శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.



నాలో స్మృతి పని చేసే తీరు చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. కంప్యూటర్ మెమరీకి ఈ స్మృతికి ఎంతో తేడా వుంది. కంప్యూటర్ మెమరీలోని అంశాలన్నీ ఓ వరుస క్రమంలో భద్రపరచబడి వుంటాయి, లైబ్రరీలో పుస్తకాలలా. ప్రతీ అంశానికి ఓ అడ్రస్ ఉంటుంది. లైబ్రరీ పుస్తకానికి కాల్ నంబర్ తెలిస్తే దాన్ని బట్టి పుస్తకాన్ని కనుక్కోగలిగినట్టు, కంప్యూటర్లో ఒక అంశం యొక్క  అడ్రస్ తెలిస్తే ఆ అడ్రస్ వద్ద ఉన్న అంశాన్ని బయటికి తీయొచ్చు. కాని నాలోని స్మృతి కి ప్రత్యేకించి అడ్రస్ అనేది వుండదు. కావాలంటే మీరు ఎప్పుడో విన్న “కొండగాలి తిరిగిందీ….” పాట నాలో ఏ అడ్రస్ వద్ద ఉందో చెప్పుకోండి చూద్దాం! 

నా స్మృతిలోని అంశాలకి ఫలానా అడ్రస్ అని వుండదు. పరస్పర సంబంధం వున్న అంశాలన్నిటినీ ఓ జాలం లాగా ఏర్పాటు చేసుకుంటాను. ఉదాహరణకి మీరు సెలవల్లో కోన సీమని చూడడానికి వెళ్తారు. అక్కడ మావిడి తోటలు చూస్తారు. పడవలో ప్రయాణం చేస్తారు. బుద్ధి పుట్టినప్పుడల్లా కొబ్బరి నీళ్లు తాగుతారు. సెల్ ఫోన్ ని పక్కన బెట్టి సెలయేటి గలగలలు వింటారు. ఈ దృశ్యాలు, శబ్దాలు, వాసనలు అన్నీ ‘కోనసీమ’ అన్న పేరుతో మూటగట్టి నాలో దాచుకుంటాను.  ఈ సారి ఎప్పుడైనా మీరు రోడ్డు పక్కన కొబ్బరి నీళ్ళు తాగుతున్నప్పుడు మీ కోనసీమ యాత్ర గుర్తొస్తుంది. లేదా మావిడి కాయలు తింటున్నప్పుడో, నీళ్ల గలగలలు వింటున్నప్పుడో, పడవ ఎక్కినప్పుడో – ఇలా ఎన్నో అనుభూతులు మీ కోన సీమ యాత్రని గుర్తుకు తెస్తాయి. ఈ చిన్న చిన్న అనుభూతుల స్మృతులన్నీ ఓ జాలంలో కలిసి వుంటాయి. ఈ చిన్న స్మృతులన్నీ ‘కోన సీమ యాత్ర’ అనే పెద్ద స్మృతిలో భాగాలు అవుతాయి. ఇలా స్మృతులని (మొదటి అడ్రస్, మొదటి అంశం), (రెండవ అడ్రస్, రెండవ అంశం)… ఇలా ఓ పెద్ద పట్టికలాగా  కాకుండా జాలాల రూపంలో భద్రపరచడం వల్ల నాలో ని స్మృతులు సులభంగా చెరిగిపోవు. కోన సీమలో కొబ్బరి నీళ్లు తాగినట్టు గుర్తులేకపోయినా, మావిడి తోటల్లో నడవడం గుర్తు  ఉండొచ్చు కదండీ!

సొంత డబ్బా అనుకోకపోతే నాలో మరో సుగుణం కూడా వుందనుకోండి. నాలో ఒక చోట ఏదో కారణం చేత కణాలు చచ్చిపోయాయనుకోండి. నెమ్మదిగా ఆ ప్రాంతానికి ఇరుగు పొరుగున ఉన్న న్యూరాన్లు చచ్చిపోయిన న్యూరాన్ల బాధ్యతలని నెత్తిన వేసుకుంటాయి. ఉదాహరణకి నాలో బ్రోకా ప్రాంతం (Broca’s area) అనే ఓ ప్రాంతం మీ భాషని శాసిస్తుంది. ఉదాహరణకి దాని దగ్గర్లో కణాలు చచ్చిపోతే మాట పడిపోయే ప్రమాదం వుంది. కాని నెమ్మదిగా దాని చుట్టు పక్కల ఉండే న్యూరాన్లు ఆ ప్రాంతం యొక్క క్రియలని చేపట్టడం వల్ల పోయిన మాట తిరిగి వచ్చే అవకాశం వుంది.

 స్ట్రోక్ (stroke) వచ్చినప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. మెదడు లోని రక్తనాళాలలో ఎక్కడైనా రక్తం గడ్డ కట్టి, దాని వల్ల ఓ నాళం పూడుకు పోయింది అనుకోండి. లేదా రక్తనాళంలో పోటు పెరిగి అది పెటేలు మని పేలిపోయిందనుకోండి. అప్పుడు ఆ నాళం మీద ఆధారపడి బతుకు నెట్టుకొస్తున్న న్యూరాన్లు ఆకలితో చచ్చిపోతాయన్నమాట. అలాంటి అత్యవసర పరిస్థితిలో దాని పొరుగు న్యూరాన్లు కొంతవరకు చచ్చిపోయిన న్యూరాన్ల పనిని తీసుకుంటాయి. అలాంటి పరిస్థితిలో రోగికి పోగొట్టుకుపోయిన క్రియలు తిరిగి వచ్చేలా తగిన శిక్షణ నివ్వడానికి వీలవుతుంది. కాని మెదడులో మరీ పెద్ద భాగం దెబ్బతింటే ఇక ఇరుగు పొరుగు న్యూరాన్లు పెద్దగా చేసేదేం వుండదు. అలాంటప్పుడు రోగికి ఇచ్చే శిక్షణ పెద్దగా ఫలించకపోవచ్చు.

స్ట్రోక్ లాగే మరో ముఖ్యమైన మెదడు సమస్య ట్యూమర్. కాని ఎన్నో సందర్బాలలో శస్త్రచికిత్స చేసి ట్యూమర్ ని తొలగించవచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే ఆపరేషన్ తరువాత రోగి పూర్తిగా కోలుగుకునే అవకాశం ఉంది.

తలకి దెబ్బ తగిలినప్పుడు కొన్ని సార్లు మెదడుకి అయ్యే గాయం విషమించవచ్చు. మెదడు చిక్కని ద్రవంలో తేలుతూ ఉంటుందని, తలకి గాయం తగిలినా లోపల మెదడు భద్రంగా ఉంటుందన్నది కొంత వరకు నిజమే. కాని తలకి దెబ్బ మరీ గట్టిగా తగిలితే లోపల మెదడు కూడా గాయపడవచ్చు. ఏ సెల్ఫోన్ లోనో మాట్లాడుతూ పరధ్యానంగా వేలిని తలుపు సందులో వేసి  చితగ్గొట్టుకున్నారనుకోండి. మరి వేలు వాయదండీ! అలాగే గాయపడ్డ మెదడు కూడా వాస్తుంది. దాంతో మెదడు చుట్టూ ఉండే ద్రవంలో ఒత్తిడి పెరుగుతుంది. దాని వల్ల స్పృహ కోల్పోవడం, ఇక మరీ కీలక పరిస్థితుల్లో ప్రాణం పోవడం కూడా జరుగుతుంటుంది.

ఈ  మెదడుతో ఇన్ని తలనొప్పులా అని బెంబేలు పడకండేం? దురదృష్టం కొద్దీ జబ్బు పడితే సమస్య గాని, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు నా సత్తా చూళ్ళేదు మీరు. నన్నెలా వాడుకోవాలో అసలు తెలీదు మీకు. క్రమబద్ధమైన శిక్షణ చేత నా శక్తి సామర్థ్యాలని విపరీతంగా పెంచుకోవచ్చు. నా సామర్థ్యం అపరిమితం. దాన్ని పెంచుకునే ఒడుపు తెలిస్తే ఆ సామర్థ్యం మీ సొంతం.








నాడీ మండలం మీద రసాయనాల ప్రభావం

Posted by V Srinivasa Chakravarthy Sunday, January 5, 2014 2 comments




భౌతిక, జీవ శాస్త్రాలు రెండిట్లోను సజావుగా పురోగమిస్తూ రెండు రంగాలలోను గొప్ప ఆవిష్కరణలు చేశాడు హెల్మ్ హోల్జ్. పూర్వులైన సాడీ కార్నో, జేమ్స్ జూల్ మొదలైన శాస్త్రవేత్తల పరిశోధనలని లోతుగా అర్థం చేసుకున్న హెల్మ్ హోల్జ్, ఉష్ణం, కాంతి, విద్యుత్తు, అయస్కాంతికత మొదలైన వన్నీ శక్తి యొక్క వివిధ రూపాంతరాలేనని గుర్తించాడు. ఉష్ణగతి శాస్త్రంలో (thermodynamics) విలియమ్ రాంకైన్ తో పాటు కలిసి కృషి చేస్తూ విశ్వం యొక్క ఉష్ణ మరణం (heat death of the universe)   అన్న భావనకి ప్రాచుర్యం కలిగించాడు. మూసి వున్న ప్రతీ వ్యవస్థలోను ఎంట్రొపీ (entropy)  ఓ గరిష్ట విలువ దిశగా పరిణామం చెందుతుందని ఉష్ణగతి శాస్త్రం చెప్తుంది. విశ్వం మొత్తాన్ని ఓ వ్యవస్థగా తీసుకుంటే భవిష్యత్తులో ఏదో ఒకనాడు దాని ఎంట్రొపీ గరిష్ట విలువని చేరుకున్నదంటే, ఇక దాని స్వేచ్ఛా శక్తి (free energy)  సున్నా అవుతుంది. జీవక్రియలకి ఆధారభూతమైన స్వేచ్ఛా శక్తి లోపించిని అలాంటి విశ్వంలో ఇక జీవం వుండదు. అలాంటీ జీవరహిత విశ్వస్థితిని విశ్వం యొక్క ఉష్ణ మరణం అంటారు.

 శబ్ద శాస్త్రంలో హెల్మ్ హోల్జ్ అనునాదిని (resonator) అనే పరికరాన్ని రూపొందించాడు. శబ్ద శాస్త్రంలో దీనికి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. కంటి లోపలి భాగాలని చూసేందుకు పనికొచ్చే opthalmoscope ని కూడా కనిపెట్టింది ఇతగాడే. ఈ పరికరం నయన శాస్త్రంలో (opthalmology), కంటి చికిత్సలోను విప్లవం తెచ్చింది. ఇక విద్యుదయస్కాంత రంగంలో ఇతడు సాచించిన దానికి చిహ్నం గా నేడు మనం హెల్మ్ హోల్జ్ సమీకరణం (Helmholtz equation)  గురించి చెప్పుకుంటున్నాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విద్యుదయస్కాంత తరంగాలు ప్రసరించే తీరుని ఈ సమీకరణం వర్ణిస్తుంది. నాడీ తీగలలో ఏక్షన్ పొటెన్షియల్ యొక్క ప్రసారం గురించిన అధ్యయనాలలో ఈ సమీకరణం   ఎంతో ఉపయోగపడింది.


 othalmoscope  పని తీరుని వివరించే చిత్రం
(http://www.aaofoundation.org/what/heritage/exhibits/online/ophthalmoscope.cfm)

ఆ విధంగా ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభం కల్లా మెదడు ఓ విస్తృతమైన, సంక్లిష్టమైన విద్యుత్ యంత్రం అని అర్థమయ్యింది. మెదడు ఓ పెద్ద విద్యుత్ సర్క్యుట్. ఆ సర్క్యుట్ లోని అంగాలు నాడీ కణాలు లేక న్యూరాన్లు. వాటిని కలిపే తీగలు నాడులు. టెలిఫోన్ తీగలలో ప్రసారమయ్యే విద్యుత్ సందేశాలకి, ఒక న్యూరాన్ నుండి అవతలి న్యూరాన్ కి సమాచారాన్ని మోసుకుపోయే విద్యుత్ సందేశాలకి, భౌతికంగా ఆట్టే తేడా లేదని తెలిసిపోయింది. జీవపదార్థాన్ని అదిలించే, కదిలించే “ప్రాణ శక్తులు,” “జీవశక్తులు” మొదలైన కృతక భావనలతో ఇక అవసరం తీరిపోయింది. ఆధునిక భౌతిక పద్ధతులనే వేపమండలతో బాది బాది అలాంటి “శక్తులు” అన్నిటినీ నాడీ శాస్త్రం నుండి బహిష్కరించారు. విద్యుత్ జీవక్రియా శాస్త్రం, విద్యుత్ సాంకేతిక శాస్త్రం (electrical engineering)  లో జరిగిన పురోగమనం  వల్ల భౌతిక ధర్మాలతో క్రమబద్ధంగా మెదడుని అధ్యయనం చెయ్యడానికి వీలయ్యింది.



ఫార్మకాలజీ

మెదడుని ఓ పెద్ద విద్యుత్ యంత్రంగా ఊహించుకోవడం సమంజసమే అయినా, మెదడులో జరిగేవి విద్యుత్ చలనాలు తప్ప మరింకేమీ లేదంటే పొరబాటే అవుతుంది. ఒక న్యూరాను మరో న్యూరాన్ కి సందేశం పంపినప్పుడు ఆ సందేశం యొక్క పురోగమనంలో పలు దశలు ఉంటాయి. ఆ దశలలో ఒక్కటి తప్ప మిగతా దశలన్నీ విద్యుత్ చర్యలే. ఆ ఒక్క దశ – అతి ముఖ్యమైన దశ - మాత్రం రసాయనిక దశ. సందేశాన్ని పంపగోరుతున్న న్యూరాన్ ఓ రసాయనాన్ని విడుదల చేస్తుంది. న్యూరాన్ కి న్యూరాన్ కి మధ్య ఉండే సైనాప్స్ అనే ఓ సన్నని సందుని దాటుకుని అయిన ఆ రసాయనం అవతలి న్యూరాన్ మీద పడుతుంది. ఇలా రసాయనాన్ని మాధ్యమంగా వాడుకుని న్యూరాన్ల మధ్య జరిగే సంభాషణని న్యూరో ట్రాన్స్ మిషన్ (neurotransmission)  అంటారు.  ఈ న్యూరో ట్రాన్స్ మిషన్ ప్రక్రియలో సూక్ష్మస్థాయిలో ఏమేం జరుగుతాయో ఆ వివరాలన్నీ గత శతాబ్దపు చివరి దశలోనే తెలిశాయి.
కాని నాడీ మండలం మీద రసాయనాల ప్రభావం ఉంటుందనే భావన కొత్తదేమీ కాదు. వెనకటి రోజుల్లో వేటగాళ్లు బాణం కొసకి విషం పూసి కొట్టేవారట. అది తగిలిన జంతువు నిశ్చేష్టమై కదల్లేక వేటగాడికి చిక్కిపోతుంది. దానికి కారణం బాణానికి పూసిన విషం జంతువు కండరాలని అదిలించే నాడిమండలం యొక్క చర్యకి అడ్డుపడడమే. అంటే రసాయనం నాడీ మండలం మీద పని చెయ్యగలదన్నమాట. ఇది కాకుండా మత్తు పానీయాలు, బాధోపశమనం కలిగించే మందులు మొదలైన వన్నీ రసాయనాలకి నాడీ మండలం మీద ప్రభావం ఉంటుందని  మనకి అనాదిగా తెలుసు అనడానికి తార్కాణాలు.

(ఇంకా వుంది)




చదవడానికి సంసిద్ధత

పిల్లలకి చదవడం ఎలా నేర్పాలి అన్న విషయం మీద మహా మేధావులైన మన విద్యావేత్తలు ఎన్నో వింత వింత సూచనలిస్తూ వచ్చారు. చదవడానికి పిల్లలని సిద్ధం చెయ్యాలంట. కేవలం బొమ్మలున్న పుస్తకాలు చాలా చూపించాలంట. ఆ బొమ్మల గురించి పిల్లలని గుచ్చి, గుచ్చి ప్రశ్నించాలంట. ఇంతకన్నా మతిలేని ఆలోచన నేనెక్కడా విన్లేదు!

ఓ మంచి సారూప్యాన్ని తీసుకుందాం. పిల్లలు అసలు మాట్లాడడం ఎలా నేర్చుకుంటారు అన్న విషయం గురించి ఓ సారి ఆలోచిస్తే అది నిజంగా గొప్ప అద్భుతంలా తోస్తుంది. తాము ‘బోధిస్తే’ తప్ప పిల్లలకి ఏమీ అర్థం కాదు అని అహంకరించే పెద్దలకి ఈ అద్భుతం ఓ పెద్ద గుణపాఠం. తమ చుట్టూ పెద్దలు మాట్లాడుకుంటుంటే పిల్లలు విని నేర్చుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పెద్దలు మాట్లాడే దాంట్లో పిల్లలకి నేర్పాలి అన్న ఉద్దేశంతో మాట్లాడేది చాలా తక్కువ. వాళ్లకి పరస్పరం మాట్లాడుకునే విషయాలు ఉంటాయి కనుక మాట్లాడుకుంటారు. కనుక పెద్దల మాటల బట్టి పిల్లలకి అంతర్లీనంగా అర్థమయ్యేది ఏంటంటే భాష చాలా ముఖ్యమైనది. మాటలతో చాలా ప్రయోజనాలు నెరవేరుతాయి. అవి విలువైనవి. మాటలు వాడి పెద్దలు పనులు జరిపించుకుంటారు. మాటల ప్రాబల్యం, విలువ పిల్లలు చెప్పకుండా గ్రహిస్తారు. మాటలు అత్యంత అవసరమైనవి అన్న విశ్వాసం వారిలో స్థిరపడుతుంది.

ఎంతో మంది పిల్లల లాగానే నేను కూడా చిన్నప్పుడు నాకు నేనే చదవడం నేర్చుకున్నాను. నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు నాకు పెద్దగా ఎవరూ నేర్పలేదు. పైకి చదవడం, చదివించడం వంటివి పెద్దగా ఎవరూ నేర్పలేదు. నేను కొంచెం పెద్దవాణ్ణయ్యాక మా బామ్మ ఒకావిడ నాకు, మా చెల్లాయికి పుస్తకాలు చదివి వినిపించేది. కాని అప్పటికే నాకు చదవడం బాగా వచ్చేసింది. హ్యూగో లాప్లింగ్ వ్రాసిన “డాక్టర్ డూ లిటిల్” పుస్తకాలు చదివేది ఆవిడ. ఇద్దరం ఆవిడకి ఇరుపక్కలా సోఫాలో వెచ్చగా ఒదిగి కూర్చునే వాళ్ళం. పిల్లలకి నచ్చుతుందని భ్రమ పడి ‘ముద్దు ముద్దు మాటలతో’ చదవడం వంటివి చెయ్యకుండా, ఎలాంటి ఆధిక్యతా భావం లేకుండా, చాలా మామూలుగా, స్పష్టంగా, గంభీరంగా చదువుతూ పోయేది. అసలు అందుకే ఆ కథలు మాకు నచ్చేవేమో ననిపిస్తుంది.

చదవడానికి నాకు స్ఫూర్తినిచ్చిన మరో విషయం ఏంటంటే ఆ రోజుల్లో (అది చాలా చాలా క్రితం) పిల్లల పుస్తకాల్లో చాలా తక్కువ బొమ్మలు ఉండేవి. N.C. Wyeth  అని ఓ గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. చాలా బొమ్మలు అతను వేసేవాడు. రాజులు, రాణులు, సింహాలు, సముద్రపు దొంగలు  - ఒక్కటేమిటి వందల కొద్దీ అద్భుతమైన బొమ్మలు. కాని ఒక పుస్తకంలో కొద్దిపాటి బొమ్మలే ఉండేవి. కనుక ఆ బొమ్మల అర్థం తెలియాలంటే ఆ పుస్తకం చదవడం తప్పనిసరి అని అర్థమయ్యింది. అందుకని చదవడం ఎలాగోలా నేర్చుకున్నాను.

చదవడానికి పిల్లలు సిద్ధం కావాలంటే అచ్చక్షరంతో గాఢమైన పరిచయం ఏర్పడాలి. బొమ్మలతో కాదు, అచ్చక్షరంతో. ఎలాగైతే తమ చుట్టూ పెద్దలు మాట్లాడుకునే భాషా ధ్వనులతో పిల్లల చెవులు నిండిపోతాయో కాస్త పెద్దయ్యాక వాళ్ల కళ్లకి ఇంపైన రంగురంగుల, పెద్ద పెద్ద అక్షరాలతో విస్తృత సాన్నిహిత్యం ఏర్పడాలి. ఆ విధంగా ఆ అక్షరాలతో పరిచయం పెరుగుతున్న కొలది ఆదిలో అర్థం లేని ఆకారాలుగా, వక్రాలుగా, వంకరలుగా కనిపించే అక్షరాలు, క్రమంగా స్థిరరూపాలు సంతరించుకుని, అర్థవంతమైన భాషా ప్రతీకలుగా తమ మనసుల్లో రూపుదిద్దుకుంటాయి. నా చిన్నప్పుడు ఓ సారి అలాగే ఓ సారి ఓ పుస్తకాన్ని తిరగేయగా, తిరగేయగా మెల్లగా ఇక్కడున్న అక్షరాన్ని అక్కడ, అక్కడున్న పదాన్ని మరో చోట ఇలా పదాలని గుర్తుపట్టగలిగాను. ఇలా అక్షరాలని పదాలని గుర్తుపట్టగలిగిన తరువాత క్రమంగా పదాల అర్థమేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. అంతకు ముందు కలగదు. ఉదాహరణకి మనం ఓ కొత్త భాష నేర్చుకుంటున్నాం అనుకుందాం. ముందు ఆ భాషలోని సంభాషణల్లోని పదాలని గుర్తుపట్టగలిగిన తరువాత పదాలకి అర్థం ఇదీ అని ఎవరైనా చెప్పగలిగితే బావుంటుంది. ముందే చెప్తే అసందర్భంగా ఉంటుంది.

పిల్లలు అచ్చక్షరానికి అలవాటు పడేలా చెయ్యాలంటే నాదో సలహా. పెద్ద పెద్ద అక్షరాలు ఉండే దినపత్రిక ఏదైనా తీసుకోవాలి. పిల్లలు అక్షరాలని గుర్తుపట్టేటంత పెద్దవిగా ఉండాలి అక్షరాలు. పైగా దినపత్రిక అంటే పెద్దవాళ్లు చదువుకునేది. అందులో విలువైన సమాచారం వుంటుంది. ఏదో పిల్లలు ఆడుకునే సరదా పుస్తకం కాదు. కనుక పిల్లలకి నచ్చుతుంది. దాంట్లోని కాగితాలు చించి గోడల మీద అంటించుకోవచ్చు. దినపత్రికే కనుక పిల్లలు పాడుచేసినా ఫరవాలేదు.

ఈ ప్రాథమిక ఏర్పాట్ల కన్నా పిల్లలు మరో అడుగు ముందుకు వెళ్లాలి. బళ్లోను, ఇంట్లోను కూడా పిల్లల దృశ్య ప్రపంచాన్ని అందమైన అచ్చక్షరంతో నింపాలి. పెద్దల ప్రపంచానికి చెందిన నానా రకాల ముద్రిత సమాచారాలతో గోడలని అలంకరించాలి. టైం టేబిళ్లు, మ్యాపులు, సినిమా టికెట్లు, వ్యాపార ప్రకటనలు, బ్యాంకు ఫారమ్ లు, రైల్వే రిజర్వేషను పత్రాలు – ఇలా పెద్దల వ్యావహారిక ప్రపంచంలో ముఖ్య పాత్ర గల రకరకాల పత్రాలని గోడలకి ఎక్కించాలి. పెద్దల లోకంలో చలామణి అవుతూ, ఎన్నో అద్భుత కార్యాలకి అనివార్యంగా ఉండే సమాచారం ఇలా ఉంటుంది అని వాళ్ల కళ్లకి కట్టినట్టు  ఉండాలి. మనుషులు ఏం చేస్తుంటారు, ఏం చెయ్యగలరు అనేది తెలుసుకోవాలంటే సాంఘికశాస్త్రం పుస్తకం కన్నా టెలిఫోన్ డైరెక్టరీలోని ఎల్లో పేజీలు మనకి ఎన్నో విషయాలు చెప్తాయి!

 (Image: http://www.pressingletters.com/tag/the-arm-nyc/)

(ఇంకా వుంది)



ఫిజో కాలం నాటికే కాంతి వేగం గురించి కొంత అవగాహన వుంది. ఐదు మైళ్ళ ఎడంలో ఉన్న కొండల మధ్య ఓ చుట్టు చుట్టి రావడానికి కాంతికి రమారమి 1/18,000  సెకను కాలం పడుతుందని ఫిజోకి తెలుసు. గెలీలియో కాలంతో పోల్చితే ఫిజో కాలానికి గడియారాలు ఎన్నో మెరుగులు దిద్దుకున్నాయి. మరింత చిన్న వ్యవధులని కొలవడానికి వీలయ్యింది. అయితే మరీ అంత సూక్ష్మమైన వ్యవధులని కొలవడం సామాన్యమైన విషయం కాదు. నేరుగా గడియారంతో కొలవగలిగే వ్యవధి కాదిది. దీన్ని కొలవడానికి కాస్త ‘సమయ’స్ఫూర్తి తో కూడిన ఏర్పాట్లు చేసుకోవాలి.

ఫిజో రూపొందించిన పరికరంలో పళ్ళున్న చక్రం ఒకటి వుంటుంది (చిత్రం). ఆ చక్రం యొక్క అంచు మీదుగా ఓ కాంతి కిరణం ప్రసరిస్తుంది. చక్రం కిరణానికి అడ్డు వస్తుందా, ముందుకి పోనిస్తుందా అన్నది చక్రం యొక్క స్థానం మీద ఆధారపడుతుంది. గేర్ చక్రం లాంటి ఈ చక్రం చుట్టూ “పళ్లు” ఉంటాయి. కిరణ రేఖ రెండు “పళ్ళ” మధ్యన సందులో పడితే ఆ సందు లోంచి కిరణం ముందుకు పోగలదు. కాని కిరణ రేఖ ఓ “పన్ను” లోంచి పోతే, అది కిరణానికి అడ్డుపడుతుంది. 



ఫిజో ఈ చక్రాన్ని నెమ్మదిగా తిరగనిచ్చాడు. చక్రం యొక్క పళ్ళ సందులోంచి వెలువడ్డ కిరణం అవతలి కొండని చేరుకుని, అక్కడ ఉన్న అద్దం మీద ప్రతిబింబితమై, వెనక్కి వస్తుంది. ఆ కిరణం ఎంత త్వరగా వెనక్కి వస్తుందంటే అప్పటికి ఇంకా కాంతి రేఖ రెండు పళ్ల సందులోంచే పోతుంటుంది. కిరణానికి అడ్డుపడుతూ ఆ స్థానం లోకి ఇంకా పన్ను రాలేదు. కనుక ఇవతల వెనక్కు వచ్చిన కిరణం కోసం కాచుకు కూర్చున్న ఫిజోకి తిరిగొచ్చిన కిరణం కనిపిస్తుంది.

ఫిజో క్రమంగా చక్రం తిరిగే వేగాన్ని పెంచుతూ పోయాడు. చక్రం వేగం ఒక స్థాయిని చేరుకునే సరికి పరిస్థితి మారిపోయింది. పళ్ల సందుల లోంచి ముందుకి పోయిన కిరణం తిరిగి వెనక్కు వచ్చేసరికి పన్ను కిరణానికి అడ్డుపడింది. కనుక ఇవతల వెనక్కి వచ్చిన కిరణం కోసం చూస్తున్న ఫిజోకి అవతలి కొండ మీద అద్దంలో ప్రతిబింబం కనిపించలేదు.

ఫిజో చక్రం యొక్క వేగాన్ని మరింత పెంచాడు. వేగం మరో స్థాయిని చేరుకున్నప్పుడు మరో విచిత్రం జరిగింది. ఈ సారి కిరణం వెనక్కి తిరిగి వచ్చేసరికి, ఏ పళ్ళ సందు లోంచి దూరి కిరణం తన యాత్ర మీద బయల్దేరిందో, ఆ పళ్ల సందుకి తరువాత పళ్ల సందు కాంతి రేఖకి అడ్డువచ్చింది. తిరిగొచ్చిన కిరణం ఆ పళ్ళ సందు లోంచి ముందుకు పోతూ  ఆ వెనుక ఉన్న ఫిజో కళ్లలో పడింది. ఈ సారి మళ్లీ ఫిజోకి కాంతి యొక్క ప్రతిబింబం కనిపించింది.

చక్రం ఎంత వేగంతో తిరుగుతోందో ఫిజోకి తెలుసు. కనుక చక్రం యొక్క పలుసందు స్థానంలో పన్ను రావడానికి ఎంత సేపు పడుతుందో తెలుసు. అలాగే ఒక పలు సందు స్థానంలోకి తదుపరి పలుసందు రావడానికి ఎంత సేపు పడుతుందో కూడా తెలుసు. ఈ వ్యవధులని వాడి కాంతికి రెండు కొండల మధ్య యాత్ర చెయ్యడానికి ఎంత సేపు పడుతుందో లెక్కించాడు ఫిజో. దాంతో కాంతి వేగాన్ని అంచనా వెయ్యడానికి వీలయ్యింది.

ఆ విధంగా 1849  లో ఫిజో చేసిన అంచనా బట్టి కాంతి వేగం 196,000 మైళ్ళు/సెకను  అని తేలింది. అసలు కాంతి వేగం కన్నా ఈ విలువ కాస్త ఎక్కువ. ఒక విధంగా చూస్తే బ్రాడ్లీ విలువతో పోల్చితే ఫిజో చేసిన అంచనా అంత గొప్పదేమీ కాదు. అసలు విలువ కన్నా బ్రాడ్లీ అంచనా 10,000  మైళ్ళు/సెకను తక్కువ అయితే, ఫిజో అంచనా 10,000  మైళ్ళు/సెకను ఎక్కువ.

అయితే ఫిజో సాధించిన ప్రత్యేక ఫలితం ఏంటంటే, తనకు పూర్వం కాంతి వేగాన్ని సాధించిన వారి లాగా అంతరిక్షపు ఘటనల మీద ఆధారపడకుండా పూర్తిగా భూమి మీదే జరిగే ఘటనల ఆధారంగా కాంతి వేగాన్ని కొలవగలిగాడు. కనుక ఫిజో వాడిని పద్ధతినే అవలంబించినా, మరింత కచ్చితంగా కాంతి వేగాన్ని కొలవాలంటే మరింత సునిశితమైన పరికరం కావాలి.

(ఇంకా వుంది)











"శాస్త్ర విజ్ఞానం బ్లాగ్ సందర్శకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు"

(భారతి లిపిలో :-)


postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts