శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


ప్రియమైన బ్లాగర్లూ,


Isaac Asimov రాసిన A short history of Chemistry ని ఇప్పట్నుంచి సీరియల్ గా పోస్ట్ చేద్దామని ఉద్దేశం.
సామాన్యంగా స్కూళ్ళలో కెమిస్ట్రీ చెప్పే తీరు ఆ సబ్జెక్ట్ అంటే ఏవగింపు కలిగించేలా ఉంటుంది. మరి ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించే అవకాశం లేకుండా, విషయాలని తీరిగ్గా ఆలోచించి, ఆరగించుకునే వ్యవధి లేకుండా ఉన్నప్పుడు ఏ రంగమైనా బోరు కొడుతుంది, కంఫు కొడుతుంది.

ఏ రంగంలోనైనా ఆ రంగంలోని సత్యాలని మొట్టమొదట ఎలా కనుక్కున్నారు, ఎంత శ్రమపడి కనుక్కున్నారు, అంతకు ముందు ఆ రంగం గురించి మనుషుల అవగాహన ఎలా ఉండేది, ఎవరెవరు ఎంతెంత మేరకు ఆ రంగాన్ని పురోగమింపజేశారు మొదలైన విషయాలు – ఒక్కమాటలో చెప్పాలంటే విజ్ఞాన చరిత్ర – తెలిస్తే ఆ రంగం పట్ల ఆసక్తి పెరుగుతుంది.

మనిషి ఇంకా చందమామ మీద కూడా పాదం మోపని రోజుల్లోనే, భవిష్యత్తులో కొన్ని వేళ ఏళ్ల తరువాత మనుషులు పాలపుంత గెలాక్సీ అంతా విస్తరించిన ఓ గెలాక్టిక్ మహాసామ్రాజ్యాన్ని ఎలా స్థాపిస్తారో ఊహించిన రాసిన ప్రతిభాశాలి అసిమోవ్ కి, కొన్ని వేల ఏళ్ల క్రితం మనుషులు రసాయనిక విద్యని ఎలా రూపొందించారో వర్ణించడం పెద్ద కష్టం కాదు. ఈ పుస్తకంలో రాతియుగం, లోహపు యుగం మొదలైన ప్రాథమిక ఆరంభదశలతో మొదలుపెట్టి, ఆధునిక కేంద్రక విజ్ఞానం వరకు రసాయన శాస్త్రం ఎలా అభివృద్ధి చెందిందో తనదైన శైలిలో వర్ణించుకొస్తాడు అసిమోవ్.

పేరుకి short history అన్నాడు గాని ఇది 278 పేజీల పుస్తకం. వీలైనంత కాలం, వీలైనంత మేరకు దీన్ని సీరియల్ గా పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

సైన్స్ అనేది కేవలం “సైన్స్ గ్రాడ్యుయేట్ల”కి మాత్రమే కాదని. అది అందరికీ సంబంధించినది అని మేము నమ్ముతాం. అందుకే ఈ బ్లాగులోని అంశాలు అన్ని వర్గాల వారికి ఆసక్తి ఉండేలా ఎంచుకోవడం జరుగుతుంది. కాని ప్రత్యేకించి ఈ బ్లాగ్ లోని వ్యాసాలు హైస్కూల్ స్థాయిలో ఉన్న తెలుగు మీడియమ్ పిల్లలకి అందుబాటులో ఉంటే బావుంటుందని మా ఆశ. ఎందుకంటే సైన్స్ అంటే ఆసక్తి కలగాలంటే అదే మంచి వయసు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం మన పల్లె బడులలో కంప్యూటర్ వసతులు పెద్దగాలేవని మనకి తెలిసిందే. అయితే భవిష్యత్తులో (మరో రెండు మూడేళ్లలో) ఆ పరిస్థితులు మారొచ్చని, అప్పటికి ఇలాంటి బ్లాగ్ లు ఆ పిల్లలకి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఈ ’రసాయనిక చరిత్ర” కూడా ఆ వర్గం పిల్లలకి ఉపయోగపడే పుస్తకాల్లో ఒకటి.

వచ్చే పోస్ట్ నుండి సీరియల్ ప్రారంభం...

గెలీలియో ఆఖరు రోజులు

Posted by V Srinivasa Chakravarthy Thursday, December 9, 2010 6 comments

ఏం జరుగుతుందో తెలీని అనిశ్చిత వాతావరణంలో ఫిబ్రవరి 1633 లో గెలీలియో రోమ్ లోకి ప్రవేశించాడు. నగరంలోకి అడుగుపెట్టగానే రాజభటులు తనకి సంకెళ్ళు వేసి బరబర లాక్కెళతారని ఊహించాడు. కాని అలంటిదేం జరగలేదు. టస్కనీ ప్రాంతానికి చెందిన వాడు కనుక మొదట్లో రోమ్ లోని టస్కనీ దౌత్యాలయంలో కొంత కాలం అతిథిగా ఉన్నాడు. ఇతర అతిథులతో సమానంగానే తనకీ మర్యాదలు జరిగాయి. అయితే ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఆ రోజుల్లో చాలా బాధపడేవాడు. ఆర్త్ రైటిస్ వల్ల కీళ్లు బాగా నొప్పి పుట్టేవి. ఆ బాధకి రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. బాధ భరించలేక గట్టిగా రోదించేవాడు. ఇలా కొన్ని రోజులు సాగాయి.

ఏప్రిల్ నెలలో న్యాయవిచారణ మొదలయ్యింది. ఇంతకీ చేసిన నేరం ఏంటయ్యా అని చూస్తే న్యాయమూర్తులకి పెద్దగా ఏమీ దొరకలేదు. మొదటి తప్పు - తన భావాలు నలుగురికీ అర్థం కావాలని లాటిన్ కి బదులుగా ఇటాలియన్ లో పుస్తకాలు రాయడం. ’మతవిరోధి, పచ్చి తగవుల కోరు, కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేవాడు’ అయిన విలియమ్ గిల్బర్ట్ ని పొగుడుతూ గెలీలియో ఒక చోట రాశాడు. ఇది రెండవ తప్పు. అయితే ఇవి రెండూ కాస్త చిన్న విషయాలేనని కొట్టిపారేయొచ్చు. కాని కాస్త కీలకమైన సమస్య మరొకటి ఉంది. కోపర్నికస్ భావాలని బోధించకూడదు అన్న మతపరమైన నిషేధాన్ని ఉల్లంఘించడం – ఇది అసలు తప్పు. ఒకసారి న్యాయవిచారణ మొదలయ్యాక ఏదో ఒక నేరం కింద గెలీలియోని ఇరికించి, భవిష్యత్తులో ఆ తప్పు మరొకరు చెయ్యడానికి భయపడేలా శిక్షించాల్సిందే. ఎందుకంటే న్యాయవిచారణలో గెలీలియో నిరపరాధి అని తేలితే, న్యాయమూర్తులకే ముప్పు. అన్యాయంగా ఆరోపించినందుకు శిక్ష వాళ్లకి పడుతుంది! కనుక ఎలాగైనా గెలీలియోకి శిక్షపడేలా చెయ్యాలని కాథలిక్ చర్చి అధికారులు చాలా పట్టుదలగా ఉన్నారు.

ఈ సమయంలో గెలీలియో స్నేహితుడైన కార్డినల్ బర్బెరీనీ ఎంతో సహాయం చేశాడు. గెలీలియో శిక్ష తగ్గడానికి శతవిధాల ప్రయత్నించాడు. తప్పు చెయ్యకపోయినా తప్పు ఒప్పుకొమ్మని గెలీలియోని ప్రాధేయపడ్డాడు. లేకపోతే గెలీలియోకి చిత్రహింస తప్పదన్న వాస్తవాన్ని వివరించాడు. గెలీలియోకి తన దయనీయమైన పరిస్థితి స్పష్టంగా అర్థమయ్యింది. ఇకి విధిలేక రాజీకి ఒప్పుకున్నాడు. కోపర్నికస్ బోధనలని తన పుస్తకంలో వివరంగా వర్ణించడం తను చేసిన పెద్ద పొరబాటని ఒప్పుకున్నాడు. వైజ్ఞానిక భావాలని అందంగా, విపులంగా వ్యక్తం చెయ్యడంలో తన నైపుణ్యాన్నిప్రదర్శించుకోవాలన్న మితిమీరిన అహంకారంతోనే అలా రాశానన్నాడు. అందుకు మనస్పూర్తిగా పశ్చాత్తాప పడుతున్నానన్నాడు. ’నా తప్పిదాలను నేనే ఖండిస్తున్నాను, శపిస్తున్నాను, గర్హిస్తున్నాను’ అంటూ ప్రాణాలు కాపాడుకోవడం కోసం చేయని తప్పుని పూర్తిగా ఒప్పుకున్నాడు. ఆధునిక భౌతికశాస్త్రానకి ఓనమాలు దిద్దించిన ఆ మొదటి గురువు, తను చేసిన ’తప్పు’కి అపరాధిలా తలవంచకుని నిలబడ్డాడు.

ఈ వృత్తాంతానికి చిన్న కొస మెరుపు ఒకటి ఉంది. మహాభారత యుద్ధంలో ధర్మరాజు “అశ్వత్థామ హత:” అని బిగ్గరగా అని, “కుంజర:” అని నెమ్మదిగా అన్నట్టు, ఈ సందర్భంలో గెలీలియో తన అపరాధాలని ఒప్పుకుంటూ బిగ్గరగా ఆ సుదీర్ఘమైన ప్రకటన చదివి, చివర్లో “ eppur, si muove (కాని అది కదులుతోందిగా...)” అని మెల్లగా, బయటికి వినిపించకుండా అనట్టు చెప్పుకుంటారు. అది గాని బయటికి వినిపించి ఉంటే శిర:ఖండన ఖాయం. అదీ కాకపోతే కట్టెకి కట్టి బహిరంగ దహనం చేసి ఉండేవారేమో. కాని గెలీలియో నిజంగా అలా అన్నాడా లేదా అన్న విషయం మీద కొంత వివాదం ఉంది.

గెలీలియో మీద విజయం సాధించినందుకు జెసూట్ లు సంబరపడిపోయారు. ఇక శిక్ష ప్రకటించడమే తరువాయి. గెలీలియోకి యావజ్జీవ కారాగార శిక్ష తప్పేలా లేదు. న్యాయవిచారణ జరిపిన పది మంది న్యాయమూర్తుల్లో ఏడుగురే శిక్షని ఆమోదించారు. మిగతా ముగ్గురూ ఆ పత్రం మీద సంతకం చెయ్యలేదు. ఆ ముగ్గురిలో చిరకాల స్నేహితుడైన బర్బరీనీ కూడా ఉన్నాడు. బర్బరీనీ ప్రమేయం వల్లనే మొదట్లో శిక్ష జారీ అయినా, అమలు చెయ్యడంలో దాన్ని బాగా బలహీన పరిచారు. మొదట్లో రోమ్ లోని టస్కనీ దౌత్యాలయంలోనే కొంత కాలం నిర్బంధించారు. 1634 నుండి మాత్రం ఆర్సెట్రీ నగరంలో ఉన్న గెలీలియో సొంత ఇంట్లోనే నిర్బంధిస్తూ శిక్షవిధించారు. ఇక జీవితాంతం ఆ ఇల్లు, పరిసర ప్రాంతాలు విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని నిర్బంధం. చివరికి వైద్య చికిత్స కోసం ఫ్లోరెన్స్ నగరానికి వెళ్లడానికి కూడా అనుమతి దొరకలేదు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా గెలీలియో తన పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. దూరదర్శిని వినియోగం మరీ ఎక్కువ కావడం వల్లనేమో, చివరి రోజుల్లో 1637 కల్లా పూర్తిగా గుడ్డివాడు అయిపోయాడు. అలా కొన్నేళ్లపాటు నరకయాతన అనుభవిస్తూ ఆ మహా మేధావి జనవరి 8, 1642, లో కన్నుమూశాడు.

References:
1. Simon Singh, Big Bang, Harper Perennial, 2004.
2. John Gribbin, Science: A history, Penguin, 2003.
3. http://www.vias.org/physics/bk1_05_01.html
4. http://cnx.org/content/m11932/latest/
5. http://cnx.org/content/m11932/latest/g_telescope.gif
6. http://galileo.rice.edu/lib/student_work/astronomy95/moon.html
7. https://ca-science7.wikispaces.com/file/view/Sun_spots.gif/34504237/Sun_spots.gif

8. http://upload.wikimedia.org/wikipedia/commons/8/87/Jupitermoon.jpg
9. http://www.scienceandyou.org/articles/ess_16.shtml
10. http://en.wikipedia.org/wiki/Giordano_Bruno
11. http://www.chrismadden.co.uk/meaning/galileo-pope-church.html
12. http://en.wikipedia.org/wiki/Dialogue_Concerning_the_Two_Chief_World_Systems

శ్రీరామ
ఈ బ్లాగులో కేవలం సైన్సు విషయాలు తప్ప మరొకటి ప్రచురించకూడదన్నది మా నియమం. కానీ, ప్రస్తుతానికి నాకు ఈ విషయాన్ని పంచుకోవడానికి మరో సరైన బ్లాగు లేకపోవడం వల్ల ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఈ బ్లాగును క్రమం తప్పకుండా చదువుతున్న పాఠకులకు కలిగిస్తున్న ఈ అసౌకర్యానికి మన్నించగలరు.

మన రాష్ట్రంలో కొత్తగా స్థాపించిన మూడు ఐఐఐటీల గురించి మీకు తెలిసిందే...అవి ఇడుపులపాయ, నూజివీడు మరియు బాసరలో ఉన్నవన్న సంగతి కూడా మీకు తెలుసు. ఈ మూడు విశ్వవిద్యాలయల లక్ష్యం ప్రభుత్వ గ్రామీణ పాఠశాలల్లో చదువుతూ పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన సాంకేతిక విద్యను అందించడమే. వీటిలోని విద్యా ప్రమాణాలు ఐఐటీల (Indian institute of Technology) స్థాయికి సమానంగా ఉంటాయి.

ఇప్పుడు అసలు విషయానికొస్తే, ఈ కాలేజిలల్లో మన దేశ చరిత్రలోనే ఏ ఇంజినీరింగ్ కాలేజీలో లేని విధంగా మాతృభాష (తెలుగు భాష) కూడా నాలుగు సంవత్సరాల పాటు ఒక పాఠ్యాంశంగా చేర్చడమైనది. కారణం, మన భారతీయ ఆత్మగతమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టు బాట్లు, నీతి నియమాలు, పెద్దల పట్ల గౌరవ భావనలు, చిన్న పిల్లల పట్ల ప్రేమాను రాగాలు, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి వాత్సల్యాలు పెంపొందించటం. ఇటువంటివన్నీ కూడా మాతృభాషలోనే నేర్చుకోవడం సాధ్యమౌతుంది. అలాగున, ఐఐఐటీ స్థాపించిన పెద్దలు భావించడం మూలాన తెలుగు భాషను ప్రవేశ పెట్టడం జరిగింది. దానితో పాటు పిల్లల్లో ఉండే సాహిత్య సృజనాత్మకతను వెలికి తీయడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు, మనో నిబ్బరం కలుగజేసినట్లవుతుంది.

ఈ క్రమంలో భాగంగా ఇడుపుల పాయలో ఉన్న ఐఐఐటీలో ఒక చారిత్రాత్మక ఘట్టం విద్యార్థుల రూపంలో వెల్లి విరిసింది. అదేమిటనగా, ఎం. ఎన్. బ్రహ్మానందయ్య అనే తెలుగు మెంటర్ పదహారు మాసాలుగా విద్యార్థులలోని సృజనాత్మక సృష్టిని తెలుగు ప్రాచీన సాహిత్య ప్రక్రియయైన శతక రూపంలో బయటకు తీయటం జరిగింది. శతకమనగా నూరు పై చిలుకు పద్యాల సమాహారం. పద్యం రాయడమంటేనే తెలుగు ఉపాధ్యాయులకే గగనంలా ఉన్న ఈ ఆధునిక కాలంలో ఏకంగా విద్యార్థుల చేతనే శతకం రాయించటం పట్ల బ్రహ్మానందయ్య గారికున్న సాహిత్య రచనా పిపాస ఎలాంటిదో తెలుస్తున్నది.

పద్యం రాసిన వారు ఇంకా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులే. ఈ శతకాన్ని ఇరవై మంది విద్యార్థులు కలిసి రచించారు. వారు రాసిన పద్యాలన్నిటినీ విశ్వవీణ శతకం అన్న పేరుతో ప్రచురించడమైనది. బ్రహ్మానందయ్య గారు, ఆ శతకాన్ని తన స్వంత ఖర్చుతో (దాదాపు 16 వేల రూపాయలతో) అచ్చు వేయించారు. అందుకు ఇడుపుల పాయలోని డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు ప్రోత్సహించారు. ఇది ఒక ఎత్తైతే, విషయం తెలిసి, వైస్ ఛాన్సలర్ రాజ్ కుమార్ గారు ప్రతిభకు పట్టం కట్టాలనే సదుద్దేశంతో ఇడుపుల పాయ వరకు వెళ్ళి ఆ విశ్వవీణ శతకాన్ని ఆవిష్కరిస్తూ, అందు విద్యార్థులను ప్రోత్సహిస్తూ పరిష్కర్తయైన బ్రహ్మానందయ్య గారిని శాలువాతో సత్కరిస్తూ ఇది నిజంగానే చారిత్రాత్మక ఘట్టం అని ఎంతగానో కొనియాడారు.


ఈ పద్యాలన్నీ కూడా ఆటవెలది ఛందస్సులో విద్యార్థులు రాశారు. ఆ విశ్వవీణ శతకంలోని మచ్చుకు కొన్ని పద్య రత్నాలు.

1) ఆట: రాళ్ళుగొట్టునొకడు రాతనేర్చునొకడు
          కూలిజేయునొకడు గొలువుదీరు
          నొకడు నొకడు నొకడునొకదీరుగాంచరా |
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | ఈ భూమి మీద అనేక వృత్తుల వారు ఉన్నారు. జీవితాన్ని పోషించుకోవడానికి వృత్తులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో భాగంగా ఒకడు రాళ్ళను మలుస్తాడు. ఒకడు చదువు నేర్చుకుంటాడు. మరొకడు కూలి పని చేస్తాడు. ఇంకొకడు అధికారాన్ని చెలాయిస్తాడు. ఎవరు ఏ పని చేసినా అందరూ సమానమే గాని వాడిపని తక్కువ వీడిపని తక్కువ అని సాటి వ్యక్తులను తక్కువ చేయకూడదని భావం.
నీతి: వృత్తి వ్యక్తి జీవన విధానానికి ప్రవృత్తి అని గ్రహించు.

2) ఆట: కూతురున్నయింట కోడలు దుఃఖించ
          తల్లిదొడ్డగుణము తగులబెట్టు
          మమ్మమనసుదెలిసి యత్తమనవలదే |
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | కూతురు పుట్టి పెరిగిన ఇంటిలోకి కోడలు వచ్చి దుఃఖపడినట్లైతే ఆ తల్లి యొక్క దొడ్డ గుణం తగులబడినట్లౌతుంది. ఎందుకంటే, ఈ ఇంటి కూతురు మరో ఇంటి కోడలని గ్రహిస్తుంది అమ్మ మనసు. ఆ విధంగా అమ్మ మనసు తెలిసి అత్త కోడల్ని చూడవలసి ఉంటుందని భావం.
నీతి: అమ్మతనం లేని అత్త ఎన్నటికీ అమ్మ కాలేదు అని గ్రహించు.

3) ఆట: రాజ్యమెంతయున్న రాటు దేలినవారు
భద్రతున్ననేమి? భటుడొకండు
మూర్కుడైనజాలు | ముప్పు వాటిల్లదే |
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | ఒక మహారాజు తన రాజ్యాన్ని ఎంత విస్తారం చేసుకున్నా, యోధులైన వారిని భటులుగా నియమించుకొని ఎంత భద్రత కల్పించుకొన్నప్పటికీ, మూర్ఖుడైనవాడు ఒకడు ఆస్థానంలో ఉన్నట్లైతే ఆ రాజుకేగాక రాజ్యంలోని ప్రజలందరికీ కూడా ముప్పు తెచ్చిపట్టగలడని భావం.

నీతి: నీవు మూర్ఖుని దగ్గర ఉన్నా, మూర్ఖుడు నీ దగ్గర ఉన్నా ప్రమోదం మూర్ఖుడికీ, ప్రమాదం నీకూ అని గ్రహించు.


4) ఆట: కళ్ళుమూసితెరచి కల్లుకల్లుయనుచు
చిందులేయునట్టి చిల్లరోళ్ళు |
గాలికితెగిపడ్డ గాలిపటాలయా |
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | సమాజంలో చిల్లర మనుష్యులు ఉంటారు. వాళ్ళు రెప్పపాటు కాలాన్ని కూడా కల్లు త్రాగడానికే ఉపయోగిస్తూ, జీవితాన్ని, సమయాన్ని వృధాగా పోనిస్తుంటారు. అటువంటివారు గాలికి తెగిపోయి దిక్కులేక, ఏ ముళ్ళచెట్టు మీదనో, చెత్త గుట్టలపైనో ఊగులాడే గాలిపటాలతో సమానమని భావం.
నీతి: నిరంతర మత్తు వృధా జీవిత పరంపర ముప్పు అని గ్రహించు.

5) ఆట: ఎదుగుచున్న వాడునెదురైన హీనుని
          మనసునోర్వలేక మండుచుండు |
          అగ్నిబడ్డ వృక్షమాహుతియగునట్లు |
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | ఈ కాలంలో ఈర్ష్యాపరులు ఎక్కువగుచున్నారు. ఎవరైనా కష్టపడి పైకి ఎదుగుతున్నారంటే వారికి సహాయం చేసి సహృదయంతో ముందుకు నడపాలని ఆలోచించక వారిని చూసి ఓర్వలేక మనసులో మంటపెట్టుకొని మాడిపోతుంటారు. అగ్నిలోపడిన వృక్షము ఏ విధంగా అయితే కాలిపోతుందో ఆవిధంగా వారికి వారే కాలిపోతుంటారని భావం.
నీతి: ఓర్పు దేనికైనా మనిషి నేర్పు అని గ్రహించు

6) ఆట: తొందరబడి మూఢదోవ బుద్ధిని గూడి
          తప్పిదమగు పనిని తలపబోకు |
          యమునిచెంతజేరి యాచింపఫలమేమి?
వినురవినుత విశ్వవీణపలుకు |
భావం: పొగడబడే గుణములు కలిగిన వాడా | సరస్వతీ తల్లి పలుకు వినవయ్యా | మానువుడు తన జీవిత కాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు తెలివిలేని తనానికి చిహ్నం. అటువంటి బుద్ధితో తప్పు చేయకూడదు. అది, మనిషి చెడు మార్గంలో పయనించి కాలం చెల్లి యముని దగ్గర శిక్షలు పడేటప్పుడు తెలియక చేశాను మన్నించండి అని అడిగితే ప్రయోజనముంటుందా? అని భావం.
నీతి: చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనము ఉండదు అని గ్రహించు.       


ఈ పరిష్కర్త హృదయాన్ని, విద్యార్థుల సృజనను ఆదర్శంగా తీసుకొని నేటి కాలంలో ఉపాధ్యాయ వృత్తిని కోరుకుంటున్నవారు భవిష్యత్తులో ఇలాంటి రచనా కార్యక్రమాలను చేపట్టాలని, చేపడుతారని ఆశిస్తున్నాను. తెలుగు గడ్డపై పుట్టినందుకు, తెలుగువాడిగా జీవిస్తున్నందుకు, తెలుగు భాషకు తిరిగి పూర్వ వైభవం రావాలని నాతో పాటు మీరు కూడా ఆలోచిస్తారని, అటువంటి వాళ్ళు మీ జీవితంలో తారసపడితే ముఖ్యంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. 
ఎడమ నుంచి: పరిష్కర్త బ్రహ్మానందయ్య, ఉపకులపతి రాజ్‌ కుమార్ గారు. 

“సంవాదాలు” తెచ్చిన సంకటాలు

Posted by V Srinivasa Chakravarthy Monday, December 6, 2010 0 comments

గెలీలియో పుస్తకం ప్రచురితం అయిన నాటికి యూరప్ లో ’ముప్పై ఏళ్ల యుద్ధం’ ఉధృతంగా కొనసాగుతోంది. 1618 లో మొదలైన యుద్ధం మూడు దశాబ్దాల పాటు అంటే 1638 వరకు సాగింది. ఈ యుద్ధానికి ఒక ఏకైక కారణం ఆంటూ ఏమీ లేదు. అయితే కాథలిక్కులకి, ప్రొటెస్టంట్ లకి మధ్య మతకలహం ఈ యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. 1618 లో జరిగిన ఓ దారుణమైన సంఘటన జరిగింది. ప్రాగ్ నగరంలో కొంతమంది ప్రొటెస్టంట్ లు రాజగృహంలోకి జొరబడి ఇద్దరు అధికారులని పై అంతస్థు కిటికీ లోంచి బయటికి విసిరేశారు. దీన్నే ప్రాగ్ నగరపు నిర్గవాక్షీకరణ (Defenestration of Prague, fenestra అంటే కిటికీ) అంటారు. ప్రొటెస్టంట్ల మీద పదే పదే జరుగుతున్న అత్యాచారాలకి నిరసనగా వాళ్లు ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టారు. దాంతో రెండు మతవర్గాల మధ్య యుద్ధ జ్వాల భగ్గు మంది. ఈ యుద్ధంలో యూరప్ లో అపారమైన జన నష్టం, ధన నష్టం జరిగింది. క్షామం విలయతాండవం చేసింది.

గెలీలియో పుస్తకం ప్రచురితం అయిన నాటికే యుద్ధం పద్నాలుగేళ్లుగా నడుస్తోంది. అలాంటి నేపథ్యంలో కాథలిక్ వర్గం యొక్క అధిపత్యాన్ని నిరూపించాల్సిన బాధ్యత పోప్ అర్బన్ VIII మీద పడింది. కాథలిక్కుల ప్రతినిధిగా తన పెత్తనం కొనసాగాలంటే ప్రొటెస్టంట్ల విప్లవాన్ని ఎలాగైనా అణచాలి. ముందుగా కాథలిక్ మతానికి విరుద్ధంగా మాట్లాడే గొంతికలని మూయించాలి. కనుక కాథలిక్ మతానికి విరుద్ధమైన ప్రచారాన్ని బహిష్కరిస్తూ, అలాంటి ప్రచారానికి తీవ్ర దండన ప్రకటించాడు. మతం సమర్ధించే పృథ్వీ కేంద్ర సిద్ధాంతానికి వ్యతిరేక ప్రచారం మీద వేటు వేయాల్సిన అవసరం కనిపించింది.

అయితే పోప్ అలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వ్యక్తిగతమైన కారణాలు కూడా ఉన్నాయని చెప్తారు. పెరుగుతున్న గెలీలియో పరపతికి ఓర్వలేని కొందరు ఆస్థాన ఖగోళశాస్త్రవేత్తలు గెలీలియో మీద లేని పోని చాడీలు చెప్పసాగారు. పోప్ తెలివితేటలని కించపరుస్తూ గెలీలియో తన పుస్తకంలో ఎన్నో విసుర్లు విసిరాడని చెప్పారు. అందులో కొంత నిజం కూడా లేకపోలేదు. సర్వశక్తివంతుడైన దేవుడు భౌతిక ధర్మాలకి అతీతంగా విశ్వాన్ని సృష్టించాడని పోప్ ఎన్నో చోట్ల చాటుతూ వచ్చాడు. ఈ విషయం గురించే గెలీలియో “సంవాదాల”లో ఒక చోట పండితుడైన సాల్వియాటీ, మూఢుడైన సింప్లీసియోతో హేళనగా ఇలా అంటాడు: “అవున్లే! దేవుడు తలచుకుంటే పక్షుల అస్తిపంజరాలలో ఎముకకి బదులు బంగారం ఉండేదేమో, వాటి రక్తనాళాలలో పాదరసం ప్రవహించేదేమో, వాటి మాంసం సీసం కన్నా బరువుగా ఉండేదేమో! చిట్టి చిట్టి రెక్కలతో ఆకాశంలో అంతెత్తున సునాయాసంగా ఎగిరేవేమో! కాని దేవుడు అలా చెయ్యలేదు. దీన్ని బట్టి నీకో విషయం అర్థం కావాలి. అది తెలుసుకోడానికి ప్రయత్నంచకుండా నీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటూ అడుగడుగునా దేవుడి పేరు ఎందుకు వాడుకుంటావు?” ఇవన్నీ చదివిన పోప్ కి నిజంగానే చిర్రెత్తి ఉంటుంది.

“సంవాదాలు” ప్రచురితం అయిన కొంతకాలం తరువాత మతధర్మకర్తల సదస్సు (Inquisition) గెలీలియోని న్యాయవిచారణ కోసం పిలిపించింది. మతవ్యతిరేక ప్రచారం చేస్తున్నాడన్న నింద మోపి రోమ్ కి రమ్మని సందేశం పంపింది. అలాంటి పరిస్థితుల్లో రోమ్ కి వెళ్తే ఏం జరుగుతుందో గెలీలియోకి బాగా తెలుసు. పైగా ఆ సమయంలో తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. రోమ్ కి ప్రయాణం ఆ పరిస్థితుల్లో తన వల్లకాదని కబురు పెట్టాడు గెలీలియో. రానని మొండికేస్తే రెక్కలు కట్టి తిసుకురావలసి ఉంటుందని తీవ్రంగా వచ్చింది సమాధానం. ఇక గతిలేక ప్రయాణానికి సిద్ధం అయ్యాడు గెలీలియో.

(సశేషం...)



గెలీలియోకి చర్చికి మధ్య భావసంఘర్షణ కొనసాగుతూనే ఉంది. చర్చి అధికారులు వాళ్లు చెప్పేది చిలకల్లా వల్లెవేస్తూనే ఉంటారు గాని, గెలీలియో సేకరించిన పరిశీలనల మీద వ్యాఖ్యానించరు, ఆ సమాచారానికి స్పందించరు. గెలీలియో కూడా పట్టువదలకుండా ఓ కొత్త విశ్వదర్శన స్థాపన కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా 1623 లో చర్చిలో పరిస్థితులు గెలీలియోకి అనుకూలంగా మరాయి. తన చిరకాల స్నేహితుడైన కార్డినల్ మాఫియో బర్బెరీనీ ఇప్పుడు కొత్త పోప్ అయ్యాడు. ఈ కొత్త పోప్ పేరు అర్బన్ VIII. గెలీలియో, ఈ బర్బెరీనీ చిన్నప్పుడు పీసా విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు కనుక గేలిలీయోకి పోప్ ని స్వయంగా కలుసుకునే అవకాశం సులభంగా దొరికింది. ఆరుసార్లు పోప్ ని కలుసుకుని తన భావాలని వ్యక్తం చేసుకున్నాడు. ఎంతో కాలంగా తన మనసులో ఉన్న మాటని ఆ సందర్భంలో గెలీలియో పోప్ కి విన్నవించుకున్నాడు.

విశ్వం యొక్క తత్వం గురించి ప్రస్తుతం సమాజంలో రెండు విభిన్న భావజాలాలు చలామణిలో ఉన్నాయి. ఒకటి బైబిల్ చెప్పేది, దానికి ప్రతినిధులైన మతాధికారులు చెప్పేది. రెండవది ఇటీవలి కాలంలో దూరదర్శిని మొదలైన పరికరాల సహాయంతో చేసిన పరిశీలనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్నది. ఈ రెండు భావజాలల మధ్య ఏది నిజం అన్నది తెగని సమస్యగా ఉంది. ఆ భావజాలాల మధ్య సంఘర్షణని, సంవాదాన్ని ఒక పుస్తరూపంలో రాయాలని గెలీలియో ఎంతో కాలంగా అనుకుంటున్నాడు. ఆ విషయమే పోప్ తో అన్నాడు. పుస్తక రచనకి పోప్ పూర్తిగా ఒప్పుకున్నాడు. పోప్ వద్ద సెలవు తీసుకున్న గెలీలియో ఇంటికి తిరిగి వెళ్లగానే పుస్తక రచనకి ఉపక్రమించాడు.


తొలిదశల్లో ఈ పుస్తకాన్ని ’తరంగాల మీద సంవాదం’ అని పిలుచుకునేవాడు గెలీలియో. వ్రాతప్రతి మాతాధికారుల చేతికి చిక్కింది. వాళ్లకి పుస్తకం పేరు ససేమిరా నచ్చలేదు. ఎందుకంటే తరంగాల పేరు చెప్పి పృథ్వీకేంద్ర సిద్ధాంతాన్ని గుంభనంగా సమర్థిస్తున్నాడు గెలీలియో అని వాళ్ళు పసిగట్టారు. తరంగాలు చందమామ యొక్క గురుత్వాకర్షణ మీద ఆధారపడతాయి. భూమి యొక్క ఆత్మభ్రమణం మీద ఆధారపడతాయి. అంటే తరంగాల గురించి గెలీలియో చెప్పింది ఒప్పుకుంటే, భూమి కదులుతోందని ఒప్పుకున్నట్టే. కనుక మతాధికారులు పుస్తకంలో తరంగాలకి సంబంధించిన విషయాలన్నీ తీసేయించారు. చివరికి వట్టి “సంవాదం” (Dialogue) అన్న పేరు మాత్రం మిగిలింది.

అయితే ఆధునిక రూపంలో ఈ పుస్తకాన్ని Dialogue Concerning the Two Chief World Systems (Dialogo sopra i due massimi sistemi del mondo) (రెండు ముఖ్యమైన విశ్వ విజ్ఞాన సాంప్రదాయాల మధ్య సంవాదం) అన్న పేరుతో వ్యవహరిస్తుంటారు. ఈ పుస్తకం అంతా సంవాదాల రూపంలో ఉంటుంది. నాలుగు రోజుల పాటు ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన సంవాదాలవి. వారిలో ఒకడి పేరు సింప్లీసియో (Simplicio). ఇతగాడు వట్టి అమాయకుడు. ఆ రోజుల్లో చలామణిలో ఉన్న అవైజ్ఞానిక భావాలకి, నమ్మకాలకి ఇతడు ప్రతిరూపం. రెండవ వ్యక్తి పేరు సాగ్రెడో (Sagredo). ఇతగాడు పామరుడే గాని తెలివైన వాడు. మొదట్లో తటస్థంగా ఉన్నా, సంవాదాలలో చివరి దశలో గెలీలియో భావాలని స్వీకరిస్తాడు. ఇక మూడవ వ్యక్తి పేరు సాల్వియాటీ. పండితుడైన సాల్వియాటీ, కోపర్నికస్, గెలీలియో మొదలైన ఆధునికుల భావాలకి మూర్తిరూపం. ఒక పక్క నిష్పక్షపాతంగా రెండు సిద్ధాంతాలని వర్ణిస్తున్నట్టు, వాటి మధ్య భేటీని విపులీకరిస్తున్నట్టు కనిపిస్తున్నా, ప్రచ్ఛన్నంగా సూర్యసిద్ధాంతానిదే పైచేయి అయినట్టుగా ఇందులో వివరిస్తాడు గెలీలియో. అయితే తలదిమ్మెక్కించే తాత్విక వివరణల రూపంలో కాకుండా అంతా సంభాషణల రూపంలో ఉంటుంది కనుక సామాన్యులకి కూడా అర్థమయ్యేలా ఉంటుంది. పైగా అప్పటికి అధికార భాష అయిన లాటిన్ లో కాక, జనరంజకంగ ఉండాలని కావాలని ఈ పుస్తకాన్ని పామర భాష అయిన ఇటాలియన్ లో రాశాడు గెలీలియో.

చివరికి పుస్తకం 1932 లో ప్రచురితం అయ్యింది. అంటే పోప్ ఆమోదం ఇచ్చాక ఇంచుమించు దశాబ్దం తరువాత అన్నమాట. కాని దురదృష్టవశాత్తు ఈ పదేళ్లలో రాజకీయపరిస్థితులు బాగా మారిపోయాయి. పుస్తకం రచన మొదలయినప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు లేదు. ఒకప్పుడు మనసారా దీవించిన పోప్ ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఎలా తగులబెట్టించాలా అన్న ఆలోచనలో ఉన్నాడు.

(సశేషం...)

చర్చితో తగని తగవు

Posted by V Srinivasa Chakravarthy Tuesday, November 30, 2010 0 comments




ఆ విధంగా గెలీలియో తన పరిశీలనలని మాత్రమే ప్రచారం చేస్తూ కోపర్నికస్ ప్రసక్తి తేకుండా ఎంతో కాలం జగ్రత్తపడుతూ వచ్చాడు. కాని 1613 లో ఒక సందర్భంలో తన సహనం చచ్చిపోయినట్టుంది. ఆ సంవత్సరం సూర్యబిందువుల (sunspots) గురించి తను చేసిన పరిశీలనల గురించి ఓ చిన్న పుస్తకం రాశాడు. లిన్సియన్ సదస్సు ఆ పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకం ముందుమాటలో గెలీలియోని ఆకాశానికెత్తుతూ సూర్యబిందువులని మొట్టమొదట పరిశీలించిన ఘనత గెలీలియోదే నన్నట్టుగా రాశారు లిన్సియన్ సభ్యులు. కాని అది నిజం కాదు. గెలీలియో కన్నా ముందు సూర్యబిందువులని గమనించినవారు మరి కొందరు ఉన్నారు. వారిలో ఒకరు ఓ జెసూట్ ఖగోళవేత్త. అతడి పేరు క్రిస్టఫర్ షైనర్. తనకు రావలసిన ఘనత గెలీలియోకి దక్కడం చూసి ఇతగాడికి ఒళ్ళుమండిపోయింది. అయితే ఇతడికి కూడా నిజానికి ఒళ్లు అంతగా మండాల్సిన పనిలేదేమో! ఎందుకంటే ఇతడి కంటే ముందు థామస్ హారియట్ అనే ఇంగ్లండ్ కి చెందిన వ్యక్తి, యోహాన్ ఫాబ్రీసియస్ అనే ఓ డచ్ వ్యక్తి సూర్యబిందువులని కనిపెట్టారు. ఘనత ఎవరికి దక్కినా ఈ వివాదం వల్ల గెలీలియో పేరు నలుగురు నోటా నానింది. కాని అసలు సమస్యకి కారణం ఇది కాదు. పుస్తకం చివర్లో గెలీలియో బాహటంగా కోపర్నికస్ విశ్వదర్శనాన్ని సమర్ధిస్తూ రాశాడు. అందుకు ఉదాహరణగా జూపిటర్ చందమామల వృత్తాంతాన్ని పేర్కొన్నాడు. అసలు గొడవ అక్కడ మొదలయ్యింది.



చర్చితో కలహం తన ఆరోగ్యానికి మంచిది కాదని గెలీలియోకి బాగా తెలుసు. ఎలాగైనా పోప్ ని స్వయంగా కలుసుకుని తన అభిమతాన్ని స్పష్టంగా వివరించాలని అనుకున్నాడు.


రోమ్ ని మరో సారి సందర్శించడానికి తగ్గ అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. పరిస్థితులు అనుకూలంగా లేవు, ఇప్పుడు వద్దని హితులు వారించారు. ఎందుకంటే ఈ నడిమి కాలంలో కొన్ని మార్పులు వచ్చాయి. అప్పటి పోప్ పాల్ V, కోపర్నికస్ బోధనలు మతబోధనలకి అనుకూలంగా ఉన్నాయో, లేక మతధిక్కారాన్ని (heretic) సూచిస్తాయో తీర్పు చెప్పమని ఓ సదస్సుని నియమించాడు. ఆ సదస్సు సమావేశమై, విషయాన్ని పరిశీలించి, సూర్యుడు విశ్వానికి కేంద్రం అని చెప్పే బోధన “అవివేకం, అసంగతం... పూర్తిగా మతవిరుద్ధం” అని తేల్చిచెప్పింది. ఆ కారణం చేత రోమ్ లో గెలీలియోకి వ్యతిరేకమైన వాతావరణం నెలకొంది. ఆ నేపథ్యంలో గెలీలియో 1615 డెసెంబర్ లో రోమ్ ని సందర్శించినప్పుడు వెంటనే పోప్ ని కలుసుకోలేకపోయాడు గాని అక్కడ టస్కనీ దూత ఇంటికి విందుకు మాత్రం వెళ్లగలిగాడు. పోప్ పాల్ V మాత్రం చర్చి కి ప్రతినిధిగా, కార్డినల్ బెలార్మిన్ ద్వారా గెలీలియోకి ఈ ఘాటైన సందేశం పంపించాడు. ఆ సందేశంలోని ముఖ్యాంశాలు ఇవి:


1. సూర్యుడు స్థిరంగా ఉన్నాడన్న భావనని గాని, భూమి కదులుతోందన్న భావనని గాని గెలీలియో ఎక్కడా సమర్ధించకూడదు, బోధించకూడదు
2. అసలు ఆ భావనలని గెలీలియో స్వయంగా నమ్మకూడదు
3. ఊరికే వాదన కోసం కూడా వాటి తరపున వాదించకూడదు


కాని తదనంతరం మార్చ్ 1616 లో గెలీలియో పోప్ ని స్వయంగా కలుసుకుని తన పరిస్థితిని పుర్తిగా వివరించాడు. తనకి చర్చికి ఎలాంటి విరోధం లేదని, తనకి దైవం పట్ల భక్తి, పోప్ పట్ల గౌరవం మెండుగా ఉన్నాయని విన్నవించుకున్నాడు. పోప్ అంతా విన్నాడు. గెలీలియో పాండిత్యం పట్ల, ప్రతిభ పట్ల ఎంతో గౌరవం ఉన్నవాడు ఈ పోప్. తన వల్ల చర్చి యొక్క అధికారానికి ప్రమాదం లేదనుకున్నాడు. తన కంఠంలో ప్రాణం ఉండగా గెలీలియోకి ఏ ప్రమాదమూ లేదని, చర్చి వల్ల ఏ సమస్యా రాదని హామీ ఇచ్చి పంపాడు. తేలకపడ్డ మనసుతో గెలీలియో టస్కనీకి తిరిగి వెళ్లాడు.

ఆ తరువాత కూడా గెలీలియోకి, చర్చికి మధ్య అడపాదపా భావసంఘర్షణ జరుగుతూనే ఉంది. 1618 లో మూడు తోకచుక్కలు కనిపించాయి. వాటిని చూసిన కొందరు జేసూట్ ఖగోళవేత్తలు (వాళ్లలో షైనర్ కూడా ఉన్నాడు) వాటి శకునం గురించి నానా వ్యాఖ్యానాలు చేశారు. అది చదివిన గెలీలియో వాటిని హేళన చేస్తూ ఇలా రాశాడు. హోమర్ లాంటి కవులు ఇలియడ్ లాంటి కమ్మని కవితలు అల్లినట్టు, ఖగోళ శాస్త్రం అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు అందమైన కల్పనలు అల్లడం కాదన్నాడు. విశ్వ గ్రంథాన్ని చదవాలంటే


“... ముందు ఆ పుస్తకం రాయబడ్డ భాష అర్థం కావాలి, ఆ భాషలోని అక్షరాలు చదవడం రావాలి. ఆ భాష గణిత భాష. అందులోని అక్షరాలు త్రిభుజాలు, వృత్తాలు మొదలైన జ్యామితీయ ఆకారాలు. ఆ ఆకృతుల రహస్యాలు తెలియకపోతే ఆ పుస్తకంలో ఒక్క పదం కూడా అర్థం కాదు...”


ఆ విధంగా జెసూట్ ల వ్యాఖ్యానాలు వట్టి కాకమ్మ కథలని దుమ్మెత్తి పోసి తనలోతనే సంతోషించి ఉంటాడు గెలీలియో. కాని ఈ ’ఎత్తిపోతల’తో తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడని గ్రహించలేకపోయాడు.


(సశేషం...)

మతం+ విజ్ఞానం: గెలీలియో సమన్వయం

Posted by V Srinivasa Chakravarthy Saturday, November 27, 2010 0 comments

ఆ విధంగా మతాధికారుల స్పందన అంత ప్రోత్సాహకరంగా లేకపోయినా రోమ్ సందర్శనంలో గెలీలియోకి సంతోషాన్ని ఇచ్చిన విషయం మరొకటి ఉంది. రోమ్ లో లిన్సియన్ అకాడెమీ అనే ఓ వైజ్ఞానిక సదస్సు ఉంది. ప్రపంచంలో అదే మోట్టమొదటి వైజ్ఞానిక సదస్సు అని అంటారు. ఆ సదస్సులో గెలీలియోకి సభ్యత్వం దొరికింది. సభ్యుడిగా చేర్చుకోవడమే కాకుండా గెలీలియో గౌరవార్థం విందు కూడా ఏర్పాటు చేశారు. ఆ విందులో ఒక దూరదర్శిని సహాయంతో సూర్యబిందువులని (sunspots) ని బహిరంగంగా ప్రదర్శించారు. చర్చి స్పందన ఎలా ఉన్నా రోమ్ కి చెందిన వైజ్ఞానిక సమాజాల ఆదరణకి పొంగిపోయాడు గెలీలియో. సంతోషంగా ఫ్లోరెన్స్ కి తిరిగి వచ్చాడు.

ఎప్పట్లాగే తన పరిశోధనల్లో మునిగిపోయాడు. ఇలా ఉండగా 1611 లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. వైజ్ఞానిక విషయాల్లో గెలీలియో అవగాహన యొక్క వైశాల్యానికి, నిశిత బుద్ధికి ఇది ఓ చక్కని తార్కాణం. ఒకసారి యూనివర్సిటీ ఆఫ్ పీసా లో ఓ సహోద్యోగికి, గెలీలియోకి మధ్య ఓ వివాదం వచ్చింది. నీరు గడ్డ కట్టి ఐసుగా మరే తీరు గురించి ఆ వివాదం. నీరు గట్టకట్టి, మరింత సాంద్రంగా మారిన రూపమే ఐసు అంటాడు ఆ సహోద్యోగి. ఐసు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువైతే, నీటి మీద ఐసు ఎలా తేలుతుంది? అంటాడు గెలీలియో. ఐసు గడ్డకి చదునైన అడుగు భాగం ఉంటుంది కనుక నీట్లో మునగదు, అంటాడా సహోద్యోగి. అదే పొడి మంచు అయితే నీట్లో మునిగి కరిగిపోతుంది అన్న విషయం ఇతడి వాదనకి బలాన్నిస్తోంది. కాని ఐసు గడ్డని నీట్లో ముంచి వదలేస్తే తిరిగి పైకి తేలుతుంది కనుక, ఐసు మునగక పోవడానికి దాని చదునైన అడుగు భాగం కాదని వాదించాడు గెలీలియో. దాంతో అసలు ఒకే ఒకే పదార్థంతో చెయ్యబడ్డ వస్తువుల ఆకారానికి, అవి తేలడానికి మధ్య సంబంధం ఉందా అన్న ప్రశ్న బయల్దేరి వాదన ఓ ప్రత్యేక దిశలో విస్తరించింది. వివాదం ఇలా ’తేల’దని గెలీలియో ఓ డెమో’ (!) ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు.

అప్పటికే ఈ సంవాదం సంగతి యూనివర్శిటీలో బాగా పొక్కింది. విషయం ఎలా తేలుతుందా ఎంతో మంది ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎప్పట్లాగే గెలీలియో ఓ బహిరంగ ప్రదర్శన ఏర్పటు చేశాడు. ఆ ప్రదర్శనలో ఒకే పదార్థంతో చెయ్యబడి, వివిధ ఆకారాలు గలిగిన వస్తువులు తేలుతాయో, మునుగుతాయో పరీక్షించి చూపించాడు. గెలీలియో ఇచ్చిన ఈ బహిరంగ ప్రదర్శనకి తన ప్రత్యర్థి గైరుహాజరు కావడం విశేషం!

పై వృత్తాంతంలో ప్రతీ సమస్య విషయంలోను గెలీలియో పద్ధతి స్పష్టంగా కనిపిస్తోంది. విషయం ఎప్పుడూ వివాదాలతోనే తేలదు. ప్రయోగం అనే గీటు రాయి మీద పరీక్షిస్తే గాని భావాలలోని నిజం బయటపడదు. ఇలా నిజాన్ని నిర్ధారించడానికి ప్రయోగం మీద, వాస్తవం మీద ఆధారపడే పద్ధతినే వైజ్ఞానిక పద్ధతి అంటారు. ఆ పద్ధతి అంత నిష్ఠగా వాడుతూ వచ్చినవారిలో ప్రథముడు కనుక అతణ్ణి మొదటి శాస్త్రవేత్త అంటారు. అయితే మతం దాని సొంత ఫక్కీలో ఎలాటి ఆధారాలు లేని విజ్ఞానాన్ని బోధించే ఆ రోజుల్లో, ఈ ప్రయోగాత్మక పద్ధతి జనానికి కాస్త కొత్తగా ఉండేది. ప్రయోగాత్మక పద్ధతిలో అధికార ధిక్కారపు బిజాలు మొదట్నుంచి కనిపిస్తున్నాయి. ఆ అధికార ధిక్కారమే తదనంతరం గెలీలియోని సంకటంలో పడేస్తుంది.

చర్చితో పదే పదే భేటీ వేసుకుంటున్నాడు కనుక, మతభావాలని తిరస్కస్తున్నాడు కనుక గెలీలియో పరమ నాస్తికుడని పాఠకులు అభిప్రాయపడే అవకాశం ఉంది. కాని గెలీలియో నాస్తికుడు కాడు. నిజానికి దైవం, అధ్యాత్మికత మొదలైన విషయాల పట్ల అతడి భావాలు చాలా ఆధునికంగా ఉంటాయి. క్రైస్తవులలో కాథలిక్ వర్గానికి చెందిన వాడు గెలీలియో. పరమ నైష్ఠికుడు. కాని అతడి చిత్తంలో ఒక పక్క హేతువాదం, మరో పక్క అస్తికత ఏ సంఘర్షణ లేకుండా ఇమిడీపోయాయి. అసలు ఆ సంఘర్షణ అనవసరం అంటాడు. అధ్యాత్మికత, విజ్ఞానం – ఈ రెండిటి రంగాలు వేరు. రెండిటి పరిధులు వేరు. వైజ్ఞానికులు భౌతిక ప్రపంచం గురించి, దాని తీరు తెన్నులు గురించి మాట్లాడతారు. అధ్యాత్మిక వాదులు అధ్యత్మిక విషయాల గురించి, దైవం గురించి, శ్రేష్ఠమైన జీవన విధానం గురించి మాట్లాడాలి. భౌతిక విషయాల గోల శాస్త్రవేత్తలకే వొదిలిపెట్టాలి. ఒకరి రంగంలో మరొకరు జోక్యం చేసుకోవడం వల్లనే సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయంలో గెలీలియో అభిమతం ఈ ఒక్క వాక్యంలో బట్టబయలు అవుతుంది: “Holy Writ was intended to teach men how to go to Heaven, not how the heavens go.”

(సశేషం...)

గెలీలియో బోధనలకి అటు అరిస్టాటిల్ వాదుల నుండి, ఇటు చర్చి ప్రతినిధుల నుండి కూడా వ్యతిరేకత ఉండేదని కిందటి సారి చెప్పుకున్నాం.
తన బోధనల మీద నమ్మకం కుదరకపోతే వాళ్లనే స్వయంగా వచ్చి తన దూరదర్శినిలో ఓ సారి తొంగి చూడమని ఆహ్వానించేవాడు గెలీలియో. కాని అసలు దూరదర్శిని పని తీరు మీదే అవిశ్వాసం వ్యక్తం చేశారు ఎంతో మంది. దూరదర్శినిలో కనిపించే దృశ్యాలన్నీ వట్టి భ్రాంతి అని, అదంతా అందులోని కటకాల మహిమ అని వాదించేవారు. వాళ్లని ఒప్పించడానికి దూరదర్శిని ప్రదర్శించే చిత్రాలు వాస్తవ వస్తువులకి సంబంధించినవేనని నిరూపించడానికి ప్రయత్నించాడు గెలీలియో. అంతరిక్ష వస్తువులని కాకుండా భూమి మీదే ఉన్న ఎన్నో సుపరిచిత వస్తువుల కేసి ఆ పరికరాన్ని గురి పెట్టి అందులో కనిపించే దృశ్యాలకి, వాస్తవ వస్తువులకి మధ్య సంబంధాన్ని నిరూపించాడు. అయినా కూడా ఒప్పుకోకుండా మొండికేసే అరిస్టాటిల్ వాదుల మూర్ఖత్వానికి నివ్వెరపోయేవాడు, నవ్వుకునేవాడు.

అరిస్టాటిల్ వాదుల తీరు ఇలా ఉంటే చర్చి అధికారుల స్పందన ఇంకా విడ్డూరంగా ఉంది. పృథ్వీ కేంద్ర సిద్ధాంతాన్ని సూటిగా ఖండించకుండా, కేవలం తన పరిశీలనలని మాత్రం అనార్భాటంగా ప్రచారం చేస్తూ వచ్చాడు గెలీలియో. సమాజం నెమ్మదిగా ఆ ఫలితాలని సమ్మతించిందంటే క్రమంగా వాటి పర్యవసానమైన సూర్యసిద్ధాంతాన్ని కూడా సమ్మతిస్తుందని ఊహించాడు. ప్రజల చింతనలో వచ్చే పరిణామాలు చూసి ఏదో ఒక నాటికి చర్చి కూడా మనసు మార్చుకుంటుందని, సూర్య సిద్ధాంతాన్ని ఒప్పుకుంటుందని ఆశపడ్డాడు.
కాని చర్చి తీరులో ఏ మార్పు రాకపోయేసరికి ఒక దశలో మతాధికారులతో ఈ విషయాల గురించి ఒక చర్చ ప్రారంభించాలి అనుకున్నాడు. అలాంటి చర్చని ప్రారంభించడానికి ఓ సదవకాశం మార్చి 1611 లో వచ్చింది. టస్కనీ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక వైజ్ఞానిక ప్రతినిధిగా ఒక సారి రోమ్ ని సందర్శించే అవకాశం దొరికింది. మార్చిలో మొదలైన ఆ సందర్శనం జూలై నెల వరకు సాగింది. అసలు అదే చర్చిఅధికారుల సుముఖతని తెలిపే ఓ శుభసూచకం అనుకోవాలి. అప్పటి పోప్ పాల్ – V గెలీలియోని స్వయంగా అహ్వానించి, అతిథి సత్కారం ఇచ్చాడు. సామాన్యులు పోప్ ని సంబోధించేటప్పుడు మోకాళ్ల మీద మోకరిల్లి మాట్లాడాలనే ఆనవాయితీ ఉండేది. గెలీలియో విషయంలో ఆ ఆనవాయితీని పక్కనపెడుతూ నించునే మాట్లాడనిచ్చాడు. గతంలో అసలు దూరదర్శిని లోంచి చూడడానికి కూడా ఒప్పుకోని చర్చి ఇప్పుడు ఆ ఒట్టుతీసి గట్టు మీద పెట్టింది. కార్డినల్ బెలార్మిన్ తానే స్వయంగా ఓ సారి దూరదర్శిని లోంచి తొంగి చూశాడు. అక్కడితో ఆగక గెలీలియో ప్రతిపాదనలని పరీక్షించడం కోసం ఒక వైజ్ఞానిక ఉపసదస్సుని ఏర్పాటు చేశాడు. ఆ సదస్సుకి చెందిన జెసూట్ అర్చకులు దూరదర్శినితో ఎన్నో పరిశీలనలు చేసి వారి అనుభవాల సారాంశాన్ని ఇలా పేర్కొన్నారు:
1. పాలపుంత అసంఖ్యాకమైన తారల సమూహం

2. శనిగ్రహం పరిపూర్ణ గోళం కాదు. దాని ఆకారం ఇరుపక్కలా ఉబ్బెత్తుగా పొంగి ఉంటుంది.
3. చందమామ ఉపరితలం కూడా నునుపుగా ఉండక ఎత్తుపల్లాలతో ఉంటుంది.
4. వీనస్ కి దశలు ఉంటాయి.
5. బృహస్పతికి నాలుగు చందమామలు ఉన్నాయి.

గెలీలియో కనుక్కున్న పై విషయాలన్నీ జెసూట్ అర్చకులు స్వయంగా నిర్ధారించారు. వాటిని ఒప్పుకుంటూ చర్చి సాధికారికంగా ప్రకటన ఇచ్చింది.


కాని చిత్రం ఏంటంటే ఇన్ని ఒప్పుకున్నా సూర్యసిద్ధాంతాన్ని మాత్రం చర్చి ఒప్పుకోలేదు. అది అదే, ఇది ఇదే...

(సశేషం...)

వీనస్ దశలు – గెలీలియో పరిశీలనలు

Posted by V Srinivasa Chakravarthy Sunday, November 21, 2010 0 comments

మరీ చిన్నదైన మెర్క్యురీని విడిచిపెట్టి, వీనస్ మీద అధ్యయనాలు మొదలుపెట్టాడు గెలీలియో. వీనస్ గ్రహం యొక్క భ్రమణంలో ఒక ప్రత్యేకత ఉంది. దాని సంవత్సర కాలం, దాని దిన కాలం ఇంచుమించు ఒక్కటే. అంటే వీనస్ యొక్క ఒక ముఖమే ఎప్పుడూ సూర్యుడి కేసి తిరిగి ఉంటుంది. (చందమామకి భూమికి మధ్య కూడా ఇలాంటి సంబంధమే ఉందని మనకి తెలుసు). కాని భూమి నుండి చూసే టప్పుడు, సూర్యుడి బట్టి వీనస్ స్థానం మారుతూ ఉంటుంది కనుక వీనస్ దశలు కూడా కనిపించాలి. టోలెమీ తదితరుల సిద్ధాంతం ప్రకారం పృథ్వీ కేంద్ర సిద్ధాంతం నిజమైతే, వీనస్ దశల వరుసక్రమం ఒక రకంగా ఉండాలి. కాని సూర్యకేంద్ర సిద్ధాంతం నిజమైతే వీనస్ దశల వరుసక్రమం మరో విధంగా ఉండాలి.


1610 లో గెలీలియో మొట్టమొదటి సారిగా వీనస్ దశలని దర్శించి వాటిని వర్ణిస్తూ సవివరంగా చిత్రాలు గీశాడు. తన పరిశీలనలు సూర్యసిద్ధాంతానికి మద్దతు నిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇది తెలిస్తే కోపర్నికస్ వాదులు మరింత చెలరేగే ప్రమాదం ఉంది. అదే జరిగితే చర్చితో ఘర్షణ తప్పదు. ఈ తలనెప్పులన్నీ వద్దనుకున్నాడు గెలీలియో. అందుకే తను కనుక్కున్న విషయాన్ని గూఢసందేశంగా (anagram) తన పుస్తకంలో లాటిన్ లో ఇలా రాసుకున్నాడు. Haec immatura a me iam frustra leguntur oy. (These are at present too young to be read by me. ) కాస్త గుంభనంగా ఉన్న ఈ వాక్యానికి ’ఇంకా అంకుర స్థితిలో ఉన్న ఈ విషయాలని చదివి ఒక కచ్చితమైన నిర్ణయానికి రావడానికి ప్రస్తుతానికి నాకు కష్టంగా ఉంది’ అన్న అర్థాన్ని తీసుకోవచ్చు. కాని పై లాటిన్ వాక్యంలోని అక్షరాలని తారుమరు చేస్తే ఇలా మరో లాటిన్ వాక్యం వస్తుంది: “Cynthiae figuras emulatur Mater Amorum” (Cynthia’s figures are imitated by the Mother of Love. సింథియా దృశ్యాలని ప్రేమ జనని అనుకరిస్తోంది.) ఇక్కడ సింథియా అంటే చందమామ. చందమామ దృశ్యాలని ప్రేమదేవత అయిన వీనస్ అనుకరిస్తోందట! అంటే చందమామకి ఉన్నట్లే వీనస్ కి కూడా దశలు ఉన్నాయని గెలీలియో లోకానికి రహస్యంగా తెలియజేస్తున్నాడు.

అలా 1610 లో చేసిన పరిశీలనలు తదనంతరం 1613 లో బయటపడ్డాయి. సూర్యసిద్ధాంతాన్ని సమర్ధిస్తూ ఇన్ని ఆధారాలు బయటపడుతున్నా అరిస్టాటిల్ వాదులు మాత్రం తమ మంకుపట్టు వదల్లేదు. ఎంతో కాలంగా అంతరిక్ష వస్తువులని పరిశీలించడానికి అలవాటు పడ్డ ఖగోళవేత్తలకి ఈ కొత్త బోధన మింగుడుపడలేదు. ఉదాహరణకి బృహస్పతి చందమామల గురించి గెలీలియో కనుక్కున్న విషయాల గురించి విన్న ఫ్రాన్సెస్కో సిజీ అనీ ఖగోళ వేత్త ఇలా వితండ వాదన మొదలెట్టాడు. “బృహస్పతి చందమాలు కంటికి కనిపించవు కనుక, భూమి మీద వాటికి ప్రభావం ఉండదు. కనుక వాటిని గురించి అసలు పట్టించుకోవడం అనవసరం. కనుక అవసలు లేవనే అనుకోవాలి” (!) అది విన “దీని భావమేమి?” అని గెలీలియో ఆలోచనలో పడ్డాడు. అలాగే గిలియో లీబ్రీ అనే తత్వవేత్త అసలు దూరదర్శిని లోంచి చూడడమే పెద్ద పొరబాటు అన్నట్టు మాట్లాడేవాడు. తదనంతరం అతగాడు చనిపయాక “కనీసం స్వర్గానికి వెళ్లే దారిలోనైనా వీనస్ దశలు, బృహస్పతి చందమామలు కనిపించాయేమో” అని ఛలోక్తి విసురుతాడు గెలీలియో.

గెలీలియో తన పరిశీలనలని బయటపడనిచ్చాడే గాని దాని పర్యవసానంగా సూర్యసిద్ధాంతాన్ని ఒప్పుకోవాలని మాత్రం గట్టిగే చెప్పేవాడు కాడు. పరిశీలనల బట్టి ఎవరికి వారే వాటి పర్యవసానాలని అర్థం చేసుకోవాలని ఎదురుచూసేవాడు. సూర్యసిద్ధాంతం ఊసెత్తితే చర్చితో తలగోక్కున్నట్టే. గతంలో అలా చేసినందుకు గోర్డానో బ్రూనోకి పట్టిన గతేంటో తనకి బాగా తెలుసు.

ఈ గోర్డానో బ్రూనో పదహారవశతాబ్దపు ఇటలీకి చెందిన ఓ గొప్ప తత్వవేత్త, గణితవేత్త, ఖగోళశాస్త్రవేత్త. ఇతడు బోధించిన విశ్వదర్శనం గతంలో కోపర్నికస్ బోధించిన విశ్వదర్శనం కన్నా ఎంతో మిన్నగా ఉండేది. భూమికి ప్రాముఖ్యత ఇవ్వడానికి బదులు సూర్యుడికి ప్రాముఖ్యత నిస్తుంది కోపర్నికస్ వాదం. కాని సూర్యుడికి కూడా విశ్వంలో ప్రత్యేకమైన స్థానం ఏమీ లేదని బోధించేవాడు బ్రూనో. విశ్వమంతా వ్యాపించిన కోటానుకోట్ల తారల్లో సూర్యుడు కూడా ఒకటి అని బోధించేవాడు. కోపర్నికస్ మాటలే మింగుడు పడని చర్చికి బ్రూనో మాటలు మరీ విపరీతంగా అనిపించాయి. మతధిక్కారం (heresy) నెపం మీద బ్రూనోకి తీవ్రమైన శిక్ష విధించింది చర్చి. బహిరంగంగా ఓ కట్టెకి (stake) కట్టి ఆ మహామేధావిని సజీవదహనం చేసింది.

