కౌ పాక్స్ సోకిన వ్యక్తికి స్మాల్ పాక్స్ నుండి కూడా రోగనిరోధకత కలుగుతుందని గ్లౌసెస్టర్ లో ఓ నమ్మకం చలామణిలో ఉండేది. దానికి అంతోఇంతో ఆధారాలు కూడా లేకపోలేదు. గొల్లస్త్రీలకి గోవులతో సాన్నిహిత్యం వల్ల సులభంగా కౌపాక్స్ సోకుతుంది. కాని వారికి స్మాల్ పాక్స్ సోకినా వారికి అందరిలాగా ముఖం మీద స్ఫోటకపు మచ్చలు రావు.
అదే ఊళ్లో ఉండే ఎడ్వర్డ్ జెన్నర్ (1749 – 1823) అనే ఓ వైద్యుడికి ఆ నమ్మకం ఆసక్తి కలిగించింది. అదేంటో పరీక్షించి తేల్చుకోవాలని అనుకున్నాడు. (కాస్త నాసిరకం వైద్యుడు అయితే ఆ నమ్మకాన్ని “పూర్వీకుల వరప్రసాదం” అని గుడ్డిగా స్వీకరించి ఆచరించేవాడు!) 1796 లో వివాదాస్పదమైన పరీక్షకి పూనుకున్నాడు. కౌ పాక్స్ సోకిన సేరా నెల్మ్స్ ఓ గొల్లవనిత చేతి మీద లేచిన పుండు నుండి కాస్త ద్రవాన్ని తీసుకుని, ఆ ద్రవాన్ని స్మాల్ పాక్స్ సోకిన జేమ్స్ ఫిప్స్ అనే ఓ ఎనిమిదేళ్ల పిల్లవాడి లోకి ఎక్కించాడు. ఈ పిల్లవాడు జెన్నర్ తోటమాలి కొడుకు. రెండు నెలల తరువాత మరింత కీలకమైన పరీక్ష తలపెట్టాడు జెన్నర్. చిన్నారి జేమ్స్ లోకి ఏకంగా స్మాల్ పాక్స్ రోగాన్ని కలిగించే ద్రవాన్ని ఎక్కించాడు. కాని ఆ పిల్లవాడికి స్మాల్ పాక్స్ సోకలేదు. అంటే అతడిలో స్మాల్ పాక్స్ కి వ్యతిరేకంగా రోగనిరోధకత ఏర్పడింది అన్నమాట.
జెన్నర్ ప్రయోగాల వల్ల రోగం మీద పోరాటంలో ఓ కొత్త అస్త్రం కనిపెట్టబడింది.
అంతవరకు బాక్టీరియా మొదలైన క్రిముల వల్ల సోకిన రోగాల విషయంలో నేరుగా క్రిములని సంహరించే మందులని వాడే పద్ధతి వినియోగించబడుతూ వచ్చింది. కాని ఈ కొత్త రోగాల విషయంలో అలా ప్రత్యేక క్రిమిసంహారక పద్ధతులు వాడబడలేదు. ఒక రోగాన్ని పరిహరించడానికి ఆ రోగాన్ని పోలిన, మరింత బలహీనమైన రోగానికి కారణమైన “క్రిమి”ని (ఆ “క్రిమి” బాక్టీరియా కన్నా చాలా భిన్నమైన వైరస్ అనే కొత్తరకం “క్రిమి” అని అప్పుడు తెలీదు) రోగి లోకి ఎక్కించి, ఆ బలవత్తరమైన రోగానికి ప్రతికూలంగా రోగనిరోధకత (immunity) కలుగజేయడమే ఈ కొత్త పద్ధతి. బాక్టీరియల్ వ్యాధులతో పోల్చితే వైరల్ వ్యాధుల చికిత్సలో మౌలికంగా భిన్నమైన పద్ధతి వాడడం గమనార్హం. దానికి కారణం రోగలక్షణాలు కలిగించే తీరులో బాక్టీరియాకి, వైరస్ కి మధ్య ఉండే తేడాయే. అయితే ఆ తేడా గురించి ఆ రోజుల్లో తెలుసుకునే అవకాశమే లేదు. ఎందుకు పని చేస్తుందని ప్రశ్నించకుండా, ఏదో పని చేస్తోంది కదా అని ఈ కొత్త పద్ధతిని వినియోగిస్తూ పోయారు.
ఫిప్స్ విషయంలో తను సాధించిన విజయం గురించి వివరంగా రాసి ఆ పేపర్ ని రాయల్ సొసయిటీకి పంపాడు జెన్నర్. ఆ పత్రిక జెన్నర్ పేపర్ ని మరిన్ని ఆధారాలు కావాలంటూ తిప్పి కొట్టింది. జెన్నర్ మరింత మంది రోగుల మీద తన కొత్త పద్ధతి ప్రయోగించాలని చూశాడు. జేమ్స్ ఫిప్స్ విషయంలో రోగం పూర్తిగా నయమైనా ఆ చికిత్సని స్వీకరించడానికి జనం సులభంగా ఒప్పుకోలేదు. స్మాల్ పాక్స్ ని వదిలించుకోబోయి కౌపాక్స్ ని తెచ్చుకుంటే ఆవుల లాగానే తోకలు, కొమ్ములు మొలుస్తాయేమో నని భయపడ్డవారు కూడా ఉన్నారు (చిత్రం).
జెన్నర్ ఎలాగో తిప్పలు పడి మరో 23 మంది రోగుల మీద తన మందు ఎక్కించి స్మాల్ పాక్స్ ని నయం చేశాడు. ఈ సారి మరిన్ని ఆధారాలతో రాసిన వ్యాసాన్ని రాయల్ సొసయిటీ స్వీకరించి ప్రచురించింది.
జెన్నర్ శ్రీకారం చుట్టిన ఈ పద్ధతికి vaccination అని పేరు. (vaccinia అంటే లాటిన్ లో కౌ పాక్స్ అని అర్థం). వాక్సినేషన్ పద్ధతి యూరప్లో కార్చిచ్చులా వ్యాపించింది. కొంత మంది పురోగాములు ఈ వాక్సినేషన్ ప్రక్రియని ఓ ఉద్యమంలా తీసుకుని లక్షలాది ప్రజలకి జెన్నర్ కనిపెట్టిన స్మాల్ పాక్స్ వాక్సీన్ ని ఇప్పించారు. అలాంటి వారిలో ప్రముఖుడు డాక్టర్ ఫ్రాన్సిస్కో జేవియర్ ద బాల్మిస్. ఈ బాల్మిస్, అతడి సహచరులు మూడేళ్ళ పాటు ప్రపంచం అంతా కలయదిరిగి యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఫిలిపీన్స్, చైనా మొదలుగా ఎన్నో ప్రాంతాలు తిరిగి లక్షలాది ప్రజలకి వాక్సీన్ ఇప్పించారు. ఆ అనుపమాన వైద్య యాత్ర గురించి రాస్తూ “చరిత్ర పుటల్లో ఇంతకన్నా సమున్నతమైన, సువిస్తారమైన ప్రజాసేవా ఉద్యమం ఉంటుందని అనుకోను” అంటాడు జెన్నర్.
జెన్నర్ ప్రయాస వల్ల స్మాల్ పాక్స్ జయించబడింది. 1979 లో WHO స్మాల్ పాక్స్ పూర్తిగా నిర్మూలింపబడ్డ వ్యాధులలో ఒకటని ప్రకటించింది.
జెన్నర్ తరువాత ఇంచుమించు ఓ శతాబ్ద కాలం తరువాత మరిన్ని వైరల్ వ్యాధుల మీద ధ్వజం ఎత్తిన మరో మహామహుడు ఉన్నాడు…
(ఇంక వుంది)
http://en.wikipedia.org/wiki/Edward_Jenner http://en.wikipedia.org/wiki/Balmis_Expedition
నిజంగానే వైద్యచరిత్రలో గొప్ప సంఘటన,. డాక్టర్ ఫ్రాన్సిస్కో జేవియర్ ద బాల్మిస్ వీరి గురించి నేను ఎక్కడా చదవలేదండి, మంచి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు.