తమిళనాడు లోని ఈరోడ్ నగరంలో 1887 లో జన్మించాడు రామానుజన్. తన తండ్రి ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. ఆయన చాలీచాలని జీతంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది.
పదో ఏటి నుంచే రామానుజన్ లోని ప్రత్యేకతని ఇరుగు పొరుగు వాళ్లు గుర్తించారు. పెద్ద పెద్ద లెక్కలని కూడా కాగితం, పెన్సిలు వాడకుండా మనసులోనే చెయ్యగల అసామాన్య నైపుణ్యం ఉండేది. ఇంచు మించు ఆ వయసులోనే ప్రఖ్యాత ఆయిలర్ సూత్రాన్ని (exp(ix) = cos(x) + i sin(x) ) రామానుజన్ ఎవరి సహాయమూ లేకుండా స్వయంగా కనుక్కున్నాడు.
చాలా మంది శాస్త్రవేత్తల జివితాల్లో చిన్న తనంలో వారి మీద బలమైన ముద్ర వేసిన ఏదో సంఘటన జరగడము, దాంతో వారి జీవితం ఓ మలుపు తిరగడం చూస్తూ ఉంటాం. ఐనిస్టయిన్ విషయంలో చిన్నప్పుడు తన మామయ్య ఇచ్చిన ఓ దిక్సూచి (compass) తన మనసు మీద బలమైన ముద్ర వేసిందట. దుక్సూచి లోని ముల్లు ఎప్పుడూ ఉత్తర, దక్షిణాలనే చూపించడం చూసి, అలా ఎలా జరుగుతుంది? అని అడిగాడట చిన్నవాడైన ఐనిస్టయిన్. అందుకు సమాధానంగా, భూమి చుట్టూ కంటికి కనిపించకుండా ఓ అయస్కాంత క్షేత్రం ఉంటుందని, ఆ క్షేత్రమే దిక్సూచిని కదిలిస్తోందని తన మామయ్య చెప్పగా, ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయాడట. కంటికి కనిపించని శక్తి అలా వస్తువులని ఎలా కదిలించడం ఆ పిల్లవాడిలో చెప్పలేని సంభ్రమాన్ని కలిగించింది.
మహా గణితవేత్త రీమన్ (Riemann) జీవితంలో కూడా ఇలాంటి కథే ఒకటి ఉంది. రీమన్ కి పదహారేళ్ల వయసులో గణితవేత్త లజాంద్రె (Legendre) ’సంఖ్యా శాస్త్రం’ మీద రాసిన పుస్తకాన్ని తమ కాలేజి ప్రిన్సిపాలు చదవమని తెచ్చి ఇచ్చాట్ట. ఆ 900 పేజీల పుస్తకాన్ని ఆరు రోజుల్లో చదివాడట ఆ కుర్రవాడు.
రామానుజన్ జీవితంలో అలాంటి సంఘటన 1903 లో జరిగింది. జార్జ్ కార్ అనే వ్యక్తి రాసిన ఓ అవిశేషమైన గణిత పుస్తకం (A Synopsis of Elementary Results in Pure and Applied Mathematics) రామానుజన్ కి ఆధునిక గణితానికి మొట్టమొదటి పరిచయ గ్రంథం అయ్యింది. అంత వరకు బడి చదువుల్లో తిప్పలు పడుతూ, కాలేజిలో చేరడానికి ప్రవేశ పరీక్షల్లో డింకీలు కొట్టిన రామానుజన్, ఈ పుస్తకాన్ని సునాయాసంగా అవపోసన పట్టాడు. అక్కడితో ఆగక పుస్తకంలో లేని కొత్త సుత్రాలని కనిపెట్టసాగాడు. జార్జ్ కార్ పుస్తకం రామానుజన్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిందో వర్ణిస్తూ రామానుజన్ సోదరి ఇలా అంటుంది: “తనలోని మేధావిని తట్టి లేపింది ఈ పుస్తకం. ముందుగా అందులో ఇవ్వబడ్డ సిద్ధాంతాలని నిరూపించడానికి ఉపక్రమించాడు. ఈ ప్రయత్నంలో తనకి ఇతర పుస్తకాల ఆసరా లేదు కనుక ఒక్కొక్క సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఎంతో లోతైన పరిశోధన చేసేవాడు... నమక్కళ్ దేవత తనకి కలలో కనిపించి పరిష్కారాలు చెప్పేదనేవాడు.”
తన అసమాన ప్రతిభాపాటవాలు రామానుజన్ కి హై స్కూలు స్థాయిలో ప్రత్యేక పారితోషకాన్ని తెచ్చిపెట్టాయి. బడిలో రోజూవారి క్లాసులు తనకి రుచించేవి కాదు. తన ధ్యాస అంతా తన మనోవేదిక మీద నాట్యాలాడే అంకెల ఆటవెలదుల మీదే ఉండేది. దాంతో హైస్కూలు పరీక్షల్లో తప్పాడు. పారితోషకం రద్దయ్యింది. ఆ పరిణామానికి తట్టుకోలేక ఇంటి నుండి పారిపోయాడు రామానుజన్. ఇంట్లో వాళ్ల ప్రోత్సాహం మీదట మళ్లీ తిరిగొచ్చి, బళ్లో చేరాడు. ఈ సారి సుస్తీ చేసి మళ్లీ పరీక్ష తప్పాడు.
కొందరు శ్రేయోభిలాషుల అండదండలతో రామానుజన్ మద్రాసులోని పోర్ట్ ట్రస్ట్ లో ఓ చిన్నపాటి గుమాస్తా ఉద్యోగం సంపాదించాడు. తెలివితేటలతో బొత్తిగా పని లేని ఓ సాధారణమైన ఉద్యోగం అది. జీతం కూడా తక్కువే. ఐనిస్టయిన్ కి స్విస్ పేటెంట్ ఆఫీసులో దొరికిన గుమాస్తా ఉద్యోగం లాంటిదే ఇదీను. జీతం తక్కువైనా ఈ ఉద్యోగం వల్ల తనకి అత్యంత ప్రియమైన గణితంలో మునిగిపోవడానికి బోలెడంత తీరిక దొరికేది. తన “కలల”ని సాకారం చేసుకోవడానికి వీలు దొరికేది.
ఈ దశలోనే రామానుజన్ తను కొత్తగా కనుక్కొన్న కొన్ని గణిత ఫలితాలని ముగ్గురు ప్రఖ్యాత బ్రిటిష్ గణితవేత్తలకి పంపాడు. పెద్దగా చదువుకోని ఎవరో అనామక భారతీయ గుమాస్తా రాసిన ఆ ఉత్తరాన్ని, వారిలో ఇద్దరు గణితవేత్తలు చూసీచూడకుండానే చెత్త బుట్టలో పారేశారు. మూడవ గణితవేత్త మాత్రం ఆ పొరబాటు చెయ్యలేదు.
(సశేషం...)
నాకు నచ్చిన భారతీయ శాస్త్రవేత్తలలో రామానుజన్ ముందుంటారు(ఎందుకో తెలీదు), మాకు పదో తరగతిలో అనుకుంటా గణిత శాస్త్రం ముఖచిత్రం ఇతని చిత్రం ఉండి, లోపలి పేజీలో క్లుప్తంగా జీవిత విషేశాలు ప్రచురించినట్టు గుర్తు మళ్ళీ ఇన్ని రోజులకు మీ బ్లాగులో నెమరు వేసుకోవడం అనందంగా ఉంది
chala bhagumdy
Bhaaratadesam lo cheooukodagga saastravettalu chalamandi unnaru. kaani mana chaduvulu, prabhutvav vaarini gurtinchakunda eppudu vere desam vaallani pogudu thundi. ikanaina mana desa gouravaanni nilapadadaam.
Bhaaratadesam lo cheooukodagga saastravettalu chalamandi unnaru. kaani mana chaduvulu, prabhutvav vaarini gurtinchakunda eppudu vere desam vaallani pogudu thundi. ikanaina mana desa gouravaanni nilapadadaam.