“సైన్సులో మహత్యాలకి స్థానం లేదు,” కాస్త కటువుగా అన్నాడు ప్రొఫెసర్. “ప్రతీ చలనాన్ని కొన్ని నియత ధర్మాలు పాలిస్తుంటాయి. కాలానికి, ఆయతనానికి (space) సంబంధించి ఐనిస్టయిన్ బోధించిన సరి కొత్త భావాలకి పర్యవసానమే ఈ మార్పు. కదిలే వ్యవస్థలో జరిగే క్రియలన్నీ నెమ్మదిస్తాయి. మనం ఉండే లోకంలో కాంతి వేగం చాలా ఎక్కువ కనుక ఈ ప్రభావాలన్నీ అత్యల్పంగా ఉంటాయి. కాని ఈ లోకంలో గరిష్ఠ వేగం చాలా తక్కువ కనుక ఈ ప్రభావాలు దైనందిన జీవితంలో కుడా సంచలనాత్మకంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి నిశ్చలంగా ఉన్న గిన్నెలో ఓ గుడ్డుని ఉడికించడానికి ఐదు నిముషాలు పడుతుంది అనుకుందాం. అదే ఆ గిన్నెని అటు ఇటు ఊపుతూ గుడ్డుని ఉడికిస్తే ఐదు నిముషాల్లో జరగాల్సినది, ఆరు నిముషాలు పట్టొచ్చు. అలాగే ముందుకి వెనక్కి ఊగే కుర్చీలో కాలం మరింత నెమ్మదిగా సాగుతుంది. అదే విధంగా రైల్లో ప్రయాణీకుల విషయంలో కూడా కాలం నెమ్మదిస్తుంది. ఆ సందర్భాల్లో వ్యక్తులు మరింత నెమ్మదిగా జీవిస్తుంటారు. కనుకనే ’సమవేగంతో కదలని వ్యవస్థల్లో కూడా కాలం నెమ్మదిస్తుంది’ అని శాస్త్రవేత్తలు అంటారు.”
“కాని మన లోకంలో, దైనందిన జీవితంలో ఇలాంటి పరిణామాలు కనిపిస్తాయి అంటారా?”
“కనిపిస్తాయి. కాని వాటిని కనిపెట్టడానికి చాలా నిశిత దృష్టి కావాలి. కాలంలో మార్పులు కనిపించేటంత స్థాయిలో త్వరణాలు సాధించడానికి అత్యధిక త్వరణాలు సాధించాలి. మరో విషయం ఏంటంటే త్వరణం చెందుతున్న వ్యవస్థకి, అధిక గురుత్వం గల వ్యవస్థకి మధ్య తేడా లేదు. ఉదాహరణకి ఊర్థ దిశలో (upwards) త్వరణం చెందుతున్న లిఫ్ట్ లో నించున్నప్పుడు, మన బరువు పెరిగినట్టు ఉంటుంది. అంటే అధిక గురుత్వ క్షేత్రంలో ఉండడం లాంటిది అన్నమాట. అలాగే లిఫ్ట్ కింది దిశలో త్వరణం చెందుతుంటే మన బరువు తగ్గినట్టు ఉంటుంది. ఇక ’తాడు తెగి’ కింద పడుతున్న లిఫ్ట్ లో అయితే తేలిపోతున్నట్టు ఉంటుంది, అసలు బరువే తెలీదు. అంటే గురుత్వం శూన్యమైనట్టు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే గురుత్వ క్షేత్రం యొక్క ప్రభావం, త్వరణం యొక్క ప్రభావానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని అనుకోవచ్చు. ఉదాహరణకి సూర్యుడి గురుత్వ క్షేత్రం భూమి మీద గురుత్వం కన్నా చాలా ఎక్కువ కనుక ఈ పరిణామాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కనుక అక్కడి ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. ఈ వాస్తవాన్ని ఖగోళశాస్త్రవేత్తలు గమనిస్తారు.”
“కాని అవన్నీ పరిశీలించడానికి మనం సూర్యుడి వద్దకి ప్రయాణించలేంగా?” కాస్త అనుమానంగా అడిగాడు సుబ్బారావు.
“అందుకు సూర్యుడి వద్దకి ప్రయాణించనక్కర్లేదు. సూర్యుడు నుండి వచ్చే కాంతిని పరిశీలిస్తే చాలు. సౌరవాతావరణంలో ఉండే పరమాణువుల ప్రకంపన వల్ల ఈ కిరణాలు పుడతాయి. అక్కడి ప్రక్రియలన్నీ నెమ్మదిస్తే, ఆ ప్రకంపనలు కూడా నెమ్మదించాలి. భూమి మీద ఉండే కాంతి మూలాల నుండి వచ్చే కాంతిని, సూర్యుడి మీద ఉండే కాంతి మూలాల నుండి వచ్చే కాంతితో పోల్చితే ఈ తేడాని గమనించొచ్చు.” అంటున్నవాడల్లా ప్రొఫెసర్ అర్థోక్తిలో ఆపి, “అవుతూ ఇప్పుడొస్తున్న స్టేషను పేరు నీకు తెలుసా?” అని అడిగాడు.
(సశేషం...)
చదువుతుంటే ఇది సామాన్య సాపేక్ష సిద్దాంతం పై చర్చ అని మర్చిపోయి ఇంకా ప్రత్యేక సాపేక్ష సిద్దాంతం అనుకొంటున్నా . ఇకపోతే నా ప్రశ్న మళ్ళీ కాలం నెమ్మదించడం గురించే. కదిలే వ్యవస్థలలో కాలం నెమ్మదిస్తుంది. దాని అర్థం ఆ నెమ్మదించడం వ్యవస్త బయట ఉన్నవారు చూడగలరని కదా. ఉదా.,బయటి ప్రపంచంలో రెండు సంఘటనల మధ్య ఏడం ’x’ సెకన్లు అనుకొందాం. కదిలే రైలులో కనక అదే రెండు సంఘటనలు జరిగెతే వాటి మధ్య ఏడం రైలు బయటఉన్న వారికి ఎక్కుగా అనిపిస్తుంది. రైలులో ఉన్నవారికి ఏడం x సెకన్లుగనే ఉంటుంది అని నా విశ్వాసం. నేననుకుంటుంది కరెక్టేనా ?
అవును. మీరు చెప్పింది కరెక్ట్.