పుస్తకాలు పిల్లలకు పసిడి నేస్తాలు. “ఏఏ వేళల పూచే పూవులతో ఆయా వేళల” దుర్గమ్మను పూర్ణమ్మ కొలిచినట్టు, ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైన సాహిత్యం చదువుకుంటూ పిల్లలు సహజంగా, సజావుగా ఎదగాలి. ఆ రకంగా ఎదగడానికి ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు పిల్లవాడికి – తెలుగులో! – ఎలాంటి సాహిత్యం లభ్యం అవుతోంది? అని ఓ ప్రశ్న మదిలో మెదిలింది ఈ మధ్యన. ఇంగ్లీష్ లో సముద్రం లాంటి బాల సాహిత్యాన్ని తీసుకుంటే, మూడేళ్ల బుడుతల దగ్గర్నుండి, పదిహేనేళ్ల పిల్లల వరకు, ఎన్నో సాహితీ వర్గాలలో, సువిస్తారమైన సాహిత్యం ఉంది. ఐరోపా భాషలలో కూడా తత్తుల్యమైన సాహిత్యం ఉందనే నమ్ముతాను. ఇక పాశ్చాత్య ప్రభావం బలంగా ఉన్న తూర్పు దేశాల భాషలైన జపనీజ్, కొరియన్ భాషల్లో విస్తారమైన బాలసాహిత్యం ఉండడం చూశాను. ఈ సందర్భంలో తెలుగులోను, ఇంగ్లోష్ లోను లభ్యమైన బాలసాహిత్యాన్ని పోల్చుతూ వరుసగా కొన్ని పోస్ట్ లో ఓ సుదీర్ఘమైన వ్యాసం రాయాలని సంకల్పం.
తెలుగులో బాల సాహిత్యంలో నాకు తెలిసినంత వరకు గత రెండు మూడు దశకాలలో పెద్దగా కొత్తదనం వచ్చినట్టు లేదు. పంచతంత్రం, జాతక కథలు, నజీరుద్దీన్, బీర్బల్, తెనాలి రామలింగడు మొదలైన వాళ్ళ కథలు. ఇవి కాకపోతే మన ‘ఎవర్ గ్రీన్’ రామాయణ, భారత, భాగవత గాధలు. తరతరాలుగా ఆ సమాచారమే బాలల సాహిత్యం పేరిట ‘రీసైకిల్’ అవుతున్నట్టు అనిపిస్తోంది. నేను స్కూల్ లో చదువుకునే రోజుల్లో పరిస్థితి మరి కొంచెం మెరుగు అనిపిస్తుంది. చందమామ తో పాటు, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలమిత్ర ఇలా ఎన్నో పత్రికలు ఉండేవి. ఈ మాస పత్రికలతో పాటు చిన్న చిన్న పాకెట్ సైజు పుస్తకాలు (‘భైరవ ద్వీపం’, ‘నేపాళ మాంత్రికుడు’ తరహా పుస్తకాలు!) వచ్చేవి. వీటిని క్లాసులో కూడా టెక్స్ట్ పుస్తకాలలో దాచుకుని దొంగతనంగా చదివేవాళ్ళం! ఆ పుస్తకాలు ఎప్పుడో మాయమైపోయాయి.
(స్కూలు రోజుల్లో దొంగతనంగా చదువుకున్న పుస్తకాలు అంటే ఓ పుస్తకం గుర్తొస్తుంది. అది రైట్ సోదరుల కథ. ఇంపైన తెలుగులో రైట్ సోదరులు విమానాన్ని రూపిందించిన వృత్తాంతాన్ని చాలా రమణీయంగా వర్ణిస్తుంది ఆపుస్తకం. క్లాసులో పిల్లలం ఆ పుస్తకాన్ని లాక్కుని లాక్కుని చదువుకున్నాం. కాని అలాంటి పుస్తకాలు తెలుగులో అరుదు.)
అసలు బాలల సాహిత్యం పట్ల మన సమాజంలో ఓ విచిత్రమైన దృక్పథం ఒకటుంది. ఒకరకమైన ఏకపక్ష ధోరణి వుంది. (ఆ జాఢ్యం అంత సులభంగా పోయేట్టు కనిపించడం లేదు.) పిల్లలకి చెప్పే ప్రతీ కథా ఓ ‘నీతి కథ’ కావాలి. ప్రతీ కథకి చివర్లో ఓ నీతి ఉండాలి. ‘అబద్ధములు ఆడరాదు.’ ‘పెద్దలని గౌరవించవలెను.’ ‘తల్లిదండ్రులని సేవించవలెను.’ ఇలా ఏదో ఒకటి. ఆ నీతి వాక్యాలు చదివేసిన పిల్లలు సజ్జనులుగా ఎదిగేసి దేశానికి మంచిపేరు తెచ్చేసేయాలి.
(విష్ణుశర్మ పంచతంత్ర కథలు బోధిస్తున్న చిత్రం – చిత్రకారుడు వ.పా.)