కనుక చర్చి విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకోవాలనుకున్నాడు గెలీలియో.

(సశేషం...)







కోపర్నికస్ – కెప్లర్ - గెలీలియో

Posted by V Srinivasa Chakravarthy Friday, November 19, 2010 0 comments



గెలీలియో దూరదర్శినులతో చేస్తున్న పరిశీలనల గురించి కెప్లర్ మొట్టమొదట ’హెర్ వాకర్’ అనే వ్యక్తి ద్వారా విని సంతోషించాడు. విశ్వం గురించి శతాబ్దాలుగా తేలని సమస్యలు ఈ దూరదర్శిని వల్ల తేలే అవకాశం ఉందని అతడు మొదట్నుంచే ఊహించాడు. ఈ కొత్త పరికరం ఖగోళ విజ్ఞానంలో విప్లవం తీసుకురాగలదని ఆశిస్తూ దాన్ని ఇలా పొగిడాడు: “ఓ దూరదర్శినీ! విజ్ఞాన దాయినీ! నీ ఘనత ముందు ఎంత మహిమాన్వితమైన రాజదండమైనా సాటి రాదు. నిన్ను చేబూనిన వాడు దివ్యమైన ఈ సృష్టికే రాజవుతాడు, సామ్రాట్టు అవుతాడు!”



భూమి చుట్టూ సూర్యచంద్రులే కాక, ఇతర గ్రహాలు కూడా తిరుగుతున్నాయని, విశ్వానికి కేంద్రం మనిషికి జన్మనిచ్చిన ఈ భూమేనని ఒక పక్క క్రైస్తవ మతం బోధిస్తుంటే, ఆ భావనని ఖండిస్తూ భూమి, తదితర గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని ప్రతిపాదించాడు కోపర్నికస్. అయితే కోపర్నికస్ వాదనలో బలహీనత దానికి తగినంత సాక్ష్యాధారాలు లేకపోవడం.


కోపర్నికస్ తరువాత ఇంచుమించు ఓ శతాబ్దం తరువాత పుట్టిన వాడు కెప్లర్. ఇతడికి కోపర్నికస్ భావాల గురించి తన గురువైన మైకేల్ మేస్టిలిన్ ద్వారా తెలిసింది. ఎలాగైనా కోపర్నికస్ భావాల గురించి మరింత లోతుగా శోధించాలని నిశ్చయించుకున్నాడు కెప్లర్. అంతలో అదృష్టవశాత్తు టైకో బ్రాహే అనే పేరు మోసిన డేనిష్ ఖగోళవేత్త నుండి తనకి సహచరుడిగా పని చెయ్యడానికి కెప్లర్ కి ఆహ్వానం వచ్చింది. టైకో బ్రాహే తో పని చెయ్యడం మహాభాగ్యం అనుకుని పన్లోకి దిగాడు కెప్లర్.


టైకో బ్రాహే ఖగోళ వస్తువుల చలనాల గురించి అపారమైన సమాచారాన్ని తన పరిశీలనల ద్వారా సేకరించాడు. అది ఖగోళశాస్త్రంలో దూరదర్శిని ఇంకా వాడుకలో లేని కాలం. కేవలం కంటితో చూస్తూ అంత సమాచారాన్ని పోగేశాడు టైకో. ఆ సమాచారాన్ని లోతుగా శోధించాడు కెప్లర్. ఆ పరిశోధనల బట్టి కోపర్నికస్ చెప్పింది నిజమని మరింత బలమైన నమ్మకం కుదిరింది. విశ్వానికి కేంద్రం భూమి కాదని, సూర్యుడని, గ్రహాలన్నీ (భూమితో పాటు) సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని, కెప్లర్ అర్థం చేసుకున్నాడు. భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయన్న నమ్మకంతో ఇక్కణ్ణుంచి గ్రహ గతులని పరిశీలిస్తున్నప్పుడు, కొన్ని సార్లు గ్రహగతులు గజిబిజిగా అనిపిస్తాయి.

గ్రహాల ఆ గజిబిజి గతులకి సంబంధించిన కొన్ని చిక్కు ముళ్ళని విడదీశాడు కెప్లర్. అంతకు ముందు టైకో బ్రాహే చేసిన విస్తృత పరిశీలనల ఆధారంగా కెప్లర్ గ్రహాల కక్షలని శాసించే మూడు నియమాలని ప్రతిపాదించాడు (చిత్రం). కెప్లర్ నియమాలుగా పేరు పొందిన ఆ నియమాలు ఇవి:

1. గ్రహాల కక్ష్యలు వృత్తాకారంలో కాక దీర్ఘవృత్తాకారంలో (elliptical) ఉన్నాయి. సూర్యుడు వాటి కేంద్రం వద్ద కాక నాభి (focus) వద్ద ఉన్నాడు.


2. కక్ష్యలో ఉన్న గ్రహం, సూర్యుడికి దూరంగా ఉన్న దశలో నెమ్మదిగాను, దగ్గరగా ఉన్నప్పుడు మరింత వేగంగాను నడుస్తుంది. (సమానమైన కాలవ్యవధుల్లో సూర్యుణ్ణి, గ్రహాన్ని కలిపే రేఖ ఊడ్చే ప్రాంతం యొక్క వైశాల్యం సమానంగానే ఉంటుంది.)


3. సూర్యుడి నుండి గ్రహం యొక్క సగటు దూరం పెరుగుతున్న కొద్ది, సూర్యుడి చుట్టూ దాని ప్రదక్షిణ కాలం (దాని "సంవత్సరం") విలువ పెరుగుతుంది. (ఒక గ్రహం యొక్క సంవత్సరకాలం యొక్క వర్గం, ఆ గ్రహ కక్ష్య యొక్క దీర్ఘాక్షం యొక్క ఘనానికి అనులోమానుపాతంగా ఉంటుంది.)

ఆ విధంగా కెప్లర్ నియమాలు సూర్యసిద్ధాంతానికి ఓ నిర్దిష్టమైన రూపాన్ని ఇచ్చాయి.

ఇప్పుడు గెలీలియో తన దూరదర్శినితో కొత్తగా చేస్తున్న పరిశీలనలు కెప్లర్ భావాలని సమర్ధిస్తున్నట్టుగా ఉన్నాయి. అందుకే గెలీలియో తన ఉత్తరాలలో అప్పుడప్పుడు అందిస్తున్న వార్తలు కెప్లర్ కి ఎంతో సంతోషం కలిగించాయి.


ఇన్ని ఆధారాలు పోగవుతున్నా మతం మాత్రం తన బోధనలని, భావనలని మార్చుకోలేదు. దేవుడు మనిషిని అపురూపంగా సృష్టించాడు. అలాంటి మనిషి జీవించే ఈ భూమికి విశ్వంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కనుక గ్రహాలు, సూర్యచంద్రులు, తారలు అన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని కాదన్న వాడు వట్టి అజ్ఞాని, లేదా దైవ ద్రోహి. ఇదీ వరస!


మతం యొక్క మంకు పట్టు ఇలా ఉండగా, గెలీలియో శాస్త్ర పరంగా కూడా వాదాన్ని ఇంకా బలపరచ వలసి ఉందని గ్రహించాడు. ఇంతవరకు తను కనుక్కున్న విషయాలు విశ్వానికి భూమి కేంద్రం కాకపోవచ్చని, భూమికి ప్రత్యేకమైన స్థానం ఏమీ లేదని సూచిస్తున్నాయే గాని, గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని ప్రత్యక్షంగా తను నిరూపించలేక పోయాడు. టైకో బ్రాహే పరిశీలనల్లో ఆ విషయం అంతర్లీనంగా ఉన్నా, కెప్లర్ సిద్ధాంతాలు కూడా ఆ దిశలోనే మొగ్గు చూపుతున్నా, దూరదర్శినితో ప్రత్యక్షంగా చూస్తూ సూర్యుడి చుట్టు గ్రహాలు తిరుగుతున్నాయని నిరూపించగలమా? అని ఆలోచించాడు గెలీలియో.


విజ్ఞానశాస్త్రంలో ఎప్పుడూ ఒక మంచి సిద్ధాంతం అంత ముందు తెలిసిన విషయాలని వర్ణించగలిగితే సరిపోదు. ఆ సిద్ధాంతం అంతకు ముందు తెలీని కొత్త విషయాలని కూడా ఊహించగలగాలి. అప్పుడా కొత్త విషయాలని కొత్తగా ప్రయోగం చేసి నిరూపిస్తే, సిద్ధాంతం మరింత బలపడుతుంది. ’ద రెవొల్యూషనిబస్’ అనే గ్రంధంలో కోపర్నికస్ సరిగ్గా అలాంటి ఊహాగానమే ఒకటి చేశాడు. శుక్ల పక్షం నుండి కృష్టపక్షం వరకు చంద్రుడికి దశలు ఉంటాయని మనకి తెలుసు. మరి వీనస్, మెర్క్యురీ మొదలైన గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగేట్టయితే వాటికీ దశలు ఉండాలని ఊహించాడు కెప్లర్. కాని ఆ విషయాన్ని నిరూపించడానికి తన వద్ద సరైన సాధన సామగ్రి లేకపోయింది.


తన కొత్త పరికరంతో ఆ సంగతేంటో తేల్చుకుందాం అని బయల్దేరాడు గెలీలియో.

(సశేషం...)









postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts