శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

న్యూరాన్ల మధ్య రసాయనిక సంభాషణలు

Posted by V Srinivasa Chakravarthy Saturday, January 18, 2014 0 comments




19  వ శతబ్దంలో నాడీమండలం మీద రసాయనాల ప్రభావం గురించి కొన్ని గణనీయమైన పరిశోధనలు చేసినవాడు క్లాడ్ బెర్నార్డ్ అనే ఫ్రెంచ్ జీవక్రియాశాస్త్రవేత్త. బాహ్యపరిస్థితులు ఎంతగా మారుతున్నా  జీవరాశులు మారని అంతరంగ స్థితిని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంటాయని ప్రతిపాదించిన వాడు ఈ క్లాడ్ బెర్నార్డ్. అలాంటి మారని అంతరంగ స్థితికి ‘సమానావస్థ స్థితి (homeostasis)’  అని పేరు పెట్టాడు. ఉదాహరణకి ఆరోగ్యవంతుడైన మనిషిలో రక్తపీడనం, అంతరంగ ఉష్ణోగ్రత మొదలైన రాశులు కొన్ని నియత విలువల దగ్గర ఉంటాయి. ఇలాంటి ప్రామాణిక రాశులతో కూడుకున్న స్థితినే homeostasis  అంటారు. ఆ భావనని అతడి మాటల్లోనే విందాం – “La fixité du milieu intérieur est la condition d'une vie libre et indépendante” (మారని అంతరంగ అవస్థ స్వతంత్రమైన, స్వేచ్ఛా జీవనానికి అవసరమైన నియమం.) 

ఇతడు శరీరం మీద విషపదార్థాల ప్రభావాన్ని పరిశోధించాడు. ముఖ్యంగా క్యురారే (curare) మరియు కార్బన్ మోనాక్సయిడ్ ల మీద అధ్యయనాలు చేశాడు.  ఈ క్యురారే అనేది కండరం మీద పని చేసే విషం. దక్షిణ అమెరికాలో దీన్ని వేటగాళ్లు వాడేవారు. క్యురారేలో ముంచిన బాణంతో జంతువుని కొడితే అది ఊపిరి సలపక ప్రాణాలు విడుస్తుంది. ఎందుకంటే  బాణానికి వున్న విషం యొక్క ప్రభావం వల్ల ఊపిరితిత్తులని అదిలించే కండరాలు స్తంభించిపోతాయి. ఇలాగే కార్బన్ డయాక్సయిడ్ ఓ విషవాయువు. దీని ప్రభావం వల్ల మతిస్థిమితం తప్పుతుంది, మనసులో అయోమయ స్థితి ఏర్పడవచ్చు. మూర్ఛ కలగవచ్చు. ఈ వాయువు హెచ్చు మోతాదుల్లో రక్తంలో కలిస్తే ఆ రక్తం లో ఆక్సిజన్ ని మోసుకుపోయే సామర్థ్యం సన్నగిల్లుతుంది. ఆ కారణం చేత శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక వ్యక్తి మరణించవచ్చు.

విషపదార్థాలు నాడీమండలం మీద పని చేసి హనికర పరిణామాలు కలుగజేసినట్టే, ఔషధాలు నాడీమండలం మీద హితవైన ప్రభావాన్ని చూపించగలవు. మందులు నాడీమండలం మీద ప్రభావాన్ని ఎలా చూపుతాయి అన్న ప్రశ్న మీద దృష్టి సారించాడు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన జాన్ లాంగ్లీ అనే జీవక్రియాశాస్త్రవేత్త. పందొమ్మిదవ శతాబ్దంలో చివరి దశలలో నాడీమండలం మీద మార్ఫీన్ (ఇదో మత్తు మందు), డిజిటాలిస్ (ఇది గుండె కొట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది, గుండె యొక్క అపలయలని (arrhythmias) నిరోధిస్తుంది) మొదలైన నాడీ ఔషధాల ప్రభావాన్ని ఏదో అవిశ్పష్టంగా, అయోమయంగా వివరించేవారు. జీవపదార్థానికి ఔషధాలకి మధ్య ఏదో ప్రత్యేకమైన సంబంధం (affinity)  ఉందని తలపోసేవారు. ఔషధాలు ఎలాగో నేరుగా ధాతువు (tissue) మీద, కణాల మీద పని చేస్తయని అనుకునేవారు. కాని లాంగ్లీ మరోలా ఆలోచించాడు. ఔషధం శరీరం మీద పని తీరు కేవలం ఓ రసాయన చర్య అని, రెండు అణువుల మధ్య జరిగే చర్య తప్ప అది మరేమీ కాదని అతడు ఊచించాడు. ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి ఔషధాలు నేరుగా ధాతువు మీద పని చెయ్యడం లేదని, ఔషదపు అణువు యొక్క ప్రభావన్ని గ్రహించే “సంగ్రాహ అణువులు” (receiving molecules)  ఉంటాయని అతడు ప్రతిపాదించాడు. వాటికి  రిసెప్టార్లు (receptors) అని పేరు పెట్టాడు. ఈ రిసెప్టార్ ఔషధం యొక్క ప్రభావాన్ని గ్రహించి దాని ఫలితాలని చుట్టూ ఉన్న ధాతువు మీదకి పంపిస్తుంది. 

ఇలాంటి రిసెప్టార్లు మరి న్యూరాన్ల మీద ఉంటాయని అనుకుంటే వాటి ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే ఔషధం అనేది మనిషి ప్రయోగిస్తే శరీరంలోకి ప్రవేశించే పదార్థం. న్యూరాన్ల మీద రిసెప్టార్లు మరి మనిషి ప్రవేశపెట్టిన ఔషధాలకి స్పందించడం కోసం కాచుకు కూర్చోలేదు. ఔషధాలతో ప్రత్యేకమైన సంబంధం లేకపోతే మరి న్యూరాన్ల మీద రిసెప్టార్లు ఏం చేస్తున్నట్టు? ఈ ప్రశ్నకి సమాధానంగా న్యూరాన్లు పరస్పర  రసాయనాల సహాయంతో సంభాషించుకుంటాయి అన్న అవకాశం సూచించబడుతోంది. ఈ రకమైన చింతనలో ముందున్న వాడు ఆటో లెవీ (Otto Loewi). 1920  ల ప్రాంతాల్లో ఈ ఆటో లెవీ రసాయనాల సహాయంతో న్యూరాన్లు సందేశాలు పంపుకుంటాయి అన్న విషయాన్ని నిరూపించడానికి తగ్గ విధానం కోసం అన్వేషించసాగాడు. ఆటొ లెవీ కి ముందు ఈ విషయం మీద కొంత సంధిగ్ధం ఉండేది. న్యూరాన్లు విద్యుత్ సందేశాలతో సంభాషించుకుంటాయి అని ఒక వర్గం నమ్మితే, రసాయనాలతో సంభాషించుకుంటాయని మరో వర్గం వాదించేది. ఈ సంగతేంటో తేల్చడానికి పూనుకున్నాడు ఆటో లెవీ. 



                                                         ఆటో లెవీ
 
అది 1921 సంవత్సరం. ఆ రోజు ఈస్టర్ పండగ.  శనివారం. ఆ రాత్రి తనకి ఓ చిత్రమైన కల వచ్చింది. తను అన్వేషిస్తున్న ప్రయోగం ఎలా చెయ్యాలో ఆ వివరాలన్నీ ఆ కలలో కనిపించాయట. వెంటనే మేలుకుని  కలలో కనిపించిన వివరాలన్నీ ఆదరబాదరాగా ఓ చిన్న నోట్ బుక్ లో రాసుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే రాత్రి కల గన్న సంగతి, ఆ వివరాలు రాసుకున్న సంగతి గుర్తొచ్చింది. సంతోషం పట్టలేకపోయాడు. తను రాసుకున్న నోట్ బుక్ తెరిచి చూస్తే రాత్రి నిద్రలో రాసిన కోడి గీతలు కనిపించాయి. ఏం రాసుకున్నాడో ఎంత తలబాదుకున్నా అర్థం కాలేదు.

రాత్రి వచ్చిన కలని గుర్తు తెచ్చుకోడానికి ఆ రోజు పగలంతా ప్రయత్నించాడు. అది తన జీవితంలోనే అతి దీర్ఘమైన రోజు అని చెప్పుకున్నాడు. అయితే అదృష్టవశాత్తు ఆ మర్నాడు రాత్రి కూడా అదే కల వచ్చిందట. ఈ సారి కల రాగానే ఊరికే ఏవో పిచ్చిగీతలు గీసి తిరిగి నిద్రలోకి జారుకోకుండా వెంటనే ప్రయోగశాలకి బయల్దేరాడు… అప్పటికప్పుడు ఆ ప్రయోగం చేసి చూద్దామని.

(ఇంకా వుంది)






స్వయం సిక్షణా పద్ధతి

Posted by V Srinivasa Chakravarthy Thursday, January 16, 2014 0 comments



స్వయం సిక్షణా పద్ధతి

గ్లెండా బిసెక్స్ అనే ఆవిడ ‘Gnys at work’  అనే ఓ చక్కని పుస్తకం రాసింది.
(http://www.amazon.in/Gnys-Wrk-Child-Learns-Write/dp/0674354907)

 తన కొడుకు పాల్ తనకు తానుగా చదవడం ఎలా నేర్చుకున్నదీ ఆ పుస్తకంలో వివరించింది. మొదట్లో తనే చిన్న చిన్న వాక్యాలు కూర్చుకుని మెల్లగా వాక్య నిర్మాణాన్ని  మెరుగుపరుస్తూ క్రమంగా పెద్దలు రాసేలాంటి చక్కని భాష రాయగలిగాడు. Gnys at work  మరో ముఖ్యమైన విషయాన్ని కూడా తెలియజేస్తుంది. పిల్లలని అర్థం చేసుకుని వాళ్లని విశ్వసించే టిచర్లు ఎలా పని చేస్తారో చెప్తుంది. పిల్లలు ఏం నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో ముందే నిర్ణయించక, దేన్ని నేర్చుకోడానికి అయితే పిల్లలు ముందుగానే కృషి చేస్తున్నారో ఆ దారిలోనే వాళ్లని  ప్రోత్సహించే వివేకం గల టీచర్లు ఎలా నడుచుకుంటారో ఆ పుస్తకంలో వుంది. విద్యావ్యవస్థని మార్చడానికి కృషి చేస్తున్న టీచర్లకి, తల్లిదండ్రులకి కూడా ఈ పుస్తకం మంచి ప్రేరణని, స్ఫూర్తిని ఇస్తుంది.

గ్లెండా కొడుకు పాల్ ఐదేళ్లప్పటి నుండే రాయడం మొదలుపెట్టాడు. ఒకసారి వాళ్లమ్మ ఇంటికొచ్చిన అతిథులతో మాట్లాడుతూ హడావుడిగా వుంది. పిల్లవాడు ఆవిణ్ణి ఏదో అడగాలని ఒకటి రెండు సార్లు ప్రయత్నించాడు. ఆవిడ పట్టించుకోలేదు. దాంతో విసిగిపోయిన ఆ పిల్లవాడు ఓ చిన్నకాగితం మీద “RUDF”  అని రాసి వాళ్లమ్మ చేతిలో పెట్టాడు. వాళ్లమ్మ ఆ సందేశాన్ని అర్థం చేసుకుంది. RUDF  అంటే “Are you deaf?” (నీకేమైనా చెముడా?) అని అర్థం.  వెంటనే కొడుకు ప్రతిభని గుర్తించింది. అప్పట్నుంచి వాడి శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలెట్టింది.

పిల్లవాడు మెల్లమెల్లగా ఇంగ్లీష్ భాషా జ్ఞానాన్ని పెంచుకోసాగాడు. కొడుకు ఏఏ పద్ధతుల్లో పురోగమిస్తున్నాడో, ఎలాంటి అడుగులలో ముందుకు నడుస్తున్నాడో అంతా ఆ తల్లి నిశితంగా గమనించి తన పరిశీలనా ఫలితాలని శ్రద్ధగా గ్రంథస్తం చెయ్యడం మొదలెట్టింది.

“ఇంకా పసివాడైన నా కొడుకు పురోగతి గురించి నోట్‍సు  తీసుకుంటున్నప్పుడు అదంతా తరువాత పరిశోధనగా రూపొందుతుందని నేను అనుకోలేదు. నాకు ముఖ్యమైన సంగతులని పుస్తకంలో రాసుకునే అలవాటు ఉండేది. పాల్ పదాల స్పెలింగ్ నేర్చుకునేటప్పుడు నేను ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గమనించాను. నాకు తరువాత తెలిసింది. చార్లెస్ రీడ్ పిల్లల మీద పరిశోధనలు చేసి, పిల్లలకి పరిష్కార మార్గం తెలీనప్పుడు వాళ్లంతకు వాళ్లే కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటారు, అని గమనించాడు. పాల్ విషయంలో కూడా ఆ ఒరవడినే గమనిస్తున్నాను.
“ఈ విధంగా ఓ పిల్లవాడి విద్యాజీవనం మొత్తాన్ని, విద్యానుభవం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరంగా రాయడం అనేది తల్లిని గనుక, ఎప్పుడూ పిల్లవాడి దగ్గరే ఉంటాను గనుక నాకు వీలయ్యింది గాని అది మరొకరికి సాధ్యం కాని పని.”

(ఇంకా వుంది)





హైగెన్స్ సూత్రం

Posted by V Srinivasa Chakravarthy Tuesday, January 14, 2014 0 comments




కాంతి ఒక కణ ప్రవాహం కాదని, అదొక తరంగమని ప్రతిపాదించిన క్రిస్టియన్ హైగెన్స్, ఆ తరంగం ఎలా వ్యాపిస్తుందో వర్ణించాడు. తరంగం ఎలా వ్యాపిస్తుందో వర్ణించడం అంటే, దాని తరంగాగ్రం ఎలా ముందుకు కదులుతుందో వర్ణించడం అన్నమాట. హైగెన్స్ ప్రతిపాదించిన సూత్రం బట్టి కాంతి పరావర్తనం చెందే తీరుని, వక్రీభవనం చెందే తీరుని అద్భుతంగా వివరించడానికి వీలయ్యింది.

ఇంతకీ ఏంటా హైగెన్స్ సూత్రం?


హైగెన్స్ సూత్రం:

ఒక తరంగాగ్రం మీద ఉండే ప్రతీ బిందువు ఓ కొత్త గౌణ తరంగానికి (secondary wavelet)  మూలంగా పని చేస్తుంది. ఈ గౌణ తరంగాలు కాంతి వేగంలో గోళాకారంలో ముందుకు కదులుతాయి. ఎలా ఏర్పడ్డ గౌణ తరంగాల యొక్క సామాన్య స్పర్శ తలమే (common tangential surface) అసలు తరంగం యొక్క తరంగాగ్రం యొక్క తదుపరి స్థానం.

ఈ సూత్రాన్ని సంక్షిప్తంగా ఓ నిర్వచనంలా చెప్తే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కనుక అది ఎలా పని చేస్తుందో ఉదాహరణాలతో అర్థం చేసుకుందాం. పై సూత్రాన్ని ఉపయోగించి కాంతి యొక్క తరంగాగ్రం ఎలా వ్యాపిస్తుందో రెండు సందర్భాలలో గమనిద్దాం.

1)    సమతల తరంగం (plane wave): సమతలంలో కదిలే ఓ సమతల తరంగాన్ని గమనిద్దాం. (త్రిమితీయ ఆకాశంలో అయితే  తరంగం యొక్క తరంగాగ్రం ఒక తలం అవుతుంది. కాని తలం మీద కదిలే తరంగం యొక్క తరంగాగ్రం ఒక రేఖ అవుతుంది.)  సమతలంలో అయితే తరంగం యొక్క  తరంగాగ్రం ఒక రేఖ అవుతుంది. అంతేకాక, ఆ తరంగం ఓ సమతల తరంగం అయితే  దాని తరంగాగ్రం ఓ సరళ రేఖ అవుతుంది. కింది చిత్రంలో (a)  రెండు నిలువు రేఖలు కనిపిస్తున్నాయి. ఎడమ పక్కన ఉన్న సరళ రేఖ తరంగాగ్రం యొక్క మొదటి స్థానం. కుడి పక్కన వున్న సరళరేఖ కాసేపటి తరువాత (Δt వ్యవధి తరువాత) ఆ తరంగాగ్రం యొక్క కొత్త స్థానం. మొదటి తరంగాగ్రం నుండి రెండవ తరంగాగ్రం ఎలా వచ్చిందో హైగెన్స్ సూత్రం చెప్తుంది.

మొదటి తరంగాగ్రం మీద ప్రతీ బిందువు నుండి గోళాకారంగా (ఇది సమతలంలో వర్తులాకారం అవుతుంది) వ్యాపిస్తున్న గౌణ తరంగాలని ఊహించుకోవాలి. అంటే ఆ గౌణ తరంగాలు మొదటి తరంగాగ్రం మీద ఉండే బిందువులు కేంద్రాలుగా గీసిన అర్థవృత్తాలు అన్నమాట. ఆ అర్థవృత్తాల వ్యాసార్థాల విలువ c X Δt. ఇక్కడ c అంటే కాంతి వేగం. Δt వ్యవధి తరువాత ఈ గౌణతరంగాలు  c X Δt దూరం వ్యాపిస్తాయి కనుక చిత్రాన్ని ఇలా గీయడం జరిగింది.  తరంగం ఎడమ నుండి కుడి వైపుకి కదులుతోంది గనుక ఆ గౌణ తరంగాలని కుడి వైపున మాత్రమే చిత్రించాం. అలా చిత్రించిన గౌణతరంగాలకి సామాన్య స్పర్శ రేఖ గీస్తే అది ఒక సరళ రేఖ అవుతుంది. చిత్రం ‘a’ లో కుడి వైపున కనిపించే నిలువ రేఖ అదే. అంటే అసలు తరంగం యొక్క తరంగాగ్రం మొదట్లో ఎడమ వైపున ఉన్న నిలువు రేఖ వద్ద ఉంటే,  Δt సమయం తరువాత కుడి నిలువ రేఖ వద్దకి జరిగింది అన్నమాట. సమతల తరంగం ఎప్పటికీ సమాంతర రేఖలలోనే వ్యాపిస్తుంది అని మనకి తెలిసిన సత్యాన్ని ఈ సందర్భంలో హైగెన్స్ సూత్రం నిర్ధారిస్తోంది.



2)   గోళీయ తరంగం (spherical wave): ఇప్పుడు సమతల తరంగం బదులుగా ఓ గోళీయ తరంగం ఎలా విస్తరిస్తుందో చూద్దాం (పై చిత్రంలో b). చిత్రం b  లో రెండు ఏకకేంద్రీయ వృత్తాలు కనిపిస్తున్నాయి. లోపలి వృత్తం తరంగాగ్రం యొక్క మొదటి స్థానాన్ని సూచిస్తోంది. హైగెన్స్ సూత్రం Δt వ్యవధి తరువాత ఈ తరంగాగ్రం ఎక్కడికి పోతుందో చెప్తుంది. ఇందాక అనుకున్నట్లే మొదటి తరంగాగ్రం మీద ప్రతీ బిందువు నుండీ గౌణ తరంగాలు పుట్టి c వేగంతో వ్యాపిస్తున్నట్లు ఊహించుకోవాలి. దాన్ని చిత్రించడం కోసం ఆ బిందువులలో ప్రతీ బిందువును కేంద్రంగా చేసుకుంటూ, చిత్రం  b  లో చూపినట్లుగా, c X Δt వ్యాసార్థం గల చాపాలు గీయాలి. అలా గీసిన చాపాలన్నిటికీ ఓ సామాన్య స్పర్శ రేఖ గీస్తే ఆ రేఖ ఓ వృత్తం అవుతుంది. ఆ వృత్తమే మొదటి తరంగాగ్రం  Δt సమయం తరువాత ఎక్కడికి జరిగిందో సూచిస్తుంది. గోళాకార తరంగం ఎప్పటికీ గోళాకారం లోనే వ్యాపిస్తుంది అని మనకి తెలిసిన సత్యం ఈ సందర్భంలో హైగెన్స్ సూత్రం నిర్ధారిస్తోంది.


ఈ విధంగా తరంగాలు వ్యాపించే తీరు గురించి మనకి తెలిసిన విషయాలని హైగెన్స్ సూత్రం నిర్ధారిస్తోందని మనం గమనించొచ్చు.

ఇప్పుడు మరో మెట్టు ముందుకు వేసి, హైగెన్స్ సూత్రం ప్రకారం కాంతి యొక్క రెండు ధర్మాలు -  1) పరావర్తనం (reflection), 2) వక్రీభవనం (refraction) - ఎలా ఉత్పన్నం అవుతాయో వివరిద్దాం.

(ఇంకా వుంది)

ప్రయోగశాలలో కాంతి వేగం కొలత

Posted by V Srinivasa Chakravarthy Monday, January 13, 2014 1 comments




ఫిజో కి తన పరిశోధనలలో సహాయం చేసిన మరో ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఉన్నాడు. అతడి పేరు Jean Bernard Leon Foucault (1819-1868).
 
ఫిజో చేసిన ప్రయోగమే ఫోకాల్ట్ కూడా చెయ్యడానికి ప్రయత్నించాడు. అయితే పళ్లు ఉన్న చక్రానికి బదులుగా రెండవ అద్దాన్ని వాడాడు ఫోకాల్ట్. మొదటి అద్దం నుండి ప్రతిబింబించబడ్డ కిరణం, రెండో అద్దం మీద పడి అక్కడి నుండి ఓ తెర మీదకి విక్షేపించబడుతుంది.

ఇప్పుడు రెండో అద్దాన్ని వేగంగా తిప్పుతున్నాం అనుకుందాం. కాంతి మొదటి అద్దం నుండి తిరిగొచ్చి రెండవ అద్దం మీద పడేసరికి ఆ అద్దం కాస్త పక్కకి తిరిగిపోతుంది. కనుక అక్కడి నుండి బయల్దేరే కిరణం తెర మీద కాస్త పక్కగా పడుతుంది.



Image courtesy: http://www.pas.rochester.edu/~pavone/particle-www/teachers/demonstrations/FoucaultDemonstration.htm
 
రెండవ అద్ధం ఎంత వేగంతో తిరిరుగుతోందో తెలుసు కనుక, దాని నుండి ప్రతిబింబితమైన కిరణం ఎంత పక్కకి తిరుగుతుందో తెలిస్తే, ఈ సమాచారం బట్ట్ కాంతి వేగాన్ని లెక్కించొచ్చు.

ఫోకాల్ట్ తన ప్రయోగాన్ని పదే పదే చేసి చూశాడు. తన ప్రయోగ పరికరాలకి కూడా సముచితమైన మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాడు. తన కృషి ఫలితంగా 1862  లో తను లెక్కించిన కాంతి వేగం 185,000  మైళ్లు/సెకను   అని వచ్చింది. అంతవరకు జరిగిన కాంతి వేగపు అంచనాలు అన్నిట్లోకి ఇది అత్యంత నిర్దుష్టమైనది. అసలు విలువ కన్నీ ఇది సుమారు 1000  మైళ్లు/సెకను మాత్రమే తక్కువ.

కచ్చితంగా ఉండడం మత్రమే కాక ఫిజో పద్ధతితో పోల్చితే ఫోకాల్ట్ పద్ధతిలో మరో లాభం కూడా వుంది. ఇందులో  పెద్ద దూరాలతో పని లేదు. గెలీలియో, ఫిజో మొదలైన వాళ్లు అవలంబించిన పద్ధతిలో లాగా కొండలు, మిట్టలు ఎక్కనక్కర్లేదు. ఫోకాల్ట్ వాడిన ప్రయోగ సామగ్రి చాలా సంక్షిప్తంగా ఉంటుంది. అందులో కాంతికిరణం సుమారు  66  అడుగుల దూరం మాత్రమే ప్రయాణించింది.
కనుక ఫోలాక్ట్ వాడిన పద్ధతిని ఆరుబయట కాకుండా, గదిలో అంటే ప్రయోగశాలలోనే అమలు చెయ్యొచ్చు. ఈ పద్ధతిలో మరో లాభం ఏంటంటే ఈ పధ్ధతిలో గాలిలోనే కాక ఇతర మాధ్యమాలలో కూడా కాంతి వేగాన్ని కొలవవచ్చు.

గాలిలో కాంతివేగాన్ని కొలుస్తున్నప్పుడు కిరణం కొన్ని మైళ్లు ప్రయాణించినా ఫరవాలేదు. కాని అదే పద్ధతి వాడి, నీట్లో కాంతి వేగాన్ని కొలవాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం విఫలం అవుతుంది. ఎందుకంటే ఐదు మైళ్లు పొడవున్న నీటి తొట్టెలో కాంతి కిరణాన్ని ప్రసరిస్తే అది అవతలి కొస దాకా ప్రయాణించి తిరిగి మొదటి వచ్చేసరికి అందులోని శక్తి ఇంచుమించు పూర్తిగా హరించుకుపోతుంది. ఆ శక్తిని నీరు హరిస్తుంది. నీరు కాంతికి పారదర్శకం అనుకుంటాం గాని ఆ సూత్రం  తక్కువ దూరాల మధ్యనే వర్తిస్తుంది. మైళ్ల దూరాల వద్ద నీరు కాంతికి పారదర్శకం కాదు.

చిన్న చిన్న దూరాల వద్ద కూడా కాంతి వేగాన్ని కొలవగలిగిన ఫోకాల్ట్ నీట్లో కూడా కాంతి వేగాన్ని కొలవగలిగాడు. ఆ కొలత యొక్క ఫలితం, కాంతి యొక్క తత్వాన్ని గురించి ఎంతో కాలంగా వస్తున్న ఓ తగవుని తీర్చింది.

ఫోకాల్ట్ కాలం నాటికి కాంతి యొక్క తత్వం గురించి రెండు సిద్ధాంతాలు ఉండేవి. కొందరు కాంతిలో వుండేవి కణాలు అనుకునేవారు. మరి కొందరు కాంతిలో ఉండేవి తరంగాలని భావించేవారు. క్రమంగా తరంగ సిద్ధాంతానిదే పై చేయి అవుతున్నా, కణ సిద్ధాంతాన్ని నమ్మిన వర్గం తమ నమ్మకాన్ని పూర్తిగా వదులుకోలేని స్థితిలో వున్నారు.

కాంతి కణ సిద్ధాంతం ప్రకారం కాంతి గాలిలో కన్నా నీటిలో మరింత వేగంగా ప్రయాణించాలి. కాని తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి గాలిలో కన్నా నీటిలో మరింత నెమ్మదిగా ప్రయాణించాలి.

(ఇంకా వుంది)









postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts