కొన్ని చోట్ల కొండ వాలు 36 డిగ్రీలు మించి ఉంటుంది. దాన్ని ఎక్కడం అసంభవం అనిపించింది. కాని ఎలాగో కష్టపడి ఆ బండరాతి కొండని ఎక్కుతూ పోయాం. కట్టెలతో ఒకరికొరం సహాహపడుతూ పైపైకి సాగిపోయాం.
మామయ్య మాత్రం ఎప్పుడూ నన్ను అంటిపెట్టుకునే ఉన్నాడు. నేను ఎప్పుడూ తన దృష్టిని దాటిపోకుండా కనిపెట్టుకుని ఉన్నాడు. ఎన్నో సంకట పరిస్థితుల్లో చటుక్కున నా చేయి పట్టుకుని నిలుపుతూ వచ్చాడు. కాని తను మాత్రం ఎప్పుడూ తొట్రువడడం, తబ్బిబ్బు కావడం చూడలేదు. ఇక మాతో పాటు వచ్చిన ఐస్లాండ్ వాసులు మాత్రం అంతంత బరువులు మోస్తూ కూడా సునాయాసంగా చెంగుచెంగున కొండెక్కేస్తూ సాగిపోయారు.
శిఖరాగ్రం మరీ దూరంగా ఉన్నట్టు కనిపించడం వల్లనో ఏమో మొదట్లో మేం ఉన్నవైపు నుండి వాలు మరీ ఎక్కువని అనిపించింది. కాని అదృష్టవశాత్తు ఓ గంటసేపు అలా కుస్తీపట్లు, కవాతులు చేశాక ఓ విశాలమైన, మంచు కప్పిన ప్రాంతాన్ని చేరుకున్నాం. ఇది రెండు శిఖరాల మధ్యన ఉన్న ఓ మంచుమైదానం. అక్కణ్ణుంచి చూస్తే శిఖరానికి తీసుకుపోతూ ఓ మెట్ల దారి లాంటిది కనిపించింది. దీంతో మా అవరోహణ మరింత సులభమయ్యింది. అగ్నిపర్వత విస్ఫోటం లోంచి ఎగజిమ్మబడ్డ రాతిశకలాల చేత ఏర్పడ్డ మెట్ల దారి అది. ఆ రాళ్ళ వర్షం కొండ వాలు మీద పడకపోయి వుంటే సముద్రంలో పడి చిన్న చితక దీవులు ఏర్పడి వుండేవి.
కనుక రాళ్ళు పడితే పడ్డాయి కాని మాకెంతో మేలే చేశాయి. వాలు ఇంకా ఇంకా పెరుగుతూ వున్నా, ఈ రాళ్ల దారి సహాయంతో సులభంగానే ఎక్కగలిగాం. వడి బాగానే వుంది కదా అని ఓ క్షణం ఊపిరి తీసుకుందామని ఆగానంతే. మా ఐస్లాండ్ వాసులు అంతలోనే అల్లంత దూరాన నలకలంత పరిమాణంలో కనిపించారు. కంగారు పుట్టి మళ్లీ నడక అందుకున్నాను.
ఆ రాతిమెట్ల దారి వెంబడి ఓ రెండు వేల మెట్లు ఇక్కాక పర్వతం యొక్క మూపురాన్ని చేరుకున్నాం. ఆ వేదిక మీద శిఖరాగ్రం నిలిచి వుంది. ఆపై వరకు ఎక్కితే అగ్నిబిలం (crater) వస్తుంది.
మేం ఉన్న చోటి నుండి మూడు వేల రెండు వందల అడుగుల కిందన సముద్రం విస్తరించి వుంది. శాశ్వత మంచు ఉండే ప్రాంతం లోకి ప్రవేశించాం. మాములుగా అనుకునే దాని కన్నా మరింత ఎత్తులో ఇక్కడ మంచు కనిపిస్తుంది. దానికి కారణం ఇక్కడ వాతావరణంలో ఉండే తేమ. చలి అతి తీవ్రంగా ఉంది. గాలి ఉధృతంగా వీస్తోంది. నాకైతే ఒక్కసారిగా ఒళ్ళంతా నిస్సత్తువ ఆవరించింది. ఇక కాళ్లు చేతులు ఆడలేదు. మామయ్య నా అవస్థ గమనించినట్టు ఉన్నాడు. సాధారణంగా అసహనంగా ఉండే పెద్దమనిషి నన్ను చూసి కాసేపు ఆగుదాం అని నిశ్చయించుకున్నాడు. హన్స్ ని పిలిచి ఏదో అన్నాడు. దానికి అతగాడు తల అడ్డంగా ఊపుతూ,
“ఒఫ్వాన్ ఫర్” అన్నాడు.
“ఇంకా ఎత్తుకి వెళ్లాలంటున్నాడు,” అన్నాడు మామయ్య నాకేసి తిరిగి.
“ఎందుకని?” అడిగాడు మామయ్య.
“మిస్టోర్” అన్నాడు హన్స్.
“యా మిస్టోర్” అన్నాడు తతిమా ఐస్లాండ్ గైడ్ల లో ఒకడు కాస్త భయంగా.
“ఇంతకీ ఆ పదానికి అర్థమేంటి?” అన్నాను కాస్త విసుగ్గా.
“అటు చూడు,” అంటూ మామయ్య దిగువ తలాల కేసి చూపించాడు.
అల్లంత దూరంలో ఇసుక, ధూళి, అగ్నిపర్వత శిలా రేణువులు కలిసిన పెద్ద వాయుగుండం లాంటిది ఏర్పడుతోంది. గాలి వాటుకి అది స్నెఫెల్ పర్వతం దిశగా, ముఖ్యంగా మేం ఉన్న వైపుగా తరలి వస్తోంది. సూర్యుడీకి అడ్డుగా కదుల్తున్న ఆ పొడవాటి ధూళి స్తంభం యొక్క చిక్కని నీడ కొండ మీద పడుతోంది. ఆ గాలికంబం కొద్దిగా మామీదకి వాలిందంటే మమ్మల్ని అందర్నీ గుప్పెట్లో పెట్టుకుని మోసుకుపోగలదు. హిమానీనదాల మీదుగా బలమైన గాలులు వీచినప్పుడు ఇలాంటి గాలిస్తంభాలు ఏర్పడతాయని ఐస్లాండ్ వాసులకి బాగా తెలుసు. దీన్నే వాళ్లు ‘మిస్టోర్’ అని పిలుస్తుంటారు.
“హాస్టిగ్! హాస్టిగ్!” అరిచాడు మా గైడు.
డేనిష్ తెలీకపోయినా విషయాన్ని సులభంగా గ్రహించి హన్స్ వెనుకే కాలిసత్తువ కొద్దీ పరుగు అందుకున్నాను. హన్స్ పర్వతం పైన శిఖరాగ్రపు శంకువు మీదుగా పరుగు అందుకున్నాడు. సూటిగా మీదకి ఉరకకుండా పక్కల వెంట శంకువు వెనకకి చేరుకున్నాడు. వాయుదుమారం క్రమంగా కొండని కబళించసాగింది. దాని ధాటికి కొండంతా భూకంపం వచ్చినట్టు కంపించసాగింది. వొదులుగా ఉన్న రాళ్ళు ఆ గాలికి కొట్టుకుపోయి కింద తలాల మీద వర్షంలా పడుతున్నాయి. మా అదృష్టం బాగుండి పర్వతానికి అవతలి పక్కకి వచ్చేశాం గాని లేకుంటే ఈ పాటికి రాళ్ళ వర్షంతో పాటు, మా నెత్తుటి వర్షం కూడా కురిసేది. యుద్ధభూమి మీద రాలే దేహాంగాలలా మా అంగాంగాలు ఆ ప్రళయానిలపు తాపులకి తుత్తునియలై కింద తలాల మీద విసిరేయబడి ఉండేవి.
శంకువు పక్కల మీద ఆ రాత్రంతా గడపడం శ్రేయస్కరం కాదని హన్స్ అన్నాడు. కనుక దుమారం తరలిపోయాక కూడా ఆగకుండా మా ఆరోహణ కొనసాగించాం. మిగిలిన పదిహేను వందల అడుగులు ఎక్కడానికి మాకు ఐదు గంటలు పట్టింది. నాకైతే ఇక నించోడానికి కూడా ఓపిక లేదు. ఆకలి, చలి నన్ను పూర్తిగా లోబరుచుకున్నాయి. దీనికి తోడు గాలి కూడా పలచన కావడంతో ఊపిరి తిత్తులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
ఎట్టకేలకి రాత్రి పదకొండు గంటలకి స్నెఫెల్ శిఖరాన్ని జయించాం.
అందరం అగ్నిబిలం లోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాం.
నా పాదాల కింద నిద్దరోతున్న దీవిని ముద్దాడుతున్న నడిరాతిరి రవి కిరణాలని చూస్తూ నెమ్మదిగా నేనూ నిద్రలోకి జారుకున్నాను.
(పదిహేనవ అధ్యాయం సమాప్తం)
0 comments