ఆ వచ్చినవాడు ఎవరో కాదు, తన చిరకాల మిత్రుడు – ప్రొఫెసరు! నిలువెత్తు మనిషి, ఎదురుగా నించుని, తల వంచుకుని, తన పాకెట్ బుక్ లో ఏదో నోట్సు రాసుకుంటున్నాడు.
సుబ్బారావు మనసులో మెల్లగా మబ్బులు విడసాగాయి. సూర్యుడి చుట్టూ ఉన్న అంతరిక్షంలో సంచరించే ఓ పెద్ద రాయి భూమి అని చిన్నప్పుడు చదువుకున్నట్టు గుర్తొచ్చింది. భూమికి ఇరుపక్కల రెండు ధృవాలు ఉన్నట్టు బొమ్మల్లో చూసిన జ్ఞాపకం. ఇప్పుడు తను ఉన్న రాయి కూడా భూమి లాంటిదే, కాని అంత కన్నా చాలా చిన్నది. అయితే తను ఉంటున్న ఈ చిన్నారి భూమి మీద జనాభా ఇద్దరే – తను, ఓ చాదస్తపు ప్రొఫెసరు! హమ్మయ్య! ఇక భయం లేదు. జారి పడిపోయే ప్రమాదం లేదు.
“గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ గారు!” ప్రొఫెసర్ కి ధ్యానభంగం చేస్తూ పలకరించాడు సుబ్బారావు.
“ఇక్కడ మార్నింగ్ లు లేవు తమ్ముడూ,” తల పైకెత్తి ఉదాసీనంగా అన్నాడు ప్రొఫెసర్. “ఎందుకంటే ఇక్కడ సూర్యుడు లేడు. ఒక్క తారక కూడా లేదు. నా అదృష్టం బావుండి ఇక్కడ రాతి మీద ఏవో రసాయన చర్యలు జరగడం వల్ల కాలాయతనపు వ్యాకోచాన్ని గమనించడానికి వీలవుతోంది,” అంటూ తిరిగి తన పుస్తక రచనలో పడ్డాడు.
సుబ్బారావు తను ఉన్న పరిస్థితి బొత్తిగా నచ్చలేదు. తను ఉంటున్న ప్రపంచంలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు! ఆ ఇద్దర్లో ఒకరికి పుస్తకాలు తప్ప మనుషులు పడరు! అంతలో ఓ రాలే ఉల్క తన బాధ అర్థం చేసుకుని సాయం చేసింది. ఎక్కణ్ణుంచి వచ్చిందో ఏమో ఓ ఉల్క శరంలా దూసుకొస్తూ ప్రొఫెసర్ చేతిలో ఉన్న పుస్తకాన్ని ఎగరగొట్టింది. ఆ పుస్తకం లిప్తలో పలాయన వేగాన్ని చేరుకుని తమ చిన్నారి లోకం నుండి దూరమయ్యింది.
“అయ్యో! పుస్తకం పోయిందే! మరి రాదా?” జాలి ఒలకబోస్తూ అన్నాడు సుబ్బారావు. కాస్త కసిగా.
“ఎందుకు రాదు?” చిరునవ్వు నవ్వుతూ అన్నాడు ప్రొఫెసర్. “కుక్కపిల్లలా తిరిగొస్తుంది. విషయం ఏంటంటే ప్రస్తుతం మనం ఉంటున్న విశ్వం అనంత విశ్వం కాదు. చిన్నప్పుడు మీరు బళ్లో చదువుకుని ఉంటారు. విశ్వం అనంతంగా ఉంటుందని, సమాంతర రేఖలు ఎప్పటికీ కలవవని. కాని అది తక్కిన మానవాళి జీవిస్తున్న విశ్వం విషయంలో ఎలాగైతే నిజం కాదో, మనం ఉన్న ఈ కాస్త చిన్న సైజు విశ్వంలో కూడా నిజం కాదు. ఆ విశ్వం నిజంగానే చాలా పెద్దది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దాని పరిమాణం – 10,000,000,000,000,000,000,000 మైళ్లు. మన లాంటి మానవమాత్రుల దృష్టిలో అది నిజంగా అనంతం అనే అనుకోవాలి. అలాంటి విశ్వంలో నా పుస్తకం కొట్టుకుపోయింది అంటే అది తిరిగి రావడానికి చాలా చాలా కాలం పడుతుంది. కాని ఇక్కడ పరిస్థితి కొంచెం భిన్నం. ఇందాక ఆ రాయి నా చేతిలోని పుస్తకాన్ని ఎగరగొట్టక ముందే మన ఈ చిన్న విశ్వం యొక్క వ్యాసం ఐదు మైళ్లని అంచనా వేశాను. పైగా ఇది కూడా వేగంగా వ్యాకోచిస్తోంది. కనుక అరగంట తిరిగేలో పుస్తకం వచ్చి నా చేతిలో వాల్తుంది. చూస్తుండు.”
“అంటే...” విషయాన్ని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా అడిగాడు సుబ్బారావు, ” ఆస్ట్ర్రేలియా ఆదివాసులు వాడే బూమెరాంగ్ లా మీ పుస్తకం, ముందుకు పోతున్నదల్లా, ఠకున వెనక్కి తిరిగి మళ్లీ మీ వద్దకి వస్తుంది అంటారా?”
“అయ్యో! ఇది అలా కాదు,” లెక్చరు ఫక్కీలో చెప్పుకొచ్చాడు ప్రొఫెసర్. “ఇక్కడ నిజంగా ఏం జరుగుతోందో అర్థం కావాలంటే భూమి గుండ్రంగా ఉందని తెలీని ఓ ప్రాచీన గ్రీకు పౌరుణ్ణి ఊహించుకుందాం. నేరుగా ఉత్తర దిశలో ముందుకు సాగమని అతగాడు మరొకడికి ఆదేశం ఇచ్చాడు అనుకుందాం. ఆ అవతలి వ్యక్తి అలాగే బయలుదేరి కొంత కాలం తరువాత దక్షిణం వైపు నుండి అదే స్థలానికి చేరుకోవడం చూసి మన గ్రీకు వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ప్రాచీన గ్రీకులకి భూమి గుండ్రంగా ఉందని తెలీదు. భూమి చుట్టూ ప్రదక్షిణ చెయ్యడం అంటే ఏంటో వాళ్లకి తెలీదు. కనుక బయలుదేరిన చోటికి తిరిగి వచ్చిన వ్యక్తిని చూసి దారి తప్పిన బాటసారేమో అనుకుంటాడు. కాని ఈ బాటసారి దారి తప్పలేదు. సూటిగా కనిష్ట దూరం గల మార్గాన ముందు సాగాడు. వ్యతిరేక దిశలో మొదటికి వచ్చాదు. కనుక నా పుస్తకానికి కూడ అదే జరుగుతుంది. మార్గ మధ్యంలో మళ్లీ ఏ రాయో దాన్ని తాపు తన్నకపోతే తప్ప. ఇదుగో ఈ బైనోక్యులర్స్ లో చూడు, ఎక్కడైనా కనిపిస్తోందేమో.”
సుబ్బారావు అలాగే బైనోక్యులర్స్ లోంచి చూశాడు. చుట్టూ బాగా దుమ్ముగా ఉండడం వల్ల దృశ్యం స్పష్టంగా లేదు. కాని జాగ్రత్తగా చూస్తే అల్లంత దూరంలో ప్రొఫెసర్ నోట్ బుక్ కనిపించింది. కాని కనిపించిన ప్రతీ వస్తువు చుట్టూ ఓ గులాబిరంగు కాంతి కనిపించడం అతడి ఆశ్చర్యం కలిగించింది. దూరం నుండి తన వైపుగా కొట్టుకొస్తున్న పుస్తకానికి కూడా అలాంటి కాంతి ఉంది.
“కనిపించింది!” ఉత్సాహంగా అరిచాడు సుబ్బారావు. “మీ పుస్తకం కనిపించింది. కాని అదేంటి? దగ్గర అవుతున్న కొద్ది అలా అమాంతంగా పెరిగిపోతోందేం?”
(సశేషం...)
0 comments