శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

వాయేజర్ 2 చెప్పిన "యాత్రికుల కథలు"

Posted by V Srinivasa Chakravarthy Saturday, September 10, 2022

 

పుడమిపై కడళ్ల మీద చేసిన మొట్టమొదటి సాహసయాత్రా సాంప్రదాయంలో వచ్చినవే నేటి వైకింగ్ చేసిన వాయేజర్ అంతరిక్ష నౌకా యాత్రలు. క్రిస్టియాన్ హైగెన్స్ కి చెందిన వైజ్ఞానిక, మేధోజన్య సాంప్రదాయంలో వచ్చినవే నేటి అంతరిక్ష పరిశోధనలు, ప్రయాసలు. చుక్కల దిశగా కొట్టుకుపోయే తెప్పలు మన వాయేజర్ నౌకలు. మార్గమధ్యంలో వాయేజర్ కి ఎదురుపడిన ప్రపంచాల గురించే హైగెన్స్ కోటి కలలు కన్నాడు,  అనేకరీతుల ఆరాధించాడు.

కొన్ని శాతాబ్దాల క్రితం నావికులు విశాల సముద్రాల మీద ధ్వజమెత్తి సాహసయాత్రలు తలపెట్టినప్పుడు, వారితో పాటు వెనక్కి తిరిగి తెచ్చిన వస్తువులలోయాత్రికుల కథలుకూడా ఉన్నాయి. అపరిచిత భూముల గురించి, అనిర్వచనీయ జీవాల గురించి తిరిగొచ్చిన నావికులు కథలుకథలు చెప్పేవారు.   కథలన్నీ శ్రోతల మనసులని సంభ్రమాశ్చర్యాలతో నింపేవి. ఆకాశాన్నంటే కొండలు; నిప్పులు కక్కే రాకాసిబల్లులు; సముద్రాలని మధించే జలరాకాసులు; కనువిందు చేసే బంగరు పళ్యాలలో చేసే విందులు; తొండాన్ని మహాదండంలా వాడే మృగాలు; ప్రొటెస్టంట్లు, కాథలిక్కులు, యూదులు, ముస్లిమ్లు మొదలైన వర్గాల మధ్య మతకలహాలని హాస్యాస్పదంగా భావించే సంస్కారవంతమైన సమాజాలు; మండే నల్లని శిలలు; చాతీలో నోళ్లు కలిగిన, తలలు లేని నరులు; మొక్కలకి పుట్టే మేకలుఇలా ఎన్నెన్నో అంతులేని వింతలు. కథలలో కొన్ని నిజాలు, కొన్ని కల్లలు. మరి కొన్నిట్లో ఎక్కడో సత్యబీజం వున్నా, దాన్ని విన్నవారు, వినిపించిన వారు ఎక్కడో తప్పుగా అర్థం చేసుకున్నారు. కథలన్నీ వోల్టేర్, జోనాథన్ స్విఫ్ట్ వంటి రచయితల కలాలకి పదును పెట్టాయి. అంతవరకు బాహ్య ప్రపంచం గురించి తెలియక కూపస్థంగా మిగిలిపోయిన యూరొపియన్ సమాజం మీద వారి రచనలు దుమ్మెత్తి పోశాయి.

 

నేటి వాయేజర్ నౌకలు కూడా ఎన్నో కమ్మని యాత్రికుల కథలు చెప్పాయి. తుత్తునియలైన గాజుగోళంలా పగిలిపోయిన ప్రపంచం కథ; సాలీడు గూళ్ళ లాంటి జాలంతో ధృవం నుండి ధృవం దాక కప్పబడ్డ ప్రపంచం కథ; బంగాళ దుంపల్లా వికారమైన ఆకారం గల చందమామల కథ; భూగర్భంలో సముద్రాన్ని దాచుకున్న ప్రపంచం కథ;  కుళ్లిన కోడిగుడ్ల కంపు కొడుతూ పీజ్జా కనిపించే నేలతో, కరిగిన గంధకపు కొలనులతో, నేరుగా అంతరిక్షంలోకే పొగలు గక్కే జ్వాలాముఖులతో జ్వలించే విచిత్ర ప్రపంచపు కథ; చిన్న చుక్కలాంటి మన భూమి ముందు దిగ్గజం లాంటి జూపిటర్ అనే గ్రహం కథ. గ్రహంలో మన భూములు 1000 పైగా పట్టేస్తాయి.

జూపిటర్ చుట్టూ తిరిగే గెలీలియన్ ఉపగ్రహాలు ఒక్కొక్కటి ఇంచుమించు మెర్క్యురీ గ్రహం అంత పెద్దవి. వాటి పరిమాణాలని, ద్రవ్యరాశిని, సాంద్రత విలువలని లెక్కించొచ్చు. దాన్ని బట్టి వాటి అంతరంగ నిర్మాణం గురించి తెలుస్తుంది. వాటిలో జూపిటర్ కి సన్నిహితంగా ఉండే అయో (Io), యూరోపా (Europa)  లు రాయిలా కఠినమైనవి. జూపిటర్ కి ఇంకా దూరంగా ఉండే గానిమీడ్ (Ganymede), కాలిస్టో (Callisto)  లు కాస్త సాంద్రత తక్కువ గలవి. రాయికి, మంచు గడ్డకి మధ్యస్థంగా ఉంటుంది వారి సాంద్రత. అయితే రాయి, మంచుగడ్డల మిశ్రమంలో రేడియో ధార్మిక పదార్థాల ఆనవాళ్లు ఉండి తీరాలి. అలాంటి ఆనవాళ్లు ఇక్కడ మన భూమిలో కూడా భూగర్భశిలలలో దొరుకుతాయి. దాని వల్ల పరిసరాలు వేడెక్కుతాయి. అలా ఉపగ్రహాల లోతుల్లో కోట్ల సంవత్సరాలుగా పేరుకుంటున్న వేడిమి అంతా ఉపరితలాన్ని చేరుకుని, అంతరిక్షంలోకి తప్పించుకునే అవకాశమే లేదు. కాబట్టి గానిమీడ్, కాలిస్టో లలో ఉండే వేడిమి, మంచు రూపంలో ఉండే వాటి అంతరంగాలని కరిగిస్తుంది. చందమామలలో నీరు, బురదలతో కూడుకున్న ఆర్ద్రమైన  అంతరంగాలు ఉండి ఉండాలి.  వాదన బట్టి జూపిటర్ చందమామల మధ్య ఎంతో వైవిధ్యం ఉండి ఉండాలని అనిపించింది. తదనంతరం వాయేజర్ చేసిన పరిశీలనలు సిద్ధాంతాలని నిర్ధారించాయి. వాటి మధ్య అసలు పోలికే లేదు. ఇంతవరకు మనం చూసిన ప్రపంచాలకి, వీటికి మధ్య చాలా భేదం వుంది.

 

వాయేజర్ 2 అంతరిక్షనౌక మళ్లీ ఎప్పుడూ భూమికి తిరిగి రాదు. కాని అది కనుక్కున్న శాస్త్రీయ సంగతులు, అనుపమాన ఆవిష్కరణలు, దానియాత్రికుల కథలు’, మాత్రం మనకి పదిలంగా చేరుకున్నాయి. జూలై 9, 1979 నాడు ఏం జరిగిందో సారి గమనిద్దాం. రోజు పసిఫిక్ ప్రామాణిక కాలంలో (Pacific Standard Time) 8:04   గంటలకి యూరోపా అనబడే మరో ప్రపంచం నుండి భూమికి సమాచారం అందింది.

బాహ్యసౌరమండలంలో తీసిన చిత్రం అసలు మనని ఎలా చేరుతుంది? జూపిటర్ చుట్టూ పరిభ్రమిస్తున్న యూరోపా మీద సూర్యకాంతి పడుతుంది. కాంతిలో కొంత భాగం ప్రతిబింబించబడి వాయేజర్ నౌక మీద ఉన్న టీవీ కెమేరాల ఫాస్ఫార్ మీద పడినప్పుడు చిత్రం ఏర్పడుతుంది. చిత్రం రేడియో సంకేతాల ద్వార అర బిలియన్ కిలోమీటర్ల దూరాన్ని దాటుకుని భూమి మీద ఉన్న భూకేంద్రాన్ని (ground station) చేరుకుంటుంది. వాటిలో ఒకటి స్పెయిన్ లోను, ఒకటి కాలిఫోర్నియాలోని మొహావీ ఎడారిలోను, ఇంకొకటి ఆస్ట్రేలియాలోను ఉంది. (1979 లో జూలై లో నాటి ఉదయాన భూమికి సమాచారం అందిన సమయంలో ఆస్ట్రేలియా కేంద్రమే జూపిటర్, యూరోపా దిశలో తిరిగి వుంది.) సమాచారాన్ని అందుకున్న భూకేంద్రం భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సాటిలైట్ ద్వార దక్షిణ కాలిఫోర్నియాకి పంపిస్తుంది. అప్పుడా కేంద్రం మైరోవేవ్ రిలే టవర్ల ద్వార సమాచారాన్ని జెట్ ప్రపల్షన్ లాబొరేటరీలో వుండే  కంప్యూటర్ కి ప్రసారం చేసుంది. అప్పుడా కంప్యూటర్ చిత్రాన్ని ప్రాసెస్ చేస్తుంది. చిత్రం  కూడా ఇంచుమించు వార్తాపత్రికల్లో అచ్చయ్యే చిత్రాల మాదిరిగానే ఉంటుంది. ఒక్కొక్క చిత్రంలో సుమారు మిలియన్ చుక్కల దాకా ఉంటాయి. చుక్కల రంగు నలుపు, తెలుపులకి మధ్యస్థంగా ఉంటుంది. చుక్కలు బాగా దగ్గరదగ్గరగా ఉంటాయి కనుక కొంత దూరం నుండి చూస్తే చుక్కలు కనిపించవు. అంతరిక్షనౌక నుండి వచ్చే సమాచారం ఒక్కొక్క చుక్క ఎంత తెల్లగా ఉండాలో, లేక ఎంత నల్లగా ఉండాలో నిర్ణయిస్తుంది. ప్రాసెస్ చెయ్యబడ్డాక చిత్రాలన్నీ మాగ్నెటిక్ డిస్క్ మీద భద్రపరచబడతాయి. జూపిటర్ వ్యవస్థని మొత్తం పద్దెనిమిద్ వేల ఫోటోలు తీసి వాయేజర్ 1 భూమికి పంపింది. ఇంచుమించు అదే సంఖ్యలో చిత్రాలు వాయేజర్ 2 నుండి కూడా అందాయి. ఇన్ని ప్రక్రియల, దశలకి అంతంలో మన చేతికి చిక్కేది యూరోపా అందాలని  ప్రదర్శించే అద్భుతమైన ప్రింటవుట్. 1979, జూలై 9 నాడు మానవ చరిత్రలో మొట్టమొదటి సారిగా మనం అలాంటి చిత్రాన్ని చూడడానికి వీలయ్యింది.

చిత్రాలలో మాకు కనిపించిన దృశ్యాలని చూసి దిగ్ర్భాంతి చెందాము. వాయేజర్ 1 మిగతా మూడు గెలీలియన్ ఉపగ్రహాలని చక్కని చిత్రాలు తీసి పంపింది. కాని యూరోపా దాని కెమేరాలకి అందలేదు. కార్యం వాయేజర్ 2 కి సాధ్యమయ్యింది. చిత్రాలలో కేవలం కొన్ని కిలోమీటర్ వ్యాసం గల భౌగోళిక విశేషాలని కూడా చూడడానికి వీలయ్యింది. యూరోపా చిత్రాలలో మనకి కనిపించేది మార్స్ మీద పార్సివాల్ లొవెల్ ఊహించుకున్న కాలువల జాలం వంటిది కాదనే చెప్పుకోవాలి. అసలు మార్స్ మీద కూడా కాలువలు ఊహల్లోనే తప్ప వాస్తవంలో లేని మాట ముందే చర్చించుకున్నాం. యూరోపా ఉపరితలం మీద సుదీర్ఘమైన సరళ రేఖల, వక్రరేఖల అల్లిక గజిబిజిగా కనిపిస్తుంది. రేఖలు పర్వత శ్రేణులా? అంటే ఎత్తుగా ఉంటాయా? లేక లోతుగా ఉండే లోయలా? అవి ఎలా ఏర్పడ్డాయి? పదే పదే సంకోచించి వ్యాకోచించే ఉపగ్రహం మీద ఏర్పడే బీటలు, ఉపగ్రహం మొత్తం వ్యాపించిన విస్తృతమైన టెక్టానిక్ వ్యవస్థలో భాగాలా? భూమి మీద మనకి తెలిసిన plate tectonics వంటిదే అక్కడ కూడా ఉందా? దాన్ని బట్టి జూపిటర్ వ్యవస్థలో ఉండే ఇతర ఉపగ్రహాల గురించి మనకేం తెలుస్తోంది? వాయేజర్ పంపిన సమాచారం ఆశ్చర్యకరంగా ఉన్నా ఎన్నో తేలని ప్రశ్నలని మిగిల్చింది. ప్రశ్నలకి సమాధానాలు సాధించడానికి కేవలం సాంకేతిక నైపుణ్యం ఉంటే సరిపోదు. దానికి మేధా శక్తి తోడవ్వాలి. యూరోపా ఉపరితలం మీద గజిబిజి గీతలు ఎన్నో వున్నా అది బిలియర్డ్ బంతిలా అతి నునుపుగా ఉంటుంది. ఉపరితలం మీద ఉల్కాబిలాలు లేకపోవడానికి కూడా ఒక కారణం వుంది. లోపలి నుండి పైకి తన్నుకొచ్చే వేడిమి వల్ల పైనున్న మంచు కరిగి, ఏర్పడ్డ ఉల్కాబిలాలని ఎప్పటికప్పుడు పూరిస్తూ ఉంటుంది. కాని గజిబిజి గీతల మూలాల గురించి మాత్రం ఇప్పటి వరకు ఎంతో చర్చ జరిగినా తేలని ప్రశ్నలు గానే మిగిలిపోయాయి.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts