రూళ్ల కర్రలతోను, రబ్బరు బ్యాండులతోను కాక ఇప్పుడు ఓ కాంతి రేఖతో సరళ రేఖని నిర్మించాలి అనుకుందాం. కాంతి కూడా ఇందాక నిర్మించిన సరళ రేఖల వెంటే ప్రయాణిస్తోందని తెలుసుకుంటాం. అయితే వేదిక పక్కన, అంటే బయట, నించుని ఈ వ్యవహారాన్ని చూస్తున్న పరిశీలకులకి కాంతిరేఖ వక్రంగా పోతున్నట్టు కనిపించదు. కాంతి యొక్క గమన రేఖ మీద, వేదిక యొక్క గమనాన్ని అధ్యారోపించడం (superimpose చెయ్యడం) వల్ల, వేదికను బట్టి కాంతి రేఖ వంగినట్టుగా కనిపిస్తోందని వాళ్లు గ్రహిస్తారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఓ చిన్న ప్రయోగం చెయ్యొచ్చు. తిరుగుతున్న గ్రామఫోన్ రికార్డు మీద గోటితో ఓ సరళ రేఖ సన్నగా గీస్తే, అలా ఏర్పడ్డ రేఖ నిజానికి అంటే రికార్డు మీద వక్రంగానే ఉంటుంది.
కాని వేదిక మిద, వేదికతో పాటు తిరుగుతున్న పరిశీలకుడు, కాంతి మార్గం సరళ రేఖ అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే అది నిజంగా అత్యంత హ్రస్వమైన (shortest) బాట. అయితే ఇప్పుడు అతడు వేదిక పరిధి మీద ఉన్న మూడు బిందువులని (A,B, C) కలుపుతూ మూడు ’సరళ రేఖలు’ గీశాడు అనుకుందాం. అలా ఏర్పడ్డ త్రిభుజం యొక్క మూడు కోణాలని కలిపి చూస్తే ఆ మొత్తం 180 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటుంది. కనుక తన చుట్టూ ఉన్న స్థలం వంపు తిరిగి ఉందని అనుకుంటాడు.
కేవలం త్రిభుజంలోని కోణాల లెక్కలోనే కాదు, వేదిక యొక్క చుట్టు కొలత లెక్కలో కూడా తేడా వస్తుంది. ఉదాహరణకి కిందటి పోస్ట్ లో ఇచ్చిన చిత్రంలో పరిశీలకుడు #3 వ్యాసార్థాన్ని కొలుస్తున్నాడు. ఈ ప్రయత్నంలో రూళ్ల కర్ర ఎప్పుడూ అడ్డుగా కదులుతోంది కనుక, దాని పొడవు మారదు. అలా కాకుండా పరిశీలకుడు #4 వేదిక యొక్క చుట్టుకొలతని కొలుస్తున్నాడు. ఈ ప్రయత్నంలో రూళ్ల కర్ర ఎప్పుడూ దాని పొడవు ఉన్న దిశలోనే కదులుతోంది. కనుక అది తగు రీతిలో కుంచించుకుంటుంది. అంటే అలాంటి రూళ్ల కర్రతో కొలిచే పొడవు మరింత ఎక్కువ అవుతుంది. కనుక అలా కొలవబడ్డ చుట్టుకొలతని వ్యాసంతో భాగించగా వచ్చే p విలువ మామూలుగా కన్నా (సమతలం మీద విలువ కన్నా) ఎక్కువగా ఉంటుంది.
కేవలం పొడవుల కొలతలు మాత్రమే కాదు, కాలం కొలతలు కూడా ఈ పరిస్థితుల్లో మారుతాయి. ఉదాహరణకి పరిధి మీద ఉండే గడియారం, అక్కడ వేగం ఎక్కువగా ఉండడం వల్ల, నెమ్మదిగా నడుస్తుంది. అందుకు భిన్నంగా కేంద్రంలో కాలం మరి కాస్త వేగంగా నడుస్తుంది.
ఇప్పుడు ఇద్దరు పరిశీలకులు వేదిక కేంద్రం వద్దకి వచ్చి తమ గడియారాలని ఒకే సమయం చూపించేలా దిద్దుకున్నారు అనుకుందాం. ఇప్పుడు వారిలో ఒకరు వేదిక అంచు వరకు నడిచి, అక్కడ కాసేపు ఉండి, తిరిగి వేదిక కేంద్రం వద్దకు వచ్చి చూస్తే, తన గడియారం మరింత నెమ్మదిగా నడవడం తెలుసుకుంటాడు. ఆ విధంగా వేదిక మీద వివిధ స్థలాలలో, భౌతిక ప్రక్రియలన్నీ వివిధ వేగాలలో నడుస్తున్నట్టు, ఎందుకంటే అసలు కాలమే వివిధ వేగాలతో గడుస్తున్నట్టు తెలుసుకుంటాడు.
ఇప్పుడు ఆ వేదిక మీద ఉన్న ప్రశీలకులు అంతా కలిసి తాము అంత వరకు వేదిక మీద గమనించిన విడ్డూరమైన ఫలితాలకి కారణాలని శోధించాలని అనుకున్నారు. వేదిక చుట్టూ ఎత్తైన గోడలు, వేదిక పైన చూరు ఉండి, వేదిక ఓ పరిభ్రమించే గదిలా ఉందనుకుందాం. లోపల ఉన్న వారికి బయట ఏముందో తెలీదు. వేదిక బయట ఈ ’నిశ్చల’ ప్రపంచం ఉందని తెలీనప్పుడు, తాము అంతవరకు చూసిన విడ్డూరమైన ఫలితాలన్నీ, వేదిక మీద ఉండే కొన్ని ప్రత్యేక భౌతిక పరిస్థితుల వల్ల కలుగుతున్నాయని వాళ్లు ఎలా తెలుసుకుంటారు? వేదిక మీద ఉన్న ఆ ప్రత్యేక భౌతిక పరిస్థితులు ఎలాంటివి?
(సశేషం...)
0 comments