నౌకాదళం ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట దక్షిణ దిశగా యత్ర కొనసాగించింది. మైళ్ల తరబడి తీరరేఖని దాటుకుంటూ ఓడలు ముందుకు సాగిపోయాయి. ఇక తదుపతి మజిలీ కేప్ వెర్దే దీవులు. దీవులు చేరగానే తీరం మీదకు వెళ్లి పెద్ద ఎత్తున వంటచెరకు, మంచినీరు, కూరలు, పళ్లు ఓడలకి తరలించమని కొంతమందిని పంపించాడు వాస్కో ద గామా. ఈ ఆదేశం నావికులకి కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆఫ్రికా తీరం వెంట ప్రయాణం ఒక విధంగా చూస్తే పెద్ద కష్టం కాదు. ఎప్పుడూ తీరం కనిపించేలా కాస్తంత దూరంలో ఉంటూ యాత్ర కొనసాగిస్తే ఆహారం మొదలైన సరుకులు ఎప్పుడు కావలసినా ఏదో రేవు వద్ద ఆగి ఓడలకి ఎత్తించుకోవచ్చు. దీర్ఘ కాలం నడిసముద్రంలో, తీరానికి దూరంగా, జరిపే యాత్రలలో మాత్రమే ఓడలలో బాగా సరంజామా నింపుకోవలసి వస్తుంది. వాస్కో ద గామా ఉద్దేశం అనుభవజ్ఞుడైన దలెంకర్ కి మాత్రమే అర్థమయ్యింది. లోగడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ని చేరుకున్న బార్తొలోమ్యు దియాజ్ కూడా ఇదే మార్గాన్ని అవలంబించాడు.
ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని అంటిపెట్టుకుని ప్రయాణిస్తే దూరం మరీ ఎక్కువ అవుతుంది. కనుక కేప్ వెర్దే దీవులని దాటాక నేరుగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ దిశగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుతూ ప్రయాణించాలి. ఆ మార్గాన్ని అనుసరించాడు కనుకనే బార్తొలోమ్యూ దియాజ్ తన గమ్యాన్ని భద్రంగా చేరుకున్నాడు. వాస్కో నౌకా దళం తమ గమన దిశని మార్చుకుంది. అంతవరకు అల్లంత దూరంలో కనిపిస్తూ భద్రతాభావాన్ని కలిగించిన తీరం క్రమంగా దూరం కాసాగింది. ఆ నాటి యాత్ర మరింత కఠినం అయ్యింది. దారిలో ఎన్నో భీకర తుఫానులు ఎదురయ్యాయి. అయినా ఏ అవాంతరం కలగకుండా యాత్ర కొనసాగింది. నవంబర్ 1 వ తారీఖున ఓ నావికుడు అల్లంత దూరంలో ఏదో తీరం కనిపెట్టాడు. అది ఆఫ్రికా తీరమే అయ్యుండాలి. నావికుల సంతోషానికి హద్దుల్లేవు.
కాని ఆ సంతోషంలో పాల్గొనకుండా నిర్లిప్తంగా ఉన్నవాడు ఒక్క వాస్కో ద గామనే. ఎందుకంటే తాము చేరుకున్న తీరం ఎక్కడుందో రూఢి చేసుకోకుండా వేడుక చేసుకోవడంలో అర్థం లేదని అతడికి బాగా తెలుసు.
తాము చేరుకున్న తీరం ఆఫ్రికా దక్షిణ కొమ్ముకి దగ్గరి ప్రాంతమో కాదో తేల్చుకు రమ్మని వాస్కో ఇద్దరు నావికులని తీరం మీదకి పంపించాడు. తీరం మీద ఇద్దరూ నడచుకుని వెళ్తుండగా ఒక చోట పొదల మాటున ఇద్దరు వ్యక్తులు నక్కి ఉండడం కనిపించింది. చేతుల్లో బరిసెలు, జంతు చర్మపు బట్టలు మొదలైన లక్షణాలు చూస్తే ఇద్దరూ ఆ ప్రాంతపు కోయవారిలా ఉన్నారు. నావికులు కూడా చెట్ల వెనక దాక్కున్నారు. ఉన్నట్లుండి నావికులు కనిపించకపోయే సరికి విస్తుపోయి ఆ కోయవాళ్లు పొదలమాటు నుండి బయటికి వచ్చారు. అంతలో తటాలున వెనక నుండి వెళ్ళి నావికులు వాళ్ళిద్దర్నీ పట్టుకున్నారు. వాళ్ళలో ఒకడు ఎలాగో తప్పించుకున్నాడు. రెండో వాణ్ణి తెచ్చి వాస్కో ద గామాకి అప్పజెప్పారు.
ఆఫ్రికన్ భాషలు తెలిసిన అఫోన్సో ఆ కోయవాడితో మాట్లాడడానికి ప్రయత్నించాడు. కాని ఒకరి మాటలు ఒకరికి అర్థం కాలేదు. సంజ్ఞలు చేస్తూ వాస్కో తదితరులు చాలా సేపు వాడితో తిప్పలు పడ్డాక తెలిసినది ఏంటంటే వాళ్ళ గ్రామం అల్లంత దూరంలో కనిపిస్తున్న కొండ దగ్గర ఉందని. ఆ గ్రామం వారితో సంబంధం కలుపుకుని, ఈ ప్రాంతం ఎక్కడుందో కనుక్కు రమ్మని వెలోసో అనే వాణ్ణి పంపించాడు వాస్కో.
(ఇంకా వుంది)
వాస్కోడ మామ గారి మారిన గమన దిశే మన
కొంప నాలుగు వందల సంవత్సరాలు ముంచింది !
అమెరికా వాది కొంప ఊరు బారి పడ్డది !
ప్రస్తుతానికి ఐటీ రంగానికి దొహదం ఐకూర్చుంది !