శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

కోల్ వుడ్ కే బంగరు పతకం

Posted by V Srinivasa Chakravarthy Saturday, August 25, 2012

ఇది తెలిసిన మిస్ రైలీ, హెడ్ మాస్టర్ తో మాట్లాడి, ఎక్కడో ఏదో పొరబాటు జరిగిందని ఒప్పించి, పిల్లలని విడిపిస్తుంది.

ఇంతకీ వాళ్లు చేసిన నేరం ఏంటని వాకబు చెయ్యగా విషయం తెలుస్తుంది. లాంచ్ జరిగిన ప్రదేశానికి పక్కనే అడవిలో ఓ పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది. దానికి కారణం హోమర్ నేస్తాలు లాంచ్ చేసిన రాకెట్టే అయ్యుంటుందని పోలీసులు భావిస్తారు. పైగా ఆ ప్రత్యేక లాంచ్ లో మాత్రం రాకెట్ ఎక్కడ పడిందో కనిపించదు. కనుక పోలీసుల అనుమానం బలపడుతుంది.

జరిగిన దానికి హోమర్ తండ్రి కొడుక్కి తల వాచేలా చివాట్లు పెడతాడు. రాయ్ లీ ని తన పెంపుడు తండ్రి చితకబాదుతుంటే హోమర్ తండ్రి వచ్చి కాపాడతాడు.

జరిగిన అవమానానికి రకెట్ కుర్రాళ్ల మనసు విరిగిపోతుంది. సైన్స్ పోటీకి వెళ్లే కలలన్నీ కరిగిపోతాయి. తమ లాంచ్ పాడ్ ని తగులబెట్టేస్తారు.



పరిస్థితులు ఇలా విషమంగా ఉండగా ఇది చాలదన్నట్టు ఒక రోజు గనిలో ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో బైకోవ్స్కీ చనిపోతాడు. అతణ్ణి కాపేడే ప్రయత్నంలో హోమర్ తండ్రి గాయపడతాడు. ఒక కంటి చూపు పోవచ్చు అంటారు డాక్టర్లు. ఇక అతడు తాత్కాలికంగానైనా ఉద్యోగం చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది.

పెద్ద కొడుకు జిమ్ తన కాలేజి చదువు మానుకుని గనిలో పని చేసి కుటుంబాన్ని పోషిస్తానంటాడు. కాని అమూల్యమైన కాలేజి చదువుని వొదులుకోవడం తెలివైన పని కాదని, అన్నయ్యకి బదులు తాను గనిలో పని చేస్తానని తమ్ముడు హోమర్ ముందుకొస్తాడు. కొడుకులు చేస్తున్న త్యాగానికి తల్లి కంటతడి పెట్టుకుంటుంది.

హోమర్ గని లో పని మొదలెడతాడు. అయిష్టంగానే మొదలుపెట్టినా త్వరలోనే పనిలో మంచి నైపుణ్యం సంపాదిస్తాడు. తండ్రి కూడా నెమ్మదిగా కోలుకుంటాడు. గనిలో తన చిన్న కొడుకు పని తీరు చూసి మురిసిపోతాడు. తండ్రిని మించిన కొడుకు అవుతాడని సంబరపడిపోతాడు.

ఈ సందర్భంలో ఓ సన్నివేశం ప్రేక్షకులని కదిలిస్తుంది. ఒక రోజు తెల్లవారే హోమర్ గనిలో పని మొదలుపెడతాడు. గని కార్మికుల యూనీఫామ్ లో, తల మీద లైటు గన హెల్మెట్ తో తోటి కార్మికులతో పాటు గనిలో లిఫ్ట్ లో కిందికి దిగుతూ ఓ సారి పైకి చూస్తాడు. పైన తారల మధ్యన తారలా స్పుట్నిక్ మెరుస్తూ వేగంగా కదలడం కనిపిస్తుంది. కిందికి కదులుతున్న లిఫ్ట్ లో అలా హోమర్ తన కలకి దూరం అవుతున్నట్టుగా చూపిస్తారు.



తండ్రి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు కనుక హోమర్ మల్ళీ హైస్కూల్ కి వెళ్ళి బడి చదువులు పూర్తి చేస్తే బావుంటుందని ఓ రోజు హోమర్ తల్లి సూచిస్తుంది. అప్పటికే మనసు విరిగిన హోమర్ ఇక బడి ముఖం చూసేదే లేదంటాడు.

అప్పుడు తల్లి మిస్ రైలీ కి అనారోగ్యంగా ఉందన్న వార్త చెప్తుంది. వెంటనే మిస్ రైలీని చూడడానికి వెళ్తాడు.

ఆమెకి హాడ్జ్ కిన్ వ్యాధి వచ్చిందని, ఇక రేపో మాపో అన్నట్టు పరిస్థితి ఉందని తెలిసి బాధపడతాడు హోమర్. అప్పుడు మిస్ రైలీ తనకు కూడా మరో విషయంలో బాధ ఉందంటుంది. ఆ నలుగురు కుర్రాళ్ళ విషయంలో ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుందని, వాళ్లిలా తమ లక్ష్యాన్ని విస్మరించడం తన బాధగా ఉందంటుంది. ఓ టీచరుగా తను ఓడిపోయినట్టు అనిపిస్తోంది అంటుంది.



“చూడు హోమర్! జీవితంలో కొన్ని సార్లు ఒక్కొక్కరు ఒక్కోలా సలహా ఇస్తుంటారు. ఎవరేం చెప్పినా గుడ్డిగా వినకూడదు. నీ మనసు ఏం చెప్తుందో తెల్సుకుని దాని మాట విని నడచుకోవాలి”, అని సలహా ఇస్తుంది.

హోమర్ కి జ్ఞానోదయం అవుతుంది. వెంటనే సైన్స్ లో దిట్ట అయిన క్వెంటిన్ వద్దకి వెళ్తాడు. ఈ మధ్యన తను సొంతంగా చదువుకుని అర్థం చేసుకున్న రాకెట్ కి సంబంధించిన విషయాల గురించి క్వెంటిన్ తో చెప్తాడు.

ఇద్దరూ కలిసి వాళు పోగొట్టుకున్న రాకెట్ ఎక్కడ పడి ఉంటుందో శాస్త్రపరంగా లెక్కలు వేస్తారు.

ఆ లెక్క ప్రకారం మర్నాడు తమ ‘లాంచ్ పాడ్’ కి చుట్టుపక్కల అడవుల్లో గాలిస్తారు. సరిగ్గా వాళ్లు అంచనా వేసిన చోటే రాకెట్ పడి వుండడం తెలిసి సంబరపడతారు. అంటే అగ్ని ప్రమాదం వాళ్ల రాకెట్ వల్ల జరగలేదన్నమాట. వాళ్ళు నిరపరాధులు అన్నమాట.

వాళ్ళ నిరపరాధాన్ని నిరూపించుకోడానికి వెంటనే వాళ్ళ బడికి వెళ్తారు. మిస్ రైలీ క్లాసులోకి నలుగురినీ ఆహ్వానిస్తుంది. హోమర్ క్లాసులో తను, క్వెంటిన్ రాకెట్ ఎక్కడ పడిందో ఎలా లెక్కించిందీ వివరిస్తుంటే క్లాసులో పిల్లలంతా నోరెళ్లబెట్టుకుని చూస్తుంటారు. ఇంతలో ప్రిన్సిపాల్ కోపంగా క్లాసులోకి వస్తాడు. మిస్ రైలీ అడ్డుపడుతుంది. ఏం జరిగిందీ ప్రిన్సిపాలుకి ఏకరువు పెడుతుంది.

ఇంతలో పోలీసుల నుండి కూడా కొంత సమాచారం దొరుకుతుంది. అగ్ని ప్రమాదానికి కారణం ఆ పక్కనే ఉన్న ఓ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి ఎగిరి వచ్చిన ఓ aeronautical flare అని పోలీస్ వివరిస్తాడు.

దాంతో పిల్లల మీద నమ్మకం కుదిరిన ప్రిన్సిపాలు సైన్స్ పోటీ లో వాళ్ళు పాల్గొనడానికి ఒప్పుకుంటాడు.

ముందు జిల్లా పోటీలో గెలుస్తారు. ఇక జాతీయ పోటీకి వెళ్ళాలి.

నలుగురిలో ఒక్కరే వెళ్లే వీలు ఉండడంతో అందరూ హోమర్ ని పంపిస్తారు.

మొదటి రోజు బాగా గడుస్తుంది. హోమర్ ఇచ్చిన ప్రెజెంటేషన్ అందరినీ మెప్పిస్తుంది. వీళ్ల బృందానికి మొదటి బహుమతి ఖాయం అని జనం అనుకుంటుంటారు. కాని ఆ రాత్రి ప్రదర్శన శాలలో హోమర్ ప్రాజెక్ట్ సామగ్రిని ఎవరో దొంగలిస్తారు.

వెంటనే కోల్ వుడ్ కి ఫోన్ చేసి వార్త చెప్తాడు. కొడుక్కి ఈ పరిస్థితిలో ఎలాగైనా సహాయం చెయ్యాలని హోమర్ తల్లి తన భర్తకి గట్టిగా చెప్తుంది. భర్త ఒప్పుకుని తన ఫాక్టరీ లో కార్మికులని పురమాయించి ప్రాజెట్ నమూనాలు తయారు చెయ్యించి, మనిషిని ఇచ్చి సకాలంలో పంపుతాడు.

హోమర్ బృందానికి బంగారు పతకం దొరుకుతుంది.

విశ్వవిద్యాలయాల ప్రతినిధులు స్కాలర్షిప్ లు ఇవ్వడానికి ముందుకొస్తారు. ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వాడు ఎవరో కాదు – వెర్నర్ ఫాన్ బ్రౌన్ ! ఆయన స్వయంగా వచ్చి హోమర్ కి అభినందనలు చెప్తాడు.

- - -

విజయుడై ఊరికి తిరిగొచ్చిన హోమర్ కి ఊరంతా ఘన స్వాగతం పలుకుతుంది.

రాకెట్ కుర్రాళ్లు మరొక్క సారి లాంచి ఏర్పాట్లు చేస్తారు.

ఊళ్ళో తమకి సహాపడ్డ వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్తూ, వారందరికీ ఈ లాంచ్ అంకితం అని ప్రకటిస్తూ స్విచ్ నొక్కబోతుండగా ఎప్పుడూ లాంచ్ లకి రాని హోమర్ తండ్రి రంగప్రవేశం చేస్తాడు.

హోమర్ అభ్యర్థన మీదట తండ్రే స్విచ్ ఆన్ చేస్తాడు.

నిప్పులు చిమ్ముకుంటూ, మబ్బులు దాటుకుంటూ, నింగి అంచులు తాకాలని ఉబలాటపడుతూ ఆ రాకెట్ నిటారుగా పైకి దూసుకుపోతుంది. (ఈసారి అది ఎంత ఎత్తుకు పోతుందో ఓ పక్కన నించుని క్వెంటిన్ లెక్కలు వేసేస్తుంటాడు.)

రాకెట్ గమనాన్ని ఆశ్చర్యంగా చూసిన హోమర్ తండ్రి ఓ సారి అంతే ఆశ్చర్యంగా తన కొడుకు వైపు ఓ సారి గర్వంగా చూసుకుంటాడు.

అల్లంత దూరంలో ఊళ్ళో ఆసుపత్రిలో ఉన్న మైస్ రైలీ ఆకాశంలో కనిపించిన వెండిగీతను చూసుకుని మురిసిపోతుంది.

ఆ విధంగా ఓ చక్కని సైన్స్ ప్రాజెక్ట్ ఓ పేరు లేని కుగ్రామాన్ని సమూలంగా, శాశ్వతంగా మార్చేస్తుంది.

(సమాప్తం)

































4 comments

  1. Nice.

    Thanks

     
  2. మంచి సినిమాను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు, సర్

     
  3. కామెంట్లకు ధన్యవాదాలు

     
  4. Anonymous Says:
  5. అద్భుతః ధన్యోస్మి!

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts