అంతలో అల్లంత దూరంలో బలంగా చేతులు ఊపుతూ, ఓడల కేసి పరుగెత్తుతూ వస్తున్న వెలోసో కనిపించాడు. బోలెడు మంది కోయవాళ్లు బరిశెలు పట్టుకుని తన వెంటపడుతున్నారు. ఈ వెలోసో అక్కడ గ్రామంలో ఏం మాట్లాడో? లేనిపోని శత్రుత్వం కొనితెచ్చుకున్నాడు. విషయం అర్థమైన వాస్కో ద గామా లంగర్లు పైకెత్తి ఓడలని బయల్దేరమన్నాడు. బ్రతుకు జీవుడా అంటూ నౌకాదళం ఆ కోయవారి నుండి తప్పించుని ముందుకి సాగిపోయింది.
నౌకా దళం ఎక్కడి దాకా వచ్చారో ఇంకా తెలీదు. కాని రెండు రోజుల తరువాత మరో తీరం కనిపించింది. బార్తొలోమ్యూ దియాజ్ లోగడ అందించిన సమాచారంతో పోల్చుకుని అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని తెలుసుకున్నారు. వారి ఆనందానికి హద్దుల్లేవు. బయల్దేరిన నాటి నుండి ఐదు నెలలలో, నవంబర్ 22, 1497, లో ఆఫ్రికా దక్షిణ కొమ్ముని చేరుకున్నారు. ఏ ప్రమాదమూ కలగకుండా ఒడుపుగా తమని అంతవరకు తీసుకొచ్చిన కెప్టెన్ నేతృత్వం మీద అందరికీ గురి కుదిరింది.
మరో మూడు రోజుల ప్రయాణం తరువాత మాసెల్ ఖాతం అనే ప్రాతంలో ఓడలు లంగరు దించాయి. చిన్న పడవలో వాస్కో ద గామా కొందరు నావికులతో తీరం మీదకి వెళ్లాడు. అవసరం వస్తాయేమోనని బట్టలలో తుపాకులు దాచుకున్నారు. నేల మీద కొంత ముందుకి వెళ్లగానే కొంత మంది స్థానిక కోయలు కనిపించారు. కెప్టెన్ వారికి తమ నౌకాదళం తరపున రంగురంగుల పూసల దండలు, చిరుగంటలు లాంటి వస్తువులు బహుమతులుగా ఇచ్చాడు. కోయలకి ఇలాంటి వస్తువులు ఇష్టం అని ఆ రోజుల్లో నావికులకి బాగా తెలుసు. అలాంటి చవకబారు వస్తువులు బహుకరించి స్థానిక కోయలని ఆకట్టుకోవడం వారికి పరిపాటి. అక్కడే కొన్ని రోజులు ఉండి మరింత మంది స్థానికులని కలుసుకున్నారు. వారితో కలిసి విందులు చేశారు. నాట్యాలు ఆడారు. స్థానికులతో సత్సంబంధాలు కుదిరాయన్న నమ్మకం కుదిరాక నావికులు ఇక అసలు పన్లోకి దిగారు.
నావికుల యాత్రలకి లక్ష్యాలు రెండు. మొదటిది, కొత్త ప్రాంతాల వారితో వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకుని, బంగారం, సుగంధ ద్రవ్యాలు మొదలైన అరుదైన వస్తువులని చవకగా పోర్చుగల్ కి తరలించడం. రెండవది, కొత్త ప్రాంతాలని ఆక్రమించి పోర్చుగల్ సామ్రాజ్యాన్ని విస్తరించడం. తాము పాదం మోపిన ఈ కొత్త భూమిని ఇప్పుడు పోర్చుగల్ రాజుకి అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించాలి. (మన దేశంలో ప్రాచీనకాలంలో రాజులు చేసిన రాజసూయయాగం లాంటిదే ఇదీను.) ఆ ప్రకటనలో భాగంగా ‘పద్రావ్’ అని పిలువబడే రాతి స్తంభాలని పాతారు. ఇవి గాక కొన్ని చెక్క శిలువలని కూడా పాతారు. గతంలో బార్తొలోమ్యూ దియాజ్ కూడా ఇలా ఎన్నో స్తంభాలు పాతాడు. అది చూసిన కోయలకి ఒళ్ళు మండిపోయింది. ఈ స్తంభాలు పాతే కథ వారికి పాత కథే! ఆ రాతి స్తంభాలని బద్దలు కొట్టారు. శిలువలని పీకేశారు. వాస్కో ద గామా తన సిబ్బంది తో పాటు అక్కణ్ణుంచి పలాయనం చిత్తగించాడు.
పాలే రచనలు కాకుండా మరి కొన్ని పుస్తకాలు కూడా డార్విన్ చదువుకునే రోజుల్లో అతడి మీద గాఢమైన ప్రభావం చూపాయి. వాటిలో ఒకటి అలెగ్జాండర్ హంబోల్ట్ రాసిన ‘Personal Narrative‘ (నా జీవనయాత్ర). జర్మనీకి చెందిన అలెగ్జాండర్ హంబోల్ట్ (1769 – 1859) ఓ గొప్ప ప్రకృతి శాస్త్రవేత్త, పర్యాటకుడు. హంబోల్ట్ తన జీవితంలో విస్తృతంగా పర్యటించాడు. ఆ పర్యటనలలో తన చుట్టూ ఉండే పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. భౌగోళిక విశేషాలు, చెట్లు, జంతువుల రూపురేఖలు, మనుషులు, సమాజాలు, సంస్కృతులు – ఇలా ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. అవసరమైన చోట ఎన్నో రకాల పరికరాలని కూడా తన పరిశీలనలలో వాడేవాడు. తన పరిశీలనల నుండి వైజ్ఞానిక సత్యాలని రాబట్టేవాడు. అలా తను అర్థం చేసుకున్న వైజ్ఞానిక విషయాలని గ్రంథస్థం చేసేవాడు. హంబోల్ట్ రచనలు చదివాక డార్విన్ కి కూడా అలాంటి ‘యాత్రా పరిశోధన’ పట్ల మోజు పుట్టింది.
డార్విన్ కి స్ఫూర్తి నిచ్చిన మరో పుస్తకం జాన్ హెర్షెల్ రాసిన ‘An introduction to the study of Natural Philosophy’ (ప్రకృతిగత తత్వశాస్త్ర అధ్యయనానికి పరిచయం). ఈ జాన్ హెర్షెల్ (1792 – 1871) ఇంగ్లండ్ కి చెందిన గొప్ప గణితవేత్త, ఖగోళవేత్త, రసాయనవేత్త కూడా. సాటర్న్, యురేనస్ గ్రహాలకి చెందిన ఉపగ్రహాల మీద ఇతడు ఎన్నో పరిశీలనలు చేసి వాటికి పేర్లు కూడా పెట్టాడు. తన పరిశీలనల ఆధారంగా పదివేల తారల విశేషాలని వివరిస్తూ పుస్తకం రాశాడు. అసలు వైజ్ఞానిక పరిశోధన అంటే ఎలా చెయ్యాలి అన్న విషయాన్ని తన ‘study of Natural Philosophy’ లో స్పష్టంగా వివరించాడు. పరిశోధిస్తున్న రంగంలో ముందు విస్తృతంగా పరిశీలనలు చేసి వాటి ఆధారంగా, కచ్చితమైన తర్కంతో, పరిశీలనలన్నిటినీ వివరించేలా, సిద్ధాంతాన్ని ఎలా నిర్మించాలో వివరించాడు.
అసలే ‘సేకరణ’ అంటే వల్లమాలిన ఉత్సాహం గల కుర్ర డార్విన్ ఇలాంటి పుస్తకాలన్నీ చదివి ఎలాగైనా విస్తృతంగా ప్రపంచం అంతా పర్యటించి, జీవరాశుల గురించి క్షుణ్ణంగా పరిశీలనలు చేసి, పరిణామం అనేది నిజంగా జరుగుతోందో లేదో తెలుసుకోవాలని ఆరాట పడసాగాడు. అలా పర్యటించే అవకాశం త్వరలోనే వచ్చింది. డార్విన్ కి జాన్ హెన్స్లో అనే ఓ స్నేహితుడు ఉండేవాడు. ఇతడో వృక్షశాస్త్రవేత్త. ఇద్దరూ కలిసి అడవులంట తిరుగుతూ చెట్లు, చేమలు పరిశీలించేవారు. 1831 ఆగస్టు నెలలో డార్విన్ కి హెన్స్లో నుండి ఓ ఉత్తరం వచ్చింది. ఇంగ్లండ్ మహారాణి గారి సర్వేయింగ్ ఓడలో ప్రయాణించే అవకాశాన్ని ఇస్తున్నట్టు ఆ ఉత్తరంలో హెన్స్లో రాశాడు. డార్విన్ సంతోషానికి హద్దుల్లేవు.
కాని ప్రయాణానికి నాన్నగారు ఒప్పుకుంటారో లేదోనన్న భయం ఒక పక్కపీకుతోంది. అనుకున్నట్టుగానే యాత్ర మాట చెవిన పడగానే తండ్రి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. “శ్రద్ధగా చదువుకోరా అంటే, ఈ తిరుగుళ్ళేవిట్రా?” అంటూ డార్విన్ ని దులిపేశాడు. కాని డార్విన్ మామగారైన జోసయ్యా కల్పించుకుని బావగారికి నచ్చజెప్పి డార్విన్ కి అనుమతి ఇప్పించాడు.
ఒక సమస్య తీరింది, కాని మరో సమస్య ఇంకా ఉంది. డార్విన్ ప్రయాణించాల్సిన ఓడ పేరు హెచ్. ఎం. ఎస్. బీగిల్. ఆ ఓడ కెప్టెన్ పేరు ఫిట్జ్ రాయి. ఇతగాడు బాగా చాదస్తం మనిషి. ఓడలో సిబ్బందితో నిరంకుశంగా ప్రవర్తిస్తాడు. తను చెప్పిందే వేదం. ప్రయాణంలో పాల్గొనాలంటే డార్విన్ ముందు ఇతగాణ్ణి ఒప్పించాలి. ఈ ఫిట్జ్ రాయ్ కి ఫిజియానమీ అనే ఓ శాస్త్రం అంటే నమ్మకం. ఈ శాస్త్రం ప్రకారం ముఖం యొక్క రూపురేఖల బట్టి మనిషి యొక్క మనస్తత్వాన్ని గురించి చెప్తారు. అయితే బల్లిపట్టు, హస్తసాముద్రికం లాగానే ఇది కూడా ఓ కుహనా శాస్త్రం. డార్విన్ ముక్కు ఆకారం నచ్చలేదు ఫిట్జ్ రాయ్ కి! అలాంటి ముక్కు ఉండేవాళ్లు సోమరులని అతడి నమ్మకం. కాని ముందు కాస్త నస పెట్టినా నెమ్మదిగా డార్విన్ తన ఓడ మీదకి రావడానికి ఒప్పుకున్నాడు.
చివరికి ఆ యాత్ర 1831 లో 27 డిసెంబర్ నాడు మొదలయ్యింది. రెండేళ్లు అనుకున్న యాత్ర ఐదేళ్లు సాగింది. ఆ సుదీర్ఘ యాత్రలో దక్షిణ అమెరికా తీరం పొడవునా ఎన్నో ప్రదేశాలు సందర్శించి, అక్కణ్ణుంచి ఆస్ట్రేలియాకి ప్రయాణించి, అక్కడ కొన్ని తీర ప్రాంతాలు చూసి, అక్కణ్ణుంచి ఆఫ్రికా దక్షిణ కొమ్ము వద్ద ఉన్న కేప్ టౌన్ కి వెళ్లి, మరో సారి దక్షిణ అమెరికా తూర్పు తీరాన్ని తాకి, అక్కణ్ణుంచి తిరిగి ఇంగ్లండ్ ని చేరుకున్నారు. అంతకాలం నావికజీవనం డార్విన్ కి కొంచెం కష్టంగానే అనిపించింది. నియంతలాగా ప్రవర్తించే ఫిట్జ్ రాయ్ నీడలో బతకడం మరీ ఇబ్బంది అయ్యింది. సిబ్బందితో కెప్టెన్ మోటుగా వ్యవహరించే తీరు సున్నిత స్వభావుడైన డార్విన్ కి నచ్చేది కాదు. ఫిట్జ్ రాయ్ విషయంలో డార్విన్ ని ఇబ్బంది పెట్టిన మరో విషయం ఏంటంటే ఈ ఫిట్జ్ రాయ్ కి బైబిల్ అన్నా, ఆ కారణం చేత సృష్టివాదం అన్నా, గాఢమైన నమ్మకం. ఒక పక్క డార్విన్ సృష్టి వాదాన్ని ప్రశ్నిస్తూ ఈ యాత్ర మీద బయల్దేరుతుంటే మరో పక్క నిరంకుశుడైన ఓడ కెప్టెన్ కి సృష్టివాదం అంటే గుడ్డి నమ్మకం! విధి వైపరీత్యం అంటే ఇదేనేమో! కెప్టెన్ తో వాదనకి దిగితే డార్విన్ ని నడిసముద్రంలో సొరచేపలకి ఎర వేసే ప్రమాదం ఉంది. కనుక కెప్టెన్ జోలికి పోకుండా తన పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు డార్విన్. రాత్రనక, పగలనక ఆరోగ్యాన్ని లెక్కచెయ్యకుండా పరిశ్రమించేవాడు. ఓడ లంగరు వేసిన ప్రతీ సారి తీరం మీదకి వెళ్లి అక్కడి జంతువులని, వృక్ష జాతులని పరిశీలించేవాడు. ఇక్కడే ‘సేకరణ’ పట్ల తనకి చిన్నప్పట్నుంచి ఉండే అభిలాష మళ్లీ ఊపిరి పోసుకుంది. తదనంతరం పరిశోధనకి పనికొచ్చేలా ఎంతో సరంజామాని సేకరించాడు. గవ్వలు, ఈకలు, గోళ్లు, దంతాలు, ఎముకలు మొదలైన అవిశేషమైన వస్తువులే జీవశాస్త్రానికి మూలస్తంభం లాంటి అమోఘమైన సిద్ధాంత నిర్మాణానికి పునాది రాళ్ళు అయ్యాయి.
http://www.andhrabhoomi.net/sisindri/m-991
నౌకాదళం ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట దక్షిణ దిశగా యత్ర కొనసాగించింది. మైళ్ల తరబడి తీరరేఖని దాటుకుంటూ ఓడలు ముందుకు సాగిపోయాయి. ఇక తదుపతి మజిలీ కేప్ వెర్దే దీవులు. దీవులు చేరగానే తీరం మీదకు వెళ్లి పెద్ద ఎత్తున వంటచెరకు, మంచినీరు, కూరలు, పళ్లు ఓడలకి తరలించమని కొంతమందిని పంపించాడు వాస్కో ద గామా. ఈ ఆదేశం నావికులకి కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆఫ్రికా తీరం వెంట ప్రయాణం ఒక విధంగా చూస్తే పెద్ద కష్టం కాదు. ఎప్పుడూ తీరం కనిపించేలా కాస్తంత దూరంలో ఉంటూ యాత్ర కొనసాగిస్తే ఆహారం మొదలైన సరుకులు ఎప్పుడు కావలసినా ఏదో రేవు వద్ద ఆగి ఓడలకి ఎత్తించుకోవచ్చు. దీర్ఘ కాలం నడిసముద్రంలో, తీరానికి దూరంగా, జరిపే యాత్రలలో మాత్రమే ఓడలలో బాగా సరంజామా నింపుకోవలసి వస్తుంది. వాస్కో ద గామా ఉద్దేశం అనుభవజ్ఞుడైన దలెంకర్ కి మాత్రమే అర్థమయ్యింది. లోగడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ని చేరుకున్న బార్తొలోమ్యు దియాజ్ కూడా ఇదే మార్గాన్ని అవలంబించాడు.
ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని అంటిపెట్టుకుని ప్రయాణిస్తే దూరం మరీ ఎక్కువ అవుతుంది. కనుక కేప్ వెర్దే దీవులని దాటాక నేరుగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ దిశగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుతూ ప్రయాణించాలి. ఆ మార్గాన్ని అనుసరించాడు కనుకనే బార్తొలోమ్యూ దియాజ్ తన గమ్యాన్ని భద్రంగా చేరుకున్నాడు. వాస్కో నౌకా దళం తమ గమన దిశని మార్చుకుంది. అంతవరకు అల్లంత దూరంలో కనిపిస్తూ భద్రతాభావాన్ని కలిగించిన తీరం క్రమంగా దూరం కాసాగింది. ఆ నాటి యాత్ర మరింత కఠినం అయ్యింది. దారిలో ఎన్నో భీకర తుఫానులు ఎదురయ్యాయి. అయినా ఏ అవాంతరం కలగకుండా యాత్ర కొనసాగింది. నవంబర్ 1 వ తారీఖున ఓ నావికుడు అల్లంత దూరంలో ఏదో తీరం కనిపెట్టాడు. అది ఆఫ్రికా తీరమే అయ్యుండాలి. నావికుల సంతోషానికి హద్దుల్లేవు.
కాని ఆ సంతోషంలో పాల్గొనకుండా నిర్లిప్తంగా ఉన్నవాడు ఒక్క వాస్కో ద గామనే. ఎందుకంటే తాము చేరుకున్న తీరం ఎక్కడుందో రూఢి చేసుకోకుండా వేడుక చేసుకోవడంలో అర్థం లేదని అతడికి బాగా తెలుసు.
తాము చేరుకున్న తీరం ఆఫ్రికా దక్షిణ కొమ్ముకి దగ్గరి ప్రాంతమో కాదో తేల్చుకు రమ్మని వాస్కో ఇద్దరు నావికులని తీరం మీదకి పంపించాడు. తీరం మీద ఇద్దరూ నడచుకుని వెళ్తుండగా ఒక చోట పొదల మాటున ఇద్దరు వ్యక్తులు నక్కి ఉండడం కనిపించింది. చేతుల్లో బరిసెలు, జంతు చర్మపు బట్టలు మొదలైన లక్షణాలు చూస్తే ఇద్దరూ ఆ ప్రాంతపు కోయవారిలా ఉన్నారు. నావికులు కూడా చెట్ల వెనక దాక్కున్నారు. ఉన్నట్లుండి నావికులు కనిపించకపోయే సరికి విస్తుపోయి ఆ కోయవాళ్లు పొదలమాటు నుండి బయటికి వచ్చారు. అంతలో తటాలున వెనక నుండి వెళ్ళి నావికులు వాళ్ళిద్దర్నీ పట్టుకున్నారు. వాళ్ళలో ఒకడు ఎలాగో తప్పించుకున్నాడు. రెండో వాణ్ణి తెచ్చి వాస్కో ద గామాకి అప్పజెప్పారు.
ఆఫ్రికన్ భాషలు తెలిసిన అఫోన్సో ఆ కోయవాడితో మాట్లాడడానికి ప్రయత్నించాడు. కాని ఒకరి మాటలు ఒకరికి అర్థం కాలేదు. సంజ్ఞలు చేస్తూ వాస్కో తదితరులు చాలా సేపు వాడితో తిప్పలు పడ్డాక తెలిసినది ఏంటంటే వాళ్ళ గ్రామం అల్లంత దూరంలో కనిపిస్తున్న కొండ దగ్గర ఉందని. ఆ గ్రామం వారితో సంబంధం కలుపుకుని, ఈ ప్రాంతం ఎక్కడుందో కనుక్కు రమ్మని వెలోసో అనే వాణ్ణి పంపించాడు వాస్కో.
(ఇంకా వుంది)
http://www.andhrabhoomi.net/more/intelligent
చార్లెస్ డార్విన్ ఇంగ్లడ్ లో ష్రూబెరీ నగరంలో 1809 లో, ఫిబ్రవరి 12, నాడు పుట్టాడు. తండ్రి పేరు రాబర్ట్ డార్విన్, తల్లి సుసన్నా డార్విన్. చార్లెస్ తండ్రి మంచి ఆస్తిపరుడైన వైద్యుడు. తాత ఎరాస్మస్ డార్విన్ కూడా వైద్యుడే. ఒక జీవశాస్త్రవేత్తగా కూడా అతడికి మంచి పేరు ఉండేది. తల్లి సుసన్నా పుట్టింటివైపు ఇంటిపేరు వెడ్జ్ వుడ్. ఆమె తండ్రి జోసయా వెడ్జ్ వుడ్ ఓ పేరుమోసిన కుమ్మరి.
చార్లెస్ తాతలు (ఎరాస్మస్ డార్విన్, జోసయా వెడ్జ్ వుడ్) ఇద్దరూ ముందే మంచి స్నేహితులు. బిర్మింగ్ హామ్ లో ‘లూనార్ సొసయిటీ’ అనే సమాజంలో వీళ్లిద్దరూ సభ్యులుగా ఉండేవాళ్లు. ఎంతో మంది శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు అందులో సభ్యులుగా ఉండేవారు. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టిన జేమ్స్ వాట్ కూడా ఆ సమాజంలో ఉండేవాడు. నెలకి ఒకసారి అంతా కలిసి వైజ్ఞానిక, సాంకేతిక విషయాలు ముచ్చటించుకుంటూ ఉండేవారు. భౌగోళిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వాతావరణం ఇలా ఎన్నో అంశాల మీద చర్చి కొనసాగేది.
ఈ సమాజం యొక్క వ్యవహారాల వల్ల మనుషుల మనసులు మత చింతన నుండి మరలి వైజ్ఞానిక చింతన దిక్కుగా మొగ్గు చూపడం మొదలెట్టాయి. మతం బోధించే కట్టుబాట్లలాగా కాక సైన్సు చెప్పే ధర్మాలు అనుభవంలో తెలుసుకోదగ్గవి. రూఢి చేసుకోదగినవి. అందుకని వాటి మీద జనం నమ్మకం పెరగసాగింది. అంతేకాక ఈ సమాజం యొక్క లక్ష్యం కేవలం సైన్సు మీదే కాదు. పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్న ఈ సమాజంలో జరిగే చర్చల్లో, విజ్ఞానాన్ని వాడుకుని లాభాలు ఎలా పొందాలి అనే చర్చ కూడా చోటుచేసుకునేది. ఆ విధంగా మతచింతన పట్టునెమ్మదిగా సడలింది. అలాంటి పూర్వీకుల ప్రభావం డార్విన్ చింతన మీద కనిపించింది అనడంలో సందేహం లేదు.
చార్లెస్ కి ఏడేళ్ళ వయసులో తల్లి మరణించడంతో చదువు కొంచెం ఆలస్యం అయ్యింది. తొమ్మిదేళ్ల వయసులో 1818 లో చార్లెస్ ని బళ్లో చేర్పించారు. బళ్లో చార్లెస్ చదువు అంత గొప్పగా సాగలేదనే చెప్పాలి. అయితే చిన్నప్పట్నుంచి పురుగులు, పక్షి గుడ్లు మొదలైన వాటిని సేకరించడం అంటే అతడికి చాలా ఆనందం. ఈ పనికిమాలిన పనులతో పిల్లవాడు కాలం వృధా చేస్తున్నాడని తండ్రికి మంటగా ఉండేది.
స్కూలు చదువులు ఎలాగో పూర్తయ్యాయి. కాలేజి చదువుల కోసం తండ్రి చార్లెస్ ని 1825 లో వైద్య కళాశాలలో చేర్పించాడు. తన లాగ, తన తండ్రి లాగ కొడుకు చార్లెస్ కూడా గొప్ప డాక్టరు కావాలని ఆయన ఆలోచన. ఎడిన్బర్గ్ లోని ప్రఖ్యాత వైద్య విశ్వవిద్యాలయంలో చార్లెస్ విధిలేక చదువు మొదలెట్టాడు. అక్కడి పాఠాలు తెగ బోరు కొట్టేవి. ఇక అనెస్తీషియా కూడా ఇవ్వకుండా రోగుల మీద చేసే శస్త్రచికిత్సలు అతడికి జుగుప్సాకరంగా అనిపించేవి. ఈ కాలంలోనే అతడికి జేమ్స్ ఎడ్మండ్ స్టోన్ అనే నల్లజాతికి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇతగాడి వద్ద చార్లెస్ ‘టాక్సీ డెర్మీ’ అనే విద్యని నేర్చుకున్నాడు. టాక్సీడెర్మీ అంటే జంతు కళేబరాలలో తగిన పదార్థం కూరి ఆ జంతు దేహాన్ని ఓ శీల్పంలా సజీవంగా కనిపించేలా నిలిపే కళ. ఈ జేమ్స్ ఎడ్మండ్ స్టోన్ దక్షిణ అమెరికాలో కారడవులలో చార్లెస్ వాటర్టన్ అనే వ్యక్తితో కలిసి పర్యటించాడు. కనుక ప్రయాణంలో తన అనుభవాలన్నీ కథలు కథలుగా చార్లెస్ చెప్పేవాడు. ఇతడి సాంగత్యం చార్లెస్ కి ఎంతో ఆనందదాయకంగా ఉండేది.
రెండవ సంవత్సరంలో ఉండగా చార్లెస్ డార్విన్ ‘ప్లైనియన్’ సమాజంలో చేరాడు. ఇదొక ప్రకృతి శాస్త్ర సమాజం. ఆ కాలంలో రాబర్ట్ గ్రాంట్ అనే అనాటమీ ప్రొఫెసరు తో బాగా సాన్నిహిత్యం పెరిగింది. పంతొమ్మిదవ శతాబ్దపు జీవశాస్త్రవేత్తల్లో ముఖ్యుడిగా ఈ గ్రాంట్ కి మంచి పేరు ఉంది. పైగా జీవపరిణామం ఉందని నమ్మినవారిలో ఒకడు. గ్రాంట్ చింతనల ప్రభావం డార్విన్ మీద పడింది. ఆ రోజుల్లోనే నీట్లో బతికే అకశేరుకాలని సేకరించడం డార్విన్ ఓ హాబీగా తీసుకున్నాడు. ఆ సేకరణ కార్యక్రమంలో డార్విన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని కనుక్కున్నాడు. ఆలుచిప్పల్లో కనిపించే నల్లని స్పోర్ లు నిజానికి ‘స్కేట్’ అనబడే ఒకరకం జలగలు పెట్టే గుడ్లు అని గమనించాడు. ఇదంత విశేషమైన విషయంగా కనిపించలేదు డార్విన్ కి. కాని గురువుల ప్రోద్బలం మీద తను కనుక్కున్న ఈ కొత్త విషయాన్ని ప్లైనియన్ సమాజపు సమావేశంలో ఒకసారి ప్రకటించాడు. మొత్తానికి డార్విన్ వైద్య చదువు సజావుగా సాగలేదనే చెప్పాలి.
డాక్టరు కమ్మని పంపితే నదీ తీరంలో నత్తగుల్లలు ఏరుకునే కొడుకు తీరు చూసి తండ్రికి ఒళ్లు మండిపోయింది. వైద్యం చదువు మాన్పించి కేంబ్రిడ్జ్ లో మతవిద్యలో బి.ఏ. చదువులో చేర్పించాడు. ఇష్టం లేకపోయినా తండ్రి మాటకి ఎదురుచెప్పలేక కేంబ్రిడ్జ్ లోని క్రైస్ట్ కాలేజి లో చేరాడు డార్విన్. అక్కడ కూడా చదువు అంతంతమాత్రంగానే సాగింది. ఇక్కడ కూడా ఓ కొత్త వ్యాపకం అలవడింది. దాన్ని అంటించినవాడు విలియమ్ ఫాక్స్ అనే ఓ బంధువుల కుర్రాడు. ఇద్దరూ కలిసి తీరిక వేళల్లో ‘కుమ్మర పురుగు’ (బీటిల్) లని సేకరిస్తూ కాలక్షేపం చేసేవారు. ఈ పురుగులేరుకునే పిచ్చి ఎంత వరకు వెళ్లిందంటే ఒక దశలో తను కనుక్కున్న కొన్ని కొత్త పురుగుల చిత్రాలు స్టీవెన్స్ ఇలస్ట్రేషన్స్ ఆఫ్ బ్రిటిష్ ఎంటొమాలజీ (స్టీవెన్స్ వారి బ్రిటిష్ కీటక శాస్త్ర చిత్రాలు) అనే పుస్తకంలో కూడా అచ్చయ్యాయి.
ఒక పక్క ఈ కీటక సేకరణ ప్రహసనం ఇలా ఉండగా తన మత చదువు కూడా అంతో ఇంతో ఉత్సాహంగానే సాగింది. ముఖ్యంగా విలియం పాలే (చిత్రం) రాసిన ‘క్రైస్తవ మతానికి ఆధారాలు (ఎవిడెన్సెస్ ఆఫ్ క్రిస్టియానిటీ) అన్న పుస్తకం డార్విన్ ని బాగా ఆకట్టుకుంది. ‘ప్రతిభతో కూడిన రూపకల్పన’ అనే భావన ముఖ్యంగా పాలే రచనలో కనిపిస్తుంది. గడియారానికి దాని నిర్మాత ఎంత అవసరమో, ప్రపంచానికి దాని సృష్టికర్త అంత అవసరం అంటాడు. అంతవరకు తెలిసిన ప్రతీ వైజ్ఞానిక విభాగాన్ని తీసుకుని, అందులోని విశేషాల బట్టి దేవుడు ఉన్నాడని వాదించేవాడు. ఇంత అందమైన, సంక్లిష్టమైన సృష్టి దేవుడు ఉన్నాడనడానికి మౌన సాక్షం అంటాడు. ఈ వాదనలన్నీ డార్విన్ కి ఇంచుమించు కంఠస్తం వచ్చేవి. ఈ సారి చదువు బాగానే సాగినందున, 178 అభ్యర్థుల్లో పదో స్థానంలో నిలిచి జనవరి 1931 లో బి.ఏ. విజయవంతంగా పూర్తిచేశాడు.
జనవరిలో పరీక్షలు పూర్తయిపోయినా జూన్ నెల దాకా కేంబ్రిడ్జ్ నగరంలోనే ఉండదలచాడు డార్విన్. ఆ సమయంలో మరి కొన్ని ఆసక్తికరమైన పుస్తకాలు డార్విన్ చేతిలో పడ్డాయి. ఆ పుస్తకాలు తన జీవితాన్నే మార్చేశాయి.
(ఇంకా వుంది)
http://www.andhrabhoomi.net/sisindri/o-086
జులై 8, 1497, నాడు ఆ మహాయత్ర మొదలయ్యింది. మూడు ఓడలూ లిస్బన్ రేవు నుండి బయల్దేరాయి. నగర వాసులంతా రేవుకి విచ్చేసి ఆ వీర నావికులకి వీడ్కోలు చెప్పారు. నెమ్మదిగా తీరం కనుమరుగు కాసాగింది. ఓడ డెక్ మీద నించుని వాస్కో ద గామా తన ఎదురుగా విస్తరించి ఉన్న అనంత సాగరం కేసి రెప్ప వేయకుండా చూస్తున్నాడు. తాను తలకెత్తుకున్న కార్యభారం నెమ్మదిగా తెలిసి వస్తోంది. ఇన్నేళ్ల తన అనుభవంలో తన నేతృత్వం లో ఉన్న ఒక్క ఓడ కూడా పోలేదు. ఈసారి కూడా అలాగే అన్ని ఓడలని, అందులోని సిబ్బందిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలి. తన పట్టుదలకి ప్రకృతి కూడా మద్దతు తెలపాలని సంకల్పించింది కాబోలు! అంతలోనే ఓ బలమైన గాలి వీచగా తెరచాపలు పొంగి ఓడలు వడిగా నీటికి కోసుకుంటూ ముందుకి దూసుకుపోయాయి.
ఓ వారం తరువాత ఆ నౌకాదళం ఆఫ్రికా పశ్చిమ తీరం వద్ద ఉన్న కానరీ దీవులని చేరుకున్నాయి. గతంలో కొలంబస్ కూడా ఈ దీవులని సందర్శించిన విషయం మనకి గుర్తు. ఆ ప్రాంతంలో కాస్త మత్స్య సంపద సేకరించి ఆహారం నిలువలు పెంచుకుందాం అని నావికులు నీట్లోకి వలలు విసిరారు. ఆయితే ఆ రాత్రి ఓ అనుకోని సంఘటన జరిగింది. దట్టంగా పొగమంచు కమ్మింది. అంతేకాక ఆగాగి బలమైన గాలులు కూడా వీచాయి. దాంతో ఓడలు చెల్లాచెదురు అయ్యాయి. పెద్ద ఓడ అయిన సావో గాబ్రియెల్ లో వాస్కో ద గామా ఉన్నాడు. తను తమ్ముడు పాలో ఉన్న ఓడ, సావో రఫాయెల్, తప్పిపోయింది. మిగతా రెండు ఓడల కెప్టెన్లకి ఏంచెయ్యాలో అర్థం కాలేదు. తప్పిపోయిన ఓడ కోసం గాలించకుండా ముందుకు సాగిపోవాలని వాస్కో ద గామా నిర్ణయించాడు. తప్పిపోయిన ఓడ ఎప్పుడో ఒకప్పుడు తక్కిన ఓడలని కలుసుకుంటుందని తన నమ్మకం. బయటికి ధీమాగా అన్నాడే గాని లోపల తనకి ఒక పక్క గుబులుగానే ఉంది. మిగతా రెండు ఓడలు ముందుకి సాగిపోయాయి. కొన్నాళ్ళ తరువత జులై 22 నాడు పోయిన ఓడ మళ్లీ కనిపించింది. వాస్కో మనసు తేలికపడింది. పోయిన తమ్ముడు మళ్లీ కనిపించినందుకు లోలోన సంతోషించాడు.
ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది?
- స్వాతి చీమకుర్తి
ఎండగా ఉన్న రోజు పైకి చూస్తే మనకి ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. సూర్యాస్తమయం అయ్యేసరికి ఆకాశం రంగు ఎరుపుగానో, లేక నారింజ రంగులోనో కనిపిస్తుంది. ఆకాశం నీలం రంగులో ఎందుకు కనిపిస్తుంది? సూర్యుడు అస్తమించే సమయం లో ఎరుపు రంగు ఎలా వస్తుంది? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే మనం ముందుగా కాంతి గురించి, వాతావరణం గురించి తెలుసుకోవాలి.
వాతావరణం:
భూమి చుట్టూ ఉండే వాతావరణం, వాయు అణువులతోను, ఇతర పదార్థాలతో నిండి ఉంటుంది. అందులో అధికంగా నైట్రోజెన్ (78 %), ఆక్సిజన్ (21 %) ఉంటాయి, ఆ తరువాత ఆర్గాన్ వాయువు మరియు నీరు(ఆవిరి, నీటి బొట్లు, మంచు కణికల రూపంలో) మిళితమై ఉంటాయి. మరి కాస్త తక్కువ శాతంలో ఇతర వాయువులు, దుమ్ము, మసి, బూడిద, పుప్పొడి, లంటి చిన్న ఘనరేణువులు మరియు సముద్రాల నుండి ఉప్పు ఉంటాయి. వాతావరణం కూర్పు మన ఉన్న ప్రదేశాన్ని బట్టి, ఉష్ణోగ్రత బట్టి, అనేక ఇతర విషయాలు ఫై ఆధారపడి మారుతూ ఉంటుంది. అంటే సముద్రం సమీపంలో కాని, గాలివాన తరువాత కాని గాలిలో ఎక్కువ నీరు శాతం ఉంటుంది. అగ్నిపర్వతాల విస్ఫోటాల వల్ల వాతావరణంలో పెద్ద మొత్తం లో దుమ్ము రేణువులు ప్రవేశీస్తాయి. కాలుష్యం వల్ల వివిధ రకాల వాయువులు, దుమ్ము, పొగ మొదలైనవి వాతావరణంలో కలుస్తాయి. భూమికి దగ్గరగా ఉన్నప్పుడు వాతావరణం లో అధిక సాంద్రత ఉంటుంది, భూమికి దూరంగా పైకి వెళ్తున్నకొద్ధీ సాంద్రత తగ్గుతూ ఉంటుంది.
కాంతి తరంగాలు :
కాంతి ఒక రకమైన శక్తిగా తరంగాల రూపంలో ప్రసరిస్తుంది. ఎన్నో రకాల శక్తి రూపాలు తరంగాలుగా ప్రసారం అవుతాయి. ఉదాహరణకు కంపించే వాయు తరంగమే ధ్వని. విద్యుత్ మరియు ఆయిస్కాంత ప్రకంపనల వల్ల కాంతి తరంగాలు ఏర్పడుతాయి. ఇది విద్యుతయస్కాంత వర్ణమాలలో ఒక చిన్న భాగం మాత్రమే. దీనినే విధ్యుతయిస్త్కాంత వర్ణమాల (electromagnetic spectrum) అంటారు. విద్యుతయస్కాంత తరంగాలు అంతరిక్షంలో 299,792km/sec (186,282 miles/sec) వేగం తో ప్రయాణిస్తాయి. దీనిని కాంతి వేగం అంటారు.
కాంతి యొక్క శక్తి దాని తరంగధైర్ఘ్యము (wavelength) మరియు పౌనఃపున్యం (frequency) ఫై ఆధారపడి ఉంటుంది. తరంగం యొక్క గరిష్ఠబిందువుల మధ్య దూరమే తరంగధైర్ఘ్యము. ఒక సెకనుకి ఎన్ని తరంగాలు ప్రవహిస్తాయో ఆ విలువని పౌనఃపున్యం అంటారు. కాంతి యొక్క తరంగధైర్ఘ్యము పెద్దది అయ్యే కొద్ది, పౌనఃపున్యం కూడా తగ్గుతుంది. దానితో పాటు శక్తి కూడా తగ్గుతుంది.
కాంతి - రంగులు :
వర్ణమాలలోని రంగులు ఒక దానిలో ఒకటి కలిసిపోతాయి. వర్ణమాలలో ఒక చివర ఎరుపు మరుయు నారింజ రంగులు ఉంటాయి. అవి క్రమంగా పసుపు, ఆకుపచ్చ, నీలం, నీలిమందు, ఊదా రంగులోకి మారుతాయి. ఈ రంగులకి వేర్వేరు తరంగధైర్ఘ్యాలు, పౌనఃపున్యాలు, శక్తులు కలిగి ఉంటాయి. దృశ్య వర్ణమాలలో (visible spectrum) స్పెక్ట్రం యొక్క వర్ణపటం లో ఊదా రంగు అన్నిటికంటే అతి తక్కువ తరంగధైర్ఘ్యము కలిగి ఉంటుంది, అంటే అది అత్యధిక, పౌనఃపున్యాన్ని, శక్తిని కలిగి ఉంటుంది. ఎరుపుకు పొడవాటి తరంగధైర్ఘ్యము మరియు అత్యల్ప పౌనఃపున్యం, మరియు శక్తి ఉంటాయి.
గాలి లో కాంతి :
అవరోధం లేనంతవరకు ఆకాశంలో కాంతి ఎప్పుడూ తిన్నగా ప్రయాణిస్తుంది. కాంతి ప్రయాణిస్తున్నప్పుడు వాతావరణంలో దుమ్ము పదార్థాలు లేక వాయువు అణువులు అడ్డు వచ్చినప్పుడు కాంతి యొక్క గతి తప్పుతుంది. అలా ఓ కిరణం ఓ అవరోధాన్ని ఎదుర్కున్నప్పుడు, ఆ కిరణంలో ఎలాంటి మార్పు వస్తుంది అన్నది ఆ కిరణం యొక్క తరంగదైర్ఘ్యం మీద, ఢీకొన్న వస్తువు యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది.
మనకి కనిపించే కాంతి తరంగధైర్ఘ్యము కంటే వాయువు లో ఉన్న దుమ్ము రేణువులు, నీటి చుక్కుల పరిమాణం పెద్దవిగా ఉంటాయి. కాంతి ఆ పెద్ద కణాలను ఢి కొట్టినప్పుడు, వివిధ కోణాల్లో వెనక్కు తుళ్లడం, పరావర్తనం చెందడం జరుగుతుంది. అది జరిగినప్పుడు కాంతిలో ఉండే వివిధ రంగుల కిరణాలన్నీ ఒకే విధంగా పరావర్తనం చెందుతాయి. ఆ ప్రతిబింబించిన కాంతి లో అన్ని రంగులూ ఉన్న కారణంగా మనకు ఆ కాంతి తెలుపు రంగులోనే కనిపిస్తుంది.
కాని వాయు అణువులు మనకు కనిపించే కాంతి తరంగధైర్ఘ్యము కంటే చిన్నవిగా ఉంటాయి. వాయు అణువును కాంతి డీ కొట్టినప్పుడు, ఆ అణువు కాంతిని కొంత వరకు గ్రహిస్తుంది. అలా కాంతిని గ్రహించిన అణువు తరువాత వివిధ దిశలలో కాంతిని విడుదల చేస్తుంది. ఏ రంగులో కాంతిని గ్రహించిందో అదే రంగుని విడుదల చేస్తుంది. వాయు అణువు అన్ని రంగులని గ్రహించినా, తక్కువ పౌనఃపున్యం గల (ఎరుపు)ల కంటే ఎక్కువ పౌనఃపున్యం గల నీలం కాంతిని ఎక్కువగా గ్రహిస్తుంది. ఈ ప్రభావాన్ని 1870 లో ర్యాలీ (Rayleigh) అనే ఒక ఆంగ్ల శాస్త్రవేత్త కనుక్కున్న కారణంగా దీన్ని ర్యాలీ పరిక్షేపం (Rayleigh scattering) అని పిలుస్తారు.
Rayleigh పరిక్షేపం కారణంగా ఆకాశం నీలంగా కనిపిస్తుంది. పొడవైన తరంగాలు గల కిరణాలు వాతావరణం లో నిరాఘాటంగా ప్రయాణిస్తూ నేలని చేరుతాయి. కొంత వరకు ఎరుపు, నారింజ మరియు పసుపు రంగులు మాత్రం గాలి వల్ల ప్రభావితమవుతాయి. అయితే పొట్టివైన నీలి తరంగాలు వాయు అణువుల చేత గ్రహించబడుతాయి. గ్రహించబడ్డ నీలి కిరణాలు మళ్లీ నానా దిశలలోను విరజిమ్మ బడతాయి, అంటే పరిక్షేపం చెందుతాయి. ఆ నీలి కాంతులే ఆకాశం అంతా వ్యాపిస్తాయి. అందుకే మనం ఎక్కడ నుంచి చుసినా పగలు సూర్యుడు ఆకాశం లో ఉన్నప్పుడు ఆకాశం మనకు నీలం రంగు లో కనిపిస్తుంది.
నలుపు ఆకాశం - తెలుపు సూర్యుడు:
భూమి మీద నుండి చూసినప్పుడు సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తాడు. మనం అంతరిక్షం లో నుంచి, లేదా చంద్రుడు మీద నుంచి చూసినప్పుడు సూర్యుడు తెలుపు రంగులో కనిపిస్తాడు. అంతరిక్షం అంతా శున్యం కనుక, అక్కడ వాతావరణం ఉండదు కనుక కాంతి పరిక్షేపం చెందదు. అందుకే అక్కడ నుంచి చూసినప్పుడు మన కంటికి ఆకాశం నీలంగా కాకుండా వెలుతురు లేనట్టు, నల్లగా, చీకటిగా కనిపిస్తుంది.
సూర్యాస్తమయం జరిగేటప్పుడు కాంతి మన వరకు చేరటానికి వాతావరణం లో ఎంతో దూరం ప్రయాణించ వలసి ఉంటుంది. కనుక దారిలో చాలా వరకు కాంతి పరావర్తనం చెందుతుంది, పరిక్షేపం చెందుతుంది. మన వరకు తక్కువ కాంతి మాత్రమే చేరుతుంది కాబట్టి సూర్యుడు తక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అధిక పౌనఃపున్యం గల నీలం మొదలైన రంగులు దారిలో వాతావరణంలోనే గ్రహించబడతాయి. పొడవాటి తరంగాలు గల ఎరుపు, నారింజ కాంతులు మాత్రమే మన వరకు వస్తాయి. అందుకే సూర్యాస్తమయం ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తుంది.
అనువాదం – స్వాతి చీమకుర్తి
మూలం -
http://www.sciencemadesimple.com/sky_blue.html
http://www.andhrabhoomi.net/intelligent/srer-757
ఆ విధంగా ప్రతిభతో కూడిన రూపకల్పన వల్లనే జీవజాతులు సృజించబడ్డాయి అన్న భావనని అడ్డుపెట్టుకుని సృష్టి వాదులు సంబరపడుతున్న సమయంలో, వారి వేడిని చల్లారుస్తూ, పరిణామ వాదానికి మద్దతు నిస్తూ మరిన్ని ఆధారాలు బయటపడ్డాయి.
ఎన్నో జంతువులకి పనికిరాని అంగాలు ఉంటాయి. ఉదాహరణకి కొన్ని పాములకి కాళ్ళు ఉంటాయి. పాకే పాములకి కాళ్లతో ఏం పని? బల్లులకి, మొసళ్లకి ఉన్నట్టే ఉంటాయి గాని నిజానికి ఆ కాళ్లు ఆ పాముల కదలికలో పాల్గొనవు. ఇలాంటి అంగాలనే వ్యర్థ అంగాలు (vestigial organs) అంటారు. అలాగే మోల్ అనబడే ఎలుకని పోలిన జంతువులకి చెందిన బ్లైండ్(గుడ్డి) మోల్ అనే ఉపజాతి ఒకటి ఉంది. ఇవి ఎక్కువగా కలుగుల్లో, చీకటి ప్రాంతాల్లో బతుకుతుంటాయి. వీటికి కళ్లు ఉంటాయి గాని అవి పని చెయ్యవు. వాటి మీదుగా ఓ చర్మపు పొర కప్పబడి ఉంటుంది. చూపు లేని ఈ జీవాలకి కళ్లెందుకు? అలాగే రెక్కలు ఉన్నా ఎగరలేని ఎన్నో పక్షి జాతులు ఉంటాయి. మనకి కనిపించే సర్వసాధారణమైన కోడి ఇందుకు తార్కాణం. కొన్ని రకాల పురుగులకి చిట్టి రెక్కలు ఉంటాయి. అవి ఎగరడానికి పనికి రావు. ‘ప్రతిభతో కూడిన రూపకల్పన’ అనే భావనకి ఈ వ్యర్థ అంగాలు ఓ వెక్కిరింపుగా, సవాళ్లుగా పరిణమించాయి. జంతువులన్నీ అంత తెలివిగా, కచ్చితంగా తీర్చిదిద్దబడినట్టయితే ఈ పనికిమాలిన అవయవాలు ఎందుకు ఉన్నట్టు?
దీనికీ సృష్టి వాదులు, తదితరులు చిత్రవిచిత్ర రీతుల్లో స్పందించారు. వ్యర్థ అంగాలు జంతువు యొక్క ఆకారానికి చక్కని సౌష్ఠవాన్ని ఇస్తాయన్నారు. అవి లేకపోతే ఏదో ‘వెలితి’గా ఉంటుందన్నారు. అవి లేకుంటే ‘చూడ్డానికి బాగోద’న్నారు. ఇలా ఎన్నో అన్నారు. ఇలాంటి ‘వ్యర్థ’ వివరణల వల్ల లాభం లేదని త్వరలోనే తేటతెల్లం అయ్యింది. తదనంతరం డార్విన్ ఈ వ్యర్థ అంగాలు పరిణామ సిద్ధాంతానికి సమర్ధిస్తున్నాయని అర్థం చేసుకున్నాడు. ఆ అంగాలు గత జీవ దశల నుండి వారసత్వంగా సంక్రమించి ఉంటాయని, బాహ్యపరిస్థితుల్లోని మార్పుల వల్ల అవి నిరుపయోగం అయిపోయి ఉండొచ్చని భావించాడు.
పరిణామ వాదాన్ని సమర్థించే మరో విశేషం జంతు శరీరాల నిర్మాణంలో కనిపించింది. పైకి చూడడానికి చాలా వేరుగా ఉన్నా అంతరంగ నిర్మాణంలో ఎంతో సమానత గల ఎన్నో అంగాలు జంతుశరీరాలలో కనిపిస్తాయి. డార్విన్ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఆశ్చర్యపోయాడు. పట్టుకోవడానికి ఉపయోగపడే మనిషి చెయ్యి, తవ్వడానికి ఉపయోగపడే మోల్ కాలు, దౌడు తీయడానికి పనికొచ్చే గుర్రం గిట్ట, ఎగరడానికి ఉపయోగపడే గబ్బిలం రెక్క – ఎంతో వైవిధ్యంతో కూడుకున్న ఈ అవయవాలన్నిటిలోను ఎముకల విన్యాసం ఒకేలా ఉండడం డార్విన్ కి విస్మయం కలిగించింది. గతానికి చెందిన శరీరనిర్మాణ విన్యాసాలు కాలానుగతంగా, బాహ్యపరిస్థితులకి అనుగుణంగా కొద్దికొద్దిగా మారుతూ వస్తునాయి కాబోలు. ఒక జంతు జాతి నుండి మరో జంతు జాతి వచ్చింది అనడానికి, జీవపరిణామం నిజమని చెప్పడానికి, ఇంతకన్నా గొప్ప ఆధారం అక్కర్లేదు అనుకున్నాడు.
అయితే ప్రతిభావంతమైన రూపకల్పనని పట్టుకుని వేలాడే బృందం ఇదే సమాచారాన్ని మరోలా తీసుకున్నారు. తెలివైన సూత్రధారి ఒకే మూలసూత్రాన్ని వాడుకుంటూ ఎన్నో రకాల వస్తువులని రూపొందిస్తాడు. ప్రతీ వస్తువుకి కొత్తగా, ప్రత్యేక మూలసూత్రాలని కనిపెట్టాల్సిన పన్లేదు. కనుక ప్రతిభావంతమైన రూపకల్పనే నిజం అన్నారు. ఈ సందర్భంలో విషయం ఎటూ తేలకపోయినా, పరిణామాన్ని బలపరిచే మరో విషయాన్ని చూద్దాం.
ఆ విషయం పిండం యొక్క అభివృద్ధికి సంబంధించినది. పిండ దశలో ఉన్నప్పుడు వివిధ జీవజాతుల పిండాల్లో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. తొలిదశల్లో చేప, ముళ్లపంది, కోడిపెట్ట, దూడ, కుందేలు, మనిషి ఇలా ఎన్నో జీవజాతుల పిండాల్లో పోలిక కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది (చిత్రం). ఉదాహరణకి మానవ పిండంలో ఒక దశలో చేపలలో ఉండే మొప్పలు (gills) లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ భావనకి మొట్టమొదట ఊపిరి పోసినవాళ్ళు పద్దెనిమిదవ శతాబ్దపు జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్తలు అని తెలుస్తోంది. తరువాత పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన జర్మన్ జీవశాస్త్రవేత్త, తాత్వికుడు అయిన ఎర్నెస్ట్ హెకెల్ ఈ భావన గురించి ఎన్నో జీవజాతుల పిండాల మీద పరిశీలనలు చేసి, ఆ భావనకి ప్రాచుర్యాన్ని పెంచాడు.
అయితే ఓ ఆసక్తికరమైన కొత్త విషయాన్ని కనుక్కున్నప్పుడు ఆ నూతనోత్సాహంలో అది అన్నివిధాలా నిజమని నమ్ముతాం. వివిధ జీవజాతుల పిండాలలో హెకెల్ చూసిన పోలికలలో కొంత అతిశయోక్తి ఉన్న మాట నిజమైనప్పటికీ, మూలభావన మాత్రం స్థిరంగా ఉందని తదనంతరం జీవనిర్మాణ శాస్త్రవేత్తలు సమర్ధించారు. పిండ దశలలో వివిధ జీవజాతులు పోలి ఉండే విషయం ఒక జీవజాతి నుండి మరో జీవజాతి వచ్చిందనడానికి ముఖ్య ఆధారాలలో ఒకటిగా తదనంతరం డార్విన్ స్వీకరించాడు.
డార్విన్ కి బాగా స్ఫూర్తి నిచ్చిన సర్వసాధారణ విషయం ఒకటుంది. రైతులకి, పశువులని పెంచేవారికి బాగా తెలిసిన విషయం ఇది. ఉదాహరణకి వరి పంట వేసే రైతు వర్షాపాతం తక్కువగా ఉండే ప్రాంతం వాడైతే ఎక్కువ నీరు అవసరం లేని వరి జాతిని ఎంచుకుంటాడు. నీరు పుష్కలంగా దొరికే ప్రాంతపు రైతుకి ఆ సమస్య ఉండదు. కొన్ని రకాల వరిగడ్డి బలంగా ఉండి, గుడిసెల మీద కప్పడానికి అనువుగా ఉంటుంది. ఆ గడ్డి ప్రధానంగా కావాలనుకునే రైతు ఆ రకం వరినే ఎంచుకుంటాడు. అలాగే జొన్న పంటలో జొన్నలే కాక ఎండిన పంట నుండి వచ్చే చొప్ప పశువులకి మేతగా పనికొస్తుంది. కొన్ని రకాల జొన్నలో చొప్ప బాగుంటుంది గాని, జొన్న గింజ నాణ్యత తక్కువగా ఉంటుంది. కాని చొప్పకి ప్రాధాన్యత ఇచ్చే రైతు ఆ రకం జొన్ననే ఎంచుకుంటాడు. ఆ విధంగా రైతు తన అవసరాల బట్టి వివిధ రకాల ధాన్యపు జాతుల నుండి తనకి కావలసిన జాతిని ఎంచుకుంటాడు.
అలాగే పెంపుడు జంతువుల (కుక్కలు, మేకలు, గొర్రెపోతులు, ఆవులు, దున్నలు…) విషయంలో కూడా అవసరాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి వివిధ జాతుల ఎంపిక జరుగుతుంది. ఆ విధంగా కొన్ని జాతులు బాగా వర్ధిల్లుతాయి, కొన్ని అంతరించిపోవడం కూడా జరుగుతుంది. మానవ చర్యల వల్ల కృత్రిమంగా జరుగుతున్న ఈ ‘ఎంపికే’ ప్రకృతిలో సహజమైన మార్పుల వల్ల కూడా జరుగుతోందని, కొన్ని జాతులు అంతరించిపోడానికి, కొత్త జాతులు ఆవిర్భవించడానికి ఈ ఎంపికే కారణం అని డార్విన్ తదనంతరం గుర్తిస్తాడు.
ఆ విధంగా డార్విన్ రంగప్రవేశం చేసిన సమయానికి పరిణామ సిద్ధాంత నిర్మాణానికి అవసరమైన ఎన్నో పునాదిరాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆయన రంగప్రవేశం చెయ్యడమే ఆలస్యం…
(ఇంకా వుంది)
http://www.andhrabhoomi.net/sisindri/vasco-da-gama-359
సేతుబల్ లో వాస్కో ద గామా సాధించుకు వచ్చిన ఘన విజయం చూశాక బేజా ప్రాంతానికి డ్యూక్ అయిన డామ్ మిగ్యుయెల్ కి వాస్కో సామర్థ్యం మీద నమ్మకం బలపడింది. ఇండియాకి దారి కనుక్కోగల సత్తా ఈ వ్యక్తిలో ఉందని మనసులో అనుకున్నాడు. ఇండియాకి నౌకాదళాన్ని పంపితే దాన్ని శాసించగల సమర్ధుడు ఈ వాస్కో ఒక్కడే అంటూ వాస్కోని సిఫారసు చేస్తూ రాజైన జాన్-2 కి డామ్ మిగ్యుయెల్ జాబు రాశాడు. ఆ సిఫారసుని రాజు ఆమోదించాడు. ఇండియాకి దారి కనుక్కునే బాధ్యతని వాస్కో భుజాల మీద ఉంచాడు.
రాజు తనపై పెంచుకున్న నమ్మకానికి తగినట్టుగానే వాస్కో ద గామా కూడా ఒక సమర్ధుడైన కెప్టెన్ గా మంచి పేరు తెచ్చుకోసాగాడు. ఒక ఓడని నడిపించాలంటే, ఓ నౌకాదళాన్ని శాసించాలంటే ఆ నౌక లోని సిబ్బంది కెప్టెన్ ని గౌరవించాలి. కెప్టెన్ మాటని శిరసావహించాలి. కాని ఆ రోజుల్లో కెప్టెన్ పని అంత సులభం కాదు. నావికులని శాసించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో నావికులు, మోటుగా, కరుగ్గా, మహాబలిష్టులై ఉండేవారు. ఎన్నో సందర్భాల్లో జైల్లోని బందీలని విడిపించి నౌకా యాత్రల మీద పంపేవారు. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన నౌకాయాత్రల్లో సామాన్యులు ప్రయాణించడానికి ముందుకి వచ్చేవారు కారు. అలాంటి గట్టిపిండాలని శాసించగల కెప్టెన్ కూడా గొప్ప నేతృత్వం, బలమైన వ్యక్తిత్వం, వ్యతిరేకతని సులభంగా ఎదుర్కుని అణచగల సత్తా ఉన్నవారు అయ్యుండాలి. వాస్కో ద గామాలో అలాంటి లక్షణాలన్నీ అప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇండియా యాత్రలో తనకి సహకరించగల నౌకాదళాన్ని ఎన్నుకునే పనిలో మునిగాడు వాస్కో ద గామా. మొదటగా వాస్కో తన అన్నల్లో ఒకడైనా పాలో ని ఎంచుకున్నాడు. ఇతగాడు అంటే వాస్కోకి ఎంతో గౌరవం, అభిమానం. అయితే పాలో ఆ యాత్రలో పాల్గొనడానికి అడ్డుపడే చిన్న చిక్కు ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ పాలో సేతుబల్ ప్రాంతానికి చెందిన ఓ న్యాయమూర్తితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో న్యాయమూర్తి గాయపడ్డాడు. ఆ నేరానికి పెద్ద శిక్షే పడేలా ఉండడంతో అప్పట్నుంచి పాలో రాజభటులకి అందకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు పాలోని యాత్ర మీద తనతో తీసుకెళ్ళాలంటే ముందు రాజుగారి క్షమాభిక్ష పొందాలి. అన్నని క్షమించమని అర్థిస్తూ వాస్కో రాజుకి లేఖ రాశాడు. క్షమాపణ ప్రసాదించిన రాజు ఓ షరతు పెట్టాడు. వాస్కో, పాలో సోదరులు ఇండియాకి విజయవంతంగా దారి కనుక్కుని వస్తేనే శిక్ష పూర్తిగా రద్దవుతుంది. ద గామా సోదరులు షరతుకి సంతోషంగా ఒప్పుకున్నారు.
యాత్ర కోసం వాస్కో ద గామా మూడు ఓడలని ఎంచుకున్నాడు. అన్నిట్లోకి పెద్దదైన సావో గాబ్రియెల్ ఓడని ప్రధాన ఓడగా ఎంచుకున్నాడు. దానికి కెప్టెన్ గా గొన్సాలో ఆల్వారెజ్ అనే వాణ్ణి నియమించాడు. ఈ ఆల్వారెజ్ కి గొప్ప నావికుడిగా పేరు ఉంది. అదే ఓడకి పైలట్ గా పెరో దలెంకర్ అనే వాడు నియమించబడ్డాడు. ఈ దలెంకర్ గతంలో బార్తొలోమ్యూ దియాజ్ తో పాటు ఆఫ్రికా యాత్రలో పాల్గొని కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా ప్రయాణించినవాడు. తన అనుభవం ఈ యాత్రలో ఉపయోగపడుతుందని తనని ఎంచుకున్నాడు వాస్కో. ఆ రోజుల్లో కెప్టెన్ ఉద్యోగం చాల వరకు వంశపారంపర్యంగా వచ్చే ఉద్యోగం. కాని పైలట్ ఉద్యోగం మరింత కీలకమైనది. అసలు పని భారం అంతా పైలట్ మీద ఉంటుంది. రెండవ ఓడ అయిన సావో రఫాయెల్ కి కెప్టెన్ గా వాస్కో కి అన్న అయిన పాలో ద గామా నియమించబడ్డాడు. ఇక మూడవది, కాస్త చిన్నది అయిన బెరియో అనే ఓడకి కెప్టెన్ గా నికొలావ్ కోయిలో నియమించబడ్డాడు.
కెప్టెన్ ల నియామకం జరిగాక 140 నుండి 170 మంది దాకా నౌకా సిబ్బందిని పోగు చేశాడు. ఒక్కొక్క వ్యక్తిని, వారి పుట్టు పూర్వోత్తరాలని క్షుణ్ణంగా పరిశీలించి, ఆచి తూచి ఎన్నుకున్నాడు. అంత ముఖ్యమైన యాత్రలో ప్రతి ఒక్కడు సమర్ధుడు, నిజాయితీ పరుడు అయ్యుండాలి. ఒక్క విషపురుగు ఉన్నా యాత్ర విఫలం అయ్యే ప్రమాదం ఉంది. బార్తొలోమ్యూ దియాజ్ తో పాటు ప్రయాణించిన నావికులలో ఎంతో మందిని తన దళంలో చేర్చుకున్నాడు వారి అనుభవం పనికొస్తుందని. అంత సుదీర్ఘమైన యాత్రలో నౌకలు ఎన్నో రేవుల వద్ద ఆగాల్సి వస్తుంది. ఎన్నో రకాల సంస్కృతులతో సంపర్కం తప్పదు. కనుక వివిధ భాషల యొక్క, సంస్కృతుల యొక్క అవగాహన కలవారు కావాలి. కనుక ఆఫ్రికా తెగలు మాట్లాడే భాషలు తెలిసిన మార్టిన్ అఫోన్సో ని చేర్చుకున్నాడు. అరబిక్ భాష తెలిసిన ఫెర్నావో మార్టిన్స్ ని, జో న్యూన్స్ ని కూడా ఎంచుకున్నాడు. వీరు కాక వంట వాళ్లు, సిపాయిలు, వండ్రంగులు, తెరచాప తయారీ తెలిసిన వాళ్లు, ఒక వైద్యుడు కూడా సిబ్బందిలో చేరారు.
ఇంత ముఖ్యమైన యాత్రలో విజయం సాధించాలంటే కేవలం సమర్ధులైన సిబ్బంది మాత్రం ఉంటే సరిపోదు. అంత కఠినమైన యాత్రకి తట్టుకోగల బలమైన ఓడలు కూడా కావాలి. 15 వ శతాబ్దంలో పోర్చుగల్ లో కారవెల్ అనే కొత్త రకం ఓడల నిర్మాణం మొదలయ్యింది. గతంలో వాడబడ్డ ఓడల కన్నా ఇవి మరింత వేగంగా ప్రయాణించగలగడమే కాక మరింత కఠినమైన సముద్ర పరిస్థితులకి తట్టుకోగలిగి ఉండేవి. వీటి తెరచాపలు చదరపు ఆకారంలో కాక, త్రికోణాకారంలో ఉండేవి. ఆ కారణం చేత ఇవి గాలికి ఎదురుగా కూడా ప్రయాణించగలిగేవి. వీటి దేహం కూడా మరింత బలమైన, దళసరి అయిన చెక్కపలకలతో నిర్మించబడేది. ఇండియా యాత్ర కోసం ఈ కారవెల్ ఓడలని ఎంచుకున్నాడు వాస్కో ద గామా.
ఇంత సుదీర్ఘమైన యాత్ర పూర్తి కావడానికి మూడేళ్లు అయినా పట్టొచ్చని అంచనా వేశాడు. కనుక మూడేళ్లకి సరిపోయే ఆహార పదార్థాలు ఓడల పైకి ఎత్తించారు. వీటితో పాటు తగినంత మందుపాతర, విల్లంబులు మొదలైన యుద్ధ సామగ్రి కూడా ఎక్కించుకున్నారు.
సన్నాహాలన్నీ పూర్తయ్యాక ఇక ఇండియా కి బయల్దేరే సుముహూర్తం కోసం ఎదురుచూడసాగారు.
(ఇంకా వుంది)
http://www.andhrabhoomi.net/intelligent/wrere-375
గతంలో ప్రళయం ఒకే సారి వచ్చి ఉంటే శీలాజాలన్నీ ఒకే లోతులో దొరికి ఉండాలి. కాని శీలాజాలు ఎన్నో లోతుల్లో విస్తరించి ఉండడం మతఛాందస వాదులని ఇబ్బంది పెట్టింది. ఆ సమస్య నుండి తప్పించుకోడానికి ప్రళయం ఒకే సారి రాలేదని, గతంలో ఎన్నో సార్లు వచ్చిందని ఓ కొత్త ప్రతిపాదన లేవదీశారు.
కాని శిలాజాలు చెప్పే సాక్షాలని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తూ పోతే మరో ముఖ్యమైన విషయం బయటపడింది. వివిధ లోతుల్లో దొరికిన శిలాజాలన్నీ కేవలం ఒకే జంతు రాశికి చెందినవి కావు. బాగా లోతులో కనిపించిన శీలాజాలు కాస్త సరళమైన జంతువులకి చెందినవై ఉన్నాయి. కాస్త పైపొరలలోని శిలాజాలు మరింత ఉన్నత జాతి జంతువులకి చెందినవి. బాగా లోతుల్లో అకశేరుకాల (invertebrates) శిలాజాలు ఉన్నాయి. కాస్త పైకి వస్తే చేపల శిలాజాలు. ఇంకా పైకి వస్తే సరీసృపాలు, పక్షులు. ఇంకా పైన స్తన్య జీవులకి, మానవులకి చెందిన శీలాజాలు. ఇలా శిలాజాల విస్తరణలో ఓ క్రమ పురోగతి కనిపించింది.
ఈ సమాచారం అంతా చూసి సృష్టి వాదులు తదనుగుణంగా తమ కథని మార్చుకున్నారు. దేవుడు జీవజాతులన్నిటినీ అదే పనిగా ఒక్కసారిగా సృష్టించలేదు. దశలవారీగా, ఒక క్రమపద్ధతిలో ముందు సరళ జతులని, తదనంతరం సంక్లిష్టజాతులని సృష్టిస్తూ వచ్చాడు. ఈ వాదననే ‘పురోగమన వాదం’ అంటారు. దీనికి ఆధునిక పరిణామ సిద్ధాంతానికి సంబంధం లేదు. ఎందుకంటే ఈ పురోగమనంలో సరళ జీవాల నుండి సంక్లిష్ట జీవాలు ఉద్భవించడం లేదు. దేవుడే వరసపెట్టి ఒక క్రమంలో జీవజాతులని సృష్టించాడు. కాని జీవజాతుల ఆవిర్భావంలో ఒక క్రమం ఉందన్న విషయం ఆధునిక పరిణామ సిద్ధాంతానికి స్ఫూర్తి నిచ్చింది.
మరి దేవుడు జీవజాతులని అలా దశల వారీగా ఎందుకు సృష్టించాడు? సర్వశక్తిమంతుడైన దేవుడు అన్నిట్నీ ఒక్కసారే సృష్టించవచ్చును కదా? అందుకు వివరణ ఈ ఫక్కీలో ఉండేది. ఇప్పుడు మీరు టీ చెయ్యదలచుకున్నారు. ముందు నీళ్లు మరగబెడతారు. అందులో టీ పొడి పోస్తారు. కాసేపట్లో డికాషన్ తయారవుతుంది. అందులో పాలు పోస్తారు. పాలు, డికాషన్ కాస్త కలిసి మరిగాక చక్కెర కలుపుతారు. ఆ విధంగా టీ యొక్క తయారీలో ఒక క్రమం కనిపిస్తుంది. అంత మాత్రం చేత నీళ్ల నుంచి పాలు పరిణామం చెందినట్టు కాదు. అలాగే టీ నుండి చక్కెర పరిణామం చెందినట్టూ కాదు. ఆ క్రమం లేకుండా టీ తయారు కాదు. కాని అది బాహ్యంగా కనిపిస్తున్న వ్యవహారం మాత్రమే. టీ తయారుచేస్తున్న వ్యక్తి మనసులో ముందే అన్నీ ఉన్నాయి – టీ కి కావలసిన పదార్థాలు, తయారు చేసే పద్ధతి, దాని చరమ ఫలితం – అన్నీ ముందే ఆ వ్యక్తి ఊహలో ఉన్నాయి. టీ చేసిన వ్యక్తి మనసులో ముందే ఉన్న భావనే బాహ్య ప్రపంచంలో దశల వారీగా వాస్తవీకరించబడుతోంది. అదే విధంగా మనిషిని నిర్మించడానికి పూర్వం ఇన్ని దశల జీవజాతుల నిర్మాణం అవసరం అని తెలిసిన దేవుడు ఇలా దశల వారీగా సృష్టి చేశాడు.
ఈ విధమైన చింతనని బాగా స్పష్టంగా వ్యక్తం చేసిన వాడు పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన శిలాజ శాస్త్రవేత్త లూయీ అగాత్సీ. భవిష్యత్తులో ఒక ఫలితం రావాలంటే, అంతకు పూర్వం కొన్ని ప్రాథమిక ఫలితాలు కలగాలి. అంటే జీవజాతుల వికాసాన్ని ఒక రకమైన ‘విధి’, ఒక ‘ప్రణాళిక’ నడిపిస్తోందన్న భావన. ఈ భావననే ‘ప్రతిభతో కూడిన రూపకల్పన’ (intelligent design) అంటారు. దీన్ని బట్టి జీవజాతుల వికాస క్రమానికి ప్రోద్బలం గతంలో లేదు, భవిష్యత్తులో ఉంది! జీవజాతుల పరిణామ రహస్యం ఈ భూమి మీద లేదు, ఏదో దివిలో, ఆ దేవుడి మనసులో ఉంది!
ఈ ‘ప్రతిభతో కూడిన రూపకల్పన’ అన్న భావన బాగా ఊపందుకుంది. అటు మత ఛాందసులని, ఇటు శాస్త్రవేత్తలని (కొన్ని సందర్భాల్లో ఆ రోజుల్లో ఈ రెండు వర్గాలకి పెద్దగా తేడా ఉండేది కాదు) కూడా ఈ రకమైన వాదన తృప్తిపరిచింది. ఆ ‘రూపకల్పన’ చేసిన వాడు, ‘ప్రతిభ’ గల వాడు దేవుడే కనుక మతఛాందస వాదులు సంతోషించారు. శాస్త్రవేత్తల అవసరాలు మరో విధంగా తీరాయి. ఓ అధునాతన యంత్రాన్నే తీసుకుందాం. ఆ రోజుల్లో అత్యంత అధునాతన యంత్రం చేతి గడియారం. ఇంత సునిశితమైన యంత్రం దానికదే ప్రకృతిలోని సహజ చర్యల వల్ల తీర్చిదిద్దబడడం అనేది ఊహించగలమా? అంత సంక్లిష్టమైన యంత్రాన్ని నిర్మించడానికి ఓ ప్రతిభావంతుడైన సూత్రధారి కావాలి. అలాగే జంతుశరీరంలోని ఓ సంక్లిష్టమైన కన్ను లాంటి అవయవాన్నే తీసుకుందాం. కంట్లో పారదర్శకమైన కార్నియా ఉంటుంది, ఫోకస్ ని మార్చుకోగల లెన్స్ ఉంటుంది, కంటికి పోషక పదార్థాలని సరఫరాచేసే పారదర్శకమైన ద్రవం (విట్రియస్ హ్యూమర్, అక్వియస్ హ్యూమర్) ఉంటుంది. ఇంత సంక్లిష్టమైన యంత్రాన్ని నిర్మించడానికి కూడా ఓ ప్రతిభావంతుడైన సూత్రధారి కావాలి. అతడే దేవుడు.
ఆ విధంగా శిలాజ సాక్షాలన్నిటినీ దేవుడి పరంగా, మతబోధనకి అనుగుణంగా అన్వయించుకునే ప్రయత్నాలు జరిగాయి. అలాంటి అన్వయం చేసినవారిలో ఉద్దండుడు ‘పాలే’ అనే బిషప్. ఈ పాలే రచనలు తదనంతరం డార్విన్ ని కూడా ప్రభావితం చేశాయి. ప్రతిభతో కూడిన రూపకల్పన అనే భావన ఎంతో మంది జీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసింది. ఈ రకమైన భావనకి మద్దతు ఒక విధంగా గ్రీకు తాత్వికుడు ప్లేటో చింతన నుండి కూడా కొంచెం వచ్చింది.
ప్లేటో చింతన ప్రకారం భౌతిక ప్రపంచంలోని వస్తువులు శాశ్వతాలు కావు. శాశ్వతమైనవి భావనలు, లేదా భావనా ప్రపంచానికి చెందిన ఆకృతులు. ఆ భావరూపాలే, భౌతిక ప్రపంచంలో వాస్తవీకరించబడి వస్తువులు అవుతాయి. నీటి లోంచి పొడుచుకొచ్చిన కలువ చెలువ ఏ దివిలోనో ప్రకాశించే అమరమైన అరవిందానికి పార్థివ ప్రతిరూపం. కూర్చోవడానికి ఉపయోగపడే వస్తువుని కుర్చీ అంటాం. ఇదొక భావన. ఇది ఏకైక, శాశ్వత భావన. భౌతిక ప్రపంచంలో దీనికి ఎన్నో వాస్తవ రూపాలు (నానా రకాల కుర్చీలు) ఉంటాయి. ఇవి ఎంతో మార్పుకి, వికాసానికి లోనవుతూ ఉంటాయి. కాని వాటి వెనుక ఉన్న మూల భావన – ‘మూల’ కుర్చీ - మాత్రం శాశ్వతంగా రాజిల్లుతూ ఉంటుంది!
ఆ విధంగా భౌతిక ఆధారాలు కొరవడిన దశలో మత ఛాందసవాదులు, తాత్వికులు జీవపరిమాణ రంగంలో చెలరేగుతూ వచ్చారు.
(ఇంకా వుంది)
(గాంధీ జయంతి సందర్భంగా ఇవాల్టి నుండి ఓ కొత్త సీరియల్. కొలంబస్ కథ ముగిసింది కనుక దానికి కొనసాగింపుగా ఇటీవలే ఆంధ్రభూమిలో వాస్కో ద గామా మీద మొదలైన సీరియల్...
)
http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-921
అసమాన సాహసాన్ని ప్రదర్శిస్తూ కొలంబస్ నాలుగు గొప్ప యాత్రలు చేసి, ఇండియాకి దారి కనుక్కోలేకపోయినా, పశ్చిమ ఇండీస్ దీవులని, దక్షిణ అమెరికా ఖండాన్ని కనుక్కున్నాడు. కాని చివరి వరకు తను కనుక్కున్న ప్రాంతం ఇండియానే అన్న భ్రమలో ఉన్నాడు. అయితే తన తదనంతరం ఆ ప్రాంతం ఇండియా కాదని, అదేదో కొత్త భూమి అని క్రమంగా యూరొపియన్ ప్రజలకి తెలిసొచ్చింది. సిల్కు దారులు మూసుకుపోయాయి కనుక ఇండియా కోసం కొత్త దారుల వేట మళ్లీ మొదలయ్యింది.
ఆఫ్రికా దక్షిణ కొమ్ము చుట్టూ ప్రయాణించి ఇండియా చేరుకోవచ్చన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉన్నా ఆఫ్రికా ఖండం దక్షిణంగా ఎంత దూరం విస్తరించి ఉందో పదిహేనవ శతాబ్దపు తొలిదశల్లో యూరప్ లో ఎవరికీ తెలీదు. 1415 దరిదాపుల్లో యూరప్ లో అన్వేషణల యుగం మొదలయ్యింది చెప్పుకుంటారు. సముద్ర దారుల వెంట ఆ కాలంలోనే పోర్చుగల్ రాజ్యాన్ని పాలించే హెన్రీ మహారాజు ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరాన్ని పర్యటించి రమ్మని వరుసగా కొన్ని నౌకా దళాలని పంపాడు. నౌకా యాత్రలలో అంత శ్రధ్ధ చూపించాడు కనుక హెన్రీ రాజుకి ‘హెన్రీ ద నావిగేటర్’ (నావిక రాజు హెన్రీ) అన్న బిరుదు దక్కింది. హెన్రీ రాజు పంపిన నౌకా దళాలు అంచెలంచెలుగా ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని పర్యటిస్తూ పోయాయి. 1460 లో హెన్రీ రాజు మరణానంతరం కూడా ఈ నౌకా యాత్రలు కొనసాగాయి. 1488 లో బార్తొలోమ్యూ దియాజ్ నేతృత్వంలో బయల్దేరిన నౌకలు ఆఫ్రికా దక్షిణ కొమ్ము వద్ద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ నగరాన్ని చేరుకున్నాయి. కాని అంత కన్నా ముందుకి పోవడానికి ఆ దళంలోని నావికులు ఒప్పుకోలేదు. కనుక విధిలేక దియాజ్ పోర్చుగల్ కి తిరిగి వచ్చేశాడు. అంతకన్నా ముందుకి పోడానికి వీలుపడలేదని అప్పటికి పోర్చుగల్ ని పాలించే మహారాజు జాన్ – 2 తో విన్నవించుకున్నాడు.
ఆఫ్రికా దక్షిణ కొమ్ము జయించబడ్డాక ఇక ఇండియాని చేరుకునే ప్రయత్నంలో ఓ ముఖ్యమైన అవరోధాన్ని జయించినట్టే. కాని ఆ కొమ్ముకి అవతల ఇండియా ఇంకా ఎంత దూరంలో ఉందో ఎవరికీ తెలీదు. పైగా దియాజ్ బృందం దారిలో పడ్డ కష్టాల గురించి, ఎదుర్కున్న భయంకరమైన తుఫానుల గురించి నావికుల సంఘాలలో కథలు కథలుగా చెప్పుకున్నారు. కనుక కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటి పోవడానికి నావికులు మొరాయించారు. కనుక ఇండియా దాకా విజయవంతంగా ఓ నౌకా దళాన్ని నడిపించడానికి సమర్ధుడైన నావికుడు దొరకడం కష్టమయ్యింది. పైగా ఈ కొత్త సముద్ర మార్గాన్ని జయించడానికి కేవలం ఓడలు నడిపించడం వస్తే చాలదు. అతడు గొప్ప యోధుడు కూడా కావాలి. ఎందుకంటే పోర్చుగల్ ఆఫ్రికా తీరం వెంట ఇండియాకి దారి కనుక్కోవడం ఇష్టం లేని వారు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఈజిప్ట్ ని ఏలే సుల్తాను, వెనీస్ నగరాన్ని ఏలే రాజు ఉన్నారు. పోర్చుగల్ ఓడలు ఆ దారిన వస్తే అటకాయించి ఓడలని ముంచడానికి వీళ్లు సిద్ధంగా ఉన్నారు. కనుక మంచి నావికుడు, మంచి యోధుడు అయిన అరుదైన వ్యక్తి కోసం గాలింపు మొదలెట్టిన మహారాజు జాన్ -2 కి త్వరలోనే అలాంటి వాడు ఒకడు దొరికాడు. అతడి పేరు వాస్కో ద గామా.
వాస్కో ద గామా పోర్చుగల్ లో, రాజధాని లిస్బన్ కి అరవై మైళ్ల దూరంలో ఉన్న సీన్స్ అనే ఓ చిన్న ఊళ్లో పుట్టాడు. ఈ సీన్స్ సముద్ర తీరం మీద ఉంది. అతడు పుట్టింది 1460 ల దశకంలో అని చారిత్రకులు అభిప్రాయపడుతున్నారు. వాస్కో తండ్రి పేరు ఎస్టేవాయో ద గామా. ఇతడు కూడా నావికుడే. పోర్చుగీస్ రాజు కొలువులో పని చేసేవాడు. తల్లి పేరు ఇజబెల్. వాస్కో కి పాలో, ఆయ్రెస్ అని ఇద్దరు అన్నలు, తెరేసా అని ఓ చెల్లెలు ఉన్నారు.
పడవలన్నా, సముద్రం అన్నా వాస్కోకి చిన్నప్పట్నుంచి వల్లమాలిన అభిమానం. అన్నలు తనకి పడవ ఎలా నడపాలో, వల వేసి మేలు జాతి చేపలని ఎలా పట్టాలో నేర్పించారు. తండ్రి నావికుడు కావడంతో తమ కుటుంబానికి నావికులతో సాన్నిహిత్యం ఉండేది. అన్నదమ్ములు ముగ్గురూ నావికులు చెప్పే సాహస గాధల గురించి వింటూ ఉండేవారు. పెద్దయ్యాక ఎలాగైనా సముద్ర యానం చేసి ఎన్నో గొప్ప సాహసాలు చెయ్యాలని కలలు కనేవారు.
సీన్స్ లో కొంత వరకు చదువుకుని పై తరగతులు చదువుకోడానికి వాస్కో ఎవోరా అనే నగరానికి వెళ్లాడు. సీన్స్ లాగ కాక ఈ ఎవోరా పెద్ద పట్టణం. ఈ నగరానికి ఇరుగు పొరుగు దేశాల నుండి జనం వస్తుండేవారు. అలా నానా రకాల సంస్కృతులకి, భాషలకి చెందిన వ్యక్తులతో వాస్కోకి పరిచయం ఏర్పడింది. లోకంలో మనుషులు ఎన్ని రకాలుగా జీవిస్తారో, ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారో వాస్కోకి అర్థం కాసాగింది.
పదిహేనవ ఏటికే వాస్కో మంచి నావికుడిగా ఎదిగాడు. పశ్చిమ ఆఫ్రికా తీరం వద్దకి ప్రయాణించే ఓడలలో స్థానం సంపాదించి నౌకా యానంలో తొలిపాఠాలు నేర్చుకోవడం మొదలెట్టాడు. తుఫాను సమయంలో సముద్రం అల్లకల్లోగంగా ఉన్నప్పుడు, పొగ మంచు వల్ల దారి అయోమయం అయినప్పుడు, కరకు శిలలు పొంచివున్న ప్రమాదకరమైన మార్గాలలో ఓడలు ప్రయాణించవలసి వచ్చినప్పుడు నావికులు ఎలాంటి కౌశలాన్ని ప్రదర్శించాలో నేర్చుకున్నాడు.
అలాంటి దశలో రాజుగారి నౌకా దళాలలో పని చేసే అవకాశం దొరికింది. 1492 లో ఒక సారి వాస్కోకి రచకార్యం మీద సేతుబల్ అనే ఊరికి వెళ్ళే పని పడింది. ఆ ఊరి సమీపంలో ఫ్రెంచ్ ఓడలు పోర్చుగల్ ఓడలని అటకాయించాయి. ఫ్రెంచ్ ఓడలకి తగిన గుణపాఠం నేర్పమని పోర్చుగీస్ రాజ్యంలో బేజా ప్రాంతానికి డ్యూక్ గా పని చేసే డామ్ మిగ్యుయెల్ అనే అధికారి వాస్కోని పంపాడు. వాస్కో ద గామా తనకి ఇచ్చిన పనిని సమర్ధవంతంగా పూర్తి చేసుకుని, దురగతాలకి ఒడిగట్టిన ఫ్రెంచ్ నావికులకి సంకెళ్ళు వేసి డామ్ మిగ్యుయెల్ కి అప్పజెప్పాడు. వాస్కో చూపించిన సత్తా చూసి డామ్ మిగ్యుయెల్ సంతొషించాడు. ఇండియాకి దారి కనుక్కోగల మహాకార్యాన్ని సాధించగల శూరుడు వాస్కో ద గామాలో తనకి కనిపించాడు.
(ఇంకా వుంది)