“ఇదుగో ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది.... సెక్షన్ 37, సబ్ సెక్షన్ 12, పేరా e, ప్రకారం: హత్య జరిగిన తరుణంలో గాని, ఆ తరుణానికి + d/c క్షణాలు (ఇక్కడ d అంటే నిందితుడికి, హత్యా స్థలానికి మధ్య దూరం, c అంటే ఈ లోకంలో గరిష్ఠ వేగం) అటు ఇటుగా కాని ఉన్నప్పుడు, ఈ విషయాన్ని ఓ కదిలే ప్రామాణిక వ్యవస్థ నుండి చూసే పరిశీలకుడి చెప్పే సాక్ష్యం, నిర్దోషమైన ఎలిబీ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నిందితుడు అసలు హత్యా స్థలంలోనే లేడని తాత్పర్యం.”
హత్యాస్థలానికి నిందితుడు d దూరంలో ఉన్నప్పుడు నిందితుడి నుండి ఏ ప్రభావం అయినా (ఉదాహరణకి తను పేల్చిన తూటా) హత్యా స్థలానికి చేరుకోవడానికి కనీసం d/c సెకనులు పడుతుంది. కనుక నిందితుడి కదలకలు అనే సంఘటనకి, హత్య అనే సంఘటనకి అంత కన్నా తక్కువ వ్యవధి ఉంటే, నిందితుడి వల్ల హత్య జరగలేదని తేలుతుంది. ఈ విషయం అర్థమైన పోలీస్ ఓ వెర్రినవ్వు నవ్వి, పోర్టర్ కేసి చూసి,
“ఇదుగో చుడు, ఇక నిన్ను వొదిలేస్తున్నా. నువ్వు స్వేచ్ఛగా ఇంటికి పోవచ్చు,” అంటూ పోర్టర్ ని విడిచిపెట్టి, వెంటనే ప్రొఫెసర్ కేసి తిరిగి, “మీకు చాలా థాంక్స్ సర్! సమయానికి మీరు వచ్చి నాకు సలహా ఇవ్వకపోయి ఉంటే, ఈ రోజు మా పై అధికారి చేతుల్లో నాకు మూడిందే. ఈ ఉద్యోగం నాకు కొత్త. ఇంకా నియమాలన్నీ పట్టు పడలేదు. అయినా జరిగిన హత్య గురించి ఫిర్యాదు చెయ్యాలి. ఇప్పుడే వస్తాను,” అంటూ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చెయ్యడానికి దగ్గర్లోనే ఉన్న ఫోన్ బూత్ వద్దకి వెళ్లాడు. కాసేపట్లో తిరిగొచ్చి, “అసలు హంతకుణ్ణి ఇప్పుడే పట్టుకున్నార్ట. రైల్వేస్టేషన్ నుంచి పారిపోతుంటే దొరికాట్ట. అయినా మీ మేలు ఎన్నడూ మర్చిపోలేను,” అన్నాడు.
సుబ్బారావు, ప్రొఫెసర్ మళ్లీ రైలెక్కారు. రైలు కదిలింది.
“నాకసలు ఏవీ అర్థం కావడం లేదు,” ఇక ఉండబట్టలేక సుబ్బారావు బయటికి అనేశాడు. “ఏంటసలు ఈ ఏకకాలీనత గోలంతా? ఈ దేశంలో ఏకకాలీనతకి అర్థమే లేదా?”
“లేకనేం. తప్పకుండా ఉంది,” చిరునవ్వు నవ్వుతూ ప్రొఫెసర్ చెప్పుకొచ్చాడు. “కాని అది కొంత వరకే. అందుచేతనే పాపం ఆ పోర్టర్ ని కాపాడగలిగాను. ఏ లోకంలోనైనా వేగానికి ఓ గరిష్ఠ పరిమతి అంటూ ఉంటే, ఆ లోకంలో ఏకకాలీనత అన్న పదానికి మనం ఇచ్చే మామూలు అర్థం ఇక ఉండదు. ఇలా చెప్తే మీకు బాగా అర్థం అవుతుందేమో. ఉదాహరణకి దూరంగా, మరో ఊళ్లో మీకో స్నేహితుడు ఉన్నాడని అనుకుందాం. మీ స్నేహితుడికి మీరు ఏదైనా కబురు పెట్టాలంటే అందుకు ఒక్కటే మార్గం. ఉత్తరం రాయడం. అది రైల్లో ఆ ఊరు చేరుకోడానికి మూడు రోజులు పడుతుంది. ఉదాహరణకి ఆదివారం నాడు మీకు ఏదో జరుగుతుంది అనుకుందాం. అదే సంఘటన మీ స్నేహితుడి విషయంలో కూడా జరుగుతుందని కూడా మీకు తెలుసు అనుకుందాం. కాని మీకు జరిగిన సంఘటన గురించి మీ స్నేహితుడికి కబురు పెడితే ఆ వార్త అతడికి బుధవారం వరకు చేరదు. అదే విధంగా ఆదివారం మీకు జరుగబోయే విషయాన్ని అతడు మీకు తెలియజేయాలంటే అతడు అంతకు ముందు గురువారమే ఆ వార్త మీకు పంపాల్సి ఉంటుంది. కనుక ఒక గురువారం నుండి, తదుపరి బుధవారం వరకు, ఆ ఆరు రోజుల వ్యవధిలో మీరు మీ స్నేహితుడి మీద ప్రభావం చూపలేకపోవడమో, మీ స్నేహితుడు మీ మీద ప్రభావం చూపలేకపోవడమో జరుగుతుంది. కార్యకారణ సంబంధాల దృష్ట్యా మీ ఇరువురి మధ్య ఆరు రోజుల ఎడం ఉందన్నమాట.”
“ఉత్తరానికి బదులుగా టెలిగ్రాం ని వాడితేనో?” సుబ్బారావు అడిగాడు.
’కాని ఈ దేశంలో రైలు ప్రయాణించే వేగమే గరిష్ఠ వేగం అన్నమాట. మనం ఉండే దేశంలో కాంతి వేగమే గరిష్ఠ వేగం. కనుక అక్కడిపరిస్థితులు వేరు.”
“కావచ్చు,” సందేహం పూర్తిగా తీరక అడిగాడు సుబ్బారావు. “రైలు కన్నా వేగం ఏదీ ప్రయాణించలేకపోవచ్చు. కాని దానికి ఏకకాలీనతకి ఏంటి సంబంధం? నేను, నా మిత్రుడు దూరంగా ఉన్నా ఆదివారం ఒకే సమయంలో భోజనం చేస్తూ ఉండొచ్చుగా? అంటే సరిగ్గా నేను భోజనం చేస్తున్న సమయంలోనే అతడు కూడా భోజనం చేస్తూ ఉన్నాడని అనుకోడానికి ఏంటి అభ్యంతరం”
“అభ్యంతరం తప్పకుండా ఉంది. అలా ఊహించుకోడానికి వీలవుతుందేమో గాని దాన్ని వాస్తవంలో నిర్ధారించడానికి వీలుకాదు. ఉదాహరణకి రైల్లో ప్రయాణిస్తూ మిమ్మల్ని పరిశీలించే పరిశీలకుల పరిశీలనలు పూర్తిగా వేరుగా ఉంటాయి. వారి దృష్టిలో ఆదివారం రాత్రి మీరు భోజనం చేస్తున్న సంఘటన, శుక్రవారం ఉదయం అతడు టిఫిన్ చేస్తున్న సంఘటన ఏకకాలంలో జరిగినట్టు కనిపింవచ్చు. లేదా ఆదివారం రాత్రి మీరు భోజనం చేస్తున్న సంఘటన, మంగళవారం మధ్యాహ్నం అతడు భోజనం చేస్తున్న సంఘటన ఏకకాలంలో జరిగినట్టు కనిపింవచ్చు. ఎలా చూసినా మూడు రోజుల ఎడం కన్నా తక్కువ కాలం ఇద్దరూ (ఏకకాలంలో) భోజనం చేస్తున్నట్టుగా ఎవరూ చూడలేరు.”
“కాని ఇదంతా ఎలా సాధ్యం” ఇంకా అయోమయంగా అడిగాడు సుబ్బారావు.
(సశేషం...)
0 comments