శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.



ఐస్లాండ్ నేలలో ఒండ్రుమట్టి ఇంచుమించు లేదనే చెప్పాలి. ఈ భూమి అంతా అగ్నిపర్వతాల నుండి పెల్లుబికిన రాళ్లు రప్పల సమూహం. అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందక ముందు ఇక్కడ భూగర్భ శక్తుల ప్రభావం వల్ల నెమ్మదిగా పైకి లేచిన అగ్నిశిలల సమూహమే ఉండేది. అప్పటికి ఇంకా భూగర్భంలోని అగ్ని ఇంకా పైకి తన్నుకురాలేదు.

కాని తదనంతర దశలలో దక్షిణ-పశ్చిమం నుండి ఉత్తర-తూర్పు దిశలో, దీవి యొక్క కర్ణం (diagonal) వెంట, ఓ పెద్ద అగాధం ఏర్పడింది. ఆ అగాధం లోంచి ట్రాకైట్ శిల పైకి తన్నుకొచ్చి ఓ పొడవాటి పర్వత శ్రేణి ఏర్పడింది. ఈ పరిణామాలన్ని సంచలనాత్మకంగా జరిగాయని అనుకోను. పెద్ద మొత్తంలో పదార్థం పైకి ఎగదోయబడింది. భూమి లోతుల నుండి కుతకుతలాడే రాతి ద్రవం పైకి ఎగజిమ్మ బడింది. ఆ పదార్థం అంతా విశాల తలాలుగా, మరీ ఎత్తుకాని కొండలుగా, గుట్టలుగా ఏర్పడింది. ఫెల్స్పార్, సైనైట్, పార్ఫిరీ మొదలైన రాతి జాతులన్నీ ఈ దశకి చెందినవే.

అలా ఎగదన్నుకు వచ్చిన పదార్థం వల్ల ఈ ద్వీపంలో పై పొర మందం పెరిగింది. ఆ పొర యొక్క ఎదుగుతున్న భారం మరింత పదార్థం లోనుండి తన్నుకురాకుండా అడ్డుపడింది. పైన ట్రాకైట్ పొర గట్టిపడిపోయాక లోపల విశాలమైన వాయురాశులు, మరిగే పదార్థపు సందోహాలు నిర్బందించబడ్డాయి. ఈ ట్రాకైట్ మూతని భేదించుకుని ఏదో ఒకనాడు లోనున్న పదార్థం విస్ఫోటాత్మకంగా పెల్లుబుకుతుంది. పొగగొట్టంలోంచి పైకి తోసుకొచ్చే పొగలా, లోపల బంధించబడ్డ వాయువులన్నీ ఏవో సొరంగ మార్గలు వెదుక్కుని పైకి తన్నుకొస్తాయి. అగ్నిపర్వతాల పైన ఉండే అగ్నిబిలం వద్ద పైపొర కాస్త సన్నగా ఉంటుంది కనుక పైపొరని భేదించడానికి ఇంత కన్నా అనువైన ప్రదేశం ఉండదు.

ఈ విస్ఫోటానికి ఇతర అగ్నిపర్వత పరిణామాలు కూడా తోడయ్యాయి. మొదటి విస్ఫోటం వల్ల ఏర్పడ్డ మార్గాల లోంచి ఎగజిమ్మబడ్డ పదార్థాలలో ఒకటి బేసల్ట్. దాని ఆనవాళ్లు ఇందాక మేం వచ్చిన మైదానాలలో ఎన్నో కనిపించాయి. గట్టిపడ్డ అగ్నిశిలా పదార్థం అంతా లెక్కలేనన్ని షడ్భుజి ఆకారపు ఫలకాలుగా ఏర్పడింది. ఒకప్పటి అగ్నికీలలన్నీ చల్లబడి లెక్కలేనన్ని ఛిద్ర శంకువులుగా మారాయి.

చుట్టుపక్కల చిన్నా చితకా అగ్నిబిలాలన్నీ చల్లారిపోయాక, బేసాల్ట్ ప్రవాహం ఆగిపోయాక ఈ అగ్నిపర్వతం మరింత శక్తిని పుంజుకుంది. లావా, బూడిద, స్లాగ్ మొదలైన పదార్థాలు బయటికి ప్రవహించడానికి మార్గం ఏర్పడింది. విరబోసుకున్న కేశాల లాగా ఈ ప్రవాహాలు కొండ వాలు మీద బాటలు వేస్తూ ఇప్పటికీ కనిపిస్తాయి.

ఇలాంటి పరిణామాల పరంపరకి పర్యవసానంగా ఐస్లాండ్ ద్వీపం ఉద్భవించింది. భూగర్భంలోని అగ్ని చేత మలచబడ్డ భూమి ఇది. కనుక ఈ నేలకి అడుగున ఉన్న పదార్థం అంతా మరుగుతున్న ద్రవ రూపంలో లేదని అనుకోవడం వట్టి వెర్రితనమే అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితిలో భూగర్భం లోకి, పైగా భూమి కేంద్రం వరకు ప్రయాణించడం అయ్యేపనిటండీ? ఈ ముసలాళ్ల పిచ్చిగానీ!

అలా ఆలోచిస్తుంటే నా మనసు కాస్త ఊరటచెందింది. స్నెఫెల్ శిఖరాగ్రం కూడా క్రమంగా దగ్గరపడుతోంది.

మా స్నెఫెల్ పర్వతారోహణా ప్రయత్నం కొనసాగుతూనే వుంది. ఎక్కుతున్న కొద్ది వాలు ఇంకా పెరుగుతోందే గాని తగ్గడం లేదు. అక్కణ్ణుంచి జారి పడితే ఇక ఎముకలు కూడా దక్కవు.

కాని మా హన్స్ మాత్రం – మహానుభావుడు – నేల మీద ఎలా నడుస్తామో అంతే సునాయాసంగా ఆ వాలు మీద కూడా నడిచేస్తున్నాడు. కొన్ని సార్లు వడివడిగా మా ముందుగా ఎగబ్రాకి కనుమరుగు అవుతాడు. మేం దిక్కులు చేస్తుంటే అంతలో ఎక్కణ్ణుంచో ఈల వేస్తాడు. ఊళ వచ్చిన దిశగా మేం ఉస్సురంటూ ముందుకు సాగుతాం. కొన్ని సార్లు నడుస్తున్నవాడల్లా ఆగి కొన్ని రాళ్ళు అందుకుంటాడు. ఆ రాళ్లని ఏదో చిత్రమైన ఆకారంలో కింద పేర్చుతాడు. ఇవన్నీ మార్గంలో మా పురోగమనాన్ని తెలిపే మైలురాళ్లు అన్నమాట. వెనక్కు వచ్చేటప్పుడు వీటి సహాయంతో మాకు దారి తెలుస్తుంది. చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు పాపం. కాని ఈ ఏర్పాట్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయని తరువాత కలిగిన అనుభవాల వల్ల తేలింది.

మూడు గంటల పాటు రొప్పుతూ, రోజుతూ నడిచాక కొండ యొక్క అడుక్కి చేరాం. కాసేపు ఆగుదాం అని సంజ్ఞ చేసి హన్స్ అందరికీ ఏదో ఫలహారం అందించాడు. సమయం ఆదా చేద్దాం అని కాబోలు మామయ్య రెండేసి ముద్దలు ఒకసారి గుటకేసి మింగేసి భోజనం అయ్యిందనిపించాడు. కాని ఆయనకి నచ్చినా నచ్చకపోయినా ఇది విశ్రాంతి ఘడియ. భోజనం ముగిసినా లేకున్నా ఓ గంట పాటు ఇక్కడ ఆగాల్సిందే. మాతో వున్న ముగ్గురు ఐస్లాండ్ వాసులూ (వాళ్ల బాస్ లాగే వీళ్ళూ ఆట్టే నోరు మెదపరు కాబోలు!) మౌనంగా వాళ్లకి అందిన దాన్ని అందినట్టు తినేశారు.

మా పర్వతారోహణం మళ్లీ కొనసాగింది. ఈ సారి కొండ వాలు ఓ గోడలా, పీడలా మా ఎదుట సాక్షాత్కరించింది. దాని హిమశిఖరం వాస్తవం కన్నా దగ్గరగా ఉన్నట్టు కనిపించింది. అదో దృశ్య భ్రాంతి అని పర్వతారోహకులకి అందరికీ తెలుసు. అందుకేనేమో మరి ఎంత నడిచినా దగ్గర పడదే! కాళ్ల కింద మట్టి లేదు, చిన్న చిన్న తుప్పల, మొక్కల వేళ్లు లేవు జారబోయిన కాళ్లని నిలువరించడానికి. మా పాదాలకి తగిలిన రాళ్ళు దొర్లిపోయి కింద ఎక్కడో అగాధంలో పడుతున్నాయి.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts