శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


 

Demystifying the Brain (మెదడులోని మర్మం) అనే పాపులర్ సైన్స్ పుస్తకాన్ని లోగడ ఈ బ్లాగ్ లో పరిచయం చెయ్యడం జరిగింది.



ఆ పుస్తకానికి అనువాదం ఇవాల్టి నుండి మొదలు…


అధ్యాయం 1
మెదడు యొక్క భావ చరిత్ర

మనిషి మెదడు తన గురించి తాను ఏమనుకుంటుంది? దాని గురించి దానికి ఎలాంటి అభిప్రాయం వుంది, ఎలాంటి అవగాహన వుంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు శోధిస్తూ పోతే చాలా ఆసక్తికరమైన కథ అవుతుంది. మనస్సుకి, బుద్ధికి, ప్రజ్ఞకి ఉపాధి, ఆధారం మెదడు అని మనకి ఇప్పుడు తెలుసు గాని రెండు సహస్రాబ్దాల క్రితం ఆ విషయంలో సరైన అవగాహన ఉండేది కాదు. అలాంటి అవసాన దశ నుండి ప్రారంభమైన నాడీ శాస్త్రం (neuroscience), నేడు జీన్ థెరపీలు అయితేనేమి, డీప్ బ్రెయిన్ స్టిములేషన్ లు అయితే నేమి, ఎన్నో కొత్త ఒరవళ్లు చోటు చేసుకుంటూ, గుర్తుపట్టరానంతగా పురోగమించింది. మెదడు చరిత్ర అంటే మెదడును గురించిన మన భావాలలోని దోషాల చరిత్రే! అసలు ఏ వైజ్ఞానిక రంగంలోనైనా చరిత్ర అంటే ఇలాగే ఉంటుంది. కొత్త ప్రయోగాలు చెప్పే సాక్ష్యం ఆధారంగా పాత సిద్ధాంతాలలోని తప్పులు దిద్దుకుంటూ విజ్ఞానం పురోగమిస్తుంది మరి. నాడీ శాస్త్రంలో ఎన్ని తప్పులు సవరించినా, ఎంత పురోగతి సాధించినా, కొన్ని ప్రశ్నలు మాత్రం కొరకరాని కొయ్యలుగానే మిగిలిపోతున్నాయి. అలాంటి ప్రశ్నలలో ‘చైతన్యం అంటే ఏంటి? మనస్సు అంటే ఏంటి?” ముఖ్యమైనవి. ఈ లోతైన ప్రశ్నల జోలికి చివరి అధ్యాయంలో వద్దాం గాని ప్రస్తుతానికి మాత్రం మెదడు చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి చెప్పుకుందాం.

మన మెదడు చరిత్ర కథ పాశ్చాత్య వైద్య సాంప్రదాయానికి మూలవిరాట్టు అని చెప్పుకోదగ్గ ప్రాచీన గ్రీకు వైద్యుడు హిపోక్రెటీస్  (460-379 B.C.) తో మొదలుపెడదాం. ప్రస్తుత కాలంలో మనం అనుకున్నట్టే హిపోక్రెటీస్ కూడా ఇంద్రియాల వ్యవహారాలకి, మనస్సుకి, బుద్ధికి మెదడే ఉపాధి అని నమ్మాడు. ప్రాచీన గ్రీకు తాత్వికుడు ప్లేటో, ప్రజాస్వామ్యం గురించి, ఆదర్శ సమాజం గురించి కలలు గన్న మేధావి, కూడా మెదడు గురించి ఇంచుమించు అదే విధంగా ఆలోచించాడు. కాని ప్లేటో శిష్యరత్నం అయిన అరిస్టాటిల్ భావాలు మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా వున్నాయి.

అరిస్టాటిల్ భౌతిక ప్రపంచంలో ఎన్నో అంశాల మీదకి తన చింతనని సారించాడు. ప్రతీ దానికి ఏదో వివరణ ఇచ్చేవాడు. ఎన్నో సందర్భాలలో ఆ వివరణ తప్పని (ఒకటిన్నర సహస్రాబ్దాల తర్వాత) తేలింది. కాని ఆ రోజుల్లో మాత్రం అరిస్టాటిల్ తప్పని చెప్పడానికి గాని, నిరూపించి తేల్చిచెప్పడానికి ఎవరికీ ధైర్యం చాల్లేదు. (ఉదాహరణకి తోకచుక్కలు అంటే ఏంటి అన్న ప్రశ్నకి సమాధానంగా అరిస్టాటిల్ అవి గాల్లో మండుతున్న వాయువుల వల్ల పుట్టే కాంతులు అని చాటాడు. తోకచుక్కలు మన భూమి చుట్టూ ఉండే వాయుమండలానికి పరిమితమైనవి కావని, అంతరిక్షంలో ఎంతో దూరం నుండి కొట్టుకొచ్చే రాతి శకలాలని ప్రస్తుతం మనకి తెలుసు.) అరిస్టాటిల్ తన విడ్డూరపు చింతనని మెదడు మీదకి కూడా సారించాడు. మనస్సుకి, చైతన్యానికి ఉపాధి మెదడు కాదని, గుండె అని బోధించాడు. ఒక విధంగా శరీరంలో ప్రాణం నిలవడానికి మెదడు కన్నా గుండే ముఖ్యం అన్నది నిజమే. కాని మన ఆలోచనలకి, అనుభూతికి ఆధారం మెదడే. కాని గుండె యొక్క ప్రాముఖ్యతని పురస్కరించుకుని అరిస్టాటిల్ అలా భావించి వుండవచ్చు.

ఆ విధంగా మెదడు గురించి ప్రాచీన గ్రీకు తాత్వికులు తమ మెదడుకి తోచిన వ్యాఖ్యానాలు చేస్తూ రావడంతో పరిస్థితి కాస్త గందరగోళంగా ఉండేది. అలాంటి పరిస్థితిలో మెదడు రంగంలోకి కాస్త స్పష్టత తెచ్చిన వాడు గాలెన్. ఇతగాడు కూడా ప్రాచీన్ గ్రీకు దేశానికి చెందిన వాడే. కాని ఇతడు తాత్వికుడు కాడు – వైద్యుడు! తాత్వికులకి, వైద్యులకి ఓ ముఖ్యమైన తేడా వుంది. తాత్వికులు తమ ఊహాశక్తిని బట్టి, ధీశక్తిని బట్టి విషయాల గురించి వ్యాఖ్యానిస్తూ పోతుంటారు. అది నిజమా కాదా అన్న విషయం బాహ్య ప్రపంచం చెప్పే సాక్ష్యం మీద కాక, తర్కమీమాంసల మీద ఆధారపడి వుంటుంది. అలా కాకుండా తన సిద్ధాంతాలని వాస్తవం సమర్ధిస్తోందని నిరూపించే బాధ్యత వైద్యుడి మీద ఉంటుంది. అందుకనే కాబోలు మెదడు యొక్క నిర్మాణం విషయంలో గాలెన్ ఎంతో ప్రగతి సాధించాడు.

గాలెన్ కాలంలో వైద్య రంగంలో విధివిధానాలు అన్నీ కకావికలంగా ఉండేవి. వైద్య వృత్తిని శాసిస్తూ పెద్దగా శాస్త్రీయ ప్రమాణాలేవీ ఉండేవి కావు. చాలా మటుకు హిపోక్రాటిక్ సాంప్రదాయాన్నే గుడ్డిగా అనుసరించేవారు. ఈ రోజుల్లో “హోలిస్టిక్ క్లినిక్” లలో చేసినట్టుగా సంగీతంతో రోగనివారణ చేసే కార్యక్రమాలు చేపట్టేవారు కొందరు. మరి కొంత మంది ఛూం మంత్రకాళీ అంటూ మంత్రాలు విసిరి రోగాన్ని మాయం చెయ్యబూనేవారు. ఆ రోజుల్లో మానవ కళేబరాలని వైద్య బోధనలో వాడే విషయంలో మతం విధించిన నిషేధం ఉండేది. ఆ కారణం చేత వైద్య పరిశోధన కుంటినడక నడిచింది. ఇక గత్యంతరం లేక గాలెన్ వంటి వాళ్లు జంతు కళేబరాలని పరిచ్ఛేదించి, పరీక్షించి ఆ పరిశీలనలని మానవ శరీరాలకి ఆపాదించేవాళ్లు. జంతుపరిచ్ఛేదంలో ఆరితేరినవాడు గాలెన్. తన అనుభవాన్ని పొందుపరుస్తూ విస్తృతంగా రాశాడు.  ఆ విధంగా ‘శరీర నిర్మాణ శాస్త్రం’ (anatomy)  కి పునాదులు వేశాడనే చెప్పాలి. 

                                                                 గాలెన్

ఉదాహరణకి “మెదడు గురించి” (On the brain)   అనే రచనలో మెదడుని ఎలా సిద్ధం చెయ్యాలి, ఎలా పరిచ్ఛేదించాలి అన్న విషయాన్ని విపులంగా ఇలా వర్ణించాడు –


(ఇంకా వుంది)



భారతి లిపి – ఎన్నో భారతీయ భాషలని వ్యక్తం చెయ్యగల సులభ, ఏకైక లిపి

మన దేశ ప్రజలు 1600  పైగా భాషల్లో మాట్లాడుతారు.  ఆ భాషల్లో  24  సాధికార భాషలు. ఈ భాషలని రాయడానికి  10  పైగా లిపులు వాడుతాము.
ఎన్నో దేశాల్లో దేశం అంతటా ఒకే భాష వాడబడుతూ ఉంటుంది. అలాంటి దేశంలో సమాచార వినియమం సులభంగా జరుగుతుంది. ప్రగతి మరింత వేగవంతం అవుతుంది. మనం దేశం అంతటా ఏకైక భాష వినియోగించబడడం అనేది వాస్తవ, రాజకీయ, సామాజిక పరిస్థితుల దృష్ట్యా జరగని పని అనే చెప్పుకోవాలి.

కాని ఒకే భాష కాక పోయినా ఒకే లిపి వాడడం సాధ్యమా?

మరి యూరప్ లో అదే కదా జరుగుతోంది? యూరప్ లో ఎన్నో భాషలు (గ్రీకు భాష లాంటివి తప్ప) ఒకే లిపిలో రాయబడతాయి. దీని వల్ల దైనిక వ్యవహారాలలో ఎంతో సౌలభ్యం ఉంటుంది.

ఇలాంటి పరిస్థితి మన దేశంలో రాగలదా?
దేశ భాషలన్నిటికీ ఒకే లిపి అంటే అది ఏ లిపి అన్న ప్రశ్న వస్తుంది? తెలుగా, తమిళమా, దేవనాగరా…?  ఉన్న లిపులలో దేన్ని ఎంచుకున్నా తక్కిన లిపుల వాళ్లు చిన్నబుచ్చుకుంటారు. మరెలా?

అసలు పలు లిపుల స్థానంలో ఒకే లిపి వాడాలి అంటే ఆ లిపులలో ఏదో సామాన్యత ఉండాలి. మన దేశ లిపులలో ఎన్నో వాటిలో అక్షర కూర్పు ఇంచుమించు ఒక్కలాగే ఉంటుంది. అక్షరాలు, 1) అచ్చులు (అ, ఆ, ఇ, ఈ…),  2) హల్లులు (క, ఖ, గ, ఘ…), 3)  గుణింతం (క, కా, కి, కీ…) ఈ తరహాలో రూపొందించబడి వుంటాయి.  ఈ రకమైన అక్షరకూర్పు గల లిపులు మనకి తొమ్మిది వున్నాయి. అవి –
హిందీ/మరాఠీ, బెంగాలీ/అస్సామీస్, ఒరియా, గుజరాతీ, గురుముఖీ (పంజాబీ లిపి), తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం.
ఒకే అక్షరాలని వ్యక్తం చెయ్యడానికి ఇన్ని లిపులు ఎందుకు? (మన ప్రాణం తియ్యడానికి తప్ప!)
కనుక ఈ తొమ్మిది లిపులకి బదులుగా ఒకే ఏకైక లిపిని వాడడానికి వీలవుతుందా?
తప్పకుండా అవుతుంది.

అంతే కాదు. ఆ లిపి వీటిల్లోనే ఒకటి కానక్కర్లేదు. ఎందుకంటే ఈ తొమ్మిది లిపులు కూడా నా ఉద్దేశంలో మరీ జటిలంగా ఉన్నాయి. అంత జటిలంగా ఉండనక్కర్లేదు. ఎందుకంటే మన లిపులలో ఆక్షరకూర్పులో, వాటి వెనుక ఉన్న శబ్ద క్రమంలో ఒక చక్కని తర్కం, ఒక తీరు, తెన్ను ఉన్నాయి.  కాని శబ్దంలో ఉన్న  విన్యాసం అక్షరం యొక్క లిఖిత రూపంలో ప్రతిబింబం కావడం లేదు. కనుక లిపులు మరీ సంక్లిష్టంగా ఉన్నాయి.

ఎందుకంటారా? రెండు కారణాలు:
-      శబ్దంలో బాగా పోలిక గల అక్షరాలు ఆకారంలో బాగా భిన్నంగా ఉంటాయి. ఉదాహణకి ‘ష’, ‘శ’ అక్షరాలు.
-      శబ్దంలో అస్సలు పోలిక లేని అక్షరాలు, ఆకారంలో ఎంతో పోలిక కలిగి ఉంటాయి. ఉదాహరణకి, ‘శ’, ‘ళ’ అక్షరాలు.
ఇలాంటి ఉదాహరణలు తెలుగు లిపిలోనే కాదు, మిగతా భారతీయ లిపులు అన్నిట్లోను ఎన్నో ఎత్తి చూపొచ్చు.

ఈ సమస్యలన్నీ గుర్తించిన మీదట ఇలాంటి సమస్యలు లేని ఓ కొత్త లిపిని రూపొందించడం జరిగింది.
ఈ కొత్త లిపి పేరు “భారతి.” ఇది యావత్ దేశానికి సంబంధించిన లిపి కనుక దానికి అలా పేరు పెట్టడం జరిగింది.

ఈ లిపి గురించి జులైలో కొంత మీడియా కవరేజ్ వచ్చింది.






ఆ సమయంలో లిపి గురించిన వివరాలు ఇవ్వడానికి వీలు కాలేదు. ఆ వివరాలు ఈ వ్యాసంలో ఇస్తున్నాను.



భారతి అచ్చులు






భారతి హల్లులు







భారతి గుణింతం

(క గుణింతం మాత్రమే ఇవ్వబడింది. ఇదే పద్ధతిలో మొత్తం గుణింతం రాయొచ్చు.)

పూర్తి గుణింతం ఇక్కడ ఇవ్వబడింది…
https://mail.google.com/mail/u/0/images/cleardot.gif



భారతి అక్షరాలని అలాగే ఎందుకు రూపొందించవలసి వచ్చింది అన్న ప్రశ్నకి ఎంతో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కొన్ని పోస్టలో రాసుకు రావడానికి ప్రయత్నిస్తాను.

అలాగే భారతి లిపితో వివిధ లిపులలోని అన్ని అక్షరాలని వ్యక్తం చెయ్యొచ్చు అని నిరూపించాలంటే, కొన్ని  లిపులలో ఉండే ప్రత్యేక అక్షరాలని ఎలా వ్యక్తం చెయ్యాలో చూపించాలి.  ఉదాహరణకి తెలుగులో ‘fa’ అనే శబ్దం లేదు. ‘ఫ’ మాత్రమే వుంది. కాని గురుముఖి లో ‘fa’ ఉంది. అలాగే తమిళ, మలయాళ భాషల్లో ‘zha’  అనే శబ్దం వుంది. అది తెలుగులో లేదు. ఇలాంటి ప్రత్యేక అక్షరాలన్నిటికీ ‘భారతి లిపి’లో చోటు కల్పించడం జరిగింది.

ప్రత్యేక లిపులలో ఉండే ప్రత్యేక అక్షరాలని భారతి లిపితో ఎలా వ్యక్తం చెయ్యొచ్చో ముందు ముందు పోస్ట్ లలో చర్చిస్తాను.

భారతి లిపి మీద బ్లాగర్ల వ్యాఖ్యానం, చర్చ ఎంతో విలువైనదని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ లిపి మీద మీ ఆలోచనలు తెలుసుకోగోరుతూ…

తేజపు గోళం చేసిన తాండవం

Posted by V Srinivasa Chakravarthy Sunday, November 3, 2013 0 comments



తేజపు గోళం చేసిన తాండవం

ఆ కాంతుల బంతి, ఆ చమక్కుల చెండు ఉన్న చోట ఉండకుండా  పడవంతా చెంగు చెంగున గంతులు వేసింది. తెరచాప గుంజ విరిగిన చోట ఓ సారి వాలింది. తరువాత మా సంభారాల సంచీ మీదకి వాలింది. అక్కణ్ణుంచి పోయి పోయి మందుపాతర ఉన్న సంచీ మీదకి వాలింది. ఇంతే సంగతులు అనుకున్నా మనసులో! కాని రక్షించి ఏం కాలేదు. మౌనంగా, ముభావంగా ఉంటాడని కాబోలు, ఆ చెండుకు మా హన్స్ నచ్చినట్టున్నాడు! ఓ సారి హన్స్ వైపుకి గంతు వేసింది. ఆ వేటగాడు మాత్రం నిశ్చలంగా రెప్ప వెయ్యకుండా ఆ నీలి కళ్లతో దాని నీలి తేజాన్ని చూస్తూ ఉండిపోయాడు. అంతలో మావయ్య మీదకి విజృంభించింది. మావయ్య సకాలంలో స్పందించి బోర్లా పడి దాని దెబ్బ నుండి తప్పుకున్నాడు. ఇక చివరికి నేనే మిగిలినట్టున్నాను. దాని తఢాకా నా మీద చూబించాలనుకుంది కాబోలు. నా పాదాల దగ్గర పడి గిర్రున తిరిగింది. దాని నుండి కాస్త దూరంగా జరగాలనుకున్నాను కాని కాలు కదల్లేదు.

ఆ మంటల వల్ల వాతావరణంలో ఆక్సిజన్ కొరవడింది అనుకుంటా. నైట్రోజెన్ వాసన భరించలేకుండా ఉన్నాం. ఊపిరితిత్తుల్లో నైట్రోజెన్ నిండిపోతోంది. ఒళ్లంతా నొప్పులు పుడుతున్నాయి.
కాలు ఎందుకు కదల్లేదో కాసేపటికి గాని అర్థం కాలేదు. పడవలోని దుంగలకి మేకులేసి కొట్టినట్టు పాదం కదల్లేదు. కాస్త ఆలోచిస్తే విషయం అర్థమయ్యింది. ఆ వచ్చిన కాంతి బంతిలోని కాంతికి మూలం విద్యుదావేశాలు. ఆ కాంతి విద్యుత్ కాంతి. దాని ప్రభావం వల్ల పడవలోని ప్రతీ ఇనుప వస్తువు అయస్కాంతీకృతం అయిపోయింది. అందు వల్ల మా పరికరాలు, పనిముట్లు, తుపాకులు అన్నీ ఒకదాన్నొకటి ఢీకొని విచిత్రంగా ఘర్షణ పడడం మొదలెట్టాయి. నా బూట్లలో ఉండే మేకులు, ఆ పక్కనే ఉండే ఓ ఇనుప పలకకి అతుక్కుపోవడం వల్ల కాలు కదల్చడానికి వీలుపడలేదు. కల్లు తాగిన కోతిలా పడవంతా గంతులేస్తున్న ఆ నిప్పుల బంతి మరి కాస్తలో నా కాలిని బుగ్గి చేసేలోగా కాలి లోని బలాన్నంతా ఉపయోగించి కాలు కదిలించి పక్కకి తప్పుకున్నాను.
ఆ అగ్ని గోళం గాల్లోకి బాణంలా దూసుకుపోయి పెటేలుమని పేలిపోయింది. ఆ విస్ఫోటంలో వెలువడ్డ కాంతికి కళ్లు బైర్లు కమ్మాయి.
ఒక్క క్షణంలో కాంతి అంతా మాయమయ్యి అంత సర్దుకుంది. మామయ్య పడవ లో సాష్టాంగ పడి వున్నాయి. హన్స్ చుక్కానిని వదలకుండా నిబ్బరంగా ఉన్నాడు. కాని వంటి నిండా విద్యుదావేశం బాగా పట్టినట్టుంది. ఒంట్లోంచి చిటపట చప్పుళ్లతో విస్ఫులింగాలు ఎగురుతున్నాయి. ‘అగ్ని వీరుడు’ లా రగిలిపోతున్న అతడి ఆకారాన్ని చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
ఈ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఇంతకీ మేం ఎటు వెళ్తున్నట్టు?

మంగళవారం, ఆగస్టు 25
ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. కాని కొన్ని గంటల సేపు గాఢ నిద్రలోకి జారుకున్నాను. బయట తుఫాను ఎప్పట్లాగే చెలరేగిపోతోంది. మైళ్ల పొడవున్న మహాసర్పాలు గాల్లో భీకరంగా కొట్లాడుతున్నట్టు ఉంది వాతావరణం.
ఈ పాటికి ఇంగ్లండ్ దాటిపోయి వుంటామా? ఇంగ్లండేం ఖర్మ, ఫ్రాన్స్ మాత్రమే కాక మొత్తం యూరప్ అంతా దాటిపోయి వుంటామేమో.

ఈ సారి మళ్లీ ఏదో పెద్ద శబ్దం వినిపించింది. మళ్లీ ఏం మూడిందో…

(ఇంకా వుంది)

(ముప్పై ఐదవ అధ్యాయం సమాప్తం)



అచేతన పట్ల ఒక అవగాహన – కార్ల్ యుంగ్

భావాలని వ్యక్తం చెయ్యడానికి మనిషి భాష వాడుతాడు. భాషతో పాటు ఎన్నో చిత్రాలను, ఆకృతులని భావవ్యక్తీకరణ కోసం వాడడం జరుగుతుంది. మూడు గీతలు ఒక బిందువులో కలిసినట్టు ఉండే ‘మెర్సిడెస్’ కారు కంపెనీ చిహ్నం గాని, ఐదు వృత్తాలు కలిసినట్టు ఉండే  ఒలింపిక్స్ చిహ్నం ఆ కోవకి చెందినవే. అవి ఒక వస్తువుకి, లేదా భావనకి దృశ్యరూపాలు. United Nations  అనే పదావళికి ఏ విధంగా  UN  అనేది సంక్షిప్త రూపమో, అదే విధంగా పైన చెప్పుకున్న చిహ్నాలు (signs) ఒక కంపెనీనో, ఒక సంస్థనో, వస్తువునో సూచించే సంక్షిప్త చిహ్నాలు. అవి ప్రతీకలు (symbols) కావు. ‘ప్రతీక’ అన్న పదాన్ని నేను పూర్తిగా భిన్నమైన రీతిలో, ఒక ప్రత్యేక అర్థంతో వాడుతున్నాను.

ప్రతీక అనేది ఒక పదం కావచ్చు, ఓ చిత్రం కావచ్చు. దానికి సామాన్య వ్యావహారిక ప్రపంచంలో ఓ అర్థం, ఓ బాహ్యార్థం ఉంటుంది.  అది కాకుండా ఆ పదానికి, లేదా చిత్రానికి మరో రహస్యమైన, గూడార్థం కూడా ఉంటుంది.  గ్రీకు దేశంలో క్రీట్ (Crete) ప్రాంతానికి చెందిన స్మారక చిహ్నాలనే తీసుకుంటే ఎన్నో సందర్భాలలో మనకి బాడిస (adze) అనే చిహ్నం కనిపిస్తుంది. ఇది మనకి బాగా తెలిసిన ఓ సామాన్య పనిముట్టు. కాని ఆ వస్తువు ఈ సందర్భంలో మరేదో వాస్తవానికి ప్రతీకగా నిలుస్తోంది.

అలాగే నాకు తెలిసిన ఓ భారతీయుడు ఒక సారి ఇంగ్లండు సందర్శించి తిరిగి ఇండియాకి వెళ్లి ఇంగ్లండులో మనుషులు జంతువులని పూజిస్తారని చెప్పాడు. ఎందుకంటే అతగాడు ఇంగ్లండ్ లో ఎన్నో పాతకాలపు చర్చిలలో  డేగలు, సింహాలు, ఎద్దులు మొదలైన జంతువుల బొమ్మలు చూశాడు.  అతడికి తెలియనిది ఏంటంటే ఈ జంతువులు ఎవాంజెలిస్ట్ లకి ప్రతీకలు. క్రైస్తవ సాంప్రదాయంలో ఎవాంజెలిస్ట్ లు నలుగురు. వాళ్లు – మాథ్యూ, మార్క్, ల్యూక్, జాన్ లు. వీరిలో మాథ్యూ ని మానవ రూపంలోను, మార్క్ ని సింహం రూపంలోను, ల్యూక్ ని ఎద్దు రూపం లోను, జాన్ ని డేగ రూపం లోను వ్యక్తం చెయ్యడం పరిపాటి. 




ఇంచుమించు ఇదే విధంగా జంతువులని ప్రతీకలుగా వాడే మరో తార్కాణం మనకి ఈజిప్షియన్ సంస్కృతిలో ఒక చోట తారసపడుతుంది. ఈజిప్షియన్ల సూర్య భగవానుడి పేరు హోరస్ (Horus). అతడికి నలుగురు కొడుకులు. వాళ్లు – ఇమ్సెటీ, హాపీ, డ్యుయాముటెఫ్, కెబెసెన్యుయెఫ్ లు. వీరిలో ఇమ్సెటీని మానవ రూపంలోను, హాపీని కొండముచ్చు రూపంలోను, డ్యుయాముటెఫ్ ని తోడేలు రూపం లోను, కెబెసెన్యుయెఫ్ ని డేగ రూపంలోను వ్యక్తం చేస్తారు. దీన్ని బట్టి నాలుగు జంతు రూపాల కూటమి అనేది ఒక విధమైన విశ్వజనీన ప్రతీక కావచ్చని అనిపిస్తోంది.  

అలాగే ప్రపంచంలో ఎన్నో చోట్ల చక్రం, శిలువ మొదలైన ప్రతీకలు కనిపిస్తాయి. సందర్భాన్ని బట్టి, సంస్కృతిని బట్టి ఈ ప్రతీకలకి ఏదో గూడార్థం ఉంటుంది. ఆ అర్థం ఏంటి అన్న దగ్గర కొన్ని చోట్ల వివాదం తలెత్తుతూ ఉంటుంది. ఏదేమైనా ఓ స్థూలార్థం, ఓ గూడార్థం ఉన్న వాటినే ప్రతీకలు అంటాము.

కనుక బాహ్యార్థం కన్నా లోతైన అంతరార్థాన్ని సూచించే ఏ పదాన్నయినా, చిత్రాన్నయినా మనం ప్రతీక అంటున్నాం. అలాంటి ప్రతీకకి మరింత విశాలమైన, “అచేతనమైన”  పార్శ్వం ఉంటుంది. ఆ ముఖాన్ని ఎవరూ స్పష్టంగా నిర్వచించలేరు, వర్ణించలేరు. మనిషి మనస్సు ప్రతీక యొక్క అంతరార్థాన్ని శోధిస్తూ లోతుగా పోతున్నప్పుడు కొన్ని సార్లు హేతువుకి అందని తలాలలోకి ప్రవేశించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఉదాహరణకి చక్రాన్ని చూడగానే మన మనసులో “దివ్యమైన” సూర్యుడు అన్న భావనకి చెందిన ఆలోచనలు మెదలవచ్చు. ఇక్కడ మనసు యొక్క పరిమితులు బయటబడతాయి. “దివ్యం” అంటే ఏంటో నిర్వచించడం కష్టం. ఒక దాన్ని మనం “దివ్యం” అన్నప్పుడు దానికి ఊరికే ఏదో పేరు పెడుతున్నాం. ఓ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం. అంతే గాని అది బాహ్య ఆధారాల మీద, అనుభవం మీద ఆధారపడ్డ విషయం కాదు.


మనిషి అవగాహనకి అందని విషయాలు ఎన్నో వున్నాయి. కొన్ని సార్లు మనిషి తన అవగాహనకి అందని, తనకి కచ్చితంగా అర్థం కాని విషయాలని అర్థం చేసుకోడానికి ప్రతీకలు వాడుతాడు. మత సాంప్రదాయాలు అందుకే ప్రతీకలని, చిత్రాలని విరివిగా వాడుతాయి. ఇలా సచేతనంగా ప్రతీకలని వాడే సాంప్రదాయం ఎప్పట్నుంచో ఉంది. కాని విశేషం ఏంటంటే కొన్ని సార్లు మనిషి అచేతనంగా, అప్రయత్నంగా, తన కలలలో కొన్ని ప్రతీకలని ఎదుర్కొంటాడు.

ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. మనిషి కలలలో ప్రతీకలు కనిపించడం ఏంటి? ఇది అర్థం కావాలంటే మనిషి మనసు పని చేసే తీరుని ఒక సారి గమనించాలి. ఇంద్రియాల ద్వార మనం బాహ్య ప్రపంచం గురించి తెలుసుకుంటాం. ఇంద్రియాల సాక్ష్యం మేరకు బాహ్య ప్రపంచం గురించి ఒక అవగాహన కల్పించుకుంటాం. అయితే ఇంద్రియాల సామర్థ్యం అందరిలో ఒకేలా ఉండదు. కొందరికి నిశిత దృష్టి ఉంటుంది. ఒక్కసారి చూస్తే ఎన్నో వివరాలు గ్రహిస్తారు. మరి కొందరు ఎంత సేపు చూసినా ఎన్నో వివరాలు గుర్తించలేకపోతారు. కనుక ఇంద్రియాలు ఒక్కటే అయినే మనం గ్రహించే సారంలో ఎంతో వైవిధ్యం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

అలాగే ఇంద్రియాలు బాహ్య ప్రపంచం యొక్క మన అవగాహనకి పరిమితులు ఏర్పరుస్తాయని కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఇంద్రియాల సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే వైజ్ఞానిక పరికరాలు వాడుకోవచ్చు. ఓ టెలిస్కోప్ తో దూరంగా ఉన్నవి చూడగలం. ఓ ఆంప్లిఫయర్ వాడి బలహీనమైన శబ్దాలని సంవర్ధనం చేసి వినగలం.  అలా మన ఇంద్రియాల సామర్థ్యాన్ని కొంత మేరకు విస్తరింపజేసుకున్నా, ఒక దశలో ఆ ప్రక్రియకి కూడా హద్దులు కనిపించక మానవు. ఆ విధంగా మన ఇంద్రియాల సామర్థ్యంలోని పరిమితుల వల్ల మన ఎరుకకి పరిమితులు ఏర్పడతాయి.

మన ఎరుకకి లేదా చేతనకి మరో విధమైన పరిమితులు కూడా ఉంటాయి. మన అంతర్యంలో జరిగే కొన్ని సంఘటనలు అన్నీ మన సచేతనమైన స్పృహలోకి రావాలని లేదు. కొన్ని సంఘటనలు మన సచేతన మనస్సు అనే స్థాయి కన్నా కాస్త కిందుగా అంటే అచేతనంగా జరిగిపోతాయి.  గొప్ప లోదృష్టి చేతనే అవి జరిగినట్టు తెలుసుకోగలం. మొదట్లో వాటి ప్రాముఖ్యతని మనం గుర్తించలేకపోయినా, అచేతన అనే చీకటి ప్రాంతం నుండి అవి కొన్ని సార్లు తదనంతరం పైకి తేలి మన సచేతన మనసులోకి ప్రవేశిస్తాయి.

కొన్ని సార్లు అలాంటి ఎరుక మనకి కలలలో సంభవిస్తుంది. సామాన్యంగా ఆంతరిక విషయాలలో అచేతనమైనది ఏదైనా ఉంటే అది మనకి కలలలో తేటతెల్లం అవుతుంది. అలా తేటతెల్లం అయిన విషయం తార్కికమైన భాషా రూపంలో ఉండదు. చిత్రాల రూపంలో, ప్రతీకల రూపంలో ఉంటుంది. అసలు మనకి చరిత్ర వల్ల తెలిసేదేమంటే అచేతన గురించి మన అవగాహన మొట్టమొదట స్వప్నాల అధ్యయనం వల్లనే తెలిసింది.

(ఇంకా వుంది)





postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts