శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

భూగ్రహానికి స్వాగతం. నీలి నైట్రోజెన్ నింగితో, ద్రవ్య జలాల సాగరాలతో, చల్లని వనాలతో, పచ్చని పచ్చికతో, జీవకళతో తొణికిసలాడే ప్రపంచానికి సుస్వాగతం. విశ్వదృక్కుతో చూస్తే ఇది అతిసుందరమైన, అరుదైన ప్రపంచం. ప్రస్తుతానికి చాలా ప్రత్యేకమైన ప్రపంచం. విశాలమైన దేశ, కాలాలలో ఇంతవరకు మనం చేసిన యాత్రల వల్ల మనకి తెలిసిన దాంట్లో, ఈ మహావిశ్వంలో, సజీవమై, సచేతనమైన పదార్థం మరెక్కడా లేదు.  మనలాంటి ప్రపంచాలు విశ్వమంతా విస్తరించి ఉండొచ్చు. కాని వాటి కోసం మన అన్వేషణ ఇక్కడే మొదలవుతుంది. కోట్ల సంవత్సరాల సుదీర్ఘ పరిణామానికి అంతంలో, మన పూర్వ తరాలు సాధించిన అనుభవం, పరిజ్ఞానం అంతా ఆన్వేషణకి మద్దతు నిస్తోంది. గొప్ప జీవనోత్సాహంతో, ప్రతిభతో, తెలుసుకోవాలన్న తీరని దాహంతో ఉర్రూతలూగే వ్యక్తులు మన చూట్టూ ఉన్నారు. జ్ఞానాన్వేషణకి విలువనిచ్చే యుగం మనది. మన వేళ్లు తారలలో ఉన్నాయి. ఇంతకాలమూ ఈ భూమి మీద మజిలీ చేశాము. ఇక సొంతింటికి తిరిగెళ్లే సుదీర్ఘ యాత్ర ఇప్పుడిప్పుడే మొదలౌతోంది.

ఎన్నో ఇతర మానవ ఆవిష్కరణల లాగానే, భూమి ఒక చిన్ని ప్రపంచం అన్న ఆవిష్కరణ మధ్య ప్రాచ్య ప్రాంతంలో జరిగింది. అది జరిగిన కాలం క్రీ.పూ. మూడవ శతాబ్దం అంటారు. జరిగిన స్థలం ఆ కాలంలో ఓ మహానగరంగా పరిగణించబడే ఈజిప్షియన్ నగరమైన అలెగ్జాండ్రియా. ఆ ఊళ్లో ఎరటోస్తినిస్ అనే వ్యక్తి జీవించేవాడు. అతడి పట్ల అసూయతో అతడి సమకాలికుడు ఒకడు అతడికి “బీటా” అని పేరు పెట్టాడు. గ్రీకు అక్షరమాలలో అది రెండవ అక్షరం. ఎరటోస్తినిస్ అన్నిట్లోను ద్వితీయ స్థానంలో  ఉంటాడని సూచించేలా ఆ పేరు ఎంచుకున్నాడా పెద్దమనిషి. కాని నిజానికి ఎరటోస్తినిస్ అన్నిట్లోను “ఆల్ఫా” గానే నిలిచాడు. అతడొక ఖగోళవేత్త, చరిత్రకారుడు, భౌగోళికుడు, కవి, నాటక విమర్శకుడు, గణితవేత్త కూడా. ‘’ఖగోళశాస్త్రం’’, 
“బాధ నుండి విముక్తి” మొదలుకొని ఎన్నో విస్తృత అంశాల మీద పుస్తకాలు రాశాడు. 

అలెగ్జాండ్రియాలోని ప్రఖ్యాత గ్రంథాలయానికి అతడు దర్శడుగా ఉండేవాడు. ఆ గ్రంథాలయంలో ఒక రోజు అతడికి ఓ తాళపత్ర గ్రంథం కంటబడింది. ఈజిప్షియన్ రాజ్యానికి దక్షిణ సరిహద్దుల వద్ద, నైలు నది యొక్క మొట్టమొదటి జలపాతానికి సమీపంలో, ఉండే సీన్ నగరంలో, ప్రతీ ఏడాది జూన్ 21 వ తారీఖు నాడు నిలువుగా పాతిన కట్టెలకి నీడ పడదని ఆ గ్రంథంలో వుంది. ఉత్తరాయణ విషువత్తు (summer solstice) 
కాలంలో, దీర్ఘతమ పగలు గల రోజున, మధ్యాహ్నం దగ్గర పడుతుంటే గుడి గోపురాల నీడలు ఇంకా ఇంకా కుంచించుకుంటూ ఉంటాయి. సరిగ్గా మిట్టమధ్యాహ్న సమయంలో నీడలు పూర్తిగా మాయమవుతాయి. ఆ సమయంలో బాగా లోతైన నూతులలో కూడా సూర్యబింబపు ప్రతిబింబం కనిపిస్తుంది. అప్పుడు సూర్యుడు సరిగ్గా నడినెత్తిన ఉంటాడు.

మరొకరైతే ఆ విషయాన్ని ఇట్టే మర్చిపోయేవారు. నిలువు కట్టెలు, నీడలు, నూతుల్లో ప్రతిబింబాలు, నింగిలో సూర్యుడి కదలికలు –
 ఈ సర్వసామాన్యమైన సంగతులకి ఏం ప్రాముఖ్యత ఉంటుంది? కాని ఎరొటోస్తినిస్ ఒక శాస్త్రవేత్త. సర్వసామాన్య విషయాల మీద అతడి ఆలోచనలు ప్రపంచాన్నే మార్చాయి. లేదు, ప్రపంచాన్ని నిర్వచించాయి. తన మనసులో మెదిలిన ఆలోచనని నిర్ధారించుకోడానికి ఓ ప్రయోగం చేసి చూడాలని అనిపించింది.  అలెగ్జాండ్రియాలో జూన్ 21 నాడు మిట్టమధ్యాహ్న సమయంలో ఓ కట్టెని పాతి దానికి నీడ పడుతోందో లేదో చూశాడు. నిజంగానే పడుతోంది.

ఒకే సమయంలో సీన్ నగరంలోనే కట్టెకి నీడ పడక, అందుకు బాగా ఉత్తరంగా ఉన్న అలెగ్జాండ్రియాలో నీడ పడడం ఎలా సంభవం? అని ఆలోచించాడు ఎరటోస్తినిస్. ప్రాచీన ఈజిప్ట్ కి చెందిన ఒక పటాన్ని ఊహించుకోండి. ఒకే పొడవు ఉన్న రెండు కట్టెలు, ఒకటి అలెగ్జాండ్రియాలోను, మరొకటి సీన్ నగరంలోను నిలువుగా పాతబడి ఉన్నాయనుకోండి. ఒక ప్రత్యేక సమయంలో రెండు కట్టెలకి నీడ పడలేదు అనుకుందాం. భూమి చదునుగా ఉందనుకుంటే అది సాధ్యం అవుతుంది. అప్పుడు సూర్యుడు రెండు కట్టెలకి సరిగ్గా నడినెత్తిన ఉన్నాడన్నమాట. రెండు కట్టెలకి ఒకే పొడవు ఉన్న నీడలు పడినప్పుడు కూడా భూమి చదునుగా ఉన్నట్టు ఊహించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సూర్యకిరణాలు రెండు కట్టెల మీద ఒకే వాలుతో పడుతున్నట్టు అవుతుంది. కాని ఒకే సమయంలో సీన్ వద్ద నీడ పడక, అలెగ్జాండ్రియాలో బారైన నీడ పడడం ఎలా సంభవం?

భూమి వంపుగా ఉంటుందని అనుకుంటేనే ఆ పరిణామం సాధ్యమవుతుందని అర్థం చేసుకున్నాడు ఎరటోస్తినిస్. అంతేకాక వంపు ఎంత ఎక్కువగా ఉంటే, నీడల పొడవులో అంత ఎక్కువ తేడా కనిపిస్తుందని కూడా అతడు గుర్తించాడు. భూమి నుండి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడంటే సూర్యకిరణాలు సమాంతరంగా ఉన్నట్టు అనుకోవచ్చు. సూర్యకిరణాల బట్టి వేరు వేరు కోణాల వద్ద పాతబడిన కట్టెల నీడలు కూడా వేరు వేరుగా ఉంటాయి. భూమి ఉపరితలం మీదుగా చూస్తే అలెగ్జాండ్రియాకి, సీన్ నగరానికి మధ్య వారడి ఏడు డిగ్రీలు ఉంటుంది. అంటే ఆ రెండు నగరాలలో పాతిన కట్టెలని భూమి కేంద్రం వరకు విస్తరించ నిస్తే, అవి కలుసుకునే చోట, వాటి మధ్య ఏర్పడ్డ కోణం ఏడు డిగ్రీలు ఉంటుంది. ఏడు డిగ్రీలు అంటే 360 డిగ్రీలలో సుమారు 50 వ భాగం అన్నమాట. సీన్ కి, అలెగ్జాండ్రియాకి మధ్య దూరం 800 కిమీలు అని తనకి తెలుసు. ఆ దూరాన్ని కొలవడానికి ఓ మనిషిని నియమించాడు ఎరటోస్తినిస్. 800 కిమీలు X 50 = 40,000 కిమీలు. అదే భూమి యొక్క చుట్టుకొలత కావాలి.

(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts