ఆకాశంలో స్పుట్నిక్ ని చూసిన దగ్గర్నుండి హోమర్ మనసు మనసులో లేదు. తనతో మరిద్దరు నేస్తాలు కూడా వచ్చారు. చూశారు. కాని కాసేపట్లోనే ఆ విషయం గురించి మర్చిపోయారు. హోమర్ మనసులో మాత్రం ఏదో ఆలోచన దొలిచేస్తోంది.
ఆ రాత్రి హోమర్ ఇంట్లో వాళ్లంతా భోజనం చేస్తున్న సన్నివేశం. హోమర్ తండ్రి పేరు కూడా హోమరే! పూర్తి పేరు హోమర్ హికమ్. అంటే కొడుకు పేరు హోమర్ హికమ్ (జూనియర్) అన్నమాట. మిస్టర్ హికమ్ ఆ గ్రామంలోని బొగ్గు గనికి మేనేజరు. పని పట్ల అపారమైన చిత్తశుద్ధి గల, గొప్ప నిజాయితీ గల వ్యక్తి. అయితే ఈయనకి బొగ్గుగనే లోకం. తన పిల్లలు కూడా పెద్దయ్యాక బొగ్గుగనిలో పని చేస్తారని కలలు కంటుంటాడు. హోమర్ ఇతడికి చిన్న కొడుకు. పెద్ద కొడుకు పేరు జిమ్. ఇతగాడిది ఫుట్ బాల్ లో అందె వేసిన కాలు! కనుక కాలేజి స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాని చిన్న కొడుకైన హోమర్ విషయంలోనే తల్లిదండ్రులకి కొంచెం చింత. ఎందుకంటే మనవాడికి ఫుట్ బాల్ ఆట్టే అబ్బలేదు.
భోజనం దగ్గర అందరూ జిమ్ కి ఫుట్ బాల్ స్కాలర్షిప్ తప్పకుండా వస్తుందని, కాలేజికి వెళ్ళి పెద్ద చదువులు చదువుకుంటాడని ఉత్సహంగా మట్లాడుకుంటుంటారు. వాళ్ల ఉత్సాహాన్ని భంగపరుస్తూ ఉన్నట్టుండి హోమర్ బిగ్గరగా అంటాడు – “ఎలాగైనా ఓ రాకెట్ నిర్మిస్తాను!”
మర్నాడు బడిలో హోమర్ తన నేస్తాలకి తన ఆలోచన గురించి చెప్తాడు. హోమర్ కి ఇద్దరు దోస్తులు. ఒకడి పేరు రాయ్ లీ. ఇతగాడి తండ్రి బొగ్గు గని ప్రమాదంలో మరణిస్తాడు. పెంపుడు తండ్రి పెంచుకుంటుంటాడు. అయితే పెంపుడు తండ్రి కిరాతకుడు. తాగొచ్చి రోజూ కొడుకుని చావబాదుతూ ఉంటాడు. రెండవ మిత్రుడు షర్మాన్ ఓ డెల్. ఇతగాడి తండ్రి కూడా బొగ్గు గనిలో ప్రమాదంలో పోయిన వాడే.
అయితే ఇద్దరికీ రాకెట్ గురించి పెద్దగా తెలీదు. మొత్తం మీద ముగ్గురికీ రాకెట్ గురించి ఒకే మోతాదులో తెలుసని ముగ్గురికీ అర్థమవుతుంది. మరేం చెయ్యాలి?
ఓం ప్రథమంగా చిన్న ప్రయోగం చేస్తారు. ఎక్కడో కొన్ని ‘దీపావళి’ పటాసుల లాంటి 30 పటాసులు సంపాదించి, అందులోని మందుగుండు తీసి, ఓ గొట్టంలోకి దట్టించి చిన్న రాకెట్ లాంటిది తయారు చేస్తారు. దాన్ని హోమర్ ఇంటి పెరట్లో, కంచె మీద కూర్చోబట్టి వత్తి అంటిస్తారు. ముగ్గురూ మెడలు సారించి ఎంత ఎత్తుకు పోతుందో నని ఆత్రంగా చూస్తుండగా ఓ పెద్ద చప్పుడు వినిపిస్తుంది. ముగ్గురూ ఆ పేలుడికి వెల్లకిలా పడతారు. దెబ్బకి కళ్లు బైర్లు కమ్ముతాయి. లోపలి నుండి హోమర్ తల్లి ఎల్సీ ఆదుర్దాగా పరుగెత్తుకుని బయటికి వస్తుంది.
పరిస్థితి చూసి, విషయం అర్థమై “ఒరేయ్! రాకెట్లతో ఆడుకోమన్నా గాని, ప్రాణాల మీదికి తెచ్చుకో మన్లేదు” అని ముగ్గుర్నీ దులిపేస్తుంది.
ఉత్సాహంగా చేసిన ఈ ప్రథమ రాకెట్ ప్రయోగం అలా ‘తుస్సు’ మన్నందుకు హోమర్ విచారపడతాడు.
ఒక పక్క ఈ బాల రాకెట్ శాస్త్రవేత్తల పాట్లు ఇలా ఉంటే, ఇంచుమించు అదే కాలంలో నాసాలో ఫాన్ బ్రౌన్ గారు పంపిన రాకెట్లు కూడా ఇలాగే కూలిపోతుంటాయి. వాన్గార్డ్ (Vanguard) రాకెట్ విఫలమవుతుంది.
ఏకలవ్య శిష్యుడిలా హోమర్ తన బాధంతా వెళ్లగక్కుకుంటూ వెర్నర్ ఫాన్ బ్రౌన్ కి విఫలమైన తన ప్రయత్నం గురించి ఉత్తరం రాస్తాడు. అలాగే అదే ఉత్తరంలో విఫలమైన వాన్ గార్డ్ రాకెట్ గురించి సంతాపం కూడా వ్యక్తం చేస్తాడు.
మరి ప్రాణాపాయం లేకుండా రాకెట్ ని తయారు చెయ్యడం ఎలా? సరైన పద్ధతి ఏంటో కచ్చితంగా కనుక్కుని చెయ్యాలి. తలతిక్క ప్రయోగాలు చేస్తే గాల్లోకి లేచేది రాకెట్ కాదు. మరి ఎవరిని అడగాలబ్బా అని మిత్రులు ముగ్గురూ తలలు పట్టుకుంటారు.
వీళ్ల బళ్లో విడ్డూరం శాల్తీ ఒకడు ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఓ మూల కూర్చునే ఒంటరి పురుగు. వీడో పుస్తకాల పురుగు కూడా. వీడి పేరు క్వెంటిన్ విల్సన్. సైన్స్ లో తన తోటి నేస్తాల కన్నా ఎంతో పరిజ్ఞానం ఉన్నవాడు.
మర్నాడు స్కూల్ కాంటీన్ లో ఓ మూల ఒక్కడే కూర్చుని తింటున్న క్వెంటిన్ ని సమీపించి హోమర్ మాట కలపబోతాడు. హోమ్ వర్క్ కాపీ కొట్టాలని చూస్తున్నాడేమో నని సందేహించి, కుదరదంటాడు క్వెంటిన్. కాని హోమర్ రాకెట్ విషయం అడుగుతాడు.
క్వెంటిన్ రాకెట్ల గురించి తనలి తెలిసినదంతా ఏకరువు పెట్టుకొస్తాడు. క్రీ.శ. 1000 లో చైనా వాళ్లు మొదట రాకెట్లు కనుక్కున్నారంటూ రాకెట్ల చరిత్ర చెప్పుకొస్తాడు. తన వద్ద ఉన్న ‘సైంటిఫిక్ అమెరికన్’ పత్రికలో ఓ వ్యాసం తెచ్చి చూపిస్తాడు. అందులో రాకెట్ ఎలా తయారు చెయ్యాలో వివరంగా ఉంటుంది.
(తెవికీ)
వ్యాసం చదివాక పిల్లలు ముగ్గిరికీ రాకెట్ నిర్మాణం గురించి కొన్ని ప్రాథమిక విషయాలు అర్థమవుతాయి. రాకెట్ ఇంధనంలో ముఖ్య అంశాలు పొటాషియమ్ క్లోరేట్, మరియు సల్ఫర్. ఈ రెండు పదార్థాలు ఎక్కడో సంపాదిస్తారు. అలాగే రాకెట్ దేహానికి ఓ లోహపు గొట్టం తెచ్చి దాన్ని సరైన పొడవుకి కోస్తారు. ఆ గొట్టానికి ఒక కొసలో చిన్న టోపీ లాంటి మూత పెడతారు. అవతలి కొసలో ఇంధనం మండగా పుట్టే జ్వాలలు బయటికి పోడానికి ఓ సన్నని ద్వారం ఏర్పాటు చెయ్యాలి. అంటే గొట్టాన్ని ఇంచుమించు మూస్తూ ఓ వాషర్ ని తెచ్చి అక్కడ వెల్డింగ్ (welding) చెయ్యాలి.
కుర్రాళ్ళు ముగ్గురికీ మరి వెల్డింగ్ రాదు. కనుక హోమర్ తన తండ్రి వద్ద పని చేసే ఇసాక్ బైకోవ్స్కీ అనే ఓ ఉద్యోగి సహాయం అడుగుతాడు. కంపెనీ సరంజామా ఉపయోగించి పిల్లలకి సాయం చేశాడని తెలుస్తే హోమర్ తండ్రి మండిపడతాడని బైకోవ్స్కీ కి బాగా తెలుసు. అయినా పిల్లల ఉత్సాహం చూసి వాళ్ళు అడిగినట్టే గొట్టానికి ఒక కొసలో వాషర్ వెల్డ్ చేసి ఇస్తాడు. ఇప్పుడు రాకెట్ దేహం సిద్ధం అయ్యింది. అందులో అంతకు ముందు తయారు చేసిన మందుగుండు పొడి బాగా దట్టించి మళ్లీ ప్రయోగానికి సిద్ధం అవుతారు.
మళ్లీ రాకెట్ ని హోమర్ ఇంటి కంచె మీద ప్రతిష్టించి వత్తి అంటించడానికి ఆయత్తం అవుతారు.
(ఇంకా వుంది)
ఆ బాగుంది.తరువాత ఏమైంది.
where is the next part?