అధ్యాయం 16
పాతాళానికి ముఖద్వారం
పాతాళానికి ముఖద్వారం
బాగా ఆకలి మీద ఉన్నామేమో అందరం ఆవురావురని తిన్నాం. విశ్రాంతి తీసుకోడానికి ఆ అగ్నిబిలం లోనే తలో చోటూ వెతుక్కున్నాం. ఆ రాత్రికి ఆ బండరాతి తల్పం తోనే సరిపెట్టుకున్నాం. సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో పెద్దగా కంబళులు లేకపోయినా సర్దుకుపోయాం. ఆశ్చర్యం ఏంటంటే ఆ రాత్రి నాకు బాగా నిద్ర పట్టింది. అసలు అంత గాఢంగా నిద్రపోయి చాలా కాలం అయ్యింది అనిపించింది. ఒక్క కల వస్తే ఒట్టు.
మర్నాడు ఉదయం మేలుకునే సరికి సగం గడ్డకట్టుకుపోయాం. గాలిలో చలి చురుక్కు మంటోంది. భానుడి నులివెచ్చ కిరణాలు కాస్త స్వాంతన నిచ్చాయి. నే పడుకున్న రాతి పరుపు మీంచి లేచి చుట్టూ చూశాను. ఎదుట కనిపించిన లోకోత్తర దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు చాల్లేదు.
నేను నించున్న శిఖరం స్నెఫెల్ శిఖర శ్రేణుల లోకెల్లా దక్షిణతమమైన శిఖరం. అక్కణ్ణుంచి చూస్తే ద్వీపం యొక్క అవతలి అంచు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దృశ్య విజ్ఞానంలోని ఓ ప్రాథమిక సూత్రం వల్ల కాబోలు, తీరం కాస్త పైకి లేచినట్టు, ద్వీపం యొక్క కేంద్ర భాగం కాస్త లొత్తగా లోపలికి పోయినట్టు కనిపిస్తోంది. హెల్బెస్మర్ తయారు చేసే, పైకి పొడుచుకుని వచ్చినట్టు ఉండే మ్యాపు ఒకటి నా కళ్ల ఎదుట విస్తరించినట్టు అనిపించింది. చుట్టూ లోతైన లోయలు ఒకదాన్నొకటి కోసుకుంటూ పోతున్నాయి. ఎత్తైన చెరియలు చిన్నపాటి గోడల్లా కనిపిస్తున్నాయి. మహా సరస్సులు చిట్టి చెరువుల్లా కనిపిస్తున్నాయి. మహానదులు పిల్లకాలువల్లా అగుపిస్తున్నాయి. నాకు కుడివైపున అసంఖ్యాకమైన హిమానీనదాలు, హిమవన్నగాలు మబ్బుల కుచ్చుటోపీలతో, తెలిమంచు అవరించిన రూపాలతో శోభాయమానంగా ఉన్నాయి. దట్టమైన మంచు పరుపుల చేత కప్పబడి, పడిలేచే ఈ పర్వతావళి తుఫాను ధాటికి కల్లోలమయమైన సముద్రాన్ని తలపిస్తోంది. ఇక దక్షిణ దిశగా చూస్తే గంభీరంగా గగనం అంచు దాకా విస్తరించిన సాగరం కనిపిస్తోంది. మంచు పరుపులు ఎక్కడ అంతమౌతున్నాయో, అలల పరవళ్ళు ఎక్కడ ఆరంభం అవుతున్నాయో చెప్పడం కష్టంగా ఉంది.
ఆ లోకోత్తర దృశ్యాలని చూసిన పరవశంలో కాసేపు నన్ను నేనే మర్చిపోయాను. మనస్సు మీద మహాపర్వత దర్శనం యొక్క ప్రభావం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. కొత్తల్లో అయితే ఇంత ఎత్తు మీద నించుని చూస్తే కళ్ళు తిరిగేవి. ఇప్పుడు ఎత్తు అలవాటైపోయింది. ఉప్పెనలా వస్తున్న భానుడి బంగరు కాంతులతో కళ్ళు మిరుమిట్లు గొల్పుతున్నాయి. నేను ఎవరు, ఎక్కడున్నాను అన్న స్పృహ కూడా ఆ మంచులాగే కరిగిపోతోంది. స్కాండినావియా కి చెందిన జానపదగాధలకి చెందిన ఎల్ఫ్ లు, సిల్ఫ్ లు మొదలైన అదృశ్య జీవులలో నేనూ ఒకణ్ణి అన్న తలంపు కలిగింది. ఎదుట మా రాకకోసం ఎదురు చూస్తున్న భయంకర పాతాళం సంగతి పూర్తిగా మర్చిపోయి కాసేపు ఆ కలలలో విహరించసాగాను. కాని అంతలోనే ఎక్కణ్ణుంచి ఊడి పడ్డారోగాని మామయ్య, హన్స్ వచ్చి నా ఎదుట నిలుచున్నారు. నా కలలన్నీ ఒక్కసారిగా కరిగిపోయాయి.
పశ్చిమ దిశలో అల్లంత దూరాన పొగమంచు మాటున లీలామాత్రంగా కనిపిస్తున్న ఏదో భూమిని చూపించాడు మామయ్య . నింగి, నీరు కలిసే చోటు ఆ భూమి అంచులు కనిపిస్తున్నాయి.
“గ్రీన్లాండ్” వేలితో సూచిస్తూ అన్నాడు మామయ్య.
“గ్రీన్లాండా?” అదిరి పోయి అడిగాను.
“అవును. అక్కణ్ణుంచి ముప్పై ఐదు లీగ్ ల దూరంలో ఉన్నాం అంతే. చలికాలంలో సముద్ర గడ్డకట్టుకున్న సమయంలో ఉత్తర హిమభూముల నుండి తెల్ల ఎలుగులు ఐస్లాండ్ దాకా చొచ్చుకువస్తాయి. సరే ఆ సంగతి పక్కన పెట్టు. ప్రస్తుతం మనం స్నెఫెల్ పర్వతశ్రేణి మీద ఉన్నాం. ఇక్కడ రెండు శిఖరాలు ఉన్నాయి. ఒకటి ఉత్తరాన, మరొకటి దక్షిణాన వుంది. ప్రస్తుతం మనం ఉన్న శిఖరం పేరు హన్స్ చెప్తాడు,” అంటూ హన్స్ కేసి తిరిగాడు మామయ్య.
“స్కార్టారిస్” ఠక్కున సమాధానం చెప్పాడు హన్స్.
అది వినగానే మామయ్య ముఖం ఎందుకు వెలిగిపోయిందో ఒక్క క్షణం అర్థం కాలేదు.
“పాతాళానికి ముఖ ద్వారం ఇక్కడే వుంది” అంటూ గర్వంగా ప్రకటించాడు మామయ్య.
(ఇంకా వుంది)
Image credits:
http://www.edge.org/3rd_culture/myhrvold08/myhrvold08_index.html
0 comments