“చాలా సింపుల్. ఈ విషయాలన్నీ నా ఉపన్యాసాలలో వివరించాను. కదిలే వివిధ వ్యవస్థల నుండి చూస్తున్నప్పుడు గరిష్ఠ వేగం ఎప్పుడూ ఒక్కలాగే కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం ఒప్పుకుంటే...”
ప్రొఫెసర్ ఇంకా ఏదో చెప్పబోతుంటే అప్పుడే రైలు ఏదో స్టేషన్ లోకి ప్రవేశిస్తూ కనిపించింది. ఆ స్టేషన్ లో సుబ్బారావు దిగి వెళ్లిపోయాడు.
స్టేషన్ లో దిగిన సుబ్బారావు ఆ ఊళ్లోనే అద్దాల మేడ లాంటి ఓ అద్భుతమైన హోటల్ లో దిగాడు. ఆ హోటల్ సముద్రతీరం మీద ఉంది. కిటికీ తెరలు తీసి బయటికి చూస్తే అనంతమైన వినీలార్ణవం ఆహ్వానిస్తూ కనిపిస్తుంది. తెల్లారే పిల్లకెరటాలు పాడే భూపాలానికి, ఏదో స్వప్నలోకం నుండి భూతలానికి వచ్చి పడ్డాడు సుబ్బారావు. త్వరగా తయారై టిఫిన్ చెయ్యడానికి కిందనున్న రెస్టారెంట్ కి వెళ్లాడు. ఓ పొడవాటి బల్ల వద్ద కూర్చున్నాడు.
ఇంతలో తలెత్తి చూసిన సుబ్బారావు ఎదురుగా కనిపించిన దృశ్యానికి ఆశ్చర్యపోయాడు. బల్లకి అవతలి కొస వద్ద తన ప్రొఫెసర్ మిత్రుడు కూర్చుని ఉన్నాడు. మరి ఏ దివి నుంచి రాలి పడిందో ఏమో, ఆయన పక్కనే ఓ చక్కని చుక్క కూర్చుని ఉంది. ప్రొఫెసర్ అప్పుడప్పుడు తలెత్తి సుబ్బారావు కుర్చున్న వైపు చూస్తున్నాడు.
వెంటనే లేచి వెళ్లి ప్రొఫెసర్ ని పలకరించాడు.
“ఏం ప్రొఫెసర్ గారూ! గుర్తున్నానా?”
“ఓహ్ మీరా? గుర్తులేకనేం? నా ఉపన్యాసాలకి వచ్చారు కదూ?” అంటూ తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేస్తూ,
“ఇదుగో మా అమ్మాయి రమ్య. తనకి పెయింటింగ్ అంటే ఇష్టం. అందుకే ఇక్కడ సముద్ర తీరం లో స్ఫూర్తిదాయకమైన దృశ్యాలు ఉన్నాయంటే తనని తీసుకుని ఇలా వచ్చాను.”
“హలో మిస్ రమ్యా” వీలైనంత ఆప్యాయంగా పలకరించాడు సుబ్బారావు. సాపేక్షతా సిద్ధాంతం మహిమ వల్ల ఆ క్షణం తన వయసు ఎలాగైనా ఓ పదేళ్లు తగ్గిపోతే ఎంత బావుణ్ణు అన్న ఆలోచన కాంతివేగంతో తన మనో ఫలకం మీద కదిలింది. “నిజమే. ఇక్కడ ఎన్నో అందమైన దృశ్యాలు ఉన్నాయి. ఈ సముద్రం, ఈ ఇసక, ఈ చెట్లు, ఈ హోటలు – ఇవన్నీ చూస్తుంటే మీ చిత్రకళకి బోలెడన్ని అయిడియాలు వస్తాయి,” ఏదో కాస్త తెలివిగా అనాలని అన్నాడు.
“అవునవును. వేసిన బొమ్మలు మీకు కూడా చూపిస్తుంది. అవునూ! ఆ రోజు నా ఉపన్యాసంలో మీకు ఏవైనా అర్థమయ్యిందా? లేక అంతా అయోమయంగా ఉందా?” అడిగాడు ప్రొఫెసర్.
“ఓ! బాగా అర్థమయ్యింది. అర్థం కావడమే కాదు. ఆ మధ్యన ఓ చిత్రమైన ఊరికి వెళ్లాను. అక్కడ కాంతి వేగం కేవలం 10 మైళ్లు/గం. దాంతో కదిలే వస్తువులు సన్నబడడం, గడియారాలు పిచ్చి పటినట్టు నడవడం, మొదలైన వన్నీ కళ్లారా చూశాను.”
“అయ్యో! అంటే మీరు ఉపన్యాసంలో తదుపరి భాగం విన్లేదు అన్నమాట. అందులో వంపుతిరిగిన కాలాయతనాన్ని గురించి, న్యూటన్ బోధించిన గురుత్వానికి ఆ కాలాయతనపు వంపుకి మధ్య సంబంధం గురించి చెప్పుకొచ్చాను. పోనీలేండి. ఇక్కడంతా తీరికేగా. హాయిగా సముద్ర తీరంలో కూర్చుని ఇవన్నీ ముచ్చటించుకుందాం.”
“అబ్బా! నాన్నా! మళ్లీ మొదలెట్టారా? సరే మీరిద్దరూ మాట్లాడుకోండి. నేను నా పని చూసుకుంటాను,” అంటూ రమ్య అక్కణ్ణుంచి బయల్దేరింది.
ఆ అమ్మాయి వెళ్లినవైపే ఒక్క క్షణం కన్నార్పకుండా చూశాడు సుబ్బారావు.
వంపులు అంటే ప్రత్యేకమైన అయిష్టత ఏమీ లేని సుబ్బారావుకి, ఆ క్షణం మాత్రం ఈ కాలాయతనపు వంపుల గురించిన చర్చ అసంగతం గాను, అప్రస్తుతం గాను, అసందర్భంగాను తోచింది.
(సశేషం...)
కథలో నాకో అనుమానం వచ్చిందండి, ఆ ఊర్లో వేగ పరిమితి పది మైళ్ళే ఐతే మన శరీరం లోని న్యూరాన్ల వేగం కూడా అదే పరిమితికి లోబడి ఉంటుందా, ఒక వేళ అలా అయినప్పుడు మన చర్యల వేగం కూడా గణనీయంగా తగ్గిపోతుంది కదా?
చాలా చాలా చక్కని ప్రశ్న. మామూలుగా మన నాడులలో, ముఖ్యంగా మయలిన్ తొడుగు ఉన్న నాడులలో (myelinated nerves) సంకేతం ప్రసారం అయ్యే వేగం 100-120 m/s ఉంటుంది. అంటే సుమారు 360 kmph, అంటే 10 mph కన్నా చాలా ఎక్కువే. అందు వల్ల అలాంటి నాడీ మండలంలో, సుబ్బారావు ఉంటున్న ఈ ప్రత్యేక లోకంలో, కాలం యొక్క అనుభూతి కూడా భిన్నంగా ఉండాలి. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, సుబ్బారావు అనుభవం చాలా భిన్నంగా ఉంటుందేమో. కాని కచ్చితంగా ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాను. మెదడులో నాడీ కణాల చలనాలకి (neural dynamics), కాలానికి సంబంధించిన మన ఆత్మాశ్రయమైన అనుభూతి (subjective sense of time) కి మధ్య సంబంధం తెలుసుకోవాలని నాకూ కొంత ఆసక్తి ఉంది. అయితే అందులో సాపేక్ష సిద్దాంతం ప్రమేయం ఉండదు. కాని గరిష్ఠ వేగం అంత తక్కువైతే కథ పూర్తిగా మారిపోతుంది.