ఆ రోజు సాయంత్రం సుబ్బారావు భోజనం చేద్దామని తను ఉంటున్న హోటల్ లో రెస్టారెంట్ కి వెళ్లాడు. అక్కడ తనకి ప్రొఫెసరు, అతడి గారాల పట్టి దర్శనం ఇచ్చారు. ముగ్గురూ ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు. గురుత్వం, కాలాయతనం, చతుర్మితీయ విశ్వం అంటూ ఏదో విచిత్రమైన సొద పెడుతున్నాడు ప్రొఫెసరు. మధ్య మధ్యలో గొంతు తడుపుకునేందుకు ఆయన గ్లాసు అందుకున్నప్పుడల్లా, కూతురు తన పెయింటింగుల గురించి మరేదో ’చిత్ర’ మైన రొద పెడుతోంది. అలా కని విని ఎరుగని రీతిలో తండ్రి కూతుళ్లిద్దరూ చేసిన ఘోషణ విని విని అలసిపోయిన సుబ్బారావు నెమ్మదిగా కాళ్లీడ్చుకుంటూ తన గదికి వచ్చేసరికి అర్థరాత్రి అయ్యింది. ఇక బట్టలు కూడా మార్చుకోకుండా మొద్దుగా మంచం మీద పడి నిద్దరోయాడు.
కలగాపులగంగా కలలు వస్తున్నాయి. త్యాగయ్య గారు తుపాకి పట్టుకుని డిష్షుం డిష్షుమ్మని గాల్లోకి పేలుస్తుంటే, వడగళ్లలా వర్షిస్తున్న తూటాలని జనరల్ కారియప్ప ఏరుకుంటున్నాడట. అంతలో లాల్ బహదూర్ శాస్త్రి మోటుగా ఓ తూటా లాక్కుని దాన్ని ఠక్కున మట్టిలో నాటాడట. అది ఇట్టే మొలకెత్తి, పచ్చని పొదగా మారగా, అందులోంచి మధుబాల లాంటి విరిబాల పుట్టి క్షణంలో నేల రాలిందట! అది చూసిన కరుణశ్రీ బోరుమని ఏడ్చి బోలెడు పద్యాలు రాశాట్ట. అజీర్తి చేసుంటుంది. లేకుంటే ఇంత మంది కిర్తిశేషులు కట్టకట్టుకుని ఇలా...? ఈ సినిమా ఇలాగే సాగితే పిచ్చెక్కుతుందని కళ్లు తెరిచేశాడు సుబ్బారావు.
కింద తడిమి చూసుకుంటే తన మంచం ఏంటో కొత్తగా అనిపించింది. తను ఇంతకు ముందు తూలి పడ్డ హంసతూలికా తల్పం కాదది. గట్టిగా రాయిలా ఉంది. రాయిలా ఏం ఖర్మ! నిజంగా రాయే. వ్యాసం ఓ ముప్పై అడుగులు ఉంటుందేమో. ఏ ఆసరా లేకుండా అంతరిక్షంలో తేల్తోంది. ఆ రాయి మీద అక్కడక్కడ నాచు పట్టి ఉంది. అక్కడక్కడ రాతిలో చీలికల్లోంచి చిన్న చిన్న మొక్కలు పొడుచుకు వస్తున్నాయి. రాతి చుట్టూ ఉన్న గాల్లో బాగా దుమ్ము ఉంది. థార్ ఎడారిలోని దుమారాలలో కూడా ఇంత దుమ్ము ఎప్పుడూ చూళ్లేదు సుబ్బారావు. ఏదో మసక వెలుతురులో రాతి మీద అంశాలు అవిస్పష్టంగా కనిపిస్తున్నాయి. పది అడుగులు మించి ఏమీ కనిపించడం లేదు. చుట్టు పక్కల అప్పుడప్పుడు దబ్ దబ్ మన్న చప్పుడుతో పై నుండి రాళ్లు కాబోలు కింద పడుతున్నాయి. ఇవి కాక అల్లంత దూరంలో తన కన్నా కాస్త పెద్ద రాళ్లు గాల్లో తేల్తూ కనిపించాయి. పరిస్థితి క్లిష్టంగా ఉందని అర్థం చేసుకోడానికి తనకి ఎంతో సేపు పట్టలేదు.
తను అంతవరకు నించోడానికి తిప్పలు పడ్తున్న రాతి మీద నుండి జారి పడితే కింద అగాధం ఎంత దూరంలో ఉందో తెలీదు. చూసొస్తే పోయిందేవుందని మెల్లగా పాక్కుంటూ రాతి అంచు వరకు వెళ్లి తొంగి చూశాడు. పడతాననుకున్నాడు గాని ఎందుచేతనో ససేమిరా పళ్లేదు. రాయి “కిందకి” వెళ్లినా రాయికి బల్లిలా అంటిపెట్టుకునే ఉన్నాడు. అలా డేక్కుంటూ రాయి చుట్టూ ఓ పావు వంతు ప్రదక్షిణ చేశాడు. అదేం చిత్రమో గాని ఎక్కడా ఆ రాతిని మోస్తూ స్తంభాలు గాని, మరే విధమైన ఆధారం గాని కనిపించలేదు. అంతలో ఆ మసక మసక కాంతిలో ఓ సుపరిచితుడు కనిపించాడు.
“ప్రపంచం ఎంత చిన్నది!” అని మనసులోనే అనుకున్నాడు సుబ్బారావు.
(సశేషం...)
0 comments