కొంత మంది పెద్ద రచయితల రచనలలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. గత ఏడాది ఒకసారి ఓ మేటి రచయిత, ఓ పత్రికలో రాసిన ఓ పిల్లల కథ చదివాను. దాని సారాంశం ఇది. ఓ తండ్రి తన కూతుర్ని తీసుకుని ఓ పుస్తకాల కొట్టుకి వెళ్తాడు. రామాయణం (భారతమో గుర్తులేదు) మీద పుస్తకం కొనిస్తానని తీసుకెళ్తాడు తండ్రి. కాని తీరా అంగడికి వెళ్లాక ఆ పాపకి చదరంగం మీద ఓ పుస్తకం నచ్చి కొనుక్కుంటానని అంటుంది. తండ్రి చిన్న క్లాసు పీకుతాడు. అప్పుడు పాపం ఆ పాప తన తప్పు తాను తెలుసుకుని, పశ్చాత్తాపపడి లెంపలేసుకుని, రామాయణ, భారత కథలు చదివేసి మోక్షమార్గాన వేగంగా ముందుకి సాగిపోతుంది. అదీ కథ.
(మరి నాకొక విషయం ఎప్పుడూ అర్థం కాదు. పుట్టినప్పటి నుంచి ‘నీతీ… నీతీ’ అని గటగటా నీతిసారాన్ని గ్రోలి పెరిగిన మన సమాజంలో ఇంత అవినీతి, ఇంత అసమానత ఎందుకున్నాయ్?)
అంటే పిల్లలకి నీతి కథలు కాక అవినీతి కథలు చెప్పాలని నీ ఉద్దేశమా? అంటారేమో. కాదు. ఎందుకంటే పిల్లల లోకం నీతికి, అవినీతికి అతీతమైన లోకం.
బాల్యం ఓ సుందరమైన, సున్నితమైన దశ. పిల్లల లోకమే వేరు. చీమిడి ముక్కులు, చీమచింతకాయలు, గాలిపటాలు, గచ్చకాయలు, తొక్కుడు బిళ్ళలు, గుజ్జెన గూళ్లు, ముద్ద మాటలు, అద్దె సైకిళ్ళు, బొత్తాలూడిన చొక్కాలు, పెచ్చుల్లేచిన మోకాళ్ళు – ఇలా ఎన్నో విచిత్రమైన అంశాలతో కిక్కిరిసిన లోకం అది. అదో అద్భుతమైన ఊహాలోకం. నానా రకాల అసంభవాలూ ఆ లోకంలో సహజ సంభవాలు.
నేను మూడో తరగతిలో ఉండేటప్పుడు అనుకుంటా… ఓ నేస్తం ఉండేవాడు. రోజూ తను చేసే ఏవో సాహస కృత్యాల గురించి, మహత్యాల గురించే కథలు చెప్పేవాడు. వాడు చెప్పిన ప్రతీ కథా శ్రధ్ధగా వినేవాణ్ణి, నమ్మేవాణ్ణి. ఇంటికి వచ్చి మా అమ్మకి ఆ కథ చెప్పాక గాని నా మబ్బులు విడేవి కాదు!
మరి పిల్లల లోకం అంటే అదే. ఆ అందమైన లోకానికి, తటపటాయిస్తూ అంకురింపజూస్తున్న ఆ అతిసుందరమైన అంతర్లోకానికి ప్రాణం పోసేలా ఉండాలి మనం వాళ్లకి అందించే సాహిత్యం. ఆ సాహిత్యంలో బోలెడంత ప్రేమ, ఆనందం, తీపి, సాహసం, అనంతపు హద్దులు తడిమే ఊహ… ఇవి దండిగా ఉండాలి. అలాంటి అంశాలు ఉన్న పరిస్థితుల్లో ఎదిగే పిల్లలు పిల్లల్లా ఎదుగుతారు. సక్రమంగా, నిండుగా, సంతుష్టుడిగా ఎదిగి, తన సత్తా ఏమిటో తెలుసుకుని, తన శక్తికి తగ్గ స్థానాన్ని జీవితంలో ఆక్రమించిన వ్యక్తి సహజంగా నీతిమంతుడు అవుతాడు. నీతి సాహిత్యంతో వాణ్ణి ‘బ్రెయిన్ వాష్’ చెయ్యనక్కర్లేదు.
ఈ సందర్భంలో అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ అన్న మాటలు గుర్తొస్తాయి - “Persons attempting to find a motive in this narrative will be prosecuted; persons attempting to find a moral in it will be banished; persons attempting to find a plot in it will be shot. By Order of the Author.”
కనుక ఓ నీతి సాహిత్యపు గోతి లోంచి పైకొచ్చి ఓ సారి ఇంగ్లీష్ లో బాలసాహిత్యం సంగతి చూద్దాం.
(ఇంకా వుంది)
chaala bavundi......please continue....
బాల సాహిత్యం గురించి చక్కగా రాస్తున్నారు, తరువాత భాగం కోసం చూస్తూవుంటాం.....