులతో అంటార్కిటికా ఖండానికి పయనించి, ఆ యాత్రలో వాళ్ల అనుభవాలన్నీ పొందుపరుస్తూ ఓ అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. దాని పేరు ‘Adventures in Antarctica.’ ఈ పుస్తకాన్ని ఎవరైనా తెలుగులోకి అనువదిస్తే బావుంటుంది.)


(ఇంకా వుంది)





పుస్తకాలు పిల్లలకు పసిడి నేస్తాలు. “ఏఏ వేళల పూచే పూవులతో ఆయా వేళల” దుర్గమ్మను పూర్ణమ్మ కొలిచినట్టు, ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైన సాహిత్యం చదువుకుంటూ పిల్లలు సహజంగా, సజావుగా ఎదగాలి. ఆ రకంగా ఎదగడానికి ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు పిల్లవాడికి – తెలుగులో! – ఎలాంటి సాహిత్యం లభ్యం అవుతోంది? అని ఓ ప్రశ్న మదిలో మెదిలింది ఈ మధ్యన. ఇంగ్లీష్ లో సముద్రం లాంటి బాల సాహిత్యాన్ని తీసుకుంటే, మూడేళ్ల బుడుతల దగ్గర్నుండి, పదిహేనేళ్ల పిల్లల వరకు, ఎన్నో సాహితీ వర్గాలలో, సువిస్తారమైన సాహిత్యం ఉంది. ఐరోపా భాషలలో కూడా తత్తుల్యమైన సాహిత్యం ఉందనే నమ్ముతాను. ఇక పాశ్చాత్య ప్రభావం బలంగా ఉన్న తూర్పు దేశాల భాషలైన జపనీజ్, కొరియన్ భాషల్లో విస్తారమైన బాలసాహిత్యం ఉండడం చూశాను. ఈ సందర్భంలో తెలుగులోను, ఇంగ్లోష్ లోను లభ్యమైన బాలసాహిత్యాన్ని పోల్చుతూ వరుసగా కొన్ని పోస్ట్ లో ఓ సుదీర్ఘమైన వ్యాసం రాయాలని సంకల్పం.





తెలుగులో బాల సాహిత్యంలో నాకు తెలిసినంత వరకు గత రెండు మూడు దశకాలలో పెద్దగా కొత్తదనం వచ్చినట్టు లేదు. పంచతంత్రం, జాతక కథలు, నజీరుద్దీన్, బీర్బల్, తెనాలి రామలింగడు మొదలైన వాళ్ళ కథలు. ఇవి కాకపోతే మన ‘ఎవర్ గ్రీన్’ రామాయణ, భారత, భాగవత గాధలు. తరతరాలుగా ఆ సమాచారమే బాలల సాహిత్యం పేరిట ‘రీసైకిల్’ అవుతున్నట్టు అనిపిస్తోంది. నేను స్కూల్ లో చదువుకునే రోజుల్లో పరిస్థితి మరి కొంచెం మెరుగు అనిపిస్తుంది. చందమామ తో పాటు, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలమిత్ర ఇలా ఎన్నో పత్రికలు ఉండేవి. ఈ మాస పత్రికలతో పాటు చిన్న చిన్న పాకెట్ సైజు పుస్తకాలు (‘భైరవ ద్వీపం’, ‘నేపాళ మాంత్రికుడు’ తరహా పుస్తకాలు!) వచ్చేవి. వీటిని క్లాసులో కూడా టెక్స్ట్ పుస్తకాలలో దాచుకుని దొంగతనంగా చదివేవాళ్ళం! ఆ పుస్తకాలు ఎప్పుడో మాయమైపోయాయి.



(స్కూలు రోజుల్లో దొంగతనంగా చదువుకున్న పుస్తకాలు అంటే ఓ పుస్తకం గుర్తొస్తుంది. అది రైట్ సోదరుల కథ. ఇంపైన తెలుగులో రైట్ సోదరులు విమానాన్ని రూపిందించిన వృత్తాంతాన్ని చాలా రమణీయంగా వర్ణిస్తుంది ఆపుస్తకం. క్లాసులో పిల్లలం ఆ పుస్తకాన్ని లాక్కుని లాక్కుని చదువుకున్నాం. కాని అలాంటి పుస్తకాలు తెలుగులో అరుదు.)



అసలు బాలల సాహిత్యం పట్ల మన సమాజంలో ఓ విచిత్రమైన దృక్పథం ఒకటుంది. ఒకరకమైన ఏకపక్ష ధోరణి వుంది. (ఆ జాఢ్యం అంత సులభంగా పోయేట్టు కనిపించడం లేదు.) పిల్లలకి చెప్పే ప్రతీ కథా ఓ ‘నీతి కథ’ కావాలి. ప్రతీ కథకి చివర్లో ఓ నీతి ఉండాలి. ‘అబద్ధములు ఆడరాదు.’ ‘పెద్దలని గౌరవించవలెను.’ ‘తల్లిదండ్రులని సేవించవలెను.’ ఇలా ఏదో ఒకటి. ఆ నీతి వాక్యాలు చదివేసిన పిల్లలు సజ్జనులుగా ఎదిగేసి దేశానికి మంచిపేరు తెచ్చేసేయాలి.





(విష్ణుశర్మ పంచతంత్ర కథలు బోధిస్తున్న చిత్రం – చిత్రకారుడు వ.పా.)

కొంత మంది పెద్ద రచయితల రచనలలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. గత ఏడాది ఒకసారి ఓ మేటి రచయిత, ఓ పత్రికలో రాసిన ఓ పిల్లల కథ చదివాను. దాని సారాంశం ఇది. ఓ తండ్రి తన కూతుర్ని తీసుకుని ఓ పుస్తకాల కొట్టుకి వెళ్తాడు. రామాయణం (భారతమో గుర్తులేదు) మీద పుస్తకం కొనిస్తానని తీసుకెళ్తాడు తండ్రి. కాని తీరా అంగడికి వెళ్లాక ఆ పాపకి చదరంగం మీద ఓ పుస్తకం నచ్చి కొనుక్కుంటానని అంటుంది. తండ్రి చిన్న క్లాసు పీకుతాడు. అప్పుడు పాపం ఆ పాప తన తప్పు తాను తెలుసుకుని, పశ్చాత్తాపపడి లెంపలేసుకుని, రామాయణ, భారత కథలు చదివేసి మోక్షమార్గాన వేగంగా ముందుకి సాగిపోతుంది. అదీ కథ.

(మరి నాకొక విషయం ఎప్పుడూ అర్థం కాదు. పుట్టినప్పటి నుంచి ‘నీతీ… నీతీ’ అని గటగటా నీతిసారాన్ని గ్రోలి పెరిగిన మన సమాజంలో ఇంత అవినీతి, ఇంత అసమానత ఎందుకున్నాయ్?)



అంటే పిల్లలకి నీతి కథలు కాక అవినీతి కథలు చెప్పాలని నీ ఉద్దేశమా? అంటారేమో. కాదు. ఎందుకంటే పిల్లల లోకం నీతికి, అవినీతికి అతీతమైన లోకం.

బాల్యం ఓ సుందరమైన, సున్నితమైన దశ. పిల్లల లోకమే వేరు. చీమిడి ముక్కులు, చీమచింతకాయలు, గాలిపటాలు, గచ్చకాయలు, తొక్కుడు బిళ్ళలు, గుజ్జెన గూళ్లు, ముద్ద మాటలు, అద్దె సైకిళ్ళు, బొత్తాలూడిన చొక్కాలు, పెచ్చుల్లేచిన మోకాళ్ళు – ఇలా ఎన్నో విచిత్రమైన అంశాలతో కిక్కిరిసిన లోకం అది. అదో అద్భుతమైన ఊహాలోకం. నానా రకాల అసంభవాలూ ఆ లోకంలో సహజ సంభవాలు.

నేను మూడో తరగతిలో ఉండేటప్పుడు అనుకుంటా… ఓ నేస్తం ఉండేవాడు. రోజూ తను చేసే ఏవో సాహస కృత్యాల గురించి, మహత్యాల గురించే కథలు చెప్పేవాడు. వాడు చెప్పిన ప్రతీ కథా శ్రధ్ధగా వినేవాణ్ణి, నమ్మేవాణ్ణి. ఇంటికి వచ్చి మా అమ్మకి ఆ కథ చెప్పాక గాని నా మబ్బులు విడేవి కాదు!

మరి పిల్లల లోకం అంటే అదే. ఆ అందమైన లోకానికి, తటపటాయిస్తూ అంకురింపజూస్తున్న ఆ అతిసుందరమైన అంతర్లోకానికి ప్రాణం పోసేలా ఉండాలి మనం వాళ్లకి అందించే సాహిత్యం. ఆ సాహిత్యంలో బోలెడంత ప్రేమ, ఆనందం, తీపి, సాహసం, అనంతపు హద్దులు తడిమే ఊహ… ఇవి దండిగా ఉండాలి. అలాంటి అంశాలు ఉన్న పరిస్థితుల్లో ఎదిగే పిల్లలు పిల్లల్లా ఎదుగుతారు. సక్రమంగా, నిండుగా, సంతుష్టుడిగా ఎదిగి, తన సత్తా ఏమిటో తెలుసుకుని, తన శక్తికి తగ్గ స్థానాన్ని జీవితంలో ఆక్రమించిన వ్యక్తి సహజంగా నీతిమంతుడు అవుతాడు. నీతి సాహిత్యంతో వాణ్ణి ‘బ్రెయిన్ వాష్’ చెయ్యనక్కర్లేదు.

ఈ సందర్భంలో అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ అన్న మాటలు గుర్తొస్తాయి - “Persons attempting to find a motive in this narrative will be prosecuted; persons attempting to find a moral in it will be banished; persons attempting to find a plot in it will be shot. By Order of the Author.”

కనుక ఓ నీతి సాహిత్యపు గోతి లోంచి పైకొచ్చి ఓ సారి ఇంగ్లీష్ లో బాలసాహిత్యం సంగతి చూద్దాం.

(ఇంకా వుంది)

కోల్ వుడ్ కే బంగరు పతకం

Posted by V Srinivasa Chakravarthy Saturday, August 25, 2012 4 comments


ఇది తెలిసిన మిస్ రైలీ, హెడ్ మాస్టర్ తో మాట్లాడి, ఎక్కడో ఏదో పొరబాటు జరిగిందని ఒప్పించి, పిల్లలని విడిపిస్తుంది.

ఇంతకీ వాళ్లు చేసిన నేరం ఏంటని వాకబు చెయ్యగా విషయం తెలుస్తుంది. లాంచ్ జరిగిన ప్రదేశానికి పక్కనే అడవిలో ఓ పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది. దానికి కారణం హోమర్ నేస్తాలు లాంచ్ చేసిన రాకెట్టే అయ్యుంటుందని పోలీసులు భావిస్తారు. పైగా ఆ ప్రత్యేక లాంచ్ లో మాత్రం రాకెట్ ఎక్కడ పడిందో కనిపించదు. కనుక పోలీసుల అనుమానం బలపడుతుంది.

జరిగిన దానికి హోమర్ తండ్రి కొడుక్కి తల వాచేలా చివాట్లు పెడతాడు. రాయ్ లీ ని తన పెంపుడు తండ్రి చితకబాదుతుంటే హోమర్ తండ్రి వచ్చి కాపాడతాడు.

జరిగిన అవమానానికి రకెట్ కుర్రాళ్ల మనసు విరిగిపోతుంది. సైన్స్ పోటీకి వెళ్లే కలలన్నీ కరిగిపోతాయి. తమ లాంచ్ పాడ్ ని తగులబెట్టేస్తారు.



పరిస్థితులు ఇలా విషమంగా ఉండగా ఇది చాలదన్నట్టు ఒక రోజు గనిలో ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో బైకోవ్స్కీ చనిపోతాడు. అతణ్ణి కాపేడే ప్రయత్నంలో హోమర్ తండ్రి గాయపడతాడు. ఒక కంటి చూపు పోవచ్చు అంటారు డాక్టర్లు. ఇక అతడు తాత్కాలికంగానైనా ఉద్యోగం చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది.

పెద్ద కొడుకు జిమ్ తన కాలేజి చదువు మానుకుని గనిలో పని చేసి కుటుంబాన్ని పోషిస్తానంటాడు. కాని అమూల్యమైన కాలేజి చదువుని వొదులుకోవడం తెలివైన పని కాదని, అన్నయ్యకి బదులు తాను గనిలో పని చేస్తానని తమ్ముడు హోమర్ ముందుకొస్తాడు. కొడుకులు చేస్తున్న త్యాగానికి తల్లి కంటతడి పెట్టుకుంటుంది.

హోమర్ గని లో పని మొదలెడతాడు. అయిష్టంగానే మొదలుపెట్టినా త్వరలోనే పనిలో మంచి నైపుణ్యం సంపాదిస్తాడు. తండ్రి కూడా నెమ్మదిగా కోలుకుంటాడు. గనిలో తన చిన్న కొడుకు పని తీరు చూసి మురిసిపోతాడు. తండ్రిని మించిన కొడుకు అవుతాడని సంబరపడిపోతాడు.

ఈ సందర్భంలో ఓ సన్నివేశం ప్రేక్షకులని కదిలిస్తుంది. ఒక రోజు తెల్లవారే హోమర్ గనిలో పని మొదలుపెడతాడు. గని కార్మికుల యూనీఫామ్ లో, తల మీద లైటు గన హెల్మెట్ తో తోటి కార్మికులతో పాటు గనిలో లిఫ్ట్ లో కిందికి దిగుతూ ఓ సారి పైకి చూస్తాడు. పైన తారల మధ్యన తారలా స్పుట్నిక్ మెరుస్తూ వేగంగా కదలడం కనిపిస్తుంది. కిందికి కదులుతున్న లిఫ్ట్ లో అలా హోమర్ తన కలకి దూరం అవుతున్నట్టుగా చూపిస్తారు.



తండ్రి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు కనుక హోమర్ మల్ళీ హైస్కూల్ కి వెళ్ళి బడి చదువులు పూర్తి చేస్తే బావుంటుందని ఓ రోజు హోమర్ తల్లి సూచిస్తుంది. అప్పటికే మనసు విరిగిన హోమర్ ఇక బడి ముఖం చూసేదే లేదంటాడు.

అప్పుడు తల్లి మిస్ రైలీ కి అనారోగ్యంగా ఉందన్న వార్త చెప్తుంది. వెంటనే మిస్ రైలీని చూడడానికి వెళ్తాడు.

ఆమెకి హాడ్జ్ కిన్ వ్యాధి వచ్చిందని, ఇక రేపో మాపో అన్నట్టు పరిస్థితి ఉందని తెలిసి బాధపడతాడు హోమర్. అప్పుడు మిస్ రైలీ తనకు కూడా మరో విషయంలో బాధ ఉందంటుంది. ఆ నలుగురు కుర్రాళ్ళ విషయంలో ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుందని, వాళ్లిలా తమ లక్ష్యాన్ని విస్మరించడం తన బాధగా ఉందంటుంది. ఓ టీచరుగా తను ఓడిపోయినట్టు అనిపిస్తోంది అంటుంది.



“చూడు హోమర్! జీవితంలో కొన్ని సార్లు ఒక్కొక్కరు ఒక్కోలా సలహా ఇస్తుంటారు. ఎవరేం చెప్పినా గుడ్డిగా వినకూడదు. నీ మనసు ఏం చెప్తుందో తెల్సుకుని దాని మాట విని నడచుకోవాలి”, అని సలహా ఇస్తుంది.

హోమర్ కి జ్ఞానోదయం అవుతుంది. వెంటనే సైన్స్ లో దిట్ట అయిన క్వెంటిన్ వద్దకి వెళ్తాడు. ఈ మధ్యన తను సొంతంగా చదువుకుని అర్థం చేసుకున్న రాకెట్ కి సంబంధించిన విషయాల గురించి క్వెంటిన్ తో చెప్తాడు.

ఇద్దరూ కలిసి వాళు పోగొట్టుకున్న రాకెట్ ఎక్కడ పడి ఉంటుందో శాస్త్రపరంగా లెక్కలు వేస్తారు.

ఆ లెక్క ప్రకారం మర్నాడు తమ ‘లాంచ్ పాడ్’ కి చుట్టుపక్కల అడవుల్లో గాలిస్తారు. సరిగ్గా వాళ్లు అంచనా వేసిన చోటే రాకెట్ పడి వుండడం తెలిసి సంబరపడతారు. అంటే అగ్ని ప్రమాదం వాళ్ల రాకెట్ వల్ల జరగలేదన్నమాట. వాళ్ళు నిరపరాధులు అన్నమాట.

వాళ్ళ నిరపరాధాన్ని నిరూపించుకోడానికి వెంటనే వాళ్ళ బడికి వెళ్తారు. మిస్ రైలీ క్లాసులోకి నలుగురినీ ఆహ్వానిస్తుంది. హోమర్ క్లాసులో తను, క్వెంటిన్ రాకెట్ ఎక్కడ పడిందో ఎలా లెక్కించిందీ వివరిస్తుంటే క్లాసులో పిల్లలంతా నోరెళ్లబెట్టుకుని చూస్తుంటారు. ఇంతలో ప్రిన్సిపాల్ కోపంగా క్లాసులోకి వస్తాడు. మిస్ రైలీ అడ్డుపడుతుంది. ఏం జరిగిందీ ప్రిన్సిపాలుకి ఏకరువు పెడుతుంది.

ఇంతలో పోలీసుల నుండి కూడా కొంత సమాచారం దొరుకుతుంది. అగ్ని ప్రమాదానికి కారణం ఆ పక్కనే ఉన్న ఓ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి ఎగిరి వచ్చిన ఓ aeronautical flare అని పోలీస్ వివరిస్తాడు.

దాంతో పిల్లల మీద నమ్మకం కుదిరిన ప్రిన్సిపాలు సైన్స్ పోటీ లో వాళ్ళు పాల్గొనడానికి ఒప్పుకుంటాడు.

ముందు జిల్లా పోటీలో గెలుస్తారు. ఇక జాతీయ పోటీకి వెళ్ళాలి.

నలుగురిలో ఒక్కరే వెళ్లే వీలు ఉండడంతో అందరూ హోమర్ ని పంపిస్తారు.

మొదటి రోజు బాగా గడుస్తుంది. హోమర్ ఇచ్చిన ప్రెజెంటేషన్ అందరినీ మెప్పిస్తుంది. వీళ్ల బృందానికి మొదటి బహుమతి ఖాయం అని జనం అనుకుంటుంటారు. కాని ఆ రాత్రి ప్రదర్శన శాలలో హోమర్ ప్రాజెక్ట్ సామగ్రిని ఎవరో దొంగలిస్తారు.

వెంటనే కోల్ వుడ్ కి ఫోన్ చేసి వార్త చెప్తాడు. కొడుక్కి ఈ పరిస్థితిలో ఎలాగైనా సహాయం చెయ్యాలని హోమర్ తల్లి తన భర్తకి గట్టిగా చెప్తుంది. భర్త ఒప్పుకుని తన ఫాక్టరీ లో కార్మికులని పురమాయించి ప్రాజెట్ నమూనాలు తయారు చెయ్యించి, మనిషిని ఇచ్చి సకాలంలో పంపుతాడు.

హోమర్ బృందానికి బంగారు పతకం దొరుకుతుంది.

విశ్వవిద్యాలయాల ప్రతినిధులు స్కాలర్షిప్ లు ఇవ్వడానికి ముందుకొస్తారు. ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వాడు ఎవరో కాదు – వెర్నర్ ఫాన్ బ్రౌన్ ! ఆయన స్వయంగా వచ్చి హోమర్ కి అభినందనలు చెప్తాడు.

- - -

విజయుడై ఊరికి తిరిగొచ్చిన హోమర్ కి ఊరంతా ఘన స్వాగతం పలుకుతుంది.

రాకెట్ కుర్రాళ్లు మరొక్క సారి లాంచి ఏర్పాట్లు చేస్తారు.

ఊళ్ళో తమకి సహాపడ్డ వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్తూ, వారందరికీ ఈ లాంచ్ అంకితం అని ప్రకటిస్తూ స్విచ్ నొక్కబోతుండగా ఎప్పుడూ లాంచ్ లకి రాని హోమర్ తండ్రి రంగప్రవేశం చేస్తాడు.

హోమర్ అభ్యర్థన మీదట తండ్రే స్విచ్ ఆన్ చేస్తాడు.

నిప్పులు చిమ్ముకుంటూ, మబ్బులు దాటుకుంటూ, నింగి అంచులు తాకాలని ఉబలాటపడుతూ ఆ రాకెట్ నిటారుగా పైకి దూసుకుపోతుంది. (ఈసారి అది ఎంత ఎత్తుకు పోతుందో ఓ పక్కన నించుని క్వెంటిన్ లెక్కలు వేసేస్తుంటాడు.)

రాకెట్ గమనాన్ని ఆశ్చర్యంగా చూసిన హోమర్ తండ్రి ఓ సారి అంతే ఆశ్చర్యంగా తన కొడుకు వైపు ఓ సారి గర్వంగా చూసుకుంటాడు.

అల్లంత దూరంలో ఊళ్ళో ఆసుపత్రిలో ఉన్న మైస్ రైలీ ఆకాశంలో కనిపించిన వెండిగీతను చూసుకుని మురిసిపోతుంది.

ఆ విధంగా ఓ చక్కని సైన్స్ ప్రాజెక్ట్ ఓ పేరు లేని కుగ్రామాన్ని సమూలంగా, శాశ్వతంగా మార్చేస్తుంది.

(సమాప్తం)

































విజయవంతం అయిన రాకెట్ లాంచ్

Posted by V Srinivasa Chakravarthy Thursday, August 23, 2012 0 comments


కాని ఈ సారి రాకెట్ దారి తప్పకుండా సూటిగా బాణంలా నింగి లోకి దూసుకుపోతుంది.

హోమర్ నేస్తాల సంతోషానికి హద్దుల్లేవు.

రాకెట్ లాంచ్ విజయవంతం అయిన వార్త ఊరంతా పొక్కుతుంది. ఆ వార్త బళ్లో కూడా సంచలనం సృష్టిస్తుంది.

ఒక్కసారిగా సైన్స్ ఫెయిర్ లో నెగ్గే అవకాశాలు పెరుగుతాయి. వాళ్ల సైన్స్ టీచరు మిస్ రైలీ బాగా ప్రోత్సహిస్తుంది. ‘ఎట్టి పరిస్థితుల్లో పోటీ చెయ్యడం మాత్రం మానుకోకండి. మీరు జాతీయ స్థాయిలో విజయం సాధిస్తే మీ జూనియర్లతో మీ గురించి గొప్పగా చెప్పుకుంటాను’ అంటుంది.



పిల్లలు నలుగురూ సైన్స్ పోటీకి సన్నాహాలు మొదలుపెడతారు.



ఆ రోజు హోమర్ పుట్టినరోజు. హోమర్ అమ్మ ఆ రోజు తను స్వయంగా కుట్టిన స్వెటర్ ఒకటి కొడుక్కి బహుమతిగా ఇస్తుంది. అంతకన్నా అపురూపమైన మరో బహుమతి కూడా అందుతుంది. తన లాంచ్ విజయవంతం అయిన సందర్భంలో వెర్నర్ ఫాన్ బ్రౌన్ నుండి అభినందనలు తెలుపుతూ ఉత్తరం వస్తుంది. అందులో ఫాన్ బ్రౌన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలుపుతాడు. హోమర్ సంతోషం ఆకాశాన్నంటుతుంది.

అలాంటి తరుణంలో హోమర్ తండ్రి గదిలోకి వస్తాడు. హోమర్ సైన్స్ పోటీలో పాల్గొంటున్న విషయం గురించి తల్లి తన భర్తతో చెప్తుంది. మొదట్నించీ ఈ రాకెట్ల పొడ గిట్టని తండ్రి వ్యతిరేకంగా మాట్లాడతాడు. తండ్రి కొడుకుల మధ్య మాట మాట పెరుగుతుంది.

హోమర్ కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు.

వెళ్ళి మిస్ రైలీతో తన గోడు చెప్పుకుంటాడు. మిస్ రైలీ పుట్టిన రోజు బహుమానంగా ‘క్షిపణుల భౌతిక శాస్త్రం’ (missile physics) మీద ఓ పెద్ద పుస్తకం ఇస్తుంది. ఇది తను చదువుతున్న తరగతి కన్నా చాలా పై స్థాయికి చెందిన పుస్తకం అని, కాని ముందు ముందు ఈ స్థాయిలో పరిజ్ఞానం అవసరం అని చెప్తుంది.



మిస్ రైలీ ఈ నలుగురు పిల్లలని ప్రోత్సహిస్తున్న తీరు ఆ బడి హెడ్ మాస్టరు కి నచ్చదు.

‘ఎవడో నూటికొకడికి ఫుట్ బాల్ స్కాలర్షిప్ వస్తుంది. ఆ అదృష్టవంతుడు పై చదువులకి పొరుగూరికి వెళ్తాడు. తక్కిన వాళ్లందరి బతుకులు బొగ్గు గని లోనే తెల్లారబోతాయి.’ ఇదీ హెడ్ మాస్టరు సిద్ధాంతం. కనుక ‘పిల్లల మనసులో అనవసరమైన ఆశలు కలిగించొద్దు’ అని మిస్ రైలీ ని మందలిస్తాడు. మిస్ రైలీ వ్యతిరేకిస్తుంది. ‘వాళ్ళు ఈ మురికి కూపం లోంచి బయటపడడానికి ఓ టీచరుగా ఏదో ఒకటి చెయ్యకపోతే అసలు నాకు పిచ్చెక్కేలా వుంది’ అంటుంది.



ఇలా ఉండగా హోమర్ ఇంట్లో పరిస్థితులు మారతాయి. హోమర్ అన్న జిమ్ కి ఫుట్ బాల్ స్కాలర్షిప్ రాగా, పై చదువులకి పొరుగూరు వెళ్తాడు.



ఇలా ఉండగా హోమర్ నేస్తాలు మరో లాంచ్ కి సిద్ధం అవుతారు. ఈ సారి రాకెట్ విఫలం కాదన్న నమ్మకంతో ఊళ్లో వారిని లాంచ్ కి ఆహ్వానిస్తారు. హోమర్ తన తండ్రిని లాంచ్ రమ్మని పిలుస్తాడు.

‘తీరికలేదు …’ అని నసుగుతాడు తండ్రి.

‘అదే అన్నయ్య ఫుట్ బాల్ ఆడితే చూడడానికి తీరిక ఉంటుందేం?’ అంటూ నిష్టూరంగా మాట్లాడి వెళ్ళిపోతాడు హోమర్.

ఇంతలో గనిలో ఏదో ప్రమాదం జరిగిందని ఫోన్ వస్తే ఆదరాబాదరాగా వెళ్లిపోతాడు హోమర్ తండ్రి.

లాంచ్ చాలా ఘనంగా జరుగుతుంది. ఊరు ఊరంతా కదిలి వస్తుంది లాంచ్ ని చూడడానికి. కుర్రాళ్ల ప్రతిష్ట పెరిగిపోతుంది. ఆడపిల్లలు అభిమానులు అవుతారు! రాకెట్ ఎదురులేకుండా నీలాకాశంలోకి దూసుకుపోతుంది.

ఆ సంఘటన గురించి రాయడానికి ఓ స్థానిక పత్రికా విలేఖరి కూడా వస్తాడు.

మర్నాడు ఆ ముచ్చట అంతా దినపత్రికలో వస్తుంది. హోమర్ తరగతిలో ఓ చక్కని చుక్క ఆ దినపత్రిక ప్రతి ఒకటి తెచ్చి హోమర్ ని దాని మీద ఆటోగ్రాఫ్ చెయ్యమంటుంది.

ఇంతలో బళ్లోకి ఒక్కసారిగా కొంతమంది పోలీసులు ప్రత్యక్షమవుతారు. ‘ఇక్కడ హోమర్ అంటే ఎవరు?’ గద్దిస్తాడు పోలీస్ ఆఫీసర్.

హోమర్ కి, అతడి స్నేహితులకి బేడీలు వేసి బర బర లాక్కుపోతారు పోలీసులు.

(ఇంకా వుంది)

Image credits: http://www.mercury-rockets.com/Model_Rocket_Gallery.html

అర్థాంతరంగా ఆగిన చీకటి బాట

Posted by V Srinivasa Chakravarthy Tuesday, August 21, 2012 0 comments


ఇదేదో బొగ్గు గనిలా వుంది.



“ఇదేదో బొగ్గు గని!” అరిచాను.

“నిర్మానుష్యమైన బొగ్గు గని,” అన్నాడు మామయ్య.

“ఎవరూ లేరని ఎలా తెలుసు?” అన్నాను.

“నాకు తెలుసు,” అన్నాడు మామయ్య ధృవంగా. బొగ్గు స్తరాలని దొలుస్తూ పోతున్న ఈ సొరంగం మానవనిర్మితం కాదని నాకు నిశ్చయంగా తెలుసు. దీన్ని చేసింది మానవ హస్తమైనా, ప్రకృతి హస్తమైనా ఇప్పుడది మనకి అంత ముఖ్యం కాదు. భోజనం వేళ అయ్యింది. రా భోజనం చేద్దాం.”

హన్స్ భోజనం తయారు చేశాడు. నాకు పెద్దగా ఆకలి వెయ్యలేదు. నా వంతుగా అందిన కాసిని నీటి బొట్లతో గొంతు తడుపుకున్నాను. సగం నిండిన ఫ్లాస్క్ తో ముగ్గురు మనుషుల దాహం తీరాల్సి వుంది.

భోజనం పూర్తి కాగానే మా ఇద్దరు నేస్తాలు రగ్గులు కప్పుకుని హాయిగా ఆదమరచి నిద్రపోయారు. బాగా అలసిపోయినట్టున్నారు. నాకు నిద్రపట్టలేదు. ఉదయం వరకు ఒక్కొక్క గంట లెక్కెడుతూ ఉండిపోయాను.



మర్నాడు శనివారం తెల్లారే ఆరు గంటలకే బయల్దేరాం. ఇరవై నిముషాలు నడవగానే ఓ విశాలమైన ప్రదేశం లోకి ప్రవేశించాం. ఈ గని తవ్వింది మనిషి కాదని తెలుస్తోంది. ఇంత లోతులో చూరు కూలిపోకుండా ఎత్తిపట్టడం అంత సులభం కాదు. ఏదో అద్భుత హస్తం ఎత్తి పట్టుకున్నట్టు మా నెత్తిన చూరు నిలిచింది.

మేం ఉన్న గుహలాంటి ప్రాంతం యొక్క వెడల్పు నూరు అడుగులు, ఎత్తు నూట యాభై అడుగులు ఉంటుందేమో. భూగర్భంలో పుట్టిన ఏదో సంక్షోభం వల్ల బ్రహ్మాండమైన శిలా పదార్థం పెల్లగించబడినట్టు వుంది. అడుగు నుండి తన్నుకొచ్చిన ఏదో శక్తి వల్ల ఓ పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గోతిలోకి మొట్టమొదటి సారిగా ముగ్గురు మానవమాత్రులు రంగప్రవేశం చేస్తున్నారు.

ఈ కళావిహీనమైన చీకటి గోడల మీద కార్బనీఫెరస్ కాలానికి చెందిన చరిత్ర మొత్తం విపులంగా చెక్కినట్టు కనిపిస్తోంది. ఆ కాలానికి చెందిన వివిధ దశలన్నిటినీ భౌగోళిక శాస్త్రవేత్త ఇక్కడ గుర్తించిగలిగి వుండేవాడేమో. బొగ్గు పొరలకి మధ్య ఇసుక రాతి స్తరాలు, సంఘటితమైన బంకమట్టి పొరలు కనిపిస్తున్నాయి. పైనున్న పొరల భారానికి ఈ స్తరాలు నలిగిపోతున్నట్టు ఉన్నాయి.

భూమి మీద రెండవ దశకి కొంచెం ముందు ఉన్న పరిస్థితులలో సువిస్తారమైన జీవ సంపద ఉండేది. వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ అధికంగా ఉండడం అలాంటి జీవన వృద్ధికి దొహదం చేసింది. వాయుమండలం అంతా ఆవిరిమయం కావడంతో వాతావరణంలోకి సూర్య కిరణాల ప్రవేశం కష్టం అయ్యేది.



మరి సూర్యకిరణాల చొరబడక పోతే వాతావరణం ఎలా వేడెక్కినట్టు? అంటే ఆ వేడి అంతా సూర్యుడు కాని మరేదో ఉష్ణమూలం నుండి వచ్చి ఉంటుంది అనుకోవాలి. ఆ వేడికి వాతావరణం నిరంతరం అట్టుడికినట్టు ఉడికిపోతూ ఉండేదేమో. ఇక పగలు, రాత్రి అనే చక్రిక పరిణామానికి పెద్దగా ప్రాముఖ్యత ఉండేది కాదేమో. ఋతువులు కూడా లేకపొవచ్చు. ధ్రువాల నుండి భూమధ్య రేఖ వరకు సమంగా విస్తరించిన ఒక విధమైన ఉష్ణమయమైన వాతావరణం. ధరావ్యాప్తమైన తీవ్ర తాపం. మరి ఆ వేడి అంతా ఎక్కణ్ణుంచి వచ్చినట్టు? భూగర్భం లోంచా?

ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ సిద్ధాంతాలని పక్కన బెడితే, ఆ కాలంలో పుడమి గుండెల్లో ఓ మహోగ్ర తాపం దాగి వుండేది. భూమి పైపొరలలో ఆఖరు పొర వరకు ఆ తాపపు ప్రతాపం యొక్క ఆనవాళ్లు కనిపిస్తూ ఉండేవి. సూర్య రశ్మి నుండి శక్తిని తీసుకునే ఒడుపు తెలీని ఆ కాలపు మొక్కలు పూల, పరిమళాల సౌభాగ్యానికి నోచుకోలేదు. కాని వాటి వేళ్లు మాత్రం కాలే నేలలోకి లోతుగా చొచ్చుకుపోయి, అక్కడి నుండి శక్తిని జుర్రుకునే కౌశలాన్ని అలవరచుకున్నాయి.



ఆ కాలంలో చెట్లు ఇంచుమించు లేవనే చెప్పాలి. పత్రయుత మొక్కలే* ఉండేవి. రకరకాల గడ్డి ఏపుగా పెరిగేది. ప్రస్తుతం వినష్టమైన, అరుదుగా కనిపించే ఎన్నో చిట్టి పొట్టి మొక్కల జాతులు ఆ కాలంలో పుష్కలంగా పెరిగేవి.

(*పత్రయుత మొక్కలు (herbaceous plants): చెప్పుకోదగ్గ కాండం లేకుండా నేలబారుగా పెరిగే మొక్కలు. బంగాళదుంప, కారట్ మొదలైనవి ఈ కోవకి చెందిన మొక్కలే.)

ఆ కాలంలో ఉండే అపారమైన వృక్షసంపదే ఇప్పుడు మా చుట్టూ కనిపించే బొగ్గుకి మూలం. అయితే భూమి యొక్క పైపొర భూగర్భంలో ఉండే ద్రవ్యశక్తుల ప్రభావానికి లొంగిపోయింది. ఆ విధంగా ఏర్పడ్డవే ఈ చీలికలు, అగాధాలు. నీటి అడుక్కి మునిగిపోయిన మొక్కల అవశేషాలు అంచలంచెలుగా అపారమైన జీవపదార్థ రాశిగా ఏర్పడ్డాయి.



తదనంతరం ప్రకృతి యొక్క రసాయన చర్యలు ఆరంభం అయ్యాయి. సముద్రపు అట్టడుగున పోగైన వృక్షపదార్థం అంతా ముందు పీట్ బొగ్గుగా మారింది. అలా ఏర్పడ్డ వాయువుల వల్ల, ఆ వాయువల చర్యల నుండి పుట్టిన ఉష్ణం వల్ల, ఆ పదార్థం కుళ్లి, తగు చర్యల వల్ల ఖనిజరూపాన్ని దాల్చింది.



ఆ విధంగా భూగర్భంలో ఈ బృహత్తరమైన బొగ్గు క్షేత్రాలు ఏర్పడ్డాయి. అయితే ఈ గనులు కూడా అక్షయమేమీ కాదు. ఈ వనరులని మనం ప్రస్తుతం వినియోగించే వేగంలో వినియోగిస్తూ పోతే, పారిశ్రామిక ప్రపంచం ఏవైనా కొత్త శక్తి వనరులని కనుక్కుంటే తప్ప, మరో మూడు శతాబ్దాలలో ఈ ఇంధనం అంతా హరించుకుపోతుంది. (*)

(*ఈ పుస్తకం 1864 లో వెలువడింది అన్న సంగతి గమనించాలి. - అనువాదకుడు)

భూమిలో ఈ ప్రాంతాలలో నిక్షిప్తమై వున్న ఖనిజ సంపద గురించి ఆలోచిస్తూంటే ఈ ఆలోచనలన్నీ నా మనసులో మెదిలాయి. ఇంత లోతుల్లో ఉండే గనులని మనుషులు ఎప్పటికీ కనుక్కోలేరని అనుకుంటాను. ఇంత లోతు నుండి బొగ్గు పైకి తీయడానికి చెప్పలేనంత ఖర్చు అవుతుంది. అయినా భూమి ఉపరితలానికి దగ్గరిగా అంత సులభంగా బొగ్గు దొరుకుతున్నప్పుడు ఇంత లోతు నుండి బొగ్గు తియ్యాల్సిన అవసరం ఏవుంది?



అలాగే మేం నడుస్తూ ముందుకు సాగిపోయాం. చుట్టూ కనిపించే భౌగోళిక విశేషాలు చూస్తూ మైమరచి పోవడం చేత నాకు ఎంత దూరం వచ్చామో కచ్చితంగా తెలియకుండా వుంది. ఇందాక లావా ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎంతుందో ఇక్కడ కూడా అంతే వుంది. అంతలో ఉన్నట్టుండి ఏవో హైడ్రోకార్బన్ వాయువుల వాసనకి నా ముక్కుపుటాలు అదిరాయి.

ఈ వాయువు ఓ ప్రమాదకరమైన వాయువు అని త్వరలోనే అర్థమయ్యింది. గనులలో పని చేసేవారు దీన్ని minedamp అంటారు. ఈ వాయువు వల్ల గనుల్లో అగ్నిప్రమాదాలు, విస్ఫోటాలు సంభవిస్తుంటాయి.



అదృష్టవశాత్తు మేం వాడుతున్న దీపం మామూలు నూనె దీపం కాదు. ఇది రమ్ కోర్ఫ్ రూపొందించిన అద్భుతమైన దీపం. అలా కాకుండా మేం గాని దివిటీలతో వచ్చి వుంటే ఇక ఇంతే సంగతులు!



బొగ్గు గని ద్వారా మా ప్రయాణం రాత్రి వరకు సాగింది. మా బాట నేలకి సమాంతరంగా ఉండడం మామయ్యకి ససేమిరా నచ్చలేదు. మా ఎదుట ఏముందో ఇరవై గజాలకి మించి కనిపించదు. కనుక అసలు ఈ సొరంగ మార్గం ఎంత పొడవు ఉందో అంచనా వెయ్యడం కష్టమయ్యింది. ఈ దారికి అంతే లేదేమో అనుకున్నాను ఒక తరుణంలో. అంతలో సరిగ్గా ఆరు గంటలకి ఓ గోడ మా దారికి అడ్డుగా నిలిచింది. ఇక కుడి, ఎడమ పక్కలకి గాని, పైకి గాని, కిందకి గాని దారి లేదు.

“చివరి దాకా వచ్చేశాం అన్నమాట,” మామయ్య అన్నాడు తాపీగా. “ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సాక్నుస్సేం సూచించిన మార్గం ఇది కాదు. కనుక వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే. ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు పొద్దున్నే మళ్లీ బయల్దేరుదాం. మూడు రోజులు ప్రయాణిస్తే మళ్లీ దారి రెండుగా చీలిన చోటికి చేరుకుంటాం.”

“అవును నిజమే. రేపు ఉదయానికి ఒంట్లో ఏవైనా ఓపిక మిగిలి వుంటే,” కాస్త వ్యంగ్యంగా అన్నాను.

“ఏం? ఓపిక కేమయ్యింది పాపం?” మామయ్య కాస్త చిరాగ్గా అన్నాడు.

“ఎందుకంటే రేపటికి ఇక నీరు ఒక బొట్టు కూడా మిగలదు కనుక.”

“నీరు లేకపోతేనేం, ధైర్యం ఉంటే చాలదూ?” మామయ్య కటువుగా అన్నాడు.

ఆయనకి సమాధానం చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు.

(ఇరవయ్యవ అధ్యాయం సమాప్తం)

http://www.mammothgardens.com/inksters/2008-11-Nov/November08.html
















ఈ సారి మేలు జాతి స్టీలుతో చేసిన వాషర్ తో రాకెట్ తయారు చేసి లాంచ్ చేస్తారు.


దురదృష్టవశాత్తు ఈ సారి కూడా రాకెట్ దిక్కు తెన్ను లేకుండా ఎగిరి అర్థాంతరంగా పేలిపోతుంది.

ఈ సారి రాకెట్ నిర్మాణంలో మరో దోషాన్ని గుర్తిస్తాడు బోల్డెన్.

ఇంధనం మండినప్పుడు పుట్టే వేడి వాయువులు బయటికి వచ్చే సన్నని రంధ్రాన్ని నాజిల్ (nozzle) అంటారు. ఈ నాజిల్ ఇంతవరకు చేసిన రాకెట్లలో ఈ కింది చిత్రంలో (A) చూపించినట్టు ఉంటుంది. రాకెట్ లోపలి భాగం యొక్క వ్యాసం అర్థాంతరంగా నాజిల్ వద్ద సన్నబడుతుంది. అలా కాకుండా క్రమంగా సన్నబడాలని సూచిస్తాడు బోల్డెన్. దాన్నే tapered bore అంటారు (చిత్రం B). ఈ tapered bore గల నాజిల్ నే ‘ద లవాల్ నాజిల్’ (de Laval nozzle) అంటారు.


ఈ రకమైన మార్పులన్నీ చేసి మళ్లీ రాకెట్ తయారు చేస్తారు రాకెట్ కుర్రాళ్లు.

ఈ కొత్త రాకెట్ పేరు Auk-V.

రాకెట్ల పేరు మారినా తీరు మారలేదు. పెటేలుమని పేలిపోయే వాటి ధోరణి మారలేదు.

ఎన్ని వైఫల్యాలు జరిగినా నిరుత్సాహ పడకుండా మన రాకెట్ విక్రమార్కులు దోషం ఎక్కడుందో అర్థం చేసుకుంటూ, రాకెట్ రూపకల్పనని క్రమంగా సరిదిద్దుకుంటూ ఇంకా ఇంకా మేలైన రాకెట్లు రూపొందించుకుంటూ ముందుకు పోతారు.

ఇన్ని సరిదిద్దినా దోషం ఎక్కడుందబ్బా అని ఆలోచనలో పడతారు.



బహుశ రాకెట్ ఘనపరిమాణం మరీ తక్కువ కావడం వల్ల లోపల ఒత్తిడి పెరిగి పేలిపోతోందేమో. కనుక ఘనపరిమాణం పెంచడానికి గాను రాకెట్ పొడవు పెంచుతారు.

అయినా లాభం లేదు. మళ్లీ పేలిపోతుంది.

ఈ సారి క్వెంటిన్ ఓ దోషం గుర్తిస్తాడు. ఇంతవరకు తాము వాడిన ఇంధనం ‘పొడి ఇంధనం’ (solid propellant). పొడి ఇంధనం తో వచ్చిన చిక్కేంటంటే పదార్థంలో అక్కడక్కడ గాలిబుడగలు చిక్కుకుపోవచ్చు. మండుతున్న ఇంధనం ఈ గాలిబుడగని తాకగానే గాలి ఒక్కసారిగ విపరీతంగా వ్యాకోచించడం వల్ల విస్ఫోటం సంభవించవచ్చు. కనుక ఇంధనం ద్రవ రూపంలో ఉంటే మేలు.

అంటే ఇంధనానికి సరైన ద్రవాన్ని కలపాలి. అది మండే లక్షణం కలిగి ఉండాలి. పొడి ఇంధనంతో కలయిక వల్ల అది ముద్దగా, ఓ చూర్ణంలా తయారవ్వాలి. రాయ్ లీ పెట్రోల్ కలుపుదాం అంటాడు. మరింత స్థిరంగా ఉంటుందని హోమర్ ఆల్కహాల్ కలుపుదాం అంటాడు. అందరూ ఆల్కహాల్ కే ఒప్పుకుంటారు. ఇప్పుడు కల్తీలేని ఆల్కహాల్ సంపాదించాలి. ఎక్కడ దొరుకుతుందబ్బా అని హోమర్ ఆలోచనలో పడతాడు.

‘అదెంత పని?’ అన్నట్టుగా రాయ్ లీ చిరునవ్వు నవ్వుతాడు. రాయ్ లీ పెంపుడు తండ్రి తాగుబోతు. వాళ్ల ఇంట్లో కల్తీలేని ఆల్కహాల్ కేమీ కొదవ లేదు.

ఎలాగోలో ఆల్కహాల్ ని సంపాదించి, ద్రవ రూపంలో ఇంధనం తయారు చేస్తారు.

ఇప్పటికి రాకెట్ రూపకల్పనలో ఉన్న దోషాలన్నీ చక్కదిద్దబడినట్టే. ఈ సారి రాకెట్ పని చేస్తుందని నలుగురికీ నమ్మకం కుదురుతుంది.

మళ్లీ రాకెట్ తయారు చేసి లాంచ్ కి సిద్ధం అవుతారు.

ఈ సారి అనుకోకుండా లాంచ్ చూడడానికి కొంత మంది గ్రామస్థులు వస్తారు. హోమర్ అన్న జిమ్ కి హోమర్ తన నేస్తాలతో చేస్తున్న ప్రయోగాల మీద పెద్దగా నమ్మకం లేదు. చోద్యం చూడడానికి అన్నట్టు కొంత మంది గ్రామస్థులని వెనకేసుకుని లాంచ్ చూడడానికి వస్తాడు. విఫలమైన లాంచ్ కారణంగా అందరి ముందు హోమర్ పరువు పోతుందని అనుకుంటాడు.

(ఇంకా వుంది)

రాకెట్ నిర్మాణంలో రైలు పట్టాలు

Posted by V Srinivasa Chakravarthy Thursday, August 16, 2012 0 comments

కొత్తగా నిర్మించిన లాంచ్ పాడ్ కి Cape Coalwood అని పేరు పెట్టుకుంటారు ‘రాకెట్ కుర్రాళ్లు.’


ఈ సారి ఇంధనంగా ఓ కొత్త మిశ్రమాన్ని వాడాలని అనుకుంటారు. పొటాషియమ్ క్లోరైడ్ ని పంచదారతో కలిపి వేడి చేస్తే మరింత శక్తిని వెలువరిస్తుందని క్వెంటిన్ ఎక్కడో కనుక్కుని హోమర్ తో చెప్తాడు.

ఇక రాకెట్ గొట్టానికి అడుగున వాషర్ ని వెల్డ్ చెయ్యాల్సి ఉంది. ఎప్పట్లాగే బైకోవ్స్కీ సహాయం అడుగుదాం అని వెళ్తారు. అయితే అంతలో ఒక ఎదురుదెబ్బ తగులుతుంది. వర్క్ షాప్ లో పని చేసే బైకోవ్స్కీ గనిలో పనికి మారిపోయాడని తెలుస్తుంది. హోమర్ తండ్రి కావాలనే అతణ్ణి బదిలీ చేశాడని అనుకుంటారు. కాని తీరా బైకోవ్స్కీ ని అడిగితే అలాంటిదేం లేదని, జీతం ఎక్కువ అని తనే కావాలని గనిలో పని వేయించుకున్నానని చెప్తాడు. ఇప్పుడిక వెల్డింగ్ లో సహాయపడలేనని కూడా చెప్తాడు. పోనీ తనకి వెల్డింగ్ నేర్పిస్తే ఇక ముందు ముందు తన సహాయం అవసరం ఉండదని అంటాడు హోమర్. అలాగే బైకోవ్స్కీ వద్ద కొంత వెల్డింగ్ నేర్చుకుని వాషర్ ని వెల్డ్ చేస్తారు.

ఇక రెండవ లాంచ్ కి రంగం సిద్ధం అయ్యింది. ఈ రాకెట్ కి Auk-II అని పేరు పెట్టారు.

ఈ సారి లాంచ్ చూడడానికి బోల్డెన్ అనే వ్యక్తి వస్తాడు. ఇతడు కూడా వర్క్ షాప్ లో పని చేస్తాడు.

అల్లంత దూరంలో బోల్డెన్ నించుని లాంచ్ చూస్తుంటాడు. దూరం నుండే ఓ తీగ ద్వారా వత్తి వెలిగించి కుర్రాళ్లు రాకెట్ ని గమనిస్తుంటారు. ముందు జయ్c మని అంతెత్తు లేస్తుంది కాని అంతలో పక్కకి తిరిగి ప్రేక్షకుల మీద దండెత్తుతుంది. కుర్రాళ్ళని విడిచిపెట్టి కొత్తగా వచ్చిన బోల్డెన్ దిశగా దూసుకొస్తుంటుంది. దాంతో హడలెత్తిన బోల్డెన్ పక్కకి గెంతి ప్రాణం కాపాడుకుంటాడు. రాకెట్ అల్లంత దూరంలో ఓ గుట్ట లోకి దూసుకుపోయి పెద్ద చప్పుడుతో పేలిపోతుంది.

అంతవరకు ఓ పెద్ద బండ వెనుక దాక్కున్న కుర్రాళ్లు నలుగురూ గుండెలు అరచేతిలో పట్టుకుని బయటికి వస్తారు. బోల్డెన్ కూడా దుమ్ము దులుపుకుని పైకి లేస్తాడు.

మృత్యు దేవతలా మీదికి దూసుకొస్తున్న ఆ రాకెట్ ని చూస్తుంటే రెండవ ప్రపంచ యుద్ధం నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అంటాడు. ఈ బోల్డెన్ ఆఫ్రికన్ – అమెరికన్ జాతికి చెందిన వాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా వాయు సేనలో ‘రెడ్ టెయిల్స్’ (Red Tails) అని పూర్తిగా ఆఫ్రికన్ – అమెరికన్ జాతికి చెందిన పైలట్లతో కూడుకున్న వైమానిక దళం ఒకటి వుండేది. బోల్డెన్ కి అందులో పైలట్ గా పని చేసిన అనుభవం వుంది.

అల్లంత దూరంలో మట్టిలో కూరుకుపోయి పొగలు కక్కుతున్న రాకెట్ ని పైకి తీసి చూస్తారు కుర్రాళ్లు నలుగురూ. దాని తీరుతెన్నులు చూసిన బోల్డెన్ కి సమస్య ఎక్కడుందో అర్థమవుతుంది.

ఇంధనం వేడికి కింద వెల్డ్ చేసిన వాషర్ బాగా కరిగిపోయింది. దాంతో జ్వాల సన్నని ధారగా రావడం మానేయడం వల్ల రాకెట్ దారితెన్ను లేకుండా కదులుతుంది.

జ్వాలకి అడ్డుగా వాషర్ ఉంటుంది కనుక అది బాగా వేడిని తట్టుకునే పదార్థం అయ్యుండాలి. అంటే మరింత మేలు జాతి స్టీలు వాడాలి. SAE 10-20 గ్రేడు స్టీలు తెమ్మంటాడు బోల్డెన్. (Society for Automotive Engineers (SAE) అనేది స్టీలు నాణ్యత యొక్క కొలమానాన్ని నిర్దేశించే ఓ సదస్సు.)

ఇప్పుడు ఈ రకం స్టీలు ఎక్కణ్ణుంచి తేవాలి? వాకబు చేస్తే రైలు పట్టాల్లో సరిగ్గా ఆరకమైన స్టీలే వాడతారని తెలుస్తుంది.

ఇకనేం? ఇరుగు పొరుగు ప్రాంతాలలో రైలు పట్టాల వేటలో పడతారు ఆ నలుగురూ!



బొగ్గు గని నుండి పైకి తీసిని బొగ్గుని దూర ప్రాంతాలకి సామాన్యంగా రైళ్ళలో రవాణా చేస్తారు. గనిలో ఒక భాగంలో పని పూర్తయినప్పుడు, ఆ భాగాన్ని పూడ్చేసి, అల్లంత దూరంలో మరో చోట తవ్వకం మొదలెడతారు. కనుక మొదటి భాగం నుండి బొగ్గు తీసుకుపోయే రైలు పట్టాలు నిరుపయోగంగా పడి వుంటాయి. అలా నిరుపయోగంగా ఉన్న రైలు పట్టాలు ఎక్కడున్నాయో కనుక్కుని కుర్రాళ్ళు అక్కడ ‘పని’ మొదలెడతారు. కష్టపడి రెండు పట్టాలని ఊడపీకి తాళ్లతో కట్టి పక్కకి ఈడుస్తారు. అంతలో అల్లంత దూరంలో ఓ రైలు కూత వినిపిస్తుంది. నలుగురికీ గుండె గుభేలు మంటుంది.



ఆదరాబాదరాగా పట్టాలు తిరిగి ముందు ఉన్నట్టు పెట్టబోతారు. కాని కొద్ది క్షణాలలో ఆ రైలు ఈ దారి వెంట రాబోతోంది. ఇక పరుగెత్తి రైలు ఆపడం తప్ప వేరే మార్గం లేదు. నలుగురూ చేతులు ఊపుతూ, అరుచుకుంటూ రైలు కూత వచ్చిన దారిన పరుగు అందుకుంటారు. అల్లంత దూరంలో పొగలు కక్కుతూ ఇంజిను కనిపిస్తుంది. ఇంకొంతలో వీళ్లని సమీపిస్తుందని అనుకుంటుండగా ఆ రైలు మరో రూట్ లో ఎటో వెళ్ళిపోతుంది. నలుగురూ ఓ సారి నిట్టూర్చి నీరసంగా ఆ పట్టాల మీదే చతికిలబడతారు.

ఈ కొత్తరకం స్టీలుతో చేసిన వాషర్ తో మరో రాకెట్ ని తయారు చేసి లాంచి సిద్ధం చేస్తారు.

(ఇంకా వుంది)























అధ్యాయం 20


ఇక ఇక్కట్లు మొదలయ్యాయి



ఇక ఆహార పదార్థాలను పొదుపు చేసే వ్యవహారం మొదలయ్యింది. మేం తెచ్చుకున్న నీరు కూడా మూడు రోజులకి మించి రాదు. భోజనం వేళ అప్పుడు ఆ సంగతి స్పష్టంగా అర్థమయ్యింది. ఇక ఈ సంక్రమణ భూస్తరాలలో నీటి బుగ్గలు దొరికే అవకాశం కూడా తక్కువని అర్థమయ్యాక విచారం మరీ ఎక్కువయ్యింది.



ఇక మర్నాడు అంతా మా ఎదుట విస్తరించిన సొరంగ మార్గానికి అంతు లేదని అనిపించింది. అందరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నడుస్తూ పోయాం. హన్స్ మౌనం ఓ అంటు వ్యాధిలా మా ఇద్దరికి కూడా సోకింది.



ఇప్పుడు దారి పైకి పోతున్నట్టు అనిపించలేదు. అంటే కచ్చితంగా చెప్పడం కష్టం. కొన్ని సందర్భాలలో వాలు కొద్దిగా కిందికే ఉన్నట్టు అనిపించేది. కాని అది కూడా చెప్పుకోదగ్గ వాలు కాదు. ఈ పరిస్థితి ప్రొఫెసరు కి పెద్దగా నచ్చలేదు. స్తరాలలో పెద్దగా మార్పు లేదు. సంక్రమణ దశకి చెందిన స్తరాల లక్షణాలు ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.



మా విద్యుత్ దీపాల కాంతులు చుట్టూ గోడల లోని సున్నపురాయి, ఎర్రని ఇసుకరాయి, షిస్ట్ రాళ్ల మీద పడి మెరుపులు చిందిస్తున్నాయి. వేల్స్ లోని ఒక ప్రాంతం గుండా పోతున్నామేమో ననిపించింది. ఆ ప్రాంతానికి చెందిన పూర్వీకులు తమ జాతి పేరే ఆ ప్రాంతానికి పెట్టారు. చక్కని పాలరాతి శకలాలు గోడలని అలంకరిస్తున్నాయి. ఒక చోట నెత్తుటి ఎరుపు, మరో చోట సంజె కాంతుల సొంపు ఇలా అనేకవన్నెల కెంపులు మా పరిసరాలకి ఏదో అలౌకిక సౌందర్యాన్ని ఆపాదిస్తున్నాయి.



ఈ శిలలలో ఎన్నో ఏవో ఆదిమ జీవాల పోలికలో ఉన్నాయి. ట్రైలోబైట్ల లాంటి ప్రాథమిక జీవరాశులు కాకుండా మరింత ఉన్నత జాతి జీవాలు కనిపిస్తున్నాయి. కొన్ని గనాయిడ్ చేపలని పోలి వున్నాయి. మరి కొన్ని పురాజీవ శాస్త్రవేత్తలు (paleontologists) కనుక్కున్న ప్రప్రథమ సరీసృపాలలా ఉన్నాయి. పుడమ చరిత్రలో డెవోనియన్ దశలో సముద్రాల నిండా ఈ రకమైన జీవాలే ఉండేవని చెప్తారు. తదనంతరం ఏర్పడ్డ శిలాజాతులలో ఆ జీవాల అవశేషాలు కుప్పలు తెప్పలుగా మిగిలి ఉండాలి.



మానవుడు అగ్రస్థానాన గల జీవపరిణామ సోపాన్ని ఎగబ్రాకుతున్నామని స్పష్టంగా తెలుస్తోంది. కాని ఎందుచేతనో ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ మాత్రం అదేమీ పట్టనట్టు కనిపిస్తున్నాడు.



ఆయన వాలకం చూస్తుంటే రెండు పరిణామాలలో ఒకదాని కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. వాటిలో మొదటిది – ఎదురుగా ఓ నుయ్యో, గొయ్యో కనపడితే, అందరం అందులోకి దూకి నేరుగా పాతాళానికి చేరుకోవడం. ఇక రెండోది – ఎదురుగా ఏదైనా అవరోధం అడ్డుపడితే ఇక దారి లేక ఇంటి దారి పట్టడం. సాయంత్రం అయిపోయింది గాని ఈ రెండు పరిణామాలలో ఏదీ జరగలేదు.

ఆ రాత్రి దాహార్తికి ప్రాణం విలవిలలాడింది. మర్నాడు శుక్రవారం మా చిన్నారి ముఠా మెలికలు తిరిగే చిమ్మ చీకటి సొరంగ మార్గల వెంట ముందుకు సాగిపోయింది.

అలా ఓ పది గంటలు ఏకబిగిన నడిచాక చుట్టూ గోడల నుండి ప్రతిబింబించే కాంతి ఉన్నట్లుండి బాగా సన్నగిల్లడం గుర్తించాను. అంతవరకు మిరుమిట్లు గొలిపిన పాలరాయి, సున్నపు రాయి, ఇసుకరాయికి చెందిన పాషాణ వర్ణాల స్థానంలో కాళ కాంతి లేని నల్లదనం కనిపించింది. ఒక దశలో దారి బాగా ఇరుకు అయ్యింది. భుజాలకి గోడలు తగులుతున్నాయి.

చెయ్యి తీసి చూస్తే చేయి నల్లగా కనిపించింది.

(ఇంకా వుంది)



లాంచ్ పాడ్ నిర్మాణం

Posted by V Srinivasa Chakravarthy Sunday, August 12, 2012 1 comments


కొత్త రాకెట్ కి ‘ఔక్’ (AUK) అని ఓ చిత్రమైన పేరు కూడా పెడతారు. ‘ఔక్’ అంటే పెద్దగా ఎగరలేని ఓ పక్షి పేరు. నలుపు తెలుపు రంగులతో ఇవి చూడడానికి కొంచెం పెంగ్విన్ పక్షుల్లా ఉంటాయి. బాగా ఈదగలవు.


(వికి)
తాము చేసిన రాకెట్ ఆ మాత్రం ఎగిరితే చాలని రాజీ పడినట్టున్నారు కుర్రాళ్లు!



వత్తి అంటించగానే రాకెట్ చివ్వున పైకి లేస్తుంది. కాని సంబరం క్షణకాలమే! పైకి లేచిన రాకెట్ మనసు మార్చుకుని పక్కకి తిరిగి ఊరి మీద విరుచుకు పడుతుంది. మీదకి దూసుకొస్తున్న రాకెట్ ని చూసిన జనం చెంగు చెంగున గెంతి ప్రాణాలు కాపాడుకుంటుంటారు. అలా ఊరంతా జడిపించిన ఆ రాకెట్ చివరికి పోయి పోయి హోమర్ తండ్రి ఆఫీసు కిటికీ అద్దాలని ఛేదించుకుంటూ ఆ తండ్రి పాదాల చెంత వాలుతుంది!



హోమర్ తండ్రి దర్శనం చేసుకోడానికి పాపం ఆ రాకెట్ ఓ దుర్ముహూర్తాన్నే ఎంచుకుంది. ఆ సమయంలో బొగ్గు గనిలో పరిస్థితులు సంకటంగా ఉంటాయి. గని నుండి వచ్చే ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని పై అధికారులు గని మూతవేసే పరిస్థితి వస్తోందని ఆ సమయంలో మిస్టర్ హికమ్ తో చర్చిస్తుంటారు. అలాంటి తరుణంలో ఈ హవాయి చువాయి గదిలోకి దూసుకు రావడం చూసి ఆయనకి చిర్రెత్తుతుంది. పైగా ఆ పని చేసింది స్వయంగా తన పుత్ర రత్నమే అని తెలియగానే అందరి ముందు కొడుకుని దులిపేస్తాడు. తనకి చెప్పకుండా దొంగతనంగా తన ఫాక్టరీలో టెక్నీషియన్ల సహాయం తీసుకుని వెల్డింగ్ చెయ్యించుకున్నందుకు “దొంగ” అని కూడా తిడతాడు. “మళ్లీ కంపెనీ పరిసరాల్లో ఈ ‘చెత్త’ తో కనిపిస్తే ఊరుకునేదే లేదు” అని గట్టిగా మందలిస్తాడు.

జరిగిన అవమానం భరించలేక హోమర్ ఇంటి కెళ్ళి వాళ్ల అమ్మతో ఫిర్యాదు చేస్తాడు. “అందరి ముందు దొంగ అని తిట్టాడమ్మా!” అంటూ శోకాలు పెడతాడు. “అసలైనా ఆ గని ఆయనకి ఏం ఇచ్చిందని? ఊపిరితిత్తుల్లో ఇంత పెద్ద నల్లని మచ్చ తప్ప,” అంటూ నిష్టూరంగా మాట్లాడతాడు. అప్పుడే ఇంట్ళోకి వస్తున్న తండ్రికి ఈ మాటలు విని ఒళ్ళు మండిపోతుంది. పిల్లలు సేకరించిన ‘రాకెట్ సరంజామా’ అంతా తీసి బయటపడేస్తాడు.

ఈ విషయం హోమర్ నేస్తాలకి తెలుస్తుంది. ముగ్గురూ నీరుగారి పోతారు. వీళ్లు రాకెట్ ప్రయోగాలు చేస్తున్నారని తెలియగానే బడిలో చిన్న సంచలనం బయల్దేరుతుంది. ప్రయోగం విజయవంతం అయితే జాతీయ స్థాయిలో ‘science fair’ లో పాల్గొనచ్చని మిస్ రైలీ అని ఓ టీచరు ప్రోత్సహిస్తుంది. ఈవిడకి ఈ పిల్లలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా హోమర్ పెద్దయ్యాక మంచి ప్రయోజకుడు అవుతాడని ఆమెకి గట్టి నమ్మకం. ఈ ఆశలు, అవకాశాలు గంగపాలు అయినందుకు పిల్లలు నలుగురూ డీలా పడిపోతారు.

పల్లెకి దూరంగా అడవిలో ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ నలుగురూ తచ్చాడుతుంటారు. ఇంతలో హోమర్ కి ఓ ఆలోచన వస్తుంది. తన తండ్రి అసలు రాకెట్ తో ప్రయోగాలు చేసుకోమన్లేదు. కంపెనీ పరిసరాలలో చెయ్యొద్దన్నాడు అంతే. కనుక కంపెనీ సరిహద్దుల బయట ఎక్కడైనా మళ్లీ ప్రయోగాలు కొనసాగిద్దాం అంటాడు. తక్కిన ముగ్గురూ ముందు ఒప్పుకోరు. కంపెనీ పరిసరాలకి అవతలికి అంటే గ్రామం నుండి ఎనిమిది మైళ్ళు నడవాలి. జరిగే పని కాదంటారు.

అప్పుడు హోమర్ అంటాడు – “చూడండి! ఈ ఊళ్లో పుట్టిన దౌర్భాగ్యానికి మనందరి జీవితాలు ఆ బొగ్గు గనిలోనే తెల్లారబోతున్నాయి. లేక లేక ఓ మంచి అవకాశం దొరికింది. జాతీయ స్థాయిలో సైన్స్ ఫెయిర్ పోటీలో నెగ్గితే మనకి స్కాలర్షిప్ లు వస్తాయి. పై చదువులకి మంచి విశ్వవిద్యాలయాకి వెళ్ళొచ్చు. ఈ అవకాశం వొదులుకుంటే ఓ చీకటి కూపమే గతి. కొంచెం దూరదృష్టితో ఆలోచించండి. ఈ అవకాశం వొదులుకోవద్దు. ఇది తప్ప మనకి వేరే దారి లేదు.”

ముగ్గురు పిల్లలూ ఒప్పుకుంటారు. గ్రామానికి ఎనిమిది మైళ్ళ దూరంలో ‘స్నేక్ రూట్’ (Snakeroot) అనే ప్రదేశానికి వెళ్ళి చూస్తారు. అక్కడో విశాలమైన మైదానం కనిపిస్తుంది. ఆ ప్రాంతం అంతా పూర్తిగా నిర్జనంగా ఉంటుంది. నలుగురికీ ఆ ప్రాంతం బాగా నచ్చుతుంది. అక్కడో ‘లాంచ్ పాడ్’ నిర్మించాలని నిశ్చయించుకుంటారు.



రాకెట్ కి వత్తి అంటించాక ఊరంగా వెళ్లి దాక్కోవడానికి ఓ బంకర్ లాంటిది నిర్మించాలని అనుకుంటారు. అందుకు కావలసిన సరంజామా కోసం దండుకునే కార్యక్రమంలో పడతారు. గ్రామస్థులు తలా ఒక రకంగా సహాపడతారు. కలప, మేకులు, రేకులు ఇలా ఎంతో సరంజామా ఉచితంగా అందుతుంది.



కాని బంకర్ కి పునాది వెయ్యడానికి కొంచెం సిమెంట్ కావాలి. హోమర్ తండ్రి ఫాక్టరీలో చాలా సిమెంట్ ఉంటుంది. తిడతాడని తెలిసినా గత్యంతరం లేక వెళ్ళి కొంచెం సిమెంట్ కావాలని తండ్రిని అడుగుతాడు –

“ఇంకా మీరు రాకెట్లతో ఆ పిచ్చి పిచ్చి ప్రయోగాలు మానలేదు అన్నమాట!” తండ్రి కాస్త కోపంగా అడుగుతాడు.

“కంపెనీ పరిసరాల్లో వద్దన్నారు అంతే. స్నేక్ రూట్ మీ కంపెనీకి చెందదుగా?”

“అంటే ఎనిమిది మైళ్ళు నడిచి వెళ్తారన్నమాట?”

“అవును నాన్నా,” తలవంచుకుని అంటాడు హోమర్.

“నాకు తెలియక అడుగాను హోమర్. ఒక్క విషయం చెప్పు. ఆ వెర్నర్ వాన్ బ్రౌన్, అతడి జర్మను పటాలం అంతా అక్కడ ఏం పొడిచేస్తున్నారంటావ్? నన్నడిగితే ఈ రాకెట్ల గోల అంతా ఓ పెద్ద ‘స్టంట్’ తప్ప మరింకేమీ లేదంటాను.”

“అంతరిక్ష పోటీలో రష్యన్ల కన్నా ముందు ఉండడం మీకు వట్టి ‘స్టంట్’ లాగా కనిపిస్తోందా నాన్నా?”

“కాక మరింకేంటి? కొత్తలో ఏదో సంబరం. నాలుగు రోజులు పోతే ముచ్చట తీరిపోతుంది. అప్పుడు ఆ మొత్తం జర్మన్ ముఠాని ఇంటికి పంపించేస్తారు. అప్పుడు అంతా ఈ పిచ్చి వేషాలు మానేసి అసలు సిసలైన ఉద్యోగాలు వెతుక్కోవాలి.”

“అంటే బొగ్గుగనిలో అనా మీ ఉద్దేశం?”

“ఇదుగో చూడు హోమర్! మనం తీసే బొగ్గు వల్ల స్టీలు ఉత్పత్తి సాధ్యం అవుతుంది. స్టీలు ఉత్పత్తి పడిపోతే అసలు దేశమే పడిపోతుంది. నీ బుర్రలో ఓ బఠాణీ అంత మెదడు ఉన్నా ఈ విషయం అర్థం అవుతుంది అనుకుంటాను. వెళ్ళవతలకి,” అని కసురుతాడు. హోమర్ కోపంగా వెళ్ళిపోబోతుంటే వెనక్కి పిలిచి తండ్రి అంటాడు – “ ఈ మధ్య ఇక్కడ ఓ చిన్న రోడ్డు వేశారు. కొంచెం సిమెంట్ మిగిలి ఉండాలి. వర్షంలో కొద్దిగా తడిసి ఉండోచ్చు. నీకేమైనా పనికొస్తుందంటే తెప్పిస్తాను,” అంటాడు.

“థాంక్స్ నాన్నా” అని కృతజ్ఞతలు చెప్పుకుని బయటికి నడుస్తాడు హోమర్. బయటి వాళ్ల మాటెలా వున్నా ఈ విషయంలో తన తండ్రి కాస్తంత ప్రోత్సహించినా చాలు తనకి కొండంత బలం వచ్చినట్టు ఉంటుంది.

లాంచ్ పాడ్ నిర్మాణానికి కావలసిన సరంజామా ఇప్పుడు అమరింది. ఇక లాంచ్ చెయ్యడమే తరువాయి.

(ఇంకా వుంది)






















“జనవరి 29, 1839 లో వివాహం, గోవర్ వీధిలో నివాసం” దగ్గర్నుండి “సెప్టెంబర్ 14, 1842 లో లండన్ విడిచి డౌన్ నగరంలో స్థిరపడడం” వరకు

(సుఖసంతోషాలతో కూడిన తన వైవాహిక జీవనం గురించి, పిల్లల గురించి కొంత ముచ్చటించిన తరువాత డార్విన్ ఇలా అంటాడు - )

లండన్ లో జీవించిన మూడేళ్ల ఎనిమిది నెలల కాలంలో పెద్దగా వైజ్ఞానిక విషయాల జోలికి పోలేదు. అయితే ఎప్పటిలాగానే కష్టపడి పనిచేసేవాణ్ణి. దీనికి కారణం ఆ దశలో తరచు ఆరోగ్యం దెబ్బ తినడమే. ఒక సారి దీర్ఘకాలం మంచాన పడ్డాను. ఓపిక ఉన్న సమయాలలో ‘పగడపు దీవులు’ మీద నేను తలపెట్టిన పుస్తకం మీద పని చేస్తూ ఉండేవాణ్ణి. పెళ్ళికి ముందు ఆరంభించిన ఈ పుస్తక రచన మే 6, 1842 నాటికి పూర్తయ్యింది. పుస్తకం చిన్నదే గాని దీన్ని పూర్తి చెయ్యడానికి ఇరవై నెలల కఠోర శ్రమ అవసరం అయ్యింది. ఈ పుస్తక రచన కోసం పసిఫిక్ దీవుల మీద ఉన్న ప్రతీ పుస్తకాన్ని చదవవలసి వచ్చింది. పైగా ఎన్నో మ్యాపులని కూడా సంప్రదించవలసి వచ్చింది. అందుకే రాయడానికి అంత కాలం పట్టింది. వైజ్ఞానిక సమాజాల నుండి ఆ పుస్తకం ఎన్నో మన్ననలు అందుకుంది. అందులో ప్రతిపాదించబడ్డ సిద్ధాంతం ఇప్పుడు లోకసమ్మతం అయ్యిందని అనుకుంటాను.



నేను రాసిన కృతులలో ఇంతగా తార్కిక అనుమానాత్మక (deductive) పద్ధతిలో రాసిన కృతి మరొకటి లేదేమో. దక్షిణ అమెరికా పశ్చిమ తీరం మీద ఉన్న కాలంలో ఈ సిద్ధాంతం మొత్తాన్ని ఊహించాను. అప్పటికి ఇంకా ప్రత్యక్షంగా కొరల్ దీవులని ఎప్పుడూ చూడలేదు. తదనంతరం వాస్తవ దీవులని క్షుణ్ణంగా పరిశీలించి నా అభిప్రాయాలు సరైనవో కాదో నిర్ధారించవలసి వచ్చింది. ఇక్కడ ఒక విషయాన్ని పేర్కొనాలి. అప్పటికి రెండేళ్ళుగా దక్షిణ అమెరికా తీరానికి చెందిన కొన్ని విశేషాల గురించి అధ్యయనాలు చేస్తూ వచ్చాను. తీరరేఖ మీద అక్కడక్కడ ఉద్ధతి (elevation) కనిపిస్తుంది. అలాగే వికోషీకరణ (తరుగుదల, denudation) కనిపిస్తుంది, అవక్షేపాల (sediments) ఏర్పాటు కనిపిస్తుంది. ఇవన్నీ చూశాక అవక్షేపాలు పదే పదే ఏర్పడడం వల్ల నేల ఎలా పైకి లేస్తుందో మనసులో ఊహించుకోసాగాను. ఆ విధంగా అవరోధక పగడపు దీవుల (barrier reefs) యొక్క, atoll (మధ్యలో నీరు చుట్టూ సన్నని గట్టు కల పగడపు దీవి) యొక్క ఆవిర్భావాన్ని వర్ణించే సిద్ధాంతం నాలో ఊపిరి పోసుకుంది.



పసిఫిక్ మహాసముద్రంలో అటాఫూ ఎటాల్ (వికీ)



పగడపు దీవుల మీద అధ్యయనాలు కాకుండా, లండన్ లో జీవించిన రోజుల్లో మరి కొన్ని అంశాల మీద కూడా భౌగోళిక సదస్సు ముందు పరిశోధనా పత్రాలు చదివాను. వాటిలో మచ్చుకి – దక్షిణ అమెరికా కి చెందిన అనియత మహాశిలలు (erratic boulders) గురించి, భూకంపాలు, వానపాముల చర్యల చేత వదులు మట్టి ఏర్పాటు, మొదలైనవి.

‘బీగిల్ యాత్రలో బయటపడ్డ జంతుశాస్త్ర విశేషాలు’ అన్న గ్రంథ రచన యొక్క పర్యవేక్షణ కూడా కొనసాగించాను. ఇవన్నీ ఒక పక్క ఇలా సాగుతుండగా ‘జీవజాతుల ఆవిర్భావం’ (origin of the species) కి కావలసిన విషయసేకరణ మాత్రం ఎప్పుడూ ఆపలేదు. అనారోగ్యం వల్ల మరి ఇంకేమీ చెయ్యలేని పరిస్థితిలో ఈ పనికి పూనుకునేవాణ్ణి.

1842 వేసవిలో ఆరోగ్యం కాస్త కుదుట పడింది. ఉత్తర వేల్స్ ప్రాంతంలో కొద్దిగా పర్యటించాను. ఆ ప్రాంతానికి చెందిన పెద్ద లోయలని ఒకప్పుడు నింపిన పాత హిమానీ నదాల యొక్క పర్యవసానాలని పరిశీలించడం ఆ యాత్ర యొక్క లక్ష్యం. నా పరిశీలనలని సంక్షిప్త రూపంలో ఫిలసాఫికల్ మాగజైన్ (’Philosophical Magazine,’ 1842) లో ప్రచురించాను. ఈ యాత్ర నాకెంతో ఉత్సాహకరంగా అనిపించింది. కొండలెక్కడానికి, ఎంతో దూరాలు నడవడానికి కావలసిన ఓపిక ఉండడం అదే ఆఖరు సారి అనుకుంటా. భౌగోళిక పరిశోధనలో అలాంటి ప్రయాస అవసరం మరి.



(ఇంకా వుంది)








ఆకాశంలో స్పుట్నిక్ ని చూసిన దగ్గర్నుండి హోమర్ మనసు మనసులో లేదు. తనతో మరిద్దరు నేస్తాలు కూడా వచ్చారు. చూశారు. కాని కాసేపట్లోనే ఆ విషయం గురించి మర్చిపోయారు. హోమర్ మనసులో మాత్రం ఏదో ఆలోచన దొలిచేస్తోంది.

ఆ రాత్రి హోమర్ ఇంట్లో వాళ్లంతా భోజనం చేస్తున్న సన్నివేశం. హోమర్ తండ్రి పేరు కూడా హోమరే! పూర్తి పేరు హోమర్ హికమ్. అంటే కొడుకు పేరు హోమర్ హికమ్ (జూనియర్) అన్నమాట. మిస్టర్ హికమ్ ఆ గ్రామంలోని బొగ్గు గనికి మేనేజరు. పని పట్ల అపారమైన చిత్తశుద్ధి గల, గొప్ప నిజాయితీ గల వ్యక్తి. అయితే ఈయనకి బొగ్గుగనే లోకం. తన పిల్లలు కూడా పెద్దయ్యాక బొగ్గుగనిలో పని చేస్తారని కలలు కంటుంటాడు. హోమర్ ఇతడికి చిన్న కొడుకు. పెద్ద కొడుకు పేరు జిమ్. ఇతగాడిది ఫుట్ బాల్ లో అందె వేసిన కాలు! కనుక కాలేజి స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాని చిన్న కొడుకైన హోమర్ విషయంలోనే తల్లిదండ్రులకి కొంచెం చింత. ఎందుకంటే మనవాడికి ఫుట్ బాల్ ఆట్టే అబ్బలేదు.

భోజనం దగ్గర అందరూ జిమ్ కి ఫుట్ బాల్ స్కాలర్షిప్ తప్పకుండా వస్తుందని, కాలేజికి వెళ్ళి పెద్ద చదువులు చదువుకుంటాడని ఉత్సహంగా మట్లాడుకుంటుంటారు. వాళ్ల ఉత్సాహాన్ని భంగపరుస్తూ ఉన్నట్టుండి హోమర్ బిగ్గరగా అంటాడు – “ఎలాగైనా ఓ రాకెట్ నిర్మిస్తాను!”



మర్నాడు బడిలో హోమర్ తన నేస్తాలకి తన ఆలోచన గురించి చెప్తాడు. హోమర్ కి ఇద్దరు దోస్తులు. ఒకడి పేరు రాయ్ లీ. ఇతగాడి తండ్రి బొగ్గు గని ప్రమాదంలో మరణిస్తాడు. పెంపుడు తండ్రి పెంచుకుంటుంటాడు. అయితే పెంపుడు తండ్రి కిరాతకుడు. తాగొచ్చి రోజూ కొడుకుని చావబాదుతూ ఉంటాడు. రెండవ మిత్రుడు షర్మాన్ ఓ డెల్. ఇతగాడి తండ్రి కూడా బొగ్గు గనిలో ప్రమాదంలో పోయిన వాడే.



అయితే ఇద్దరికీ రాకెట్ గురించి పెద్దగా తెలీదు. మొత్తం మీద ముగ్గురికీ రాకెట్ గురించి ఒకే మోతాదులో తెలుసని ముగ్గురికీ అర్థమవుతుంది. మరేం చెయ్యాలి?

ఓం ప్రథమంగా చిన్న ప్రయోగం చేస్తారు. ఎక్కడో కొన్ని ‘దీపావళి’ పటాసుల లాంటి 30 పటాసులు సంపాదించి, అందులోని మందుగుండు తీసి, ఓ గొట్టంలోకి దట్టించి చిన్న రాకెట్ లాంటిది తయారు చేస్తారు. దాన్ని హోమర్ ఇంటి పెరట్లో, కంచె మీద కూర్చోబట్టి వత్తి అంటిస్తారు. ముగ్గురూ మెడలు సారించి ఎంత ఎత్తుకు పోతుందో నని ఆత్రంగా చూస్తుండగా ఓ పెద్ద చప్పుడు వినిపిస్తుంది. ముగ్గురూ ఆ పేలుడికి వెల్లకిలా పడతారు. దెబ్బకి కళ్లు బైర్లు కమ్ముతాయి. లోపలి నుండి హోమర్ తల్లి ఎల్సీ ఆదుర్దాగా పరుగెత్తుకుని బయటికి వస్తుంది.

పరిస్థితి చూసి, విషయం అర్థమై “ఒరేయ్! రాకెట్లతో ఆడుకోమన్నా గాని, ప్రాణాల మీదికి తెచ్చుకో మన్లేదు” అని ముగ్గుర్నీ దులిపేస్తుంది.

ఉత్సాహంగా చేసిన ఈ ప్రథమ రాకెట్ ప్రయోగం అలా ‘తుస్సు’ మన్నందుకు హోమర్ విచారపడతాడు.



ఒక పక్క ఈ బాల రాకెట్ శాస్త్రవేత్తల పాట్లు ఇలా ఉంటే, ఇంచుమించు అదే కాలంలో నాసాలో ఫాన్ బ్రౌన్ గారు పంపిన రాకెట్లు కూడా ఇలాగే కూలిపోతుంటాయి. వాన్గార్డ్ (Vanguard) రాకెట్ విఫలమవుతుంది.

ఏకలవ్య శిష్యుడిలా హోమర్ తన బాధంతా వెళ్లగక్కుకుంటూ వెర్నర్ ఫాన్ బ్రౌన్ కి విఫలమైన తన ప్రయత్నం గురించి ఉత్తరం రాస్తాడు. అలాగే అదే ఉత్తరంలో విఫలమైన వాన్ గార్డ్ రాకెట్ గురించి సంతాపం కూడా వ్యక్తం చేస్తాడు.



మరి ప్రాణాపాయం లేకుండా రాకెట్ ని తయారు చెయ్యడం ఎలా? సరైన పద్ధతి ఏంటో కచ్చితంగా కనుక్కుని చెయ్యాలి. తలతిక్క ప్రయోగాలు చేస్తే గాల్లోకి లేచేది రాకెట్ కాదు. మరి ఎవరిని అడగాలబ్బా అని మిత్రులు ముగ్గురూ తలలు పట్టుకుంటారు.



వీళ్ల బళ్లో విడ్డూరం శాల్తీ ఒకడు ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఓ మూల కూర్చునే ఒంటరి పురుగు. వీడో పుస్తకాల పురుగు కూడా. వీడి పేరు క్వెంటిన్ విల్సన్. సైన్స్ లో తన తోటి నేస్తాల కన్నా ఎంతో పరిజ్ఞానం ఉన్నవాడు.



మర్నాడు స్కూల్ కాంటీన్ లో ఓ మూల ఒక్కడే కూర్చుని తింటున్న క్వెంటిన్ ని సమీపించి హోమర్ మాట కలపబోతాడు. హోమ్ వర్క్ కాపీ కొట్టాలని చూస్తున్నాడేమో నని సందేహించి, కుదరదంటాడు క్వెంటిన్. కాని హోమర్ రాకెట్ విషయం అడుగుతాడు.



క్వెంటిన్ రాకెట్ల గురించి తనలి తెలిసినదంతా ఏకరువు పెట్టుకొస్తాడు. క్రీ.శ. 1000 లో చైనా వాళ్లు మొదట రాకెట్లు కనుక్కున్నారంటూ రాకెట్ల చరిత్ర చెప్పుకొస్తాడు. తన వద్ద ఉన్న ‘సైంటిఫిక్ అమెరికన్’ పత్రికలో ఓ వ్యాసం తెచ్చి చూపిస్తాడు. అందులో రాకెట్ ఎలా తయారు చెయ్యాలో వివరంగా ఉంటుంది.

(తెవికీ)


వ్యాసం చదివాక పిల్లలు ముగ్గిరికీ రాకెట్ నిర్మాణం గురించి కొన్ని ప్రాథమిక విషయాలు అర్థమవుతాయి. రాకెట్ ఇంధనంలో ముఖ్య అంశాలు పొటాషియమ్ క్లోరేట్, మరియు సల్ఫర్. ఈ రెండు పదార్థాలు ఎక్కడో సంపాదిస్తారు. అలాగే రాకెట్ దేహానికి ఓ లోహపు గొట్టం తెచ్చి దాన్ని సరైన పొడవుకి కోస్తారు. ఆ గొట్టానికి ఒక కొసలో చిన్న టోపీ లాంటి మూత పెడతారు. అవతలి కొసలో ఇంధనం మండగా పుట్టే జ్వాలలు బయటికి పోడానికి ఓ సన్నని ద్వారం ఏర్పాటు చెయ్యాలి. అంటే గొట్టాన్ని ఇంచుమించు మూస్తూ ఓ వాషర్ ని తెచ్చి అక్కడ వెల్డింగ్ (welding) చెయ్యాలి.



కుర్రాళ్ళు ముగ్గురికీ మరి వెల్డింగ్ రాదు. కనుక హోమర్ తన తండ్రి వద్ద పని చేసే ఇసాక్ బైకోవ్స్కీ అనే ఓ ఉద్యోగి సహాయం అడుగుతాడు. కంపెనీ సరంజామా ఉపయోగించి పిల్లలకి సాయం చేశాడని తెలుస్తే హోమర్ తండ్రి మండిపడతాడని బైకోవ్స్కీ కి బాగా తెలుసు. అయినా పిల్లల ఉత్సాహం చూసి వాళ్ళు అడిగినట్టే గొట్టానికి ఒక కొసలో వాషర్ వెల్డ్ చేసి ఇస్తాడు. ఇప్పుడు రాకెట్ దేహం సిద్ధం అయ్యింది. అందులో అంతకు ముందు తయారు చేసిన మందుగుండు పొడి బాగా దట్టించి మళ్లీ ప్రయోగానికి సిద్ధం అవుతారు.



మళ్లీ రాకెట్ ని హోమర్ ఇంటి కంచె మీద ప్రతిష్టించి వత్తి అంటించడానికి ఆయత్తం అవుతారు.

(ఇంకా వుంది)













భూమి గుండ్రంగా ఉంది
(హాస్య భరిత సైన్స్ నాటిక)

భూమి గుండ్రంగా ఉంటుందన్న విషయం ప్రస్తుతం మనకి అత్యంత స్వయంవిదితంగా అనిపించవచ్చు. కాని కొద్ది శతబ్దాల క్రితం వరకు కూడా ఈ విషయం మీద జనంలో  చిత్రమైన ఆలోచనలు చలామణిలో ఉండేవి. భౌతిక శాస్త్రవేత్తల, అన్వేషుల (explorers)  కృషి ఫలితంగా ఈ విషయం లో క్రమంగా అవగాహన పెరిగింది. ఈ భావవికాస చరిత్ర గురించి అసిమోవ్ చాలా అందంగా చెప్పుకొస్తాడు. అసిమోవ్ అందించిన కథనాన్ని ఆసరాగా చేసుకుని ఆ చరిత్రని ఓ సరదా నాటకంగా వ్రాయడానికి ప్రయత్నించాను. సైన్స్ రంగంలో తెలుగులో హాస్య నాటికలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. హాస్యం ద్వార, నాటక రూపంలో ప్రదర్శించబడ్డ సైన్స్ మరింత సులభంగా మింగుడు పడుతుందన్న ఉద్దేశంతో చేసిన ఓ చిన్న ప్రయత్నం.




ప్రతుల కోసం -
ఏ. గాంధీ,
పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్.

agaandhi@gmail.com




అక్టోబర్ స్కై అన్న పేరు గల హాలీవుడ్ చిత్రం 1999 లో విడుదల అయ్యింది. ఓ నిజజీవిత కథ ఆధారంగా తీసిన ఈ చిత్రం ఓ చిన్న గ్రామానికి చెందిన నలుగురు కుర్రాళ్ల కథ. కథ జరిగిన కాలం 1957. పెద్దగా సౌకర్యాలు లేని ఆ కుగ్రామానికి చెందిన ఆ కుర్రాళ్లకి కొన్ని కారణాల వల్ల ఓ రాకెట్ తయారుచెయ్యాలని ఆలోచన వస్తుంది. ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి, ఎంతో వ్యతిరేకతని ఎదుర్కుని చివరికి ఓ చిన్న రాకెట్ తయారు చేస్తారు. ఆ రాకెట్ ని ఓ జాతీయ స్థాయి సైన్స్ ప్రాజెట్ పోటీ లో ప్రదర్శించి మొదటి స్థానంలో విజయం సాధిస్తారు. అత్యంత స్ఫూర్తి దాయకమైన ఈ కథలో ముఖ్య పాత్ర పేరు ‘హోమర్ హికమ్.’ ఇతడు రాసిన పుస్తకమే యూనివర్సల్ స్టూడియోస్ బానర్ కింద సినిమాగా విడుదల అయ్యింది. ఈ పుస్తకానికి రచయిత హోమర్ హికమ్ మొదట పెట్టిన పేరు Rocket Boys (రాకెట్ కుర్రాళ్లు). అయితే సినిమాకి అలాంటి పేరు పెడితే “ముప్పై ఏళ్లు నిండిన స్త్రీలు ససేమిరా చూడరు” అని యూనివర్సల్ స్టూడియోస్ సిబ్బంది అభిప్రాయపడడం చేత Rocket Boys అన్న పేరుని కాస్తా Ocober Sky అని మార్చవలసి వచ్చింది. ఇక్కడ తమాషా ఏంటంటే ‘Rocket Boys’ అన్న పదజాలంలోని అక్షరాలని తారుమారు చేస్తే అది ‘October Sky’ అవుతుంది. ఈ కథ పిల్లలకి ఎంత స్ఫూర్తి దాయకంగా ఉంటుందంటే ఈ పుస్తకాన్ని అమెరికాలో ఎన్నో బళ్లు పిల్లలు తప్పనిసరిగా చదవాల్సిన సాహిత్యంలో భాగంగా స్వీకరించాయి.



ఈ సినిమా కథని విపులంగా కొన్ని పోస్ట్ లలో చెప్పుకు రావాలని ఉద్దేశం.



అక్టోబర్ 4, 1957 లో రష్యా స్పుట్నిక్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలో కక్ష్యలో పెట్టగలిగింది. స్పుట్నిక్ విజయంతో అంతరిక్ష రంగంలో అమెరికా రష్యాల మధ్య మహోగ్రమైన పోటీ మొదలవుతుంది. ఇంత ముఖ్యమైన రంగంలో రష్యా అమెరికా కన్నా ముందు ఉండడం అమెరికాలో సంచలనం సృష్టిస్తుంది. రాకెట్ టెక్నాలజీలో పై చేయిగా వున్న రష్యా ఆ టెక్నాలజీని ఉపయోగించి అమెరికా మీద దెబ్బ తీస్తుందేమో నన్న భయం మొదలవుతుంది. రష్యా స్పుట్నిక్ ని పంపడం అనే ప్రపంచ ఘట్టమే మన సినిమా కథకి సందర్భాన్ని, నేపథ్యాన్ని సమకూరుస్తుంది.



కథా స్థలం అమెరికాలో, వెస్ట్ వర్జీనియాలో కోల్ వుడ్ (Coalwood) అనే ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఓ బొగ్గు గని తప్ప మరేమీ లేని పరిస్థితి ఉంటుంది. ఆ పల్లెలో ఓ చిన్న బడి. ఆ బడిలో చదువుకుని బయటికి వచ్చిన వారిలో ఇంచుమించు అందరూ ఆ బొగ్గుగనిలో పని చేస్తారు. బహు కొద్ది మంది అదృష్టవంతులు మాత్రం, - ఫుట్ బాల్ లో ప్రావీణ్యత ఉన్న వారు – ఫుట్ బాల్ స్కాలర్ షిప్ మీద పొరుగు ఊళ్ళో కాలేజిలో చదువుకునే భాగ్యానికి నోచుకుంటారు.

స్పుట్నిక్ లాంచ్ జరిగిన నేపథ్యంలో కోల్ వుడ్ లో జనం రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు.

‘రాకెట్లు ఉపయోగించి రష్యా మన మీద బాంబులు వేస్తుందో ఏమో?’ అంటాడు ఒకడు. ‘ఆ వేసేదేదో ఈ పల్లె మీద పడేస్తే శని వదిలిపోతుంది,’ అంటాడు మరొకడు.



స్పుట్నిక్ గురించి రేడియోలు హోరెత్తిస్తూ ఉంటాయి.

“గంటకి 18,000 మైళ్ల వేగంతో, భూమికి 559 మైళ్ల ఎత్తులో, 96 నిముషాలకి ఒకసారి భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటుంది ఈ ఉపగ్రహం. సాయంత్రం సూర్యాస్తమయం జరిగిన గంట తరువాత, సూర్యోదయానికి ఓ గంట ముందు ఈ ఉపగ్రహం ‘అక్టోబర్ ఆకాశం’లో దర్శనమిస్తుంది.” అంటూ ఆ రేడియో ప్రోగ్రాం ఉపగ్రహం వివరాలు తెలుపుతుంది.



అదే ప్రోగ్రాంలో, అమెరికాకి చెందిన ‘వెర్నర్ ఫాన్ బ్రౌన్’ (Wernher von Braun) అనే రాకెట్ శాస్త్రవేత్త “దగ్గర్లోనే అమెరికా కూడా కృత్రిమ ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపనుంది” అని ప్రకటిస్తాడు.



రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ నుండి అమెరికాకి వలస పోయిన ఎంతో మంది శాస్త్రవేత్తలలో ఈ ఫాన్ బ్రౌన్ ఒకడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి జర్మనీ రాకెట్ టెక్నాలజీని బాగా అభివృద్ధి పరచుకుంది. అయితే రాకెట్ లని అంతరిక్ష ప్రయోజనాల కోసం కాక, క్షిపణులు (missiles) రూపంలో యుద్ధ ప్రయోజనాల కోసం వాడుకుంది. జర్మనీ పంపిన V2 రాకెట్లు యూరప్ లో శత్రు దేశాల మీద నిప్పులు కురిపించి భీభత్సం సృష్టించాయి. ఆ V2 రాకెట్ల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించినవాడు ఈ వెర్నర్ ఫాన్ బ్రౌన్. యుద్ధం తరువాత ఇతగాడు అమెరికాలో NASA లో చేరిపోతాడు. తదనంతరం Saturn-V అనే రాకెట్ సీరిస్ నిర్మాణంలో ఇతడు ముఖ్య పాత్ర ధరించాడు. ఓ దశకం తరువాత చందమామ వద్దకి మనిషిని మోసుకు పోయిన అపోలో మిషన్ ఈ అత్యంత శక్తివంతమైన Saturn-V రాకెట్ వల్లనే సాధ్యమయ్యింది.



స్పుట్నిక్ గురించి దేశం అంతా ఇంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో అదెలా ఉంటుందో నన్న కుతూహలంలో ఓ రోజు సాయంతం కోల్ వుడ్ ప్రజలంతా ఒక చూట గుమిగూడుతారు. మామూలుగా ఉపగ్రహాలు ఎంత చీకట్లోనైనా నేల నుండి చూస్తే కనిపించవు. కాని స్పుట్నిక్ లో ఓ ప్రత్యేకత వుంది. దాని సోలార్ పానెళ్లు ఎలా అమర్చారంటే వాటి మీద సూర్యకాంతి పడ్డప్పుడు అది ప్రతిబింబించి భూమి నుండి కనిపిస్తుంది. కనుక చీకటి ఆకాశంలో చిన్న కదిలే తారలా అందంగా కనిపిస్తుంది.

ఆకాశంలో అంత ఎత్తులో అంత వేగంగా కదిలే ఓ మానవ నిర్మిత వస్తువు కనిపించడం కోల్ వుడ్ ప్రజలకే కాదు, ప్రపంచ ప్రజలందరికీ అదే ప్రథమ అనుభవం. స్పుట్నిక్ దృశ్యం కోల్ వుడ్ ప్రజలలో కలకలం రేకెత్తిస్తుంది.



ఆ బృందంలో ఓ పిల్లవాడు కూడా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి బాగా ప్రభావితం అయిన ఆ పిల్లవాడి మనసులో ఓ ఆలోచన మెరుస్తుంది.

(ఇంకా వుంది)







ప్రావస్థ - తరంగాగ్రం

Posted by V Srinivasa Chakravarthy Thursday, August 2, 2012 6 comments


కాంతి విషయంలో న్యూటన్ సిద్ధాంతం తప్పని అర్థం చేసుకున్న డచ్ శాస్త్రవేత్త ఒకడు ఉన్నాడు. అతడి పేరు క్రిస్టియన్ హైగెన్స్. ఇతడు 1678 లో కాంతి ఒక తరంగం అని ప్రతిపాదించాడు.



అయితే కాంతి తరంగం అనుకోడానికి ఓ పెద్ద అభ్యంతరం ఉంది. తరంగానికి ఎప్పుడూ ఓ యానకం కావాలి. కాని తక్కిన తరంగాలలా కాక కాంతి శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. దీనికి సమాధానంగా హైగెన్స్, మనం శూన్యం అనుకునేది నిజానికి శూన్యం కాదని, ఈథర్ అనేటువంటి ఓ అతి సూక్ష్మమైన ద్రవమని, అది విశ్వమంతా వ్యాపించి ఉందని ప్రతిపాదించాడు.

ఈథర్ ద్రవంలో ఏర్పడే అలజడులే, తరంగాలే కాంతి అన్నాడు. ఆ తరంగాలు అనుదైర్ఘిక తరంగాలు అన్నాడు.



కాంతి తరంగాలు ఎలా వ్యాపిస్తాయి, అన్న ప్రశ్నకి సమాధానంగా హైగెన్స్ ఓ నిర్మాణాన్ని వర్ణిస్తాడు. ఆ నిర్మాణం అర్థం కావాలంటే ముందు కొన్ని భావనలు అర్థం కావాలి.

- ప్రావస్థ (phase)

- తరంగాగ్రం (wavefront)



ప్రావస్థ: చక్రికంగా మారుతున్న ప్రతీ రాశికి ఓ ప్రావస్థ ఉంటుంది. ఏ రాశి అయినా చక్రికంగా మారుతున్నప్పుడు దాని చలనాన్ని వృత్తం మీద కదిలే బిందువుతో పోల్చుకోవచ్చు. వృత్తం మీద కదిలే బిందువుని, వృత్త కేంద్రంతో కలిపితే, ఆ వ్యాసార్థం x-అక్షంతో ఏర్పరిచే కోణమే ఆ బిందువు యొక్క ప్రావస్థ (phase).

అలాగే ఓ తరంగం ప్రసారం అవుతున్నప్పుడు, ఒక బిందువు వద్ద నుండి తరంగాన్ని చూస్తే ఏదో రాశి పెరిగి కిందపడుతున్నట్టు ఉంటుంది. ఆ మార్పు పదే పదే చక్రికంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది.

సామాన్య పరిభాషలో చెప్పాలంటే, చక్రికంగా మరే రాశిలో కొన్ని దశలు పదే వస్తుంటాయి. ఆ దశలనే ప్రావస్థ అంటారు. రెండు ఉదాహరణలు.

1) ఋతువులు – ఏడాదిలో ఋతువులు చక్రికంగా వస్తుంటాయి. అంటే ఏడాది యొక్క ప్రవస్థలు ఋతువులు అన్నమాట.

2) చంద్ర కళలు – 28 రోజులకి ఓ సారి చంద్రుడి కళలు చక్రికంగా మారుతుంటాయి. అంటే చంద్రుడి కళలు చంద్రుడి ప్రావస్థలు అన్నమాట.





1) సముద్ర తీరం మీదకి కెరటాలు పదే పదే పరుగులు పెడుతుంటాయి. కింద చిత్రంలో తీరం మీదకి వస్తున్న ఓ కెరటం కనిపిస్తుంది. ఆ కెరటాన్నే ‘తరంగాగ్రం’ (wavefront) అంటాం. అంటే తరంగం యొక్క ముందు భాగం అన్నమాట.





2) తరంగాగ్రానికి ప్రావస్థకి సంబంధం ఏంటి?

దానికి మరో ఉదాహరణ చూద్దాం. కింద కొలనులో ఓ బాతు బొమ్మ తేలుతోంది.

ఎడమ పక్క నుండి ఓ తరంగం బయలుదేరి వస్తోంది. తరంగంలో కెరటాలు వృత్తాకారంలో వ్యాపిస్తున్నాయి. నల్లని గీత ఓ తరంగాగ్రాన్ని సూచిస్తోంది. తరంగాగ్రం ఎలా కదులుతోంది అనేది కింద కనిపించే మూడు చిత్రాలలోని నల్లని గీత సూచిస్తోంది. తరంగాగ్రం కదులుతోందే గాని బాతు మాత్రం ఉన్న చోటే వుంది. అక్కడే ఉండి కిందికి పైకి కదులుతూ ఉంటుంది. అంటే బాతుకి ప్రవస్థ ఉంటుంది. అది బాతు ఉన్న చోటి నీటి ప్రావస్థతో సమానం. నల్లని రేఖ మీద ఉండే అన్ని బిందువుల వద్దను నీటి యొక్క ప్రావస్థ ఒక్కటే.

అందుకే తరంగాగ్రాన్ని ఈ విధంగా నిర్వచిస్తారు. యానకంలో ఒకే ప్రావస్థతో కదిలే భాగాలని ఒక ఊహాత్మక రేఖతో (లేదా తలంతో) కలిపితే వచ్చేదే ‘తరంగాగ్రం.’





(Vibrations and Waves by Benjamin Crowell)



(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts