అంతలో ఏం జరిగిందో ఏమో స్టేషన్ మాస్టర్ నించున్న వాడల్లా బోర్లా ముందుకి పడ్డాడు. రైలు రొదలో తుపాకీ పేలిన చప్పుడు కూడా సరిగ్గా వినిపించలేదు. స్టేషన్ మాస్టర్ శరీరం చుట్టూ రక్తం మడుగయ్యింది. అది చూసిన ప్రొఫెసర్ ఆదుర్దాగా రైల్లోని ఎమర్జన్సీ చెయిన్ లాగాడు. కీచుమన్న చప్పుడుతో రైలు ఆగింది. ఇద్దరూ రైలు దిగుతుండగా అల్లంత దూరం నుండి పోర్టర్ కింద పడ్డ శరీరం వైపుగా పరుగెత్తుతూ కనిపించాడు. మరో పక్క నుండి ఓ పోలీస్ కూడా ప్లాట్ ఫామ్ మీదకి రావడం కనిపించింది.
“తూటా గుండె లోంచి దూసుకుపోయింది,” శవాన్ని పరీక్షించిన పోలీస్ నిట్టూరుస్తూ అన్నాడు. అంతలో పక్కనే ఉన్న పోర్టర్ జబ్బ బలంగా పట్టుకుంటూ, “ఈ హత్యకి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను,” అన్నాడు.
“అయ్యో నాకేం తెలీదు. ఈ హత్య నేను చెయ్యలేదు,” పోర్టర్ అరుస్తున్నట్టుగా అన్నాడు. “తూటా పేలిన చప్పుడు వినిపించిన సమయానికి నేను అక్కడ కూర్చుని పేపరు చదువుకుంటున్నాను. కావాలంటే ఈ పెద్దమనుషులని అడగండి. వాళ్లు రైల్లోంచి అంతా చూసే ఉంటారు.”
“అవును,” అన్నాడు సుబ్బారావు. “నేను కళ్లారా చూశాను. స్టేషన్ మాస్టర్ కి తూటా తగిలిన సమయానికి ఇతడు అల్లంత దూరంలో పేపర్ చదువుకుంటున్నాడు. కచ్చితంగా చెప్తున్నాను.”
“కాని ఆ సమయంలో మీరు కదులుతున్న రైల్లో ఉన్నారు. మీరు చూసింది అసలు సాక్షం కిందకి రానే రాదు,” పోలీసు మాటల్లో అధికార దర్పం ధ్వనిస్తోంది. “ఎందుకంటే అదే దృశ్యాన్ని ప్లాట్ ఫామ్ నుండి చూసినట్టయితే అదే సమయంలో ఇతగాడు తుపాకీ కాల్చి ఉండొచ్చు. ఏకకాలినత అనేది మనం చూస్తున్న వ్యవస్థ మీద ఆధారపడుతుందని మీకు తెలిసే ఉంటుంది,” అని పోర్టర్ కేసి తిరిగి, “గొడవ చెయ్యకుండా నాతో రా” అని వాణ్ణి జబ్బ పట్టుకుని లాక్కెళ్లబోయాడు.
“ఇదుగో చూడండి కానిస్టేబులు గారూ” అంటూ అంతవరకు మౌనంగా ఉన్న ప్రొఫెసర్ జోక్యం చేసుకున్నాడు. “మీరు పూర్తిగా పొరబడ్డారు. ఈ పొరబాటు మీ పై అధికారులకి తెలిస్తే క్షమించరు. మీ దేశంలో ఏకకాలనత అన్నది చూస్తున్న వ్యవస్థ మీద ఆధారపడుతుందన్నది వాస్తవమే. రెండు వేరు వేరు స్థలాలలో జరిగిన రెండు వేరు వేరు సంఘటనలు ఒకే సమయంలో జరిగాయా లేదా అన్న విషయం మనం చూస్తున్న వ్యవస్థ యొక్క గమనం మీద ఆధారపడుతుంది అన్నది కూడా నిజమే. కాని అలాంటి మీ దేశంలో కూడా ఫలితాన్ని చూడక ముందే కారణాన్ని ఎవరూ చూడలేరు. ఉదాహరణకి టెలిగ్రాం పంపక ముందే మీకు అందడం ఎప్పుడైనా జరిగిందా? సీసా మూత తియ్యక ముందే అందులోని పానీయాన్ని తాగేయడం సాధ్యమా? అయితే ఒక్కటి మాత్రం జరిగి ఉండొచ్చు. కదిలే రైల్లోంచి చూడడం వల్ల కారణానికి, ఫలితానికి మధ్య వ్యవధి మరింత ఎక్కువై ఉండొచ్చు. స్టేషన్ మాస్టర్ కింద పడడం కనిపించగానే రైలు దిగేశాం కనుక, తూటా ఎప్పుడు పేలిందో మాకు తెలీదు. పోలీస్ డిపార్ట్ మేంట్ లో సిబ్బందికి వాళ్లకి లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలనే అనుసరించాలని ఓ నియమం ఉంటుంది. ఒకసారి ఆ ఆదేశాలని మళ్లీ చూడండి. అందులోనే మీకు ఏవైనా క్లూ దొరుకతుందేమో?”
(సశేషం...)
0 comments