శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

మార్స్ మీద కాలువలు ఉన్నాయా?

Posted by V Srinivasa Chakravarthy Sunday, October 3, 2021

 

 

లొవెల్ తన జీవితమంతా మార్స్ అంటే మనసుపడ్డాడు. 1877లో ఇటాలియన్ ఖగోళశాస్త్రవేత్త జియొవానీ షియాపరెల్లీ మార్స్ మీద canali ఉన్నాయని చేసిన ఒక ప్రకటన విని నిర్ఘాంతపోయాడు లొవెల్. మార్స్ భూమికి బాగా దగ్గరగా వచ్చిన ఒక దశలో ఎన్నో నిశితమైన పరిశీలనలు చేశాడు. మార్స్ ఉపరితలం మీద ఎన్నో అడ్డుగీతలు, నిలువు గీతలు, ఒంటరిగాను, జంటల గాను, ఒక జాలంలా విస్తరించి ఉండడం చూశాడు షియాపరెల్లీ. ఇటాలియన్ భాషలో canali అంటే అగాధాలు, లేదా నేలలో గాట్లు. ఇంగ్లీష్ లో అది canal అంటే కాలువగా అనువదించబడింది. అంటే అవి కృత్రిమ నిర్మాణాలు అన్న భావన చోటు చేసుకుంది. అప్పటి నుండి మార్స్ పట్ల ఒక రకమైన ఉన్మాదం యూరప్, అమెరికా ఖండాల్లో వెర్రి తలలు వేసింది. ఉన్మాదం లొవెల్ మనసుని కూడా ఆక్రమించింది.

1892 లో చూపు మందగిస్తోందని షియాపరెల్లీ తన మార్స్ పరిశీలనలని ఆపేస్తున్నానని ప్రకటించాడు. కృషిని లొవెల్ కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. అందుకు ఒక ఉన్నత స్థాయి నక్షత్రశాల కావాలి. అక్కడ మబ్బులు అడ్డురాకూడదు. నగర కాంతులు చిత్రాన్ని కలుషితం చెయ్యకూడదు. వాతావరణం నిశ్చలంగా ఉండాలి. అప్పుడే ఖగోళ చిత్రాల నేపథ్యంలో ఉండే ఒక అవాంఛనీయమైన మెరుపు తగ్గుతుంది. వాతావరణంలో ఉండే సంక్షోభం వల్లనే ఖగోళ చిత్రాలు దెబ్బతింటాయి. తారలు మినుకు మినుకు మని కనిపించేది కూడా సంక్షోభం వల్లనే. అరిజోనా రాష్ట్రంలో, ఫ్లాగ్ స్టాఫ్ అనే ఊళ్లో మార్స్ కొండ మీద, సొంతింటికి దూరంగా లొవెల్ తన నక్షత్రశాల నిర్మించుకున్నాడు.[1] అక్కడి నుండి మార్స్ ఉపరితల విశేషాలని పరిశీలించాడు. తనని అంతగా సమ్మోహన పరిచిన కాలువలని రకరకాలుగా చిత్రాలు గీశాడు. ఇలాంటి పరిశీలనలు చెయ్యడం అంత సులభం కాదు. నడిరాతిరి ఎముకలు కొరికే చలిలో గంటల తరబడి టెలిస్కోప్ ముందు కూర్చోవాలి. కొన్ని సార్లు చిత్రం చెదిరిపోతుంది, అలుక్కుపోయినట్టు ఉంటుంది. అలాంటి చిత్రాలని పారేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు చిత్రం కుదురుగా ఏర్పడుతుంది. గ్రహం ముఖ లక్షణాలు ఒక్క క్షణం పదునుగా, స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి సందర్భాల్లో మన అదృష్టాన్ని తలచుకుని చిత్రాలని కాగితాల మీదకి ఎక్కించాలి. మన అనిర్ధారిత విశ్వాసాలని పక్కన పెట్టి, చిత్రంలో కనిపించే మార్స్ అద్భుతాలని విప్పారిన మనసుతో, ఇంతేసి కళ్లతో పరికించాలి.

 

పార్సివాల్ లొవెల్ తన నోట్సు పుస్తకాలని మార్స్ చిత్రాలతో నింపేశాడు. చీకటి ప్రదేశాలు, ప్రకాశవంతమైన ప్రాంతాలు, కాస్తంత మంచు కప్పిన ధృవాలు. ఇవి గాక కాలువలు. చిలువలు పలువలుగా కాలువలు. గ్రహం అంతా విస్తరించిన నీటిపారుదల కాలువల జాలం వుందని అనిపించింది లొవెల్ కి. కరుగుతున్న హిమావృత ధృవాల నుండి మంచునీటిని, దాహంతో అలమటిస్తున్న గ్రహమధ్య ప్రాంతాలకి కాలువలు మోసుకుపోతున్నాయని ఊహించుకున్నాడు. మన కన్నా తెలివైన, మన కన్నా వయసైన నాగరికత గ్రహం మీద నెలకొందని నమ్మాడు. మార్స్ మీద చీకటి ప్రాంతాలలో వచ్చే మార్పులకి కారణం అక్కడ వృక్షసంపదలో వచ్చే ఆటుపోట్లేనని నమ్మాడు. మార్స్ చాలా మటుకు భూమిలాగే ఉంటుందని నమ్మాడు. మొత్తం మీద అతడు చాలా నమ్మాడు.

మార్స్ గ్రహం ప్రాచీనమైన, మోడువారి, శుష్కించిన ఎడారిలోకం అన్నట్టు లొవెల్ చిత్రీకరించాడు. కాని అది భూమిని పోలిన ఎడారి లోకం. లొవెల్ ఊహలో మార్స్ ఉపరితలం అమెరికాలోని దక్షిణ-పశ్చిమ ప్రాంతానికి చెందిన ఎడారులని పోలి వుంటుంది. లొవెల్ నిర్మించిన నక్షత్రశాల అమెరికాలో ప్రాంతంలోనే ఉండడం విశేషం. మార్స్  వాతావరణంలో శైత్యం కాస్త హెచ్చే కావచ్చుగాని, మహా అయితేదక్షిణ ఇంగ్లాండ్ లో వాతావరణంలాఉంటుందిలా అని భావించాడు. గాలి పలచగానే ఉండొచ్చు గాని, అందులో పీల్చుకోవడానికి కావలసినంత ఆక్సిజన్ ఉంటుందను కున్నాడు. నీరు అరుదుగా కనిపించినా, అద్భుతమైన నీటిపారుదల వ్యవథ పుణ్యమా అని  ధృవాల నుండి మొత్తం గ్రహం అంతా నీరు సరఫరా అవుతుంది.

లొవెల్ భావాలకి రోజుల్లో అత్యంత తీవ్రమైన వ్యతిరేకత ఒక అనుకోని దిశ నుండి వచ్చింది. 1907 లో, పరిణామ సిద్ధాంతాన్ని డార్విన్ తో పాటు స్వతంత్రంగా కనుక్కున్న ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ ని, లొవెల్ రాసిన పుస్తకానికి సమీక్ష రాయమన్నారు. ఇతడు యవ్వనంలో ఇంజినీరింగ్ లో శిక్షణ పొందాడు. అతీంద్రియ శక్తులు మొదలైన వాటిని కొద్దో గొప్పో నమ్మిన ఆధారాలు ఉన్నాయి. కాని ఎందుకో మరి మార్స్ మీద జీవావాసాలు ఉండడం విషయంలో మాత్రం పూర్తి అవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. మార్స్ మీద సగటు ఉష్ణోగ్రతల లెక్కల్లో లొవెల్ పొరబడ్డాడని వాలెస్ నిరూపించాడు. దక్షిణ ఇంగ్లాండ్ లోలాగ మధ్యస్థమైన శీతోష్ణస్థితులు  ఉండకపోగా, ఇంచుమించు గ్రహం మీద ప్రతీ చోట ఉష్ణోగ్రత నీటి ఘనీభవన బిందువు కన్నా తక్కువే ఉందని చూపించాడు. గ్రహం మీద శాశ్వత హిమం (permafrost) ఉండి తీరాలని నిర్ణయించాడు. చందమామ మీద ఉన్నట్టే ఇక్కడ కూడా ఉల్కాబిలాలు పుష్కలంగా ఉంటాయన్నాడు. ఇక మార్స్ కాలువల లో నీటి విషయమై ఇలా అంటున్నాడు

 

హిమావృత ధృవాల నుండి, పొంగిపొరలే కాలువల ద్వార, ఒక్క మబ్బుతునక కూడా లేని దారుణ ఎడారి ప్రాంతాల ద్వార, భూమధ్యరేఖని దాటి అవతలి గోళార్థం వరకు మోసుకుపోయే ప్రయత్నం చేసే వారు, ప్రజ్ఞ గల జీవులు కారు కదా, వట్టి వెర్రివెంగళప్పలు అయ్యుండాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రవహించే నీరు, ఆవిరై గాని, ఇసుకలోకి ఇంకిపోయి గాని, వందమైళ్లకి మించి ముందుకు పారలేదు.”

 

ఇలాంటి తీవ్ర విమర్శాత్మకమైన, కచ్చితమైన భౌతిక విశ్లేషణ రాసినప్పటికి వాలెస్ వయసు ఎనభై నాలుగు. విశ్లేషణ బట్టి మార్స్ మీద జీవం ఉండడం అసంభవం అని తేల్చి చెప్పాడు. అతడి ఉద్దేశంలో జీవం అంటే నీటి పారుదల వ్యవస్థలు నిర్మించగల సివిల్ ఇంజినీర్లు! ఇక సూక్ష్మక్రిములు ఉంటాయా లేదా అన్నవిషయం మీద అతడు వ్యాఖ్యానించలేదు.

 

కాని వాలెస్ విమర్శని ఎవరూ పట్టించుకోలేదు. లొవెల్ వాడిన టెలిస్కోప్ ని తలదన్నే టెలిస్కోప్ లతో ఎందరో ఇతర ఖగోళశాస్త్రవేత్తలు మార్స్ ని పరిశీలించి అక్కడ లొవెల్ వర్ణించిన కాలువలని కనిపెట్టలేకపోయారు. అయినా లొవెల్ చిత్రీకరించిన మార్స్ జనసామాన్యానికి నచ్చింది. జనం కాలువలని ప్రాచీన, పౌరాణిక విశేషాలుగా భావించడం మొదలెట్టారు. మార్స్ కాలువలు జనం మనసులని అంతగా ఆకర్షించడానికి కారణం కొంతవరకు అప్పటి సామాజిక నేపథ్యం అని చెప్పాలి. పందొమ్మిదవ శతాబ్దం ఇంజినీరింగ్ అద్భుతాల యుగం. అద్భుతాలలో పెద్ద పెద్ద కాలువల నిర్మాణం కూడా భాగమయ్యింది. 1869 లో నిర్మించబడ్డ సూయెజ్ కాలువ, 1893 లో నిర్మించబడ్డ కోరింత్ కాలువ, 1914 లో నిర్మించబడ్డ పనామా కాలువ, అమెరికాలో గ్రేట్ లేక్స్ లాకులు, న్యూ యార్క్ రాష్ట్రంలోని బార్జ్ కాలువలు, అమెరికాలో దక్షిణ-పశ్చిమ ప్రాంతానికి చెందిన నీటి సరఫరా కాలువలు అన్నీ కోవకి చెందినవే. యూరొపియన్లు, అమెరికన్లు అలాంటి అద్భుతాలు సాధించినప్పుడు, అవి మార్షియన్లకి ఎందుకు సాధ్యం కావు? శుష్కించి, శిధిలమవుతున్న ఎర్ర గ్రహాన్ని కాపాడడానికి మన కన్నా పరిపాకం చెందిన నాగరికత అలాంటి విస్తృతమైన కాలువల వ్యవస్థ నిర్మించడంలో ఆశ్చర్యమేముంది?



మార్స్ మీద కాలువలు - ఊహా చిత్రం (ఎడమ పక్క); వాస్తవంలో మార్స్  చిత్రం (కుడి పక్క)



(ఇంకా వుంది)



[1] ఈ విషయం మీద ఐసాక్ న్యూటాన్ ఇలా రాశాడు. టెలిస్కోప్ ల నిర్మాణ సూత్రాలని ఆచరణలో పెట్టినప్పుడు, కొన్ని పరిమితులకి మించి ఆ టెలిస్కోప్ లు పని చెయ్యలేకపోవచ్చు. మనం ఏ గాలిలో నుండి అయితే తారలని చూస్తామో, ఆ గాలి నిరంతరం సన్నగా చలిస్తూ ఉంటుంది…దాని ఒక్కటే విరుగుడు. గాలి నిశ్చలంగా ఉండాలి. మేఘాలకి పైన అత్యున్నత శిఖరాల పైన గాలి అలా నిశ్చలంగా ఉంటుంది.

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts