కనుక వేదిక మీద ఉన్న భౌతిక పరిస్థితులకి, వేదిక బయట ఉన్న పరిస్థితులకి మధ్య తేడా ఏంటని ఆలోచిస్తే, వేదిక మీద కేంద్రం నుండి దూరంగా నెట్టి వేస్తూ, పరిధి వైపుగా ఆకర్షిస్తూ ఏదో బలం పనిచేస్తోందని అర్థమవుతుంది. వేదిక మీద కనిపించే విచిత్రమైన ఫలితాలన్నిటికీ ఆ బలమే కారణం అని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.
కాని ఆలోచిస్తే ఇది నిజంగా ఏదో కొత్త బలం అని అనుకోవాలా? అలాంటి బలం వేదిక బయట, నిశ్చలంగా ఉన్న నేల మీద ఉండదనా? గురుత్వం అనే బలం వల్ల భూమి కేంద్రం దిక్కుగా భూమి మీద ఉన్న వస్తువులన్నీ ఆకర్షింపబడతాయని మనకి తెలిసిందే. అయితే వేదిక విషయంలో వేదిక పరిధి దిక్కుగా ఆ ఆకర్షణ పని చేస్తోంది, భూమి విషయంలో భూమి కేంద్రం దిక్కుగా ఆ ఆకర్షణ పని చేస్తోంది – అంతే తేడా. రెండు సందర్భాల్లోను బల క్షేత్రం యొక్క విస్తరణలో తేడా ఉందంతే. బలం యొక్క లక్షణంలో కాదు. సమవేగంతో సాగని చలనం వల్ల గురుత్వ క్షేత్రాన్ని పోలిన ఓ “కొత్త బలం” పుట్టుకొస్తుందని చెప్పడానికి మరో ఉదాహరణ ఇవ్వొచ్చు.
తారాంతర యాత్రల కోసం రూపొందించిన ఓ అధునాతన వ్యోమనౌక అంతరిక్షంలో ఎక్కడో ఒంటరిగా, దరిదాపుల్లో తారలు లేని శూన్య ప్రాంతంలో ఉందని అనుకుందాం. చుట్టు పక్కల పెద్ద వస్తువులేమీ లేవు కనుక ఆ నౌకలో గురుత్వమే తెలియదు. నౌకలో ఉన్న వస్తువులు, సిబ్బంది, పరిశీలకులు అంతా అలా శూన్యంలో తేలిపోతూ ఉంటారు. అసలు వాళ్ల బరువు వాళ్లకే తెలీదు! ఇలాంటి పరిస్థితినే ప్రఖ్యాత కాల్పనిక విజ్ఞాన రచయిత జూల్స్ వెర్న్ తన ’చంద్రయానం’ పుస్తకంలో వర్ణిస్తాడు.
ఇప్పుడు ఉన్నట్టుండి వ్యోమనౌక ఇంజెన్లని ’ఆన్’ చేశాం అనుకుందాం. రాకెట్ కదలడం మొదలెడుతుంది. క్రమంగా వేగం పుంజుకుంటుంది. అప్పుడు నౌకలోని వస్తువులన్నీ నౌక కదులుతున్న దిశకి వ్యతిరేక దిశలో కదలడం మొదలెడతాయి. మరోలా చెప్పాలంటే నౌకలోని నేల పైకి, అంటే ఆ వస్తువుల దిక్కుగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటి నౌకలో నేల మీద నించున్న ఒక పరిశీలకుడు, తన చేతిలో ఓ ఆపిల్ పండుని పట్టుకుని, ఉన్నట్టుండి ఆ పండుని వదిలేశాడని అనుకుందాం. నౌక సమవేగంతో కదులుతున్నట్లయితే, పండు కూడా నౌకతో బాటు కదులుతూ ఉంటుంది. కాని నౌక త్వరణం చెందుతోంది కనుక, దాని వేగం పెరుగుతూ ఉంది కనుక, పండు నేల దిక్కుగా కదలడం కనిపిస్తుంది. దీన్నే నౌక పరంగా వర్ణించాలంటే, నౌక యొక్క నేల వేగం పెరిగి పెరిగి ఒక దశలో పండుని చేరుకుని దాన్ని ఢీ కొంటుంది. అలా నేలని ఢీ కొన్న (లేదా నేల చేత ఢీ కొట్టబడని) ఆపిల్ పండు, ఒకటి రెండు సార్లు వెనక్కి తుళ్లినా, కాసేపయ్యాక నేలకి అదమబడి, నేల మీదే “నిశ్చలంగా” ఉండిపోతుంది.
ఈ తంతంతా చూస్తున్న పరిశీలకుడి దృష్టిలో ఆపిల్ కేవలం “కింద పడిపోయింది” అంతే. ఆపిల్ కి బదులుగా వివిధ వస్తువులని చేతిలోంచి వొదిలేసి చూసుకుంటాడు పరిశీలకుడు. అన్ని వస్తువులూ ఒకే త్వరణంతో నౌక యొక్క నేల దిశగా “పడుతున్నాయని” అర్థం చేసుకుంటాడు. వస్తువు బరువు ఎక్కువైనా, తక్కువైనా దాని త్వరణం మాత్రం ఒకలాగే ఉంటుంది. అది చూసిన పరిశీలకుడికి వెనకటికి గెలీలియో గెలీలీ చేసిన ప్రయోగం గుర్తొస్తుంది. (గెలీలియోకి పూర్వం అరిస్టాటిల్ చేసిన బోధల ప్రభావం వల్ల బరువైన వస్తువులు వేగంగాను, తేలికైన వస్తువులు నెమ్మదిగా పడతాయని అనుకునేవారు. కాని అలాంటి తేడాలు కేవలం గాలి ప్రభావం వల్లనే వస్తున్నాయని, గాలి లేకపోతే అన్ని వస్తువులూ ఒకే వేగంతో, లేదా త్వరణంతో పడతాయని గెలీలియో ఓ ప్రయోగం చేసి నిరూపిస్తాడు – అనువాదకుడు).
(సశేషం...)
0 comments