ఎన్నో జంతువుల్లో ఎంతో తెలివితో కూడిన ప్రవర్తన చూస్తుంటాం. సంక్లిష్టమైన వ్యూహాన్ని పన్ని సమిష్టిగా వేటాడే తోడేళ్ళ గురించి విన్నాం. భాషా జ్ఞానం ఉందా అని సందేహం కలిగించే డాల్ఫిన్ ల గురించి విన్నాం. ఇక మనిషికి ప్రాణస్నేహితుడైన కుక్కల శక్తి సామర్థ్యాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ జీవాలన్నీ పరిణామ సోపానంలో కాస్త ఉన్నత స్థాయిలో ఉన్న జివాలు. తెలివితేటలు అనేవి నాడీమండలం యొక్క ప్రభావం వల్ల కలుగుతాయి. కనుక అంతో ఇంతో పరిపాకం గల నాడీమండలం గల జంతువుల్లోనే తెలివితో కూడుకున్న ప్రవర్తన సాధ్యం.
పరిణామ క్రమంలో అకశేరుకాలు (వెన్నెముక లేని జీవాలు, invertebrates) సకశేరుకాల (వెన్నెముక గలవి, vertebrates) కన్నా ముందు వచ్చాయి. సకశేరుకాల నాడీమండలంలో మనలో లాగానే మెదడు, వెన్నుపాము ఉంటాయి. కాని అకశేరుకాలలో ప్రత్యేకమైన మెదడు, వెన్నుపాము ఉండవు. Ganglia అనబడే నాడీ కణాల రాశులు మాత్రమే ఉంటాయి. ఈ గాంగ్లియా ని కలుపుతూ ఒక నాడీ జాలం ఉంటుంది. అందుకే అకశేరుకాల ప్రవర్తనలో అంత విశేషం ఏమీ ఉండదు.... అని మామూలుగా అనుకున్నా, కొన్ని సందర్భలలో అలాంటి అవగాహన తప్పనిపిస్తుంది. ముఖ్యంగా ఆక్టోపస్ లాంటి జీవాన్ని తీసుకుంటే అది అకశేరుక లోకపు మహామేధావి అని అనుకోవచ్చేమో!
ఆక్టోపస్ లు ఎక్కువగా సముద్రాలలోను, ముఖ్యంగా coral reefs లో ఉంటాయి. కొన్ని సార్లు మంచి నీటి సరస్సులలో కూడా కనిపిస్తాయి. తొండాల్లాంటి ఎనిమిని బలమైన చేతులతో (tentacles) ఇవి సొరచేపలని కూడా ఉక్కిరిబిక్కిరి చెయ్యగలవు. ప్లెక్సీ గ్లాస్ ని కూడా పుటుక్కున విరవగలవు. “ఎముకే లేని చేతుల్లో” అంత బలం ఎలా ఉంటుంది అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కారణం చేతనే ఆక్టోపస్ తొండాలు ఇంజినీర్ల దృష్టిని ఆకట్టుకున్నాయి. ఎముకల్లేని ఆ తొండాలు సులభంగా మెలికలు తిరగగలవు. నిండుగా కండలతో కూడుకున్న ఆ తొండాలు శత్రువుని పిండిపిప్పి చెయ్యగలవు. కనుక ఆక్టోపస్ చేతులు రోబోల చేతుల నిర్మాణానికి స్ఫూర్తి నిచ్చాయి. ఆ తీరులో నిర్మితమైన రోబోటిక్ చేతులు శస్త్రచికిత్స లాంటి సునిశితమైన కౌశలం అవసరమైన క్రియలు చెయ్యగలవని రోబో ఇంజినీర్లు ఆశిస్తున్నారు.
ఆక్టోపస్ చేతుల మీద చిన్న చిన్న దొన్నెల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఏదైనా ఉపరితలం మీద అదిమినప్పుడు వాటిలో ఉండే గాలి బయటికి పోయి వాటిలో కాస్త పాక్షిక శూన్యం (partial vaccuum) ఏర్పడుతుంది. ఆ విధంగా ఆ దొన్నెలని ఆసరాగా చేసుకుని ఆక్టోపస్ నునుపైన తలాల మీద కూడా సులభంగా పాకగలదు.
ఆక్టోపస్ లో ఇంజినీర్లకి నచ్చిన మరో అంశం కూడా ఉంది. అవి ఆక్టోపస్ కళ్లు, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఆ కళ్లలోని కటకం (lens). ఆ కటకాన్ని చూసి ఇంజినీర్లు మరింత మెరుగైన కెమేరా కటకాలని తయారుచెయ్యగలిగారు. కెమేరాల్లో వాడే కటకంలో అంచు వద్ద కాంతి మరీ ఎక్కువగా వంగుతుంది. అందుచేత ఏర్పడే చిత్రం అంచుల వద్ద కాస్త అలుక్కుపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా ఆక్టోపస్ కంటి కటకం పొరలు పొరలుగా నిర్మితమై ఉంటుంది. ఒక్కొక్క పొరలో వక్రీభవన గుణకం (refractive index) ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలాంటి కటకం వల్ల ఏర్పడ్డ చిత్రం మరింత స్పష్టంగా, నిశితమైన అంచులు కలిగి ఉంటుంది.
ఆక్టోపస్ శరీరంలోని ఈ ప్రత్యేకమైన హంగులని పక్కన పెట్టి దాని తెలివితేటల విషయానికి వద్దాం. ’ఇది చదరం’, ’ఇది వృత్తం’ అంటూ చిన్న చిన్న ఆకృతులని గుర్తుపట్టే కిండర్ గార్టెన్ పిల్లల్లా ఆక్టోపస్ కూడా చిన్న చిన్న రూపాలని గుర్తుపట్టగలదని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. వేటాడడం లాంటి ప్రాథమిక క్రియలు ఏకకణ జీవులు కూడా ప్రదర్శిస్తాయి గాని, ఆటాడడం అనేది కాస్త ఉన్నత స్థాయికి చెందిన జీవాలకే సాధ్యమని మనం భావిస్తాం. పిల్లి కూనలు దారపు బంతితో ఆడుకోవడం చూస్తాము. అదేదో ప్రత్యేక లౌకిక ప్రయోజనం కోసం చేస్తున్న పని కాదు. అది కేవలం ఓ ఆట! అలా ఆటలేడే ప్రవృత్తి ఆక్టోపస్ లలో కూడా చూశారు. ఉదాహరణకి వలయంలా గిర్రున తిరిగే నీటి ప్రవాహంలో ఓ బంతినో, ప్లాస్టిక్ సీసానో పడేసి దాన్ని పదే పదే పట్టుకుంటూ వినోదించే ఆక్టోపస్ లని అధ్యయనాలలో గమనించారు.
(సశేషం...)
బాగుంది.