“సరిగ్గా చెప్పారు,” అన్నాడు ప్రొఫెసర్. “ఇన్నాళ్లకి నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారు. మనం ఉంటున్న ఈ విశాల విశ్వం యొక్క వక్రత ధనమా, ఋణమా తెలుసుకోవాలంటే వివిధ దూరాలలో ఉన్న వస్తువులని లెక్కిస్తే చాలు. మన నుండి కొన్ని వేల మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో కూడా గెలాక్సీలు, నెబ్యులాలు విస్తరించి ఉన్నాయి. వాటి విస్తరణ (distribution) ని పరిశీలిస్తే మన విశ్వం యొక్క వక్రత ఎలాంటిదో తెలిసిపోతుంది.”
“మరైతే విశ్వానికి ధన వక్రత ఉన్నట్లయితే, అది దానిలోకి అది ఓ బంతిలా ముడుచుకుని, పరిమితమైన వ్యాప్తి గలిగి ఉంటుంది అనుకోవాలా?”
“ఓహ్! అదా? చాలా చక్కని ప్రశ్న,” మెచ్చుకుంటూ అన్నాడు ప్రొఫెసర్. విశ్వవిజ్ఞానం (cosmology) మీద ఐనిస్టయిన్ రాసిన ప్రప్రథమ పత్రాలలో విశ్వం బంతిలా ముడుచుకుని, పరిమితమైన పరిమాణం గలిగి, నిశ్చలంగా ఉంటుందని ప్రతిపాదించాడు. తదనంతరం రష్యన్ గణితవేత్త ఎ.ఎ. ఫ్రీడ్మాన్ నిరవధికంగా సంకోచించే విశ్వం, లేదా నిరవధికంగా వ్యాకోచించే విశ్వం ఉండే అవకాశం ఐనిస్టయిన్ సమీకరణాలలోనే దాగి వుందని గణితపరంగా నిరూపించాడు. ఈ గణిత సిద్ధాంతాన్ని నిర్ధారిస్తూ అమెరికన్ ఖగోళవేత్త ఎడ్వర్డ్ హబుల్, మౌంట్ విల్సన్ వేధశాలలో తన 100-ఇంచిల దూరదర్శినితో పని చేస్తూ, గెలాక్సీలు మన నుండి దూరంగా తరలిపోతున్నాయని, అంటే మన విశ్వం వ్యాకోచిస్తోందని కనుక్కున్నాడు. అయితే ఈ వ్యాకోచం ఇలా ఎల్లప్పటికీ సాగుతుందా, లేక ఒక గరిష్ఠ స్థితిని చేరుకుని, ఏదో సుదూర భవిష్యత్తులో తిరిగి సంకోచించడం మొదలుపెడుతుందా అన్నది ఇంకా తేలని విషయం. మరింత వివరమైన ఖగోళపరిశీలనల ద్వారా ఈ విషయం నిర్ణయించబడుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.”
ప్రొఫెసర్ అలా మాట్లాడుతుండగా తమ చుట్టూ గదిలో ఏవో విచిత్రమైన మార్పులు రావడం కనిపించింది. గదిలో ఒక మూల భాగం బాగా కుంచించుకుపోతోంది. అక్కడ ఉన్న కుర్చీలు కూడా అలాగే కుంచించుకుపోతున్నాయి. ఇక అదే గదిలో మరో మూల భాగం ఎంతగా విస్తరిస్తోంది అంటే అందులో సుబ్బారావుతో పాటు, సమస్త విశ్వమూ పట్టేట్టు అనిపించింది. అంతలో సుబ్బారావుకి ఓ దారుణమైన ఆలోచన వచ్చి వొంట్లో వొణుకు పుట్టింది.
రమ్య ఎలా ఉందో? బీచిలో ఆమె, ఆమె పెయింటింగ్ లు, ఆమె పరిసరాలు అన్నీ కట్టకట్టుకుని అసలు ఈ విశ్వం నుండే వేరుపడి, మహాశూన్యంలో కలిసిపోతేనో? ఇక మళ్లీ జన్మలో తనని చూసే భాగ్యం కలుగదా? ఆ ఆలోచనకే తన కాళ్ల కింద నేల చీలిపోతున్నట్టు అనిపించింది సుబ్బారావుకి. తటాలున లేచి గదిలోంచి బయటికి పరుగెత్తబోయాడు.
“ఏయ్ సుబ్బారావ్! జాగ్రత్త! క్వాంటం స్థిరాంకం కూడా విపరీతంగా మారిపోతోంది చూసుకో,” వెనకనుండి ప్రొఫెసర్ కేక వినిపించింది.
బీచి దాకా వెళ్ళేసరికి అక్కడ బాగా రద్దీగా ఉండడం కనిపించింది. అక్కడ తనకి దర్శనమిచ్చింది ఒక రమ్య కాదు, కొన్ని వేల రమ్యలు! ఆ వేవేల రమ్యలు కోలాహలంగా అటు ఇటు పరుగెడుతున్నారు.
“ఇంత మందిలో మరి అసలు రమ్యని పట్టుకునేదెలా?” సుబ్బారావు ఆలోచనలో పడ్డాడు.
క్వాంటం అనిశ్చయత్వ సూత్రం వెర్రితలలు వేస్తోంది అన్నమాట. ఎందుచేతనో క్వాంటం స్థిరాంకం విపరీతంగా పెరిగిపోయింది.
కాసేపట్లో వాన వెలిసినట్టు క్వాంటం స్థిరాంకం మునుపటి స్థితికి వచ్చింది. అల్లంత దూరంలో, తన వేలాది ప్రతులంతా మాయం కాగా మిగిలిన ఏకైక రమ్య, పెయింటింగ్ మానేసి భయంగా దిక్కులు చూస్తూ కనిపించింది.
“అబ్బ! సుబ్బారావ్ గారూ! మీరా?” సుబ్బారావుని చూడగానే ఆ అమ్మాయి మనసు తేలికపడినట్టయ్యింది. “ఇందాక ఎందుకో ఒక్కసారి బోలెడు జనం ఉప్పెనలా మీదికి వస్తున్నట్టు అనిపించింది. కాసేపు ఊపిరాడలేదు అనుకోండి. అదేదో దృశ్య భ్రాంతి అయ్యుంటుంది. ఎండ ప్రభావం కాబోలు. ఉండండి నా గదికి వెళ్లి నా క్యాప్ తెచ్చుకుంటాను.”
“రమ్య గారూ!” మనలోంచి తన్నుకొస్తున్న బాధని ఎలా వెళ్లగక్కాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ అన్నాడు సుబ్బారావు. “చూడబోతే కాంతివేగం కూడా తగ్గిపోతున్నట్టు ఉంది. మీరు హోటల్ నుండి తిరిగి వచ్చే సరికి నేను ముసలాణ్ణి అయిపోతానేమో నండీ!”
“ఛఛ! అదేం మాట. ఊరికే లేనిపోని భయాలు పెట్టుకోకండి. హాయిగా ఇక్కడ కెరటాలు లెక్కెడుతూ కూర్చోండి. క్షణంలో వచ్చేస్తా,” అంటూ హోటల్ దిశగా పరుగెత్తింది.
కాని ఆ అమ్మాయి ఓ నాలుగు అడుగులు వేసిందో లేదో, క్వాంటం స్థిరాంకం మళ్లీ పెరిగిపోయింది. ఈ సారి రమ్య, సుబ్బారావుల సేన సముద్ర తీరం అంతా విస్తరించింది. అంతలో కాలాయతనంలో మరి ఏం మార్పు వచ్చిందో ఏమో అల్లంత దూరంలో కొండలు విచిత్రంగా వంపు తిరగడం మొదలెట్టాయి. దూరాన జాలర్ల పేటలో ఇళ్లు కూడా వింతగా కొంకర్లు పోతున్నాయి. ఏదో బ్రహ్మాండమైన గురుత్వ ప్రభావం చేత కాబోలు సూర్యుడి కిరణాలు నేలని తాకీ తాకకుండానే దారి మళ్లి ఎటో వెళ్లిపోతున్నాయి. లోకం గాఢాంధకారంలో లోతుగా కూరుకుపోయింది.
ఇంతలో తనకి సుపరిచితమైన, ప్రియమైన కంఠం వినిపించింది.
“మీకు రాళ్లతో నీటి మీద కప్పగెంతులు వేయించడం వచ్చా?” ఎప్పుడు వచ్చిందో రమ్య తన చేతిలో ఓ గవ్వ పెడుతూ అంది.
“ఇది కలయా నిజమా...” సుబ్బారావు దీర్ఘాలోచనలో పడ్డాడు.
0 comments